Pages

02/11/2023

మానవ హృదయం - ఉమేష్ కౌల్

 

మానవ హృదయం - ఉమేష్ కౌల్

(Translation) (Saranga, 01 Nov 2023)



"రాజరాణి అత్తయ్యా ! గాషా తో మాటాడి  నన్ను ఆ ఫతె కి ఇచ్చి పెళ్ళి చెయ్యొద్దని చెప్పవూ ? "  మెహర్ మొత్తానికి ధైర్యం చేసి రాజ రాణి ని అడిగేసింది. 


రాజరాణి అప్పుడే తన ఎడమ మోకాలి వైపుకు కుంపటి ని జరిపి, చిలుము నిండా బొగ్గు నింపుతూ "ఏం ?!!  ఫతేకి ఏమి తక్కువ ?!!" అనడిగింది. 


మెహర్ దగ్గర ఈ ప్రశ్నకి సమాధానం లేదు. ఆమె కేవలం రాజరాణి అత్తయ్య వైపు గుడ్లప్పగించి చూడటం తప్ప ఇంకేమీ చెయ్యలేకపోయింది.చెప్పాలంటే  ఫతె లొ  ఎటువంటి దుర్లక్షణాలూ లేవు. అతను వయసులో ఉన్నాడు.  మంచి దేహ దారుడ్యంతో శుభ్రంగానే ఉంటాడు. కానీ మెహర్కి మాత్రం అతనిని పెళ్ళాడటం ఇష్టం లేదు. 


ఫతెహ్ ఆమె దగ్గరి బంధువే. ఆమె తండ్రి సోదరుడి కొడుకు.  అతని తల్లితండ్రుల మరణం తరవాత అతను మెహర్ తండ్రి,  పాలమ్ముకునే 'గాషా'  దగ్గరే ఉన్నాడు.  అనాధ అయిన ఫతే మీద జాలితో కాకుండా, గాషా అతన్ని చేరదీయడానికి వేరే స్వార్ధపూరితమైన  కారణాలున్నయి. అంతవరకూ ఇద్దరు అన్నదమ్ములకూ చెందిన ఇంటిని తానొక్కడే  మింగేయాలని గాషా ఆలోచన. అందుకే ఫతే ని పెంచి 'పెద్ద' చేసే బాధ్యతని భుజాన ఎత్తుకున్నాడు గాషా.  అతని తో పాటూ చనిపోయిన సోదరుడికి  చెందిన నాలుగు ఆవులనీ,  తన చేతికిందికి తెచ్చుకోవడమూ  గాషా మర్చిపోలేదు. పైగా రెండుసార్లు పెళ్ళాడినప్పటికీ గాషాకి మగ సంతానం లేదు. దాంతో అతని పాడి అదీ చూసుకోవడానికీ, ఇరవైనాలుగు గంటలూ అందుబాటులో ఎవరో ఒకరు ఉండాలి కాబట్టి ఆ పన్లకీ,  ఫతెహ్  సరిగ్గా సరిపోయాడు.  ఫతే కూడా చాలా మంచి అబ్బాయి.  వాడికి తన  మొదటి భార్య కూతురు మెహర్ ని ఇచ్చి పెళ్ళి చేస్తే ఫతె ఇంక ఇంటిని విడిచిపోడని గాషా ఆలోచన. 


ఫతే సరిగ్గా గాషా అవసరాలకి అతికినట్టు సరిపోయిన మంచి పని వాడు.  తన ఎనిమిదో ఏటి నుండీ, ఆవులని మేతకు తోలుకుపోవడం, వాటిని జాగ్రత్త గా చూసుకుని, చీకటి పడే వేళకి ఇంటికి తీసుకురావడం, అతనికి అప్పగించబడిన పనులు. పాలని ఖాతాదార్లకు ఇచ్చి వాళ్ళ దగ్గనుంచి వసూలు చేసిన డబ్బు గాషా కి అందివ్వడమూ ఫతే చాలా నిజాయితీ గా చేసేవాడు. ఏళ్ళు గడిచేకొద్దీ అతని బాధ్యతలు పెరుగుతూనే వచ్చాయి. తనకోసం అంటూ కాణీ కూడబెట్టుకోవడం తప్ప మిగిలిన అన్ని పన్లనీ యంత్రం లాగా చేసిపెట్టేసెవాడు.  

