Pages

28/01/2024

The Ivory Throne - Manu S Pillai

 


The Ivory Throne - Chronicles of the House of Travancore - Manu S Pillai 


ఈ రోజుల్లో ఎందరో షీరో ల గురించి చదువుతున్నాము.   ఏ రంగమైనా కావచ్చు - ఎన్నో అత్భుత విజయాలు సాధించినవాళ్ళనీ,  వాళ్ళు తమ తమ పరిధుల్లోనే, పరిమితుల్లోనే, అవకాశాలను సద్వినియోగం చేసుకుని మంచి  మార్పులకు కారణమయ్యేవాళ్ళని గురించి తెలుసుకోవాలి.  Rulers మంచి నిర్ణయాలను తీసుకోవడం వల్ల అవి కాలక్రమేణా ఎందరి జీవితాలలోనో  వెలుగు తీసుకువస్తాయి.   తమ పాలనలో రాజకీయంగా, పరిపాలనా రంగంలో, సామాజికంగా,  స్త్రీలు తీసుకొచ్చిన మార్పుల్ని తెలుసుకోవాలంటే ఈ పుస్తకం చదవాలి.   కేరళ లో ఉన్న మూడు ప్రసిద్ధమైన రాజవంశాలలో ఒకటైన ట్రావన్ కోర్ రాజవంశం లో ప్రస్తుత కేరళ సమాజం మరిచిపోయిన ఒక (Last Queen) రాణి గురించిన ఏకపక్ష కథ ఈ "ఐవరీ థ్రోన్". రాసింది చాలా చిన్న వయసులో ఉన్న అబ్బాయే. కానీ తన రాష్ట్ర  చరిత్ర రాయడానికి  అతను చేసిన పరిశ్రమ మెచ్చుకోదగ్గది.   

కేరళ లో  తిరువనంత పురం లో ఉన్న ప్రముఖ పద్మనాభ స్వామి ఆలయం, అక్కడి బ్రహ్మాండమైన నిధులని గురించి ప్రపంచం అంతా మారుమోగిపోయిన నాడు, రాజ వంశం చాలా విమర్శలకు గురయింది.  దేశానికి స్వతంత్రం వచ్చి, రాజరికాలు రద్దయినాక, రాజు కేవలం ఆ అనంత పద్మనాభ స్వామికి దాసునిగా తన కర్తవ్యాన్ని నిర్వర్తించేందుకే తిరువనంతపురం లో తన అంతఃపురం లో ఉండాల్సి వచ్చి ఇంత నిజాయితీగా, భక్తిగా, ధర్మ బద్ధంగా బ్రతుకుతూన్నపుడు - ఆయన మీద ఆలయ సంపద ను టిఫిన్ బాక్స్ లో తరలిస్తున్నట్టు ఆరోపణలు రావడం సాధారణ విషయం కాదు. 

పుస్తకం, తిరువనంతపురం రాజరికం గురించి విస్తారంగా వివరిస్తూ అక్కడి మాతృస్వామ్య పరిపాలనా వ్యవస్థ గురించి చెప్పే ప్రయత్నం చేస్తుంది. పుస్తకం లో చాలా వరకూ రాణి సేతు లక్ష్మీబాయి (సీనియర్ రాణి), సేతు పార్వతీ బాయి (జూనియర్ రాణి) ల మధ్య జరిగిన పోరాటం గురించే గానీ, ఇంతవరకూ బయటికి రాని కొన్ని  విషయాల్ని గురించి కూడా చెప్తూ ముఖ్యంగా రాణి సేతు లక్ష్మీ బాయి గురించి, ఆవిడ తన కున్న తక్కువ పరిపాలనా కాలంలో, తన పరిధిలోనే ఎంత చక్కగా పరిపాలించిందో, కేరళ సమాజంలో ఎన్ని కొత్త మార్పులకు ఆవిడ నిర్ణయాలు ఊతమిచ్చాయో, మాతృస్వామ్య వ్యవస్థ లో మహిళ సామాజిక స్థానం ఏమిటో చాలా బోల్డంత విపులంగా వివరిస్తుంది.  ఇంత ఎక్కువ సమాచారం ఎలా సేకరించి ఉంటాడో ఈ అబ్బాయి. ఎన్ని ఇంటార్వ్యూ లు ! ఎన్ని కోట్ లు, ఎంత క్రోడీకరణ, ఎంత పరిశోధన, ఎన్ని ప్రశంసలు, ఎన్ని విమర్శలు !! 

