Pages

17/10/2026

Mother Mary Comes To Me - Arundhati Roy




అరుంధతీ రాయ్ తన జీవితం గురించి సమగ్రంగా రాసుకున్న memoir,   ముఖ్యంగా తన తల్లి తో తనకున్న సంక్లిష్ఠ అనుబంధాన్ని గురించి నెమరేసుకున్న పుస్తకం. ఈ పుస్తకం ఒక పాత తరం షీరో గురించి ఆమె కూతురు, ఈనాటి షీరో చెప్పుకున్న "ఆత్మ"  కథ. పుస్తకం 2025 లో ప్రచురితమైంది. ఈ తరానికి తగినట్టు "పుస్తకం లో ఏ భాగమూ ఎక్కడా కృత్రిమ మేథ సాంకేతికత / వ్యవస్థల  తాలూకూ తర్ఫీదు కి అంటూ ఉపయోగించడానికి అస్సలు వీల్లేదు" అని రాసుకున్న పుస్తకం.  ఆ నిక్కచ్చితనం, ముందుచూపు, నైతికతా,  తాము నమ్మిన వాటి గురించి మొండిగా ఉండగలగడం, పోరాడాల్సి‌వస్తే ఎన్నాళ్ళు పట్టినా పోరాడడానికి సిద్ధపడటం వీరి ప్రత్యేకత.  అసలు సమస్యలు ఒక కార్నర్ కి‌ మనిషిని తోసేయగలవు.   అదేవిధంగా,   మామూలు మనిషికి కొన్ని సమస్యలు ఎంత ధైర్యాన్నిస్తాయో - ఈ పుస్తకం చదివితే  తెలుస్తుంది. 


అరుంధతీ రాయ్ తల్లి మేరీ రాయ్, ఓ టీచర్.  Education లో గా పట్టా తప్ప ఆస్తిపాస్తులు ఏమీ లేని మహిళ.   తాగుబోతు భర్తని విడిచిపెట్టి, ఇద్దరు పిల్లల్ని పెంచుకొచ్చి, సామాజికంగా ఓ ఒంటరి మహిళ పడాల్సిన కష్టాలన్నిటిని పడి, ఆర్ధిక, సామాజిక, కుటుంబ, ఆరోగ్య ఇబ్బందులన్నిటితో యుద్ధం చేస్తూ, పులి లా పోరాడి  గెలిచిన మనిషి.  పరిస్థితులు ఎంత  ఘోరంగా మారినా, తట్టుకుని నిలబడటం వల్ల, ఆవిడ ఉక్కు మనిషి లా తయారవుతుంది. అరుంధతి దీ, మేరీ రాయ్ లది చాలా క్లిష్టమైన బంధం.  తల్లీ పిల్లల మధ్య ఉండాలిసిన మమతానురాగాల కన్నా, ఇంకేవో చెప్పలేని కాంప్లెక్స్ అనుబంధం ఉంటుంది.  

మేరీ రాయ్ తండ్రి ఒక ఎంటమాలజిస్ట్. కీటక శాస్త్రవేత్త. ఆమె భర్త మికీ రాయ్ అసాం టీ ఎస్టేట్ లో పని చేస్తుండేవాడు. మికీ రాయ్ తండ్రి, ప్రణయ్ రాయ్ కి కూడా తాత. అలా, అరుంధతీ, ప్రణయ్ రాయ్ లు కజిన్లు. ఈ తాత, బాక్సర్. కానీ రచయిత్రి  బేరీజు ప్రకారం,   టెంపర్మెంట్ విషయానికొస్తే, ఎంటమాలజిస్టు తాత అత్యంత నిర్దయుడు. బాక్సర్ తాత సున్నిత హృదయుడూ గా మిగుల్తారు. ఈ ఎంటమాలజిస్ట్ తాత భార్య,  అంటే, మేరీ రాయ్ తల్లి అత్భుతమైన వయొలెనిస్ట్. ఆమె ప్రతిభ అంటే అతనికి అసూయ.  భార్య ని కొట్టడం‌ అతనికి అలవాటు. ఒకసారి కోపంతో   ఆవిడ తల పగలగొడతాడు ఈ "ఎంటమాలజిస్టు" . ఇలా ఈ రాక్షసుడి కి పుట్టడాన మేరీ రాయ్, తనని ప్రపోస్ చేసిన మొదటి మనిషిని గబ గబా పెళ్ళాడి ఇంటి నుండీ దూరం వెళిపోతుంది. అలా మికీ రాయ్, మేరీ లు ఒక జంట అవుతారు. కానీ అత్యంత పెర్ఫెక్షనిస్ట్ భార్య కి, పూర్తి భిన్న వ్యక్తిత్వం ఉన్న ఆ భర్తకీ సరిపోక విడిపోతారు.  మేరీ రాయ్ ఇద్దరు చిన్న పిలలతో ఒంటరిగా మిగులుతుంది. 


ఆస్థమాతో, ఆర్ధిక అభద్రత తో పోరాడుతూ ఊటీ లో తన తండ్రి బంగళా కి పిల్లల్ని తీసుకుని చేరుతుంది. అక్కడికి ఆవిడ సోదరుడొచ్చి, ట్రావెంకూరు చట్టాల ప్రకారం సిరియన్ క్రిస్టియన్ ఆడ పిల్లలకి,  తండ్రి ఆస్థిలో హక్కు లేదనీ, ఇల్లు ఖాళీ చేయమనీ కూచుంటాడు. ఆ గొడవ జరిగే  అప్పటికి,  వాళ్ళు తమిళనాడు లో ఉండటాన అక్కడ కేరళ చట్టాలు చెల్లక బ్రతికిపోతుంది. తిరిగి కొన్నాళ్ళకు,  అక్కడి చల్లని    వాతావరణం తన ఆరోగ్యానికి పడక కొట్టాయం కు మారుతుంది.    కొట్టాయం లో పుట్టిల్లు చేరి, అక్కడ ఇంకో మిషనరీ మహిళ సాయంతో అద్దె భవనం లో  ఓ చిన్న స్కూలుని తెరిచి, దాన్ని చక్కటి రూపానికి తీసుకొస్తుంది. కేరళ లో సిరియన్ క్రిస్టియన్ ల లో ఉండే వారసత్వ విధానం మీద సుప్రీం కోర్ట్ లో పోరాడి గెలిచిన ఏక్టివిస్టు. ఒక విద్యా వేత్త గా, ఫెమినిస్ట్ గా కేరళ లో మంచి ముద్ర వేసిన విజేత గా నిలుస్తుంది. సమాజంలో మంచి పేరు, గౌరవం సంపాదించుకుంటుంది. 


అలాంటి సింహానికి   పుట్టడం, అరుంధతీ, ఆమె అన్న ఎల్ ఎస్ కే రాయ్ (LKS Roy)  లు చేసుకున్న ప్రారబ్ధం, పుణ్యమూ.  మేరీ రాయ్  కు తీవ్రమైన ఆస్థమా ఉండటం వల్ల స్టెరాయిడ్స్ విపరీతంగా వాడాల్సొస్తుంది. ఆ ప్రభావం వల్లనేమో ఆమెకు విపరీతమైన టెంపర్, కోపం, అసహనం. ఎవరి మీద కోపమొచ్చినా, పిల్లలు బలవ్వాల్సిందే.   ఆవిడకి విడిచిపెట్టేసిన  భర్త మీదో, చిన్నతనంలో  నిష్కారణంగా తనని చావ బాదుతుండిన తండ్రి పట్లో, ఆస్తి దక్కనీకుండా తనని తండ్రి ఇంట్లోంచీ వెళ్ళగొట్టాడని తన సోదరుడి మీదనో ఉన్న కోపం, అసలు పురుషుల మీద ఉన్న కోపమంతా తన కొడుకు మీద చూపించేది. 


అరుంధతీ, ఆమె అన్నా, తల్లి తామిద్దరిలో ఎవరి మీద ఎక్కువ కోపం చూపించేదా అని చర్చించుకునే వాళ్ళు.   పిల్లల్ని చాలా స్ట్రిక్ట్ గా పెంచుతుంది. ఎంత స్ట్రిక్ట్ గా అంటే, ఇద్దరూ తల్లితో విసిగిపోయి, బెదిరిపోయి, భయపడిపోయి,  పెరిగారు. అరుంధతి జ్ఞాపకాలలో ఒక సారి టీచర్ అయిన తల్లి అన్నకి ఏవరేజ్ మార్కులొచ్చినందుకు బెత్తం విరిగేలా కొట్టడం ఉంటుంది. అరుంధతి ని ఎన్నోసారులు ఉన్న పళాన, నడి రోడ్డు మీద, కారు లోంచి దింపేయడం, ఇంట్లోంటి కొన్ని వందల సార్లు గెట్ అవుట్ అనడం, ఎన్నో సారులు నువ్వు నా మెడకి కట్టిన గుది బండవి అనడం,  ఆవేశం మితిమీరినపుడు తల్లికి వచ్చే ఆస్థమా ఎటాక్ లు, వాటికి తానే కారణం అని ఈమె గిల్ట్ తో కుమిలిపోయేలా చేయడం,   తన కోర్  బాల్య జ్ఞాపకాలు.   అయినా "మేరీ రాయ్" అంతటి మేరీ రాయ్ అనే తన తల్లిని  ప్రేమిస్తూ,  బ్రతికిన అన్నా చెల్లెళ్ళ కథ ఇది. 


తల్లి ని, ఆమె తిట్లనీ భరించలేక 17 యేళ్ళ వయసులో ఇల్లు విడిచిపెట్టి ఢిల్లీ వచ్చి, అక్కడ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ లో చేరి, చదువు పూర్తి చేసి, జీవితాన్ని కూడా చదివి, చిన్న చిన్న ఉద్యోగాలు చేసి, తన మొదటి ప్రేమికుడు, స్వీట్ హార్ట్, కాలేజ్ సీనియర్ ని పెళ్ళి చేసుకుని, గోవా వెళ్ళి, అక్కడ అస్సలు కట్టిపోత జీవితంలో ఇమడలేక, వివాహాన్ని ముగించుకుని,  మళ్ళీ డిల్లీ వచ్చి, మళ్ళీ జీవితాన్ని స్క్రాప్ నుంచీ మొదలు పెట్టి, ఎందరో స్నేహితుల్ని సంపాదించుకుని, అప్పటికే పెళ్ళయి పిల్లలున్న ఒక సినిమా దర్శకుడిని (Pradip Krishen) కలిసి, అతని సినిమా లో నటించి, అతన్ని ప్రేమించి.. అతనితో, అతని కుటుంబంతో, పిల్లలతో, కుక్కలతో సహజీవనం చేసి,  తనతో కలిసి  కొన్ని సినిమాలకు స్క్రిప్టులు రాసి, కొన్ని డాక్యుమెంటరీలకు పని చేసి, గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్ రాసి, బుకర్ గెలుచుకుంది.   ఈ ప్రైజ్ ఆమె జీవితానికి స్థిరత్వాన్ని తీసుకొచ్చింది. బుకర్ గెలుచుకున్నాక తను చేసిన మొట్టమొదటి కాల్ తల్లికే. అప్పటికే మేరీ రాయ్ ప్రత్యక్ష ప్రసారం టీవీలో చూస్తూండడం వల్ల, ఆమె కూతుర్ని, తన బేబీ గర్ల్ ని మెచ్చుకుంటుంది. ఒకే ఒక్క మాట. అరుంధతి ఆత్మని నిలబెట్టిన మాట.  తల్లి బహుశా తనని మొట్ట మొదటిసారి మనస్పూర్థిగా మెచ్చుకుని దాన్ని బయటకు వ్యక్తపరిచిన సందర్భం.  బుకర్ ప్రైజ్ మనీ, ఆ తరవాత ఏటా వచ్చే రాయల్టీలతో తన జీవితాన్నే కాకుండా తను నమ్మిన ప్రతి విషయంతోనూ, మనిషి తోనూ, పని తోనూ ఆ సొమ్ముని పంచుకుని -   తక్కువలో తక్కువ మినిమం ఖర్చుతో బ్రతకడం అలవాటయిన తనకు అక్కర్లేని సొమ్ముని సమాజానికే తిరిగి ఇచ్చేసింది చాలా సార్లు. 


బుకర్ ఇచ్చిన గుర్తింపు, డబ్బు ఆమె జీవితం మీద ఒక గ్రిప్ ని తీసుకొచ్చాయి.   అదే లేకపోతే ఏ లోయల్లోకో జారిపోకుండా పట్టుకునేందుకు కూడా  కావల్సిన స్నేహితులు ఉన్నారు. వాళ్ళు "థాంగ్ గాడ్ మనకి డబ్బొచ్చింది"  అనుకున్నారు.   అదే ఆమె కుటుంబం. మేరీ, మీకీ రాయ్ ల 'చెడ్డ' పేరెంటింగ్ వల్ల దొరికిన గాడ్ గివెన్ కుటుంబం.  జీవితం లో, అరుంధతి సంపాదించుకున్న స్నేహితులని చూస్తే బాగా అనిపిస్తుంది. అదీ ఆమె జీవితం.    మేరీ రాయ్ పెట్టే మానసిక హింస, అవమానాల నుండీ, బెదిరింపుల నుండీ  నుండి పారిపోయి రావడం వల్ల అబ్బిన స్వతంత్ర ఆలోచనా విధానం వల్ల భయపడినా,  గట్టిగా నిలవడం అరుంధతికి  వంటబట్టాయి. 


అందుకే ఆస్థమా తో ఎన్నో సార్లు ఇక తల్లి ఊపిరి ఆగిపోతుందేమో అని భయపడుతూ, ఆమెకు ఓ ఊపిరి తీసుకునే అవయవం గా, (Organ daughter) తనని తాను ఊహించుకునే కూతురు కూడా, తల్లి మెచ్చుకునే లా సాహిత్యంలో విజయాన్ని సాధించింది.   God of Small Things లో అమ్మూ పాత్రని సృష్టించింది.  అసలు రచయిత్రి ని అవుతానని అనుకోనే లేదు ఆమె.


ఆమెతో కలిసి పలు సినిమా ప్రాజెక్టులలో పని చేసిన తరవాత,  ఆమె రాతల్లో స్పార్క్ ని కనిపెట్టి,  ఆమె తనకు తరచూ రాసే ప్రేమ లేఖల్లో సౌందర్యాన్ని చూసి మెచ్చుకుంటూ,    ఆమెను సాహిత్యం వైపు మళ్ళించినది, ఆమె రెండో భర్త ప్రదీప్.    అరుంధతి అందమైన వచనం కట్టి పడేస్తుంది. విషాదంలో లాజిక్, హాస్యం, నిస్పృహ అన్నీ కనిపిస్తాయి. ఆమె రాసిన వ్యాసాలూ, రాసిన రెండే రెండు నవలలు, నటించిన రెండే రెండు సినిమాలూ, ఆమె రాసిన వ్యాసాలూ చదివినవాళ్ళకు తప్ప కాంటెక్స్ట్ తెలీని వాళ్ళకి కూడా అర్ధం అయే లా రాసిన పుస్తకం.   చదివిన వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. 

 జీవితం లో ఇంకా సక్సెస్ రాకమునుపే ఇరవైలలో తండ్రి మళ్ళీ ఈ పిల్లలిద్దరి జీవితాల్లోకీ వస్తాడు. ఈ మత్తు మనిషి ని వెతుక్కుంటూ పెద్దవాడయిన అన్న అతన్ని కలకత్తాలో కనుగొంటాడు. ఆయన అక్కడ ఠికాణీ లేక ఢిల్లీ వచ్చేస్తాడు. పిల్లలు అతని జీవిత చరమాంకంలో తాగుడు వల్ల వచ్చిన అనారోగ్యానికి వైద్యం చేయిస్తారు. ఆయన చనిపోతాడు. అదే సమయంలో తల్లి కూడా విపరీతంగా జబ్బు పడుతుంది. అయినా ఆవిడ మాత్రం గట్టెక్కి, ఇంకో 15 యేళ్ళు బ్రతికి, ప్రశాంతంగా తన ఇంట్లోనే కళ్ళు మూస్తుంది. మేరీ రాయ్ మరణం తో నే పుస్తకం మొదలవుతుంది. తల్లిదండ్రులు వృద్ధాప్యంలో / అనారోగ్యంతో  ఉన్న వాళ్ళయితే ఈ పుస్తకం చదివి అసలు ఓర్చుకోలేరేమో.  తమ సాధారణ వృత్తి జీవితాన్ని పక్కన పెట్టి పెద్దవాళ్ళని చూసుకోవాల్సిన పిల్లల బాధ, అనుభవిస్తే గానీ గానీ బోధపడదు. 


అరుంధతీ రాయ్ స్వతంత్ర భావాలు చాలా కాంట్రవర్సరీ, ఇప్పటి భాషలో ఏంటీ నేషనల్ !!!  ఆమె మనసు కష్మీరు యువత కష్టాలకూ, ఉగ్రవాదులని ముద్ర వేయబడి చంపేయబడే సామాన్యుల కష్టాలకూ, నక్సల్ వాదులూ, మావోయిస్టుల హత్యలకూ, చలించిపోతుంది.  ఆమె మొట్ట మొదటి అర్బన్ నక్సల్. కొన్ని వితండవాదాలు కూడా చేస్తుంది. బోరు కొట్టించే వ్యాసాలూ, స్నిపెట్ లూ రాస్తుంది. అయినా ప్రపంచ వ్యాప్తంగా అరుంధతి చెప్పే మాటలని పట్టించుకునే అభిమానులు ఉన్నారు.  బీజేపీ ని రాజకీయంగా ఎదిరించేందుకు, కేవలం ఎన్నికలలో గెలిచేందుకు హడావిడిగా, అఫ్సల్ గురు ని, కనీసం కుటుంబసభ్యులకు తెలీకుండా ఉరి తీసింది కాంగ్రెస్ ప్రభుత్వం. సాయి బాబా ని అరెస్ట్ చేసింది. అయినా మోదీ ప్రభంజనం ముందు నిలవలేకపోయింది అంటుంది అరుంధతి. 


మేరీ రాయ్ ధాటి - కోపం, ధైర్యం, విసురూ ఈమెలోనూ ఉన్నాయి కనుకనే, అటు కాంగ్రెస్ నీ, ఇటు మోదీ నీ, అద్వానీ ని, ఫూలన్ దేవి మీద సినిమా తీసి, ఆమె జీవితాన్ని అమ్ముకుని పేరు గడించిన శేఖర్ కపూర్ నీ, అదానీ ని,  నర్మదా ప్రాజెక్టునీ, కశ్మీరు దమనకాండలనీ, ఎండగట్టింది.   కేవలం మోదీ, భాజపా వ్యతిరేకతే కాకుండా, కాంగ్రెస్ విధానాలని కూడా నిష్పక్షపాతంగా విమర్శించింది అరుంధతీ రాయ్.    ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా, దానికి అయిష్టురాలుగానే ఉంది. రాజకీయ వ్యాపార దురహంకారుల దాడులకూ, న్యాయ పరమైన చిక్కులకూ గురయింది. ఆ వ్యవహారాలలో తన రెండో భర్త కుటుంబం అవస్థలు పడకూడదని ఆ పెళ్ళినీ ముగించింది. కానీ తన జీవితం అంతా కొత్త కొత్త గా స్నేహాలను గెలుచుకుంటూనే ఉంది. తనని చెడ్డగా ట్రీట్ చేసినవాళ్ళందిరికీ ఆఖరి దాకా దన్నుగా నిలిచింది. ఇవన్నీ మేరీ రాయ్ ద్వారానే అబ్బటం వల్ల, తల్లికో ప్రేమ కానుక గా ఈ పుస్తకాన్ని రాసుకుంది.  మేరీ రాయ్ ఆఖరి రోజులలో, వీళ్ళిద్దరి మధ్యా ఇంటరాక్షన్ కు కొన్ని చోట్ల కళ్ళలో నీళ్ళు తిరుగుతాయి.  ఇద్దరూ రాక్ స్టార్లు.   


ఆర్తులూ, ఆపన్నులూ అని వేరే ఎవరో ఉండరు. అధికారం కోసం, రాజకీయాల కోసం సమిధలయ్యే దురదృష్టవంతులు కొందరు ఉంటారు. వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ ని సమాజానికి చెప్పే నోరు కూడా కావాలి.  అందుకే అరుంధతీ రాయ్ దేశానికి కావల్సిన అర్బన్ నక్సల్.  ప్రతీ పుస్తకానికీ కొన్నేళ్ళు కేటాయించి, చాలా ఎలాబరేట్ గా రాయడం ఆమె పద్ధతి.  మేరీ రాయ్ ని ఈ పుస్తకం తో ఎప్పటికీ సజీవంగా ఉంచేసింది. ఆమె చనిపోయాక, తల్లి గురించి కాస్త చెడ్డగా చెప్పడం తను చేస్తున్న ద్రోహమే.. కానీ తలీ కూతుళ్ళ అనుబంధాలలో ఇలాంటివి కూడా ఉంటాయి. తను ఒక రెబెల్ గా ఎదగడానికి తల్లి లాంటి రెబల్ ఎంత సాయపడిందో తలచుకోవద్దూ అని అనుకుంది. 


