ఈరోజు హోలీ. పిల్లలకి పిడిలైట్ రంగులు తెచ్చారు. పిడిలైట్ లోగో చూసి, ఈ పుస్తకమే గుర్తొచ్చింది. మామూలుగా నాకు సెకన్లలో ప్రభావాన్ని చూపించే వాణిజ్య ప్రకటనలు చాలా ఇష్టం. ఈ మధ్య వచ్చే ఎడ్వర్టైస్మెంట్ల పై స్పందనలు, ప్రకటన దారుల సోషల్ మీడియా పేజీల్లో, సహేతుక, నిర్హేతుక విమర్శలు, ముంచెత్తడం చూస్తే, ఇప్పుడు ప్రకటనల రంగంలో ఎంతో పోటీ వుంది, ఎంతో ట్రోలింగ్ కూడా జరగడం సాధారణం. అని ఒప్పుకోవాలి. ఇప్పుడు ప్రకటన బాలేకపోతే, చీల్చి చండాడేందుకు ఔత్సాహికులు వెనకాడడం లేదు. వస్తువుల నాణ్యత బాలేకపోయినా ప్రకటనలు దాన్ని మసిపూసి మారేడు చేస్తూ అమ్మజూపడం కూడా వినియోగదారులు సహించలేకపోతున్నారు. పూర్వకాలపు బ్రాండ్ లు నాణ్యత ని ప్రమాణంగా తీసుకుని పాతుకున్నాయి. దానికి ప్రకటనల వ్యూహాలు తోడిచ్చాయి అని చెప్పొచ్చు.
పాత కాలపు బ్రాండ్లు మన మనసుల్లో ఎంతగా పాతుకుపోయాయో - వాటి వెనక ఎంత ప్రణాళిక, తపన, పరిశ్రమ ఉండుంటాయో ఇపుడు అర్ధం అవుతుంది. అప్పట్లో నేనైతే, వీకో, నిర్మా, సర్ఫ్, కాడ్బరీ చాకొలెట్లు, ఎం.ఆర్.ఎఫ్. టైర్లు, రామాయణం.. ఇవన్నీ ఎటువంటి ప్రశ్నలూ లేకుండానే చూడడం గుర్తుంది. అవన్నీ ఈ పుస్తకం మనసు ముందుకు తెస్తుంది. మళ్ళీ, వాటి తెర వెనుక కలల్నీ, కథల్నీ, వాటిని పురమాయించిన వ్యక్తుల, సంస్థల అవసరాల్నీ, తటపటాయింపుల్నీ, మరీ ఎలాబరేట్ గా కాకుండా, అవసరమయినంత convincing గా గుర్తు చేస్తుంది. అలా అని ఇది కేవలం ఒక బిజినెస్ స్టూడెంట్ మాత్రమే చదవాల్సిన పుస్తకం కాదు.
సాధారణంగా వాణిజ్యం, వ్యాపార రంగాల చదువులు చదువుకునే వారు చదివే బిజినెస్ పాఠాలు మామూలు పాఠకుల దాకా రావడం అరుదు. కష్టపడే వాడిదే విజయం అనే సింపుల్ సూత్రాన్ని అన్వయించుకోవడానికి సగటు మనిషి కూడా తపించాల్సిందే అని తెలుస్తూనే వుంటుంది. కానీ విజయాలు సాధించడానికి ఇంకేదో కావాలి. అదేంటో తెలీక సగం, ఎదురు దెబ్బలు కలిగించే కుంగుబాటు తనం సగం, మనల్ని వెనక్కి లాగేస్తుంటాయి. అలాంటప్పుడు మనకి మంచి స్నేహితుడెవరో భుజం పట్టుకుని ఆపి చెప్పే సూర్థి కలిగించే మాటలు చాలా అత్యత్భుతంగా పనిచేస్తుంటాయి.
అలాంటి పుస్తకమే ఈ సూపర్ 30 విజనరీస్. మామూలుగానయితే నేను వ్యక్తిత్వ వికాస పాఠాలకు దూరంగా ఉంటాను. ఎందుకో నాకు కొన్ని "మంచి మాటలు" నచ్చవు. ఒకలాంటి పొగరు అనుకోవచ్చు. కానీ ఈ పుస్తకాన్ని రచయిత నాకు పంపించినపుడు పేజీలు తిరగేసి నాకు ఆసక్తి కలిగించే అన్ని లక్షణాలూ ఈ పుస్తకంలో ఉన్నందున ఏకబిగిన చదివేసాను. ఈరోజిలా పిడీలైట్ పేరే - ఓ ఫెవికాల్ బంధంలా నన్ను మళ్ళీ ఈ పుస్తకం వైపు లాక్కొచ్చింది. Brand power. అదే విధంగా ఈ బ్రాండులు తమ నిజాయితీ తో భారతీయ కుటుంబాల imagination ని చాలా సాంప్రదాయక మార్గాలలో, కొన్ని అసాధారణ సాహసాలతోనూ ప్రభావితం చేసాయి.