మను పిళ్ళై కేరళలో పుట్టి, పూనే, లండన్ ల లో విద్యాభ్యాసం ముగించి, శశీ థరూర్ పార్లమెంట్ ఆఫీస్ లో కొన్నాళ్ళు, లండన్ లో  లార్డ్ బిలిమోరియా దగ్గర కొన్నాళ్ళూ పని చేసాడు. ఆ తరవాత బీబీసీ లో హిస్టారియన్ గా కూడా పని చేసాడు. "ద ఐవరీ థ్రోన్" అతని మొదటి పుస్తకం. ఆరేళ్ళు పట్టింది ఈ పుస్తకం రాయడానికి. అతను ఎంత ప్రయత్నించినా, 'జూనియర్ రాణి' కుటుంబం నుంచీ అతనికి ఒక్క ఇంటర్వ్యూ కూడా దొరకలేదు.  దాంతో అతని రీసెర్చ్ అంతా 'సీనియర్ రాణి' కుటుంబం చెప్పిన విషయాలు, అప్పటి డాక్యుమెంట్ లు, చారిత్రక సాక్షాల ఆధారంగా సాగింది. కాబట్టి ఇది ముగించేసరికీ, ఇదంతా సీనియర్ రాణిని సమర్ధిస్తూ రాసిన కథ అనిపిస్తుంది. కాకపోతే, ఆ సీనియర్ రాణి ఒక షీరో కాబట్టి - ఆవిడ జీవితం, ఒక Matriarch గా ఆవిడ జీవన విధానం, రాణి గా ఆమె సాధించిన విజయాలు, మాజీ రాణి గా అనుభవించిన బాధలు చదివి - ఇప్పటి కేరళ సమాజం ఆమె గురించి పూర్తిగా మర్చిపోయింది కాబట్టి అలాంటి వ్యక్తి ఒకరంటూ ఉన్నారని తెలియజేయడం కోసం రాయబడిన పుస్తకం అనిపిస్తుంది.    

Travancore గురించి ఇంత సమాచారం చదవడం ఒక పెద్ద  విషయం. ఇన్ని డీటైల్స్ - ఇన్ని వివరణలు, ఇంత ఒక పుస్తకం లో ఇరికించడం కష్టమే. కేరళ లో మొదట విదేశీయులు అడుగుబెట్టి, వ్యాపారం మొదలు పెట్టినప్పటికే అక్కడి సామాజిక పరిస్థితులు కాస్త భిన్నంగా కనిపిస్తాయి. కేరళ ఒక రాజకీయ దేశం. అక్కడి ప్రజలు చైతన్యవంతులు. ముఖ్యంగా పోరాట వీరులు. స్త్రీలు పురుషులతో సమానంగా యుద్ధాలలో పోరాటాలు చేసారు. రాజ్యాలని ఏలారు. అలాంటి   రాజ్యంలోకి సిరియన్ లు, ఫ్రెంచు వారు, పోర్చు గీసు వారు, అరబ్బులు వచ్చారు. దక్షిణ మలబార్ లో కాలికట్ ని ఏలిన రాజు జమోరిన్ (సమూథిరి)  (ఇంద్రుడి లాగా ఇదో టైటిల్) ఆ రోజుల్లో  కేరళ రేవులకి రారాజు. వాస్కోడి గామా కేరళ తీరం చేరగానే అతనికి 'మను విక్రముడు' అనే జమోరిన్ నుండీ పిలుపు వస్తుంది. 