మినిస్త్రీ ఆఫ్ అట్ మోస్ట్ హేపీ నెస్, గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్ ల వాటిలో పాత్రలూ, అవి అలా రావడానికి నిజ జీవితంలో తనకి తారసిల్లిన మనుషులూ, అనుభవాల గురించి  క్షుణ్ణంగా రాసింది. అవి ఆల్రెడీ చదివినవారికి, సినిమాలు ఒకటైనా చూసినవాళ్ళకీ ఈ పుస్తకం చదివేందుకు బావుంటుంది. నాకయితే నచ్చింది. కొన్ని relatable-by-all  లైన్లు : 

> One young man (inspiration to Velutha in GOST)  who lived in Ayemenem but worked in Kottayam,  became my most beloved friend.  We spent a lot of time together.  He made me a fishing rod out of culm of bamboo and showed me where to find the best earthworms to use as bait.  He taught me to fish, he taught me to stay still and be quiet.  He fried the tiny fish I caught and we ate them together as though we were feasting at a banquet.  Had I been sixteen years old instead of six, who knows, if I got lucky, he might well have been mine.  He was the kindest, most handsome man I had ever seen. 


> Mrs Roy (as a teacher) made it her mission to disabuse boys of their seemingly God-given sense of entitlement.  She turned them into considerate, respectful men, the kind the town had rarely seen.  In a way, she liberated them too.  She freed them of the burden of being what society taught men out to be.  She raised generations of sweet men and sent them out into the world.  What she did for her girl students, the spirit she instilled in them, was nothing short of revolutionary.  She gave them spines, she gave them wings, she set them free.  She bequeathed her unwavering attention and her stern love on them and they shone back at her.  

> To get to work, I'd hire a bicycle for one rupee an hour.  It oughtn't to have been an ordeal.  Millions of working men in the city cycled long distances.  For a woman, though, it was different.  It involved being chased down, hooted at, ogled.  My only other option was to submit to being molested twice a day in a crowded city bus.  That, on top of everything else, used to make my mind shut down. 


>   In those early years most of my friends were men. Very straight men. Which is not the case now.  It probably has to do with the fact that, at the time, girls my age were either still living with their parents or married and not living the vagrant life.  And the off-grid others were living in the shadows.  Today, its almost the opposite.  The straight men are enfolded in home and marriage.  Women who have had enough of that are breaking free.  And the off-grid others are slowly but surely coming out.  For people like me of the vagrant mentality, it is an excellent time for friendship.  Friendship is the raft I sail on.  Friendship is the pennant I fly. 

>  I was also caught in the flight path of the entertaining insults with which various sects and factions of communist parties denounce one another.  That high-minded debate was necessary of course.  But that forest was necessary too.  Without the Naxalites, whatever anybody thought of them, there would be no forest. 

Notes:

AI Training cant use the content   

Mary Roy

School established by Mary Roy

Succession Law Case 

Pradip Krishen

Messy Memsab

In which Annie gives it ... 

Ministry of Utmost Happiness 



11/10/2026

Of Men, Women and Witches - Stories from my Life - Jeya Mohan


 "ఉఱైవిడంగళ్ (Malayalam) అనే తన  'ఆత్మ కథ' ని జెయమొహన్, 2011 లో ప్రచురించారు. అయితే ఎన్నో ఏళ్ళ తరవాత సంగీత దానిని "Of Men, Women and Witches " పేరుతో ఇంగ్లీషు లోకి అనువదించారు.   చాలా ఆకర్షణీయంగా  పిట్ట కథలూ,  చమత్కారాలూ,  కబుర్ల లాంటి  కథలు చెప్తూ వాటి ని కవితల లాంటి  వచనం తో నింపేసి,  ఆసక్తిని పేని,  దాంతో చదువర్లను  కట్టిపడేసే కళ ఎరిగిన జెయ మోహన్ ఆత్మ కథ ఇది. దీన్నిండా ఆడవాళ్ళే.  మనిషిని షేప్ చేసే, తల్లి,  భార్య,  పిల్లలూ,  నాయనమ్మలూ, తానెరిగిన ఇరుగుపొరుగు  అమ్మాయిలూ, జీవన ప్రయాణంలో తారసిల్లిన మహిళలు, కొద్దో గొప్పో అతిలోక సుందరీమణులు, అలౌకిక శక్తులు ఉన్న యక్షిణులూ నూ.  

 మనూ పిళ్ళై వంటి హిస్టారియన్ లు ఎలా కేరళ చరిత్రని, అక్కడి మాతృస్వామ్య వ్యవస్థనీ, elaborate గా చర్చిస్తారో అలా జెయ మోహన్ కూడా కేరళ చరిత్ర ని చెప్తూ, అక్కడున్న కులాలూ, కులాలలో నడిచే practices,  మాతృస్వామ్య వ్యవస్థని వివరిస్తారు.   అసలు స్త్రీలు కేరళ సమాజంలో, ఎంత ప్రధాన పాత్ర పోషించారో, వారికున్న ఆర్ధిక, రాజకీయ,  లైంగిక స్వాతంత్ర్యం, అధికారం, గౌరవం - ఇపుడు అది కనుమరుగైన క్రమం,  మెల్లగా మారిన కేరళ సమాజం, కరిగిన మాతృస్వామ్యం, వేళ్ళూనిన పితృస్వామ్య వ్యవస్థ, ఆడవారి జీవితం ఎలా పంజరం లోకి  వెళిపోయిందో ఒక మళయాళీ గా తన గమనింపులోకి వచ్చిన విషయాలు రాసుకున్నారు. ఒరిజినల్ లో కేవలం 142 పేజీలున్న పుస్తకం లో ఒక వరద ప్రవాహం లాంటి వరుస కనిపిస్తుంది.  అదెలాగంటే కేవలం నాలుగు చాప్టర్లలో జెయమొహన్, తన తల్లితండ్రుల మధ్య అగాధాన్ని, తల్లినీ, తండ్రినీ, వారి వ్యక్తిత్వాలనీ విడివిడిగా పరిచయం చేస్తూ, తన తోబుట్టువులనీ, ముఖ్యంగా తమ వంశం లో పెద్దదయిన నాయనమ్మ జీవితాన్నీ పరిచయం చేస్తారు. అదంతా చదివాక, ఆయన భార్యతో తనకు జరిగిన ప్రేమ వివాహం గురించి చదివి ముచ్చటేస్తుంది.   భార్యంటే తనకున్న ప్రేమ ని ఎంత చక్కగానో వ్యక్తపరుస్తారు. తరవాత ప్రధాన పాత్రలు, కేరళ లో రచయిత ఎరిగిన యక్షిణులు - వారి కథలు. వీటిని ఎలా కలిపి ఒక గ్రంథం గా మారుస్తారు? ఎలా ఈ కథల్ని, తన జీవితానుభవాలుగా చెప్పుకున్నారు - అది చదవాలి. 


జెయమోహన్ ప్రధానంగా మళయాళీ. తల్లి "వైశాలం"  చాలా  అందగత్తె, చదువుకున్నది. ఆరోజుల్లో ప్రభుత్వ ఉద్యోగం ఉందన్న కారణం చేత, అంత అందంగా ఉండని ఒక 'నాయర్ ' ని‌ ఇచ్చి పెళ్ళి చేస్తారు. ఇతనికి విపరీతమైన కోపం, అందమైన ముగ్ధ "వైశాలం' ను, సహజంగా చాలా అభిమానవతి, సాహిత్యాభిమానీ, చదువుకున్నది, అయిన వైశాలం ని, అస్తమానం (జెయమొహన్ తల్లి).. చావగొడుతూ, అవమానిస్తూ, బూతులు తిడుతూ ఆమె ఆత్మని నిత్యమూ హత్య చేస్తూ ఉంటాడు. ముగ్గురు పిల్లలు వాళ్ళకి. మధ్యలో కొన్నాళ్ళు అతని హింసకు బాగా అభిమానపడి అతనితో విడిపోయినా, పరిస్థితులకు లొంగి, ఆయనతోనే ఉండడానికి వచ్చేస్తుందావిడ. పుట్టింటి గడప మరి తొక్కదు. 


జెయమోహన్ అనారోగ్యంతో బాధపడే పిల్లాడు. తండ్రి కి చూస్తే ముక్కు మీద కోపం!! అయినా ఆ కాఠిన్యం తో పాటూ తండ్రికి కొడుకంటే ప్రేమా ఉంటుంది. భార్యన్నా ప్రేమ ఉంటుందేమో.. కానీ అతని లవ్ లేంగ్వేజ్ కేవలం అధికారం చలాయింపూ, కటువు మాటలూ, విసుగు చేతలూ.  అయినా ఎక్కడో గుంభనమైన పితృప్రేమ కూడా దాచుకున్న ఆ తండ్రి చేతికింద పెరిగి, తండ్రిని కూడా  ప్రేమించినా, అతని‌కన్నా  తల్లి పై తీవ్రమైన ప్రేమ ని పెంచుకున్న కొడుకు గా, తన హృదయాన్నంతా పరచుతాడు రచయిత,  ఒక చాప్టర్ లో. 


నాయనమ్మ, నాయరు మహిళ. బోల్డంత ఆస్తి, భూమి, గుళ్ళు, చెరువుల ఓనరు. భారత దేశానికి స్వాతంత్రం వచ్చాక, వైకోం సత్యాగ్రం అనంతరం, గుళ్ళూ, ఆస్తుల మీద పట్టు పోతుంది. దున్నిన వాడిదే భూమి అని లాండ్ సీలింగ్ చట్టాలొచ్చాక, ఆవిడ పీకల్లోతు వ్యాజ్యాలలో కూరుకుపోతుంది. చిన్న కులాల వారు ఆవిడ తోటల్నీ, పొలాలనీ కౌలుకు తీసుకుని, పరిస్థితులు మారాక,  వాటికి యజమానులు అవుతారు. ఆవిడ చేతుల్లో హస్తభూషణంగా,   ఎప్పుడూ కోర్టు కాయితాలున్న ఓ తోలు సంచీ!!  చిన్న చిన్న వాటికే, అమాయకంగా, ఆగ్రహానికి ఆవేశానికీ లోనై, నిస్సహాయత తో,  లాయర్లకు ఎకరాలకెకరాలు రాసేస్తూ చాలా భూమిని పోగొట్టుకునేస్తుంది. కేసులూ ఓడిపోతూంటుంది. ఆవిడ‌ పోయాక కొన్ని కేసుల్లో తీర్పులు వీళ్ళుకు అనుకూలంగా వచ్చినా, వివిధ కారణాల‌ వల్ల వీరి‌ కుటుంబం ఇక ఆ ఆస్తులను తిరిగి క్లెయిమ్ చేసుకోదు.  


ఒకప్పుడు  నాయరు మహిళల పెళ్ళిళ్ళలో బోల్డు స్వతంత్రం మహిళలకి. అలా జెయమోహన్ నాయనమ్మ కు ముగ్గురికి మించి భర్తలు. ఆమె చదువు, పాండిత్యానికి సాటిరాని భర్తలు. ఆమె ఇంటిని కొడుకు,  కోపంతో విడిచిపెట్టేనాటికి, ఆమె, తన కొత్త భర్తతో పడకగదిలో నిద్రించి ఉంటుంది. ఆ తల్లంటే కొడుక్కి ఎక్కళ్ళేని కోపం. ఇంత ఆస్తి ఉన్నా, ఇల్లు విడిచిపెట్టి వెళ్ళి, రోడ్డున పడి, ఎలానో జీవితం మొదలుపెట్టి, నిలదొక్కుకుని, ప్రభుత్వ ఉద్యోగం సాధిస్తాడు. వైశాలం తో పెళ్ళవుతుంది. 

కొన్నాళ్ళకి నాయనమ్మ పోతుంది. తల్లి ఉరిపోసుకుంటుంది. తండ్రి కూడా ఆత్మహత్య చేసుకుంటాడు. జీవితం అతలాకుతలం అవుతుంది. ఉక్కు పాదంతో జీవితాన్నేలిన తండ్రి కాఠిన్యం వెనుక కండిషనింగ్, నాయనమ్మ ఆత్మగౌరవ పోరాటం, తల్లి పడిన బాధలూ - అర్ధం అయినట్టు, భార్యని మాత్రం ప్రాణ సమానంగా ప్రేమిస్తాడు. సాధారణంగా, కఠినమైన బాల్యం ఉన్న మగవాళ్ళు పెళ్ళాలని ఆదరంగా చూస్తారా ? కానీ జెయమొహన్, భార్య అరుణ్మోళిని చూసుకునే పద్ధతీ, ఆమెని తలమునకలుగా  ప్రేమిస్తున్నానూ.. ఆమె లేకుండా ఉండనే లేనూ అని  ప్రకటించుకోవడమూ, అలా జీవించడమూ చూస్తే చాలా  ముచ్చటేస్తుంది.  చాలా తక్కువమంది పిల్లలకు తల్లితండ్రుల మధ్య ఉన్న ప్రేమ, గౌరవాదరాలు ప్రత్యక్ష ఉదాహరణలు గా నిలుస్తాయి.   ఇంటి నుండే, ఈ లోకం చాలా  పాసిటివ్ గా, ప్రేమ మయంగా కూడా, ఉంటుందనే విషయం మనిషికి ప్రత్యక్షంగా తెలిస్తే కదా - అతను మంచి మనిషిగా పరిణామం చెందేది !! 


తరవాత యక్షిణులు - ఇక్కడ నుండీ కథ కొత్త పుంతలు తొక్కుతుంది. బాడ్ పార్ట్ అంతా అయిపోయి కొత్త అధ్యాయం జీవితంలో మొదలైనట్టు.  ఈ యక్షిణులకు కేరళ చరిత్ర లో కూడా పార్ట్ ఉంటుంది. ఎప్పటెప్పటివో కథలు, గాధలూనూ. కొందరు యక్షిణులు చెట్లను రక్షిస్తుంటారు. కొందరు యక్షిణులు అడవుల్లో పూజలందుకుంటారు. ఒకామె వేశ్యామాత. ఒకామె మదన మోహిని. ఒకామె బందిపోట్ల చేత హత్య కు గురైంది. కొందరు యక్షిణులు మార్తాండ వర్మ కేరళ ని జయించాక, యుద్ధంలో అమ్ముడుపోయిన బానిసలు. కేరళ రక్తంలో వివిద దేశాల డీ ఎన్ ఏ లు.. చరిత్ర. ప్రేమలు.. చరిత్రలు. 


ఇదంతా ఇంత చిన్న పుస్తకం లో చొప్పించి, ధన ధనా చదివించే కళ జయమోహన్ మంత్ర దండానిది. శేఖర్ గుప్తా లాగా అరటి పండు వలిచే ప్రక్రియలో కథనం పక్కదారి పట్టకుండా, ఇంకా ఇంకా ఆసక్తికరంగా మారుతూ ఉంటుంది.   ఉపకథలు, కొండలూ, కోనలూ, తుఫాన్లూ, నల్లని మబ్బులూ, చల్లని వానలూ, చిక్కటి గాలులూ పాఠకుడిని చుట్టుముట్టేస్తాయి. "మా ఊరిలా, మా ఊరలా.."  అని నాస్టాల్జియా లో మునిగి తేలే కుర్రాడిలా ఆయన చెప్తూండగా  మనమూ మన జ్ఞాపకాలలోకి పరుగుతులు తీస్తాము. అర్ధరాత్రి ఏ అతిథి గానో కొత్త ప్రదేశంలో పడుకుంటే, అందమైన అమ్మాయి 'సారె .. సారే' అంటూ పిలుస్తూ తలుపు తడుతుంది.  అడవిలో సైకిల్ మీద పక్క గ్రామానికి ప్రయాణం అయిన పెద్ద మనిషిని ఓ మదన మోహన ఎత్తుకుపోతుంది.  బీదరికం, దేశ దిమ్మరితనం, డిప్రెషన్ - భయానక జీవితానుభవాలూ, ఆయన కథలయ్యాయి. ప్రతీదీ‌ విస్తృత పరిశీలన చేయటం, మనుషులని గుర్తు పెట్టుకోవడమూ  వంంటి లక్షణాల వల్లే తనకు తారసిల్లిన ఎందరో మామూలుతనపు ముసుగేసుకున్న మహానుభావులని తన రచనలతో అందరికీ పరిచయం చేసారు రచయిత. అట్లాంటి వ్యక్తి    కేరళా, తమిళ నాడు లో తమ జీవితాన్ని గురించి చెప్తూ - నంబూద్రిలూ, నాయనమ్మ తిట్లూ, అక్కడి   నమ్మకాలూ, తిండి పదార్ధాలు, కషాయాలూ, కొరడా దెబ్బలూ, తిట్లూ, చండా వాద్యాలూ, కాలువల మీద పరిచే తాటి దూట వంతెనలూ, పడవ ప్రయాణాలూ, కథాకళి నడిచే రాత్రులూ అంటూ ఫ్లో తో చెప్తూ ఉంటే - ఇలా కొట్టుకెళిపోతూ ఉండడమే మనం చేయగలిగే పని.  ఒకోసారి బోరు కూడా కొడుతుంది.. కానీ మనకి బేసిక్ గా, బ్రతకడానికి‌ కాస్త గాసిప్‌కావాలి. చాలా సార్లు దాన్నే సాహిత్యం అంటాము.  ఇది అలాంటి అందమయిన జీవన గాసిప్. 


అయితే - ఇలా చదివి అలా వదిలేసే పుస్తకమైతే కాదు. పుస్తకం లో ప్రతి పాత్రా, ప్రతి ప్రస్తావనా, మనని వ్యక్తిగతంగా తాకుతాయి. ఉదాహరణకు వైశాలం, తన స్నేహితురాలి తో కలిసి అప్పట్లో పాపులరైన మళయాళ ప్రేమ సాహిత్యం చదువుతూ ఉండేది. ఆమె ప్రాణ స్నేహితురాలి భర్త, కేవలం,     వాళ్ళ కులం లో చెల్లుతుంది కాబట్టి ఇంకో భార్యను పెళ్ళాడి ఇంటికి తెచ్చుకుంటాడు.‌ గుమ్మంలో   అతన్ని దండలతో చూడగానే ఈమె (మొదటి భార్య)  మారుమాటాడకుండా పరిగెత్తి, పెరటి  బావిలో దూకి చనిపోతుంది. ఆమె తల బావి గోడకి గుద్దుకోవడం వల్ల, నీటిలో పడే ముందరే తల పగిలి ఆమె వెంటనే చనిపోతుంది. ఈ ఆత్మహత్య కలిగించిన షాక్.. వైశాలం జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. అలాగే ఆ చిన్న (!) ఇన్సిడెంట్ ని చదివిన మనం కూడా ఆ చావుని మర్చిపోలేం. ఆలోచిస్తాం. ఆ కొత్త భార్య రియాక్షన్ ఎలా ఉండి వుంతుంది. భర్త ఎంత గిల్ట్ ఫీలయి ఉంటాడు ? అసలు ఫీలయి ఉంటాడా ? దుర్మార్గుడిలానే ఉంటాడా ? ఇలా.. 


ఇలాంటి తీవ్రమైన ఇంపాక్ట్ దెబ్బల్ని చిన్నతనాన్నించీ తట్టుకుని, ఆ తరవాత, తలిదండ్రుల మరణానంతరం, ఇల్లు విడిచి, వీధిన పడి కొన్నాళ్ళు పరివ్రాజిక జీవితం గడిపాక, ఆ కాలంలో తెలుసుకున్న సత్యాలను క్రోడీకరించి, కథలు రాసినవాడు. కథల వల్లనే అరుణ్మోళి అనే ప్రియ సఖి దొరుకుతుంది.  రాయటం - అతని వ్యక్తిత్వానికి ఓ అవసరం అనిపిస్తుంది ఈ పుస్తకం చదివితే, ఎన్నో విషయాలు అతనిలో తన్నుకొచ్చేస్తూ, గుర్తొచ్చేస్తూ ఉంటాయి. వాటిని చెప్పకుండా, ఎక్కడో ఒక చోట పొదగకుండా ఉండలేడు. తల్లి తో కలిసి పుస్తకాల గురించి చర్చించిన టీనేజర్.. జీవితంలో స్థిరపడ్డానని అనుకునే వేళ, ఆమె మరణం తరవాత పసివాడైపోతాడు. అదీ అతన్నుండీ పోదు. ఈ పుస్తకం ద్వారా, తన కుటుంబానికి, తన బాల్యానికీ,  అప్పటి కేరళ రాజకీయ, సాంస్కృతిక వాతావరణానికీ నివాళులర్పించాడు. 