అతను బలవంతుడు, నిజాయితీ పరుడు, ముఖ్యంగా వొళ్ళు దాచుకోండా కష్టపడే మనిషి. అయినా మెహర్ కి అతనిలో 'జీవితపు మెరుపు' ఎక్కడా కనబడేది కాదు. ఎలాంటి మెరుపంటే, ఏ కాస్తంత కొంటెతనమో, పరిమళాలు వెదచల్లే ఓ మంచి మాటో, వెచ్చని స్వభావమో, ఏదీ ఆమెకు కనిపించేది కాదు. ఒకప్పుడు అనాధ అయిన అతని లోకం అంతా ఆ ఇల్లు, నాలుగు ఆవులు, బోల్డంత పనీ తప్ప ఇంకోటి లేదు. వీటన్నిటి మధ్యా నిజమైన ఫతే ఎప్పుడో మాయమైపోయాడు. 


మెహెర్ చిన్నప్పటి నుంచి పెద్దయాక తన పెళ్ళి ఫతే తోనే అని అందరూ చెప్తూండడం వింటూనే పెరిగింది.  కానీ ఆమె మాత్రం ఫతే ని ఆ దృష్టి తో చూడలేకపోయింది. ఆమె వరకూ అతను ఓ చల్లని, జీవం లేని బొమ్మ, ఆ బొమ్మ కి దేని గురించీ ఆర్తీ లేదు, నిస్పృహా ఉండదు. ఒట్టి మూర్ఖుడు. ఆమెని అతను చూసే చూపులు కూడా అభావంగానే ఉండేవి. ఆ కళ్ళలో నవ్వో, ఆనందమో ఎప్పుడూ కనపడలేదు ఆమెకు. అతనో పని చెయ్యడం మాత్రమే ఎరిగిన యంత్రం. 


హృదయం ఒక కొలను లాంటిది. తనకున్న ఆ  చిన్న పరిధి లోనే ఆకాశపు లోతులనీ , , సూర్యుడి వెలుగుల్నీ,  చంద్రుడి నవ్వుల్నీ ఒడిసిపట్టుకోగలదు.   మెహర్ కి ఫతే లో 'లేనిదే'మిటో  స్పష్టంగానే తెలుసు, కానీ దానిని ఇతరులకు బోధపరిచేంత భాషా పరిజ్ఞానం ఆమెకు లేదు.  అందుకే ఫతే కేమి తక్కువని అత్తయ్య అడుగుతుంటే  చెప్పేందుకు ఆమెకు నోరు రాలేదు. నిజానికి 'చేత' కాలేదు. అందుకే రాజ రాణి అత్తయ్య చిలుముని హుక్కాకు బిగించి, బొగ్గు మంట ని ఊది, నోరు విప్పని ఆ పిల్లని ఆరాగా  "నీ మనసులో ఇంకెవరైనా ఉన్నారా మరి ?" అని అడిగింది. 

"అబ్బే ! అలాంటిదేమీ లేదు.. కేవలం... "

అంతకన్నా మాట పెగల్లేదు ఆమెకు.  నిజానికి, ఆమెకు అసలు తెలిసినవాళ్ళే చాలా తక్కువ మంది. రాజరాణి, సుల్తాన్ పండిట్, కబీర్ వనీ లాంటి వాళ్ళందిరి ఇళ్ళ గుమ్మాల దాకా ఎన్నోసార్లు నీళ్ళు మోసి తెచ్చింది. కానీ తన మనసులో మాటలు చెప్పుకునేంత దగ్గరతనం ఎవరితోనూ ఆమెకు లేదు. వాళ్ళందరూ వేరే అంతస్తు వాళ్ళు. ఆమెతో అంతగా కలవరు. మెహర్ బట్టలు పేడ అంటుకుని మురిగ్గా ఉంటాయి. ఆమె నుంచీ నాచు కంపు కొడుతూంటుంది. ఆమెకు తన ముందంతా ఇసుక మేటలు వేసినట్టు అనిపిస్తూ ఉంటుంది. ఆ మేటల్ని ఏ పడవా దాటుకుని వచ్చి తనని తీరం చేర్చలేదు. ఏ రాకుమారుడూ వచ్చి ఆమెతో ఉంగరాలు మార్చుకోలేడు. ఆమె గురించి మేలి ముసుగుల పెళ్ళి పాటలు పాడేందుకూ ఎవరూ లేరు.

