Pages

27/06/2025

Prophet Song - Paul Lynch



ఈరోజు నేటో పత్రికా సమావేశం లో ట్రంప్ ని ఒక మహిళా బీబీసీ యుక్రెయిన్ రిపోర్టర్  యుక్రెయిన్ కు "పేట్రియాట్" లు ఇస్తారా/ఇస్తున్నారా అని అడిగారు. ఆమె భర్త యుక్రెయిన్ లో సైనికుడు. ఆమె, పిల్లలతో ఇక్కడ వార్సాలో ఉంటోంది. ట్రంప్ ఎప్పట్లానే "ఇజ్రాయిల్" తన మొదటి ప్రయారిటీ అన్నట్టు, పిచ్చి సమాధానం ఇచ్చి యుక్రెయిన్ కు 'ఆల్ ద బెస్ట్' చెప్పాడు. చాలా మందికి అది ఒక రిపోర్టర్ అడిగిన ప్రశ్న లా అనిపించలేదు. ఒక తల్లి,  ఒక భార్య, తన కుటుంబ క్షేమం గురించి తల్లడిల్లుతూ అడిగిన ప్రశ్న అది.  ఆ వీడియో లో ఆమె  తనలాంటి ఎందరో అమ్మల ప్రతినిధి  అనిపిస్తుంది. 

మనం చాలా మామూలుగా వార్తలు చదువుతాం.  ఈ జూన్ మొదటి వారానికి, 2022 నుండీ, పాలస్తీనా జాతి హననం లక్ష్యం గా పెట్టుకుని ఇజ్రాయిల్ పలు చోట్ల చేసిన 42000 క్షిపణి దాడులలో, 25000 పాలస్తీనాలోనే జరిగాయి. 60,000 మంది చచ్చిపోయారు. 615 కన్నా ఎక్కువ రోజులు యుద్ధం నిరంతరాయంగా జరిగింది. 55000 మంది పాలస్తీనీలే చనిపోయారు. వారిలో 17000 మంది పిల్లలే. 


ఇదంతా ఎందుకు? సగం రాజకీయాలు, సగం అధికారం కోసం ప్రాకులాట, ఇంకొంచం ఆయుధ వ్యాపారం. ఒక "మంచి కరువంటే అందరికీ ఎలా ఇష్టమో", ఇలాంటి ఆగని యుద్ధాలంటే యుద్ధవ్యాపారులకు చాలా ఇష్టం. ఆ చచ్చిపోయిన పిల్లలూ, వాళ్ళ తల్లుల గురించి ఒక్క మాట అడగదు ప్రపంచం. అడిగిన వాళ్ళను విడిచిపెట్టదు. మానవత్వం లేని డిప్లమసీ ఉచ్చులో భారత దేశం కూడా చిక్కుకుపోయింది.  

మనకి, అంటే,  మామూలు యుద్ధం బారిన పడని వాళ్ళకి "యుద్ధం, మానవ మరణాలు, బాంబుల సామర్ధ్యాలు వగైరాలు" ఒక సోప్ ఓపెరా. ఒక టెలివిజన్ షో!!   టీవీలో / ఇపుడు మన మొబైళ్ళలోనూ, బాధితులను, వాళ్ళ కష్టాలనూ జనం, "ప్రాపగాండా" గా తీసిపడేసేటట్టు  చేస్తున్న శక్తులు ఉన్నాయి. ఆ కష్టాల్లో నిజంగా చిక్కుకుపోయిన కుటుంబాల బాధ మనకు పట్టదు. 

సాధారణ ప్రజలమీద దురాగతాలకు పాల్పడే పాలకులను, మిగతా ప్రపంచం చాలా నిర్లిప్తంగా చూస్తూంటుంది. "మన బాధల్ని ప్రపంచ దేశాలు చూస్తాయి, మనల్ని కాపాడతాయి" అని ఆశించడం కూడా తప్పే. హిట్లరు అలానే నెగ్గుకొచ్చాడు చాలా ఏళ్ళు.  హిట్లర్ దురాగతాలు చాన్నాళ్ళు బయటి ప్రపంచానికి తెలీలేదనే అనుకుందాం. ఇప్పుడు యుద్ధాల దృశ్యాలు మన అరచేతుల్లోకి రాలేదూ?!  అయినా మనం పెద్దగా ఆలోచించం.


అలాగే totalitarianism వైపుకు మళ్ళుతున్న దేశాల్లో,   భయానకమైన పరిస్థితుల్లో, అణిచివేతకు, నిర్బంధానికీ, హింసకూ గురయ్యే ప్రజల కథకు ఎంతో కొంత సెన్సార్ షిప్ ఉన్నా, ఎంతో కొంత బయటకు రాదా!?!  ఈ "ప్రోఫెట్ సాంగ్" అలాంటి నోరులేని బాధితుల వ్యధని చర్చిస్తుంది.  ఇలాంటి అంతర్యుద్దాలలో అన్నిటినీ కోల్పోయి, అనాధాలయిపోయే తల్లుల గురించి చెప్తుంది.

నిజానికి ప్రజల్ని రక్షించాల్సిన ప్రభుత్వమే / సమాజమే, వాళ్ళని కొద్ది కొద్ది గా  కబళించేస్తున్నపుడు, ప్రాణాలు నిలుపుకోవడం కోసం, బాధితులు శరణార్ధులుగా, కట్టుబట్టల్తో ఇంటిలోంచీ, దేశం నుంచీ, పారిపోవాల్సి రావడం, చాలా ఘోరమైన స్థితి.  అలా తమ మూలాల నుండీ, తమని తాము పెకలించుకుని, ఇంటినీ, తమ వాళ్ళనూ వదిలి రావడం వెనుక ఎంతటి సంఘర్షణ ఉంటుంది?!  


ముఖ్యంగా రాక్షస పాలననిండీ తప్పించుకోగలగడం వెనక ఎంత బాధ ఉంటుంది? ఎన్ని మూసిన దార్లు / ఎంత నిర్బంధం / ఎంత రిస్క్!! పైగా పారిపోయొచ్చిన శరణార్ధికి ఏ దేశమూ గేట్లు బార్లా తెరిచి స్వాగతం పలకదు. ప్రతి చోటా తిరస్కారం, అవమానం ఎంతో కొంత ఎదుర్కోక తప్పదు. కాకపోతే, తమవీ, తమ వాళ్ళవీ ప్రాణాలు  నిలుపుకోవడం ముఖ్యం గాబట్టి, శరణార్ధులకు వేరే దారి ఉండదు. అలాంటి శరణార్ధుల మీద సానుభూతి తో రాసిన పుస్తకం ఇది. 

ఈ మధ్య కాలంలో ఇంత కదిలించేసిన పుస్తకం చదవనే లేదు. ఎటు చూసినా  యుద్దం, నరసంహారం, కూలిపోయిన ఇళ్ళు,  శిధిలమైన నగరాలు, మన్ను గా మారిపోయిన హాస్పిటళ్ళు,  శరణార్ధులు, రాక్షసత్వం, బాంబులు, క్షిపణులు, దాడులు, మృత్యువు. ఇవన్నీ ఎంతగా అలవాటయి పోయావంటే,  మనకి అవన్నీ అవి ఏవో టీవీలో వచ్చే వార్తలు! అంతే! ఓ వేళ జనం స్పందించినా, అది మరింత రెచ్చగొట్టే యుద్ధ వాంచ, తెలిసీ తెలీని గణాంకాల గొడవ మాత్రమే. ఎక్కడో జరిగే యుద్ధాలలో చచ్చిపోయే జనం, కేవలం ఓ సంఖ్య. యుద్ధం,  భవిష్యత్తు తెలీని పరిస్థితుల నుండీ పారిపోయే శరణార్ధి ఓ న్యూసెన్స్.     

