ఇది ఒరిస్సా రాష్ట్రానికి చెందిన మరో విశేషం. చూడగానే కలంకారీ ని గుర్తు చేసే, చాలా ఖ్యాతి చెందిన ఈ చిత్ర కళ పేరు 'పట చిత్ర'! మా తోటికోడలు చాలా ప్రత్యేకంగా పుట్టింటి నుంచీ తెచ్చుకుని, అపురూపంగా డ్రాయింగ్ హాల్లో అమరుస్తున్నప్పుడు ఈ 'పట చిత్ర' ని చూసి, చాలా ముచ్చట పడ్డాను. ఆవిడ చెప్పగా విన్న ఈ పట చిత్రాల కధ ని, కాస్త నా పరిశోధన జోడించి, వీలయినంత క్లుప్తంగా చెప్తాను.
సాధారణంగా, కొన్ని ప్రాంతాల కళా రూపాల్లో సారూప్యత కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. ఉదాహరణ కు, చాలా వరకూ మన పోచంపల్లి డిజైన్లూ, ఒరిస్సా కు చెందిన సంబల్ పురి డిజైన్లూ ఒకే పోలిక తో ఉండటం గమనించాను. అలానే ఈ 'పట చిత్ర' కూడా మన కలంకారీ లా బట్ట (కాన్వాస్) మీద వేసే వర్ణచిత్రమే. ఈ కాన్వాస్ అలాంటి ఇలాంటి కాన్వాస్ కాదు. ఇది పట్టు (tusser silk) కాన్వాస్. రెండు పట్టు వస్త్రాలను ఒకదానికొకటి అతికించి, ఈ కాన్వాస్ ను మందంగా తయారు చేస్తారు. వస్త్రాలను ఎలా అతికిస్తారో తెలుసా.. చింతపిక్కల తో తయారు చేసిన గ్లూ తో! ఇవి కాన్వాస్ ని గట్టిగా పట్టి ఉంచుతాయి. ఈ అతికించిన వస్త్రాన్ని బాగా ఎండ పట్టించాక తయారయిన ఈ కాన్వాస్ నే 'పట' అంటారు.
అన్నీ సహజ సిద్ధంగా ప్రకృతి లో దొరికే రంగులనే వాడతారు. ఈ రంగులని బంక మట్టి, సున్నపు రాయి, ఎర్ర రాళ్ళూ, శంఖాలూ, బొగ్గూ, ఆకులూ, అలములూ, ఇంకా, ఒరిస్సా సముద్ర తీరం అంతా సంవృద్ధిగా దొరికే గవ్వలూ లాంటి మామూలు పదార్ధాల నుంచీ తయారు చేస్తారు. ఈ చిత్రాలను వేయడానికి వాడే బ్రష్షులు కూడా 100% 'ఆర్గానిక్'. ఈ కుంచెలకు కావలసిన జుట్టు.. గేదెల మెడ భాగం నుంచీ తీస్తారు. ఇంకా నాజూకు కుంచెలకు ఎలుకల రోమాలను వాడుతారు. కొన్ని వెజ్ కుంచెలు కూడా ఒక రకం మొక్క వ్రేళ్ళ నుంచీ తయారుచేస్తారు. రంగులని రకరకాల పద్ధతుల ద్వారా.. తయారుచేసుకున్నాకా వాటిని కొబ్బరి చిప్పల తో తయారు చేసిన పాత్రల (బౌల్ లు) లోనే కలుపుతారు.
పట చిత్రాల లో 'కలంకారీ' మాదిరిగానే ఎక్కువగా భగవంతుని లీలలూ... హిందూ పురాణ, ఇతిహాసాల ఇతివృత్తాలు ఎక్కువగా చిత్రీకరించబడతాయి. ఆయితే, మధుబని, గోండ్ లాంటి జానపద చిత్రాల లానే ఈ పట చిత్రాల లోనూ 'జానపదం' తొంగి చూస్తుంది. మతం, దేవుడూ, లీలలూ, నమ్మకాల తో పాటూ జానపదుల, రైతుల, జాలర్ల, వేట గాళ్ళ జీవితం, వారి కష్టాలూ, ఆనందాలూ, పండగలూ, ఆనాటి సాంఘిక జీవనం అన్నీ కూడా కనిపిస్తాయి. ప్రతీ ఒక్క అంశం, ప్రత్యేక శైలిలో ఒకే నిర్డుష్టతతో చిత్రీకరించబడడం ఈ పట చిత్రాల ప్రత్యేకత.
క్లిష్టమైన ప్రక్రియలలో.. అంచెల వారీ గా తయారయ్యే ఈ పట చిత్రాలు కూడా కలంకారీ లానే బాగా ఆదరణ పొందుతున్నాయి. రాజస్థానీ పెయింటింగ్ల లా డ్రాయింగ్ రూంల లో ఆవిష్కృతం అవుతున్నాయి. ఆయితే ఎంత గొప్పదనం లేక పొతే... ఈ సాంప్రదాయ కళలు ఇంకా దేశంలో కొనసాగుతున్నాయో అని ఆశ్చర్యం కలుగుతుంది. ఆ గొప్పతనం ఈ పట పెయింటింగ్ ని చూడగానే చూచాయగా తెలుస్తుంది.
సుజాత గారు,
ReplyDeletevery interesting! ముఖ్యంగ brushes తో సహా ఆర్గానిక్ మెటీరియల్ వాడటం! మరి ఇవి ఎక్కడ దొరుకుతాయో, చెప్పండి!
సుజాత గారూ,
ReplyDeleteథాంక్స్. బాపూ బొమ్మల్లా ఈ పట చిత్రాలు కూడా ఇంటర్నెట్ లో దొరుకుతాయి. కానీ నాకు తెలిసి ఢిల్లీ లో మన 'లేపాక్షి' లాంటి 'ఉత్కళ' షోరూం లలో దొరుకుతాయి. హైదరాబాదు లో ఆయితే ఎప్పుడైనా ఎగ్జిబిషన్లు జరిగినపుడు, లేదా శిల్పారామం లోనూ ప్రయత్నించ వచ్చు.