మెహర్ తన చుట్టూ కలియచూసింది. ఆమె గోడు వినిపించుకునేందుకు ఎవ్వరూ కనబళ్ళేదు. ఒక్క పడవ నడుపుకునే మధ్యవయసు హాంజీ తప్ప. అతని పడవని ఫతే ఎన్నో సార్లు కలుపులోంచీ తప్పించాడు. హాంజీ చేతులూ, కాళ్ళూ తారు రాసుకునీ రాసుకునీ నల్లగా తయారయ్యాయి. రేవులో రణగొణ ధ్వనుల మధ్య కస్టమర్లని ఆకర్షించేందుకు గొంతు పగిలేలా అరిచీ అరిచీ,  పెదవుల చుట్టూ చొంగ ఎండిపోయి,  అతని మొహం ఒక కుండలా పెళుసుబారిపోయి ఉంటుంది. అతని కళ్ళ స్థానంలో రెండు గుంటలుంటాయంతే.   ఇంకా మెహర్ పక్కింట్లోనే ఉండే ఒక నేత పని చేసుకునే కూలి మనిషి గుర్తొచ్చాడు.  ఇంకా నల్లమందుకి బానిసైన కిరాణా అంగడి యజమాని కూడా !  అతని దగ్గర జనాలు జ్వరానికీ, దగ్గులకీ కషాయానికి వెళ్తుంటారు. వీళ్ళు తప్ప మెహర్ కి తెలిసిన మనుషులే లేరు. వీళ్ళలో ఒక్కరు కూడా   ఆమె తరపున గాషా తో మాటాడో / పోట్లాడో ఒప్పించే వాళ్ళు లేరు 

అయితే ఆమె గుండె ఒక జారిపోని కన్నీటి బొట్టు లా, బైటికి చెప్పుకోలేని కోరికలా.. పుట్టే ముందే చచ్చిపోయే ఆలోచనలా, ఎప్పటికీ నిజం కాని స్వప్నంలా, కొట్టుమిట్టాడింది.

ఒక్కరు - ఎవరో ఒక్కరు - తన గోడు వినేవాళ్ళు.. ఒడుపుగా తన చేతిని పట్టుకుని, పల్లకిలో కుదేసి,  తనకి తెలీని అజ్ఞాత వ్యక్తి  - అతన్ని ఆమె చూడలేనంత అస్పష్ట వ్యక్తి, తనని తన పరిసరాల్నుండీ  ఎత్తుకెళ్ళిపోతే బావుణ్ణని ఆమె తపించిపోయింది. 'ఆ అజ్ఞాత వ్యక్తి అస్సలు ఫతెహ్ లా ఉండనేకూడదు'!!!  ఇలాంటి ఆలోచనల నీడలు తన మనసులో  తచ్చాడుతూ మెహర్ ని మరింత భయపెట్టేవి. అందుకే ఆమె రాజరాణి అత్తయ్యకు చప్పున సమాధానం ఇవ్వలేకపోయింది.

"మరి ఏంటే నీ బాధ ? ఫతే మీద నీకంత వ్యతిరేకత ఎందుకు? అడిగింది అత్తయ్య, కుంపటిని తన కుడి  మోకాలినిండీ ఎడమ మోకాలి కిందికి జరుపుకుంటూ.  అప్పటికి చిలుముని హుక్కాకి బిగించడం, పొగ ఊది దాన్ని పరీక్షించడమూ అయ్యాయి. 

"అతని మీద వ్యతిరేకత ఏమీ లేదు !! ...." అంతకన్నా ఇంకా ఎలా చెప్పాలో తెలీక మెహర్ సందిగ్దంగా ఆగిపోయింది.   మాటల్లో చెప్పలేని  భావాలు కన్నీళ్ళై ఉబికి వచ్చి, ఆమె చెంపల మీదుగా జారిపోయాయి. "నాకు ఫతే ని పెళ్ళి చేసుకోవాలని లేదు అత్తయ్యా.. దయ చేసి నువ్వే గాషా కి చెప్పాలి!!" వేడుకుంది. 

అత్తయ్య కుంపటిని బయటకు తీసి, భుజాల్ని ఎగరేసింది. చేతులు విరుచుకుంది. మెహర్ ని ఓదార్చింది.   "సరే అమ్మలూ.. నేను చెప్పి చూస్తాను. కానీ ఇలా చూడు. కాలం మారింది. మాలాంటి వాళ్ళ మాటలు ఎవరు వింటారు చెప్పు. గాషాని ఒప్పించగలనన్న నమ్మకం నాకు లేదు. కానీ కేవలం నీ కోసం అడుగుతాను"  అంది. 

రాజ రాణి అత్తయ్య అన్న మాటే నిజమయింది. గాషా ఆమె మాటల్ని లెక్క చెయ్యలేదు. అతని రెండో భార్య మాటల్నీ, తన స్వార్ధపుటాలోచనలనీ తప్ప ఇంకేదీ వినే ఆలోచనే అతనికి లేదు. నికా చదవబడింది. ఓ రెండు మూడు పెళ్ళి పాటలు పాడారు. కొందరు మనుషులెవరో భోజనాలు చేసారు. ఒక రోజంతా ఆనందంగా, గొడవగా గడిపేసారు. రాత్రి చీకటికి రెండు గ్యాసు దీపాలు వెలిగాయి. మెహర్ కీ ఫతే తో పెళ్ళయిపోయింది. 