ప్రతీ యేడూ వచ్చే వరదల్లా, వానల్లా, ఎండల్లా, మెరుపులూ, పిడుగుల్లా, ఈ యుద్ధాలు, మారణకాండా కూడా సర్వసాధారణం అయిపోయి, తమ గురించి నోరెత్తే నాధుడు లేని జనం గురించి చెప్పిన కథ ఈ "ప్రోఫెట్ సాంగ్". కనీసం పెరిగిన ఎండల గురించో, ఆగని వానల గురించో మాటాడుకున్నట్టు కూడా మనుషులు "యుద్ధం" గురించి, నిష్కారణ ప్రాణ నష్టం గురించి,   మాటాడుకోవడం తగ్గించేసిన కాలం ఇది.  అన్యాయాలని, క్రమేపీ బలం పెంచుకునే ప్రభుత్వ వ్యవస్థలనీ,  టీవీలో చూసి, నిర్లిప్తమైపోయి, మొహం తిప్పుకున్న సమాజంలో ఉన్న మనకి, కొన్ని రకాల రచనలు అవసరం. 

మన వరకూ వస్తే తప్ప మన ప్రపంచం స్పందించడమే మానుకున్న ఓ ఆట ఈ యుద్ధం/అనిశ్చితి.  కళ్ళెదురుగా మారణహోమం జరుగుతున్నా, కనీసం మనుషులుగా స్పందించడం మర్చిపోయిన మానవ జాతి ని చెవి మెలేసి తీసుకొచ్చి, ఓ సంక్షోభం మధ్యలో పడేసి, నిలువెల్లా ఆ ఘోరాన్ని అనుభవింపజేసి, ప్రాణాలకోసం, ముఖ్యంగా తన కుటుంబాన్ని కాపాడుకోవడం కోసం, తపించిపోయే ఓ విద్యాధికురాలైన తల్లిని,  ప్రధాన పాత్రగా పెట్టి  రాసి, పాఠకుడిని ఉక్కిరిబిక్కిరి చేసేసిన నవల ఇది.  

యుద్ధం.  అందులోనూ ఏదైనా దేశంలో  ప్రజలకీ ప్రభుత్వానికీ మధ్య జరిగే యుద్ధం అయితే మరీ నిర్లక్షం. వీటిలో ఎక్కువగా నలిగిపోయేది స్త్రీలే.  సిరియా లో అల్ అసాద్ కు వ్యతిరేకంగా యేళ్ళు గా జరిగిన సివిల్ వార్ లో దేశం నిలువునా కృశించిపోయి, వేలాదిమంధి సాధారణ పౌరులు అదృశ్యం అయిపోయి, దశాబ్దాలుగా నిర్బంధం లో ఉండి, టార్చర్ అనుభవించి, ఒంటరిగా చచ్చిపోయి, వాళ్ళ కుటుంబాలు వీళ్ళని వెతుక్కుంటూ తరాలుగా పడిన వేదన, కూలిన నగరాలు, రాళ్ళ దిబ్బల మధ్య ప్రజలు కకావికలయిపోయి, ప్రమాదకరమైన డింగీల్లో దేశం విడిచిపారిపోయి, సముద్రంలో శవాలుగా తేలి,  ఎవ్వరికీ చెందని వాళ్ళయిపోయి,  ఇప్పుడు యుద్ధం ముగిసాక తమ తమ ఇళ్ళకు రావాలని ఎదురు చూస్తున్న సిరియా ప్రజల గురించి విన్నాము.  


తీరానికి కొట్టుకొచ్చిన రెండేళ్ళ బాల శరణార్ధి ఫోటో చూసి, చలించిపోయి,  సరిగ్గా సిరియా శరణార్ధి సమస్య ని ఓ అంశంగా తీసుకుని దానికి డబ్లిన్ (ఐర్లండ్) ను వేదిక చేసి రాసిన నవల ఇది.  పరిస్థితులు మొదటి నుండీ ఘోరంగా ఉండవు. మెల్లి మెల్లిగా దిగజారుతాయి. రాజ్యం ప్రజలకి వ్యతిరేకం గా మారితే, ఆ ఒత్తిడిని తట్టుకోగలగడం, సామాన్య ప్రజలకు అసాధ్యం. ఇలా మెల్ల మెల్లగా వస్తూన్న మార్పుల గురించి హెచ్చరికలతో నవల మొదలవుతుంది. ఒక నలుగురు పిల్లలున్న అందమైన కుటుంబం, తమ  కళ్ళెదురుగుగా తమ జీవితం నేల కూలడం ఎలా చూస్తుంది అన్నది దీనిలోని ప్రధానాంశం. 

ఓ సాధారణ ట్రేడ్ యూనియనిస్ట్ అయిన లారీ స్టాక్ కేవలం, నిరంకుశ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నోరెత్తినందుకు, అదృశ్యం అయిపోతాడు. అతని భార్య ఎలిష్ ఓ సెల్యులర్ ఎండ్ మాలిక్యులర్ బయాలజిస్ట్. నలుగురు పిల్లలు ఉన్న కుటుంబం. ముగ్గురు టీనేజ్ పిల్లలు, నాలుగో వాడు పసివాడు.   కేవలం రాజకీయంగా చురుకుగా ఉన్నందుకు, అన్యాయాలకి వ్యతిరేకంగా నోరెత్తినందుకు ఈ కుటుంబం వీధిన పడుతుంది. లారీ కోసం పోలీసులొచ్చి, అతను ఆ సమయానికి ఇంట్లో లేనందుకు, ఓ కార్డ్ ఇచ్చి, భలే మర్యాదగా పోలీస్ స్టేషన్ కు రమ్మని సందేశం ఇచ్చి వెళిపోవడం తో నవల మొదలవుతుంది. 

ఇంటికి వచ్చిన భర్త తో ఎన్నో మల్లగుల్లాలు పడి, అపటికే అదృశ్యం అయిన ఇతర ఆక్టివిస్టులను తల్చుకుని, బెంగపడిపోయిన భార్యకు నచ్చ జెప్పి, పోలీస్ స్టేషన్ కు వెళ్ళిన మనిషి మరి తిరిగిరాడు. వస్తూ, దారిలో హాకీకి వెళ్ళిన పద్నాలుగేళ్ళ కూతురిని తీసుకురావాల్సిన ఆ తండ్రి రాకపోవడంతో, ఎవరో తీసుకొచ్చి, పిల్లని ఇంటికి దింపినపుడు ఎలిష్ కి అర్ధం అవుతుంది  భర్త ప్రభుత్వం చేతిలో బందీ అని. అయితే అ(న)ధికారికంగా  అదృశ్యం అయిన వారి పరిస్థితి ఇక అంతే!!  అతని విడుదల కోసం ఎందరిని కాళ్ళా వేళ్ళా పడినా ఫలితం ఉండదు. అసలు అతను ప్రాణాలతో తిరిగొస్తాడని ఎవరూ అనుకోరు. ఎలీష్  తప్ప.


అప్పటినుండీ ఎలీష్ పడిన అగచాట్లు, వేదనా వర్ణనాతీతం!  ఎదిగిన పెద్దవాడు ఎక్కడ బలవంతంగా సైన్యానికి తీసికెళిపోతారో అని భయం,  ఓ వైపు డబ్లిన్ లోనే ఇంకో వీధిలో ఒంటరిగా ఉన్న తన మతిమరుపు వ్యాధిగ్రస్తుడైన తండ్రి,  మాయం అయిన తమ  తండ్రి గురించి అడుగుతుండే పిల్లలు,  సాకాల్సిన చిన్నవాడు!  ఈలోగా యుద్ధం ముదిరి, పెద్దవాడు ఇల్లు విడిచి వెళిపోవడం, వాడి గురించి ఏ వార్తా తెలియకపోవడం, వాడు రెబల్స్ లో చేరాడని ఓ ఫోన్ కాల్ తో చూచాయగా అర్ధం అయినా, వాడు నిఘా కారణాల వల్ల తన ఆచూకీ / క్షేమ సమాచారం, తల్లికి అసలు తెలీనివ్వకపోవడం,  ఎప్పుడు ఇంట్లో ఫోన్ మోగినా వాడే అనుకుని ఈమె ఎంతో ఆశగా ఫోన్ తియ్యడం, ఒకోసారి, ఫోన్ దగ్గరకు వెళ్తూన్నప్పుడే వాడితో మాటలు మొదలు పెట్టేయడం,  తండ్రి "అదృశ్యాన్ని" ప్రశ్నిస్తూ ఉండే పన్నెండేళ్ళ  రెండో వాడు. పిల్లలు బాధపడతారని, భయపడతారని, వాళ్ళకి నిజం చెప్పక, తల్లి పడే బాధ!!  