పుస్తకం చాలా స్టిర్రింగ్ గా ఉంటుంది. So,  ఓసారి చదవమని చెప్పేందుకు వెనకాడను. అనువాదం చాలా చాలా పోయెటిక్‌గా ఉంది.  ఆ అమ్మాయి సంగీత ఎపుడైనా కనిపిస్తే ఆ చేతులని ఒకసారి కళ్ళకద్దుకోవాలని అనిపిస్తుంది.  సామాన్యుడు కొనుక్కోగలిగే వెల లో దొరుకుతున్న ఒక  మంచి పుస్తకం  ఇది.  ఇది ఒక తరం చరిత్ర. ఇప్పుడు చెట్లను, అడవుల్నీ కాపాడే యక్షిణులు లేరు. రేప్ కో హత్యకో గురయితే,  యక్షిణి గా మారే ఆడవాళ్ళూ (/such lugends)  లేరు. మొగుడు  తెలివితేటలు లేని దద్దమ్మ అని తేలితే, వాడి చెప్పులు గడపవతల పెట్టి ఒక్క ముక్క మాటాడకుండా తరిమేసే భార్యలూ లేరు.  దెబ్బలాడుకోకుండా, అహంకారాలు బయట పెట్టుకోకుండా,  చెప్పలేనంత  ఏరొగెన్స్ తో తల్లితండ్రులనో,  పెళ్ళాలనో,  పిల్లలనో, భర్తలనో బాధపెట్టని మనుషులూ లేరు. సాంఘిక  చరిత్ర ని ఇలా, విడమర్చి, ఆసక్తి కరంగా చెప్పే పెద్దవాళ్ళూ మనకు లేరు.  కాబట్టి ఇదో చదివితెలుసుకోవాల్సిన కాలం  కథ.   కాలక్షేపపు ప్రేమలేఖ!

***

 


02/10/2026

WE DO NOT PART - Han Kang




హాన్ కాంగ్ రాసిన  We Do Not Part  ఒక అందమైన నవల. నిజానికి కొరియా చరిత్ర చాలా హింసాత్మకం. రెండో ప్రపంచ యుద్ధం లో ఓడాక జపాన్ చేతుల్లోంచీ బయటపడి, రెండు చీలికలయి, ఒక భాగం కమ్యూనిస్టు రష్యా చేతిలోకీ, ఇంకో భాగం అమెరికా చేతిలోకీ చేరి, ఎంతో హింసా, మారణ హోమాల బారిన పడి, ఇప్పుడు ఇలా రాజకీయంగా, సామాజికంగా కాస్త పుంజుకున్న రాజ్యం అది.  సాహిత్యం లో ఇలాంటి నరమేధాల గురించి  రచయితలు రాస్తూంటారు. ఎలీ షెఫాక్ వంటి వాళ్ళూ, ఇలా హాన్ కాంగ్ వంటి వాళ్ళూ, నస్రీన్ లూ, పాముక్ లూ రాయటం వల్ల అదికారంలో ఉన్నవాళ్ళు సెన్సార్ చేసినా కూడా, కంట్రోల్ చేసినా, తిరగరాసినా, వక్రీకరించినా,  మానవజాతి చరిత్రలో జరిగిన నరమేధాల రికార్డ్, అన్ని దేశాలలో ఉన్న నలుగురికీ చేరుతుంది.  దానికి వాళ్ళు చెల్లించే మూల్యం కూడా ఒక demonstration. 

అలా, కొరియా చరిత్ర లో చీకటి కోణాల గురించి 'Human Acts' అనే పుస్తకం రాసిన తరవాత హాన్ కాంగ్ కూడా మానసికంగా చాలా అలజడి కి గురయ్యారు. తరచూ పీడకలలు వేధించడం, నిద్ర లేమి, డిప్రెషన్ తో బాధపడ్డారు. ఈ పుస్తకం కూడా పుంఖానుపుంఖాలు గా ఒక మనిషి, వేరే మనిషి మీద, ఏదో నమ్మకాన్నో, సిద్ధాంతాన్నో అడ్డు పెట్టుకుని, మానవత్వం లేకుండా వ్యవహరించడం,  చేసే అరాచకం గురించే చర్చిస్తుంది.   తనకు వచ్చే పీడకలల నుంచి ఇన్స్పైర్ అయి, వాటి అర్ధాన్ని విడమర్చి, తరచి చూసుకుని ఈ కథని చెప్పాల్సిన అవసరాన్ని హాన్ కాంగ్ గుర్తించారు. ఈ నవలలో వ్యక్తిగతంగా ప్రభావితం అయిన వారిగురించి విషయ సేకరణ చేస్తూ, నవల్లోకి అల్లుకుంటూ,  ఘోరమైన విషయాల్ని చర్చించడానికి  ఆవిడకు చాలా సమయం పట్టింది. 'ఇక రాయలేను' అనుకున్నాక కూడా రాసి, కొరియా లో ఏ తరమూ మర్చిపోకూడని అధ్యాయాన్ని ప్రపంచం ముందుకు తీసుకొచ్చారు.  ఎందుకంటే, చరిత్ర ని విస్మరించి, పట్టించుకోకుండా ఉండడం మనిషి వినాశనానికే దారితీస్తుంది.  ఇది చదివాకా అయినా మనిషి 'ఏం చేయకూడదో' అనేది  నేర్చుకుంటాడేమో అనిపిస్తుంది. 


ఇది ప్రధానంగా 'క్యుంఘా' అనే ఒక (రచయిత్రి) పాత్ర చెప్పిన కథ.    ఆమె కొరియా లోని నరమేధాల గురించి డాక్యుమెంట్ చేసి ఒక ప్రాజక్ట్ ముగించాకా, తీవ్రమైన వేదనలో కూరుకుపోయి, ఆరోగ్యం చెడి, ఒంటరిగా తన సియోల్ ఫ్లాట్ లో మానసిక కృంగుబాటు లో, మైగ్రైన్, ఇతర ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ ఉంటుంది. తల్లి తండ్రులిద్దరూ మరణించారు.  ఒంటరితనం, కుంగుబాటూ ఆమెను తీవ్రంగా బాధిస్తుంటాయి.  అనారోగ్యం వల్ల ఆర్ధిక సమస్యలూ చుట్టుముట్టేస్తున్నాయి.  పీడ కలలు వెన్నాడుతుంటాయి. వాటి నిండా మంచు లో కూరుకుపోయిన చెట్ల మెండాలు.

ఇలాంటి పరిస్థితుల్లో తన పాత స్నేహితురాలు ఇన్సియాన్ ఆమెను అర్జంట్ గా రమ్మని మెసేజ్ చేస్తుంది.  నిజానికి ఇన్సియాన్, సియోల్ కు దూరంగా ఓ గ్రామంలో ఉంటూంది.  ఇన్సియాన్ తల్లి చివరి దశలో డిమెన్షియా కు గురయి, వాళ్ళ గ్రామం లో మరణించాకా, ఆమెకు తోడుగా అక్కడే ఉండాల్సి రావడాన, ఇన్సియాన్ కూడా సియోల్ అదీ వదిలేసి, గ్రామం లోనే కార్పెంటరీ పని చేసుకుంటూ ఉండిపోతుంది. అలాంటి ఇన్సియాన్ కు తన వర్క్ షాప్ లో మెషీన్ లో వేళ్ళు పడి, తీవ్ర గాయల పాలవుతుంది.   ఆమెని తెలిసిన వాళ్ళెవరో చూసి, ఉన్న పళాన airlift  చేసి, సియోల్ తీస్కొచ్చి హాస్పిటల్ లో వేసారు. 


అయితే, ఇన్సియాన్ ఇంట్లో ఒక పెంపుడు పక్షి ఉంది. దానికి తిండీ నీళ్ళూ పెట్టే నాధుళ్ళేడు. ఆమె ఇల్లు గ్రామానికి అవతల ఓ నిర్మానుష్యమైన ప్రాంతం లో ఉంటుంది. ఆ ఇంటికి ఏ (వాతావరణ) సమస్యొచ్చినా చటుక్కున కరెంటూ, నీళ్ళూ కట్ అయిపోతుంటాయి.  ఒక ఇరుగూ పొరుగూ లేరు. పైగా ఇన్సియాన్ తీవ్రమైన అంతర్ముఖి.  క్యుంఘా తప్ప ఇంకెవరూ స్నేహితుల్లేరు. కాబట్టి క్యుంఘా ఎలా అయినా ఇన్సియాన్ ఊరికి వెళ్ళి, ఆ పక్షి ని కాపాడాలి. ఇదీ ప్లాట్. 

ఇన్సియాన్ ఉండే ఊరు ఒక దీవి లోఉంటుంది. దాని పేరు జెజూ దీవి. ఈ ఊరికి కొరియా చరిత్ర లో ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఈ దీవి ప్రజలు, కొరియా విభజన ని వ్యతిరేకించారు. ఆ పాపానికి వీళ్ళకి అమెరికన్ లు రెడ్ లు / కమ్యూనిస్టు లు గా ముద్ర వేసి, నానా ఇబ్బందులకు గురి చేసారు. కొరియా విభజన తరవాత ఏలిన వాళ్ళందరూ జెజూ మీద అరాచకత్వానికి పాల్పడ్డారు. మార్షల్ లా వచ్చిన తరవాత అమెరికన్ ల పర్యవేక్షణ లో తీవ్రమైన మారణ కాండ జరిగింది. చిన్నా పెద్దా ముసలీ, ముతకా, స్త్రీ పురుషుల్ని అందరినీ సమూలంగా నాశనం (Exterminate) చేసారు. అయితే చాలా సార్లు శవాలే దొరకని పరిస్థితి వల్ల,  sensorship వల్ల, ఈ మారణ హోమాల్ని ప్రూవ్ చేయలేక జిజూ సమాజం చాలా ఇబ్బంది పడింది. ఎన్నో ఏళ్ళు గా అక్కడ మీడియా గానీ, న్యాయం గానీ లేక, ఎటువంటి రికార్డూ లేక, తుడిచిపెట్టబడ్డ మనుషులు అడవుల్లో, కొండల్లో, కొమ్మల్లో, గాలిలో మంచు బిందువులుగా మాత్రమే మిగిలిపోయారు.   


క్యుంఘా అతి కష్టం మీద సియోల్ నుంచీ మంచు తుఫానులో సరైన ఆరోగ్యమూ, ప్రణాళికా లేకుండా బయల్దేరి జిజూ కు వెళ్ళి, తానేనాడో చూసిన ఇన్సియాన్ ఇంటినీ దారినీ గుర్తు చేసుకుంటూ, దారిలో మంచు తుఫాను బారిన పడి, చలీ, జారిపడటాన తగిలిన దెబ్బల  వల్ల తీవ్ర ఇబ్బందులు పడి ఎలానో ఇన్సియాన్ ఇల్లు చేరే సరికీ ఆ పెంపుడు పక్షి అప్పటికే చనిపోయుంటుంది. పక్షిని ఎలానో మోకాళ్ళోతు మంచులో అతికష్టం మీద పెరటి చెట్టు కింద పాతిపెట్టి, ఇంట్లోకి వచ్చి చూస్తే, వెచ్చదనం అనేదే లేకుండా, కరెంటు పోయి, బాయిలర్ ఆఫ్ అయిపోతుంది. నీళ్ళూ రావు. సాయంత్రం చీకటి చిక్కబడిపోయి, ఒక కేండిల్ వెలుగు తప్ప ఏ ఆధారమూ లేక, బాధో సౌఖ్యమో తెలీనివ్వని మంచు వల్ల చంపేసే చలి లో బహుశా చనిపోతూ, ఇన్సియాన్ జీవితాన్ని, ఆమెతో అంతకు ముందు ఎపుడో జరిపిన సంభాషణల్నీ, ఈ ఇంటితో, ఆమె పెంచుకున్న పక్షులతో, ఇన్సియాన్ చెప్తూండే కబుర్లతో, తలపోతలతో, హేలూసినేషన్లు, చిత్త భ్రమా మొదలయిపోతాయి క్యుంఘా కు. 


ఈ చిత్త భ్రమలో చనిపోయిన పక్షి బ్రతికొచ్చి, ఇంట్లో ఎగురుతున్నట్టూ, హాస్పిటల్ లో వేళ్ళు తెగి, ఆపరేషన్లయి, తీవ్ర బాధలో ఉన్న తన స్నేహితురాలు ఇన్సియాన్ హఠాత్తుగా ఆ మంచు తుఫానులో ఆ ఇంటిలోకి వచ్చేసి, తనకు సాయాలు చేసేస్తూ, తనకు ఏదో వండి పెట్టి, వెచ్చపెట్టి, మాటలవీ మొదలుపెట్టినట్టూ, తనకి ఆమె కథనీ, తన కుటుంబపు కథనీ చెప్తున్నట్టు, వాళ్ళు సహజంగా వీడియో గ్రాఫర్లూ, డాక్యుమెంటరీల తయారీదార్లూ కావడాన తాము జెజూ, గ్వాంజూ మారణహోమాల గురించి  సేకరించిన ఆధారాలతో మాటాడుకుంటున్నట్టూ భ్రమపడుతుంది. 


ఈ భ్రమల్లో ఇన్సియాన్ తల్లి జీవితం గురించే మాటాడుకుంటారు.  ఆమె పసితనంలో,  జెజూ దీవి లో ఇన్సియాన్ తల్లి ఊరిపై దాడి జరిగి, ఊర్లో వాళ్ళందరినీ ఒక చోట చేర్చి,  సైనికులు కాల్చి  చంపేస్తారు.  ఇళ్ళు తగలపెట్టేస్తారు.  ఆపూటకి అనుకోకుండా బయటికి వెళ్ళిన ఇన్సియాన్ తల్లీ, ఆమె సోదరీ మాత్రం బ్రతుకుతారు. వచ్చి, తమ వారి శవాలని వాటి ముఖాల మీద పేరిన మంచు పొరల్ను చేతితో తుడుస్తూ వెతుకుతారు. వారికి అక్కడ దవడ లో తూటా తగిలిన పసి చెల్లెలు దొరుకుతుంది.  ఇన్సియాన్  తల్లి ఆ చెల్లి నోట్లో తన రక్తం కారుతున్న చిన్న గాయం తాకిన వేలిని పెట్టి, ఆమె కోల్పోయిన రక్తం లో కొంతయినా ఆ పసిదానికి ఇవ్వగలుగుతున్నాను అనుకుంటుంది. ఆ  రోజుల్లో వయసొచ్చిన మగపిల్లల్ని, సైనికులు చంపేస్తారో / సైన్యంలోకి బలవంతంగా చేర్పిస్తారో అనే భయానికి కుటుంబాలు అడవుల్లోకి పారిపొమ్మనేవి. అలా ఆ రాత్రి ఇన్సియాన్ తల్లి సోదరుడు బ్రతికినా, తరవాత బందీ అయి, రాజకీయ హత్యాకాండ లో మరణిస్తాడు. అయితే అసంఖ్యాక మరణాల మధ్య, ఇతను ఉన్నాడో, పోయాడో తెలీక అక్కచెల్లెళ్ళిద్దరూ, యుద్ధం ముగిసాక కూడా కొన్నేళ్ళ పాటూ సోదరుణ్ణి వెతికీ వెతికీ, కనీసం ఎముకలన్నా దొరికితే తమకో సమాధానం దొరుకునే అని బాధపడతారు. ఏ అద్భుతమో జరిగి  అతను బ్రతికాడేమో అని, వారి చివరి దశ వరకూ ఎంతో ఆశపడతారు. ఆఖరికి చనిపోయే ఉంటాడని సర్ది చెప్పుకుంటారు.

ఈ మారణ హోమాలు, గ్రామాల మధ్యలోకి తీసుకొచ్చి చంపేసిన గ్రామస్తులు, సముద్రపు అంచున నిల్చోబెట్టో, లోయల / సొరంగాల అంచుల్లోనో నిల్చోబెట్టి, వరసగా కాల్చేస్తే, అక్కడ గుట్టలుగా ఒకళ మీదొకరు పడి చనిపోయి, అలాగే ఎముకల కుప్పలుగా మిగిలిన వేలాది శరీరావశేషాల మధ్య తమ వారెవరో అని వెతికిన తరాల కథ ఇది.   అయితే ఈ శవాలు, ఆధారాలూ అనేవి యుద్ధం ముగిసిన ఎన్నో ఏళ్ళకి గానీ దొరకలేదు. దొరికాక వాటిని జల్లెడ పట్టే పరిస్థితిలోనూ అవి మిగల్లేదు. ఎవరు ఎలా ఎక్కడ చనిపోయి ఉంటారో మిలటరీ రికార్డుల ద్వారా తెలుసుకునే ప్రయత్నాలకోసం ప్రజలే సంఘాలు గా ఏర్పడ్డారు. చాలా మంది పిల్లలకు తమ కుటుంబాలిలా చెదిరిపోయాయనే తెలియదు. అధికారిక లెక్కల ప్రకారమే 30,000 దాకా చంపబడ్డారు. 


గతానికీ, వర్తమానానికీ, ఊహకీ, నిజానికీ మధ్య ఊగిసలాడుతూ సాగే కథనం లో ఈ మారణహోమాల వల్ల ప్రభావితమైన మనుషుల వేదనని చదువుతున్నపుడు, గుండె బరువెక్కుతూ ఉంటుంది. ఇలాంటి ఘోరాలు మానవ చరిత్రలో ఎన్నో జరిగాయి. ఇంకా జరుగుతూనే ఉన్నాయి. దక్షిణ   కొరియాలోనే చాలా టైం లైన్ల లో చాలా ప్రాంతాలలో ఈ అణిచివేత ప్రయత్నాలు జరిగాయి. అవి కూడా పాపులర్ కాలేదు. అసలివి జరిగాయని బయటకు తెలీనివ్వలేదు. బాధితులు తమ పిల్లలకు సైతం ఈ విషయాలు చెప్పుకునే వారు కాదు. ఆ సంగతుల్ని గురించి మాటాడటం, ట్రామాని మరింత  పెంచేది. కానీ కొన్నాళ్ళకి,  నిజం బయటపడింది.  ఇంటికి రాని తమ వాళ్ళ కోసం తల్లడిల్లిన కుటుంబాలు సంఘాలుగా ఏర్పడి,  తమ ప్రయత్నాలని విడిచిపెట్టకుండా కొనసాగించడాన ప్రపంచం ఈ మారణకాండని గుర్తించింది. 


కానీ చాలామంది దక్షిణ కొరియన్ లకే ఈ చరిత్ర చాలా రోజులకి గానీ తెలీలేదు. కొన్ని తరాలు మాయం కూడా అయిపోయాయి. కానీ మెల్లగా కాలం మారింది. ఒకప్పుడు మరుగునపడిపోయిన ఘోరాలు వెలుగులోకి వచ్చాయి. అప్పటి దక్షిణ కొరియా ప్రభుత్వం ఈ మారణకాండ పై తీవ్రమైన సెన్సార్ షిప్ విధించింది. ఇప్పటి అమెరికన్లకైతే, తమ పర్యవేక్షణలో దక్షిణ కొరియాలో ప్రభుత్వ దళాలు తమ పౌరుల్నే తీవ్రంగా అణిచివేసాయని, గుంపులుగా చేసి జైళ్ళలో పెట్టీ, జైళ్ళలో కుక్కేందుకు జాగా లేదని చెప్పి పాత ఖైదీలను వరుసలుగా పెట్టి కాల్చేసారనీ, ఊరికే, గ్రామాల మీదా, స్కూళ్ళ మీదా పడి పిల్లల్నీ, తల్లుల్నీ, పాలు తాగే పసివాళ్ళనీ చంపేసారనీ, తెలీదు. దక్షిణ కొరియాలో కమ్యూనిజాన్నో, విభజన వ్యతిరేకతనో తీవ్రంగా అణిచివేయటంలో తాము ఘనవిజయం సాధించామంటూ అమెరికన్ మిలీటరీ హిస్టరీ నమోదు చేసుకుంది. కానీ అప్పటి సీక్రెట్ డాక్యుమెంట్లు 50 ఏళ్ళ తరవాత డీ-క్లాసిఫై కావడం తో ఈ నరమేధం గురించి కథనాలు బయటికొచ్చాయి.  ఇన్నేళ్ళకి దక్షిణ కొరియా ప్రభుత్వం ప్రజలకు క్షమాపణలు చెప్పింది.


నవలలో హాన్ కాంగ్ ప్రస్తావించిన పలు సంఘటనలు నిజంగా జరిగినవే.  డరాంగ్షి గుహల్లో గుట్టలుగా పేరుకుపోయిన మనుషుల్ని ప్రభుత్వ దళాలే కాల్చేయి. తల వెనుక కాల్చడం వల్ల పుర్రె చెదిరి కిందకు లోతుల్లోకి కాళ్ళు బార్లజాపి, ముఖం మీద పడి చచ్చిపోయిన శవాలు కుళ్ళుతుండగానే, వాటి మీదికి ఇంకో లేయర్ తాజా  శవాలు వాలేవి. ఇలా కొన్ని నెలల పాటూ వరుసలు వరుసలుగా మానవ దేహాలు. తమవారేమయారో తెలీక స్థానికుల కుటుంబాల తరాల పాటూ వెతుకులాటలు, వ్యధాలూ అనుభవించడం. ఇవన్నీ నిజంగానే జరిగాయి.  లోయలో, కందకాలో పూర్తిగా నిండి ఇక శవాలకి స్థలం లేకపోతే, గుట్ట మీద పడిన వారెవరైనా ప్రాణాలతో బయటపడి, ఆ కందకాన్నించీ కాలినడకన బయటపడగలిగే పరిస్థితి  వచ్చే వరకూ వాటిని వాడారు. తరవాత సీల్ చేసారు.  


