హైదరాబాద్ లో రోడ్ దాటడం మీద చిన్న జోక్ లాంటి నిజం.
Pages
29/05/2008
28/05/2008
అంతరంగాలు
రాత్రి నాకొక కల వచ్చింది. భయంకరమైన కల. న్యూక్లియర్ డీల్ త్రూ అయిపోయింది. ఆంధ్రా వాటాగా, తెలంగాణా లో మొదటి పవర్ ప్లాంట్ పెట్టారు. ఎలక్ట్రిక్ కార్లూ, ట్రాములూ నడుస్తున్నాయి హైదరాబాదులో. పవర్ ప్లాంట్ పెట్టారు కాబట్టి తెలంగాణా అంతా విపరీతంగా చెట్లు నాటారు. ఆ చెట్లకి గోదావరి నుంచీ, కృష్ణ నుంచీ తీసుకొచ్చిన జలాలతో పోషణ అందిస్తున్నారు. దక్కన్ ప్రాంతం అంతా చల్లగా అయిపొయింది.
కోస్తా అంతా సముద్రం నుంచీ తీసి, శుద్ధి చేసిన మంచి నీటితో వ్యవసాయం చేస్తున్నారు. రాయల సీమ లో ఫాక్షనిస్తులు అంతా, బుద్ధి తెచ్చుకుని తిరుపతి లో చిన్నజియ్యర్ స్వామి మఠం లో చేరిపోయారు. హైదరాబాద్ లో ఊరు పొడుగునా ఎలెక్ట్రిక్ ట్రైన్లు నడుస్తున్నాయి. చవక లో రవాణా సాధనాలు లభిస్తున్నాయి కాబట్టి ఆటోలను నిషేదించారు. ట్రాఫిక్ సమస్య తీరింది. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో, బేస్మెంట్ లో ట్రైన్ స్టేషన్ కట్టారు. అక్కడ ట్రైన్ పట్టుకుని, రాష్ట్రం లో లేదా.. హైదరాబాద్ జంట నగరాల్లో.. ఎక్కడకన్నా వెళ్లొచ్చు!
చిరంజీవి, చంద్ర బాబు, జయప్రకాష్ నారాయణ కలిసి రాజకీయ కూటమి పెట్టారు. ఎలా అయినా కాంగ్రెస్ ని గద్దె దించాలని రవీంద్ర భారతి బయట బహిరంగ సభ లో కఠినశపధం చేసారు. బోల్డంత బెట్టింగ్ జరుగుతుందని ఐపీఎల్ మాచుల్ని నిషేధించారు. చెత్త సినిమాలు తీసీ తీసీ విసిగిపోయారని నిర్మాతలకూ, దర్సకులకూ బ్రేక్ గా - తెలుగు సినిమాల్ని కూడా కొన్నాళ్ళు నిషేధించారు. పిల్లలూ, పెద్దలూ కలిసి మెలిసి సాయంత్రాలు ఆటలూ, వాకింగులూ అయాక, ఇల్లు చేరి, చదువుకుంటున్నారు.
రాష్ట్రం లో ''హరిత విప్లవం - ౨'' మొదలయింది. బియ్యం, నూనె, కూర గాయలూ, పప్పు ధాన్యాల ధరలు తగ్గుముఖం పట్టాయి. కరెంట్ ఇష్టం వచ్చినంత ఉంది కాబట్టి, వ్యవసాయానికి నీళ్ళ కరువు లేదు. దూర ప్రాంతాలనించీ కూడా నీరు తెప్పిస్తున్నారు - అంచెలలో - పైపుల ద్వారా, ప్రాజెక్ట్ ల ద్వారా ! రైతులందరికీ మంచి ఒళ్టేజీ తో ఉచిత విద్యుత్ ఇస్తున్నారు. పల్లెటూళ్ళలోఇష్టం వచ్చినన్ని బడులూ, ఆస్పత్రులూ కట్టిస్తున్నారు. అన్నింట్లో ప్రగతి తన్నుకొచ్చేసి కనిపిస్తూంది. ముఖ్యంగా అందరూ మూడు పూటలా అన్నం తింటున్నారు. చిన్న పిల్లలంతా చదువు కుంటున్నారు. పిల్లలకు ఎవరూ పని ఇవ్వట్లేదు. పని కోసం వస్తె, స్కూల్ లో చేర్పిస్తున్నారు.
వంట గాసు కనెక్షన్లు అందరూ వాపసు చేస్తున్నారు. ఇపుడు ఇళ్ళల్లో కరెంటు స్టవ్ లు అందుబాటులోకి వచ్చాయి. కాలుష్యం తగ్గింది. పట్నాలలో కూడా స్వచ్చమైన గాలి అందుబాటులో ఉంది. ప్రజలు హాబీ గా కాలనీ లలో, పార్కులు కట్టించుకుంటున్నారు. చెట్లు నాటుతున్నారు. అయినా హైదరాబాదు వేడెక్కి పోతుందని భయపడి వారానికో రోజు బత్తీ-బంద్ చేస్తున్నారు. ఊరంతా రీసైక్లింగ్ పెద్ద ఫాషన్ అయిపోయింది.
...........*(^%&^*%^&£%$£...... $$$£$"£"£$%$£
.... ....."$"$^$%^&%^*^&*^&*%*.....
.........^&*%^&$%^£$$%£&*********
...హుష్ ! తెలివోచ్చి బంగారం లాంటి కల చెడిపోయింది.
(సుమన్ + ప్రభాకర్ ఈ టీవీ ని వోదిలేస్తున్నారని విని.. ఆ అలౌకిక ఆనందంలో నిద్దరోవటం వల్ల వచ్చిన కలవరింతలు ఇవి.. తప్పట్టుకోకుండా ఈ ఊహా - భరిత ప్రేలాపన ని క్షమించండి)
కలత
నువ్వోస్తావని సాయంత్రం అంతా ఎదురు చూసాను
చెట్ల నీడన పిచ్చుకల తో కబుర్లు చెబుతూ !
చల్ల గాలి తెమ్మెరలు కదిలిస్తున్న
ఆలోచనల తో ఆటలాడుతూ !
రావేమో లే అని అనిపించి నిట్టూర్చేసరికీ,
చుట్టూ నిరాశలా కమ్ముకుంది చీకటి.
రాత్రి లోగిల్లోకి ఎదురు చూపుని నెట్టి -
'వస్తే లేపుతావు లే!' అని - మత్తు గా నిద్ర పోయాను.
నువ్వు రానే లేదు !
దీర్ఘ - సుషుప్తి లోంచీ నన్ను లాగడానికి!
27/05/2008
శుభ అభినందన
24/05/2008
విమానం Vs. వోల్వో బస్సు!!
అదే ప్రైవేట్ బస్సు అయితె.. సిటీ మధ్య లో రాత్రి పూట ఎక్కితే, తెల్లారే సరికి.. బెంగుళూరు గాని హైదరాబాద్ అయినా కనీసం ఏదైనా సెంటర్ లో (సిటీ మధ్యలో) దిగొచ్చు. ఇల్లు చేరేందుకు ఎవరన్నా ఫ్రెండ్ కు ఫోన్ చేసి పిలిచినా.. ఎక్కువ మైండ్ చెయ్యకుండా లిఫ్ట్ ఇచేందుకు వస్తారు. ఆటో కో , టాక్సీ కో కూడా.. మరీ దోచిపెట్టేయ్యనక్కర్లేదు. తక్కువ లగేజీ ఉంటే, సిటీ బస్సు పట్టుకోవచ్చు.
హైదరాబాదు లో ఇపుడు ఎయిర్ పోర్ట్ నుంచీ మా ఇంటికి వెళ్లడానికి టాక్సీ కి ఎనిమిది వందల నుంచీ వెయ్యి రూపాయలు పడుతుందంట. విమాన ప్రయాణం అందరికి అందుబాటులోకి రావలసింది కాస్తా.. కొండెక్కి కూర్చుంటుంది.
23/05/2008
వర్షం - నేనూ!
ఈ రోజు వర్షం పడింది! ఆకులూ.. అలములూ, వీదులూ.. శుబ్రంగా తడిచాయి. అసలే పొద్దుట్నించీ డల్ గా ఉన్న వాతావారణం.. మరింత చిరాగ్గా మారింది. నేను కిటికీ లోంచీ చూస్తూ ఇంట్లోనే కూర్చున్నాను. చెయ్యడానికి పని ఉంది.. కానీ చెయ్యబుద్ధి కావట్లేదు ! బద్దకం కాదు.. ఇల్లు గుర్తోస్తూంది! వర్షం పడితే.. ఇంట్లో ఉన్నట్లయితే, హాయిగా ఫ్యాన్ స్పీడ్ లో పెట్టుకుని, మంచం మీద దుప్పటి కప్పుకుని పడుకుని.. చెల్లి తో కబుర్లో, పుస్తకం చదవటమో చేసేదాన్ని. వర్షానికి బయట దొరికిపోతే.. మాత్రం చిరాకు.