మెహర్ బ్రతుకు ఎప్పట్లాగే ఉండిపోయింది. ఆమె సేద తీసుకోవడానికి  వాలేందుకు  ఇంటిలో అదే స్తంబం, అదే ఇంటి మెట్లు, అవే పేడ కుప్పలు, ఆమె నడిచే తోవంతా నాచు మొక్కలూ - అదే చాకిరీ ! ఫతే జీవితమూ ఏమాత్రం మారలేదు.  అతను పాత ఫతే లాగే తన పనికి పునరంకితమయ్యాడు. అతనిలో ఒక్క పిసరు మెరుపు కూడా రాలేదు. మెహర్ చేతి గోరింట వెలిసిపోయింది గానీ, ఆమె ని అతనితో కలిపి కట్టేసే బంధం ఏదీ అతనికి దొరకలేదు.  అతని రాక ఆమె జీవితంలో ఏ మాత్రం కొత్తదనాన్నీ తేలేదు. మెహర్ తన జీవితపు బావిలోకి మరింత కూరుకుపోయింది. ఒక్కోసారి ఆమెకు కిటికీలోంచీ దూకి చావాలనిపిస్తుంటుంది. కానీ అది కూడా ఎవరికీ 'పట్టని' పనే అని అర్ధం అయి, ఊరుకుంది.  దాని వల్ల కూడా ఫలితం లేదు.  ఇన్నాళ్ళూ సవతి తల్లితో తాను బ్రతకలేదూ.. ఇప్పట్నించీ ఫతే తో బ్రతుకుతానేమో.. అనుకుంది. ఆమె గోడు ఎప్పట్లాగే బయటికి వినబళ్ళేదు. తండ్రికి అస్సలు పట్టలేదు. 

ఒక పూర్తి ఏడాది ఏ మార్పూ లేకుండా గడిచిపోయింది.  ఎక్కడా పొరపాట్న కూడా కొత్తగా ఏమీ జరగలేదు. ఆమె స్నేహితులు అలానే ఉన్నారు. రోజూ పొద్దెక్కుతోంది.   రాత్రుళ్ళు దీర్ఘంగా, చిన్నగా, కాలం తో పాటు మారాయి. ఇంటి పనీ అలానే ఉంది.   ఒకే ఒక్క సంగతి మారింది. గాషా కి ఫతె అంటే అయిష్టం కలగడం మొదలయింది.    

గాషా కి తన రెండో భార్య మాట అంటే ఆన. ఆవిడ ద్వారా ఫతే గురించి కొత్త సంగతులు తెలుస్తున్నాయి గాషాకు. పెళ్ళయ్యాక ఫతే మారాడు. అతని వ్యవహారం గాషా కు అస్సలు నచ్చడం లేదు. కస్టమర్లనుండీ డబ్బు వసూలు చేసుకోవడం లో ఏదో అసహజత్వం కనిపిస్తుంది. పైగా నలుగురూ నాలుగు మాటలంటున్నారు. ఎవరితోనో ఫతే, గాషా నుండీ తన వాటాను అడుగుతానన్నట్టుగా పుకారు వినపడింది.  ఇంకెవరో, గాషా, ఫతే ఇంటి వాటాని ఇకనైనా విడిచిపెట్టాలని అన్నట్టు తెలిసింది. చికాకులు ఎక్కువయ్యయి. ఫతే తిరుగుబాటు సంగతి గాషా కి అస్సలు జీర్ణం కాలేదు.  వొళ్ళు మండి, ఒకరోజు వీధిలో కేకలేసాడు. 'ఇకపై తన కూతురితో విడాకులిప్పించేస్తాననీ, అతనికి తనకీ ఇక ఏ సంబంధమూ లేదనీ, ఫతె ఇక తన సంగతి తాను చూసుకోవాలనీ' అరిచాడు.  కూతురిని పిలిచి "నువ్వ్వపుడు ఎంత చెప్పినా విన్నాను కాదు. నీకు ఫతె సరైన మొగుడు కాదు. ఇక విడాకులిచ్చెయి. అర్ధమయిందా?' అని బెదిరించాడు. ''ఇక చాలు ఆ వెధవని గుమ్మం తొక్కనీయను. పోనీ కదా అని చేరదీస్తే ఇలా మారుతాడా. నీకింకో మంచి సంబంధం తెస్తాను. వాడికిక విడాకులిచ్చేయి.."