దక్షిణ కొరియా గురించి ఇప్పుడు ప్రపంచం చాలా గ్లామరస్ గా తెలుసుకునుండొచ్చు.  కొత్త కొరియన్ వేవ్ లో సాంకేతిక విప్లవం, వ్యాపారాలూ, నైపుణ్యాలూ, ప్రపంచ స్థాయి సాహిత్యమూ, టెలివిజన్, కొరియన్ పాప్ కలల్ని అమ్మే ఈ సమాజం తమ గతాన్ని గురించి తెలుసుకోకపోవడం క్షమించరాని నేరం. అందుకే ఎన్నో ఉద్యమాలు,  కొరియా పర్యంతమూ మరణించిన ఎందరో వీరులూ, సాధారణ పౌరులు, తల్లులూ, పిల్లలూ, యువకులూ వీళ్ళ గురించి ఎన్నో సంస్థలూ, మ్యూజియం లూ, కలెక్టివ్ లూ, సంఘాలూ పుట్టాయి. మనవమాత్రులకు సాధ్యమయినన్ని శవాలని గుర్తించే ప్రయత్నాలు జరిగాయి. అప్పటికే గనుల్లో విసిరివేయబడి, ఏ నీళ్ళలోనో కొట్టుకెళిపోయి, చెల్లా చెదురయిన వేలాది మనుష్యావశేషాలను ఇక లెక్కించలేక, వదిలేసారు. కానీ మనిషిని గుర్తు పెట్టుకోవడం, వారిని తలచుకోవడం, అలాంటి అడిగేవారెవరూ లేరని జరిగే అన్యాయమైన మారణ కాండలు, నరమేధాలు, ఇంకెన్నడూ జరగనివ్వకుండా చూసుకోవడమూ, సమాజానికి అవసరం. 


అందుకే కొరియాలో మరో మారు 2024 డిసెంబరు లో అప్పటి అధ్యక్షుడు 'యూన్ సుక్ యోల్',  ప్రజా వ్యతిరేకతను అణచడానికి మార్షల్ లా ప్రవేశపెడతానని ప్రకటించగానే, పెద్ద యెత్తున దేశం తిరగపడింది.  అతన్ని అప్పటికపుడు పదవి నుండీ తప్పించి, ప్రాసిక్యూట్ చేసారు. ఇలాంటి కుట్రల్నుంచీ, అత్యంత కష్టం మీద సాధించుకున్న ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుంటామని దక్షిణ కొరియా చాటి చెప్పింది. ఇలా వెర్రి తలలు వేసే అధికార దాహాన్ని మొగ్గలోనే తుంచేయకపోతే, రేపు సమాజమే బాధలు అనుభవించాలి. 


ఈ నవలలో ఒక్క డీటైలూ వదలకుండా, పాపులర్ మీడియాలోనికి  సెన్సార్ అయి, ప్రచారంలోకి రాని వాటన్నిటినీ మనస్సాక్షి తో రాయటం వల్ల, వాడిన భాషా సౌందర్యం వల్లా, మధ్యలో పాఠకుడి గుక్క తిప్పుకునేందుకు అవకాశం ఇస్తూ, కథనాన్ని జరుపుతూ చెప్పటం వల్ల చాలా కష్టమైన విషయాన్ని, తమ జాతి చరిత్రనీ చర్చించడం వల్లా, చనిపోయిన ఎన్నో ఆత్మలకు శాంతి కలిగించినట్టయింది. మిమ్మల్ని మేము మర్చిపోం అని చెప్పినట్టయింది. 


ఇందులో ఇన్సియాన్, క్యుంఘాల స్నేహం ఒక కడుపున పుట్టని తోబుట్టువుల స్నేహం లాంటిది. క్యుంఘా చివరి క్షణాలలో ఇన్సియాన్ ఆమెను ఒంటరిగా వదలకుండా ఆమె ఊహల్ని ఆవరించి, తన గాధని చెప్తుంది. పుస్తకం లో సగానికి సగం చరిత్రే. అయినా విసుగనిపించదు. చదివేందుకు కష్టంగానూ ఉండదు. ఒకదాని వెనుక ఒకటి సంఘటనలు జరుగుతూనే ఉంటాయి. సాక్షుల సాక్షాలు, పత్రికల కటింగ్ లు, చేతి వ్రాతలో రాసుకున్న నోట్సూ, అన్నీ పాఠకుణ్ణి విస్మయానికి గురి చేస్తాయి. అయితే ఇది చెప్పడానికి భయానక పరిస్థితులూ, రచయిత్రి మరణమో / ఇంకేదో ఎందుకు పుట్టించారో అనిపిస్తుంది. చివర్లో  అక్కడ ఇన్సియాన్ అకస్మాత్తుగా ఎలా ప్రత్యక్షం అయి కథను చెప్తూ వస్తుందో, అలానే అదృశ్యం అవుతుంది. దానర్ధం, సియోల్ లో ఆమె ఆరోగ్యం కుదుటపడి, ఆమె ఆత్మ తన శరీరాన్ని ఆరొగ్యంగా చేరినట్టా ? ఇక్కడ ఈమె పక్షులు ఎందుకు చనిపోతాయి. ఆ మంచు, ఆ చెట్ల మొండాలు, ఆ కలలు ఏమిటి ? అవి దేనికన్న ప్రతీకలా? ఇంతకీ ఈ కథంతా చెప్పిన అమ్మాయి చివరికి చనిపోయిందా, బ్రతికిందా అర్ధం కాదు. ఎలాంటి ముగింపు ఉండాలో మనం ఊహించుకున్నా, చెప్పిన కథంతా మాత్రం,  మర్చిపోకూడని చరిత్ర. 



Notes : 

Darangshi Caves 

Jeju Massacre 

Watch on TV 

***





    

17/08/2026

Houti Attacks in the Red Sea and the Shifting Paragigms of Modern Warfare - AVM PK Mallick, VSM (Retd)

 Houti Attacks in the Red Sea and the Shifting Paragigms of Modern Warfare - AVM PK Mallick, VSM (Retd)

చైనా టిబెట్ లో ప్రపంచం లో అతి మెగా అతి పెద్ద డాం (Medog Hydropower Station) ని నిర్మిస్తూంది. ఒక వేళ ఏ భూకంపాలకో, లాండ్ స్లైడింగ్ వల్లనో, చైనా కనుక ఆ డాం ను నియంత్రించలేకపోయినా, లేదా ఆ డాం పగిలినా, నిజంగానే చైనా ఉద్దేశ్యపూర్వకంగా డాం ని బద్దలు కొట్టినా, ఆ నది నీరు, కింద ఉన్న అరుణాచల్ ప్రదేశ్, అసాం, బాంగ్లాదేష్ లను సమూలంగా ముంచెత్తగలవు. ఒక విధంగా ఆ నీరు ఒక ఆయుధం. అదేదో అంటామే - ఒక సారి వినాశనం సృష్టించే మెగా మాస్ డిస్ట్రక్టర్. దీనితో పాటూ జరిగే ఎకాలజికల్ విధ్వంసం కూడా ఈ ప్రాంతాలు త్వరగా కోలుకోనివ్వలేవు.   ఇలా ప్రకృతిని, భౌగోళిక సంపదలనూ, ప్రాదేశిక వాతావరణాన్నీ, బూచి గా మార్చడాన్ని మానవుడు ఎపుడో నేర్చేసుకున్నాడు.  చైనా ఇపుడు ప్రపంచంలోనే బలమైన దేశం, సార్వభౌమాధికారం ఉన్న ఒక దేశం.  కానీ ఏ సార్వభౌమత్వమూ, రాజ్యమూ లేని చిన్న ఉగ్ర మూక, పర్యావరణ బాంబుల్నీ, చిన్న చిన్న పడవల్నీ, ఆయుధాలనీ వాడి, ప్రపంచ వాణిజ్యాన్ని అతలాకుతలం చెయ్యగలగడం, దాని ముందు పెద్ద పెద్ద నేవీలు, సైన్యాలు కూడా దిక్కు తోచని పరిస్థితి కి నెట్టివేయబడడం ఇప్పుడు చూస్తున్నాం. 


దాని గురించి రాసిన ఈ బుల్లి 62 పేజీల ఈ బుక్ గురించి నేను చేస్తున్న చిన్న పరిచయం ఇది. యుద్ధ కళ బాగా మారింది. ఆధునికం కాస్తా అత్యాధునికం అయింది. కృత్రిమ మేధ - రకరకాల మనుషుల్లేని విమానాలు, ఇంటర్ నెట్, బిగ్ డేటా, టెక్నాలజీ, సింథటిక్ బయాలజీ, వగైరాలు అందరి నాలుకలపై తిరుగుతున్నాయి. 

ఎర్ర సముద్రం లో ఇప్పుడు  ఉన్న పరిస్థితులు, వాటి వెనకున్న మర్మాలు, గొడవలు, ఆయుధాలూ వీటన్నిటి గురించి ఇంకా, సాంప్రదాయ సైన్యానికి ఉన్న పరిమితులు, సొంతింటి గూళ్ళలోంచీ స్థానబలిమితో అదుపైన (గొరిల్లా)  పోరాటం చేసే తీవ్రవాదులూ, సాయుధ మూకలు, ప్రపంచం లోకెల్లా అత్యంత సమర్ధవంతమైన నౌకా సైన్యాన్ని సైతం ఎదుర్కోగల చిన్న చిన్న వ్యూహాల సామర్ధ్యం గురించి రచయిత ఈ పుస్తకం లో వివరిస్తారు. 


నిజానికి ఎర్ర సముద్రం లో ఇప్పుడు జరగాల్సిన యుద్ధం పెద్ద పెద్ద వార్ షిప్ ల తో కాకుండా తీరాల్లో గస్తీకీ యుద్ధానికి వాడే చిన్న నౌకలకూ, ఈ మూకలు వాడే చిన్న బోట్లకూ మధ్యే జరగాలి. దీన్ని బట్టి సముద్రం లో శాంతినీ, స్థిరత్వాన్ని ఈ అతి పెద్ద అత్యాధునిక యుద్ధ నౌకలు, శక్తివంతమైన నౌకా దళాలూ తీసుకొస్తాయన్న గారంటీ అయితే ఇప్పుడు లేదు. ఈ వార్ షిప్ ల బలిమి తగ్గలేదు గానీ వీటి వాడకంలో   కొన్నిటిని లోతుగా పరిశీలించాల్సిన అవసరం ఉంది. 


సౌదీ అరేబియా కూ యెమెన్ కూ మధ్య ఉన్న సమస్యలూ, యెమెన్ కూ దిజిబూతీ కీ మధ్య దగ్గర దగ్గర కనిష్టంగా 20 మైళ్ళ వైశాల్యం మాత్రమే ఉండిన బాబ్ ఎల్ మండెబ్ సంధి తాలూకూ ప్రాధాన్యతా - ఇపుడు ప్రపంచానికి తెలుసు. సౌదీ, యునైటెడ్ అరబ్ ఎమిరైట్స్ కూ, ఇరాన్ కూ మధ్య ఉన్న ప్రాధమిక వాణిజ్య రహదారి అయిన హర్మూజ్ జల సంధి ని ఇరాన్ ఆపేశాకా, దాదాపు పెట్రోల్ ఉత్పత్తి చేసే దేశాలన్నీ  సౌదీ కి దిగువన ఉన్న ఈ బాబ్ ఎల్ మెండెబ్ జల సంధి ద్వారా తమ క్రూడ్ ఆయిల్ నూ, ఎల్ ఎన్ జీ నీ సరఫరా చేస్తున్నాయి. అయితే, ఈ జల సంధి లో ట్రాఫిక్ కీలకంగా మారిన కొన్ని నెలలకు హౌతీలు దీనిలో దాడులకు తెగబడి, అమెరికాను మరింత ఇరకాటంలోకి నెట్టేయడం, ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన అమెరికా సాయుధ సంపద ఈ గుంపు ముందు, ఈ గుంపు వాడే చిన్నా చితకా ఆయుధాల ముందు బెదరాల్సి రావడం విచిత్రం. 


బాబ్ ఎల్ మెండెబ్,   మెడిటెరేనియన్ సముద్రాన్నీ, హిందూ మహా సముద్రాన్ని కలిపే చోట ఉన్న  ఓ కీలకమైన జల సంధి.   దీనికి పశ్చిమాన ఆఫ్రికా తీరం  లోని దిజిబూతీ, తూర్పున యెమెన్ ఉన్నాయి. పెరిం ద్వీపం (జబాల్ అల్ టాయిర్) ఈ సంధిని రెండు ప్రధాన సముద్రయాన మార్గాలుగా విడదీస్తుంది. 



* కుడి కాలువ  (బాబ్ ఇక్సెందర్) : రెండు మైళ్ళ వెడల్పు, దగ్గరదగ్గర 98 అడుగుల లోతు తో అంత పెద్దవి కాని నౌకలకి సరిపోతుందిది. 


* పడమటి కాలువ : 16 మైళ్ళ వెడల్పు, 1017 అడుగుల లోతు తో లోపలికీ, బయటికీ రెండువైపులా నౌకలు ప్రయాణించడానికి రెండు రెండేసి మైళ్ళ ఇరుకు ఉన్న ట్రాన్సిట్ కారిడార్లతో ఉంటుంది. ఈ ఇరుకు దారి లో వెళ్ళే వాణిజ్య నౌకల పరిస్థితి ఎంత సున్నితంగా ఉంటుందో ఊహించుకోండి. సాధారణంగా వాణిజ్య నౌకలు బోల్డంత బరువుల్ని మోసుకుపోతూ, అతి నెమ్మదిగా ప్రయాణిస్తూంటాయి. వీటి మీద దాడి జరిగితే ఎంత కష్టం? పైగా అవి క్రూడ్ ని తీసుకెళ్ళే నౌకలయితే ? 

రష్యన్ ఆయిల్ మీద నిషేధం విధించిన తరవాత 2021 నుండీ 2023 మధ్య ఈ బాబ్ ఎల్ మెండెబ్ తాలూకు ప్రాముఖ్యత పెరిగింది. రష్యా సూయెజ్ కెనాల్, ఆ తరవాత బాబ్ ఎల్ మెండెబ్ గుండానే తన ఆయిల్ ను ఇండియా, చైనాలకు పంపించేది.  అదే విధంగా సౌదీ, యూ ఏ ఈ వంటి దేశాలు, తమ ఉత్పత్తులను  యూరప్ కు పంపేందుకూ ఈ మార్గమే సరైనది.  ఈ జల సంధి మీద అధికారం ఎవరిదీ అనే ప్రశ్న, యెమెన్ లో అంతర్యుద్ధం పొడుగూతా రేగుతూనే వచ్చింది. 2015 లో యెమెన్ తన తీరాన్నంతటినీ సాయుధ దళాలతో నింపేసింది. 2015 నుండీ 2017 వరకూ హౌతీలు ఈ ద్వీపాలను ఈ జలసంధి గుండా ప్రయాణించే నౌకల మీద దాడి చేయడానికి వాడేవారు. వీటిని కొత్తలో యూ ఏ ఈ వగైరా దేశాలు, చిన్న చిన్న నౌకల సాయంతో బానే ఎదుర్కొన్నారు. వాళ్ళని బాబ్ ఎల్ మెండెబ్ దరి దాపుల్లోంచీ, పెరిం దీవి నుండీ ఎన్నోసార్లు తరిమి కొట్టారు. అయితే హౌతీలు ఓడిపోలేదు. వెనుదిరగలేదు. ఎప్పటికప్పుడు ఏదో రకంగా తమ అదుపుని కొనసాగించారు. హోడిడా లాంటి కీలకమైన నగరాన్ని తమ ఆధీనం లోనే ఉంచుకున్నారు. 


2023 నవంబర్ ఒకటిన ఇండియా నుండీ టర్కీ కి కార్లని రవాణా చేస్తున్న ఒక వాణిజ్య నౌక ' గేలక్సీ లీడర్"  ని బంధించారు. దీనిని ఒక జపన్ కంపెనీ నడిపింది.  దీనికి బెహమీస్ జెండా ఉంది గానీ దీని ఓనర్ ఒక బ్రిటిష్ కంపెనీ.  కానీ ఇంకో ఓనర్ పార్ట్నర్ "ఇస్రాయిలీ" అనే సాకు హౌతీలకి ఉంది. దీన్ని తీస్కెళ్ళి తమ ఆధీనంలో ఉన్న హౌడీడా పోర్ట్ లో బంధించుకున్నారు. నౌకలకి ప్రత్యేకంగా ఒక దేశం ఉండదు. బందీలయిన ఓడ సిబ్బందిలో ఒక్కరూ ఇస్రాయిలీ లేరు.  అయితే, ఈ దాడితో హౌతీల ప్రభ వెలిగింది. అసలు హౌతీల గొడవ ఏమిటా అని అందరూ తల తిప్పి చూశారు. అయితే, హౌతీలు అంతకన్నా పురాతనమైన వాళ్ళే. 


హౌతీల అసలు పేరు అన్సర్ అల్లా ("Ansar Allah") (దేవుని మద్దతుదారులు) - వీళ్ళ కథ  1990 లలో మొదలయింది. యెమెన్ లో షియా ముస్లిం లలో వీరిదొక మైనారిటీ వర్గం. పేరు జైదీలు. వీళ్ళకి ఈ పేరు వారి పోరాటాన్ని ముందుకు తెచ్చిన "హుసేన్ అల్ హౌతీ" పేరు మీదుగా వచ్చింది. షియా ల లో జైదీలు వేరు. వీళ్ళు దక్షిణ సౌదీ అరేబియా లోనూ, ఉత్తర యెమెన్ లోనూ కనిపిస్తారు. వీళ్ళకూ మామూలు షియాలకూ కొన్ని తేడాలున్నాయి.  వీళ్ళు మొదట యెమెన్ అధ్యక్షుడు 'అలీ అబ్దుల్లా సలేహ్ '  మీద తిరుగుబాటు చేయడం ద్వారా తమ పోరాటాన్ని మొదలు పెట్టారు. సలెహ్ ని సపోర్ట్ చేయడం వల్ల సౌదీ అరేబియా వీళ్ళకు శత్రువైంది. 

సలేహ్ 2003 లో వీళ్ళ మీద సౌదీ అరేబియా మద్దతుతో తీవ్రమైన దాడులు చేసాడు. 2004 మొదటి కల్లా సలేహ్ దాడుల్లో వీళ్ళ లీడర్ హుసేన్ బద్రెద్దిన్ అల్ హౌతీ మరణించాడు.  ఈ అణిచివేతను హౌతీలు తిరస్కరించారు. తిరగబడ్డారు. అరబ్ స్ప్రింగ్, యెమెన్ లో 2011 లో సలేహ్ ని గద్దె దించింది.  హౌతీలు, 2014 లో  యెమెన్ రాజధాని సనా ని తమ ఆధీనం లోకి తీసుకున్నారు. అప్పటి నుంచీ హౌతీలు యెమెన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తూనే ఉన్నారు. 

2014 లో హౌతీల ఎదుగుదల చుట్టు పక్కల రాజ్యాలని గాభరా పెట్టింది. సౌదీ అరేబియా, యూ ఏ ఈ లను ప్రధానంగా కలవరపెట్టింది. పైగా హౌతీలకు హిజబొల్లా, ఇరాన్ ల మద్దతు ఉండడం అందరినీ ఆందోళనకు గురి చేసింది.  దానితో, ఒక గ్రూప్ గా ఏర్పడి, అమెరికా, బ్రిటైన్, ఫ్రాన్స్ ల తో కల్సి, ఆ కూటమి, యెమెన్ లో హౌతీ ప్రాంతాల మీద వైమానిక దాడులు చేసారు. అవి చిచ్చుని మరింత రాజేసాయి. ఈ దాడుల వల్ల యెమెన్ కు లాభం కన్నా నష్టమే జరింగింది. యెమెన్ లో 21 మిలియన్ల ప్రజలు ఇళ్ళూ పొళ్ళూ కోల్పోయి రోడ్డున పడ్డారు. తీవ్ర మానవ  సంక్షోభం ఏర్పడింది. లక్షలాది మంది తిండి, రక్షణా లేక చనిపోయారు.  ఆఖరికి 2022 లో అప్పటి యెమెన్ అధ్యక్షుడు అబ్ద్రబుహ్ మన్సూర్ హదీ, తన అధికారాన్ని యునైటెడ్ నేషన్స్ గుర్తించిన "ప్రెసిడెన్షియల్ లీడర్ షిప్ కౌన్సిల్" కు బదలాయించాడు. 