మొత్తం 30 మంది వ్యాపార దిగ్గజాల గురించి అన్నాను కదా. మొత్తం ముప్ఫయి సంక్షిప్త వ్యాసాలు - 30 విజయ గాధలు. రచయిత బహుశా వీటిని ఒక ఫార్మాట్ ప్రకారం, చిక్కని క్లుప్తత తో మాగజీన్ 'కాలం' తరహాలో రాయడం ఒక పెద్ద ప్లస్ పాయింటు. దీని వల్ల అస్సలు సాగదీత లేకుండా, ఆసక్తి చెడకుండా, ముఖ్యంగా ఎన్ని కష్టాలు ఎదుర్కొని, ఎన్ని సాహసాలు చేసి ఆయా రంగాలలో ప్రముఖులు ఇలా విజయాలని సాధిస్తారో అర్ధమవుతుంది. కొత్త వ్యాపార వృత్తి నిపుణతలు, కొత్త ఆలోచనలు చెయ్యడం, దేశంలోకి ప్రవేశపెట్టబడిన వాణిజ్య సంస్కరణలను అందిపుచ్చుకోవడం వల్ల ఎదిగిన విజేతల గురించి కథనాలివి.
అన్నట్టు ఇది అంతా మన డైలీ లైఫ్ లో భాగమయిన ఫెవికాల్, ఫెవీస్టిక్ వగైరాల పెడిలైట్ గురించి అనుకోలు తో మొదలైంది కాబట్టి చెప్పడం - దీనిలో ఫెవికాల్ ఆవిర్భావం, ప్రయాణం గురించి కూడా ఆసక్తికరమైన కథనం ఉంది. యూట్యూబ్ లో ఫెవికాల్ వి ఓ పది పదిహేను ప్రకటనలు వరుసగా చూసినా బోరు కొట్టదు. అయితే ఇది ప్రకటనల విజయం తో పాటూ, ఫెవికాల్ నాణ్యత, గొప్పతనం కూడా. నిర్మా, సర్ఫ్, MDH మసాలా లు, అమూల్ ప్రకటనలు, మన సంస్కృతి లో భాగం అయిపోయాయి. పాత కాలపు జింగిల్స్, బ్రూక్ బాండ్, గోల్డ్ స్పాట్ ప్రకటనలు అలాంటివే. నాకు ఏ.ఆర్. రెహమాన్ జింగిల్ తోనే గుర్తుండిపోయాడు. సూడో ఆడ్వర్టైసింగ్ - అనగా మంచి నీళ్ళ పేరో, music కాసెట్ల పేరో చెప్పి ఆల్కహాల్ బ్రాండ్ ప్రకటనలు గుప్పించడం, దేశ భక్తి ని ఎరగా వేసి గుట్కా ను అమ్మజూపడం లాంటివి. దీనిలో "నెంబర్ వన్ - యారీ" (McDowell's) లాంటివి, "మెన్ విల్ బి మెన్" (Imperial Blue) ప్రకటనలు - అసలు ఎపిక్ లు.