నాకు వర్షం అంటే ప్రత్యేక అభిమానం అదీ లేదు. వర్షం వచ్చే ముందు మట్టి వాసన మాత్రం ఇష్టం. వర్షం పడేటప్పుడు నేను ఇంట్లో ఉంటేనే ఇష్టం. వైజాగ్ లో ఐతే.. దూరం నుంచీ కనిపించే కొండల మీద వర్షాన్ని చూడొచ్చు. కమ్ముకోస్తున్న మేఘాల్ని చూస్తూ, టీ తాగొచ్చు. హైదరాబాద్ లో సరిగ్గా.. ఆఫీసుకి వెళ్లేటప్పుడు, లేదా ఆఫీసు నించీ తిరిగీ వస్తున్నప్పుడూ వర్షం పడుతుంది. వర్షం లో రోడ్లూ.. ఆగిపోయే ట్రాఫిక్! రాత్రంతా వర్షం పడితే.. వెచ్చగా ఇంట్లో పడుకున్నపుడు, ఇళ్లు లేని బీద వాళ్ల కష్టం తలుచుకుని; పాపం వాళ్ళంతా ఎలా సర్దుకున్నారో..?! అనిపిస్తుంది.
వర్షం పడితే.. అయినవాళ్లు దగ్గర ఉన్నప్పుడే ఆనందం. ఒక్కరూ.. ఒంటరులు.. ఎలా ఆనందిస్తారు ? వర్షం పడుతుంటే.. మిర్చి బజ్జి తినాలనిపిస్తుంది! కానీ.. అందరం కలిసి ! వానలోస్తే.. తోట పని చెయ్యాలనిపిస్తుంది. మనిషికి తల దాచుకోవడానికే స్థలం లేదు. తోట ఎక్కడిది ? వర్షం పడితే, విపరీతంగా ఆనందించే అక్కయ్య గుర్తొచ్చింది. వేసవి కాలంలో..వైజాగ్ లో .. విపరీతమైన వేడికి తట్టుకోలేక పోతుంటే, సాయంత్రానికి ఫెళ ఫెళ లాడుతూ కురిసే వర్షం గుర్తొచ్చింది. ఉరుములకూ, మెరుపులకూ.. ఎప్పుడు వానకి పేలిపోయే ట్ట్రాన్స్ఫార్మర్ ! రాత్రంతా.. ఆకాశం చేసే గోల కి నిద్ర పట్టకపోవటం గుర్తొచ్చింది. జ్ఞానాపురం జంక్షన్ లో మునిగిపోయే వీధులు గుర్తొచ్చాయి.
పచ్చని పచ్చిక బయళ్ళూ.. చెట్లూ, చేమలూ నిండి ఉన్నా .. కొండలు లేని దేశం ఇది. అనుకోకుండా అప్పటికప్పుడు చినుకుల దారాలు నెల వైపు ప్రయాణిస్తూ వుంటాయి. ఎప్పుడూ వానే.. ఎప్పుడూ గొడుగు కావాల్సిందే! తరచూ చూస్తున్న వానని చూసి కాదు ఈ విసుగు! రోజు రోజుకీ ఇంటి కి దూరంగా..వెళ్ళిపోతుంటే, వర్షం, వెన్నెలా.. గొప్పగా అనిపించడం మానేశాయి. మళ్ళా కాలం లోకి - 'ఆదిత్యా 365' లో లా వెళిపోయి .. చిన్నప్పుడు స్కూల్ రోజుల్లోకి వెళ్లి అక్కడే ఉండిపోవాలనుంది. ఒక రోజు విశాలాక్షి నగర్ లో, ఒక కసిన్ తో కలిసి, కాలి నడకన, బాటా స్లిప్పర్లు వేసుకుని, జారి, పాకి, పడీ, లేచి... కొండెక్కి, అక్కడ్నించీ సముద్రాన్ని చూసాను. ఆ రోజుల్లోకి !
నా తో నేను విసిగిపోయి.. నా నుంచీ నేనే పారిపోయి.. ఇక్కడ్నించీ మాయం అయ్యి.. అక్కడికి వెళ్లిపోయి.. సముద్రం ముందు అల్చిప్పలూ, గవ్వలూ ఏరుకుంటూ... ఎవరి కోసమో ఎదురు చూడాలని అనిపిస్తుంది.
22/05/2008
Ice cream ( Eggless ) Making Made Easier
ఐస్ క్రీమ్.. ఎగ్ లేకుండా.. సులువుగా ఎలా చెయ్యొచ్చో చూసారు కదా. యూట్యూబ్ లో ఈ వీడియో పోస్ట్ చేసిన ఆయన పేరు శ్రీవత్స. ఈయన చానల్ లో.. రక రకాల వీడియో లు వంటకాల నుంచీ ''వరవీణా మృదుపాణీ'' కారేయోకే ల దాకా.. ఇంగ్లిష్ పోఎట్రీ రెండిషన్లూ చూడొచ్చు. మంచి మంచి 'మేడ్ ఈజీ' పద్ధతులలో మురుకులూ.. నాన్లూ.. కేకు, కాఫీ.. అన్నీ చేసి చూపిస్తారు. మనసు పాడితే వర్డ్స్ వర్త్ కవితలు చదివి వినిపిస్తారు. నాకు నచ్చుతారు. :D
20/05/2008
నీ తోనే ..!
ఊరికే.. సరదాగా ఈ మంచి పాట చూడండి. ఈ బాణీ, పాట, డాన్స్ అన్నీ గమ్మత్తుగా ఉంటాయి. ఎప్పుడన్నా మనసు పాడయితే ఈ పాట చూస్తే భలే మూడ్ చేంజ్ అవుతుంది. చిరంజీవి కనుక మన రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఐతే.. మనకు ఒక లాభం ఉంటుంది. మా టీవీ లో నూ.. ఈ టీవీ లోనూ తెగ శనివారం, ఆదివారం, పండగలప్పుడు తప్పకుండా చిరంజీవి సినిమాలు చూడొచ్చు. (కాంగ్రెస్ వారు అధికారం లో ఉన్నప్పుడు ఏ జాతీయ సెలవు దినం అయిన.. 'గాంధీ' సినిమా చూసాం కదా! అలా!)
Dashavatar - mohini promo
ఈ యానిమేటేడ్ సినిమా చూద్దామని ఎదురు చూస్తున్నా. చిన్నప్పుడు 'బాల భారతం'.. లాంటి ప్రత్యేకంగా పిల్లల కోసం తీసిన సినిమాలు ఉండేవి. ఇప్పుడు హనుమాన్, ఘతోట్కచ్ (ఎన్ని సార్లు టైప్ చేసినా.. ఇలానే వస్తుంది..), లాంటి పురాణ కదల హీరోలతో పిల్లల కోసం సినిమాలు రావడం చాలా బావుంది. వాల్ట్ డిస్నీ వారి రామాయణం చూసారా..''అసలు ఎంత కష్టపడి ఈ సినిమాలు తీస్తారో.. అంత మజా ఏ మామూలు సినిమాలు ఇస్తాయి !?'' అనిపిస్తుంది. తింటే గారెలు తినాలి, వింటే భరతం వినాలి, చూస్తే ఇలాంటి యానిమేటేడ్ సినిమాలు చూడాలి!
19/05/2008
తప్పక చూడండి - స్విట్జర్లాండ్!
ముఖ్యమైన పర్యాటక స్థలాలలో ఎక్కడ చూసినా భారతీయులూ, తమిళులూ, తెలుగు వారూ, గుజరాతీ, పంజాబీలు... అసలు విదేశం లో ఉన్నామా.. ఇండియా లో ఉన్నామా అని అనుమానం కలిగింది. స్విట్జర్లాండ్ లో కొన్ని విషయాలు చాలా ప్రత్యేకంగా ఉన్నాయి. అందరికీ తెలిసిన ప్రకృతి అందాలూ, స్విస్ బాంకులూ, గడియారాలూ, పాల ఉత్పత్తుల తో పాటూ, అక్కడి జన జీవనం, సంస్కృతీ కూడా ప్రత్యేకంగా అనిపించాయి. ఎవరు వెళ్ళినా ఒకే కబుర్లు చెప్తారో - బోర్ అనుకుంటున్నారా? మరి నాకు నచ్చిన విషయాలు కొన్ని - వినండి.
మేము చూసిన ప్రదేశాలూ, తిరిగిన కొండా, కోనా, చరిత్రా, ట్రావేలాగూ రాసే కన్నా.. అందర్నీ.. తప్పకుండా చూడండీ అని చెప్పడం సుళువు. ఎందుకంటే.. ఆ అనుభవాల్ని కవితాత్మకంగా, రసాత్మకంగా.. ఇంకా నానా రకాలుగా అందంగా చెప్పడం నాకు రాదు. (మా తెలుగు అయ్యోరు - ఛందస్సు సరిగా చెప్పలేదు.. పద్యాలల్లడం అసలు చాత కాదు!!) అక్కడ చాలా ప్రదేశాల్లో చూసిన భారతీయుల్ని.. ప్రత్యేకంగా ఇండియా నుంచీ హాలీడే కు వచ్చిన కుటుంబాలనూ చూసి, చాలా ఆనందం కలిగింది. COOP లాంటి డిపార్ట్మెంట్ స్టోర్లలో చాలా మంది తెలుగు వారు తారస పడ్డారు.
మొత్తం మీద చాలా ఆశలు పెట్టుకుని వెళ్ళినందుకు స్విట్జర్లాండ్ మంచి అనుభూతులనే మిగిల్చింది. ఇంకా ఇంకా.. ఇంకా ఇంకా.. ఇంకో సారి వెళ్లి వద్దామని బోల్డన్ని కోరికలు పుట్టించింది. ఇంకో సారి వెళ్ళే అవకాశం వస్తే తప్పకుండా వెళ్లాలని నిర్ణయించుకుని తిరిగి వచ్చాం.