ఈ రెండోవాడు, బాగా నోరు జారే రకం. తల్లి తో అవమానకరంగా మాట్లాడుతూ ఉంటాడు.   చుట్టూ జరుగుతున్న పరిణామాలతో బెంగపెట్టుకుని సరిగ్గా తినడం మానేసిన కూతురు. ఈ పిల్లే కాస్త తల్లి బాధని, ఆమె దిగమింగుకున్న దుఃఖాన్నీ అర్ధం చేసుకున్న  ఏకైక సాయం.  నవలంతా ఆమె తల్లికి అండగా ఉంటూనే ఉంటుంది. పసివాడికి ఈ కష్టాలేవీ తెలీవు. 


మెల్లగా ఉద్యోగ జీవితంలో ఒంటరి అయిపోయి, అది కూడా కొన్నాళ్ళకి కోల్పోయి, నిర్బంధం లో ఉన్న నగరంలో నిత్యావసరాల కోసం కూడా ప్రాణాలు గుండెల్లో పెట్టుకుని  పలు చెక్ పోస్టులు దాటి, అటు తండ్రి నీ, ఇటు పిల్లల్నీ కనిపెట్టుకుంటూ, ఓ వైపు భర్త కోసం, పెద్ద వాడికోసం తల్లడిల్లిపోతూ, వాళ్ళు చనిపోయే ఉంటారని ఎవరు చెప్పి ఆమెను నగరం విడిచిపెట్టి వెళిపోమన్నా, నిరాకరిస్తూ,  మొండి గా నెట్టుకొస్తూ, అగచాట్లు పడుతుంది.  


నవల మొత్తం ఎలిష్ దే.  ఓవైపు కెనడాలో స్థిరపడ్డ చెల్లెలు అక్కను, తండ్రిని తన వద్దకు రప్పించుకునేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది. రాజకీయ శత్రువు కుటుంబం కాబట్టి,  ఐరిష్ ప్రభుత్వం కుంటి సాకులతో ఎలీష్ ని అష్టదిగ్బంధనం చేసేస్తుంది.  ఈ కుటుంబానికి పాస్పోర్ట్ లు సైతం నిలిపేస్తుంది. దాని వల్ల, సమయం ఉండగానే  న్యాయమైన దారుల్లో దేశం దాటడం అసాధ్యం అయిపోతుంది. 

ఎప్పటికైనా తన వాళ్ళు వస్తారని భ్రమల్లో ఉండడం వల్ల, ఎలిష్ 'తల్లి ప్రాణం', దేశం విడిచి  పారిపోయేందుకు ఒప్పుకోదు. ఎన్నో సంఘర్షణలు, అంతులేని విషాదం మధ్య చివరకు తనను తాను, తన ఇంటి నుండీ, నగరాన్నించి, కుటుంబం నిర్మించుకున్న జీవితం నుంచీ, బయటకు లాక్కుని,  చెల్లెలు పంపిన డబ్బుతో,  స్మగ్లర్లని నమ్ముకుని, దేశాన్ని దాటుతుంది. టీనేజ్ కూతురిని గార్డులు 'చెడ్డ' దృష్టి తో చూస్తున్నారని, ఆ పిల్ల అందమైన జుత్తును పూర్తిగా కత్తిరించేసి,  మేకప్ ని చెత్తబుట్ట లో పడేసి, చంటి పిల్లాడితో దేశం విడిచి, శరణార్ధి అయిపోతుంది ఎలిష్.  లీలగా మారిపోయిన తండ్రినీ, సోదరులనీ విడిచి వెళ్ళలేక,   నేను "రాను రానని" మొండికేస్తున్న, ఏడుస్తున్న కూతుర్ని బ్రతిమాలుకుని, సముద్రాన్ని చూపించి, "ఇదిగో.. ఇటే జీవితం ఉంది" అని చెప్పగలుగుతుంది. ఆ స్టేజ్ వరకూ వచ్చేందుకు ఆమె పడిన వేదన, అనుభవించిన కష్టాలు, పాఠకుడిని ఊపిరిసలపనివ్వవు. 

ఈ నవల మనల్ని తనలోకి లాక్కుంటుంది. ఈ తరహా డిస్టోపియన్ రచనల్లోకి వెళ్ళడం కష్టం. కానీ డబ్లిన్ నగరం, ఐరిష్ బాక్ గ్రౌండ్, చాలా రిలేటబుల్ గా ఉండడం తో, పైగా ఐరిష్ చరిత్ర కాస్తో కూస్తో తెలిసిన సగటు పాఠకుడికి కూడా, ఈ కథ ఇక్కడ జరిగి ఉంటుందనుకోవడంలో ఏ చిక్కూ ఉండదు.  విప్లవాత్మక ఆత్మ ఉన్న  ఐర్లాండ్ కూడా ఎందరో తల్లులకు గర్భశోకం మిగిల్చినందుకు, ఈ డబ్లిన్ నేపథ్యం కథకు సరిపోతుంది.


ముఖ్యంగా నవలలో కొటేషన్ లు, కామాలు, ఫుల్ స్టాప్  లు, పేరాలు ఉండవు. ఒకటే వాక్యాల వరద ప్రవాహం.  ఈ ధోరణి, ఎలీష్ నిస్సహాయతని అర్ధం చేసుకునేందుకు పనికొస్తుంది.  ఈ వరదలోకి దూకడం మొదట్లో భయం పుట్టించినా, కథ లోకి మనం కూడా చేరిపోయి,  పాత్రల డైలమ్మా లలో, కష్టాలలో, ఆలోచనలలో, బెంగల్లో మనల్ని మనం చూసుకుంటాం. పరిస్థితులు ముదిరే కొద్దీ "ఎలీష్ ఎందుకు ముందే పారిపోలేదు ?  ఇంత నష్టం జరిగే దాకా ఎందుకుంది. అసలు ఏమీ లేకుండా  ఎలా బ్రతికింది ?" అని కోప్పడలేము. ఆమెను పారిపొమ్మని ఒత్తిడి చేసే శ్రేయోభిలాషుల మీద అభిమానం కలుగుతుంటుంది.  ఎలీష్ కు మాత్రం ప్రాణం ఒప్పుకోదు.  ఓసారి "మార్క్ (పెద్దబ్బాయి) ఇంటికి ఎప్పటికైనా తిరిగి రాడా ? వస్తే మేము ఇక్కడ లేకపోతే ఎలా? వాడొచ్చి, ఆకలితో ఫ్రిజ్ తలుపు తెరిచి హేం (HAM) వెతుక్కుంటాడు. నేను ఉండకపోతే ఎలా? " అంటుంది. 

నవల లో మొదటి పేజీలు చదవడానికి కొంచెం ఇబ్బంది గా అనిపించినా, కథ మనసుని మెత్తగా చేస్తూ, ఒకటీ అరా సెకెన్లు కన్నీళ్ళు పుట్టించి, ఆపకుండా చదివిస్తుంది.  అప్పటి దాకా సాధారణం గా ఉన్న పరిస్థితులు ఒక చెడ్డ ప్రభుత్వం అధికారం లోకి వచ్చినపుడు  ఎంతలా ఘోరంగా మారవచ్చో చూస్తాం.  కథ ఒక్క కుటుంబానిదే కాదు, దేశం మొత్తానిది.  రెబల్స్  ఇళ్ళ మీద దాడులు జరిగినపుడు క్షతగాత్రులను హాస్పిటల్ కు తీసుకెళితే అక్కడ కూడా షెల్స్ పడి, ఇంకో హాస్పిటల్ కు పరిగెత్తాల్సొస్తుంది. అది ఎంత గాభరాగా ఉంటుందో పాఠకులకు కూడా!!

నాకు నిరాశావాదంతో నిండి ఉన్న పుస్తకాలు చదవడం అంటే  కొన్ని అభ్యంతరాలు ఉన్నా, ఈ పుస్తకం కొంత దూరం గడిచాక అర్ధం కాకపోవడం తో, మొదట 'సినాప్సిస్' చదివి ముందుకు వెళ్ళాను. ముఖ్యంగా కథ ఇక్కడ ముఖ్యం కాదు. ఇలాంటి "ఎవరికీ పట్టని కుటుంబాలు" కొన్ని వేలు లక్షలు ఉన్నాయి. ఇలాంటి "దిక్కూ మొక్కూ"  లేని చావులు కూడా కోకొల్లలు.  కాపోతే, ఆ జీవితాన్ని కళ్ళకు కట్టినట్టు వివరించడం, రచయిత చేసిన గొప్ప పని. 


