Pages

10/05/2008

మా అమ్మ!

అమ్మ జ్ఞాపకాలంటే.. మధుర జ్ఞాపకాలే! అమ్మకి భక్తీ-వైరాగ్యం ఎక్కువ. చిన్నప్పటినించీ ఎక్కువే. ఎప్పుడూ పూజ, పునస్కారం, అగరోత్తులూ, ధూపం.. అందుకే అమ్మ చీరంతా అగరొత్తుల వాసన. మా పెద్దమ్మలందరి దగ్గరా ఇదే వాసన. అమ్మని కౌగిలించుకుంటే.. ఒక అమ్మ వాసన వస్తుంది. అది అమ్మ చిన్నప్పటినుంచీ వాడే పాండ్స్ కోల్డ్ క్రీం. మైసూర్ సాన్డల్ సబ్బూ.. మధ్యాహ్నం ఆయితే ఇంగువా.. అగరోత్తులూ కలిసిన వాసన. సాయంత్రం ఆయితే, ఇంగువ బదులూ సంపెంగలో, మల్లెలో, సన్నజాజులో, విరజాజులో ఆ కమ్మని అమ్మ వాసనలో చేతులు (పరిమళం) కలిపేవి.

అమ్మ పెద్ద జడ నేను ముందుకు వేసుకుని నా జడ అని ఆడుకోవడం, మీసాలు పెట్టుకోవడం, అమ్మ వంట చేసినా, దుమ్ము దులిపినా అదేదో అద్భుత దృశ్య కావ్యం లా చూడడం, అమ్మ చేత 'గలివర్', 'రిప్ వాన్ విన్కిల్', 'సిందేరిలా' పాఠాలు కధలు గా చెప్పించుకోవడం. మట్టి లో ఆడినప్పుడల్లా తిట్లు తినడం - ఇవన్నీ మధుర జ్ఞాపకాలే. భక్తి ని కూడా తప్పకుండా మా బుర్రల్లోకి డీఫాల్ట్ గా ఎక్కించేసింది. ఆయితే.. ఎప్పుడూ పూజ లో కూర్చోవాలంటే విసుగే మాకు. అయినా ఒక వేళ కూర్చుంటే మాత్రం చక్కగా స్త్రోతాలు చదువుకోగలం.

తను పూర్తిగా సాంప్రదాయవాది. అయినా తన భావాల్లో, అందరు ఆడపిల్లల తల్లుల్లానే అభ్యుదయవాదం కూడా ఎక్కువ. జీవితం లో ఏది కావాలంటే అది దేవుడు ఇవ్వలేడు. చాలా వాట్ని మనమే కష్టపడి సాధించుకోవాలి. కానీ అమ్మ మాత్రం.. ఏమైనా.. ఏమయిపోయినా.. ఎలాగైనా.. ఎప్పుడైనా.. ఎక్కడైనా.. మనకు సహాయపడడమే తన జీవితలక్ష్యం గా పెట్టుకుని. హెల్ప్ చేస్తుంది. ఒక వేళ ఏమి చెయ్యలేక పొతే.. ఒక్క ఫోన్ కాల్ తో ఎదురయ్యే సమస్య లని దూది పింజాలు చేసి పడేస్తుంది. అపుడే కష్టపడి సాధించుకోవడం లో ఉన్న కిక్ తెలుస్తుంది. కష్టపడడం లో ఏదో గ్లామరు ఉంది అని చాలా వీజీ గా చెప్పేసేది.


అమ్మ చేతి వంట.. ముఖ్యమ్గా కాఫీ. ఇప్పుడూ ఇంటికి వెళ్తే డాడీ పొద్దునీ ఫిల్టర్ కాఫీ స్వయంగా చేసి ఇస్తారు. అయినా అమ్మ కాఫీ తాగడానికి ఇంకో సారి కాఫీ కి కూర్చుంటాం. వంటింట్లో - పులిహోర మా కులదైవం. రక రకాల కూరలూ - చట్నీలూ - సాంబారు - వీటి మీద తనకి ట్రేడ్మార్కులున్నాయి.