అయితే ఈ "ప్రభుత్వం",  హదీ 2015 లో సౌదీ అరేబియా  కి పారిపోయిన దగ్గరనుంచీ రియాద్ లోనే ఉంది. అంటే ప్రపంచం అధికారికంగా గుర్తించిన యెమెన్ ప్రభుత్వం, యెమెన్ కు అవతల ఉంది. యెమెన్ ని, లోపలి నుంచీ పాలిస్తున్నది, ప్రపంచం గుర్తించని ఉగ్ర మూక - హౌతీలు.  సనా పగ్గాలు చేపట్టిన దగ్గర్నించీ హౌతీలు తమని తాము బలోపేతం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూనే వచ్చారు. సాధారణ గొరిల్ల గ్రూప్ దగ్గరనుంచీ ఒక దేశ ప్రభుత్వానికి కావలసిన  పద్ధతీ, సరంజామా, స్ట్రక్చర్ ఏర్పరచుకున్నారు. తమ సైనిక సామర్ధ్యాలని పెంచుకున్నారు. పన్నులూ, స్మగ్లింగూ, సుంకాల ద్వారా ఆదాయం గడించారు. ప్రపంచం తమని గుర్తించాలని కోరుకునేవాళ్ళు!!  వారి స్లోగన్ "God is Great; deat to America; death to Israel; damn the Jews, Victory for Islam". 

ఇంత వరకూ అందరికీ తెలిసిన విషయలయ్యాక, హౌతీల యుద్ధ నీతి గురించి చెప్పుకోవాలి. వాళ్ళు పర్యావరణాన్ని నాశనం చేస్తామని బెదిరింపులకు పాల్పడి సంవత్సరాల పాటూ 'హొడీడా ' తీరం మీద పట్టుని కోల్పోకుండా ఆపారు. అదెలా అంటే దాదాపు 1.1 మిలియెన్ బారెళ్ళ లైట్ క్రూడ్ తో నిండి ఉన్న,  ఒక తీరానికి కొట్టుకొచ్చిన పాత, పిప్పి పట్టిన  స్టోరేజ్ టేంకర్ ని ఎన్విరాన్మెంటల్ వెపన్ గా వాడుకున్నారు. దాన్ని పరిశీలించడానికి యూ. ఎన్. పరిశీలకులకు, హౌతీలు అనుమతి ఇవ్వలేదు. ఆ టాంకర్ కి ఏదైనా జరిగితే, జరిగే 'ఆయిల్ స్పిల్' వల్ల ఆ ఇరుకు జల సంధి లో జరిగే పర్యావరణ వినాశనానికి భయపడి, ఎవరూ యెమెన్ మీద, హౌడీడా ప్రాంతం మీదా దాడి చేయనీకుండా ఈ బెదిరింపు ఆయుధం కాపాడుతుంది. 

గాజా లో యుద్ధం, హౌతీలకు ఇంకో ఆయుధం. నిజానికి హౌతీల ప్రభుత్వం పాలనలో ఆర్ధిక పరిస్థితి కుదేలయి, సాధారణ యెమెన్ ప్రజలలో అసంతృప్తి మొదలయి, విప్లవ ధోరణులు కనపడే వేళలోనే సెప్టెంబర్ 2023 లో యెమెన్ లో ప్రదర్శనలు జరిగాయి. సరిగ్గా అక్టోబర్ 7, 2023 న ఇజ్రాయిల్ మీద దాడి జరగడం తో హౌతీల దృష్టి మళ్ళింపు పోరాటం మొదలయింది.  ఇరాన్, హమాస్, హిజబుల్లా, హౌతీలు ఫ్రెండ్స్ కాబట్టి, వీళ్ళ ఉత్సాహం కూడా పెరిగింది. సడెన్ గా యెమెన్ లో హౌతీలు ఇస్లాం ఆత్మగౌరవం గురించి మాటాడడం వల్ల, పొలిటికల్ మూడ్ మారింది.  

హౌతీలు తెలిసీ తెలీకండా ఇజ్రాయిల్ మీద దీర్ఘ శ్రేణి క్షిపణుల్ని ప్రయోగించారు.   "డోం" లు,  వాటిని అడ్డుకున్నాయి. ఆ తరవాత 'గేలక్సీ లీడర్'  ని పట్టుకున్నారు. దానితో వారి ప్రభ వెలిగింది. ఇదేదో బావుందనుకుని, యెమెనీ సరిహద్దు లో తిరిగే వాణిజ నౌకల మీద దాడులు చెయ్యడం మొదలు పెట్టారు. వీటికి ఒక సారి ప్రయోగించే డ్రోన్ లు, ఏంటీ షిప్ క్రూయెజ్ మిసైళ్ళు, ఏంటీ షిప్ బాలిస్టిక్ మిసైళ్ళు, చిన్న చిన్న డ్రైవర్ లేని స్పీడ్ బోట్లు (పేలుడు పదార్థాలు నింపిన బోట్లు) - వీటన్నిటితో దేశం తొ సంబంధం లేకుండా అన్ని నౌకల్నీ దాదాపుగా అల్లరి పెట్టారు. 

అసలు నౌకలు ఆ జలాలలో ఎక్కడున్నాయో హౌతీలకు ఎలా తెలుస్తుంది ? వాళ్ళు ఇంటర్నెట్ లో అందుబాటు లో ఉండే ఓపెన్ సోర్స్ వెబ్ అప్లికేషన్ ల ద్వారా ఓడల ట్రాకింగ్ డాటా ని సేకరించేవాళ్ళు. తీరం వెంబడి చిన్నా చితకా ట్రాన్స్పోండర్ డాటాబేస్ లను, మరైన్ రాడార్ లనూ నెలకొల్పారు. పైగా ఎర్ర సముద్రం మధ్యలో తిరుగుతూ ఉండే, ఇరాన్ ఇంటెలిజెన్స్ షిప్ " బెహ్షాద్"  కూడా,  వీళ్ళకు, ఓడల "సరైన ఎడ్రసులు"  ఇచ్చేది. దానితో తమకున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని తమకున్న పరిధుల్లోనే పెంచుకుంటూ, ప్రిసిషన్ దాడులకు పాల్పడేవారు. కొన్ని ఓడలను పాక్షికంగా దెబ్బ తీసేవి. కొన్ని తీవ్రంగానూ దెబ్బ తీసేవి. దెబ్బకి వాణిజ్య నౌకల బిజినెస్ లో చాలా మార్పులొచ్చాయి. ఓడల భీమా మొత్తాలు పెరిగాయి. అమెరికా ఏ నౌకలకీ రక్షణ ఇచ్చే పరిస్థితి లో లేదు. సడన్ గా 'బాబ్ ఎల్ మెండెబ్'  సున్నితత్వం బయటపడింది. 

ఈ జలసంధినో, హర్మూజ్ నో ఇరాన్ ఆపేసినా, ప్రపంచ వాణిజ్యానికి కొద్దిపాటి ఇబ్బంది ఉంటుంది గానీ, మొత్తంగా దెబ్బ తిని పోదు. పనామా కెనాల్ లో కరువు వల్ల సరిగ్గా వర్షాలు పడక, నీళ్ళు నిండకపోతే అది మూసేస్తారు కొన్నాళ్ళు. సూయెజ్ కెనాలూ ఎన్నో సార్లు మూత పడింది. ఓడలు ఇంకొన్ని రోజులు ఎక్కువైతేనేం,  ఆఫ్రికా చుట్టూ తిరిగి సరకునైతే రవాణా చేసాయి. అసలు ఇంతింత దూరం ఎక్కువ బరువులు మోసుకెళ్ళేందుకే,  "పెద్ద పెద్ద నౌకల్ని"  కూడా నిర్మించారు. ఇవసలు కృత్రిమమైన కెనాళ్ళ లో సరిపోను కూడా సరిపోవు. కాబట్టి ఇక్కడ ప్రశ్న వాణిజ్యానిది కాదు. ఈ గొడవల వల్ల మన ఇళ్ళలోకి గేస్ రావడం ఇబ్బంది అవుతూంది. నిజమే. కానీ ప్రపంచం ఇప్పుడు ప్రత్యామ్నాయాల వైపు కూడా చూస్తుంది. ప్రపంచం అంతా ఎలక్ట్రిక్ వాహనాల వైపు మళ్ళిందనుకోండి. అపుడు పెట్రోల్ డిమాండ్ ఎక్కడుంటుంది. అయితే అది వెంటనే జరగకపోవచ్చు. అంత వరకూ మాత్రమే ఈ ఇబ్బంది, సందిగ్ధత. 

రచయిత చెప్పేదేమిటంటే, దీనిలో ప్రపంచాన్ని, క్రూడ్ బిజినెస్ నూ ఇబ్బంది పెట్టగలిగే శక్తి కేవలం ఒక అనాగరిక ఉగ్ర మూక కు ఉండడం ఏం బావుంటుంది ? అగ్ర రాజ్యాలు కూడా ఊరుకోలేదు. వీలైనన్ని సార్లు యెమెన్ మీద రక రకాల స్థావరాల నుండీ దాడులు చేశాయి. బ్రిటన్, అమెరీకా లు తమ దగ్గర ఉన్న పెద్ద పెద్ద యుద్ధ నౌకల్ని మోహరించాయి. ఉదాహరణ కు  USS Dwight D Eisenhower (22 Fixed Wing Aircrafts), USS Pilippine Sea, USS Gravely, USS Mason, USS Florida, యెమెన్ మీద దాడి కి వాడిన కొన్ని ప్రముఖ ఆపరేషన్ లలో పనిచేసాయి. 12 Jun 2024 లో క్రూయిస్ మిసైళ్ళను ప్రయోగించి, వైమానిక దాడుల్నీ చేపట్టాయి. సైప్రస్ నుండీ విమానాలు బయల్దేరి వచ్చాయి. తోమహాక్ లు వాడారు. 150 precision guided munitions of various types,  వాడారు.  F/A-18 Super Hornet లు వాడారు.  ఎంత చేసినా హౌతీలు తోక ముడవలేదు. వాళ్ళ వ్యూహాలు వేరు. 


సౌదీ మిత్ర పక్షాల తో దశాబ్దం గా చేసిన యుద్దం, హౌతీలను బలోపేతం చేసింది. ఎప్పటికప్పుడు తమ సైన్య స్థావరాలను మార్చడం, ట్రక్ ల మీద నుండీ ప్రయోగించే మిసైళ్ళను వాడుతూ, ఆ ట్రక్ లను ఒక  చోట నుండీ ఇంకో చోటకు వెను వెంటనే మారుస్తూ ఉండటం, సొరంగాల ద్వారా కదలికలు, సొరంగాలలో ఆయుధాగారాలను  దాయడం, ముఖ్యంగా ఇరాన్ నుండీ ఆగకుండా అందే ఆయుధాలూ, హౌతీలను మరింత సమర్ధులను చేసాయి. 


ఈ దాడులకు హౌతీలు కూడా "ప్రతిదాడులు"  చేసారు జనవరి 2024 లో USS Laboon మీద మిసైళ్ళు వేసారు కానీ అవి మధ్యలోనే నిలువరించబడ్డాయి. మరునాడే మూడు anti ship ballistic missiles, Gibraltar Eagle  అనే అతి పెద్ద అమెరికన్ వాణిజ్య నౌక మీదికి ప్రయోగించారు. వాటిలో రెండు గురితప్పాయి. మూడోది నౌక కి తాకినా, పెద్ద నష్టం జరగలేదు. 


జనవరి 28 న "టవర్22" అనే కీలక అమెరికన్ సైనిక స్థావరం మీద దాడి చేసారు. దీనిలో ముగ్గురు అమెరికన్ సైనికులు చనిపోయారు. 40 మందికి పైగా,  తీవ్రంగా గాయపడ్డారు.  ఇది సిరియాకీ ఇరాక్ కీ మధ్య ఉన్న కీలక స్థావరం. ఇక్కడి నుండే అమెరికన్ సైన్యాలు, 'ఐసిస్' మీద దాడులు చేసేవి. ఇది పెద్ద దెబ్బ.   అసలు ఈ చిన్న చిన్న మూకలు చేసే "తక్కువ ఖర్చు" దాడులకీ, అగ్ర రాజ్యాలు చేసే అత్యాధునిక దాడులకీ ఎంత తేడా ఉందో. పేట్రియాట్ మిసైల్ బేటరీలు ఒక సారి వాడేందుకు, ఒకో మిసైల్ కూ 3-4 మిలియన్ డాలర్ ల ఖర్చవుతుంది. అలాంటిది "టవర్ 22" ను పేల్చేందుకు హౌతీలు, చవకైన "ఆత్మాహుతి" డ్రోన్ లు వాడారు.  ఒక సైనిక స్థావరం మీద అంత పెద్ద దాడి ని అగ్ర రాజ్యం కనుక్కోలేకపోవడానికి కారణం, సరిగ్గా అదే సమయానికి అమెరికన్ డ్రోన్ ఒకటి సర్వైలెన్స్ చేసి, బేస్ కు వాపసు రావాల్సి ఉంది. దాని రాకతో వార్నింగ్ సిస్టం లు ఎలర్ట్ అయి 'ప్రతి దాడి ' (friendly fire) చేస్తాయేమో అనే "ముందు జాగ్రత్తగా"  డ్రోన్ లను పసిగట్టే వ్యవస్థ ను కాసేపు నిలిపేసారు.   అదే సమయానికి హౌతీ డ్రోన్ రావడం వల్ల, 'టవర్ 22' దాడి,  సాధ్యమయింది.   ఇలా ఇలాంటి యుద్ధాలలో వాడే యుద్ధ తంత్రాలు, ఆయుధ శ్రేణి, వాటి ఖర్చులు, వాటి పరిమితులు, ఎదుటి వారు వాడే పద్ధతులు, వ్యూహాలూ, డేటా ఫ్యూజన్, ఇంటెలిజెన్స్ సేకరించే పద్ధతులు, ఇరాన్ సాంకేతిక సామర్ధ్యం, వీటన్నిటి గురించీ చక్కగా మిలిటరీ భాషలో వివరించారు రచయిత.  సైన్యం వాడే పద్ధతులు, మారాల్సిన కొత్త కొత్త పోరాట పద్ధతుల గురించి ఇంటరెస్టింగ్ గా రాయడం వల్ల, ఇవన్నీ, న్యూస్ పేపర్లలో చదివే వ్యవహారేలే అయినప్పటికీ, క్షిపణి వ్యవస్థలు, ఒక వేళ నౌకల మీద ఆయుధ శ్రేణులన్నీ వాడేస్తే వాటిని ఎలా రీఫిల్ చేస్తారు? వాటి పరిమితులేంటి ? యుద్ధం లో పార్టిసిపేట్ చేసే యుద్ద నౌకలు ఎందుకు వెనక్కి రాలేవు.. ఇలాంటివన్నీ చదివితే నిజంగా ఇన్ని నెలలు గా సముద్రం లో చిక్కుకుపోయిన నావికుల మీదా, సైన్యాల మీదా చాలా సానుభూతి కలుగుతుంది.  నౌకలకి, ఆయుధ వ్యవస్థ లకీ ఎప్పటికప్పుడు, మెయింటనెన్స్ అవసరం! తరిగిపోతున్న మందుగుండుకూ, క్షిపణులకూ తయరీ, సప్లై చైన్ లకూ, సమయం అవసరం! 


అత్యంత ఖరీదైన రక్షణ వ్యవస్థలు మాత్రమే, అంతు లేని దాడులు చేస్తూ, యెమెన్ అంతా, చెల్లా చెదురుగా విస్తరించిన హౌతీల ని నిలువరించడం సాధ్యం కాదు. రక రకాల రాజకీయ కారణాల వల్ల జరిగే ఈ ఎడ తగని ఈ పోరాటాల వల్ల ఈ కొత్త రకం యుద్ధాలు, కొత్త సాంకేతికతలూ  ఈ కొత్త వ్యూహాలూ !! కానీ,  ఇవేవీ కావు సొల్యూషన్ ! మంచి నాయకులూ, మంచి పద్ధతులూ, మంచి నిర్ణయాలూ తప్ప ఈ ప్రపంచాన్ని బాగు చెయ్యలేవు.   యుద్ధం చాలా ఖరీదైనది. అది దేశాల ఆర్ధిక వ్యవస్థలని ఇబ్బంది పెట్టగలవు. అమెరికన్ నేవీ వాడే టాక్టికల్ ఇంటర్సెప్టర్ లు, మల్టీ మిలియన్ డాలర్ల ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు అంటే : ఉదా: Standard Missile-2 (SM-2) అనేది 2.2 మిలియన్ డాలర్లుంటుంది. అదే  SM-6 - 5.3 మిలియన్లు, SM-3 -  28.7 మిలియన్లు.   ఒక పేట్రియాట్ ఇంటర్సెప్టర్ ఖరీదు దాదాపు 4-5 మిలియన్ డాలర్లు ఉంటుంది. అన్నిటి కన్నా చవక రకం AIM-9X సైడ్ విండర్ ఒక షాట్ కి 400,000 డాలర్లుంటుంది. అంటే యుద్ధం, ఆయుధ వ్యాపారులకి తప్ప ఎవరికీ లాభం కాదు. అలాంటిది, ఇంతా ఖర్చు పెట్టి అమెరికన్లు సాధించినది ఏముందా అంటే ఏదీ లేదు. చిన్న చిన్న గుంపులుగా విడిపోయి, చవక రకం చిన్న ఆయుధాలతో తమ ప్రాదేశిక  బలిమి వల్ల, ప్రపంచానికి చాలా అవసరమైన జలసంధిని ఆధీనం లోకి తెచ్చుకుని హౌతీలు చేస్తున్న పోరాటం వెనుక ఉన్న బలం, వాళ్ళ రాజకీయ పట్టుదల అనేది, బహుశా అమెరికన్లు గుర్తించాల్సి ఉంటుంది.  

ఇట్లాంటి సమస్యలకి రాజకీయ, దౌత్య పరిషారాలు వెతకాల్సిందే తప్ప, ఎడా పెడా సైన్యాలను, సైనిక ఆస్తులనూ తాకట్టు పెట్టడం ఎవరికీ మంచిది కాదు. పైగా ప్రపంచ రాజకీయాలలో ఇపుడు ఏర్పడిన సున్నితత్వం ఇంతకు ముందెన్నడూ లేదు. కల్సి కట్టుగా అగ్ర రాజ్యాలు పోరాడే రోజులు దగ్గర్లో లేవు. నాటో గొడవల వల్ల ఇప్పుడు ఈ సుదీర్ఘ యుద్ధాలలో అమెరికా ఒంటరై పోయింది. ఇలాంటి చిక్కు ముళ్ళకు పరిష్కారం తొందరగా దొరకదు.  ఇలాంటి ప్రపంచంలో మిలిటరీలు పోషించే పాత్ర ఎంత కీలకం ?! అంతే ఇంపార్టెంట్,  "దౌత్యవేత్తలు"  చేసే పని కూడా. వీటికి కాస్త పొలిటికల్ విల్ ఉండాలి. అంతే. 

***

https://indianexpress.com/article/opinion/columns/shyam-saran-nepal-uttarakhand-china-mountains-are-warning-us-10853273/

***

15/08/2026

Yazeed by Saadat Hasan Manto (Telugu Translation)

Yazeed



1947 లో జరిగిన అల్లర్లు ఎలా మొదలయ్యాయో అలానే ముగిసిపోయాయి. అచ్చం ఋతువులు మారినపుడల్లా మధ్యలో వస్తూండే గడ్డు కాలాల్లాగా! కరీందాద్ అన్ని ప్రతికూల పరిస్థితుల్నీ దేవుడి నిర్ణయం అని నిర్ణయించేసి మౌనంగా ఊరుకోలేదు. తనకి ఎదురయిన విపత్తులను, విషాదాలనూ, ఓ మొగవాడికుండాల్సిన మనోధైర్యంతో శాయశక్తులా ఎదుర్కొన్నాడు. ఎప్పటికపుడు, ప్రతికూల పరిస్థితులతో తలపడ్డాడు. అతని ఉద్దేశ్యం కేవలం పట్టుదలతో అలా ముఖాముఖీ సమస్యలని ఎదుర్కోవడమే తప్ప, వాటిని ఓడించేయగలనని కాదు. శత్రువు తనకన్నా బలవంతుడని, సంఖ్యాపరంగా కూడా శక్తిమంతుడనీ అతని చేతిలో ఓడిపోవడం తథ్యమని తెలిసినా కూడా, అసలు పోరాడకముందే ఓటమిని అంగీకరించడం, అస్త్రసన్యాసం చేయడం, అవమానం అని నమ్మే మనిషి. నిజం చెప్పాలంటే లోకానికి అతనిమీదున్న అభిప్రాయం కూడా అదే. అత్యంత క్రూరులైనవాళ్ళతో కూడా అతను ఎంతో గుండె ధైర్యంతో తలపడి, పోరాడడం కళ్ళారా చూసారు. కానీ ఎవరైనా కరీందాద్‌ను ఆ మాట అడిగితే, పరిస్థితులను ప్రతిఘటించకుండా ముందుగానే ఓటమిని అంగీకరించేసి, నేరుగా తలవంచడమన్నది తనొక్కడికే పరాభవం కాదు, సమస్త మానవాళికే జరిగే పరాభవంగా భావిస్తాడా అనిపించేలా - ఏదో క్లిష్టమైన గణిత సమస్య తీర్చమని అడిగినట్టు దీర్ఘాలోచనలో పడిపోతాడు. 



కరీందాద్‌కు కూడికలు, తీసివేతలు, హెచ్చివేతలు, భాగాహారాలూ లాంటి లెక్కలేవీ రావు. 1947 నాటి మత కల్లోలాల తరవాత జనం కూర్చుని ధన, ప్రాణ నష్టాలను లెక్కకట్టడం మొదలుపెట్టారు. కానీ కరీందాద్‌ను ఇవేవీ తాకనుకూడా లేదు. అతనికి తెలిసిన లెక్క ఒక్కటే. అది, తన తండ్రి రహీందాద్ ఈ యుద్ధంలో 'ఖర్చ'యిపోయాడన్నదే! ఆనాడు, అతను తన తండ్రి మృతదేహాన్ని ఎత్తుకుని భుజాలమీద స్వయంగా మోసుకొచ్చి ఒక బావి పక్కన పూడ్చిపెట్టాడు. 



గ్రామంలో ఎందరో మరణించారు. వేలాది యువకులు, ముసలివాళ్ళూ చంపబడ్డారు. ఎంతో మంది అమ్మాయిలు అదృశ్యమయిపోయారు. మరెందరో అత్యంత పాశవికంగా మానభంగానికి గురయ్యారు. బాధితులంతా గుండెలవిసేలా రోదించారు. వాళ్ళంతా తమ దురదృష్టాన్ని తలచుకుని, ఆ అకృత్యాలకు పాల్పడిన కిరాతకుల్ను శపిస్తూ ఏడ్చాడు. కానీ కరీందాద్ మాత్రం ఒక్క కన్నీటి చుక్కయినా కార్చలేదు. చివరి శ్వాస వరకు పోరాడిన తన తండ్రి ధైర్యసాహసాలను తలచుకుంటే అతనికి చాలా గర్వంగా అనిపించేది. అతని తండ్రి నిరాయుధుడై ఉండి కూడా, కత్తులు, గొడ్డళ్ళతో మీదపడిన పాతిక ముప్పై మంది ముష్కరులను ఒంటి చేత్తో ఎదిరించాడు. దాడి చేసిన వాళ్ళతో తన తండ్రి ధైర్యంగా పోరాడుతూ మరణించాడని విన్నాక, తండ్రి ఆత్మతో వీడ్కోలుగా చెప్పేందుకు అతనికి ఏదీ తోచలేదు - "యార్, పెద్ద పొరపాటు చేసావు. నీదగ్గర ఎప్పుడూ కనీసం ఒక్క ఆయుధమైనా ఉంచుకోమని చెప్పాను కదా!" అని మాత్రం అన్నాడు.



ఆ మాట అన్నాకా, తండ్రి శవాన్ని మోసుకెళ్ళి, ఒక బావి పక్కన గుంత తవ్వి పూడ్చిపెట్టాడు. సమాధి పక్కన నించుని, ప్రార్ధనగా కూడా ఒక్కటే అన్నాడు, "దేవుడు పాపపుణ్యాల లెక్కలు చూసుకుంటాడు. నీకు స్వర్గం ప్రాప్తించాలిగాక!" 

రహీందాద్‌ను అతికిరాతకంగా చంపేశారని విన్నవాళ్ళందరూ ఆ దుండగులను శపించారు కానీ కరీందాద్ ఒక్క మాట కూడా అనలేదు. కోతకు సిద్ధంగా ఉన్న పంటపొలాలను దుండగులు పెట్టిన మంటలవల్ల కోల్పోయాడు కరీందాద్. అతని రెండు ఇళ్ళను కూడా అంతకు ముందే తగలబెట్టారు. అయినా, అతను ఆ నష్టాలను, తన తండ్రి ప్రాణ నష్టంతో లెక్కకట్టలేదు. అతను ఒకటే అనేవాడు. "ఏది జరిగినా సరే, అది ఇలా జరిగిందంటే, అది మన తప్పే!". అలాంటపుడు ఎవరైనా ఆ తప్పు ఏంటని అడిగితే, మౌనంగా ఉండిపోయేవాడు. 



గ్రామమంతా ఈ అల్లర్లలో మరణించిన వాళ్ళను తలచుకుంటూ శోక సంతాపాల మధ్య ఉన్నపుడు, కరీందాద్ పెళ్ళి చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. చామనచాయతో ముద్దులొలికే ‘జీనా’ అనే అందమైన అమ్మాయి మీద ఎన్నాళ్ళుగానో అతనికి మరులు. జీనా అప్పటికి తీరని దుఃఖంలో మునిగి ఉంది. ఆమెకు ఉన్న చెట్టంత అన్నను దుండగులు, ఆ మతకల్లోలాలలో నిర్దాక్షిణ్యంగా చంపేసారు. జీనా తల్లితండ్రులేనాడో పోయారు. ఆమెకు మిగిలిన అండా దండా, ఈ అన్న ఒక్కడే. జీనాకు కూడా కరీందాద్ అంటే ప్రేమే. కానీ తన అన్నను ఆ విధంగా కోల్పోవడం వల్ల కలిగిన శోకంలో జీనాకు ప్రేమకూడా భారంగా మారిపోయింది. ఎప్పుడూ నవ్వుతూ ఉండే ఆమె కళ్ళు ఇప్పుడు సదా దుఃఖంతో, కన్నీళ్ళతో నిండి ఉన్నాయి. 



కరీందాద్ కు, ఏడుపులన్నా, రోదనలన్నా అసహ్యం. జీనా అలా శోకదేవతలా కనిపిస్తూ ఉంటే, అతనికి చాలా చిరాకు కలిగేది. కానీ తొందరపడి మాటలు తూలి, అసలే గాయపడి ఉన్న స్త్రీ హృదయాన్ని మరింత గాయపరచకూడదన్న స్పృహ అతనికి ఉండేది. ఒకరోజు పొలంలో ఆమె ఒంటరిగా ఉండగా, ప్రేమ గా, ఆమె చేయి పట్టుకుని అన్నాడు. "పోయినవాళ్ళని మనం పాతిపెట్టేసి ఏడాదయింది. ఇంకా ఎన్నాళ్ళయినా మనం ఇలా ఏడుస్తూ ఉంటే, ఆ వెళ్ళిపోయిన ఆత్మలు కూడా మన దీర్ఘ సంతాపాన్ని చూసి విసిగిపోతాయి. ఇక ఈ దుఃఖాన్ని విడిచిపెట్టు ప్రియా! ముందు ముందు మనం ఇంకా ఎన్ని చావులు చూడాల్సి వస్తుందో ఎవకికి తెలుసు? ఈ కన్నీళ్ళను రేపటి కోసం కూడా దాచుకో!" 



జీనాకు ఆ మాటలు నచ్చలేదు. కానీ అతనంటే ఉన్న ప్రేమతో, అతను చెప్పిన మాటల గురించి పదే పదే ఆలోచించింది. ఒంటరిగా ఉన్నపుడల్లా ఆ మాటల్నే తలచుకుంటూ, వాటి వెనుక ఉన్న సత్యమేమిటో తెలుసుకునేందుకు ప్రయత్నించేది. అలా చివరికి కరీందాద్ చెప్పింది నిజమేనని ఎలాగో ఒప్పుకుని, తన దు‌ఃఖంనుండి బయటపడింది. 

 

కరీందాద్, జీనాల పెళ్ళి ప్రస్తావన వచ్చినపుడు, గ్రామ పెద్దలు మొదట అభ్యంతరం చెప్పారు. కానీ వాళ్ళ నిరసనలో పస లేదు. ఏడాది కాలం సుదీర్ఘంగా, పోయిన పిల్లలనీ, పెద్దలనీ తలచుకుంటూ, అంతులేని వేదనతో, ఏడుపులతో గడిపి విసిగిపోయిన వాళ్ళకు ఈ పెళ్ళిని అడ్డుకోవడానికి పెద్ద కారణాలు ఏవీ కనపడక, వారి అభ్యంతరాలన్నీ వీగిపోయాయి. అలా, కరీందాద్ పెళ్ళి జరిగింది. సంగీతవాయిద్యాలవాళ్ళను, పాటలు పాడేవాళ్ళనూ పిలిచారు. ప్రతి తంతూ పద్ధతిగా, సక్రమంగా జరిపించారు. అలా కరీందాద్ తన ఇంటికి, తన ప్రేయసిని, చట్టబద్ధంగా వివాహం చేసుకుని, భార్యగా తీసుకొచ్చుకున్నాడు. 



మతకల్లోలాల తర్వాత గ్రామం మొత్తం ఒక పెద్ద స్మశానంలా మారిపోయింది. కరీందాద్ పెళ్ళి ఊరేగింపులో బాజాబజంత్రీలు విని కొందరు గ్రామస్తులు భయపడిపోయారు - అది ఏ దెయ్యాల ఉత్సవమో అనుకున్నారు. ఈ విషయం కరీందాద్ స్నేహితులు అతనికి చెప్పినపుడు పగలపడి నవ్వాడు. కానీ కరీందాద్ నవ్వుతూ ఈ విషయాన్నే కొత్త పెళ్ళికూతురికి చెప్తే, ఆమె భయంతో వణికిపోయింది. 



కరీందాద్, ఎర్రని గాజులు వేసుకున్న జీనా చేతుల్ని తన చేతుల్లోకి తీసుకుని, ఆమె కళ్ళల్లోకి ప్రేమగా చూస్తూ, "ఈ దయ్యం నిన్ను జీవితాంతం వెంటాడుతూనే ఉంటుంది. ఏ భూతవైద్యుడూ, నీ నుండి నన్ను, అంటే ‘నా’ భూతాన్ని ఎంత పెద్ద తంతులు చేసినా వదలించలేడు"అన్నాడు కొంటెగా.



జీనా తన గోరింటాకు చేతి వేలిని మునిపంట పెట్టి, సిగ్గుతో గొణిగింది "కీమె.., నీకు దేనికీ భయపడవు కదా!"



కరీందాద్ నారింజ రంగు మీసాలను తన నాలుక అంచుతో తడుపుకుంటూ నవ్వి, "ఎవరైనా దేనిగురించయినా అసలు ఎందుకు భయపడాలి?" అన్నాడు. 



జీనా గుండెను కస్సున కోసే దుఃఖపు అంచు తన వాడిని మెల్లమెల్లగా కోల్పోసాగింది. ఆమె త్వరలో తల్లి కాబోతుంది. కరీందాద్ ఆమెలో విరుస్తున్న మాతృత్వాన్ని చూసి ఎంతో మురిసిపోయాడు. "దేవుని సాక్షిగా జీనా, నువ్వు రోజు రోజుకీ మరింత అందంగా మారిపోతున్నావు. నువ్వు, ఇంత అందంగా నా కొడుకు మూలానే తయారవుతున్నావు! వాడూ నేను ఇక నీకోసం ఒకరితో ఒకరం పోట్లాడుకుంటూ ఉండిపోతామేమో చూడు”, అని ఆటపట్టించేవాడు.



జీనా సిగ్గుతో, తన శాలువతో పొట్టను కప్పుకుంది. కరీందాద్ నవ్వుతూ ఆమెను మరింత ఆటపట్టించాడు. "ఎందుకు దాచడం? నువ్వు పడుతున్న ఈ తపనా, నీ తాపత్రయం అంతా నా ఈ పంది వెధవ గురించేనని నాకు తెలీదా?



జీనాకు సర్రున చిర్రెత్తింది. "నీ కొడుకుని అలా ఆ చెడ్డ మాట అనడానికి నీకు నోరెలా వచ్చింది?"



కరీందాద్ గోధుమవన్నె మీసం నవ్వుతో వణికింది. "కరీందాద్ అందరి కన్నా పెద్ద పంది కనుక".



మొదటి ఈద్ వచ్చింది. తరవాత రెండోది. కరీందాద్ రెండు పండగల్నీ ఎంతో సంబరంగా జరుపుకున్నాడు. నిరుడు సరిగ్గా ఈద్‌కు 12 రోజుల ముందే దుండగులు ఆ గ్రామం మీదికొచ్చారు. అప్పటి అల్లర్లలోనే, ‘రహీందాద్’, జీనా అన్న ‘ఫజల్ ఇలాహీ’లు చంపబడ్డారు. జీనా రహస్యంగా ఇద్దరినీ తలుచుకుని ఏడ్చింది. కరీందాద్ లాంటి ఏడుపు, విచారం అంటే పడని మనిషి సాంగత్యంలో, జీనాకు తనివితీరా ఏడ్చుకోవడానికి కూడా వీలుపడలేదు. 



ఎపుడు జీనా తన జీవితాన్ని ఆకళింపు చేసుకునేందుకు ప్రయత్నించినా, ఆమెకు తన గత జ్ఞాపకాల నుంచి, గత జీవితాన్నుంచీ తను ఎంత దూరంగా ప్రయాణించేసిందో అర్ధం అయి, ఆశ్చర్యం కలిగేది. తన తల్లితండ్రుల మరణాలు జ్ఞాపకం లేవు. ‘ఫజల్ ఇలాహీ’ ఆమె కన్నా ఆరేళ్ళు పెద్ద వాడు. అతడే, ఆమెకు తల్లీ, తండ్రీ, సోదరుడూ అన్నీ. తన అన్న తనవల్లనే పెళ్ళి చేసుకోలేదని ఆమెకు తెలుసు. జీనా మానాన్ని రక్షిస్తూనే ఫజల్ ప్రాణాలు కోల్పోయిన సంగతీ ఊర్లో అందరికీ తెలుసు. అన్న మరణం ఆమె జీవితంలో అత్యంత విషాదకరమైన అఘాతంగా మారిపోయింది. ఆమె మీదకు ఆ దుఃఖశిఖరం ఏ హెచ్చరికాలేకుండా విరుచుకుపడింది. అదీ రెండో ఈద్‌కు సరిగ్గా పన్నెండు రోజుల ముందు. ఆమెకు ఈ విషయం ఎపుడు గుర్తొచ్చినా, ఆ రోజు నుండీ తను ఎంత దూరం కొట్టుకుని వచ్చేసిందో, ఆ ఘోరం తరవాత, ఆ దుఃఖం నుండి బయటపడేందుకు, తన తలరాత ఎలా మారిందో అనే సంగతి ఆమె ఆలోచనల్లో చేరిపోయి కలవర పెట్టేది. 



ముహర్రం నాటికి, జీనా కరీందాద్‌ని తన మొట్టమొదటి కోరిక కోరింది. ‘ప్రసిద్ధికెక్కిన గుర్రాన్ని, తాజియానూ ఊరేగింపులో చూడాలని చెప్పలేనంత ఉబలాటంగా ఉంది‘ అంది. ఆమె తన స్నేహితుల దగ్గర ఈ ఊరేగింపు గురించి ఎంతో గొప్పగా వింది. ఆమె కరీందాద్‌తో "నాకు బాగుంటే, ఈ ఊరేగింపుకు నన్ను తీసుకు వెళ్తావా?" అని అడిగింది.



కరీందాద్ నవ్వి, "నీకు బాలేకపోయినా కూడా నిన్ను తీసుకుని వెళ్తాను.. ఇంకా నా పంది వెధవ ని కూడా!" అన్నాడు. 



అతను పుట్టబోయే తన పిల్లాడ్ని అలా పంది అనడం ఆమెకు అస్సలు నచ్చదు. అలా అతను అన్నపుడల్లా ఆమెకు కోపంతో విసుగొచ్చేసేది. కానీ అలా అన్నపుడు కరీందాద్ గొంతులోని మార్దవం, జీనా కోపాన్ని కాస్తా చెప్పలేనంత ఆనందానుభూతిగా మార్చేసేది. అతను అంత ప్రేమని అలా "పంది వెధవ" అనే చెత్త పదంలోకి ఎలా కుదించగలుగుతున్నాడా అని ఆశ్చర్యపోయేది. 



ఇండియా, పాకిస్తాన్ మధ్య యుద్ధం గురించిన వార్తలు అప్పటికే కొన్నాళ్ళుగా వినిపిస్తున్నాయి. నిజానికి పాకిస్తాన్ ఏర్పడిన తరవాత, రెండు దేశాల మధ్యా యుద్ధం జరగడం దాదాపు ఖాయం అయిపోయింది. అసలు యుద్ధం ఎపుడు మొదలవుతుందో గ్రామంలో ఒక్కరికీ తెలీదు గానీ, అందరూ అలజడిగా ఉన్న ఆ రోజుల్లో, కరీందాద్‌ని ఈ సంగతి అడిగితే, క్లుప్తంగా, "ఎపుడు జరగాలో అపుడు జరుగుతుంది. ఇప్పుడు దానిగురించి ఆలోచించడం దేనికి?" అని అనేవాడు.



జీనాకు యుద్ధం అన్న మాటకే వణుకు పుట్టేది. ఆమె సహజంగా శాంతిని ఇష్టపడే వ్యక్తి. ఊరికే స్నేహితుల మధ్య జరిగే చిన్న చిన్న గొడవలకు కూడా గాబరాపడిపోయేది. అలాంటిది, ఆమె అప్పటికి చాలానే హత్యలనూ, దోపిడీలు, దొమ్మీలను అతి సమీపాన్నించి, కళ్ళారా చూసేసింది. తన సొంత అన్న హత్యను ఆమె మర్చిపోలేకపోతోంది. ఒక రోజు భయంతో, "కీమె, ఇపుడు ఏమి జరుగుతుంది?" అని కరీందాద్‌ను అడిగింది. 

 

కరీందాద్ నవ్వి, "అమ్మాయి పుడుతుందో, అబ్బాయి పుడతాడో నాకెలా తెలుస్తుంది?” అన్నాడు. ఆమెకు చిరాకు కలిగినా కరీందాద్ చెప్పే కబుర్లలో, హాస్యాలలో, తన తలలో కమ్ముకుంటున్న యుద్ధ భయాలని మర్చిపోయేది.


కరీందాద్ నిర్భయుడు, బలశాలి, జీనా అంటే అపారమైన ప్రేమ కలవాడు. అతను ఒక రైఫిల్ కొని, దాన్ని గురి తప్పకుండా పేల్చడం నేర్చుకున్నాడు. వీటన్నిటి వల్లా, జీనాకు కొంత ధైర్యం చిక్కినా, గ్రామస్తుల నోట యుద్ధం గురించి ఏ పుకారు విన్నా, మళ్ళీ ఆమెను భయం కమ్ముకునేది. 

 

ఒకరోజు మంత్రసాని ‘భక్తో’ రోజూలానే జీనాను చూసేందుకు వచ్చినపుడు, భారతీయులు 'నది'ని మూసేస్తున్నారన్న వార్త తెచ్చింది. జీనాకు ఆ మాట అస్సలు అర్ధం కాలేదు. భక్తోను అడిగింది, "నది ని మూసేయడం ఏమిటి?" అని. 



"మన పొలాల్లో పంటలు పండనివ్వుకుండా వాళ్ళు నదిని మూసేస్తారంట" అంది భక్తో. 

జీనా ఓ నిముషం ఆలోచించి, పకాలుమని నవ్వి, "నువ్వు పిచ్చి దానిలా మాటాడుతున్నావు. అంత పెద్ద నదిని ఎవరు మూసేయగలరు? అది నది! ఇంటి వెనక పారే మురికి నీటి కాలువ కాదు!" అంది. 

భక్తో జీనా పెరిగిన పొట్ట మీద మృదువుగా తడుముతూ, "నాకు తెలీదు. నేను విన్నదేదో నీకు చెప్పాను. పేపర్ల నిండా ఇదే రాసుందంట" అంది.

 

"అది ఏమిటి?" జీనాకు అసలు నమ్మశక్యంగా లేదు. 

 

భక్తో తన ముడుతలు పడిన చేతులతో జీనా పొట్టని నిమిరి, "అదే… వాళ్ళు నది దారి మళ్ళిస్తారు, నీటి ప్రవాహాన్ని ఆపేస్తారు" అంది. ఆమె జీనా కమీజ్‌ను కిందికి లాగి, లేచి, అనుభవజ్ఞులైన మనిషికి ఉండే, నమ్మకమైన స్వరంతో "ఇలానే అంతా బావుంటే, పిల్లాడు ఇంకో పది రోజుల్లో బయటికొస్తాడు" అంది. 

 

కరీందాద్ ఇంటిలోకి అడుగు పెట్టీ పెట్టంగానే జీనా, అతన్ని నది సంగతి అడిగింది. మొదట ఆమె భయాలను కొట్టి పారేసేందుకే ప్రయత్నించాడు. కానీ ఆమె అదే పనిగా అడుగుతుంటే, "అవును నేనూ అలాంటిదే విన్నాను" అన్నాడు.

 

జీనా అడిగింది "ఏం విన్నావు?"

 

"హిందుస్తానీలు మన నది దారిని మూసేయబోతున్నారంట!"

 

"కానీ ఎందుకు?"

 

"అలా చేస్తే మన పంటలు ఎండి పోతాయని"



అప్పటికి నదుల ప్రవాహాన్ని కూడా మనుషులు ఆపగలరని ఎలానో జీనాకు నమ్మకం కలిగింది. ఆమె ఎలానో కూడబలుక్కుని నిస్సహాయంగా, "ఎంత క్రూరులు వాళ్ళు?" అంది. 



ఇది విని, కరీందాద్ చిరునవ్వుతో ఓ నిముషం ఆగి, "సరే ఇదంతా వదిలెయ్, భక్తో వచ్చిందా చెప్పు?" అన్నాడు.

 

ఆమె నీరసంగా, "వచ్చింది" అంది. 

 

"ఏమి చెప్పింది?"

 

"పిల్లవాడు ఇంకో పది రోజుల్లో పుడతాడని చెప్పింది"

 

కరీందాద్ ఆనందంతో గట్టిగా నవ్వి, "వాడు చల్లగా నూరేళ్ళు జీవించాలి" అన్నాడు.

 

జీనా తన అసహనాన్ని ప్రదర్శిస్తూ, "నువ్వర్థం కావు నాకు. ఇలాంటప్పుడు కూడా ఎలా నవ్వుతావో! ఏ ఉపద్రవం పొంచిఉందో, ఏ కర్బలా మనల్ని ముంచేసేందుకొస్తుందో ఆ దేవుడికే ఎరుక!” అంది. 

 

కరీందాద్ రచ్చబండ దగ్గరకు వెళ్ళాడు. అక్కడ గ్రామంలోని మొగవాళ్ళంతా అప్పటికే గుమిగూడున్నారు. అందరూ గ్రామ పెద్ద 'చౌదరీ నత్తూ' చుట్టూ మూగిపోయి, నదిని ఆపేయడం గురించే ప్రశ్నలు అడుగుతున్నారు. వాళ్ళలో ఒకరెవరో, పండిట్ నెహ్రూని నానా తిట్లూ తిడుతున్నాడు. ఇంకొకడు శాపాలు పెడ్తున్నాడు. ఇంకొకడు, అసలు నది గతిని మార్చగలగడం అన్న భావననే నమ్మనంటున్నాడు. వాళ్ళలో ఇంకొకడు అసలు ఏమి జరగనుందో అంతా మన తప్పులకు దేవుడు వేయబోయే శిక్ష అని తీర్మానిస్తున్నాడు. ఈ ఘోరంనుండీ తప్పించమని దేవుడిని వేడుకునేందుకు అందరూ మసీదుకు వెళ్దామని ఇంకొకడు ప్రతిపాదిస్తున్నాడు.



కరీందాద్ ఓ మూల కూర్చుని, తన చుట్టూ సుడులు తిరుగుతున్న మాటల్ని మౌనంగా వింటున్నాడు. హిందుస్తానీలను తిట్టడం లో చౌదరీ నత్థూ మొదట ఉన్నాడు. ఈ గోలంతా విని కరీందాద్ అసహనంగా కదులుతున్నాడు. అందరూ ఒక విషయాన్ని మాత్రం ఒప్పుకున్నారు - నదిని ఆపడం అనేది, చాలా నైతికంగా దిగజారిపోయిన వారి కుయుక్తి అని. అది మానవత్వం, మనస్సాక్షి లేనివారి అత్యంత హేయమైన, నీతిబాహ్యమైన చర్య. ఈ చర్య ‘యజీద్’ చేసిన పాపకార్యంతో సమానం. (యజీద్, కర్బలాలో జరిగిన యుద్ధంలో ప్రవక్త మనవడిని, అతని పరివారాన్ని, యూఫ్రటిస్ నది నుండీ నీరు వాడుకోనీయకుండా చేసి, తదనంతరం అతన్ని చంపిన వాడు. ఈ యుద్ధం తరువాత ముస్లిములు సున్నీలు, షియాలుగా విడిపోయారు. ఈ యుద్దం గెలిచిన యజీద్, రెండో కాలిఫ్ అయాడు.)

 

కరీందాద్ రెండుసార్లు దగ్గి, ఏదో చెప్పేందుకు గొంతు సవరించుకున్నాడు. కానీ అప్పటికి చౌదరీ నత్తూ నోటి వెంట బూతుల ప్రవాహం విరుచుకుపడింది. కరీందాద్ ఇక ఆగలేకపోయాడు, "వాళ్ళను తిట్టకు చౌదరీ!" అని అరిచాడు.

 

భయంకరమైన 'అమ్మ బూతు తిట్టు' ఒకటి చౌదురీ గొంతు లోనే ఇరుక్కుపోయింది. కరీందాద్‌ను ఆశ్చర్యంగా చూస్తూ తన తలపాగాని సవరించుకుంటూ, "ఏమన్నావు?" అన్నాడు చౌదరీ. 

 

కరీందాద్ నెమ్మదిగా ఖచ్చితమైన స్వరంతో, "నేను వాళ్ళను తిట్టొద్దు అన్నాను" అన్నాడు.

 

చౌదురీ తన గొంతులో ఆగిపోయిన బూతుని ఖాండ్రించి ఉమ్మేసి, కరీందాద్ వైపు తిరిగి కోపంగా, "ఎవరిని తిట్టొద్దంటున్నావు? వాళ్ళు నీకేమవుతారు?" అని, చుట్టూ చూసి, చౌపాల్ దగ్గర గుమిగూడినవాళ్ళతో అన్నాడు "విన్నారా మీరంతా? వీడి మాటలు? వాళ్ళను తిట్టొద్దంట. అందరూ అడగండి వీడ్ని… వాళ్ళు వీడికి ఏమవుతారో!". 

 

కరీందాద్ ఓపిగ్గా, "నాకు వాళ్ళేమవుతారు? వాళ్ళు నా శత్రువులు. అంతకంటే ఇంకేం కారు!” అన్నాడు.

 

ఏ పెద్ద నవ్వు లాంటి బొంగురు శబ్దం చౌధురి నోటి నండీ ఎంత వేగంగా బయటికొచ్చిందంటే, అతని మీసంలోని వెంట్రుకలు కూడా అదిరాయి! "విన్నారా? వాళ్ళు వీడికి శత్రువులంట. మరి మన శత్రువు ని ప్రేమించమంటావా, నాయనా?”



కరీందాద్ సమాధానం ఇస్తున్నట్టు, "కాదు చౌదరీ, నేను అలా అనట్లేదు. నేను అన్నదంతా - వాళ్ళను తిట్టొద్దు అని మాత్రమే" అన్నాడు.



కరీందాద్ పక్కనే కూర్చున్న అతని చిన్ననాటి స్నేహితుడు మీరాన్ బక్ష్ అడిగాడు "కానీ ఎందుకు?"

 

కరీందాద్ నేరుగా మీరాన్ బక్ష్‌తో, "వాళ్ళను తిట్టి ఏం లాభం, యార్? వాళ్ళు నదిని మూసేసి మన పంటలను నాశనం చెయ్యాలని చూస్తున్నారు. నువ్వు వాళ్ళను తిట్టి ఆ లెక్క సరిచేయగలనని అనుకుంటున్నావా? నువ్వు తిట్టినంత మాత్రాన ఆగుతారా? అసలు దీనికి ఏమైనా అర్ధం ఉందా? మన దగ్గర ఇంకే సమాధానమూ లేనపుడే ఎదుటివాళ్ళను తిడతాం" అన్నాడు.

 

మీరాన్ బక్ష్, "మరి నీ దగ్గర ఏమైనా సమాధానం ఉందా?" అని అడిగాడు. 

 

కరీందాద్ ఒక క్షణం ఆగి, "ఈ సమస్య నా ఒక్కడిది కాదు. ఇది వేలాది మందికి సంబంధించిన విషయం. నా సమాధానం అందరి సమాధానం కాలేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఎంతోలోతుగా ఆలోచిస్తే అందరికీ అంత సంతృప్తికరమైన సమాధానం దొరకుతుంది. వాళ్ళు నదీ ప్రవాహాన్ని ఒక్కరోజులో ఆపలేరు. వాళ్ళకు ఆ పని చేసేందుకు ఏళ్ళు పడతాయి. కానీ మీరేమో వాళ్ళ మీద మనసులో పేరుకుపోయిన కక్షనంతటినీ ఒక్క క్షణంలో బూతులుగా మార్చి తిట్టేసి దులిపేసుకుంటున్నారు". కరీందాద్, మీరాన్ బక్ష్ భుజం మీద చెయ్యేసి ఆప్యాయంగా, "నాకు తెలిసిందల్లా ఒక్కటే యార్. హిందుస్తాన్‌ను నీతిమాలిందని, కౄరమైందని, అల్పమైనదని చిన్న మనసుదనీ అనడం తప్పు."

 

మీరాన్ బక్ష్ బదులు చౌదురీ నత్తూ అరిచాడు, "ఇప్పుడు ఇది వినండి మరి!"

 

కరీందాద్, మీరాన్ బక్ష్‌తో తన మాటలు కొనసాగించాడు. "నా ప్రియ మిత్రమా, ఇది మూర్ఖత్వం! శత్రువులనుండి కనికరాన్ని ఆశించడం మూర్ఖత్వం. యుద్ధం వచ్చినపుడు మన దగ్గర ఉన్నదానికంటే శత్రువు దగ్గర పెద్ద ‘బోరు’న్న రైఫిలు ఉందని ఏడవడం లాంటిది! మనం చిన్న చిన్న బాంబులు విసురుతూ వాళ్ళు పెద్ద పెద్ద బాంబులు వాడుతున్నారని ఫిర్యాదు చేయడం లాంటిది! చిన్న కత్తి అయినా పెద్ద కత్తిలాగే ప్రాణాలు తీయగలదు కదా. నేను చెప్పేది నిజం కాదా?"

 

మీరాన్ బక్ష్ బదులు, చౌధరీ నత్తూ ఆలోచనలో పడినా, వెంటనే తన చిరాకుని ప్రదర్శిస్తూ, "కానీ ఇక్కడ సమస్య అది కాదు, వాళ్ళు మన నీళ్ళను ఆపబోతున్నారు. మనం ఆకలితో, దప్పులతో చావాలని కోరుకుంటున్నారు."

 

కరీందాద్ తన చేతిని మీరాన్ బక్ష్ భుజంమీదనుండి తీసి, చౌదరీ వైపు తిరిగి, "మనం ఒకరిని శత్రువు అని ప్రకటించేసాక, వాళ్ళు మనల్ని ఆకలీ, దాహాలతో చంపడానికి ప్రయత్నిస్తున్నారు అని ఫిర్యాదు చేయడం దేనికి? మనన్ని ఆకలికి ఎండగట్టకుండా, మన పచ్చని పొలాలను బీడు భూములు చేయకుండా మన ఇంటికి డేగిశాల నిండా పులావులూ, కుండల నిండా తీయని షర్బత్‌లూ పంపుతారనీ, మనం ఆడుకోవటాని కోసం తోటలూ, తోపులూ పెంచుతారనుకుంటామా?"



ఇది చౌదరికి మరింత కోపాన్ని తెప్పించింది. "ఏంటి ఈ అర్థం పర్థం లేని మాటలు?" అని అడిగాడు ఆగ్రహంగా.



మీరాన్ బక్ష్ కూడా మెల్లగా, "అవును యార్, ఏంటిది అర్ధం లేకుండా?" అడిగాడు.



"ఇది అర్ధం లేని విషయం కాదు మీరాన్ బక్ష్!" అన్నాడు కరీందాద్ సేహితుడికి విషయం భోధపరిచేందుకు ప్రయత్నిస్తూ, "ఆలోచించు! యుద్ధంలో రెండు పక్షాలూ ఎదుటివాళ్ళను ఓడించేందుకే ప్రయత్నిస్తారు. కుస్తీ పోటీలో వస్తాదు అన్నిటికీ సిద్ధపడి నడుం బిగించి రంగంలో ఎలా దూకుతాడో, ఎదుటివాడిని మట్టికరిపించడానికి తనకు చేతనయిన అన్ని యుక్తులనూ వాడి, తన శాయశక్తులా ఎలా పోరాడతాడో ఇది కూడా అంతే." 

 

మీరాన్ బక్ష్ ఒప్పుకున్నట్టు నున్నగా గుండు చేసున్న తన తల ఊపుతూ, "అవును, అది నిజమే" అన్నాడు.

 

కరీందాద్ నవ్వి, "అలాంటప్పుడు నదిని మూసేయడం కూడా సరైనదే. అది మనకు కౄరత్వంలా అనిపించచ్చు. కానీ, వాళ్ళ దృష్టిలో అది సరైన చర్యే"

 

"దాహంతో నీ గొంతెండిపోయి, నాలుక పిడచకట్టుకున్నప్పుడు అ‍‍డుగుతాను ఇది సరైన పనో కాదో! నీ పిల్లలు అన్నం ముద్ద కోసం ఏడ్చినప్పుడు కూడా ఇదే మాట అంటావా? నదిని ఆపడం సరైన పనేనని!"

 

కరీందాద్ ఎండిన తన పెదవుల్ని నాలుకతో తడుపుకుని సమాధానమిచ్చాడు, "అవును, అప్పుడు కూడా నేను ఇదే మాట అంటాను చౌదరీ. కేవలం వాళ్ళు మాత్రమే మన శత్రువులు కాదు, మనం కూడా వాళ్ళకు శత్రువులమే అన్న విషయం నువ్వు ఎందుకు మర్చిపోతున్నావు? మనకే వాళ్ళ అన్నపానీయాలను ఆపగలిగే వీలుంటే, నిర్దాక్షిణ్యంగా మనమూ అదే చేసుండేవాళ్ళము కదా. ఇపుడు వాళ్ళు మన నీళ్ళను ఆపేయగలిగి, నదిని మూసేయగల స్థితిలో ఉన్నపుడు పనికిమాలిన తిట్లవల్ల ప్రయోజనం ఏముంది? దీన్నుండీ బయటపడే మార్గం గురించి ఆలోచించాలి గానీ. శత్రువు మన కోసం ‘పాల నదుల’ను సృష్టించడు చౌదరీ. కానీ వీలుంటే మన వాటాకు వచ్చే ప్రతి నీటి చుక్కలోనూ విషం కలపగలడు. ఈ రకంగా ప్రాణాలు తీసే పద్ధతి నీకు నచ్చకపోవచ్చు. దాన్ని నువ్వు క్రూరత్వం అను, రాక్షసత్వం అను… కానీ ఇందులో వింతేముంది? యుద్ధం మొదలయే ముందే ఇరుపక్షాల వాళ్ళూ కూర్చుని కొన్ని షరతులూ, ఒప్పందాలూ మాట్లాడుకోవచ్చు కద… అంటే నిఖా చేసుకునేప్పటి మాటల్లాగా… మమ్మల్ని ఇలా ఆకలి, దాహాలతో చంపవద్దని, తుపాకులూ తూటాలతో చంపమని, అది కూడా మా దగ్గరున్నట్టే ఫలానా బోర్ ఉన్న తుపాకులతోనే రండి అని చెప్దామా? ఇవీ నిజానికి అర్ధం లేని మాటలంటే. నెమ్మదిగా, శాంతంగా ఆలోచించండి." 



అప్పటికి చౌదరి‌కి ఓపిక నశించి, నిరాశ అవధులు దాటింది, "ఎవరైనా ఓ మంచు పలక తెచ్చి నా గుండె మీద పెట్టండి" అని కోపంగా అరిచాడు.

 

"అది కూడా నేనే తెచ్చివ్వాలని ఆశిస్తున్నావా?" అని పకాల్న నవ్వాడు కరీందాద్. మీరాన్ బక్ష్ భుజం మీద చరిచి, లేచి, రచ్చబండ నుండి బయలుదేరాడు.



అతను ఇంటి గడప చేరీసరికీ ఇంటినిండీ బయటికొస్తూ భక్తో కనపడింది. ఆమె బోసినవ్వుతో "అభినందనలు కీమె! నీకు పండులాంటి బిడ్డ పుట్టాడు. వా‍డికి మంచి పేరు ఆలోచించు ఇప్పుడు" అంది.

 

"పేరా?" కరీందాద్ ఒక్క క్షణం ఆలోచించి అన్నాడు, "యజీద్… యజీద్."


భక్తో ఆశ్చర్యంతో నోరు తెరిచింది. ఆనందంతో ఉబ్బితబ్బిబ్బవుతూ కరీందాద్ ఇంటిలోపలికి వెళ్ళాడు. జీనా నులక మంచం మీద పడుకుని ఉంది. ఇంతకు ముందు కన్నా పాలిపోయి, నీరసంగా కనిపిస్తుంది. ఓ అందమైన శిశువు తన బొటనవేలిని చీకుతూ ఆమె పక్కనే పడుకుని ఉన్నాడు. కరీందాద్ ప్రేమగా, గర్వంగా వాడిని చూశాడు. వాడి లేత బుగ్గని చూపుడువేలుతో సున్నితంగా తాకి మృదువుగా అనాడు, "నా చిట్టి యజీద్!" 

 

జీనా ఆశ్చర్యంతో ఓ కేక వేసింది, "యజీదా?"

 

కరీందాద్ కొడుకు ముఖాన్ని దగ్గరగా చూస్తూ, వాడి పోలికల్ను గమనిస్తూ అన్నాడు, "అవును. యజీద్. ఇదే వీడి పేరు."

 

జీనా గొంతు నీరసబడిపోయింది, "ఏమంటున్నావు కీమె? యజీద్ ఏంటి…"

 

కరీందాద్ నవ్వి, "అందులో ఏముంది? అది కేవలం ఒక పేరు మాత్రమే!" అన్నాడు.

 

జీనా అతికష్టం మీద కీచుగా ఒక్క మాట అనగల్గింది, "కానీ… అది ఎవరి పేరు?" 

 

కరీందాద్ చాలా గంభీరంగా సమాధానమిచ్చాడు, "వీడు ఆ పాత యజీద్ అవ్వాలని ఏముంది. ఆ యజీద్ నదిని మూసేసాడు; మన కొడుకు దాన్ని తెరుస్తాడు."



***

మూలం: సాదత్ హసన్ మంటో కథ ‘యజీద్’

అనువాదం : నేను 🙎‍♀️

First published in Udayini Webzine.

***

Context of the story is weaponisation of natural resources.  Background is Indus Water Treaty between India and Pakistan & Op Sindhoor.

****

Notes : 

https://scroll.in/article/1081748/theyre-going-to-close-our-river-mantos-1950s-story-about-the-india-pakistan-water-dispute



https://www.rekhta.org/ebooks/detail/yaziid-saadat-hasan-manto-ebooks


https://urduadab4u.blogspot.com/2012/02/yazeed-interesting-urdu-short-story-by.html


The Book of Bullah, A Selection of Verses - Manjul Bajaj



బుల్లే షా, పంజాబ్ కు చెందిన ఒక ప్రసిద్ధ సూఫీ గురువు. శతాబ్దాలుగా జనరంజకమైన వాక్యాలని రాసి, వాటికి ఎప్పటికప్పుడు కాలానుకూలంగా సరికొత్త అర్ధాలు వెతుక్కునే పాఠకుల అభిమానానికి సొంతదారు.   అతని కవితల్లో తీవ్రమైన భావోద్వేగం, పిచ్చి పరవశం, ఉత్సాహం,  గాఢ అనురక్తి, మూఢ విశ్వాసాల పట్ల తీక్షణమైన తిరస్కారం, సాధారణం.  తన కవితలు/పాటలు చదివిన పాఠకుడిని ఆలోచించేలా చేసి, తద్వారా వారిని తీవ్రంగా ప్రభావితం చేయగల లక్షణం బుల్లే షా సొంతం.   'జీవితం', దాని అంతిమ లక్ష్యం, 'మృత్యువు', 'జీవన పరమార్ధం,'  'ఆధ్యాత్మిక చతురత', 'విశ్వాసం' లాంటి వాటి వైపు పాఠకుడి దృష్టి మళ్ళించగల బుల్లే షా కవిత శతాబ్దాలుగా పంజాబీ సాహిత్యంలో ఓ దిక్సూచిగా నిలబడింది.  

ఈ  పుస్తకంలో మంజుల్ బజాజ్ ఈ కవితలను సులువైన ఇంగ్లీషు లోకి తర్జుమా చేస్తూ, బుల్లే షాని ఆధునిక పాఠకుల చెంతకు వీలైనంత సరళంగా, సున్నితంగా, ప్రతిభావంతంగా తీసుకు రాగలిగారు.   


బుల్లే షా జీవిత కాలం బహుశా  1680 - 1758 మధ్యలో ఉండొచ్చు. అతని గురించిన సమాచారమంతా ఓరల్ గా మాత్రమే  చరిత్రలో నిలిచిన  అతని రచనల్లోనించి రాబట్టినదే. అతని జీవితమంతా ప్రేమను జీవిస్తూ బ్రతికేడు. అతని నిజమైన పేరు "అబ్దుల్లా షా". భక్తీ, ఆచారం కలిగిన సయ్యద్ కుటుంబంలో జన్మించాడు. ఉమ్మడి పంజాబు లోని  కాసుర్ లో బాల్యం, చదువూ గడిచాయి. తండ్రి మత విద్య లో పండితుడు. బుల్లే చిన్నపుడు పంజాబీతో సహా అరబ్బీ, పెర్షియన్ చదువుకున్నాడు. కురానూ, ఇస్లామిక్ న్యాయ సూత్రాలు, పెర్షియన్ సాహిత్యం కూడా అధ్యయనం చేశాడు.   యవ్వనంలోకొచ్చాకా,  మూఢమైన  మత విశ్వాసాలని ప్రశ్నించాడు. 