కథ లో ముందుకు ఏమి జరుగుతుందో ముందే తెలిసినా చదివించగలగడం, చాలా గొప్ప విషయం. పాల్ లించ్ చాలా ఇంటర్యూలలో, ప్రోఫెట్ సాంగ్ కథ ని గురించి ప్రశ్నల్లో స్పాయిలర్ లు ఉంటాయి. అయినా ఈ పుస్తకం ఎంతో ఆదరణ పొందింది. 2023 లో బుకర్ ప్రైజ్ దక్కించుకుంది. పోటీలో దీనికన్నా గొప్ప రచనలు ఉన్నాయి అని ఆ సంవత్సరం చాలా మంది పెదవి విడిచారు. కానీ బహుశా 'మనిషి', ఇంకో 'మనిషి కష్టాలని' చూసి స్పందించగలిగే హృదయాన్ని కోల్పోకుండా చేసే సాహిత్యాన్ని ప్రోత్సహించడం కోసం ఈ ప్రైజ్ ని ఈ పుస్తకానికి ఇచ్చుంటారు. 

పుస్తకాన్ని ఒక వారం లో రెండు మూడు సార్లు చేతిలోకి తీసుకుని, వదిలేసిన సందర్భాలు ఉన్నాయి. కేవలం డిస్టోపియన్ అని / ఈ 'పేరా' లు లేని, ఎవరు ఎవరితో ఏమంటున్నారో తెలీనివ్వని శైలి.. చదవలేక, చదివాక ఆ కష్టాలు తట్టుకోలేక ఆపి, ఆతరవాత మెల్లిగా కథ లోకి దూకి, పాత్రల మనసులు చదివేసి, వాళ్ళ పరిస్థితుల్ని నీవిగా భావించి, ఆ పుస్తకంలోకి మమైకం అయిపోయేటట్టు చేసేసినందున మొత్తానికి, పూర్తిగా చదివాను. మధ్య లో కొన్ని సార్లు  భావాల గాఢత తట్టుకోలేక, రోజుల కొద్దీ పూటల కొద్దీ బ్రేక్ లు తీసుకున్నా కూడా, పూర్తి చేసే దాకా చదివించింది. మతిమరుపు తండ్రి తో ఎలీష్ సంభాషణలు, బెంగ, అతని అదృశ్యం, అతని ఫోన్ కాల్ లు, ఎలీష్ ఆందోళనలు, తండ్రి మీద ప్రేమ - వీటన్నిటినీ చదివి, ఓ రోజంతా ఏడ్చాను.   ఒక పుస్తకం ఇంత కదిలిస్తుందా ? అని ఆశ్చర్యం కలిగింది. 

కొన్ని గుండెను మెలిపెట్టే సన్నివేశాలు :

ఎలీష్ భర్త అదృశ్యం, అతను మరి రాడని అర్ధం అయేందుకు చాలా సమయం పట్టడం, అతనిని ప్రతి సంభాషణలోనూ, ప్రతి సంఘటనలోనూ తలచుకోవడం, కలల్లో అతన్ని హత్తుకుని పడుకుని, లేచి చూస్తే అతను లేకపోవడం.  పెద్దవాడి గురించి న్యూస్ పేపర్ లో చూసి తెలుసుకోవడం, రెండోవాడి తిరుగుబాటు ధోరణి, తల్లిని కావాలని బాధ పెట్టేలా వాగడం, చివర్లో తల్లిని హత్తుకుపోయే తెలిసీ తెలీని పసితనం, అతని కోసం, తల్లి పడ్డ పాట్లు, ఎలీష్ చెల్లెలి ప్రయత్నాలు, ఎలీష్ బాస్ వ్యవహారం,  మొత్తానికి సరిహద్దు దాటాల్సొచ్చినపుడు, కూతురు మోలీ జుత్తు కత్తిరించడం, (పద్నాలుగేళ్ళ పిల్ల ని కాపాడుకోవడానికి చేసే ప్రయత్నం) ఈ అగాధాలు తెలీని చిన్న పిల్లవాడు, వాడి మందుల రేట్లు, పాల ఖర్చు, సగం ప్రాణాన్ని ఐర్లండ్ లోనే వదిలి, సగాన్ని పిల్లలకోసం పణం గా పెట్టి, ఎలీష్ భవిష్యత్తు వైపు ప్రయాణం చెయ్యడం.

ఇలా ఎలీష్ తో ప్రయాణం మొదలు పెట్టి, ఆమె తోనో నడుస్తూ, ఆవిడ ప్రశ్నలకు సమాధానం వెతుకుతూ, పాఠకుడు కూడా ప్రయాణిస్తూ ఉండడం వల్ల, ఆ కష్టాల ఇంటెన్సిటీ అర్ధం అయి, అసలు ప్రపంచ వ్యాప్తంగా "ప్రమాదం లో ఉన్న ప్రజాస్వామ్యన్ని" కాపాడుకోవడం ఎందుకు అంత అవసరమో తెలుస్తుంది.  ఎన్నో మంచి రివ్యూలు, ఎంతో ప్రశంస పొందిన ఈ నవల, మనిషిని  cleanse  చేసి పడేస్తుంది.  రాజకీయాల మీద ఏమాత్రం ఆసక్తి ఉన్నా ఈ పుస్తకం చదవొచ్చు. సాధారణ ప్రభుత్వాలు కూడా ప్రమాదకరం గా ఎలా మారతాయో, మారితే ఏమి జరుగుతుందో అర్ధం అవుతుంది. 

Some clips : 






Some quotes : 

(a) ఆమెను ఒప్పించడానికి చెల్లెలు ఏన్ అన్న మాటలు : I wish you would listen to me, history is a silent record of people who did not know when to leave. 

(b) History is silent record of people who could not leave, it is a record of those who did not have a choice, you cannot leave when you have nowhere to go and have not the means to go there, you cannot leave when your children cannot get a passport, cannot go when your feet are rooted in the earth and leave means tearing off your feet. 

(c) Seeing how they have made an end of death by meeting it with death. 

(d) I don't see how free will is possible when you are caught up within some monstrosity, one thing leads to another things until the damn thing has its own momentum and there is nothing you can do. 


***




  


18/12/2024

మృత్యుంజయ - అబ్బూరి చాయా దేవి






హైదరాబాద్ బుక్ ట్రస్ట్ 1993 లో ప్రచురించిన పుస్తకం ఇది. ఒక సెకండ్ హాండ్ పుస్తకాల అంగట్లో అబ్బూరి చాయా దేవి గారి పేరు చూసి, చటుక్కున కొనేసుకున్నాను. సామాన్యంగానే ఒక తండ్రీ, కూతుళ్ళ మధ్య ఉన్న బంధం అపూర్వమైనది. అందులోనూ, సింప్లిసిటీ, విద్వత్తూ, అందమైన స్నేహమూ ఉన్న ఇద్దరు తండ్రీ కూతుర్ల మధ్య నడిచిన ఉత్తరాలే ఈ పుస్తకం నిండా.  ఇది ఆమె చెప్పబోయిన తన తండ్రి జీవిత కథ, తన గాధ అనిపించింది. నేను పుస్తకం చదివి కదిలిపోయిన మాట నిజం. మా నాన్నగారిని బాగా గుర్తు చేసుకున్న మాటా నిజమే. చాయాదేవి గారి రచనల్లో ఇది నిజానికి "పెద్ద కథ" అని చదివాను. కానీ ఇది నవలో, కథో, ఆత్మ గాధో తెలియలేదు. ఏమైతేనేం, ఇది చదవడం వల్ల మనసు శుద్ధి చెందింది. 

ఏల్చూరి సుబ్రహ్మణ్యం గారు రాసిన 'ముందుమాట' పుస్తకం మీది గౌరవాన్ని అమాంతం పెంచేసింది. అసలు ఎన్నడూ విని ఉండకపోవడం వల్ల ఈ చిన్ని పుస్తకం నుంచి ఏమి ఆశించాలో తెలీని పరిస్థితిలో ఈ ముందుమాట గొప్ప మేలు చేసింది. పాఠకుడికీ, పుస్తకానికీ కూడా. 