అలానే ఎప్పుడైనా.. ఎక్కడినుంచయినా.. .. 'చేగోడి చమే, కంది పొడి చమే!' అని కబురు పెడితే, వైజాగ్ నుంచీ ముగ్గురికీ మూడు పెద్ద ప్యాకెట్ లు రెడీ అయిపోతాయి ప్యూర్లీ హోమ్ మేడ్ చేగోడీలూ, చెక్కలూ, జంతికలూ, కంది పొడీ, చారు పొడీ.. ఇలా ''మొదలగునవి'' కూడా!


పదేళ్ళ బట్టీ బాధ పెడుతున్న సుగరు, బీ పీ ల వల్ల, నడుము నొప్పి వల్ల, శారీరకంగా కాస్త బలహీనురాలయినా. మానసికంగా మాత్రం బలమైన శక్తి లా ఎదిగింది. తనకి ఉన్న ధైర్యం నాకు లేదు. ఎన్నో కష్టాలూ, ఒడిదుడుకులూ ఎదుర్కొన్నా- అమ్మ ఉందిలే అన్న ధైర్యం తో అలుపు తెలియలేదు. అమ్మ మా అందరికీ పెద్ద దన్ను, ఆసరా. ఇప్పటికీ మా కాకి గోల భరిస్తూ.. మా మానసిక ఆందోళన ని తగ్గిస్తూ, ఒక స్నేహితురాలిగా, మమ్మల్ని స్వచ్ఛమైన ప్రేమ తో ముందుకు నడిపించేది అమ్మ.


ఇప్పటికీ అమ్మ వాసన మారలేదు. అలానే జీవితం పట్ల తన పాసిటివ్ దృక్పధం మారలేదు. మా ముగ్గురూ (మేము ముగ్గురు అమ్మాయిలం) మా కాళ్ళ మీద మేము నిలబడేలా చెయ్యడమే కాదు. జీవితాన్ని ధైర్యంగా ఎదుర్కొనే స్తైర్యాన్ని ఇచ్చింది. దేవుణ్ణి ఇంతకన్నా ఎవరు ఏమి అడుగుతారు ?


ఆధ్యాత్మికత కూడా ఒక హాయి హాయి - అనేలా ఉంటుంది అమ్మ భక్తి. నాకు జీవితం లో ఎప్పుడు పెద్ద ఎదురుదేబ్బలు తగిలినా.. దేవుడు సాయం చేస్తాడనే తన థియరీ ప్రకారం కొన్నాళ్ళ పాటూ ప్రతి రోజూ సాయంత్రం నా చేత విష్ణుసహస్త్రం చదివించేది. దాని వల్ల దేవుడి మీద నమ్మకం పెరగడం తో పాటూ, నా మీద నాకు నమ్మకం కూడా పెరిగింది. అంతగా భక్తి లేని నేను ప్రతీ సాయంత్రం కోసం ఎదురు చూడడం జరిగేది.


అమ్మ మీద కొంత కోపతాపాలు కూడా ఉండేవి. నాకు సంగీతం అదీ నేర్పించలేదని, నాకిష్టమైనవేవీచేసే స్వతంత్రం ఇవ్వలేదనీ.. నన్ను మా ఫ్రెండ్ వాళ్లు చేరిన ''ఫలానా కాలేజీలో'' లో చేర్చలేదనీ, ఫలానా డ్రెస్సులు వేసుకోనివ్వలేదనీ.. .. ఇలా! కానీ పెద్ద వయసు లో కూడా నేను అనారోగ్యంతో మంచాన పడిపోతే.. 'అన్నీ' - అన్ని సపర్యలూ - కౌన్సిలింగ్ చేసి - అపుడు అత్యంత లోతుల్లోకి కూరుకుపోయిన నా ఆత్మస్థైర్యాన్ని వీజీ గా వెలికి తీసి, నా జీవితానికి కొత్త అర్దాన్నిచ్చిన అమ్మ - ఇప్పుడూ నా హాచ్ హాచ్ తుమ్ములకూ కంగారు పడిపోయే అమ్మ - మీద కోపం లేదు. కేవలం కృతజ్ఞత తో కూడిన ప్రేమ తప్ప.