ఇది కేవలం వస్తువును ఎలా అమ్ముకోవడం అనే సంగతి గురించి కాదు. ఆ వస్తువుల్ని ఎంత నాణ్యంగా, వినియోగదారులకు నిజాయితీ గా అందుబాటులోకి తెచ్చారు అనేదాని గురించి. అది ఆయుర్వేద ఔషధాల నుంచీ, బాంకింగ్, రియల్ ఎస్టేట్ లాంటి అన్ని రంగాలది. బ్రాండ్ వాల్యూ ఇప్పుడు ఒక ముఖ్యమైన విషయం. ఆయా సంస్థల్లో, ఆయా రంగాల్లో ప్రముఖులు ఎలా కష్టపడి పైకొచ్చారో చదవడం చాలా బావుంది. వీటిల్లో పాతకాలపు ప్రముఖులు అనగా కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు (అమృతాంజనం), కేశవ్ విష్ణు పెంధార్కర్ (వీకో టర్మరిక్) లాంటి వారితో పాటు, కిరణ్ మజుందార్ షా, జియా మోడీ లాంటి కొత్త తరం మహిళా విజేతల కథలు కూడా ఉన్నాయి. Glass ceiling ని బద్దలుకొట్టిన తొలి తరం మహిళలు ఇప్పుడు ప్రముఖ స్థానాన్ని చేరినా, వాళ్ళు ఎదుర్కొన్న సవాళ్లు ఎలాంటివి, పెద్ద చదువులు చదివినా, ఉన్నత కుటుంబ నేపథ్యం ఉన్నా కూడా తమను తాము నిరూపించుకోవడానికి ఎలాంటి యుద్ధాలు చేసారో చదవడానికి బావుంటుంది. ఇదే విధంగా మధ్యతరగతి, పేద కుటుంబ నేపథ్యం నుంచి వచ్చిన మహిళా విజేతల కధలు కూడా ఉన్నాయి.
రచయిత ప్రొఫెషనలిసం చాలా బావుంది. చిన్న చిన్న పొరపాట్లు మినహా, (నిర్మా గర్ల్ గురించి), అతిశయోక్తుల్లాంటి కథనం, (తప్పదు మరి..!) మినహా మొత్తం చదవడానికి బావుంది. ఈ విజేతలు ఆడుతూ పాడుతూ ఇక్కడికి చేరుకోలేదని, వాళ్ళూ, అష్ట కష్టాలూ పడ్డారని, సాహసంతో, ఓర్పుతో, శ్రమతో, లక్ తో, సాధనతో ఈ మెట్లన్నీ ఎక్కగలిగారనీ, పెద్ద పెద్ద వాణిజ్య సామ్రాజ్యాలు నిర్మించారనీ, మన దేశం అభివృద్ధి చెందిన దేశంగా మారాలంటే, ఇలాంటి పారిశ్రామిక వేత్తలూ, పీవీ, వాజపేయీ లాంటి దార్శనికిత ఉన్న రాజకీయ నాయకులు ఉండాలనీ, మనందరి కలలూ సాధ్యం చేసేందుకు ఇలాంటి వాళ్ళు స్పూర్థిదాయకమైన పోరాటం చేస్తూనే ఉన్న్నరనీ చెప్పడం ఈ పుస్తకం ముఖ్య ఉద్దేశ్యం.
ఈ పుస్తకానికి ముందుమాట తో కలిపి 15 మంది ప్రముఖుల (ఈ పుస్తకంలో ప్రస్తావించబడ్డ విజేత కూడా ఉన్న్నరందులో) ఎండార్స్మెంటులు ఉన్నాయి. రచయిత దీనిని పీవీ, NTR,వాజపేయి, JRD లాంటి మహారథులకు అంకితం ఇచ్చారు. రచయిత పరిచయం తొ సహా ఇంత positive punch / సానుకూలత తట్టుకోలేక ఎలాగో మెల్లగా మొదలుపెడితే, పుస్తకం లోపలి కంటెంటు (మొత్తం 30 మంది ప్రముఖుల విజయ గాధలు. ఎక్కువ గా వ్యాపార దిగ్గజాల గురించి ఉంది. ) మాత్రం ఎంత మాత్రం నిరాశపరచదు. కొంత నాటకీయత తో చదివింప జేస్తుంది. Inspirational work కాబట్టి, పెద్ద పిల్లలకు, ఇంకాస్త పెద్ద వారికీ, గిఫ్ట్ చెయ్యడానికి బావుంటుంది.
Written by : Shri Sunil Dhavala
వ్యాసాలు : 30
మొత్తం పేజీలు : 219
మొత్తం ప్రకటనలు: 29 (ప్రకటనలు అనగా - ప్రతి వ్యాసం తరవాత ఒక్కోటి చొప్పున రకరకాల పూర్తి పేజీ ప్రింట్ ప్రకటనలు - ఇవి కొంచెం లేకుంటే బావుండేది. గానీ ఇదేదో కొత్త పద్ధతి అనిపించింది!)
వెల : Rs. 250 /-
ISBN : 9 88194 44904
Special Mention : కవర్ పేజీ. కవర్ డిసైన్ (Shri P Suresh) బావుంది .
No comments:
Post a Comment