16/05/2008
O2 ad - పాట విన్నారా ?
టీవీ లో నాకు ఇష్టమైనవి ఏడ్ లు. ఈ O2 ఏడ్ ఈ మధ్యే టీవీ లో చూసా.. ఏడ్ మాట పక్కనుంచండి. ఏడ్ బానే ఉంటుంది. ఈ నేపధ్యసంగీతం వింటే.. ఒక హిందీ సినిమా పాట గుర్తొచ్చి, ఎప్పుడు ఈ ఏడ్ వచ్చినా చెవులప్పగించి వింటాను. ఇది ఒరిజినల్ గా ఒక ఇరిష్ ఫోక్ సాంగ్ అంట. కానీ ఈ బాణీ తో ఒక హిందీ పాట మాత్రం ఉంది. మనది స్వతహాగా నూరు పాళ్ళు మట్టిబుర్ర కాబట్టి, ఎంత ప్రయత్నించినా పాట, లిరిక్స్ గుర్తు రావట్లేదు. ఎన్నాళ్ళో అయింది ఆ పాటలు విని. అందుకే కాస్త హెల్ప్ కావాలి. ఎవరైనా కాస్త ఈ పాటని గుర్తు చేసి నాకు సాయం చేస్తారా ?
15/05/2008
పట చిత్ర కళ
ఇది ఒరిస్సా రాష్ట్రానికి చెందిన మరో విశేషం. చూడగానే కలంకారీ ని గుర్తు చేసే, చాలా ఖ్యాతి చెందిన ఈ చిత్ర కళ పేరు 'పట చిత్ర'! మా తోటికోడలు చాలా ప్రత్యేకంగా పుట్టింటి నుంచీ తెచ్చుకుని, అపురూపంగా డ్రాయింగ్ హాల్లో అమరుస్తున్నప్పుడు ఈ 'పట చిత్ర' ని చూసి, చాలా ముచ్చట పడ్డాను. ఆవిడ చెప్పగా విన్న ఈ పట చిత్రాల కధ ని, కాస్త నా పరిశోధన జోడించి, వీలయినంత క్లుప్తంగా చెప్తాను.
సాధారణంగా, కొన్ని ప్రాంతాల కళా రూపాల్లో సారూప్యత కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. ఉదాహరణ కు, చాలా వరకూ మన పోచంపల్లి డిజైన్లూ, ఒరిస్సా కు చెందిన సంబల్ పురి డిజైన్లూ ఒకే పోలిక తో ఉండటం గమనించాను. అలానే ఈ 'పట చిత్ర' కూడా మన కలంకారీ లా బట్ట (కాన్వాస్) మీద వేసే వర్ణచిత్రమే. ఈ కాన్వాస్ అలాంటి ఇలాంటి కాన్వాస్ కాదు. ఇది పట్టు (tusser silk) కాన్వాస్. రెండు పట్టు వస్త్రాలను ఒకదానికొకటి అతికించి, ఈ కాన్వాస్ ను మందంగా తయారు చేస్తారు. వస్త్రాలను ఎలా అతికిస్తారో తెలుసా.. చింతపిక్కల తో తయారు చేసిన గ్లూ తో! ఇవి కాన్వాస్ ని గట్టిగా పట్టి ఉంచుతాయి. ఈ అతికించిన వస్త్రాన్ని బాగా ఎండ పట్టించాక తయారయిన ఈ కాన్వాస్ నే 'పట' అంటారు.
అన్నీ సహజ సిద్ధంగా ప్రకృతి లో దొరికే రంగులనే వాడతారు. ఈ రంగులని బంక మట్టి, సున్నపు రాయి, ఎర్ర రాళ్ళూ, శంఖాలూ, బొగ్గూ, ఆకులూ, అలములూ, ఇంకా, ఒరిస్సా సముద్ర తీరం అంతా సంవృద్ధిగా దొరికే గవ్వలూ లాంటి మామూలు పదార్ధాల నుంచీ తయారు చేస్తారు. ఈ చిత్రాలను వేయడానికి వాడే బ్రష్షులు కూడా 100% 'ఆర్గానిక్'. ఈ కుంచెలకు కావలసిన జుట్టు.. గేదెల మెడ భాగం నుంచీ తీస్తారు. ఇంకా నాజూకు కుంచెలకు ఎలుకల రోమాలను వాడుతారు. కొన్ని వెజ్ కుంచెలు కూడా ఒక రకం మొక్క వ్రేళ్ళ నుంచీ తయారుచేస్తారు. రంగులని రకరకాల పద్ధతుల ద్వారా.. తయారుచేసుకున్నాకా వాటిని కొబ్బరి చిప్పల తో తయారు చేసిన పాత్రల (బౌల్ లు) లోనే కలుపుతారు.
పట చిత్రాల లో 'కలంకారీ' మాదిరిగానే ఎక్కువగా భగవంతుని లీలలూ... హిందూ పురాణ, ఇతిహాసాల ఇతివృత్తాలు ఎక్కువగా చిత్రీకరించబడతాయి. ఆయితే, మధుబని, గోండ్ లాంటి జానపద చిత్రాల లానే ఈ పట చిత్రాల లోనూ 'జానపదం' తొంగి చూస్తుంది. మతం, దేవుడూ, లీలలూ, నమ్మకాల తో పాటూ జానపదుల, రైతుల, జాలర్ల, వేట గాళ్ళ జీవితం, వారి కష్టాలూ, ఆనందాలూ, పండగలూ, ఆనాటి సాంఘిక జీవనం అన్నీ కూడా కనిపిస్తాయి. ప్రతీ ఒక్క అంశం, ప్రత్యేక శైలిలో ఒకే నిర్డుష్టతతో చిత్రీకరించబడడం ఈ పట చిత్రాల ప్రత్యేకత.
క్లిష్టమైన ప్రక్రియలలో.. అంచెల వారీ గా తయారయ్యే ఈ పట చిత్రాలు కూడా కలంకారీ లానే బాగా ఆదరణ పొందుతున్నాయి. రాజస్థానీ పెయింటింగ్‌ల లా డ్రాయింగ్ రూంల లో ఆవిష్కృతం అవుతున్నాయి. ఆయితే ఎంత గొప్పదనం లేక పొతే... ఈ సాంప్రదాయ కళలు ఇంకా దేశంలో కొనసాగుతున్నాయో అని ఆశ్చర్యం కలుగుతుంది. ఆ గొప్పతనం ఈ పట పెయింటింగ్ ని చూడగానే చూచాయగా తెలుస్తుంది.
14/05/2008
కలం - ప్రేమ
ఈ రోజు మా ఆయన షర్టు పాకెట్ లోంచీ తొంగి చూసిన ఒక పెన్ను నా దృష్టినీ, మనసునూ ఆకర్షించేసింది. పార్కర్ పెన్నులా ఉంది గానీ.. రాసినప్పుడు జెల్ పెన్ లా రాసింది. రాసింది చూస్తే... ఇంకుపెన్ను తో రాసినట్టు అనిపించింది. ఎప్పుడైనా పెన్ను కనిపించగానే టెస్టింగ్ చెయ్యడానికి నా పేరు రక రకాలుగా రాసి, మురిసిపోవడం నా అలవాటు.. ఈ పెన్ను తో రాస్తే.. నా హ్యాండ్ రైటింగ్ అదిరింది! 'ఇంక ఈ పెన్ను నాది'. అని డిక్లేర్ చేశా. పెన్ను కొట్టేసిన ఆనందం లో ఉండగా, నా పోయిన పెన్నులన్నీ గుర్తొచ్చి మనసు మూలిగింది. సరిగ్గా అప్పుడే పెన్నుల మీద నా అభిమానాన్ని... ఇంకోసారి.. నా బ్లాగ్ లో ప్రకటించాలని అయిడియా.. వచ్చింది. నా చేతి లోంచీ జారిపోయిన.. అసంఖ్యాకమైన పెన్నులను తలచుకుంటూ.. మొదలు పెడుతున్నా.
పెన్ను లంటే నాకు చాలా అభిమానం. పెన్ను నా బలహీనత! అయితే అన్ని పెన్నుల కన్న ఇంకు పెన్నులు మేలయా..! అనే ఓల్డ్ ఫేషన్ మనస్తత్వం నాది. చిన్నప్పుడు చేతి వేళ్ళ నిండా ఇంకు అలముకునేదని ఆ రోజుల్లో హేట్ చేసిన ఇంకుపెన్ను, ఇప్పుడు నా ఫస్ట్ లవ్ అయిపోయింది. చిన్నప్పుడు బాల్ పెన్ను కోసం పీకిన మనసు ఇప్పుడు ఇంకు పెన్ను కోసం పీకుతుంది. పెన్నులు పోవటం స్కూలు, కాలేజీ ల లో ఉన్నా.. ఆఫీసులో పోవటం అనేది ఒక విస్తృతమైన విషయం.
