"కుంభ మేళా కి వచ్చి మోక్షం పొందూ " అంటే రబీంద్రుడి అభిమాని ఎవరో.. 'నాకు మోక్షం వొద్దు ఏమీ వొద్దు.. ఇంకో మూడు నాలుగయిదు జన్మలెత్తి రబీంద్రుని సాహిత్యం మొత్తం చదవాలి' అన్నారంట. అంతటి విశ్వ కవి రవీంద్రనాథ్ టాగోర్. చిన్న పిల్లల ఇంగ్లీషు టెక్స్ట్ పుస్తకాల కాలం నుంచీ పాతుకుపోగలిగే రచయిత, ప్రతి వేసవి లోనూ పీచు మామిడి పళ్ళ ని తన గడ్డం తో పోల్చడం గుర్తు తెచ్చుకునేలా చేసే రబీంద్రుడు, మన పిల్లలకి కూడా ఎక్కడో ఓ చోట గుర్తుండిపోయేంత దగ్గరయిపోతాడు.
అపురూపమయిన ప్రార్థనా గీతాలతో, చిన్నా పెద్దా అందరినీ ఆకర్షించిన విశ్వకవి రవీందృడు, కథల ద్వారా మొదట పరిచయం నాకు. ఇప్పుడు ఆ కథలు, వెబ్ సెరీస్ గా కూడా పెద్ద హిట్. ఎన్నో కథల సినిమాలు వచ్చాయి. ముఖ్యంగా ఎర్రని వేసవి కాలం లో పచ్చని మామిడి తోపుల మధ్య బెంగాలీల ఇంట్లో ఉక్కపోత మధ్యాన్నం లో చిన్న పిల్లల ఆటలు, ప్రతీ ఎండాకాలమూ కరెంట్ పోయినప్పుడు గుర్తొస్తాయి.
నేను చదివిన కొన్నే నాకు అపురూపం, అలాగే చిన్నప్పుడు చలం గీతాంజలి చదివి, నేనూ, మా అక్కా, ఎంత సంతోషపడిపోయామో గుర్తుంది. ఎప్పుడన్నా ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ లో వచ్చే సరోజినీ నాయుడు కవితా, టాగోర్ గీతాంజలి లో ఓ గేయమూ, ఎంత అమృతోపమానంగా వుండేవో గుర్తొస్తుంది. అందుకే ఇది మన కు చాలా స్పెషల్ పుస్తకం.
స్నేహితుల ఇళ్ళల్లో పుస్తకాల షెల్ఫులని "విండో షాపీంగు" చేసే అలవాటులో ఇది నా కంట పడగానే, దీని సొంతదారు, మెత్తని హృదయం గల కమ్మని ఆత్మీయ స్నేహితురాలు 'సుజాత' నుండీ, నాకీ పుస్తకం కావాలీ అని అడిగేసి, ఓ పది సంవత్సరాలలో(From Feb 2021, Bengaluru) ఇచ్చేస్తానని చెప్పేసి, అరువు తెచ్చుకున్న పుస్తకం. "నా దగ్గర షెల్ఫ్ లో ఉండిపోవడం కన్నా ఎవరో ఒకరు 'చదవడం' మేలు అని ఇస్తున్నా!" అని హెచ్చరించినా, పుస్తకాన్ని పూర్తి గా చదవడం కుదర్లేదు. ఇప్పటి దాకా, పేజీలు తిరగేస్తూ, మురిసిపోతూ, నచ్చినదేన్నో స్టేటస్ లలో పెట్టుకుని గొప్పలు పోవడమే తప్ప చదివే ఉద్దేశ్యమే లేదు నాకు. పది సంవత్సరాల టైం ఉంది. ఆస్వాదిస్తూ చదవాలి అని అనుకుంటూ, మంచం పక్కనే పెట్టుకుని ఆరాధిస్తూ ఉండడమే తప్ప, నిజంగా ఈ సుధాంబుధి లోకి దూకనే లేదు. అప్పుడప్పుడు ఒకటి చదివితే చాలు .