లాయరుగా వృత్తిపరంగా బిజీగా ఉన్నా కూడా ఊరికే కూర్చునే రకం కాని 'నాన్నగారి  ఆధ్యాత్మిక భావాల సంగతితో పాటూ, అహంకారం సంగతి' కూడా బాగా తెలిసిన కూతురు ఆయన రాజమండ్రి నుండి హైదరాబాదుకి మకాం మార్చిన వార్త విని ఆదుర్దా చెందుతున్నపుడు  తండ్రి నుండి ఉత్తరం అందుతుంది.  'ఇదిగో ఫలానా పనికి రాజమండ్రి వెళ్ళొచ్చాను. ఇక లాయరుగా నా జీవితం సమాప్తమైందని నిశ్చయంగా చెప్పవచ్చు. ఆఖరి కేసు పూర్తిచేసాను. ఇక ఏ కోర్టు తోనూ ఇంక సంబంధం లేదు. సన్యాసి కావడానికి అడవులకు పోయి ఉండనక్కర్లేదు. మానసికంగా నిజమైన సన్యాసిగా ఉండవచ్చు. ఏవిధమైన గొడవలూ లేకుండా మనస్సుని ప్రశాంతంగా ఉంచుకుని, అన్ని కోరికలనూ, భయాలనూ త్యజిస్తే అదే నిజమైన సన్యాసం.. మీరు ఢిల్లీ వెళ్ళి అపుడే రెండేళ్ళు దాటింది. అవసరమైనవీ, కుతూహలమైనవీ, అన్ని విశేషాలతో పెద్ద ఉత్తరం రాస్తే నీకు కృతజ్ఞతలు తెలుపుకుంటాను.." అంటూ రాస్తారాయన.  అనగా ఆయన స్వచ్చందంగా వృత్తి విరమించి, తనకి కావల్సిన విధంగా రిటైర్డ్ లైఫ్ గడపాలనుకున్న వ్యక్తి. ఇంకా సంపాదించేయాలన్న ఆసక్తి లేని సింపుల్ (/చాదస్తపు) మనిషి.

అసలు ఉత్తరాలు రాసుకోవడం ఎంతందమైన కళ ! అందులోనూ, ఉన్నతాదర్శాలు, ఉత్తమ సంస్కారం గల మనుషుల మధ్య ! కుమార్తె తండ్రి ని 'పదవీ విరమణ చేసాక ఊరికే ఉండడానికి పిచ్చెక్కుతుంది. మీరు ఢిల్లీ వచ్చి కొన్నాళ్ళు కాలక్షేపం చేయమంటే' ఆయన అస్సలు ఒప్పుకోరు. నేనెక్కడున్నానో అక్కడే బావుంది. మీ అమ్మ(గారి) లాగా నాకు డిల్లీ, ఆగ్రా, బదరీనాధ్ అవీ చూడాలనే ఉత్సాహమేమీ లేదు అనేంత తాత్విక మనస్తత్వం ఉన్న మనిషి,  కొన్నాళ్ళకు ఎర్ల్ స్టాన్లీ గార్డ్నర్ నవలలు చదువుతున్నాననీ అవి న్యాయానికీ, చట్టానికీ సంబంధించిన సృజనాత్మక సాహిత్యంలో మేలైన రచనలనీ, ఉత్తరంలో రాస్తారు. గార్డ్నర్ రచనలు వరుసగా చదివి, రచయిత అభిప్రాయాలు, జీవన్మరణాలగురించిన తత్వం అచ్చు జిడ్డు కృష్ణమూర్తిగారి అభిప్రాయాలతో సరిపోలడం గురించి ఉత్తరం రాసారు.  ఆయన కాలక్షేపానికైనా వేదాంత గ్రంధాలనే చదివే వ్యక్తి. అలాంటి మనిషి డిటెక్టివ్ నవలలను చదువుతున్నారని ఉబ్బితబ్బిబ్బవుతుంది కూతురు. ఆషాడ బహుళ నవమిన అన్నదీ, తండ్రిదీ పుట్టిన రోజు. ఇద్దరికీ చెరొక "బెర్ట్రాండ్ రసెల్ స్పీక్స్ హిస్ మైండ్"  పుస్తకాన్ని బహుమతిగా పోస్ట్ చేస్తుంది.  

ఆయన ఏకబిగిన దాన్ని చదివి, అనువాదం చేసేసేంతగా నచ్చేస్తుంది ఆ పుస్తకం. "నువ్వు పంపిన పుట్టినరోజు బహుమతి అద్భుతమైనది. గత కొద్దిరోజులుగా నేను బెర్ట్ రాండ్ రసెల్ సాన్నిధ్యంలో ఉన్నాను. ఆయన సాన్నిధ్యాన్ని నేనెంతో ఆనందించాను. పదిరోజులక్రితం రాత్రి 8 గంటలకి అనువాదం ప్రారంభించి ఈరోజు మద్యాహ్నం 3 గంటలకి పూర్తి చేసాను..  బెర్ట్ రాండ్ రసెల్ కీ, జిడ్డు కృష్ణమూర్తి గారికీ చాలా సామ్యం కనిపించింది. ఇద్దరూ ప్రపంచ విఖ్యాత మేధావులు, తత్వవేత్తలు, బోధకులు.  అయితే లార్డ్ రసెల్ బోధకుడవునో కాదో చెప్ప్పలేకపోవచ్చు కానీ ఆయన నిశ్చయంగా మహా మేధావి, తత్వవేత్త.  ఆయన అభిప్రాయాలు విప్లవాత్మకమైనవే కాదు. ఎంతో వినూత్నమైనవి. ఆయన (పుస్తక పఠనా..) సాన్నిధ్యం నాకెంతో ఆనందం కలిగించింది" అంటూ జవాబు రాస్తారు. 

ఇద్దరూ ఉత్తరాలు రాసుకుంటున్నప్పుడు, కొన్నాళ్ళకు తండ్రి హఠాత్తుగా సంతకానికి బదులు చుక్కలు పెట్టడం గమనిస్తుంది కూతురు. "ఈసారి నుండీ నా చిరునామా లో అసలు పేరు స్థానంలో మృత్యుంజయ అని రాయు. ఇది నేను పెట్టుకున్న పేరు. ఎప్పుడో అప్పుడు గతమంతా నశించాలి. ఒక కొత్త అధ్యాయం ప్రారంభమైంది. నాయీ కోరిక అనుకో, లేదా మానసిక బలహీనత అనుకో, దాన్ని మన్నించు. చెప్పినట్టుగా చెయ్యి. చిరునామాలో ఇంటి నెంబరు వేయాలి సుమా" అని చమత్కరించి రాసిన ఉత్తరంలో సంతకం స్థానంలో మృత్యుంజయ అని సంతకం చేసారు. 

ఇద్దరి మధ్యా రకరకాల ఉత్తరాలు. ఆమె ఆరోగ్యం, అనారోగ్యం, ఆయన చదివిన పుస్తకాలు, చేస్తున్న అనువాదాలు. దీపిక కోసం రాసిన వ్యాసాలు, మిగిల్న తోబుట్టువుల గురించి, బంధువుల ఇళ్ళలో పెళ్ళిళ్ళ గురించి, దివ్యజ్ఞాన సమాజం గురించీ, హోమియో పతీ మందుల సూచనలు, ఆమె చదువులు, చేయాల్సిన కోర్సులు, చైన్సీస్ విద్యా, అల్లుడి ఉద్యోగమూ, దిల్లీ రమ్మనడం, ఆయన వద్దనడం, కుమార్తె అత్తమామల గురించి హెచ్చరికలు, వారిని గురించి రాయకపోవడం గురించి మందలింపులు, వారి ఆదరణ గొన్నందుకు కూతురికి ప్రశంసలు, ప్రస్తావనలు వగైరాలు.  వీటన్నిటిలోనూ ఇద్దరి వ్యక్తిత్వమూ, కష్టపడే తత్వమూ, జీవితపు మిగిల్నకోణాల పట్లా, మనుషుల పట్లా, బంధాల పట్లా ఉన్న అవహాహన, ప్రేమ, వ్యక్తమవుతూ ఉంటాయి.


ఆయన రాసిన ఉత్తరాల్లో కొన్ని వాక్యాలు చూడండి.

