పేరు చూడగానే నేను చెప్పబోయేది బెంగాలీ నవల కి తెలుగు అనువాదం అని తెలుస్తూంది కద. అసలు ఇతివృత్తం ప్రకారం, "చందేర్ పహార్" అనే పేరున్న ఓ గొప్ప సాహస మెకన్నాస్ గోల్డ్ తరహా బెంగాలీ నవల, అదీ ఆఫ్రికా నేపధ్యంలో, దేశ స్వాతంత్రానికి ముందే, ఇంత రోమాంచితంగా రాసారంటే, సహజంగానే ఉత్సుకత కలుగుతుందెవరికయినా. దాన్ని అరటి పండు చేతిలో వొలిచి పెట్టినట్టు కాత్యాయని గారు అనువాదం చేసారు.
ఇదే పేరుతో తీసిన సినిమా కూడా బెంగాలీ లో సూపర్ హిట్టు అయింది. యూట్యూబులో ట్రైలర్ చూసి ఆనందించండి. పూర్తి సినిమా, ఈ రోజుల్లో చూస్తే, చదివితే వచ్చేంత గగుర్పాటూ, ఆనందమూ కలుగుతాయో లేదో చెప్పలేము. అన్నీ దృశ్య రూపంలో, ప్రత్యేకంగా ఇమాజిన్ చేయనక్కర్లేకుండా ఉంటుంది కాబట్టి, ఇంకా మజా రావచ్చేమో చెప్పలేను.
ఆఫ్రికా గురించి అంతవరకూ ప్రత్యేకంగా తెలుసున్న వారికి 1937 లో ప్రచురితమైన ఈ కథ నమ్మశక్యంగానే అనిపిస్తుంది. నాకయితే 13/15 ఏళ్ళ క్రితం గొల్లపూడి టాంజానియా యాత్రానుభవం 'కౌముది'లో చదివేదాకా ఆఫ్రికా గురించి ఏమీ తెలీదు. గొల్లపూడి చెప్తే మసాయి తెగ వారి గురించి అబ్బురంగా చదవడం గుర్తుంది. రక్తం తాగే, ఈ పొడుగాటి పిల్లంగోవి వీరులు, యాదవులలా, పశు కాపరులే అయినా, వీళ్ళని చూసి ఆఫ్రికన్ సింహాలే భయపడతాయని ప్రతీతి.
ఫూడ్ రేంజర్ అనే ప్రఖ్యాత యూ ట్యూబర్ కూడా మసాయి తెగ వారి ఆహారపు అలవాట్ల గురించి వీడియో తీసారు. పచ్చి నెత్తురు తాగే ఈ సాంప్రదాయ ఆఫ్రికన్ తెగ మూలాల గురించి గొల్లపూడి మారుతీ రావు, ఓ ప్రచారంలో ఉన్న పిట్ట కథ కూడా చెప్పారు. దాని ప్రకారం, మసాయిలు మన ద్వాపర యుగం నాటి యాదవులే. గుజరాత్ ప్రాంతం నుండీ భూమి ఫలకాల మార్పుల వల్ల వారి భూభాగం జరిగి టాంజానియా / ఆఫ్రికా లో కలిసిపోయిందని ఓ వాదన. ఇదంతా నాకు గుర్తున్న మటుకూ విషయాలు. ఫుడ్ రేంజర్ వీడియో మాత్రం ఈ మధ్య తీసినదే. ఆసక్తి ఉన్న వారు చూడ వచ్చు.