అప్పటి దాకా యూరోపియన్ లకి అరబ్బుల వల్ల, ఇస్లాం వల్ల ఖండాంతర వాణిజ్యంలో దాదాపు పూర్తిగా బాగా restrict అయిన దారిలో ప్రయాణించి, మొత్తనికి కేరళ తీరం చేరుకున్నాక వాళ్ళకి అప్పటికే వ్యాపారంలో ఎంతో ప్రగతి సాధించేసిన జాతి ఎదురయింది. అరబ్బులు పర్షియా, యూరోప్ నుండీ, చైనా నుంచీ మింగ్ రాజులు కేలికట్ ని తరచూ సందర్శించేవారు. 140 నుండీ 1430 వరకూనే చైనీస్ ఎడ్మిరల్ ఝెంగ్ ఏడు సార్లు 250 ఓడల్లో, 28000 మంది సైనికులతో కేలికట్ వచ్చాడు.  చైనీస్ ఆఖర్న కేరళ  వొదిలి వెళ్ళీనాటికి కేలికట్ లో సగం మళయాళీ, సగం చైనీ, మలయ్ ల తో కూడిన 'చిన్న క్రిబల' అనే ఉప జాతి కూడా తయారయింది. ఇక్కడ ఇంత వాణిజ్యం జరుగుతుంది కాబట్టి ఇక్కడి రాజు కూడా చాలా బలవంతుడు. ధనికుడు. అసలు పోర్చుగీసు వాళ్ళకి ఈ సంపద చూస్తే కళ్ళు తిరిగినట్టయింది. 

అయితే యూరోపియన్ లకు అరబ్బుల నిండీ వ్యాపారపరంగా ఎదురైన పోటీని నిలువరించడానికి పోర్చుగీసు మెల్లగా కేరళ లో ఇతర రేవు పట్టణాల వైపు చూడడం మొదలుపెట్టింది. కొచ్చిన్, మలబారు ల మధ్య ఉన్న చారిత్రాత్మక గొడవలని అడ్డు పెట్టుకుని, జమోరిన్ ప్రాబల్యాన్ని తగ్గించుకుంటూ, తమ వ్యాపారాన్ని విస్తరించుకునేందుకు ప్రయత్నం చేసాయి. పైగా కేరళ అప్పట్లో రాజకీయంగా దేశంలో ఇతర దక్షిణాది రాష్ట్రాల నుండి కూడా యుద్ధ భయాన్ని ఎదుర్కొంటూ అటు సముద్రంలో పోర్చుగీస్ తో యుద్ధం చెయ్యడం - వగైరాల వల్ల కాస్త వెనకబడుతుంది. జమోరిన్లు వైభవంగా పోరాడి విఫలం అయ్యారు. కేరళ చిన్న చిన్న స్వతంత్ర రాజ్యాలుగా విడిపోయింది. 18 వ శతాబ్దం వచ్చ్చేసరికీ కేరళ తన గత ప్రాభవానికొక నీడ లా మిగిలిపోయింది. 