అతనిలా మాట్లాడుతుండగానే మెహర్ కి గడిచిన ఏడంతా గుర్తొచ్చింది. ఆ రోజులన్నీ ఎప్పుడో మర్చిపోయింది. వాటిలో గుర్తు పెట్టుకునేందుకు ఏముందో ఆమెకు తోచలేదు. కానీ గాషా అరుపుల మధ్య, మెహర్ కు ఏ దీర్ఘ నిద్ర లోంచో మెలకువ వచ్చినట్టు అనిపించింది.  అంత గాఢాంధారంలో ఎక్కడో వెలుగు కనిపించినట్టు, తనెవరో, తనెలా ఉండేదో, తన పరిస్థితి ఎలా ఉండేదో అన్నీ కొత్తగా తెలుస్తున్నట్టు అనిపించింది.   ఒక విషయం గుర్తొచ్చింది. 


ఒకరోజు ఆమె వరండాలో ఉంది. ఫతె సరస్సులోంచీ పెద్ద  నీటి కలుపు మొక్కల మోపుని తెస్తున్నాడు. అదెంత బరువుగా ఉందంటే, అతని కాళ్ళు ఆ బరువు మొయ్యలేక వంకరగా పెట్టి, కాస్త ఊగుతూ ఘాట్ మీదుగా మోసుకొస్తున్నాడు.  మెహర్ అసంకల్పితంగా అతని ముందుకు పోయి, బరువందుకుని, మోపును కిందికి దించేందుకు సాయం చేసింది.  బరువు దించాకా ఫతే కాసేపు కళ్ళు మూసుకున్నాడు. కాసేపటికి కళ్ళు తెరిచి చూసాడు. నెమ్మదిగా అతని కళ్ళలోకి వెలుగొచ్చినట్టయింది. అలుపు తీర్చుకుని, నుదుట చెమటను, మొక్కలనుండీ కారిన నీళ్ళనూ తుడుచుకున్నాడు. మెహర్ కాసేపు అతన్ని చూసి "ఎందుకంత మొయ్యలేని బరువు మోస్తావు? అంది. 

ఆ మాత్రం సానుభూతికే,  స్తబ్దుగా ఉండే అతనిలో ఏదో కదలిక వచ్చి,  తన టోపీ తీసి దులిపి,  భర్తగా ఆమె మీద అధికారం ధ్వనించే గొంతుతో,   మృదువుగానే  "ఏం చెయ్యను ?  తప్పదు!" అన్నాడు.  


 "ఎందుకు ?   ఏదయితే అది కానీ - వదిలెయ్ ఇంక!" అంది అసంకల్పితంగానే.  ఆరోజు బహుశా అతని మీద మొదటి సారిగా ఆమెలో జాలి లాంటి భావన కలిగింది.  "ఎంతయినా, అతనూ మనిషే. ఎంతకని అతనిలా కష్టపడగలడు ? అతని శరీరం ఎంత పనిభారాన్ని సహించగలదు? అతనేమయినా రాక్షసుడనుకుంటున్నారా వాళ్ళు ?" అనే ప్రశ్నలతో సతమతమయింది.  అసలతని మీద తనకు జాలి కలిగిందన్న భావమే ఆమెకు ఎందుకో చాలా సంతృప్తిని ఇచ్చింది.

అసలిది అంతా ఇప్పుడు గుర్తొస్తుంటే ఆమెకు ఈ క్షణాన కూడా  అదే సంతృప్తి కలుగుతుంది. ఈ భావోద్వేగంతో  ఉక్కిరిబిక్కిరవుతూన్న తన శరీరపు భారాన్నంతా కిటికీకి ఆన్సి నించుంది. ఆమెకు ఫతె పేరుని తన గొంతు చించుకుని అరవాలని అనిపించింది. అయితే కిందనుండి గీషా  అరుపులు వినిపిస్తున్నాయి. అతను ఫతె ని వదిలేయమంటున్నాడు. ఏడాది క్రితం వరకూ ఆమెకు అతనంటే ఎటువంటి సానుభూతీ లేదు. కానీ పెళ్ళయి ఏడాది అయేసరికీ తన మనసులో ఈ భావాలెందుకు కలుగుతున్నాయో!?   అసలు అతనేమయిపోతే తనకు ఎందుకు ? విధి లో ఇలా జరగాలని రాసిపెట్టుంటే తప్పించుకోవడం ఎవరికి సాధ్యం ?  అసలు తన గుండె ఇన్ని కృత్రిమ వలలు పన్నుతుందెందుకు.. ?  అసలు ఫతె తన కోసం ఏం చేసాడని ?