9 comments:

  1. మనసు చెమర్చేలా రాశారు.. అమ్మ అన్న పదం వింటేనే మనసు భావోద్వేగంతో నిండిపోతుంది.. ముఖ్యంగా జీవితంలో ఒక సుస్థిర స్థానాన్ని ఏర్పరుచుకుంటున్న ఈ వయసులొ! అమ్మ పడ్డ కష్టాలు, చేశిన త్యాగాలు, అందించిన అండదండలు.. ఇవన్నీ కదా ఈనాటి మన స్థాయికి ముఖ్య కారణం అనిపిస్తుంది..

    ReplyDelete
  2. yes, beautifully expressed..

    ReplyDelete
  3. అమ్మ, అమ్మతనాన్ని గురించి ఎంత చెప్పినా సరిపోదని మళ్లీ బల్లగుద్ది చెప్పినట్టుంది.
    కొన్ని ప్రయోగాలు బాగున్నై (భావవ్యక్తీకరణలో కూడా మీ అమ్మగారు అలవరచిన భక్తిని చక్కగా రంగరించారు). ఉదాహరణకి "పులిహోర కులదైవం", "కందిపొడి చ మే, చెగోడీ చ మే" ... భలే వ్రాసారు అనిపించింది.

    ReplyDelete
  4. ఏమి చెప్పాలో తెలియడం లేదు. అమ్మని గురించి ఏం చెప్పినా ఎంత చెప్పినా ఎంతో కొంత మిగిలే ఉంటుందనిపిస్తుంది.మీరు రాసిన 'ఇంగువా అగరొత్తులూ కలిసిన వాసన ' చదివితే మా అమ్మ గుర్తొచ్చింది.ఎవరు అమ్మ గురించి రాసినా నాకు మా అమ్మ గుర్తొస్తుంది. అమ్మంటే అదేనేమో! మనసు చెమర్చేలా రాశారు. నిషిగంధ గారన్న మాట నిజమే!

    ReplyDelete
  5. ఉస్కో నహి దేఖా హమ్నె కభి,పర్ ఉస్కి జరూరత్ క్యా హోగీ,ఏయ్ మా తెరీ సూరత్ సె అలగ్,భగ్వాన్ కి సూరత్ క్యా హొగీ,క్యా హొగీ-మనము దేవుడిని చూడలేదు.కానీ,అమ్మ వుండగా దేవుడెందుకు?

    ReplyDelete
  6. నిషిగంద, కొత్త పాళీ, వికటకవి, రాఘవ, సుజాత, కస్తూరి గార్లకు

    చాలా Thanks. కనుమూరి జాన్ హైడ్ గారి 'బ్లాగరులకు విన్నపం' చూసి మదర్స్ డే సందర్భం గా ఈ టపా రాసాను. మీరంతా కూడా రాస్తారని ఎదురుచూస్తున్నాను. అమ్మని 'Taken for Granted' గా, అస్సలు చాలా మామూలుగా మన కోసమే 'అమ్మ' లే, అని తీసుకుంటూ జీవితం వెళ్లబుచ్చకుండా తనకు Thank you అని చెప్పే ప్రతి అవకాసమూ వినియోగించుకోవాలని ఈ బ్లాగు ని వాడుకుందాము అన్నట్టున్న కనుమూరి గారికి చాలా చాలా Thanks.

    ReplyDelete
  7. అయిదేళ్ల క్రితం మమ్మల్నందరిని ఒంటరిని చేసి వెళ్లి పోయిన మా అమ్మ గుర్తుకువచ్చించి. ఇంకా వ్రాయలనిపిస్తుంది. కళ్లకు కన్నీటి పొర అడ్డుతగులుతుంది. క్షమించండి.

    బొల్లోజు బాబా

    ReplyDelete
  8. 2008 లో బ్లాగుల్లోని టపాలతో చేసిన చిన్న ప్రయత్నం
    ఈ రొజు ఏదో వెదుకుతుంటే మళ్ళీ కంటపడింది
    వీలుంటే మీరూ చూడండి
    http://files.koodali.org/johnhyde/amma.pdf
    జాన్ హైడ్ కనుమూరి

    ReplyDelete

వ్యాఖ్యానించినందుకు చాలా చాలా థాంక్స్.