అయితే విదేశీయులతో ఇంత దీర్ఘమైన సంబంధాలుండడం వల్లనూ, ఎన్నో దేశాలనుండీ వలస వచ్చిన వివిధ మతాల వాళ్ళ వల్లనూ, కేరళ లో బోల్డన్ని మతాలు వ్యాప్తి చెంది, సమాజం చాలా inclusive  గా తయారయింది. అయితే కేరళ లో ఉన్న హిందూ సమాజం కూడా చాలా కులాలతో, శాఖలతో అల్లుకుని ఉంటుంది. దానిలో నాయర్ లు - పాములను పూజించే, యుద్ధ వీరులు. వాళ్ళ వృత్తి సైనిక వృత్తి ! వివిధ రాజుల తరఫున యుద్ధాలు చేయడం వాళ్ళ రక్తంలోనే ఉంది.  ఎపుడూ ఎక్కడో ఓ చోట యుద్ధం జరుగుతూనే ఉంటుంది. వీళ్ళు యుద్ధానికి వెళ్ళి చచ్చిపొనైనా పోతారు, ఇంకోర్ని చంపేసేయినా వస్తారు. జమోరిన్ ల కూ, కొచ్చిన్ రాజులకూ మధ్య యుద్ధాలు, పగలు, ప్రతీకారాలూ ఎప్పుడూ జరుగుతూనే వుందేవి. అందుకని వాళ్ళలో పెళ్ళి, రొమాంటిక్ రిలేషన్ లు కూడా ఎక్కువగా, ఫ్రీ గా ఉండేవి. స్త్రీలకు పురుషులతో సమానాధికారాలు ఉండేవి. అవి బయటి నుండి చూసే విదేశీయులకు చాలా ఆశ్చర్యం కలిగించేవి.  అక్కడ స్త్రీలు వ్యక్తితం తో బ్రతుకుతూ, పెద్ద పెద్ద ఇళ్ళను, ప్రాంతాలను ఏలే వాళ్ళు. యుద్ధాలు చేసే వాళ్ళు. కత్తులతో, బాణాలతో వీళ్ళు చేసిన పోరాటాల్ని గురించి ప్రజలు జానపద గాధలు చెప్పుకునేవారు. పాటలు పాడుకునేవారు. అలాంటి జమోరిన్ ల రాజ్యం 1760 లలో యుద్ధాల బారిన పడి సమసిపోయినప్పుడు, జమోరిన్ లు తమ రాజ్యాన్ని, పేలేస్ లనూ విడిచిపారిపోవల్సివచ్చిన దశలో ట్రావన్ కోర్ (తిరువనంతపురం) రాజ్యం పైకి ఎదగడం ప్రారంభం అయింది. 

అప్పటికే చుట్టుపక్కల నాయక రాజులు (మధురై), ఆర్కోట్ నవాబు (మొఘలులు), కేప్ కేమొరిన్ కీ, ట్రావెంకోర్ కీ మధ్య ఉన్న ఈ చిన్ని జమీందారీ లాంటి రాజ్యాన్ని అన్నిరకాలుగా దోచేస్తున్నపుడు కుపాక వంశానికి చెందిన తిరువనంతపురం రాజుల్లో "మార్తాండ వర్మ" అనే అతను తిరగబడి, యుద్ధాలలో విజయం సాధిస్తాడు. అదీ తిరువనంతపుర 'కుపాక' వంశ  రాజుల మొదటి విజయం. అప్పటి దాకా తమలో తాము పోరాడుకుంటూ, విపరీతమైన కుల రాజకీయాల్లో, బ్రాహ్మణ-నాయర్ల ఫైటింగుల్లో చీలికలైపోయిన కేరళ అతన్ని గుర్తిస్తుంది. తనకిష్టం లేని పద్ధతుల్ని ఉక్కుపాదంతో అణిచేసి చాల శక్తివంతంగా ఎదిగాడు మార్తాండ వర్మ. 

హైదర్ ఆలీ కేరళను దాదపు తుడిచిపెట్టేసిన సమయానికి కేవలం దక్షిణ కేరళ లో 'తిరువంతంతపురం' మాత్రమే నిలబడగలుగుతుంది.  ఆఖరికి టిప్పు సుల్తాన్ కూడా కేరళ ను గెలిచేందుకు ప్రయత్నించి విఫలమవుతాడు. ఐతే నాయర్ల శౌర్య పరాక్రమాల వల్ల అప్పటిదాకా ఎలాగో నెగ్గగలిగినా - ఈస్ట్ ఇండియా కంపెనీ దేశం లో వేళ్ళూనగలిగే సరికీ, కంపెనీ అండ తన రాజ్యానికి అవసరం అని ట్రావెన్ కోర్ గుర్తిస్తుంది. అటు జమోరిన్ లు కోలుకుంటారు. మిగిలిన కేరళ అంతా కూడా రాజకీయంగా మారుతుంది. 