మెహర్ ఇలా ఆలోచిస్తుండగానే ఆమెకు ఇంకో సంగతి గుర్తొచ్చింది.  శ్రావణ మాసం లో ఒక రోజు ఆమె తన మోచేతిని గోడకి అదిమి నించుని ఉంది. కడుపులో లుంగలు చుట్టేస్తున్న ఆకలి!   అది భోజనాల సమయం దాటి అందరూ టీ తాగే మధ్యాన సమయం.  ఇంట్లో పొయ్యి ఆరి చాలా  సేపయింది. కుండలు, పాత్రలు అన్నీ ఖాళీ.  ఒకవేళ అవన్నీ  వెతికి ఏదయినా తినేందుకు దొరికబుచ్చుకున్నా, సవితి తల్లి కేకలేస్తుంది.  ఈ బాధతో సుడులు తిరుగుతూ ఆకలి నకనకలాడుతుండగా ఏవో రెండు లిలీ పూ గింజలు దొరికితే నోట్లో వేసుకుంది. అవి జఠరాగ్నిని ఇంకాస్త పెంచాయే తప్ప ఇంకెలాగూ పనికిరాలేదు.  ఆమె కళ్ళ ముందే పొద్దు గుంకుతూంది. అప్పుడే ఆమె ఎదురుగా ఫతే వచ్చాడు. ఆమెను "ఈ ఎండలో ఎందుకు నించునున్నావు ?" అని అడిగాడు మొహమాటంగా. 

"ఏమీ లేదు ! "  అందామె ముక్తసరిగా. అతనికి చెప్పనే కూడదనుకున్నా, మాటలు ఆమె నోట్లో ఆగలేదు.  "నాకు చాలా ఆకలిగా ఉంది. నా లోపల అంతా పగిలి ముక్కలయ్యేలా ఉన్నట్టుంది" అంది.  ఫతె తనని ఏదో బరువైన వస్తువేదో  బలంగా తాకినట్టు అదిరిపడ్డాడు. మెల్లగా ఆమె భుజాన్ని తట్టి - "నాకెందుకు చెప్పలేదు ? ఉండు! రెండు నిముషాల్లో నీకు రొట్టె తెస్తాను!"  అన్నాడు. అన్నట్టుగానే ఉరుకులు పరుగుల మీద దుకాణానికి వెళ్ళి, రెండు రొట్టెలు తెచ్చాడు..   రావడం రొప్పుతూనే వచ్చాడు. చాలా సేపటి వరకూ, మెహర్ కు అతను తన భుజం మీద తట్టడం, అతని స్పర్శ,  గుర్తు ఉండిపోయింది.   అతని రొప్పు తున్న శబ్దం, బరువైన ఊపిరి, ఆమె చెవుల్ని   చాన్నాళ్ళ వరకూ  వీడలేదు.   ఆరోజు పని ముగిసాక మాటాడలనిపించి అతనికోసం ఎదురుచూసింది. అసలు తనని 'సరిగ్గా'  ఒకసారైనా చూడాలనుకుంది! 

మెహర్ మెల్లగా కిటికీ నుండీ వెనక్కు వచ్చింది. ఆమెకు ఇంతవరకు తను ఫతె మొహాన్ని 'సరిగ్గా' చూసిన గుర్తు కూడా లేదు.   గడిచిపోయిన సంవత్సరం అంతా ఆమెకు ఈ స్పృహే లేకపోయింది. వాళ్ళి చిన్నప్పటినుండీ ఒకరినొకరు ఎరిగినవాళ్ళే. చాలాసార్లు ఆమె అతనితో  మాటాడేది, పని చేసేది. ఎపుడైనా పోట్లాట కూడా వేసుకునేది.  అయినా ఆమెకు అతన్ని తాను సరిగా కనులారా చూసిన జ్ఞాపకం లేదు.  ఇప్పుడు ఆమె తండ్రి అతన్ని వొదిలేయమంటున్నాడు.   ఏడాది క్రితం తాను మొరపెట్టుకున్నప్పుడు అతను వినుండాల్సింది.  ఇప్పుడు ఆమె హృదయం వేరే లా ఆలోచిస్తుంది. ఏడాది క్రితం కథే వేరేలా ఉండేది. మరి ఇపుడు .... ?  