(i) ఒకడు కొండల కింద, చీకటి లోయల చుట్టూ ఎప్పుడూ ఏదో తడుముకుంటూ, లొడ లొడ వాగుతూ, సణుక్కుంటూ, అష్టకష్టాలు పడుతూ, సంపాదిస్తూ, పోగు చేసుకుంటూ ఉంటాడు.  మరొకడు మేఘాలులేని ఆకాశంలోకి దూసుకుపోయి అత్యున్నత పర్వత శిఖరాగ్రాల కింకా పైన ఏ విధమైన ఆటంకాలూ ఎదురవని చోట, ప్రగాఢమైన పరిపూర్ణ నిశ్శబ్దత, ప్రశాంతత ఆవరించి ఉన్నచోట తేలుతూ ఉంటాడు.  ఈ ఇద్దరిమధ్య ఉండే వ్యత్యాసం గురించి నీకేమనిపిస్తుంది ? 

(ii) అమ్మా, మనం మన గూళ్ళలో నివసిస్తూనే, మబ్బుల్లేని అనంతాకాశంలో తేలుతూ, వర్ణనాతీతమైన ఆనందాన్ని చవిచూడటం సాధ్యం అంటావా, కాదంటావా ? 

(iii) ఏసుక్రీస్తు చెప్పిన మాటల్ని మనం మరచిపోకూడదు. "నీ దగ్గర రెండు కప్పుకునే దుస్తులుంటే ఒకటి అసలు లేనివాడి కి  ఇయ్యి" నన్ను ఇలా సాదాగా, నిరాడంబరంగా ఉండనీ..."

(iv)   నీకు నిజంగా నా మీద ప్రేమ ఉంటే, నేను త్వరగా ఏ వ్యాధి, ఏ బాధా లేకుండా, ఎవరికీ ఏ బాధా కలుగజేయకుండా, దగ్గరగా ఉన్నవాళ్ళకు గాని, దూరంగా ఉన్నవాళ్ళకు గాని, ఎవరికీ కష్టం కలుగజెయ్యకుండా నేను తనువు చాలించాలని మనసారా కోరుకోమని నిన్ను బ్రతిమాలుకుంటున్నాను. 


వృద్ధాప్యం కమ్ముకొచ్చేస్తున్న తల్లితండ్రులను ఊర్లో ఒంటరిగా వొదిలి, వాళ్ళకు ఆరోగ్యం బాలేనపుడల్లా అప్పటికే మధ్యవయసుకొచ్చి, బాధ్యతల్లో మునిగిపోయిన పిల్లలు పడే ఆవేదన అందరికీ అనుభవంలోకి వచ్చేదే.  తండ్రి వీలయినంత శారీరక శ్రమ, మొక్కలకు నీళ్ళు తోడటమూ, కూరలు తీసుకురావడమూ, చదువుకోవడమూ, ఉత్తరాలు రాయడమూ, భార్యకు సాయపడటమూ, ఆవిడ ఊరెళ్తే, మొత్తం పనిచేసుకోవడమూ - ఇలా తనకు ఓపికున్నన్నాళ్ళూ చేస్తూనే ఉంటారు. సైంటిస్ట్ అయిన కొడుకు డెహ్రాడూన్ లో ఉండటం వల్ల, వీళ్ళకు వెళ్ళే ఉద్దేశ్యమూ ఉండదు. అయితే విధివశాత్తూ, ఆయనే 84 ఏళ్ళ వయసులో కొడుకు హఠాన్మరణంతో ఇంకొన్ని కుటుంబ బాధ్యతలు స్వీకరించాల్సొస్తుంది. కాటరాక్ట్ తో కళ్ళు కనిపించడం తగ్గుతుంది. 

తల్లితండ్రులను గురించి, ముఖ్యంగా తండ్రి గురించి ఎంతో బెంగ పెట్టుకుని మనసారా ప్రేమించిన పిల్లలకు ఆయన చివరి రోజులు భారమవుతాయి. తండ్రిని గురించి రాస్తూ కూతురు రాసిన ఆఖరి పేరాల లో కొంత భాగం :- 

ఒక్క సంగతి మరచాను. నాన్నగారు 'మృత్యుంజయ' అన్న సంగతి. కొడుకు మరణాన్ని కొండంత స్థైర్యంతో స్వీకరించారు. కోడలి కోరిక ప్రకారం యధావిధిగా కర్మకాండ జరిపారు. కొడుకు కొడుక్కి ఉపనయనం కానందున తను ఏనాడో విసర్జించిన జంద్యాన్ని మళ్ళీ వేసుకుని కర్మ చేసారు. కేటరాక్ట్ ముదిరిపోయింది. రెండు కళ్ళూ చీకటి గూళ్ళు. మంచమే శరణ్యం అయింది. మరణం కోసం ఎదురు చూడ్డమే మిగిలింది. బ్రతికినన్నాళ్ళూ కోరికలని చంపుకుంటూనే బ్రతికారు. మరణించాలన్న కోరిక ఒక్కటే ఆయన చంపుకోలేకపోయింది. దానికే శిక్ష అనుభవించినట్టున్నారు.  కంటికి రెప్పలా చూసుకోవాల్సిన కొడుకు ముందే పోయాడు.  అన్నయ్య పోయిన రెండేళ్ళకు నాన్నగారి రెండు కళ్ళూ పోయాయి. వాటితో పాటే నేనూ నా చిరకాలపు 'కలం స్నేహితుణ్ణి'  కోల్పోయాను".

తండ్రులతో గాఢమైన అనుబంధం ఉన్న కూతుర్లకు ఈ పుస్తకం చాలా నచ్చుతుంది. అదెలాగూ ఉన్నదే. ఈ పుస్తకంలో అంతకు మించిన స్నేహానురక్తి ఉంది. మృత్యుంజయ దివ్యజ్ఞాన సమాజాన్ని, కృష్ణమూర్తి బోధనలనూ  నమ్మిన వ్యక్తి. "నవ్య మనస్సు" అనే శీర్షికన దివ్యజ్ఞానం పై అనేకమైన ప్రసంగ వ్యాసాలను రాశారు. జిడ్డు కృష్ణమూర్తి, దివ్యజ్ఞానము అనే అంశాలపై వివిధ నగరాల్లోనూ, రేడియోలోనూ తెలుగు, ఇంగ్లీషుల్లో ప్రసంగించారు. ఆయన వ్యాసాలు రెండు భాషల్లోనూ అచ్చయ్యాయి. ఆయన హైదరాబాదు లో జిడ్డు కృష్ణమూర్తిగారి ప్రభోధాలను వివరిస్తూ చేసిన ప్రసంగాన్ని విని, దివ్యజ్ఞాన సమాజం హైదరాబాదు శాఖ వారు ప్రచురించి దేశమంతా పంచిపెట్టారు. ఈ విషయాల్ని రాస్తూ, జిడ్డు కృష్ణమూర్తి తత్వాన్ని, తనకు చేరినంత జ్ఞానాన్ని, వీలయినంతగా వ్యాప్తి చెయ్యాలంటే ఏమి చెయ్యొచ్చో చెప్పాల్సిందిగా కోరారు. ఆమె ఇచ్చిన సలహానీ స్వీకరించారు. 

ఈ మధ్య 'మినిమలిజం ' గురించి ఒక స్పృహ వృద్ధులలోనూ మొదలయినట్టు చదివాను. చనిపోయే ముందు ఇంట్లో వస్తువుల పట్లా, పేర్చుకుపోయిన బంధనాల పట్లా బాధ్యతాయుతమైన డిటాచ్మెంట్, వదిలించుకోవడమూ గురించి ఆలోచనలు బాగా చదివాను. మృత్యుంజయుని గా  మారిన కొత్తల్లోనే, పూర్తి స్పృహతో ఆయన రాసుకున్న వీలునామా చదివితే ఆయన ఎంత నిరాడంబరంగా జీవించారో, ఎంత ఉన్నతాదర్శాలతో బ్రతుకుని తీర్చిదిద్దుకున్నారో తెలుస్తుంది.   తన నిర్దుష్టమైన బాధ్యతలను గుర్తెరిగినట్టు భార్య పేరిట కాస్త సొమ్ము, తన దహన సంస్కారాలకోసం కేటాయించిన సొమ్ము ఖచ్చితంగా కేటాయిస్తారు.  దహనానంతరం తన బూడిదను వారణాసిలో గట్రా కలపొద్దు, దహనం జరిగిన ప్రదేశానికి దగ్గరలోని నీటిప్రవాహంలో కలిపితే చాలు అని రాస్తారు. కర్మ కాండ పట్ల ఆయనకు నిర్దుష్టమైన అధునాతన అభిప్రాయాలున్నాయి. తనకై కర్మకాండ అస్సలు జరిపించవద్దని చాలా విపులంగా రాస్తారు. రిస్టువాచీ, బట్టలూ, హోమియోపతి పుస్తకాలు, మందులూ, ఎవరికి ఆసక్తి ఉంటే వారు తీసుకోవచ్చు. దహనానంతరం డబ్బు మిగిలితే కుష్టురోగులకు భోజనం పెట్టాలి. తన బట్టలన్నీ బీదలకు పంచాలి.. తన ఫలానా వస్తువులన్నీ ఫలానా అందరికీ ఇవ్వాలి అని రాసి, ఆఖర్న, "మృత్యుంజయ తన అనంతరం వదిలివెళ్ళేది సుహృద్భావం, ప్రకృతిలోని ప్రతి ప్రాణి పట్ల ప్రేమ - అంతకు మించి మరేమీ లేదుఅని రాసారు.  

ఈ పుస్తకం ముందుమాట లో  సుబ్రహ్మణ్యం గారు రాసినట్టు, "ఎన్ని తరాలు మారినా, ఏ దిక్కు నుంచి ఎన్ని ప్రభంజనాలు వీచినా, విజ్ఞాన శాస్త్రంలో ఎన్ని మార్పులు వచ్చినా, వస్తున్నా, తండ్రీ తనయల స్వభావం మారనిది.  'మృత్యుంజయా, ఆయన కూతురూ,  ఒకే క్రాంతి చక్రంలో విక్రమిస్తున్నారు - ఒకరి వలయాన్ని ఇంకొకరు ఖండించకుండా, ఘర్షణ పడకుండా.. "

ఈ పుస్తకం చాలా రోజులకు నన్ను నవ్వించింది, ఏడిపించింది, కదిలించింది. మా నాన్నగారితో  నా అనుబంధం, చివరి రోజుల్లో ఆయన నన్ను పోల్చుకోలేకపోవడం, ఆయన్ని నేను బాధపెట్టిన సంగతులూ, ఆయన ఉత్తరాలు దాచుకోవడం, ఆయన సంతకమూ, ప్రోత్సాహ పూర్వక వాక్యాలూ, అందమైన దస్తూరీ.. ఇవన్నీ గుర్తొచ్చాయి. సరిగ్గా ఇలానే హోమియో మందులు సూచించడమూ, మా చదువుల్నీ, ఉద్యోగాల్నీ, కుటుంబాలనీ ఆయన ఎంత ఇంటరెస్ట్ గా సమకూర్చి పెట్టారో తలచుకున్నాను. ఆయన ఉండి వుంటే నేనిప్పుడు పడుతున్న చిన్నా పెద్దా కష్టాలకు ఆయన  ఓదార్పులు, ధైర్యవచనాలూ, నాకు ఎంత దన్నుగా ఉండేవో గుర్తు చేసుకున్నాను. ఇకపై అబ్బూరి చాయాదేవి రచనల్ని వెతికిమరీ చదవాలని నిశ్చయించుకున్నాను. 

***


10/11/2024

Roman Stories - Jhumpa Lahiri

 


 

 

లాహిరి ది ఇది ఇంకో అనువాదం. ఒరిజినల్ ఇటాలియన్ లో రాసినది. 'పెద్దగా కదిలించని పుస్తకం' గా పలు రివ్యూలలో చదివాను. చదవడానికి మనసు రానప్పుడు, ఊరికే తిరగేయడానికి పనికొస్తుంది. ఎప్పట్లాగే, ఒక దృక్కోణంతో చెప్పే కథలు. రచయిత్రి చాలా చోట్ల పాత్రధారిగా కనిపిస్తుంటుంది.

మొదటిది, ఒక శరణార్ధి కుటుంబపు కథ. అతనికి పూల వ్యాపారం ఉంటుంది రోం లో ! కానీ అతని పై ఒక సారి జాత్యాహంకార దాడి జరిగింది. ప్రపంచం ఎప్పట్లాగే 'వేరే ' వాడిని నిరాకరిస్తుంది. అతనికి పోషించుకోవడానికో కుటుంబం ఉంది. స్వదేశంలో ఉపాధి లేదు. ఒక మారుమూల పల్లెలో పొలం, ఎస్టేటూ చూసుకునే పనికి కుదురుతాడు. దాడిలో అతను భౌతికంగా దెబ్బతినిపోయినదే కాకుండా, మానసికంగా కూడా డస్సిపోతాడు. మాటలు పోతాయి. ఈ పల్లె బ్రతుకు భార్యకు ఇష్టం ఉండదు. ఐనా ఏమి చెయ్యగలం? ఇక్కడ మన జోలికి వచ్చేవారుండరు. ఎలాగో ఒకలా బ్రతుకుదాం. ఎవరి పొడా లేకుండా !   అనేది అతని ఉద్దేశ్యం.    ఆ ఎస్టేట్ కి సీజన్ బట్టి అద్దెకు తీసుకుని వచ్చే కుటుంబాలుంటాయి. అతను కేర్ టేకర్. అతని భార్యా, కూతురూ, అతిధులకి అన్నీ సమకూరుస్తుంటారు. అదే జీవితం వాళ్ళకు.  

బిజీ నగర జీవితాల నుండీ తప్పించుకునేందుకు వచ్చిన అతిధులకు ఆ గ్రామపు శూన్యతా, మౌనమూ కట్టిపడేసినట్టు అనిపిస్తాయి. దాదాపు ప్రతివాళ్ళూ వెళ్ళేటపుడు, మళ్ళీ ఇక్కడికి వస్తాం - అంటారు గానీ రారు. వీళ్ళని అతని కూతురు ఓ పదమూడేళ్ళది గమనిస్తూ ఉంటుంది. అతిధులు, వాళ్ళ పిల్లలు, వాళ్ళు వదిలేసి వెళ్ళిన సామాన్లు, వాళ్ళను గమనిస్తూ గడిపిన క్షణాలు మాత్రమే ఆమె మొనాటనీ కి కొంచెం ఆటవిడుపు. కథంతా ఈ పాప దృష్టిదే.

ఇలానే ఇంకో కథ : 'పి' పార్టీ లు. లాహిరి అన్ని కథల్లో లానే, ఏ పాత్రలకీ పేర్లుండవు. ఏ ప్రాంతాలకీ పేర్లుండవు. ఏ ద్వీపాలకీ, యాట్ లకీ, వేటికీ పేరులుండవు. పీ అనే ఆవిడ ప్రతి వేసవిలోనూ ఏర్పాటు చేస్తుండే పెద్ద పెద్ద పార్టీలకి హాజరవుతూ,  అక్కడ ఒక తెలీని విదేశీయురాలితో ప్రేమలో పడిపోతాడు కథకుడు. ఎన్ని సంఘర్షణలో.. ఎన్ని సంభాషణలో, ఎంత రొటీన్ - యూనివర్సిటీకి వెళ్ళిపోయిన పిల్లాడిని మిస్ అయే తండ్రి ప్రేమ, మగాళ్ళ సున్నితత్వం ! ఆఖరికి జీవితం చాలా విచిత్రంగా ఉంటుంది. ఎన్నో ఏళ్ళుగా పార్టీలు, సందడీ, స్నేహితులూ అని కులాసాగా ఉండే పీ చనిపోతుంది. ఆమెకి ఏదో జబ్బు. ఒకసారి ప్రాణాల మీదికొస్తే ఎలానో బ్రతికింది. ఆఖర్న బ్రతకలేకపోతుంది. ఆమె ఫ్యూనరెల్ కూడా పార్టీలానే ఏర్పాటు చేస్తారు కుటుంబసభ్యులు. మనిషికి సాటి మనిషి మీద ఉండే ప్రేమ కి నివాళి ఈ కథ. 

అయితే మనిషి సొంతవాళ్ళనే ప్రేమిస్తుంటాడు. రోం లాంటి ఊరిలో శరణార్ధులు ఎక్కువ. ఆఫ్రికా నుండీ, ఆసియా నుండీ డింగీలలో ప్రమాదకరంగా సముద్రాన్ని దాటి పారిపోయి వాళ్ళు చేరుకునే దేశం ఇటలీ నే. చాలా కథల్లో ఈ శరణార్ధులని ద్వేషించే సమాజం కూడా వుంటుంది. ఇద్దరు కన్న బిడ్డలతో, సంతోషంగా రోం లో జీవించిన ఒక తల్లి, భర్త పోయాకా, ఒంటరితనాన్ని ఈదేందుకు చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తుంది. అదీ, అనుకోకుండా, తెలిసినవాళ్ళు చూపించినవి. ఒక సారి స్కూల్లో చిన్న పిల్లల్ని చూసుకునేందుకు చేరుతుంది. అదీ లీవ్ వేకెన్సీ లో. టెంపరరీగానే. ఆ మాత్రం సమయంలోనే చిన్న పిల్లలే ఆమె కోటు జేబులో,  'నువ్వు మాకు నచ్చలేదు', 'నువ్వు మాకు వద్దు', 'నువ్వు బాలేవు', 'ముందుండే మిస్ బావుంటుంది'... వగైరా నోట్ లు పెడతారు. ఆవిడ చాలా బాధపడుతుంది. కొడుకులు వేరే దేశాల్లో ఉద్యోగాల్లో ఉన్నారు.వాళ్ళు తల్లికి ధైర్యం చెప్తుంటారు. స్కూల్ విడిచిపెట్టి వచ్చేసేటపుడు ఆవిడా ఆ నోట్ లన్నింటిని రిపోర్ట్ చెయ్యకుండా (అన్నాళ్ళూ కోట్ లోనే ఉంచుకుంటుంది) నమిలి మింగేస్తుంది. భూదేవికున్నంత క్షమ. 

ఇంకో కథ లో ఒక శరణార్ధి కుటుంబం (ముస్లిం) ! వాళ్ళకి ఎన్నాళ్ళో టెంట్ లలో గడిపాక, ఒక హౌసింగ్ కేంప్ లో ఇల్లు కేటాయింపబడుతుంది. ఇక సుఖపడదామా అనుకునేసరికీ, అదే కేంప్ లో సాటి శరణార్ధులలోనే వేరే వేరే దేశాలవాళ్ళూ, ఇతర జాతి  బీదవాళ్ళూ, ఇతరులు, అతని కుటుంబం జీవితాన్ని  దుర్భరం చేసేస్తారు. ముసుగు వేసుకునే భార్య బురఖా,  అన్ని చూపులు వీళ్ళ మీద పడేందుకు కారణం అవుతుంది.  బెదిరింపులు సాధారణం అయిపోతాయి.   ఏ క్షణాన ఏం జరుగుతుందో అని భార్య, పిల్లల్ని పట్టుకుని, కూడబెట్టిన డబ్బంతటితోనూ టికెట్ కొనుక్కుని స్వదేశానికి వెళిపోతుంది. అతను రోడ్డున పడతాడు. కానీ బ్రతుకుతెరువు కోసం ఆ దేశం లోనే ఉండాల్సిన పరిస్థితి.

ఇంకో కథ లో హీరోయిన్ కూతురు, బోట్లలో వచ్చే శరణార్ధులకు నీళ్ళూ, తిండీ, వసతీ, బ్లాంకెట్లూ, వైద్య సహాయమూ, అంత్యక్రియలు, డాక్యుమెంటేషన్ కూ సాయం చేసే వలంటీరు గా పనిచేస్తుంటుంది.   తమ తమ దేశాల్లో యుద్ధం, కరువు, తీవ్రవాదం నుండీ జనాలు పారిపోతుంటారు. ఇటలీకి కొట్టుకొచ్చే వేల శవాలు ఈ మాట చెప్తుంటాయి. ఇటలీ నుండీ బారులు కట్టి యూరోపు కు నడిచెళ్ళే వాళ్ళు, ఆ దేశం లోనే వీళ్ళతో రొట్టెనీ, ఇళ్ళనీ షేర్ చేసుకునే మంచి పౌరులూ.. ఇలా ఎందరో ఉంటారు.  అయితే ఇవి రోం కథలు కాబట్టి, పాక్షికంగానే ఈ ప్రస్తావనలు వస్తుంటాయి. రోం నగరం లో జీవితం ప్రధానంగా చెప్పబడుతుంది.

లాహిరి - కదిలించని కథలెలా రాస్తుంది ?  కాలక్షేపం కోసం చదివే కథల్లో డాంటే వస్తాడు. ఒక టీనేజ్ అమ్మాయి కథ ఇది. ఆమె ప్రాణ స్నేహితురాలి బాయ్ ఫ్రెండ్, ఈమె పై ప్రేమ వ్యక్తం చేస్తాడు. కానీ దానివల్ల ఈమె ప్రాణ స్నేహితురాల్ని కోల్పోతుంది. అటు ఆ ప్రేమికుడూ తను చేసిన పనికి విచారించి, ఈమెకు దూరమవుతాడు.    అదంతా ఎలా వుంటుందంటే,  బాల్యం లో   ఈ పిల్ల ఒంటరిగా ఇంటి వెనక పెరటి అడవిలో ఆడుకునేటప్పుడు ఒకసారి నేల మీద మన్నులో ఉన్న  ఒక మాదిరి సైజ్ రాయి ని తొలగించి చూస్తుంది.

దానికింద వానపాములూ, పురుగులూ వంటి (ఈమె అక్కడ లేవనుకున్న) జీవరాశి లుకలుకలాడుతూ కనిపిస్తుంది.  వాటిని చూసి ఈ పిల్ల ఆ రాతిని మళ్ళీ ఎక్కడ తీసిందో అక్కడే జాగ్రత్తగా పెట్టేస్తుంది [వాటిని డిస్టర్బ్ చెయ్యకుండా].   ఈ  స్నేహితురాలి బాయ్ ఫ్రెండ్ తన టీనేజ్ అయోమయం లో,  అచ్చు 'తన లో లేవనుకున్న ఫీలింగ్స్' ని   ఒక ప్రేమలేఖ రాసి, ఆమె సరిగ్గా ఆ రాయిని తొలగించి చూసినట్టు, తనలోకి తొంగి  చూసునట్టు ఊహించుకుంటుంది.   ఈమె హృదయ స్పందన వినేసి, మళ్ళీ రాతిని మూసేసి వెళ్ళిపోతాడు ఆ అబ్బాయి.  అతను ప్రేమలేఖ లో రాసిన మారు  పేరు 'డాంటే'.  ప్రేమ పోతే పోయింది గానీ 'డాంటే'  ఆమెను ఆకర్షించేస్తాడు.   ఇక ఈ పిల్ల తండ్రి చదువుకొమ్మన్న సైన్స్ ని వదిలేసి, డాంటే నే చదువుకుంటుంది యూనివర్సిటీ లో.. ఈ కథ నాకు చాలా నచ్చింది.  ఇది కూడా ఇమిగ్రెంట్ కుటుంబమే (బహుశా ఇండియన్).

ఏదో చదివించే గుణం ఉంటుంది లాహిరి లో.    మా స్నేహితుల్లో  ఒకమ్మాయి, కాఫీ తాగడాన్నీ, డాబామీద ఆరేసిన బట్టల్ని తీసుకురావడాన్ని కూడా కవితాత్మకంగా,  తాద్యాత్మంగా చెప్తూండేటపుడు,   ఆమె జీవితోత్సాహాన్ని చూసి ఎంత మెచ్చుకుంటూ, నవ్వుకునేదాన్నో గుర్తొస్తుంటుంది ఈ కథలు చదివితే!   ఈ మధ్య, వయసుతో పాటూ, రచయిత్రీ, నేనూ ఎంతో మారాం.  కరుడు కట్టిన రచనా విధానాలనుండీ, లేత కొబ్బరి జున్ను లాంటి  మనసులున్న మనుషుల కథలు చదవడం పెద్ద ఉపశమనం.    చాలా మటుకూ శరణార్ధుల కథలే.    రోమన్ కథ లనగానే రొమాన్స్ ని ఊహించుకుంటే దెబ్బ తగులుతుంది.    ఒక్కోసారి కష్టమైన జీవితాన్ని నమ్మకంతో  ఈదడమే రొమాన్స్. 

 ***