మార్తాండ వర్మ మరణం తరవాత రెండు వందల సంవత్సరాలు దేశం పరాయి పాలన లోనే ఉంది. అప్పటి నుండీ, ఇప్పటి దాకా తిరువంతంతపురం లో రాజరికపు ప్రయాణం గురించి ఈ పుస్తకం చాలా డీటైల్స్ ఇస్తుంది.  తిరువనంతపురం  పాలించిన రాజులు ఎందరో చాలా మంచి పాలనని తమ ప్రజలకు అందించారు. కంపెనీ కి ఎదురు తిరగకుండానే, ఒక స్థిరమైన వ్యవస్థ ని ఏర్పరిచారు, 

ఈ రాజుల్లో రాజ్యాన్ని ఏలిన మహారాణులున్నారు. వీళ్ళలో ఆఖరి రాణి సేతు లక్ష్మీ బాయి 1920 లలో దేశం లో పెను మార్పులు చోటు చేస్కుంటున్న టైం లో ఈ 'ఏనుగు దంతపు' సింహాసనం నుండీ రాజ్యాన్ని ఏలారు. బైటి శక్తులనుండీ, లోపలి శత్రువులనుండీ తనని తాను, రాజ్యాన్ని, మర్యాదలనీ కాపాడుకుంటూ చాలా నిజాయితీ గా తన పాత్రని పోషించారు. స్వతంత్రం వచ్చాక అంత వరకూ ఓ వెలుగు వెలిగిన ట్రావెన్ కూర్ రాజ్యం  మెల్లగా తెర వెనక్కు తప్పుకుంది. రాణి తన స్థానాన్ని వొదులుకుని సామాన్యురాలిగా జీవించింది.  

ఒకవిధంగా అధికారం కోసం కుటుంబం తో నే పోరాడలేక ఓడి,  రాజరికపు జీవితం నుండీ విషాదంగా, విరక్తి తో తప్పుకున్న రాణి జీవితం  గురించి చెప్పిన పుస్తకం ఇది.  ఆఖరికి  ఆవిడ చేసిన మంచి పన్లని చెప్పుకోవడానికి, ఆవిడ ముందుచూపు నీ, నిరాడంబరతనీ, నిజాయితీని, ఆవిడ కుటుంబం పాటించిన విలువలనీ ఎప్పటికీ కేరళ మర్చిపోకూడదని ఈ ప్రయత్నం చేసారు మను పిళ్ళై. 

కేరళ నుండీ వచ్చి, ప్రపంచ ప్రఖ్యాతి పొందిన చిత్రకళాకారుడు రాజా రవి వర్మ కూతురి కూతురే సేతు లక్ష్మీ బాయి (పూరాడం తిరునాళ్ సేతు లక్ష్మీ బాయి).  కేరళ లో రాజరికం మాత్రుస్వామ్య పద్ధతిని అనుసరిస్తుంది. రాజు భార్య రాణి కాదు. రాజు కు పుట్టిన పిల్లలకూ వారసత్వం వెళ్ళదు.  కుటుంబంలో పెద్ద మహిళ (అమ్మ) రాణి అవుతుంది.  రాజు సోదరి పిల్లలు రాజ్యాధికారానికి అర్హులు. ఒక వేళ రాజు కు సోదరి లేకపోయినా, ఆ లైన్ లో పిల్లలు లేక పోయినా,  రాజ వంశానికి సోదరి వంశమయిన "అట్టింగళ్" వంశపు పాపాయిలను దత్తత తీసుకుంటారు. అలా రాజా రవివర్మ మనవరాళ్ళయిన ఇద్దరు పాపాయిలను దత్తతకు తీసుకున్నారు. వారిలో పెద్ద అమ్మాయి ఈ సీనియర్ రాణి. రెండో పాప జూనియర్ రాణి అన్నమాట (వీళ్ళ తల్లులు వేర్వేరు. రవి వర్మ కూతుర్లు) .   అయితే  వీళ్ళ తదనంతరం చట్టాల సవరణల కారణంగా  ఈ దత్తత సాంప్రదాయం ఇప్పుడు సమసిపోయినట్టే. ఆ రకంగా సేతు లక్ష్మీబాయి ఆఖరి రాణి.  ఆమె తరవాత జూనియర్ రాణి కుమారుడు రాజయ్యాడు. అతను పుట్టిన తరవాతనే సీనియర్ రాణికి కూతుర్లు పుట్టారు. కాబట్టి ఇంట్లో పెద్ద వాడు జూనియర్ రాణి కొడుకు కాబట్టి, ఆయనే రాజయ్యాడు. 

ఆవిడ పాలించిన కాలం 1924 - 1931 -(7 years, as a Regent)  చాలా కొద్ది సమయమే అయినా, ట్రావెన్ కోర్ లో కొన్ని మంచి పనులు జరిగాయి. దేవదాసీ వ్యవస్థ రద్దయింది. జంతుబలులను నిషేధించారు.  గ్రామాలలో స్థానిక ప్రభుత్వ వ్యవస్థని ప్రోత్సహించేందుకు పంచాయితీ వ్యవస్థను తెచ్చారు.   కుల చైతన్యం పెరిగింది. అంటరానితనం, ప్రధాన రహదారుల్లోకి హరిజనులను రానివ్వకపోవడం వంటివి ఆపారు. కొన్ని ప్రధాన ఆలయాల లోనికి అన్ని కులాల వారూ ప్రవేశించడాన్ని అనుమతించారు. 1928 లో చివరికి మాతృస్వామ్య వ్యవస్థ రద్దయి పితృస్వామ్య వ్యవస్థ కేరళ లో మొదలయింది. అయితే అదే సమయంలో సేతు లక్ష్మీబాయి పద్మనాభస్వామి దేవాలయంలోకి హరిజనులను అనుమతించకపోవడంతో విమర్శలకు గురయ్యారు.  కేరళ లోకి రైళ్ళు, విద్యుత్, కొత్త సాంకేతికతలు, ప్రవేశించాయి. ఇవన్నీ కేరళ సమాజం లో సామాజికంగా తీసుకొచ్చిన మార్పులకు దారితీసాయి.  

రాణి స్వయంగా స్త్రీ విద్య ని, ఉచిత ప్రాధమిక విద్య ని, అందరికీ సమానమైన విద్యావకాశాలను, స్కూళ్ళలో పిల్లలకు ఉచిత ఆహారాన్ని అందించడం లాంటి పనులను దేశంలో బహుశా మొదటి సారే మొదలు పెట్టారు. దేశానికి స్వతంత్రం వచ్చినప్పటినుండీ, విద్యలో / అక్షరాశ్యతా శాతం, బళ్ళూ, రోడ్లూ, ఆస్పత్రులతో మంచి జీవన ప్రమాణాలని తన ప్రజలకు అందివ్వడంలో కేరళ ముందుండడానికి కారణం సేతు లక్ష్మీబాయి.  వైద్యాన్ని చాలా ఎక్కువ ప్రోత్సహించారు. మహిళలు వైద్య విద్యని చేపట్టేందుకు చాలా ప్రయత్నాలు చేసారు. మొదటి మహిళా వైద్యురాలిని దర్బారులోనికి తీసుకున్నారు. ఎందరికో స్కాలర్షిప్ లు ఇచ్చి డాక్టరీ చదివించారు. రహదారులు, రైల్వే లైన్లూ వేసారు. టెలిఫోన్లు వచ్చాయి. విద్య మీద బడ్జెట్ లో 22% కేటాయించారు. ఇవన్నీ ఆమె రీజెన్సీ ముగిసాక కూడా కేరళ ని దేశంలో ఎంతో అభివృద్ది సాధించిన దేశంగా నిలబెట్టాయి.  

అసలే మాతృస్వామ్య వ్యవస్థ చాలా కులాల్లో రద్దయినా, స్త్రీలు సామాజికంగా, ఆర్ధికంగా కూడా వెనకబడిపోలేదు. ఆడ పిల్లలు వైద్య వృత్తిలోకి, ఇతర సాంకేతిక విద్యల్లోకీ రావడానికి రాణి పాలసీలు ఎన్నో పని చేసాయి. ఆమె కాలంలో తలెత్తిన గొడవలు, రక్తపాతానికి ఎప్పుడూ దారితీయలేదు. గొడవల్ని నిర్దాక్షిణ్యంగా అణిచేసే ప్రయత్నమూ జరగలేదు. ఆంగ్ల విద్య ప్రాముఖ్యత దేశం లో పెరిగింది. అలాగే కేరళ లో కూడా క్రిస్టియన్లు, చిన్న కులాల వాళ్ళూ కూడా ఆర్ధికంగా ఎదిగారు. చదువుకున్న వాళ్ళు ఎక్కువయి ఉన్న ఉద్యోగాలు తక్కువవడం వల్ల బయటి దేశాలలో ఉపాధి వెతుక్కోవడం, మనియార్డర్ ఎకానమీ రావడం సాధ్యపడింది. బ్రిటిష్ ఆంత్రోపోలజిస్ట్ ఆడ్రియన్ మేయర్ చెప్పినట్టు "కేరళ గురించి తెలిసిన ఎవరికైనా ఆమె సామాజికంగా చారిత్రకంగా ఒక గొప్ప మనిషి". ఒక రకంగా ఆమె గురించి ఇలా తెసులుకోవడం మనకీ బావుంటుంది.  

అప్పటికి దేశంలో మిగిలిన సంస్థానాల రాజులు, నల్లమందు, వేశ్య లతో, వేటలతో ఆనందాలలో వ్యసనపరులు, స్త్రీలోలులు గా మిగిలి - బ్రిటిష్ ప్రభుత్వానికి కట్టాల్సిన కప్పం కోసం విపరీతమైన పన్నులతో వాయగొట్టి, ప్రజల్ని పీడించుకు తినడంలో మునిగిపోయి  అటు ప్రజల్లోనూ, ఇటు ప్రభుత్వం దృష్టి లోనూ చవటల్లా, పనికిరాని వాళ్ళుగా మారుతున్నప్పుడు, దేశంలో  చాలా మంచి పరిపాలనా విధానాలని ఈ రాణి అవలంబించింది. ఏదేమయినా గానీ, కొన్ని పొగడ్తలు, కొన్ని విమర్శలు ఎదుర్కొన్నా, స్వయానా మహత్మా గాంధీ కూడా ఆవిడ వ్యక్తపరచిన కొన్ని 'నిస్సహాయత' లను అర్ధం చేసుకోగలిగేలా చేసింది. తాను నిర్వర్తిస్తోన్నది ఒక డ్యూటీ నే! తన చేతిలో సర్వాధికారాలూ ఉన్నా కూడా  అందరి అంగీకారం లేకుండా ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం, వాటిని ప్రజల మీద రుద్దడం లాంటివి చెయ్యలేదు. ఆఖరికి వివిధ కారణాల వల్ల తన కజిన్ (Junior Queen)  కుటుంబం తనని అమర్యాదకరంగా చూసినా సరే, ఆస్తుల్ని వొదులుకోవాల్సి వచ్చినప్పుడు చాలా  detached గా అన్నిటినీ వొదులుకున్నారు. 

ఈ పుస్తకం, ముందే చెప్పినట్టు ఏకపక్షంగానే అనిపించినా, కేరళ చరిత్రని చాలా విస్తారంగా రికార్డ్ చేసినందున విపరీతమైన డీటైల్స్ ఉన్నా కూడా చదవాల్ని అనిపిస్తుంది. దీనికి నేను ఇంతకు ముందు చదివిన రాజారవి వర్మ జీవిత చరిత్ర చాలా పనికొచ్చింది. తన మనవరాళ్ళని రాణులుగా దత్తత తీసుకోవడానికి జరిగిన ప్రయత్నాలనీ, వాటికి తమ కుటుంబంలోనే ఎదుర్కోవల్సిన వ్యతిరేకతనీ, ఆ మంటల్ని ఎప్పటికప్పుడు ఆర్పుకుంటూ వచ్చి చివరికి ఎంత సంప్రదాయబద్ధంగా దత్తత ప్రమాణ స్వీకారోత్సవం జరిగిందో రవివర్మ చెప్పడం వల్ల, ఈ రాణుల వ్యవస్థ అర్ధం చేసుకోవడం సులువయింది.  