మెహర్ తను ధరించిన బట్టల అంచుల్ని, వాటి మీద ఉన్న గీతల్నీ,  దీర్ఘంగా చూస్తూ ఆలోచిస్తూండిపోయింది. భగవంతుడికే తెలుసు.. తన నుదిట్న ఏమి రాసుందో!  పోయిన ఏడాది ఈద్ పండుగ గుర్తొచ్చింది. చిన్నప్పటినుండీ మెహెర్ పక్కింటి 'వని' కూతుర్లని గమనించేది. వాళ్ళు ఈద్ కి కొత్త బట్టలో, కొత్త చెప్పులో తొడుక్కునేవాళ్ళు. ఈద్ ముందురోజే వాళ్ళ కానుకల్ని వాళ్ళ మధ్యలో పేర్చుకుని చర్చించుకునేవాళ్ళు. "నువ్వు టైలర్ దగ్గరికి వెళ్ళావా?" అని ఒకరినొకరు  ఆరా తీసుకునేవాళ్ళు . 'ఈద్' కు తనకూ ఏదయినా కొత్త వస్తువు ఉంటే బావుండునని మెహెర్ కి కూడా అనిపించేది.  కానీ ఆమెకు ఎప్పుడూ ఆ రాత ఉండేది కాదు. మర్నాడు ఏ పక్కవాళ్ళ పిల్లో తలకు కొత్త వస్త్రం కట్టుకునొ, కాళ్ళకు కొత్త చెప్పులు వేసుకునో కనబడేది.   ఇపుడు తను పెళ్ళి బట్టలే తొడుక్కుంటుంది  -  ఇపుడు మళ్ళీ  వాటినే వేసుకున్నా, దుపట్టా మాత్రం లేదు దానికి.   అదన్నా కనీసం ఉండాల్సింది అనుకుంది.   ఆరోజు సాయంత్రం ఫతె ఆమె ఎదుట  ఒక పొడవైన మస్లిన్ బట్ట పరిచి ఆమెను నిశ్చేష్టురాల్ని చేసాడు. అంత మంచి బట్ట!!!  ఆమె తన కళ్ళను తానే నమ్మలేకపోయింది.  ఆమె నోట ఒక్క మాట కూడా పెగల్లేదు. కాసేపటికి ఫతే అరిగిపోయిన బట్టలు గుర్తొచ్చి.. "నీకోసం ఏమీ కొనుక్కోలేదా నువ్వు?"  అని మాత్రం అనగలిగింది.  

"ఓహ్.. దాన్ని గురించి వొదిలెయ్.  నా బట్టలు ఎవరు చూస్తారు?  కానీ నువ్వు చెప్పు. ఈ దుపట్టా నీకు నచ్చిందా ?" అనడిగాడు. ఆరోజు,  ఆమె అతనిలో 'కొత్త ఫతె' ని చూసింది.  ఈరోజు పక్క మీద వాలి ఆ రోజు తాను అతనిలో చూసిన కొత్తదనాన్ని గుర్తు తెచ్చుకుంది. ఆ నాటి  ఫతె రూపం లోని కొత్తదనం ఆమెలో ప్రవేశించి, ఆమె మెత్తని, బలమైన శరీరానంతంటినీ ఆక్రమించి,  ఆమె సంశయాలని చెల్లా చెదురు చేసింది.  అతని జ్ఞాపకాలు అన్నీ కొత్త రూపు సంతరించుకుంటున్నాయి.  ఫతె మొహం ఆమె కళ్ళ ముందు మెదులుతుంది.  ఆ భావాలు ఉక్కిరిబిక్కిరి చేస్తుండగా మెహర్ తన చేతులు తన చుట్టూనే గట్టిగా బిగించుకుని తనని తానే బలంగా  హత్తుకుంది. ఆమెలో ఇంకో జ్ఞాపకం కూడా నిద్రలేచింది. 

ఆ రోజు ఆవు ఈనింది.  మెహర్ తన చేతుల్లోకి ఆ లేగ దూడ ని తీసుకుని ఆడుకుంటూ దాని చెవుల్ని పట్టి గుంజుతోంది. దూడ ఆమె చేతుల్లోంచీ తప్పించుకునేని,  తల్లి దగ్గరకు పాలకోసం వెళ్ళేందుకు గింజుకుంటూంది. మెహెర్ కి ఈ పెనుగులాట సరదాగా ఉంది. కానీ తల్లి ఆవుకు మాత్రం కోపం వచ్చేసి దాని చెవులు నిక్కబొడుచుకున్నాయి.  ఫతె గుమ్మం నుండి 'దాన్నిక వొదిలెయి.. నువ్వు దాని చెవులు గుంజేసేలా ఉన్నావు' అని కేకేసాడు. 

'చూడు - ఆ ఆవు ఎంత కోపంగా ఉందో?!. దాని చెవులు పైకి లేచే ఉన్నాయి'  అంది మెహర్. 