ఆఫీసులో ఎన్ని ఇంకుపెన్నులు (వాటితో పాటూ బాల్ పెన్నులు కూడా.. ) పోయాయో తలుచుకుంటే.. హృదయం గింజుకుపోతుంది. నాకు మతిమరుపు.. నిర్లక్షం.. లాంటివేమి లేవు. కానీ ఎలానో పెన్నులు మాయం అవుతుంటాయి. ఎవరికో అవసరం వస్తుంది.. నా డెస్క్ దగ్గర పెన్ను కనిపిస్తుంది.. పనయ్యాక, (మర్చిపోయి..ట!) జేబు లో పెట్టుకుని వెళ్ళిపోతారు. కొందరు ఆరోజు పెన్ను తీసుకుని రాకుండా.. (ఆఫీసుకి పెన్ను తేకుండా ఎలా వస్తారో..) వచ్చి.. ఎపుడైనా పెన్ను అవసరం పడుతుందేమో అని అప్పు / అరువు తీసుకుంటారు. మర్నాడు మనం 'మన పెన్ను' విషయం గుర్తుచేసేదాకా ఆ విషయం గుర్తుండదు. 'ఆ! అవునవును..! నీ పెన్ను తీసుకున్నాకదా ! అయ్యో ఎక్కడో పెట్టాను. ఉండుండు వెతికేసి ఇప్పుడే ఇచ్చేస్తాను..'.. అన్నారా.. ఇంక అంతే!! పెన్నుకి మనసులోనే నివాళులు అర్పించుకోవచ్చు.
ఒక్కో సారి సంతకం చెయ్యడానికి బాసు తీసుకుంటాడు. వాపసు చెయ్యకుండానే వెళిపోతాడు. అడగడానికి కొత్తలో మొహమాటపడేదాన్ని. ఇపుడు మాత్రం... ''నా పెన్ను.. నా పెన్ను..'' అని వెంటపడకపోతే, ఎంత గొప్ప ఆఫీసరైనా వాపసు చెయ్యడని తెలుసుకున్నాను. అసలు ఇలాంటి పెన్ను వాపసు చెయ్యకపోవడాలు - ఉద్దేశ్యపూర్వకంగా జరగకపోయినా, అలవాటుగా మాత్రం జరిగిపోతుంటాయి. అక్కడే నా లాంటి అమాయకులు దెబ్బ తినేస్తుంటారు.
వీటిల్లో ముఖ్యంగా ఇంకు పెన్ను పోయాకా.. నా మనసు నాలుగు రోజుల దాకా కీచు కీచు మని ఏడుస్తుంది. ఆ నాలుగు రోజుల సంతాపం అయిపోయాక.. స్టేషనరీ షాపుకి వెళ్లి ఇంకు పెన్ను అడుగుతాను. ఆ షాపు అబ్బాయి... ఎన్ని సార్లో.. 'ఇపుడు ఇంకు పెన్నులు రావట్లేదు మేడం..!' అంటాడు. నసిగి నసిగి ఆ కామ్లిన్ ఇంకు పెన్నే కొనుక్కుంటాను. ఆ పెన్ను నా చేతి కింద నలిగే దాకా.. ఆ పెన్ను మీద ఒక్కో సరి మనసు రాదు. ఒక్కో సారి చూడగానే..(రాయ గానే) నచ్చుతుంది. అదేంటో..వెంటనే... అందరికీ అదే పెన్ను నచ్చుతుంది. వారం తిరిగే సరికీ పెన్ను మాయం!
నా దృష్టి లో .. పెన్నులు రెండు రకాలు. కొన్ని పెన్నులతో రాస్తే.... నా చేతి రాత ముత్యాల్లా... పొందికగా.. అదిరిపోయేలా ఉంటుంది. కొన్ని పెన్నులు .. నా ఎల్ కే జీ రైటింగ్ ని కళ్ళ ముందు ఉంచి.. బాల్యాన్ని ఆవిష్కరిస్తాయి. ఈ మొదటి రకం పెన్నులను పోగొట్టుకోవటం నాకు ఇష్టం లేని పని. అవి పొతే.. కొన్ని క్షణాలు నా జీవితం నిలిచిపోతుంది. సముద్రం లో కెరటాలు బండలకు కొట్టుకొకుండా.. అలానే ఆగిపోతాయి. పక్షులు టేక్ఆఫ్ పోసిషన్ లో స్టిల్ అయిపోతాయి. హృదయం మూగగా రోదిస్తుంది.. ఇంకా రకరకాలు జరుగుతాయి. ఈ మొదటి రకం పెన్నులు.. నా జీవితం లో... అమూల్యమైనవి. అవి లేని జీవితం..ఊహించుకోలేను! కానీ నిర్దాక్షిణ్యం అయిన ఆ క్షణాలని దాటి వచ్చాక.. ఇంకో మంచి పెన్ను కొనుక్కున్నాక.. కాస్త శాంతి లభిస్తుంది.
డెస్క్ దగ్గర - ఒక పార్కర్ ఇంకు బాటిలు - నా ట్రేడ్ మార్కు. కానీ ఆ ఇంకు పెన్ను వంక అందరూ మ్యూజియం లో డైనోసార్ని చూసినట్టు చూడటం చూసి నా మనస్సు గాయపడుతూ ఉంటుంది. కాస్త క్లోజ్* (అనుకునే) అయిన కోలీగ్లు.. 'ఈ రోజుల్లో ఇంకు బాటిలు ఏమిటి మేడం..!' అని వెక్కిరిస్తారు. (* నాకు నిజంగా క్లోజ్ అయితె.. నా ఇంకాభిమానాన్ని అర్ధం చేసుకునే వారు..) అలాంటి సమయాల్లోనే మన నిజమైన స్నేహితులేవరో మనకు రూఢిగా తెలుస్తుంది. నిజమైన ఆప్యాయులైతే.. నా నల్లింకు బాటిలు లో ఇంకు ని వాళ్ల ఇంకు పెన్నుల్లోకి కాస్త వొంచుకుంటారు.
ఇప్పుడు కాస్త తెలివి మీరాను. ఇంకుపెన్నులయితే పోతున్నాయని, (అసలు ఇంకు పెన్నుల్ని అందరూ ముచ్చటపడి కొట్టేస్తుంటారు) బాల్ పెన్నులు తెచ్చి, వాటి కేప్ లు తీసి పారేసి, వాటితో ఆఫీసు డెస్క్ ని అలంకరించడం మొదలుపెట్టా. బాల్ పెన్ను అయినా, కేప్ ఉంటే తప్పకుండా పోతుంది. కేప్ లేని పెన్ను పోవడం అరుదు.
11/05/2008
అబ్బాయిల నృత్యం !
ఈ పిల్లలందరూ అబ్బాయిలు. అమ్మాయిల వేషం లో నృత్య ప్రదర్సన ఇస్తున్నారు. ఈ నృత్య రీతి పేరు 'గోటిపువ'. ఇది ఒరిస్సా లో పూరీ కి చెందిన జానపద నృత్యం. ఒరియా లో.. 'గోటి' అంటే ..'ఒక' లేదా 'ఒంటరి', 'పువ' అంటే 'అబ్బాయి' అని అర్ధం. అంటే.. పేరుని బట్టే ఇది అబ్బాయిల నృత్యం అని చెప్పొచ్చు అన్నమాట. మొదటి సారి 'గోటిపువ' ప్రదర్సన ఢిల్లీ లో చూసాను. గణతంత్రదినం సందర్భంగా.. Talkatora Indoor Stadium' లో.. జానపద నృత్య పండగ(Folk Dance Festival) జరుగుతుంటే, ఫ్రెండ్స్ తో కలిసి నోరెళ్ళబెట్టి చూసాను. ఈ పండగ లో.. వివిధ రాష్ట్రాల జానపద నృత్యరీతుల ప్రదర్సన జరిగింది. గోటిపువ సంగతీ కనీ వినీ ఉండక పోవడం వల్ల, మొదటి సారి చాల Thrill కలిగింది.
గోటిపువ చాలా acrobatic గా ఉంటుంది. ట్రూప్ లో కనీసం ౨౦ మంది చిన్నపిల్లలు.. రక రకాల పిరమిడ్ ఆకారాలూ.. మత్స్య, కూర్మ..అవతారాల లా అన్ని రకాల ఆసనాలూ. పక్షులనూ, జంతువులనూ అనుకరిస్తూ భంగిమలూ.... చేస్తూనే వుంటారు. ఒడిస్సీ కాస్ట్యుములలో ఉన్న ఈ పిల్ల లందరూ ఆడపిల్లలే అనుకుని.. అయ్యబాబోయ్ ఎన్ని ఫీట్లు చేస్తున్నారో అని.. ఎవరైనా పడిపోతారేమో అని...భయపడుతూ చూసాను. అంత చక్కగా.. సుకుమారంగా వున్నారు ఆ పిల్లలు. వాళ్ల కదలికల్లో, మేకప్ లో.. ఎక్కడా.. అబ్బాయిలని తెలియలేదు. ఆ తరువాత.. వ్యాఖ్యాత గోటిపువ నృత్యాన్ని గురించి కాస్త జ్ఞానబోధ చేసారు. ఈ డాన్స్ అబ్బాయిలకే పరిమితం. పూరీ లో పుట్టిన ఈ కళ, దేవదాసీ లకు ప్రత్యామ్నాయంగా, ఒక హిందూ మత విశ్వాసానికి ఆధారంగా జరిగింది.