నా ఆస్వాదన కి ఒక్క "గీతాంజలి" సరిపోలేదు, ముందు చలం అనువాదం చదివాను. తరవాత ఎన్నో వచ్చాయి తెలుగు అనువాదాలు. అన్నీ బావున్నాయి. వీళ్ళంతా ఏ క్రేజ్ లో కొట్టుకెళిపోతూ ఇన్ని వెర్షన్ లు అనువాదాలు చేసారా అని ఆశ్చర్యం కూడా ఉండేది. ఈ పుస్తకం నాలో కలిగించిన మురిపెం, ఈ ఆశ్చర్యానికి, సందేహానికీ సమాధానం చెప్పింది. ఈ మేజిక్ నుంచీ తప్పించుకోవడం ఎంత కష్టం ?! ఉదాహరణ కు మా అమ్మాయి కి చిన్నప్పుడు యూ ట్యూబ్ లో చూపిస్తూ రబీంద్రుని కవిత "పేపర్ బోట్" ను నేర్పించినప్పుడు ఆ కాయితప్పడవలో రాలిన నక్షత్రాల లాంటి పారిజాతాలు... నదిలో తేలుతూ వెళ్ళిపోతూండడం లాంటి మేజిక్ - నాలాంటి అన్-రొమాంటిక్, ఏంగ్రీ, పోయెట్రీ ఇష్టపడని మనిషిని కూడా అంటిపెట్టుకోగలదని అర్ధం అయింది.
'గీతాంజలి' మన దేశపు ఏకైక సాహితీ నోబుల్ తెచ్చిపెట్టిన గేయాల మాలిక. అంత కన్నా ముందు, దేవుణ్ణి స్నేహితునిగా చేసి, బ్రతుకు గొడవల్లో అతని పాత్రని విస్తృతం చేసి, ఏ మందిరంలోనో, దూర స్వర్గంలోనో ఒక జీవం లేని ఆత్మ అనే భావాన్ని దూరం చేసిన పాటలివి. ఈ పాట, ఈ కవిత, టాగోర్ తాలూకు విలక్షణ, అసమాన ప్రజ్ఞ లో కేవలం, ఒక చిన్న సంగతి. సూటి గా మనసుని తాకేంత సున్నితత్వం, మానవత్వం, దైవత్వం - దాపరికం లేని ప్రేమ, స్నేహం కలగలిపిన సింపుల్ కవితలు ఇవి.
ఇప్పుడు మన ఏకైక నోబుల్ బహుమతి 2004 లో దొంగతనానికి గురయింది. కానీ "గీతాంజలి" ని భారత దేశం నుండీ ఎవ్వరూ లాక్కోలేరు. ఈ పుస్తకం అదే ప్రయత్నం చేస్తూ, ఒరిజినల్ బెంగాలీ చిత్తు ప్రతులతో పాటూ, టగోర్ చేతి రాత, నోబుల్ పొందినప్పటి సంగతుల వార్తా కథనాలు, రబీంద్రుని డ్రాయింగ్స్, ఉత్తర ప్రత్యుత్తరాలు, అరుదైన ఫోటోలు, చారిత్రక విలువ గల ఎన్నో హృద్యమైన వ్యాసాలను ఒక చోట చేర్చింది. ఇది నిజంగా కలెక్టర్స్ ఎడిషన్. విశ్వభారతి ప్రచురణ. Bilingual Edition. (Bengali and English). దీన్ని విశ్వభారతి, గీతాంజలి ప్రచురణ జరిగి 100 సంవత్సరాలయిన సందర్భంగా డిసెంబర్ 2012 లో WB Yeats పరవశంగా రాసిన పరిచయ వాక్యాలతో సహా ప్రచురించింది. గీతాంజలి గురించి, రబీంద్రుని గురించి, పూర్తి సమాచారం తో కలిపి సమగ్రంగా, సందర్భానుసారంగా ఉపయోగించిన బొమ్మలు, ఫోటోలతో, చక్కగా, డిసైన్ చేసారు. వెల వెయ్యి రూపాయలు.
In one salutation to thee, my God, let all my senses spread out and touch this world at thy feet.
Like a rain-cloud of July hung low with its burden of unshed showers let all my mind bend down at thy door in one salutation to thee.
Let all my songs gather together their diverse strains into a single current and flow to a sea of silence in one salutation to thee.
Like a flock of homesick cranes flying night and day back to their mountain nests let all my life take its voyage to its eternal home in one salutation to thee.
2 comments:
మంచి పుస్తకం పరిచయం చేశారు. Netflixలో రవీంద్రుని కథలు మాత్రమే నాకు రవీంద్రుని సాహిత్యంతో ఉన్న పరిచయం. అవి నాకు చాలా నచ్చాయి. మళ్ళీ మళ్ళీ చూస్తూ ఉంటాను. గీతాంజలి చదివే ప్రయత్నం చేస్తాను. ISBNతో వెతికితే యిది కనిపించింది -
https://www.google.com/books/edition/Gitanjali_song_Offerings/HzM62PUsjDUC?hl=en&gbpv=0
Thank you for liking it. Tagore is a versatile and very talented person, hugely respected by many Indians. You will definitely enjoy these poems. Enjoy reading.
The ISBN for the book that I mentioned here is 9788175225602. Thank you.
Post a Comment