'అవును మరి. దానికి కోపం రాదూ. అది తల్లి బాధను అనుభవిస్తుంది. నీకది ఎలా తెలుస్తుందిలే !' అన్నాడు -  మెహర్ 'అస్సలు అలవాటు పడని' సున్నితమైన కొంటెతనంతో.  మెహర్ కి చాలా సిగ్గేసింది. ఆ సంగతి గుర్తు రాగానే ఆరోజులాగే ఇప్పుడు కూడా ఆమె చెంపలు ఎర్రబడ్డాయి. ఆమె శరీరమంతా ఏదో విద్యుత్ ప్రకంపన లాంటిది కలిగింది. ఆమె రొమ్ముల్లో మధురమైన పులకరింత. ఆమె హృదయమంతా ఏదో దివ్యలోకాలకి మాత్రమే చెందిన తియ్యటి భావన నిండిపోయింది. 

అసలు హృదయం ఏమిటి చివరికి ?  బరువు మోసేవాడి సాయానికి ముందుకొచ్చిన ఆపన్న హస్తమా . ఆకలి గొన్నవాడికిఇచ్చిన ఒక రొట్టె నా ?   ఈద్ కి కొన్న దుపట్టా నా?   మనసుని పరవశింపజేసి, గుండెలోతుల్లో 'కాలం మొదలయిన నాటినుండీ'   భద్రంగా దాచుకున్న ఆ 'కొత్తదనపు'  మెరుపు తాలూకు  జ్ఞాపకమా ?  

మెహర్ దీనంతటిలో దేనినీ విడమరచి చెప్పలేకపోవచ్చు. కానీ ఆమె హృదయం మాత్రం  ఫతె లో ఉన్న మెరుపుని "ఇప్పుడే" ఎరిగినది కావడం వల్ల కలిగిన ఆనందంలో మునిగిపోయింది. తన చుట్టూ నిండిపోయిన బూడిద కుప్పల్లో, సరస్సులో పద్మం పూల గుట్టల్లో, ఈగలువాలిన పేడ పోగులలో, ఆమెకు మాత్రమే కనిపించే మెరుపుని ఫతె ఆమె కోసమే జాగ్రత్త చేసాడు. ఆ మెరుపు ఆమెకు మాత్రమే సొంతం. అతని నవ్వు ఆమె కోసమే!!!  హఠాత్తుగా, ఆమెకు, తను అతన్ని వదిలేస్తే అతను అదే చిత్తడినేలల్లో కూరుకుపోతాడనిపించింది. ఈ నవ్వునూ, మెరుపునూ కోల్పోతాడని తోచింది.   తానిన్నాళ్ళూ పల్లకిలో తీసుకుపోతాడని కలలు కన్న అజ్ఞాత వ్యక్తి 'ఫతె' నే అని అర్ధమయింది. అప్పుడు సరిగ్గా కనీ కనిపించని ఆ కలలాంటి రూపం, ఇప్పుడు ఓ రూపు తెచ్చుకుంది.  ఈ యవ్వన, దృఢ, పవిత్రమైన మోము కలిగిన పెళ్ళికొడుకు 'ఫతే'నే!  అతన్ని కోల్పోతే,   తన చీకటి ఊబుల్లోంచీ తాను ఇక ఎప్పటికీ బయటపడలేదు . 

అలా ఆలోచనల్లో మునిగి, తనకు తెలీకుండానే మెహర్ రాజ రాణి అత్తయ్య దగ్గరికి వెళ్ళింది. 

రాజ రాణి అత్త  హుక్కా పీలుస్తుంది. ఎప్పటి లాగే ఆమె కాళ్ళ కింది కుంపటి పెట్టుకుని కూర్చుంది. 

"దయచేసి గాషాకి చెప్పత్తయ్యా.. నన్నూ, ఫతె నూ విడిదీయవద్దని -" .... ప్రాధేయపడింది మెహర్

"ఓహో ! అయితే ఫతే నీ మీద ఏ మంత్రం వేసాడే పిల్లా ?"   మేలమాడింది అత్తయ్య. 

"మంత్రం కాదు అత్తయ్యా.. కానీ ...."  

మెహర్ అత్తయ్యకు తన బాధనంతా విడమరచి చెబ్దామనే అనుకుంది గానీ.. బెంగతో, దుఃఖంతో గొంతు పూడుకుపోయి,  ఎప్పట్లాగే మాటాడలేకపోయింది. ఎలాగో గొంతు పెగుల్చుకుని,  "కానీ నాకతన్ని వదిలేయాలని లేదు అత్తయ్యా. నువ్వు దయచేసి గాషాకు చెప్పు" అంది దీనంగా.    

***

From : The Greatest Kashmiri Stories Ever Told"

Name of the Story :  "Human Heart"  - by -  Sri  Umesh Kaul.

Translated from Kashmiri to English : Ms.Neerja Mattoo 

 



No comments: