Pages
▼
11/05/2008
బాస్మతీ భోగం
పోయిన నెల లో, మేము గ్రాసరీ తెచ్చుకునే శ్రీలంకన్ షాపులో పనిచేసే తమిళ అబ్బాయిలు 'మీరు బియ్యం తీసుకోవాలంటే త్వరగా తీసుకోండి.. వచ్చే నెల నుండీ టిల్డా, కోహినూర్.. అన్నీ రేట్లు పెరగనున్నాయి' అని హెచ్చరిక చేసేరు. అప్పటికీ టైం లేక కాస్త ఆలస్యంగా వెళ్లి, స్టోర్ లో ఇండియన్ బియ్యం దొరకక, పాకిస్తానీ బ్రాండ్ బాస్మతీ బియ్యం తీసుకున్నాం. చూస్తుండగానే బాస్మతీ రేట్లు రెట్టింపు అయ్యాయి. ఆంధ్రా బియ్యం ఎపుడో గాని దొరకనపుడు, బాస్మతీ మీదే చాలా మంది ఆధారపడటం జరుగుతుంది. ఇండియా లో ధరలు పెరగడం వల్ల బాస్మతీయేతర బియ్యం ఎగుమతుల మీద ప్రభుత్వం నిషేధం ప్రకటించింది. బాస్మతీ ధరలు పెంచింది. ఈ ధరల పోటు ప్రవాస భారతీయులు కూడా అనుభవిస్తున్నారు.
ఇంకొన్నాళ్ళకు బియ్యం ధరలు మూడు రెట్లు అయ్యేలా ఉన్నాయి. గోధుమ పిండి, జోవర్ పిండి ల రేట్లు కూడా పెరగొచ్చు. పేపర్ లోనూ, టీవీ ల లోనూ ఆర్ధిక మాంద్యం, ఆహార కరువు ల మీద బోల్డన్ని వార్తలు వెలువడుతున్నాయి. మన పని చెయ్యని ప్రభుత్వాలే కాకుండా.. బ్రిటన్ లాంటి పని చేసే ప్రభుత్వాలు కూడా ఈ బాస్మతీ బియ్యం ధరవరల గురించి 'ఆందోళన' చెందడం చూసి 'ఔరా!' అనిపించింది.
బ్రిటన్ లో ఆహార కరువు ఎప్పుడూ లేదు. యుద్ధ కాలంలో కూడా వాళ్ల దగ్గర సరిపడా ఆహరం ఉండేది. ఆయితే భారతీయ భోజనం ఒక fancy అయిన బ్రిటిషర్లు అక్కడ బోల్డన్ని ఇండియన్ రెస్తారెంట్ల మహా రాజపోషకులు. చాలా మటుకూ 'ఇండియన్', 'కాశ్మీరీ' రెస్తారెంట్ల లో బంగ్లాదేషీ, పాకిస్తానీ, అఫ్గానీలు వడ్డించే చెత్త 'భారతీయ భోజనం' కూడా భేషుగ్గా లాభాలు పండిస్తుంది. జాతీయ వంటకం చికెన్ టిక్కా తో పాటూ ఘుమ ఘుమలాడే బాస్మతీ వంటకాలు బాగా ప్రాచుర్యాన్ని పొందాయి. పాపం నిజమైన భారతీయ వంటకాల గురించి తెలియని బ్రిటిషర్లు 'ఇండియన్' అన్న పేరు బోర్డు మీద ఉంటే చాలు! కాసుల పంట కురిపిస్తారు. రెస్టారెంట్లో కాస్త బాలీవుడ్ సెట్టింగ్, ఏనుగు బొమ్మ, పాత హిందీ సినిమాల పాటలూ వుంటే.. బాస్మతీ తో ఏది వడ్డించినా సరే... వాళ్ళకు అపురూపం.
కుకరీ టీవీ షో లలో కర్రీ, రైస్ వంటకాలలో బాస్మతీ బియ్యం ఫ్లేవర్ గురించి ఊకదంచి పెద్ద పెద్ద సూపర్ మార్కెట్ ల లో కూడా బ్రిటిషర్లు చిన్న చిన్న ప్యాక్ లలో బియ్యం కోనేలా చేస్తున్నారు. ఈ పెరిగిన ధరలు వీరినే కాకుండా.. ప్రధానంగా రెస్టారెంట్ వ్యాపారాన్ని ముట్టడించాయి. భారతీయ ఆహారం కోట్లాది రూపాయల వ్యాపారం చేస్తున్నపుడు, సహజంగానే ఈ ధరలు రాజకీయంగా వేడిని పుట్టిస్తాయి. ఆయితే ఇక్కడ దాదాపు అందరు గ్రాసర్లూ తమ తమ భారతీయ కస్టమర్లకు బియ్యాన్ని బ్లాకు చెయ్యకుండా.. ముందుగానే హెచ్చరించి, అప్పటి ధరల కే అమ్మటం చాల ఆనందాన్నిచ్చింది. ఇది ఇక్కడి కట్టుదిట్టమైన చట్టం వల్లనో, వారి వారి నిజాయితీ వల్లనో తెలియలేదు. బాస్మతీ ధర పెరగడం వల్ల దేశ ఆర్ధిక చిత్రానికి పెద్ద చెరుపు లేక పోయినా..ప్రజల కోసం తను చెయ్యగలిగేదేదో ఇక్కడి ప్రభుత్వం చేస్తోంది.
సమస్యని కాసేపు సీరియస్ గా తీసుకోకుండా.. అసలు spices కోసమే భారతదేశాన్ని ఆక్రమించుకున్న బ్రిటీషు వాళ్లు ఇప్పుడు 'బియ్యం ధరలు పెరిగాయి' అంటూ గోల పెట్టడం, వొత్తిడి చెయ్యడడం చూస్తే .. భలే! అనిపిస్తుంది. ఎక్కడో ఉత్తర భారత దేశం లో పండే ఒకానొక రకం ధాన్యం ఇప్పుడు ప్రపంచం లో ఒక ముఖ్యమైన వినిమయ వస్తువు కావటం గొప్ప విషయం మరి.
No comments:
Post a Comment
వ్యాఖ్యానించినందుకు చాలా చాలా థాంక్స్.