రాజుల కథల్ని మనం ఇంతగా ఎంజాయ్ చేస్తామనేనేమో ఈ పుస్తకం విడుదలయ్యాక శోభు యార్లగడ్డ (బాహుబలి నిర్మాత - ఆర్కా మీడియా) హక్కుల్ని కొన్నారట.  మార్తాండ వర్మ గా ఎవర్ని ఊహించుకుంటున్నా, రాణి సేతు లక్ష్మీ బాయి గా ఎవరు నటిస్తారో అని ఆశ్చర్యం కలిగింది. ఎందుకంటే ఈ కథ చాలా పెద్దది.  అయితే ఈ రాణుల  మనుమలు, మునిమనుమలు, తమ తమ రంగాల్లో పేరు తెచ్చుకున్నారు. వివిధ దేశాల్ల స్థిరపడ్డారు. వివాదాలలోకి లాగబడడానికి ఎవరికీ తీరికా, ఇష్టమూ లేనే లేవు.   ఇప్పటికీ సీనియర్ రాణి మనుమలు రాజులవడానికి టెక్నికల్ గా క్యూ లో ఉన్నా వాళ్ళు మాత్రం అస్సలు ఇంట్రెస్ట్ చూపించట్లేదు.  జూనియర్ రాణి వారసులు కూడా మౌనంగా పక్కకు తప్పుకునేందుకు ప్రాధాన్యం ఇచ్చారు. కర్నాటక సంగీత ప్రముఖుడు అశ్వత్థి స్వాతి తిరునాళ్ వంశం నుంచీ ఇప్పట్టి తరానికి సంగీత వారసత్వన్ని మాత్రమే ఘనంగా మోసుకొచ్చిన ప్రిన్స్ రామ వర్మ కూడా జూనియర్ మహారాణి వారసుడే. ఆయన కూడా రచయిత తో మాట్లాడేందుకు నిరాకరించడం అర్ధం చేసుకోతగ్గదే.  

ఇప్పుడు రాజరికాలేంటి ? ఆస్తుల పోరాటాలు తప్ప ! వివిధ వ్యాజ్యాలలో సీనియర్ రాణి వారసులు ట్రావెన్ కోర్ లో ఆస్తుల పై, పాలెస్ ల పై అధికారాల్ని కోల్పోయారు. కొన్ని సుప్రీం కోర్ట్ లో ఉన్నాయి.   కాబట్టి కహానీ అభీ ఖతం నహీ హుయీ. 555 పేజీల చరిత్ర  (పూర్తి పేజీలు వివరణలతో, నోట్స్ తో సహా 694 Pages) మొత్తానికి పూర్తి చేసాక ఏదో పెద్ద మహాభారతం చదివినట్టు తృప్తి దొరికింది. అదే కదా కావల్సింది.   వైకోం సత్యాగ్రహం, దీవాన్లు, కేరళ రాజకీయాలపై తమిళుల ప్రభావం, రాజరికాలు, పెన్షన్లు, గ్రాంటు లు, రాజుల పరివారాలు, ఆచారాలు, కట్టుబాట్లు, ట్రైనింగు లు, ఆంగ్ల విద్య, పర్యటనలు, మత రాజకీయాలు, ఆస్తులు, వ్యాజ్యాలు అన్నీ కలిపి చాలా పెద్ద కథ. కుటుంబ రాజకీయాలు, బ్రిటిష్ వాళ్ళ సొంత అభిప్రాయాలు వగైరాలు తప్ప  స్కాండల్, ఆకర్షణీయమైన అంశాలూ పెద్దగా లేవు. కానీ లక్ష్మీ బాయి జీవితానికి మంచి Tribute ఈ పుస్తకం. 

***



No comments: