గోదావరి సినిమాలో ఒక సీనుంది. హీరోయిన్ చెక్కగా ముస్తాబయ్యి, టూ వీలర్ మీద వెళ్తూంటే, దార్లో పోలీసులు పట్టుకుంటారు. హెల్మెట్ పెట్టుకోనందుకు ఫైన్ వేస్తామంటారు. అప్పుడు ఆ అమ్మాయి 'సర్ మా ఇంట్లో అమ్మ పెళ్ళి సంబంధాలు చూస్తూంది.. హెల్మెట్ పెట్టుకుంటే హైర్ స్టైల్ పాడైపోతుంది.. ' లాంటి ఎక్స్క్యూసెస్ ఇచ్చి, చివరికి లంచం ఇస్తున్నట్టు నటించి, ఇవ్వకుండానే, పారిపోతుంది.
అప్పట్లో ఈ సీన్ చాలా మంది ప్రేక్షకులకి నచ్చు ఉండొచ్చు. కానీ నాకు సరదాగానే ఉన్నా కొంచెం నచ్చని సీన్ ఇది. మా ఆర్మీ లొకాలిటీ లో టూ వీలర్ మీద రైడర్, మగ వారైతే, పిలియన్ రైడర్ కూడా తప్పకుండా హెల్మెట్ గానీ హెల్మెట్ లాంటి పదార్ధం గానీ తప్పకుండా ధరించాలి. లేక పోతే, అనవసరం గా బోల్డంత ట్రబుల్ (మహా అయితే నడిచి వెళ్ళిపోవల్సి రావడం) ఇచ్చేస్తారు. అదేంటో గానీ ఎంత ఆర్మీ వాళ్ళయినా, పిలియన్ రైడర్ ఆడవాళ్ళైయితే హెల్మెట్ పెట్టుకోక పోయినా వొదిలేస్తారు. అసలే స్త్రీ పక్షపాతినేమో - వాళ్ళు వొదిలేస్తున్నందుకు ఆనందం కాక బాధ కలుగుతుంది నాకు. అసలు ఆడవాళ్ళని ఆర్మీ వాళ్ళూ, పోలీసు వాళ్ళూ ఎందుకని వొదిలేస్తారు ? వాళ్ళకి ఎందుకు ఫైన్ వెయ్యరు ? ఇందులో సమానతని సాధిద్దామని నేను అనడం లేదు. ఇది కామన్ సెన్స్. దేవుడి దయ వల్ల అంతా సవ్యంగా జరిగితే పర్లేదు. ఏక్సిడెంట్ అయితే, స్త్రీ ల తలలకు దెబ్బలు తగలవా..? వారి తలలు పగలవా ? అసలు ఎందుకీ ఆడవాళ్ళు హెల్మెట్ పెట్టుకోవడానికి తెగ అవమానం ఫీల్ అయిపోతారో తెలియదు.
సౌందర్య పిపాస.. జుట్టు మీద అభిమానం, హెల్మెట్ పెట్టుకుంటే, ముగాంబో ల్లా ఉంటామని భయం, ఇలాంటివన్నీ బహుసా వీళ్ళని హెల్మెట్ కు దూరంగా ఉంచుతాయి. దీన్లో మగ వాళ్ళూ తక్కువ తిన్లేదు. హెల్మెట్ లేక పోతే, అడ్డమైన పోలీసూ, అడ్డమైన చోటల్లా పట్టుకొని లంచమో, ఫైనో గుంజబట్టి గానీ..(అప్పుడు కూడా పోలీసులూ, హెల్మెట్ డీలర్లూ కుమ్మక్కయ్యారని, హెల్మెట్ల సేల్స్ పెంచుకోవడానికే పోలీసులతో ఇలా రక రకాల రైడ్లు చేయిస్తున్నారనీ, సభ్య సమాజంలో మనుషులకి హెల్మెట్ లేకుండా తిరగ గలిగే స్వేచ్చ లేదనీ, పేపర్లో ఆరోపణలు వస్తాయి) నూటికి ఎనభయి శాతం ఇప్పటికీ హెల్మెట్ లు ధరించకపోయుణ్ణు. నాకు బైక్ మీద హెల్మెట్ పెట్టుకోవడం అలవాటు. దీని వల్ల రోడ్ రూల్స్ పాటించినట్టే కాకుండా, దుమ్మూ, ధూళీ నుంచీ నా ముఖ చర్మానికి రక్షణ దొరుకుతుంది. అసలే హైదరాబాదు. హెల్మెట్ లేకుండా రోడ్ మీదికి వెళ్తే, ఇంటికొచ్చీసరికీ, కాకి లా, కోయిలల్లా తయారై పూడుస్తాము. (దుమ్మూ, ఎండా.. ల కారణం గా) So helmet helps.
చావు గురించి ఒక్కొక్కరికీ ఒక్కొక్క ఫిలాసఫీ ఉండొచ్చు. చచ్చేది రోడ్ ప్రమాదం లో చచ్చిపోతే పైకి బానే ఉంటుంది (భార్యా పిల్లలూ.. ఇంట్లో వెయిట్ చెయ్యని రకాలకి) కానీ తలకి దెబ్బ తగిలి కోమాకో, కేంద్ర నాడీ వ్యవస్థ దెబ్బ తినడమో జరిగితే గానీ తమ నిర్లక్షం తమకి తెలియదు. హెల్మెట్ ప్రాణాల్ని కాపాడుతుంది. అసలే మనవి ప్రమాదకరమైన రోడ్లు. బైక్ నడపడం లో మన తప్పు లేక పోవచ్చు. ఎదుటి వాడి తప్పు వల్ల మనం జీవితాన్ని కోల్పోవాలసి రావడం, చాలా ట్రాజెడీ. దాన్ని మనం నివారించలేకపోవడం సిల్లీ.
హెల్మెట్ ధరించక పోతే, ఇంత ఫైన్, కార్ లో సీట్ బెల్ట్ పెట్టుకోక పోతే అంత ఫైన్ అని ప్రభుత్వం (పోలీస్) ప్రకటించేసి ఊరుకుంటుంది. ఫైన్ లు కూడా వేస్తుంది. కానీ ఎందుకు పెట్టుకోవాలో, పెట్టుకోకపోతే, దురదృష్టవశాత్తూ ప్రమాదం జరిగితే ఎలాంటి దెబ్బలు తగిలే సంభావన ఉందో, కొంచెం నిజం, కొంచెం హైప్ లతో చిన్న చిన్న ఏడ్ లు తయారుచేసి ప్రతీ సినిమా హాల్లోనీ, టీవీ చానెల్లోనీ ప్రదర్శించాలి. అప్పుడు గానీ సీన్ జనాలకి తలకెక్కదు.(దురదృష్టవశాత్తూ.. తాగుబోతు కి మనం తాగవద్దని ఎంత చెప్పినా తలకెక్కదు) మన పిచ్చి గానీ మంచి చెప్తే ఎవరికి నచ్చుతుంది చెప్పండి ?
పోలీసులు ప్రజలకు వ్యతిరేకం అనే భావన పాతుకుపోయిన సమాజం మనది. అలానే మన లాంటి అలసత్వం జీర్ణించుకుపోయిన మనస్తత్వాలకి భద్రత అంటే ఏదో 'కొత్త ' సంగతి లా అనిపిస్తుంది. పెద్ద పెద్ద భవన నిర్మాణాల్లో కూలీలు కూడా ఒక హెల్మెట్టూ, బెల్టులూ లేకుండానే ఇక్కడ చాలా ప్రమాదకరమైన పరిస్థితుల్లొ పని చేస్తుంటారు. అంతెత్తునుండీ కాలు జారి పడితే..?!
ఇలాంటి ప్రమాదమే మన వెనుక కూడా పొంచి ఉంది. ఎంత నెమ్మదిగానో డ్రైవ్ చేసే నాకే మరీ అవమానకరంగా సైకిలు నడిపే చిన్న పిల్లల కారణంగా రెండు సార్లు ఏక్సిడెంట్ అయింది. (అవమానకరం అంటే, నన్ను గుద్దేసింది పిల్లకాయలు!! ఏ కారో, లారే నో, ఫెలో స్కూటరిస్టో అయితే.. ఈ పాటికి ఏ కాలో చెయ్యో విరిగి ఉండేది... ఇది హెల్మెట్ గురించి గాబట్టి, తలకి గాట్టి దెబ్బ కనీసం తగిలి మతి పోయి ఉండేది). ఇలాంటి కొన్ని ప్రత్యేక క్షణాల్లో నే నా జ్ఞాన చక్షువులు తెరుచుకున్నాయి. ఈ భూ ప్రపంచకంలో నూటికి 70 శాతం పిలియన్ రైడర్లూ ఆడవాళ్ళూ, పిల్లలే! మిగతా దేశాల సంగతి పక్కన పెడితే, మన ప్రభుత్వానికి ఆడవాళ్ళ రక్షణ గురించి చింత లేదు.
ఏ పోలీసు (సినిమాల్లో హీరో పోలీసులకి సైతం) కూడా.. హెల్మెట్ పెట్టుకోని ఆడ డ్రైవర్ని పట్టుకుని ఝాడించడు. (కనీసం మందలించే రకం పోలీసెంకటసాములు కూడా, చాలా తక్కువాతి తక్కువ లెండి) అంత ధైర్యవే ?! అది కూడా కాదు.. వాళ్ళకి పిలియన్ రైడర్ స్త్రీ అయితే ఆవిడ హెల్మెట్ పెట్టుకోకపోవడం అసలు ఒక పాయింట్ లా అనిపించదు.
ఇక నుంచీ అందరు పిలియన్ రైడర్లూ (పోనీ కనీసం ఆడ డ్రైవర్లు) స్త్రీ పురుష భేదం లేకుండా హెల్మెట్ పెట్టేసుకోవాలని మన మహిళా సంఘాలు పోరాటం చెయ్యకపోతే మహిళా సాధికారత కి అర్ధం లేదు. :D
కొంచెం చించితే - ప్రమాదం జరిగినపుడు దెబ్బలు ఆడ వారికీ మగ వారికీ ఒకేలా తగుల్తాయి ! అందుకే అందరూ హెల్మెట్ పెట్టుకోవాలి. హైర్ స్టైయిల్ కన్నా సేఫ్టీ మిన్న ! అవునా కాదా ?
16 comments:
Why don't we start with you? ;-)
Are you wearing it regularly? Why not you create a simple ad-like statement on your own blog and circulate it around?
Point,well made!
మంచి విషయం ప్రస్తావించారు.
హైదరాబాదులో EMS, emergency Trauma care లాంటివి అందుబాటులో లేక, హెల్మెట్ పెట్టూకోని నా కజిన్ యాక్సిడెంట్ అయిన గంటన్నర తర్వాత మరణించాడు లాస్టి్యర్. ఒక్క head injury తప్ప వేరే ఏ గాయమూ కాలేదు. Emergency transport and immediate intubation would've saved his life but wearing a helmet would've prevented the whole mishap :(
సుజాత గారు, భలే టాపిక్ పట్టారు. బాగా రాశారు.
హెల్మెట్ పెట్టుకోకపొతే ఏమి జరుగుతుందో ప్రభుత్వం, ట్రాఫిచ్ పోలీసులు, ఇంకా ఆర్టీయే వాళ్ళు కూడా పెద్ద పెద్ద బానర్లు గట్రా పెట్టి చెపుతూనే ఉంటారు కదండీ! కొబ్బరి కాయ యాడ్ చూసే ఉంటారుగా మీరు! హెల్మెట్ ఉన్న కొబ్బరి కాయ మీద సుత్తి తో కొడితే ఏమీ కాదు, హెల్మెట్ లేని కొబ్బరికాయ పగిలి చిప్పలై పోతుంది. ఇలా చాలా ఉన్నాయి. ఎంత చెప్పినా బుర్రకెక్కని సివిలియన్స్ ఏం చెయ్యమన్నారు? అందులో మీరు చెప్పినట్టు ఆడవాళ్ళు హెల్మెట్ పెట్టుకోడానికి ససేమిరా అంటారు. హేర్ స్టైల్ సంగతి అలా ఉంచి హెల్మెట్ మొయ్యడం భలే తలనొప్పి (నాకు కూడా.అయినా పెట్టుకోక తప్పదు)
రక్షణ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు చెప్పింది నిజమే కానీ ప్రతి పిలియన్ రైడరూ హెల్మెట్ పెట్టుకోవాలంటే అబ్బ ఊహించండి, కష్టం కదా! మా ఇంటి దగ్గర ఇలాగే హెల్మెట్ పెట్టుక్కూచున్న పిలియన్ రైడరు(భార్య) తన దుపట్టా చక్రంలో పడిందన్న సంగతి హెల్మెట్ లోంచి భర్తకు చెప్పి, అది అతనికి అర్థం అయ్యేలోపల ఈవిడ పడనే పడింది కింద! (అందరికీ ఇలా జరుగుతుందని కాదు)
సిటీ బస్సుల్లో "పోనీలెద్దూ, పాపం ఆడాళ్ళు" అని సీట్లు ఇచ్చినట్టు, హెల్మెట్ లేని ఆడాళ్లని చిన్న పాటి జాలితో పోలీసులు కూడా వదిలేస్తారు గానీ స్త్రీల రక్షణ పట్ల concern లేక కాదు !
కొసమెరుపు ఏమిటంటే ఈ మధ్యే హెల్మెట్ దర్జాగా వెనక తగిలించుకుని వెళుతుండగా ఒక వెంకట సామి నాకు ఫైను వేసేశాడు. నేను కూడా తప్పు నాదే కాబట్టి పెద్దగా ఆర్గ్యుమెంట్స్ చేయకుండా కిక్కురుమననకుండా కట్టేశాను.
నాకు హెల్మెట్ పెట్టుకోవాల్సిన అవసరమే రాలేదు (అంటే తల లేదనుకునేరు; మనకి బైకు నడపటం రాదు)
మంచి విషయం చెప్పారు సుజాత గారు. ఎవరో ఎన్ఫోర్స్ చేయాలి అని కాకుండా వాహన చోదకులలోనే ఆ చైతన్యం రావాలి. హెల్మెట్ యొక్క ప్రాముఖ్యత తెలుసుకుని ధరించాలి.
"హైర్ స్టైయిల్ కన్నా సేఫ్టీ మిన్న !" అదుర్స్..చాలా మంచి టపా.
My dear anonymous..
I am very much law-abiding. I wear helmet whenever I drive / pillion ride.
My blog isnt so popular that I think I can post ads. Anyway, thanks for the suggestion.
బాగా చెప్పారు. మన మంచి కోసమే అన్న సంగతి జనాలు అర్థం చేసుకోవాలి.
మంచి విషయం గురించి రాసారు. RTA వాళ్ళు బాగానే ప్రచారం చేస్తున్నారు కాని ప్రజలలో అవగాహన పెరగాలి. పెట్టుకోకపోతే ఫైను కాబట్టి పెట్టుకుందాం అనుకునేవాళ్ళే ఎక్కువ, అది మనకు ఎంత అవసరమో గ్రహించి పెట్టుకునేవాళ్ళు తక్కువ. హెల్మెట్ లేని ఆడవాళ్లని వదిలివేసేది వాళ్ళపట్ల బాధ్యత లేక కాదు అదో soft corner అంతే. అలవాటు పడటానికి ప్రజలకి కూడా కాస్త టైము పడుతుంది లేండి. నాకు కారులో సీటు బెల్టు పెట్టుకోవాలంటే మొదట్లో చాలా uneasy గా అనిపించేది, ఏంటో పొట్టనంతా వత్తేస్తున్న ఫీలింగ్. ఇప్పుడు కారు ఎక్కగానే అసంకల్పిత ప్రతీకారచర్య లాగా చేతులు వాటి పని అవి చేసేస్తాయి నా ప్రమేయం లేకుండా :)
Purnima
Thanks.
Teresa garu
Im very sorry for your cousin. As you said, it would have been prevented with the simple measure of wearing a helmet.
సుజాత గారు
మీరన్నదీ నిజమే గానీ నాకెందుకో 'భద్రతా వారోత్సవాల ' సమయంలో తప్ప ఈ ప్రకటనలు ఎక్కువగా కనిపించవనిపించింది. మీరు చెప్పిన 'సాఫ్ట్ కార్నర్ ' సంగతీ ఒప్పుకుంటాను. కానీ వీళ్ళకి కూడా ఫైన్ వేస్తే గానీ స్త్రీలు పిలియన్ రైడ్ చేసేటప్పుడు హెల్మెట్ పెట్టుకోరు. మరీ అన్యాయంగా మన వస్త్రధారణ (చున్నీలూ, కొంగులూ చక్రాల్లో పడటం ద్వారా) మనల్ని ప్రమాదం లోకి నెట్టెయ్యకుండా ఎప్పుడూ సేఫ్టీ పిన్లు పెట్టుకోవడం, చక్కగా కుచ్చెళ్ళూ, కొంగూ టక్ చేసుకోవడం లాంటి అతి సాధారణమైన విష్యాల్ని నిర్లక్షం చెయ్యకూడదు.
ఏదయినా సరే అలవాటు చేసుకుంటే, అదే హాయి. హెల్మెట్ తల నొప్పి అనుకునే కన్నా, హెల్మెట్ తలకి రక్ష అని తెలుసుకోవడం ఎక్కువ కావాలి.
మీకు ఫైన్ వేసిన పోలీసెంకటసామి కి ఒక వీర తాడు (సరదాకి) !
నేను మహిళల రక్షణ పట్ల పోలీసులకు పెద్ద కన్సర్న్ లేదనడం కొంత సరదాకీ, కొంత నిష్టూరానికీ, అని గమనించగలరు.
Thanks for the nice comment here.
అబ్రకదబ్ర గారు - జోకు పేలింది. చాలా గట్టిగా ! (తల లేదనుకోవడం గురించి)
వేణూ శ్రీకాంత్ గారు
మీరన్నది ముమ్మాటికీ నిజం. ఇలాంటి చైతన్యం కొంచెం ఉండుంటే, నిష్కారణమైన చావుల్ని చాలా మట్టుకు తగ్గించగలం
కత్తి గారు - చాలా థాంక్స్ !
గార్లపాటి గారు
థేంక్స్ ! ...మ్మ్మ్... యెస్. మన మంచికే మనం కొన్నిట్లో సర్దుకుపోవాలి.
వరూధిని గారు.
అదే నిజం లెండి. ఫైన్ వేస్తున్నరు గాబట్టి, పోలీసులకి దొరికితే రచ్చ గాబట్తి హెల్మెట్లు ఆ మాత్రమైనా పెట్టుకుంటున్నారు జనం. అసలు ఒక బండి మీద 3 - 6 గురు హెల్మెట్ లేకుండా ప్రయాణించేస్తూ ఉంటేఅ, చూడటానికే చాలా భయం వేస్తుందే..! మన దేశంలో అస్సలు ప్రాణానికి విలువ లేదు. అందుకే జనమే స్వయానా తమ రక్షణకి బాధ్యత వహించరు. కానీ ప్రభుత్వం అన్నిటికీ హెల్ప్ చెయ్యాలంటారు.
మీరు గుడ్ గర్ల్ - సీట్ బెల్ట్ పెట్టుకుంటారు గాబట్టి. మీకూ ఒక వీర తాడు.
Post a Comment