బ్రిటీషు రాజ్యంలో భారత దేశం నుండీ ఎందరో కూలీలు ఆఫ్రికాలో, మారిషస్ లో, శ్రీలంక లో, ఇంకా ఇతర సుదూర ప్రాంతాలలో ప్రపంచం నలు మూలలకూ విస్తరించిన కాలం అది. అయితే ఈ చందేర్ పహార్ పథికుడు ఒక బాగా చదువుకున్న బీద బెంగాలీ బాబు శంకర్. పట్టభదృడయి ఉండి కూడా జూట్ మిల్లులో చిన్న పనికి పోవాల్సిన పరిస్థితుల్లో కూడా, రగిలిపోయే సాహసేచ్చ, ప్రపంచాన్ని చూడాలనుకునే ఉత్సాహమూ ఉన్న యువకుడు. తెలిసిన వారెవరో ఉగాండా లో రైల్వేలో పని చేస్తూండటంతో వారి సాయంతో మొదట మొంబాసాకు 350 మైళ్ళ దూరంలో ఓ స్టేషన్ నిర్మాణ పనుల్లో ఆ కేంపు గుమస్తా, స్టోర్ కీపర్ గా ఉద్యోగంలో కుదురుతాడు. అక్కడ గుడారంలో మకాం. ఆ సమయంలోనే ఎలిఫెంట్ గ్రాస్ అని పిలవబడే నిలువెత్తు గడ్డి భూముల్లో చాలా దూరం దాకా నడిచి వెళ్తూండే శంకర్ కు అనుభవజ్ఞులు హెచ్చరికలు చేస్తారు. ఆ గడ్డిలో వన్య మృగాలు మాటు వేసి ఉంటాయని. అదే, ప్రమాదాలతో శంకర్ కు పరిచయం చేసిన సమయం.
అక్కడే పలు మసాయిలూ, భారతీయులూ కలిసి కూలీలుగా పని చేస్తూంటారు. మసాయిలు స్థానికులే కాబట్టి వారే తోటి వారిని హెచ్చరిస్తూ ఉంటారు. అయినా, ఆ సమయంలో విపరీతంగా సింంహాల దాడి జరిగి కనీసం రోజుకొకరు చొప్పున ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా, కార్మికులు మరణిస్తూ ఉంటారు. వీరంతా వివిధ పనులకోసం, కేంపు వదిలి బయటకు వెళ్ళినవారే. ఆఖరికి వారంతా బయటకు వెళ్ళటం మానుకునేసరికీ, సింహాలే కేంపు లోపలికి చొచ్చుకొచ్చి, నిద్రపోతున్న వారిని కూడా లాక్కెళ్ళడం మొదలు పెడతాయి.
అప్పుడప్పుడే సన్నిహితుడవుతున్న తిరుమలప్ప అనే తమిళ గుమస్తా, శంకర్ తో మాటాడుతూ పక్కనే నిద్రపోయిన ఒక రాత్రి, వారి గుడిసెలోకి చొచ్చుకొచ్చిన సింహం, తిరుమలప్పను లాక్కెళ్ళిపోతుంది. ఇలా మృత్యువు అతి సమీపంలోకి రావడాన్ని శంకర్ చూసి చాలా వ్యాకులపడతాడు. ఈ కేంపు సింహాల దెబ్బకి మూతపడ్డాక, ఉగాండాలో ఓ మారుమూల ప్రాంతపు రైల్వే స్టేషన్ లో ఉద్యోగానికి కుదురుతాడు. రైల్వేస్టేషన్ లో రోజంతటికీ వచ్చే ఒకే ఒక్క రైలుకు సిగ్నల్ ఇవ్వటమే అతని పని.
అతను ఉద్యోగంలో చేరేనాటికి తనని చుట్టుముట్టబోయే ఒంటరితనం, భయానక పరిస్థితుల గురించి అస్సలు అవగాహన లేని శంకర్ ని రిసీవ్ చేసుకున్న పాత ఉద్యోగీ, గుజరాతీయుడే. అతను కాస్తా వీడ్కోలు చెప్పాక బొత్తిగా ఒంటరితనం, ప్రమాదాలూ చుట్టుముడతాయి. అప్పటినుంచీ ఆ పరిసరాల్లో యదేచ్చగా చుట్టుముట్టే సింహాలూ, అతి భయానకమైన మాంబా సర్పాలూ. వాటి దాడులూ, తన ఆత్మ రక్షణా వ్యూహాలూ, నిత్య కృత్యాలయిపోతాయి. . నిద్ర లేని రాత్రుల మధ్యా ఉద్యోగ జీవితం గడుస్తూంటుంది. నిజానికి అప్పటికే ఆ స్టేషన్ లో ఓ ఇద్దరు పూర్వ ఉద్యోగులు మరణించడం, మరో నలుగురు ట్రాన్స్ ఫర్ కోసం దరఖాస్తు చేసుకుని పారిపోవడమూ జరిగింది. శంకర్ కి కూడా ట్రాన్స్ఫర్ సలహా ఇస్తారు తెలిసిన వారు. కానీ అంత తేలిగ్గా బ్రతుకు జీవుడా అనుకునే మనిషి కాదు కదా మన హీరో.
[అసలు మాంబా సర్పాల గురించీ నాకేమి తెలుసు? రాల్డ్ డాల్ చెప్తే గానీ తెలీలేదు. అతనూ ఆఫ్రికాలో షెల్ కంపెనీ లో ఉద్యోగం చేసేటప్పుడు, స్థానిక సమాచారం లో భాగంగా ఎరిగిన, మనిషి ఎత్తు కి లేచి, తల మీద నిర్దాక్షిణ్యంగా కాటు వేసే, విరుగుడు లేని విష సర్పం మాంబా గురించి మతిపోయీలాగా చెప్పిన విషయం గుర్తొచ్చింది. ఆఫ్రికా ఖండంలో ప్రసిద్ధికెక్కెన ఆ బ్లాక్ మాంబా కరిచిన కొద్ది సెకన్లకే, రక్తం పెరుగు లా గడ్డలు కట్టి, శరీరంలో రక్త ప్రసరణ జరగక మనిషి మరణిస్తాడు.]
సరైన ఆహారమూ, నీరూ, మాటాడ్డానికో తోడూ దొరకని ఆ స్టేషన్ లో ఉద్యోగం చేస్తున్న రోజుల్లోనే చేపల వేటకు దగ్గరలో నీటి కుంటకు బయలుదేరిన శంకర్ కు దప్పికతో చావుకు దగ్గర్లో ఉన్న ఆల్వరెజ్ కనిపిస్తాడు. అతన్ని తన బసకు తీసుకొచ్చి, నాలుగయిదు రోజులు సేవ చేసి, మనిషిని చేస్తాడు. ప్రాణాపాయం నుండీ బయటపడ్డ అరవయ్యారేళ్ళ ఆల్వరెజ్ శంకర్ కు తన వజ్రాల అన్వేషణ, అవి ఓ గుహలో ఉండటం, వాటిని వెతుక్కుంటూ వచ్చి తాను దారి తప్పిపోవడం, ఇతర ప్రమాదాలు, సహచరుడి మరణం, వగైరాల గురించి చెప్తాడు.... అంతటితో రైల్వే ఉద్యోగానికి సలాం చెప్పి, ఆల్వరెజ్ వెంట వెళ్తాడు. ఇద్దరూ తండ్రీ కొడుకుల్లా సమన్వయంతో వజ్రాల వేటలో ఆ భయానక ఆఫ్రికన్ అడవుల్లో, దుర్గమమైన దారుల్లో, అత్యంత భయానకమైన సవాళ్ళను ఎదుర్కొంటూ సాహస యాత్ర మొదలుపెడతారు.. అదీ ఈ కథ. ఈ మొత్తం ఆఫ్రికా అనుభవం వయసు పద్ధెనిమిది నెలలు. ఈ పద్ధెనిమిది నెలల్లోనే వంద జీవితాల్ని జీవిస్తాడు శంకర్.
వికీ లో 'చందేర్ పహార్' కథా, ఈ అనువాద పుస్తకంలోనీ కథా, ముగింపు లో తేడాగా ఉన్నాయి. అది బహుశా సినిమా కథ అయి ఉండొచ్చు. సినిమా కోసం నాటకీయత జోడించి ఉండొచ్చు. మొత్తానికి జింబాబ్వే (రోడీషియా), సౌత్ ఆఫ్రికా, కెన్యా.. ఇలా దూర దూర ప్రాంతాలంతా నడిచి నడిచి, మనిషనేవాడెవ్వడూ అప్పటికి ఎరిగే ఉండని ప్రాంతాల్లో, గొడ్డలి దెబ్బే తగలని వనాలలో, శతాబ్దాలుగా రాలిన ఆకుల మీద మెత్తగా అడుగులేస్తూ, దిక్సూచి పాడయితే, తిరిగిన చోటల్లోనే పదే పదే తిరుగుతూ, అడుగడుగునా మృత్యువు విసిరే సవాళ్ళను ఎదుర్కొంటూ, అగ్ని పర్వత విస్ఫోటనాన్ని కళ్ళారా చూస్తి, దుస్సాహసమైన రిచ్టర్స్వెల్డ్ (ఇదే బహుశా ఈ చంద్రగిరి శిఖరం) పర్వతాలని అధిరోహించి, మొత్తానికి ప్రాణాలతో బయటపడతాడు శంకర్.
తనకు సాహసయాత్రకు పురిగొలిపిన, ఎంతో చదువుకున్న, ఆల్వరెజ్ లాంటి ప్రతిభావంతులు కేవలం వజ్రాల వేటకు, బంగారు గనుల అన్వేషణకూ బయలుదేరి వెళ్తారంటే నమ్మలేని మనిషి శంకర్. వారి రక్తాలలో సాహసం చేయాలన్న తృష్ణ ఉంటుంది. దేనికీ బెదిరిపోని ధైర్యం, దానికి అలవాటుపడి, సుఖంగా ఏ పట్నంలోనో స్థిరపడి సుఖంగా ఉండే నింపాది లేని మనస్తత్వం వీరిది. ఈ వజ్రాలూ, బంగారమూ, దురాశా కన్నా, వారిని నడిపించే శక్తి ఏదో ఉందని నమ్ముతాడు శంకర్. ఎన్ని సాహసాలు, ఎన్ని వైఫల్యాలు, ఎన్ని కొత్త ప్రయత్నాలు.. వీటికి మానసిక శక్తి ఎక్కడ నుండి వస్తుంది ?
అగ్ని పర్వతం పేలడం ఎన్నడూ జన్మలో ఎరగని శంకర్, తన కళ్ళ ముందు ఆవిష్కృతమైన ఆ దృశ్యాన్ని చూసి, నిర్వాణ / సమాధి స్థితిని అనుభూతించినట్టు అయి, దేవుడికి కృతజ్ఞతలు చెప్పిన ఘట్టం చాలా సరళంగా అనువదించారు. బర్డోలియో లెంగాయ్ అనే పేరున్న ఈ అగ్నిపర్వతం పేలినప్పుడు - దానిని చూసిన శంకర్ అనుభూతి ఇలా ఉంది.
QUOTE
అలాంటి దృశ్యాన్ని చూసిన భారతీయ యువకుడు శంకర్, తన సంప్రదాయం ప్రకారం ఆ పర్వతానికి చేతులు జోడించి, ఆ చేతులను కళ్ళకద్దుకుంటాడు. 'లయ కారకా, నీకు నా ప్రమాణాలు ! నీ విలయతాండావాన్ని ప్రత్యక్షంగా దర్శించే భాగ్యాన్ని కలిగించిన నీకు నా నమస్కారం. నీ అత్భుత స్వరూపం ముందు వంద వజ్రపు గనులైన దిగదుడుపే. ఇంత కాలంగా నేను పడిన శ్రమకు ఫలితం దక్కింది. నాకిది చాలు!" అని తన్మయుడయ్యాడు.
UNQUOTE
హైదరాబాద్ బుక్ ట్రస్ట్ ప్రచురించిన ఈ చిన్ని పుస్తకం వెల 50 రూపాయలే. బిభూతి ఈ పుస్తకాన్ని రాయడానికి ఎంత రీసెర్చ్ చేసి ఉంటారో, వీరి సాహస యాత్ర లో తిరిగిన దారులూ, ఆఖర్న యాత్ర ముగిసాక, బెంగాలు బయలు దేరే ముందు అక్కడెక్కడో దక్షిణాఫ్రికాలో శంకర్ కు దొరికిన భారతీయ ఫలహారం.. ఇప్పట్లా ఇంటర్నెట్ అందుబాటులో లేని నాళ్ళలోనే, కళ్ళకు కట్టిన చిన్న చిన్న వివరాలు.. చాలా బావున్నాయి.
కథాకాలం మరీ పురాతనమైనది కాదు గాబట్టి, ఎందరో ప్రవాస భారతీయుల గురించి మనం చదివాము కాబట్టి, ఈ కథ లో అసంబద్ధమైనదేదీ కనపడదు. ఉదాహరణకు వీ.ఎస్.నైపాల్ ట్రినిడాడ్ అండ్ టొబాగో వాడు కదా, ఆయన చెప్పిన వాళ్ళ నాన్న కథా అలాంటిదే కదా. ఇంకా అక్కడ లేదా ప్రవాసంలో దొరికే భారతీయ ఆహారం గురించి చదివినా, ట్రినిడాడ్ లో ప్రసిద్ధమైన "డబల్స్" లాంటి పదార్ధాలు గుర్తొస్తాయి. ఈడీ అమీన్ తరంలో అయితే, గుజరాతీయులు ఉగాండా నుండీ నిష్క్రమించడం..., ఇవన్నీ. అందుకే ఈ కథ ఎంతో నిజంగా జరిగినట్టుగానే అనిపించేస్తుంది. ముఖ్యంగా ఆఫ్రికా ఖండంలో మన ప్రవాసుల ప్రస్తావన తో మొదలయిన కథ ఇది. కాబట్టి, మరీ అభూత కల్పన లాగా ఎక్కడా అనిపించదు.
బిభూతి ఇతర నవలల్లోగా, పేరా పేరా కూ పాఠకుడు ఆ "అనుభూతిస్తూ", మైమరపుకు చేరుకునేలా లేదీ పుస్తకం. పేరా పేరాకూ ఒక స్వప్నం, వెను వెంటనే ఒక నిజానుభవం, ఓ జలదరింపు, ఆసక్తి కలిగించే వర్ణనా.. దట్టమైన రెయిన్ ఫారెస్ట్ లో కాలు జారే ప్రాంతాల్లో, ఆ ఆకుల వాసనా, జంతువుల అరుపులూ, వాటి విచిత్ర అలవాట్లూ, పాములూ, కొండ చిలువలూ, హైనాలూ, చిరుతలూ.. జిరాఫీలూ వీటన్నిటి మధ్యా మనమూ నడుచుకుంటూ, భయపడుతూ, వెళ్తూ ఉంటాము. అనువాదం చాలా బావుంది.
ఇన్ని నానా అగచాట్ల అనంతరం, అనుకోకుండా ఎదురైన , గులకరాళ్ళ లా పడి ఉన్న వజ్రాలను మనమూ అసలు ఖాతరు చేయము. సర్వైవల్.. ఎలాగైనా బ్రతకాలని శంకర్ / ఏ ఇతర సాహసికుడైనా పడే బాధలూ, వారి జీవన కాంక్ష చదివి మెచ్చుకుంటూ.. భయంకర మృగ దాడుల మధ్య, అనారోగ్యాలూ, అలసటల మధ్య, నీరూ , భోజనమూ, నిద్రా లేని ఘోర పరిస్థితుల్లో వీళ్ళని నిలబెట్టే శక్తి ఏది ? అస్సలు మనకు తెలియనే తెలియని, సరైన map లే లేని ప్రాంతాల్లోకి వీరు ఏ ధైర్యంతో అగమ్య గోచర ప్రయాణం చేస్తారో అని ఆశ్చర్యపోతూ మనమూ ప్రయాణిస్తాం. మొత్తానికి మనసుకు పట్టిన మకిలినేదో తొలగించిందీ కథనం. నేనేమీ కథ ని పూర్తిగా చెప్పలేదు కాబట్టి మీ ఉత్కంఠ డిగ్రీలు క్షేమంగానే ఉంచుకోండి. అసలు కథ, దానిలో దూకితేనే తెలుస్తుంది. దొరికితే చదవండి.
☸☘☙☙☘☸
2 comments:
చాలా మంచి పరిచయం, తప్పక చదువుతాను.
ధన్యవాదాలు.
ఒహ్. థాంక్యూ వెరీ మచ్
Post a Comment