ఒరిస్సా రాష్ట్రం లో ప్రధానమైన మతం.. వైష్ణవం. 'గోటిపువా' కళా కారులు, వైష్ణవ గాధలూ, పురాణాలూ, గాదలను, ముఖ్యంగా దసావతారాలనూ, రాసలీల నూ ప్రదర్శిస్తారు. అప్పట్లో పూరి మహారాజు ఆదేశాల మీదను ఈ 'గోటిపువ' కోసం బోల్డన్ని స్కూళ్ళూ వెలిసాయి, ఎందరో కళాకారులు తయారయ్యారు. అయితె, ఒకప్పుడు రాజులూ, జమీన్దారులూ ప్రోత్సహించిన ఈ నృత్య రూపం ఇపుడు రాజపోషణ లేక దాదాపూ అంతరించిపోయింది. ఇప్పుడు ఎవరో కొందరు మహానుభావుల వలన.. ఈ కళ గత పదేళ్ళ నుంచే వెలుగులోకి వచ్చింది. మగపిల్లలు - ఈ చిన్నపిల్లలు, ఎంత కష్టపడి ఎన్నాళ్ళు సాధన చేస్తే ఈ రకం నృత్యం చెయ్యగలరా.. అని అబ్బురం కలిగింది.
విశ్వ విఖ్యాతి చెందిన ఒడిస్సి కళాకారుడు గురు కేలూచరణ్ మహాపాత్ర, చిన్నప్పుడు ఈ గోటిపువ బృందం లోని సభ్యుడే.. జయదేవుని అష్టపదులను అభినయిస్తున్నప్పుడు ఆయన ఒక పురుషుడి లా అస్సలు అనిపించరు. మధుర భక్తి రసం ప్రధానంగా సాగే అభినయాల్లో.. ఆయనకు పెద్దపీట వెయ్యొచ్చు. యూట్యూబ్ లో 'గోటిపువ' వీడియోలు దాదాపు లేవు. చాలా ఇతర వెబ్సైట్ లలో ఉన్నాయి. వాటిని ఇక్కడ ఎలా అప్లోడ్ చెయ్యాలో నాకు తెలియలేదు.
(ఈ Folk Dance Festival లో ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన ''జడకోలాటం'' కూడా చూసాను. వేదిక మీద కోలాటం ఆడుతూ ఒక దూలానికి మధ్యలో వేలాడేలా కట్టిన తాళ్ల కింది కొసలని, తమ ముంచేతికి కట్టుకుని, వాటితో ఒక పెద్ద జడ ను అల్లే కళాకారులు.. అలానే.. రివర్స్ ఆక్షన్ లో.. చాలా రిధమిక్ గా.. చాలా వేగంగా డాన్స్ చేస్తూ సరైన సింక్రనైసేషన్ తో.. ఆ జడను విప్పేస్తారు.. .... ఢిల్లీ నుంచీ వచ్చాక.. అయ్యో! అవన్నీ మిస్ అవుతున్నాను)
ఒక మంచి ఘజల్ వింటారా ?
చిన్నప్పట్నించీ.. రేడియో లో ఈ పాట విన్నాకా .. పూర్తి పాఠం కోసం వెతికీ, కాసెట్ దొరకక.. టీనేజ్ నుంచీ ఇప్పటి దాకా.. పాట నేర్చుకున్దామని విశ్వ ప్రయత్నం చేసినా, 'మాన్సూన్ వెడ్డింగ్' సినిమా లోనూ. ఆశాభోంస్లే కొత్త ఆల్బం లోనూ వున్నా.. ఒరిజినల్ పాట కలిగించిన అలజడి కలగక.. విసిగిపోయాను.
పాకిస్తానీ ఘజల్ గాయని ఫరీదా ఖాన్నుం కు బోల్డంత పేరు తెచ్చిన పాట.. ఎన్నో సినిమాల్లో.. ఎన్నో కచేరీల్లో.. ఎన్నో కొత్త ఆల్బం ల లో.. ఎన్ని సార్లు విన్నా, ఇంకా వినాలనిపిస్తుంది. ఈ ఘజల్ (ఒరిజినల్) కు వీడియో తీసే సాహసం ఎవరూ చేయలేదనుకుంటాను. ఎందుకంటే. ఈ పాటను కళ్లు మూసుకుని ఆస్వాదించాలి.. అంతే!
యుట్యూబ్ లో ఒరిజినల్ పాట ఉంది. కానీ ఈ మధ్యనే.. ఈ చిన్న అమ్మాయి పాడిన పాట విన్నాను. ఎంత చక్కగా పాడిందో... అనిపించింది. కేవలం పాట వరకూ వినండి. చాలా బాగా పాడింది.
బాస్మతీ భోగం
పోయిన నెల లో, మేము గ్రాసరీ తెచ్చుకునే శ్రీలంకన్ షాపులో పనిచేసే తమిళ అబ్బాయిలు 'మీరు బియ్యం తీసుకోవాలంటే త్వరగా తీసుకోండి.. వచ్చే నెల నుండీ టిల్డా, కోహినూర్.. అన్నీ రేట్లు పెరగనున్నాయి' అని హెచ్చరిక చేసేరు. అప్పటికీ టైం లేక కాస్త ఆలస్యంగా వెళ్లి, స్టోర్ లో ఇండియన్ బియ్యం దొరకక, పాకిస్తానీ బ్రాండ్ బాస్మతీ బియ్యం తీసుకున్నాం. చూస్తుండగానే బాస్మతీ రేట్లు రెట్టింపు అయ్యాయి. ఆంధ్రా బియ్యం ఎపుడో గాని దొరకనపుడు, బాస్మతీ మీదే చాలా మంది ఆధారపడటం జరుగుతుంది. ఇండియా లో ధరలు పెరగడం వల్ల బాస్మతీయేతర బియ్యం ఎగుమతుల మీద ప్రభుత్వం నిషేధం ప్రకటించింది. బాస్మతీ ధరలు పెంచింది. ఈ ధరల పోటు ప్రవాస భారతీయులు కూడా అనుభవిస్తున్నారు.
ఇంకొన్నాళ్ళకు బియ్యం ధరలు మూడు రెట్లు అయ్యేలా ఉన్నాయి. గోధుమ పిండి, జోవర్ పిండి ల రేట్లు కూడా పెరగొచ్చు. పేపర్ లోనూ, టీవీ ల లోనూ ఆర్ధిక మాంద్యం, ఆహార కరువు ల మీద బోల్డన్ని వార్తలు వెలువడుతున్నాయి. మన పని చెయ్యని ప్రభుత్వాలే కాకుండా.. బ్రిటన్ లాంటి పని చేసే ప్రభుత్వాలు కూడా ఈ బాస్మతీ బియ్యం ధరవరల గురించి 'ఆందోళన' చెందడం చూసి 'ఔరా!' అనిపించింది.
బ్రిటన్ లో ఆహార కరువు ఎప్పుడూ లేదు. యుద్ధ కాలంలో కూడా వాళ్ల దగ్గర సరిపడా ఆహరం ఉండేది. ఆయితే భారతీయ భోజనం ఒక fancy అయిన బ్రిటిషర్లు అక్కడ బోల్డన్ని ఇండియన్ రెస్తారెంట్ల మహా రాజపోషకులు. చాలా మటుకూ 'ఇండియన్', 'కాశ్మీరీ' రెస్తారెంట్ల లో బంగ్లాదేషీ, పాకిస్తానీ, అఫ్గానీలు వడ్డించే చెత్త 'భారతీయ భోజనం' కూడా భేషుగ్గా లాభాలు పండిస్తుంది. జాతీయ వంటకం చికెన్ టిక్కా తో పాటూ ఘుమ ఘుమలాడే బాస్మతీ వంటకాలు బాగా ప్రాచుర్యాన్ని పొందాయి. పాపం నిజమైన భారతీయ వంటకాల గురించి తెలియని బ్రిటిషర్లు 'ఇండియన్' అన్న పేరు బోర్డు మీద ఉంటే చాలు! కాసుల పంట కురిపిస్తారు. రెస్టారెంట్లో కాస్త బాలీవుడ్ సెట్టింగ్, ఏనుగు బొమ్మ, పాత హిందీ సినిమాల పాటలూ వుంటే.. బాస్మతీ తో ఏది వడ్డించినా సరే... వాళ్ళకు అపురూపం.
కుకరీ టీవీ షో లలో కర్రీ, రైస్ వంటకాలలో బాస్మతీ బియ్యం ఫ్లేవర్ గురించి ఊకదంచి పెద్ద పెద్ద సూపర్ మార్కెట్ ల లో కూడా బ్రిటిషర్లు చిన్న చిన్న ప్యాక్ లలో బియ్యం కోనేలా చేస్తున్నారు. ఈ పెరిగిన ధరలు వీరినే కాకుండా.. ప్రధానంగా రెస్టారెంట్ వ్యాపారాన్ని ముట్టడించాయి. భారతీయ ఆహారం కోట్లాది రూపాయల వ్యాపారం చేస్తున్నపుడు, సహజంగానే ఈ ధరలు రాజకీయంగా వేడిని పుట్టిస్తాయి. ఆయితే ఇక్కడ దాదాపు అందరు గ్రాసర్లూ తమ తమ భారతీయ కస్టమర్లకు బియ్యాన్ని బ్లాకు చెయ్యకుండా.. ముందుగానే హెచ్చరించి, అప్పటి ధరల కే అమ్మటం చాల ఆనందాన్నిచ్చింది. ఇది ఇక్కడి కట్టుదిట్టమైన చట్టం వల్లనో, వారి వారి నిజాయితీ వల్లనో తెలియలేదు. బాస్మతీ ధర పెరగడం వల్ల దేశ ఆర్ధిక చిత్రానికి పెద్ద చెరుపు లేక పోయినా..ప్రజల కోసం తను చెయ్యగలిగేదేదో ఇక్కడి ప్రభుత్వం చేస్తోంది.
సమస్యని కాసేపు సీరియస్ గా తీసుకోకుండా.. అసలు spices కోసమే భారతదేశాన్ని ఆక్రమించుకున్న బ్రిటీషు వాళ్లు ఇప్పుడు 'బియ్యం ధరలు పెరిగాయి' అంటూ గోల పెట్టడం, వొత్తిడి చెయ్యడడం చూస్తే .. భలే! అనిపిస్తుంది. ఎక్కడో ఉత్తర భారత దేశం లో పండే ఒకానొక రకం ధాన్యం ఇప్పుడు ప్రపంచం లో ఒక ముఖ్యమైన వినిమయ వస్తువు కావటం గొప్ప విషయం మరి.
10/05/2008
మా అమ్మ!
అమ్మ పెద్ద జడ నేను ముందుకు వేసుకుని నా జడ అని ఆడుకోవడం, మీసాలు పెట్టుకోవడం, అమ్మ వంట చేసినా, దుమ్ము దులిపినా అదేదో అద్భుత దృశ్య కావ్యం లా చూడడం, అమ్మ చేత 'గలివర్', 'రిప్ వాన్ విన్కిల్', 'సిందేరిలా' పాఠాలు కధలు గా చెప్పించుకోవడం. మట్టి లో ఆడినప్పుడల్లా తిట్లు తినడం - ఇవన్నీ మధుర జ్ఞాపకాలే. భక్తి ని కూడా తప్పకుండా మా బుర్రల్లోకి డీఫాల్ట్ గా ఎక్కించేసింది. ఆయితే.. ఎప్పుడూ పూజ లో కూర్చోవాలంటే విసుగే మాకు. అయినా ఒక వేళ కూర్చుంటే మాత్రం చక్కగా స్త్రోతాలు చదువుకోగలం.
తను పూర్తిగా సాంప్రదాయవాది. అయినా తన భావాల్లో, అందరు ఆడపిల్లల తల్లుల్లానే అభ్యుదయవాదం కూడా ఎక్కువ. జీవితం లో ఏది కావాలంటే అది దేవుడు ఇవ్వలేడు. చాలా వాట్ని మనమే కష్టపడి సాధించుకోవాలి. కానీ అమ్మ మాత్రం.. ఏమైనా.. ఏమయిపోయినా.. ఎలాగైనా.. ఎప్పుడైనా.. ఎక్కడైనా.. మనకు సహాయపడడమే తన జీవితలక్ష్యం గా పెట్టుకుని. హెల్ప్ చేస్తుంది. ఒక వేళ ఏమి చెయ్యలేక పొతే.. ఒక్క ఫోన్ కాల్ తో ఎదురయ్యే సమస్య లని దూది పింజాలు చేసి పడేస్తుంది. అపుడే కష్టపడి సాధించుకోవడం లో ఉన్న కిక్ తెలుస్తుంది. కష్టపడడం లో ఏదో గ్లామరు ఉంది అని చాలా వీజీ గా చెప్పేసేది.
అమ్మ చేతి వంట.. ముఖ్యమ్గా కాఫీ. ఇప్పుడూ ఇంటికి వెళ్తే డాడీ పొద్దునీ ఫిల్టర్ కాఫీ స్వయంగా చేసి ఇస్తారు. అయినా అమ్మ కాఫీ తాగడానికి ఇంకో సారి కాఫీ కి కూర్చుంటాం. వంటింట్లో - పులిహోర మా కులదైవం. రక రకాల కూరలూ - చట్నీలూ - సాంబారు - వీటి మీద తనకి ట్రేడ్మార్కులున్నాయి.
అలానే ఎప్పుడైనా.. ఎక్కడినుంచయినా.. .. 'చేగోడి చమే, కంది పొడి చమే!' అని కబురు పెడితే, వైజాగ్ నుంచీ ముగ్గురికీ మూడు పెద్ద ప్యాకెట్ లు రెడీ అయిపోతాయి ప్యూర్లీ హోమ్ మేడ్ చేగోడీలూ, చెక్కలూ, జంతికలూ, కంది పొడీ, చారు పొడీ.. ఇలా ''మొదలగునవి'' కూడా!
పదేళ్ళ బట్టీ బాధ పెడుతున్న సుగరు, బీ పీ ల వల్ల, నడుము నొప్పి వల్ల, శారీరకంగా కాస్త బలహీనురాలయినా. మానసికంగా మాత్రం బలమైన శక్తి లా ఎదిగింది. తనకి ఉన్న ధైర్యం నాకు లేదు. ఎన్నో కష్టాలూ, ఒడిదుడుకులూ ఎదుర్కొన్నా- అమ్మ ఉందిలే అన్న ధైర్యం తో అలుపు తెలియలేదు. అమ్మ మా అందరికీ పెద్ద దన్ను, ఆసరా. ఇప్పటికీ మా కాకి గోల భరిస్తూ.. మా మానసిక ఆందోళన ని తగ్గిస్తూ, ఒక స్నేహితురాలిగా, మమ్మల్ని స్వచ్ఛమైన ప్రేమ తో ముందుకు నడిపించేది అమ్మ.
ఇప్పటికీ అమ్మ వాసన మారలేదు. అలానే జీవితం పట్ల తన పాసిటివ్ దృక్పధం మారలేదు. మా ముగ్గురూ (మేము ముగ్గురు అమ్మాయిలం) మా కాళ్ళ మీద మేము నిలబడేలా చెయ్యడమే కాదు. జీవితాన్ని ధైర్యంగా ఎదుర్కొనే స్తైర్యాన్ని ఇచ్చింది. దేవుణ్ణి ఇంతకన్నా ఎవరు ఏమి అడుగుతారు ?
ఆధ్యాత్మికత కూడా ఒక హాయి హాయి - అనేలా ఉంటుంది అమ్మ భక్తి. నాకు జీవితం లో ఎప్పుడు పెద్ద ఎదురుదేబ్బలు తగిలినా.. దేవుడు సాయం చేస్తాడనే తన థియరీ ప్రకారం కొన్నాళ్ళ పాటూ ప్రతి రోజూ సాయంత్రం నా చేత విష్ణుసహస్త్రం చదివించేది. దాని వల్ల దేవుడి మీద నమ్మకం పెరగడం తో పాటూ, నా మీద నాకు నమ్మకం కూడా పెరిగింది. అంతగా భక్తి లేని నేను ప్రతీ సాయంత్రం కోసం ఎదురు చూడడం జరిగేది.
అమ్మ మీద కొంత కోపతాపాలు కూడా ఉండేవి. నాకు సంగీతం అదీ నేర్పించలేదని, నాకిష్టమైనవేవీచేసే స్వతంత్రం ఇవ్వలేదనీ.. నన్ను మా ఫ్రెండ్ వాళ్లు చేరిన ''ఫలానా కాలేజీలో'' లో చేర్చలేదనీ, ఫలానా డ్రెస్సులు వేసుకోనివ్వలేదనీ.. .. ఇలా! కానీ పెద్ద వయసు లో కూడా నేను అనారోగ్యంతో మంచాన పడిపోతే.. 'అన్నీ' - అన్ని సపర్యలూ - కౌన్సిలింగ్ చేసి - అపుడు అత్యంత లోతుల్లోకి కూరుకుపోయిన నా ఆత్మస్థైర్యాన్ని వీజీ గా వెలికి తీసి, నా జీవితానికి కొత్త అర్దాన్నిచ్చిన అమ్మ - ఇప్పుడూ నా హాచ్ హాచ్ తుమ్ములకూ కంగారు పడిపోయే అమ్మ - మీద కోపం లేదు. కేవలం కృతజ్ఞత తో కూడిన ప్రేమ తప్ప.
చందనోత్సవం - సింహాచలం జ్ఞాపకాలు
ప్రకృతి కి, మనిషి కీ దూరం పెరిగిపోయి, 'ఆర్గానిక్', 'ఫ్రీ రేంజ్' అనేవి కాస్ట్లీ అయిపోయి, పెరటి లో పూల తోట, వెన్నెల్లో ఆటలూ, డాబా మీద/ఆరుబయట నిద్రపోవటం... ఏవో పూర్వ కాలపు విషయాలయిపోతున్న ఈ రోజుల్లో కూడా, మా ఊర్లో (విశాఖపట్నం) లో ప్రతీ ఏడూ చందనోత్సవం జరుగుతుంది. దీనికీ ప్రకృతికీ ఏమిటి సంబంధం అంటే.. ఇక్కడ అచ్చంగా అడవి దేవర అయిన సింహాచలం వరాహ నరసింహ స్వామికి 'చందన తదియ' నాడు నైవేద్యం పెట్టి కానీ, మామిడి పళ్ళు తినని ఒక ముచ్చటైన సాంప్రదాయం ఉంది. ప్రకృతి కీ, దేవుడికీ సంబంధం ఎప్పుడూ ఉంది. దేవుడికి ఏమిచ్చి మనం రుణం తీర్చుకోగలం ? ఆయనిచ్చిన దాంట్లో ఏదో కొంత ఆయనకే ఇచ్చి, ఆయనకు దగ్గరవటానికి ప్రయత్నిస్తాం.
మొన్న సింహాచలం లో అప్పన్న కు చందనోత్సవం జరిగింది. ఇంట్లో ఆ రోజు అప్పన్న కు మామిడి పళ్ల నైవేద్యం జరిగి ఉంటుంది. ఇంక అఫీషియల్ గా మనం (మేము) అంతా మామిడి పళ్ళు తినడం మొదలు పెట్టొచ్చు అన్నమాట! చందనోత్సవం దాకా మామిడి పళ్ళు, కాయలూ, పిందెలూ తినటం ఒక అపరాధం! 'ఎందుకూ ?' అని చిన్నపుడు పోట్లాడినా, పెద్దయ్యాక, దేవుడు మనకు అంత మంచి ఫలాన్ని ఇచ్చినందుకు ఇదో రకమైన Thanks చెప్పడం అన్న మాట అని అర్ధం అయింది. అప్పుడే ఈ ప్రకృతి ఇచ్చిన వరాలను మనం ఎంతగా cherish చేస్తామో అర్ధమవుతుంది.
విశాఖపట్నం నుండీ సాధారణంగా సాయంత్రం కొండ కు వెళితే.. ఒక్కోసారి ముసురు పట్టేది. కొండ మీద తేలి వస్తున్న నల్లని మేఘాలూ, పచ్చని అడవులూ.. గోపురం వెనుక నల్లని ఆకాశం, చెట్లూ..వీటన్నిటి తో కలిసిన సింహాచలం చాలా అందమైన ప్రదేశం. అప్పన్న అడవి మనుషుల దేవుడు. సంపెంగలూ, తులసీ, మామిడి పళ్ళూ, కొండ మీది పనస పళ్ళూ..సపోటాలూ, తేనె, సీతాఫలాలూ, అన్నీ ఆయన ప్రసాదాలే.. ఆయనకు ప్రీతి పాత్రాలే ! విశాఖపట్నం నిజంగా అందమైన ఊరు. కొండ మీద, దగ్గర ఉండే ఊర్లలోనూ కోయజాతి ప్రజలు.. చెంచులూ.. అప్పన్న దేవస్థానం, గోసాలలూ, ఒక పదేళ్ళ క్రితం ఆయితే ఇంకా బావుండేది ఈ 'మరీ ప్రకృతి ఒడి లో ఉన్నట్టుండే గుడి'!
ఇప్పుడు కూడా మరీ పెద్ద మార్పులు లేవు. మరీ బ్రహ్మర్ల పీడింపు ఉండదు-అన్నవరం లా! దక్షిణలు లెక్క కట్టి (అన్నదానం, బ్రాహ్మణుల కు వస్త్రదానం అంటూ ఎవరూ మిమ్మల్ని అడగరు) స్వీకరించడం ఉండదు. ఒక మంచి దేవస్థానం ఉంది. తిరుపతి లా, అన్ని దానాలూ దేవస్తాననికే చెయ్యొచ్చు. అన్నిటికీ ఒక ఎకౌంటు ఉంటుంది. అడవి దేవుడే అయినా చాల నాగరికంగా ఉంటాడు అప్పన్న. డబ్బు పీడింపు ఉండదు. ఊరి వాళ్లు 'అది కొనండి' - 'ఇది కొనండి' అని వెంటపడరు. అప్పన్న దేవస్థానం బావుంటుంది. భేషజాలు లేకుండా ప్రశాంతంగా, మామూలుగా ఉంటుంది. పొద్దున్న సుప్రభాతం వేళకు కొండ మీద చిరు చలి, పవిత్రత.. పొద్దున్న ఏమి చెప్పనా అప్పన్న వింటాడు. పొద్దున్నే ఎందుకు బ్రహ్మముహూర్తమో ఏమో కానీ.. పొద్దున్నమాత్రం స్వర్గమే.. సింహాచలం. స్వర్గం లో దేవుడూ కూల్ గా ఉండి మన గోడు వింటాడుగా మరి. ఇప్పుడు రియల్ ఎస్టేట్ గొడవలు ఎక్కువయిపోయి, విశాఖపట్నం లో అందమైన కొండల నిండా ఇళ్ళూ, కాలనీలూ వెలిసినా, సింహాచలం ఇంకా సింహాచలం గానే ఉంది.
ఎందుకో, సింహాచలం అంటే నాకు చాల ఇష్టం. గాంగులు నిర్మించిన రమణీయమైన శిల్పం, కళ - ఒరియా, తెలుగు భాషల లో రక రకాల ఫలకాలూ. శతాబ్దాల నాటి శిల్పం - రాళ్ళు మాట్లాడుతున్నట్టు! సంవత్సరాలుగా బోల్డన్ని కధలు... అప్పన్న గుడి లో ఎప్పుడో ఒక సారి దొంగలు పడితే, ఎక్కడ నుంచో, తుమ్మెదలూ, తెనేటీగలూ వారి మీద దాడి చేసి తరిమేసాయంట. లల్లా దేవి నవల కూడా ఎపుడో ఆంధ్రప్రభ లో చదివిన గుర్తు. అప్పన్న ఆభరణాలు శతాబ్దాల నాటివి. ఆయన్ని గర్భగుడి లో చాలా దగ్గర నుంచీ చూడొచ్చు. చందనం అలమిన దేహం.. పట్టు బట్టలూ, వజ్రాల నగలూ, తులసి మాలలూ! ఆయన ఆకారం పెద్ద లింగం లా.. ఉంటుంది. కాని ఆ చందనపు పొరల క్రింద, చిన్న నిజ విగ్రహం ఉంటుంది.. వరాహ - నరసింహుని విగ్రహం. దాన్ని నిజరూపం అంటారు. దర్శనం సంవత్సరం లో కేవలం ఒక్క వైశాఖ శుద్ధ తదియ రోజు మాత్రమే! ఆ రోజే చందనోత్సవం.
చందనోత్సవం రోజున ప్రతీ ఏడూ.. ఆయన విగ్రహానికున్న చందనాన్ని వొలిచి, కొత్తగా నూరిన మంచి గంధం (చందనం) పూస్తారు. ఆ రోజు నిజ రూప దర్శనం. (వరాహం ముఖం - మనిషి మొండెం - సింహం తోక !) ఆ రోజున మాత్రం, ఊరంతా వేడి, భగ భగ లాడే ఎండా..! అదంతా 'అప్పన్న వేడి వల్లనే' అంటారు. స్వామి ఉగ్ర నరసింహుడు కదా! ఇదంతా ఒక Legend. నమ్మే వారు నమ్ముతారు. కానీ ప్రహ్లాదవరదుడు.. అంటే పిల్లలకు చాలా ఇష్టం కదా! అందుకే చిన్నప్పుడే అప్పన్న అంటే నాకు ఒక హీరో వర్షిప్. ఆయన ఉగ్ర రూపాన్ని చూసి ప్రపంచమే వొణుకుతుంటే, ప్రహ్లాదుడు మాత్రం ఆయన్ని శాంతపరిచాట్ట ! 'మరి ప్రహ్లాదుడి కి భయం వేయలేదా?' అని అడిగితే, మా అమ్మ మాత్రం 'మరి దేవుడికి చిన్న పిల్లలంటే ఇష్టం కదా.. అందుకే ప్రహ్లాదుడిని చూసి దేవుడు ఏమి అనలేదు. నెమ్మదిగా శాంతించాడు!' అని చెప్పింది. ఆయన ఎంత శాంతించినా, మరి కోపంతో 'వొళ్ళు మండుతూ ఉంటే !' (మన వాడుక లో) చందనం పూసి ఆయన ఒంటిని చల్ల పరచే ప్రయత్నం జరిగింది. అందుకే చందనోత్సవం.
ఇంట్లో అందరం...సింహాచలం ఒక పిక్నిక్ లా వెళ్ళే వస్తూండే వాళ్ళం. ఆ కంపనీ మహిమో ఏమో.. మళ్ళీ అలాంటి ఫీలింగ్స్ వేరే వాళ్ళతో చప్పున కలగవు. తిరుగు ప్రయాణం లో, అన్నమయ్య కీర్తనలూ, వైజాగ్ అందాల వర్ణనలూ.. (అక్క అసలే భావుకురాలు), మాలో మేము మైమరిచిపోవడాలూ లాంటివి బోలెడు. ఆ జ్ఞాపకాలు ముసిరినప్పుడు.. మాత్రం.. 'ఈ సారి వెళ్ళాలి!' అని గట్టిగా నిర్ణయించుకున్నా, మా అందరం ఒకే సారి వెళ్ళేది మాత్రం అనుమానమే. నాకు వీలయినపుడు అక్క కు వీలవదు, ఒకవేళ అందరికీ సెలవులు దొరికినా.. చెల్లికి కుదరదు. దేవుడు మా అందరికీ ఒకే సారి, సెలవులూ, వైజాగ్ వెళ్ళే అవకాశం కనుక కల్పిస్తే, తప్పకుండా సింహాచలం. ఒక సాయంత్రం వేళ వెళ్ళాలని నా కోరిక. రద్దీ - రద్దీ హైదరాబాద్ నుంచీ విశాఖ వెళ్ళడమే పెద్ద రిలీఫ్. అందులో.. సింహాచలం లో ఒక సాయంత్రం.. ఇంకా హాయి. ఎందుకు హాయి అంటే..సిటీ కి దగ్గర్లోనే, ఆ కొండ సంపెంగల గాలీ, పట్టు తేనెగూళ్ళు ఎటు చూసినా కనిపించే ఆకుపచ్చని ఆవరణ.. ఇంకెక్కడా దొరకవు కాబట్టి.
09/05/2008
Vaishnava Janato
వైష్ణవ జనతో తేనే కహియేజే,
పీడ పరాయీ జానే రే
పర దుక్ఖే ఉపకార్ కారే తోయే,
మన అభిమాన న ఆనే రే .... వైష్ణవ జనతో...
సకల్ లోక మ సహునే వందే,
నిందా న కరే కేని రే
వాచ్ కాచ్ మాన్ నిశ్చల్ రాఖే,
ధన ధన జనని తేని రే .... వైష్ణవ జనతో.....
సమ ద్రిష్టి నే త్రిష్ణ త్యాగి,
పర స్త్రీ జేనే మాత రే
జిహ్వా థకే, అసత్య న బోలె,
పరధన్ నవ ఝాల హాత్ రే ....వైష్ణవ జనతో...
మొహ మాయ వ్యాపే నహి జేనే,
ద్రిడ్ వైరాగ్య జేనే మాన్ మ రే
రామ్ నాం సుతాలీ లాగే
సకల తిరాథ్ తేనే తన మ రే .. వైష్ణవ జనతో....
వన్ లోభి నే కపట రహిత్ జే,
కామ క్రోద్ నివార్యా రే
భనే నర సయ్యో తేను దర్శన కర్తా,
కుల ఎ కోటేరే తాయ రే .... వైష్ణవ జనతో ....
08/05/2008
మాతృభూమి!
ఈ సినెమా కధ ఒక ఊహ నించి పుట్టింది. మనీష్ ఝా ఈ కధను రచించి, సినీమా దర్శకత్వం వహించారు. వర కట్న దురాచారం దేశం లో మహిళల జీవితాలను ఎలా ప్రభావితం చేస్తుందో మనకు తెలుసు. ఇప్పటికీ ఆడపిల్ల పుడుతుందని తెలిస్తే అబార్షన్ చేయించడం, ఆడ పిల్ల పుడితే రక రకాల హేయమైన పద్ధతుల లో ఆ పసిగుడ్డును చంపటం.. జరుగుతూనే ఉన్నాయి. ఈ ఆడ సంతానాన్ని చంపటం.. ఇదే రేట్ లో కొనసాగితే.. కొన్నాళ్ళకి దేశం లో ఆడవాళ్ళే కరువుతారు. అటువంటప్పుడు సామాజికంగా ఎటువంటి పరిస్తితులు ఎదురుతాయో ఊహించి తీసిన చిత్రం ఇది. ఈ సినెమా ౨౦౦౩ లో విడుదలైంది. చాలా అంతర్జాతీయ వేదికలలో విడుదల అయి చాల పేరు పొందింది. ప్రపంచం అంతా.. ఇండియా లో ఇలా ఆడ పిల్లల్ని చంపుతారా?! .. అని ఆశ్చర్య పడితే మనకు అవమానం కదూ!
గ్రామంలో అగ్రకులానికి చెందిన ఒక పెద్దాయనకు ( ఠాకూర్) (సుధీర్ పాండే) అయిదుగురు కొడుకులు. ఎన్నాళ్ళుగానో ఆడపిల్లలను మట్టుపెట్టడం వల్ల గ్రామంలో ఆడదంటూ మిగలక.. గత పదిహేనేళ్ళుగా అందరూ మగ వాళ్లతో నిండిన గ్రామం అది. పెద్దాయనకు కొడుకుల పెళ్లి చెయ్యటం గగనం అవుతుంది. పిల్ల దొరకందే..! ఇతగాడికీ అయిదుగురు మగ పిల్లల్ని కన్న భార్య ఏనాడో పరమపదిస్తుంది. కాబట్టి ఆడపిల్ల ఒకటి దొరికితే.. ఆ ఆరుగురూ.. దాన్ని (ఒక వస్తువు లాగా..) అనుభవించుదామని చూస్తుంటారు. ఇక్కడ ఆడది లేక పొతే మగవాళ్ళ జీవితాల్లో కలిగే Sexual Frustration ముఖ్యమ్గా చూపించారు. మనిషి పశువు అవుతాడు. రాక్షసుడు కూడా అవుతాడు.
ఈ కుటుంబానికి (నిజానికి పెద్దబ్బాయికి) ఒక సారి ఒక సంబంధం వస్తుంది. కానీ తాళి కట్టే వేళకు ఆ పెళ్లి కూతురు అసలు ఆడది కాదని.. మోసం అని తెలిసి.. ఖంగు తింటారు. అప్పటికి వరకట్నం పోయి కన్యాశుల్కం పద్దతి వస్తుంది. ఊర్లో అమ్మాయి కనపడితే ఎత్తుకుపోవటమో, కొనుక్కోవటమో సాధారణం అయి వుంటుంది. ఆడ పిల్లలు పెళ్లి పేరుతో అమ్మకానికి సిద్ధంగా ఉంటారు.
వంశం అన్న మాట వచ్చేసరికీ జనం ఆ స్త్రీ మీద హక్కుల గురించి పోరాడుకుంటారు. సంతానం తమదంటే తమదని వాదించుకుంటారు. ఆ సన్నివేశం చూడాలంటే.. గుండె బలం కావాలి. ప్రజల desperation చూసి 'నిజమే! ఇలా కూడా జరగొచ్చు' అనిపిస్తుంది.
ఈ సినెమా చూసినంత సేపు ఆ ఘోర కలి ని చూసి .. వళ్ళు గగుర్పొడిచింది. సినెమా లో మంచి పట్టు ఉంది. నాకు టెక్నికల్ గా చెప్పడం తెలియలేదు. కానీ ఇలాంటి పరిస్తితి వస్తె.. మగవాళ్ళూ.. ఆడవాళ్ళూ కూడా అలాంటి నరకాన్ని తట్టుకోలేరు. సెక్స్ మాత్రమే కాకుండా స్త్రీ మగవాడికి చాలా అవసరాలకు పనికొస్తుంది. ఇంటి పని, వంట పని చెయ్యడానికీ, పిల్లలను కని పెంచడానికీ.. ఇలా ఈ లెక్కలు కట్టి ఠాకూర్ కల్కి ని కొన్నా ఇవి నిజంగానే నిజాలు కదా! స్త్రీ లేక పొతే.. మిగతా పనులు జరిగి పోయినా వంశం మాత్రం పెరగదు కదా! అందుకే స్త్రీ కి అంత డిమాండ్. (కధ కాలానికి ఆమె కేవలం ఒక వస్తువు కదా) ఈ నిజం మన కళ్ళ కు కట్టే పని లో మనీష్ ఝా సఫలీకృతం అయ్యారు.
05/05/2008
అమితాబ్ వర్సెస్ రామ్ దోస్
http://www.eenadu.net/archives/archive-4-5-2008/panelhtml.asp?qrystr=htm/panel10.htm
సాధారణంగా రెవెన్యూ కోసం ప్రభుత్వమే మధ్య వ్యాపారానికి పూర్తి మద్దతు ఇస్తుంది. పై పై మెరుగులు గా సిగరెట్ పెట్టెల మీద అస్థిపంజరం బొమ్మ ముద్రించమని.. ఒక చట్టం చేసి చేతులు దులిపేసుకుంటుంది. అలాంటప్పుడు రామ్ దోస్ మాత్రం సినీ నటుల సామాజిక బాధ్యత ను తరచూ గుర్తు చేస్తూ, కరకు ప్రకటనలు చేస్తూ, కోర్టు నోటిసులు పంపిస్తూ .. ఏదో 'గొప్ప పని' చేసేస్తున్నట్టు ఫీల్ అవుతూ ఉంటారు. ఇదంతా హిపోక్రాసీ నే కదా. ఆయనకు చిత్త శుద్ధి ఉండి ఉంటే తరచూ సమ్మెలు చేస్తూ ప్రభుత ఆస్పత్రుల లో నిష్కారణమైన చావులకూ, ప్రజల తీవ్ర అసౌకర్యానికీ కారణమయ్యే డాక్టర్లూ, మెడికో ల పై ఏదైనా చర్య తీసుకునే వారు. లేక అసలు వాళ్ళతో గొడవ పెట్టుకో కుండా వాళ్ల సమస్యల్ని పరిష్కరించే వారు. లేదా పొగాకు, మద్యాల క్రయ విక్రయాల మీదే దేశ వ్యాప్త నిషేధం విధించేలా ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చేవారు. కనీసం ప్రజల్లో అవేర్ నెస్ కలిగించే ప్రకటన లన్నా ప్రచారం చేయించే వారు. కాబట్టి నాకు అమితాబ్ వాదన సరైనది గానే అనిపించింది.
టిబెట్ స్వతంత్ర పోరాటం
Brand Ambassador
ఇండియన్ కార్లు .. అనగా Ambassador లు ఇప్పుడు London లో ద్రవ్యాకర్షణ చేస్తున్నాయి. London Cabs అనగా ప్రసిద్ధి పొందిన నల్ల రంగు కాబ్ ల లో తిరిగే పర్యాటకులు ఈ భారతీయ కారు మీద చాల మోజు చూపిస్తున్నారు. ఈ క్రింది వార్త (Karma Cars - Advertisement) చదవండి. రక రకాల రంగుల్లో, అలంకరణ ల లో మెరిసి పోతున్న మన కారు మీద లండనర్లకు, పర్యాటకులకూ మోజు కలుగుతూ ఉందంటే ఆశ్చర్యం ఏమి లేదు.