ఆ తరవాతే లహోరు లోని "షా ఇనాయత్ కాద్రీ" అనే గురువుని కనుగొని అతని పరంపరని ఎంచుకున్నాడు. 'షా ఇనాయత్ ఖాన్' కులం (తోట) 'మాలి'.  బుల్లా లాంటి వాడు,  'సయ్యదీ' అయి ఉండి తక్కువ కులస్తుడి శిష్యుడు కావడమేమిటని సమాజం వెక్కిరించింది.   అతన్ని ఆ పరంపర నుండీ తప్పించేందుకు ప్రయత్నాలూ జరిగాయి.  గురు శిష్యుల ఎడబాటు బుల్లే షాకి భరింపశక్యం కాలేదు. ఆ దుఃఖోద్వేగంలోనే చరిత్రలో  అత్భుతమైన కవిత్వం రాసాడు.    


ఈ గురువుతోని అతనికి కలిగిన ఎడబాటు అతని మనసుని ఎంతో చలింపజేసింది. విరహమే అతని ఎన్నో కవితలకు సబ్జెక్ట్ గా మారింది. ఒకానొక సందర్భంలో గురువు కొలువునుండీ బహిష్కరింపబడ్డాక, ఒక నాట్యకత్తె వేషంలో కొలువులోకి ప్రవేసించి, "తెరి ఇష్క్ నచియా" అనే ప్రసిద్ధమైన పాట పాడి, గురువు మనసు కరిగించాడని అంటారు. 

షా ఇనాయత్ 1728 లో మరణించాక, బుల్లే షా ఒక టీచర్ గా, కవిగా 'కాదిరీ' పరంపరలోనే కొనసాగాడు. అతని తుది జీవితం, కసూర్ లోనే గడిచింది. అతని తరవాత కవితలన్నీ ఆధ్యాత్మికత లో మునిగి తేలాయి. తన శిష్యులకి మంచీ చెడూ, న్యాయం, అన్యాయం, చావూ పుట్టుకల గురించి మంచి అవగాహన ఉండాలని బుల్లే అభిమతం. 

అతని చివరి దశకల్లా పంజాబులో రాజకీయ కల్లోలం మొదలయింది. ముఘల్ సామ్రాజ్య పతనం ఆరంభమైంది. చిన్న చిన్న రాజులు కూడా అణిచివేతలకు పాల్పడేవారు. సిక్కు  మతం పుట్టడం, ముస్లిముల ఘోరమైన అకృత్యాలతో, నాదిర్ షా,అహ్మద్ షా అబ్దాలీల ముట్టడులూ కలిసి, మత విశ్వాసాలను కూలగొట్టాయి. రాజకీయ సత్యాలు కూడా అతని కవితలకు వస్తువులయ్యాయి. నిస్పృహా, ఆశా, రాజకీయ పరిమాణాల పట్ల వెటకారం, వ్యతిరేకతా కూడా చోటు చేసుకోవడం మొదలు పెట్టాయి.


బుల్లే కవిత లు మధుర భక్తి ప్రధానాలు. దేవుడూ, భక్తుడూ వేర్వేరు  కాదని, ప్రియుడికీ, ప్రియురాలికీ మధ్య ఉండాల్సిన మోహమూ, ప్రేమా, వాత్సల్యమూ, స్నేహమూ, బంధాలుగా దేవుడికీ భక్తుడికీ ఉండాలన్నది అతని దృక్పథం.  బుల్లే కవితల్లో పొంగే భక్తీ, ప్రేమా, విరహమూ పాఠకుడిని వివశుడిని చేస్తాయి. "జీవితం ఎంత మధురమైనది? దానినెందుకు కట్టుబాట్ల పేరునో, కుల మతాల అంతరాల పేరుతోనో ద్వేషం, అహంకారంతో నింపేసుకుంటున్నాము ? చావు కూడా ఎంత అర్ధవంతమైన విషయం?" అని అనుకునేలా చేసినందునే, బుల్లే కవితలు కాలంతో ప్రయాణించాయి.  ఇండియా, పాకిస్తాన్ లోని రెండు పంజాబులకూ ఈ కవిత్వం  సొంతం.  


తాను జీవించినంత కాలమూ బుల్లే షా మతాన్ని, దాన్నంటిపెట్టుకున్న అంధత నీ విమర్శించాడు. పరమత అసహనాన్నీ,  మడీ,ఆచారాలనీ, అసలు మతంలోని 'అర్ధం పర్ధం లేని తనా'న్నంతా వ్యతిరేకించాడు. దేవుడికీ, మనిషికీ మధ్య మతం అనే ముసుగు దేనికి ?    అందుకే అతను మరణించాకా, అతని శరీరాన్ని పాతిపెట్టేందుకు మసీదు అంగీకరించలేదు. అయితే, విచిత్రమేమిటంటే,  ఇప్పుడు కసుర్ లోని బుల్లే సమాధి ఓ ప్రసిద్ధి చెందిన ప్రదేశం. అతని సమాధి ఇరుగు పొరుగునంతా ఊర్లోని ధనికులూ, గొప్పవాళ్ళూ పాతిపెట్టబడ్డారు. 

 పంజాబీ సాహిత్యానికి బుల్లే దన్ను ని ఇచ్చాడు.  బుల్లే కవిత్వమంతా పంజాబుకే చెందిన వ్యావహారిక మౌఖిక సాంప్రదాయంలోనే భద్రపరచపడింది.  అసలు పంజాబీ భాష ఎదుగుదల లో సూఫీ కవిత పోషించిన ప్రధన పాత్ర విచిత్రంగా ఉంటుంది. బుల్లేషా యొక్క మొదటి పంజాబీ సాహిత్య ఆధారం, బుల్లేకి ముందున్న 13 వ శతాబ్దికి చెందిన సూఫీ గురువు బాబా ఫరీద్ మూలాన  దొరికింది.  సింధు నాగరికత లో భాగంగా  ఉండిన పంజాబ్, ఆధునిక మానవుడి ప్రాచీన నాగరికతల్లో ఒకటిగా రికార్డయింది. తక్షశిల లో క్రీస్తు పూర్వం ఏడవ శతాబ్దంలో దాని గురించి ఆధారాలు దొరికినా, ఆ సాక్షం, పూర్తిగా రూపాంతరం చెందని ఫార్మ్ లోనే దొరికింది.  

పంజాబీ లిపి ప్రతులు హూణుల, గ్రీకుల ఘజనీ, ఘోరీల దండయాత్రల్లో పూర్తిగా మాయమయ్యాయని అంటారు. కాబట్టి ఏడవ శతాబ్దం నుండీ, పదవ శతాబ్దం దాకా పంజాబీ అంతా 'నాథ భాష' అనే ప్రాకృత  పంజాబీనే. దీనిలోనే 'నాథ జోగీ' లు రాయబడ్డాయి. సూఫీజం వచ్చాక ఘజ్ఞవీ రాజంలో ఈ ప్రాకృత భాష, పెర్షియను తో కలిసి, పెర్సియో-అరబిల్ లిపులు కలిసి, 'శ్రీముఖీ' లిపి మొదలయింది. సిఖు గురువులు ఆ తరవాత 'గురుముఖీ' అక్షరమాలను ప్రాచుర్యంలోకి తెచ్చారు. సిక్కు గురువుల కాలం నాటి వ్యావహారిక భాషే ఈ 'గురు ముఖీ'. అచ్చులు లేని వ్యాపారుల భాష ఇది.   ఈ లిపే ఇప్పటికీ పంజాబీ రాసేందుకు ఉపయోగపడుతుంది. పంజాబీని దేవనాగరీ లో కూడా రాస్తారంట. కానీ బుల్లే ఎంచుకున్నది 'శ్రీ ముఖి' లిపి. ఈ లిపిలో తరచుగా ఉర్దూ అక్షర మాల కూడా దొర్లేది. 

బాబా ఫరీద్ తరవాత నాలుగు తరాలలో సూఫీ కాఫీలు, సిక్కు షాబాద్ లు పంజాబీని ముందుకు నడిపించాయి. ప్రాక్ పశ్చిమ కవితల సౌందర్యాన్ని కలిపి, బ్రజ భాషను, పెర్షియన్  నూ కలిపి జానపద చాటువులూ, సామెతలూ, గేయాలు పుట్టాయి. 

ఇలా సూఫీ మతం, సిక్కు మతం, చుట్టు పక్కల ప్రబలిన 'భక్తి ఉద్యమం' కలిపి, పంజాబీని రూపు దిద్దాయి. గురు గ్రంధ సాహిబ్ లో బాబా ఫరీద్ పాటలూ, కబీరు దోహాలు కూడా ఉన్నాయి. బాబా ఫరీద్ తరవాత, బుల్లే షాకి ముందూ ప్రసిద్ధులైన షా హుసేన్, సుల్తాన్ బాహులు కూడా వివిధ పంజాబీ యాసల్లో రచనలు చేసారు. బుల్లే షా, అతని కాలానికే చెందిన వారిస్ షాల చలవ కారణంగా, మధ్య పంజాబు అనగా మాఝీ ప్రాంతం మొత్తం పంజాబీ సాహిత్య భాషకు పెట్టని కోట గా మారింది.   

బుల్లే రాసిన కాఫీలు విచిత్రమైనవి. వాటిలో భాష సొగసులు, విరుపులు ఏదీ ఉండదు. కవితాత్మకత కూడా తక్కువ. కానీ వాటి సూటిదనం వల్లనా, నలుగురికీ అర్ధమయ్యే భాష వాడడం వల్లా, అవి జనాన్ని బాగా చేరాయి. ఇవి రోజువారీ సంభాషణలు, చమత్కారాలు, తల్లి కూతుర్ల సంవాదాలు, పెళ్ళికూతురు అత్తవారింటికి వెళ్ళడం, ప్రియురాలూ, ప్రియుడూ అనుభవించే విరహ వేదనా, సమాజం కట్టుబాట్ల వల్ల గందరగోళాలయ్యే మనసుల గురించి ప్రస్తావనలూ, వాటి వెనకున్న తాత్విక అర్ధాలూ, ఈ కవితల్లో మార్మికత, ఎవరికి సంస్కారానికి తగినట్టు వారికి అర్ధమయే వేదాంతమూ అతన్ని ప్రత్యేకంగా నిలబెట్టాయి.   కొన్ని అతనివి 'కాని' కాఫీలు కూడా అతని పేరుమీదే చలామణీ అయ్యాయి. అతను మరణించిన వంద సంవత్సరాల దాకా కూడా అతని కవితలు రికార్డ్ చేయబడని కారణాన ఇప్పటికీ చాలా కవ్వాలీలు బుల్లే లైన్లూ, ఇతరుల లైనతో కలిపేసి కొత్త వి సృష్టించబడ్డాయి. చాలా మటుకూ పాకిస్తాన్, ఇండియా లలో ఈ కవాలీలు బుల్లే వి గా ఇప్పటికీ గౌరవించబడుతూనే ఉన్నాయి. అబీదా పర్వీన్, రబ్బీ షెర్గిల్ లు బుల్లే పాటల్ని బాగా ప్రాచుర్యం లోకి తెచ్చారు. 

పాపులర్ హిందీ సినిమా పాటలూ, ఇప్పటికీ హిట్ అయే బాలీవుడ్, ఇండీ, పంజాబీ పాప్ పాటలూ బుల్లే ని కొత్త తరానికి పరిచయం చేస్తూ వస్తున్నాయి.  పాత హిందీ సినిమాలలో చాలా సూపర్ హిట్ కవాలీ లు బుల్లే రచనల నుండీ తీసుకున్నవే.   చరిత్రనీ, ప్రేమనీ, కొంటె తనాన్ని, వేదాంతాన్నీ సమానంగా మోస్తూ ఆ పదాలు జనాల నాలుకపై నిలిచిపోయాయి. కొత్తర్ధాలు చెప్తున్నాయి. 

మంజుల్ ఇంగ్లీషు లో కి అనువాదం చేసిన ఈ పుస్తకంలో బుల్లే సాహిత్యం (అంటే ఇప్పటికి అందుబాటులో ఉన్న మాత్రంలో)  వంద  పాపులర్ కవితలే ఉన్నాయి. వీటిని ప్రేమగా సేకరించి, అనువదించి, చక్కగా ప్రెసెంట్ చేసారు. తను మొదటి సారిగా కనుగొన్న బుల్లే ద్విభాషా కవితల పుస్తకం చూసి, అంత వరకూ బుల్లే గురించి తెలీనిది ఏదైనా ఉందా అని పరిశోధించి, మనసు పెట్టి,  కాఫీల్ని తన కున్న పరిధుల్లో, ఒరిజినల్ కు దగ్గరగా ఉండాలనే స్పృహతో ఎన్నో సంవత్సరాల కృషి ని ఇన్వెస్ట్ చేసి, అనువదించానని చెప్పారు.  

పంజాబీ రానివారికి ఈ అమృతం రుచి తెలియాలని (ఒక వేళ) ఒరిజినల్ లో రైమింగ్ ని తేలేకపోయినా పర్లేదనుకుని ధైర్యం చెప్పుకుని,  అదే  సరళత తో అనువదించడానికి ప్రయత్నించారు.  నాకయితే, గీతాంజలికి చలం తెలుగు అనువాదంలా, ఆ లైన్లు మన తో జీవితాంతమూ మిగిలిపోయినట్టు (పెద్ద ప్రశంస కదా) - ఈ ఇంగ్లీషు బుల్లే కూడా అనిపించాడు.  పోయెట్రీ అంటే ఇష్టపడే వాళ్ళూ, ఇష్టపడని వాళ్ళూ మెచ్చుకుంటారు ఈ కవితల్నీ, ఈ ఎఫర్ట్ నీ.   బుల్లే షా మన రెండు దేశాల కూ చెందిన వారసత్వ సంపద. అలా అని ఒక భాష లోనే దాచేసుకుంటే ఎలా. అందరికీ ఈ సంపద చేరాలీ అంటే వీలైనన్నై భాషల్లో అతని కవిత్వం ప్రవహించాలి. కొన్ని విని చూడండి. 

***

The Most Popular Song "Bulla ki jana me koun":-
 
Bullah, how do I know
who am I?

I am not a believer among believers
Nor am I a disbeliever
Neither pure nor unclean
Neither Moses nor Pharoah

Bullah, how do I know 
who am I ? 

I am not in the Vedas or scriptures
Nor in alcohol or drugs
I am not a drunkard or a repentant
Not asleep nor awake 

Bullah, how do I know 
who am I ? 

Neither saint nor sinner
Neither happy nor unhappy 
Neither fire nor water
Neither earth nor wind

Bullah, how do I know 
who am I ? 

Not an Arab or a Lahori
Nor do I belong to Nagori
Not a Hindu, not a Turk
Nor a dweller of Nadaun

Bullah, how do I know 
who am I ? 

I do not know the secret of religions
I was not born of Adam and Eve
I am without a name 
Without faith or disbelief

Bullah, how do I know 
who am I ? 

I know only myself
Nothing other than the Self
Nothing greater than the Self
Who then is that I see watching me?


***


***



***

Finding God

If God was to be found
by washing and bathing,
frogs and fish would find him

If God was to be found 
by roaming in the wilderness
cows and calves would have him

Listen to Bulleh Shah
God comes to the pure of heart
those truthful in their ways

***
శుభం 

29/05/2026

The Vegetarian - Han Kang




ఒక పుస్తకం గురించి చాలా విన్నాక, పత్రికలలో రివ్యూలు చదివాక, దాదాపు స్టోరీ ఏంటనేది చూచాయగా తెలిసిపోయాక, మంచి స్నేహితుడు చదవమని చేతిలో పెడితే, న్యూట్రల్ గా మొదలుపెట్టిన పుస్తకం ఇది. చదవడానికి సులువుగా ఉన్న భాష, దేశీ అనువాదం, (అనువాదకురాలు, డెబోరా స్మిత్ ఏషియన్ ఆత్మని పట్టుకోవడం కోసం ఉద్దేశ్యపూర్వకంగా అలా చేసుండొచ్చు) అందమైన కథనం, గబ గబా చదివించేస్తాయి. ఒక సారి చదివిన దానికీ, ఇంకోసారి నెమరువేసుకునేదానికీ అర్ధాలు కొత్తగా బోధపడతాయి. అది పూర్తిగా అనువాదం గొప్పతనం అనిపిస్తుంది. ఎప్పట్లాగే కవర్ పేజ్ చాలా అర్ధవంతంగా ఉంది. పుస్తకం ముగించాక అది తెలుస్తుంది. 


భార్య అంటే ఏ మాత్రం ఆసక్తి, ప్రేమా లేని భర్త. కూతురి మీద, అసలు తమ పిల్లలంటే విపరీతమైన కంట్రోల్ ఉన్న తల్లితండ్రులు. పురుషాధిక్యత.  హీరోయిన్ - యాంగ్ హై, మామూలు భార్య. ఆమె భర్త, కూడా సాధారణమైన మనిషే. అయితే ఈ పిల్ల కి  ఒక 'మొక్క ' లాంటి బ్రతుకు బ్రతకాలనుండడం అన్ని సమస్యలకీ బీజం. 'యాంగ్ హై' కున్న అక్కయ్య 'ఇంగ్ హై', ఎంతో కుదురైన కూతురు. బాధ్యతకల, చిన్నపిల్లవాడి తల్లి. డిజిటల్ కళాకారుడైన సంపాయించని భర్తని సాకుతూ, ఇంట్లో సకలం చూసుకునే సూపర్ వుమన్. ఈ ఇద్దరి అక్క చెల్లెళ్ళ జీవితం - ఈ వెజిటేరియన్. 


యాంగ్ హై కి చిన్నప్పటి నుండీ ఒక ఆక్రోశం జీవితం అంటే. ఆమె కి పెళ్ళయాక జీవితం ఏమీ పెద్ద మారదు. భర్త చాలా సున్నితత్వం లేని మామూలు భర్త. అతనికి భార్య మీద ప్రేమ, ఆదరణా ఉండవు. అతనికి ఆమె అర్ధం కాదు. యాంగ్ హై కి ఉన్న మానసిక సమస్యలు అతనికి పట్టవు. ఆమెకు ఏమి కావాలో అక్కర్లేదు. ఆమె బాధ్యతగా, మర్యాదపూర్వకమైన భార్యగా మసులుకుంటే చాలు. 


యాంగ్ హై పెద్ద సౌందర్యవతి కాదు. కానీ మంచి సాంప్రదాయ కొరియన్ కుటుంబంలో పుట్టింది. చెప్పిన మాట వినే రకం. అంతే. ఆమెకు బ్రా వేసుకోవడం, రొమ్ముల్ని బట్టతో బంధించడమూ అంటే అసలు ఇష్టం ఉండదు. దాని వెనకున్న హైపర్ సెన్సిటివిటీ అతనికి అర్ధం కాదు.  అసలు ఆమె భయాలూ, వేదనా, అతనికి పట్టవు. పిల్లలు అప్పుడే వద్దనుకున్నారు.  ఆమె కు ఏవో కలలొస్తున్నాయి. హఠాత్తుగా వెజిటేరియన్ అయిపోతుంది.  అతనికి ఈ మార్పు సహించదు. కారణాలడగడు. ఆమె సమస్యకు ఏదైనా పరిష్కారం ఉందా అని ఆలొచించడు. ఆమె భయాలు అతనికి అనవసరం. పూట పూటకీ, తనకు అన్నీ అమర్చిపెట్టే, విధేయురాలు ఎక్కడ అని అతనికి సందేహం. ఆవిడ ఓ మనిషనేది అతనికి పట్టదు. ఆమె తండ్రి చిన్నపుడు ఆమెని ఎలా చూసాడో, భర్త కూడా అదే నిరాసక్తి తో, నిర్లక్షంగా చూడడం - అదీ తన దృష్టి కోణంలో తనదేమాత్రం తప్పులేదనే విధంగా చెప్తూండడం - ఇదంతా సహజమే కదా అనిపించేలా ఉంటాయి.  

దానితో ఇద్దరి మధ్యా ఘర్షణ మొదలవుతుంది. ఆమెకు చెట్లలా బ్రతకాలనుంటుంది. నాన్ వెజ్ తినడం వల్ల పీడ కలలు రావనుకుంటుంది. కానీ ఆమె నాన్ వెజ్ నుంచీ  ఎంత దూరంగా పారిపోయినా, పీడకలలు వెన్నాడడం ఆగవు. ఆమె కొరియన్లు సాధారణంగా తినే భోజనం మానేస్తుంది. ఈమె మాంసాహారం ముట్టకపోవడం వాళ్ళందరినీ కుదిపేస్తుంది. భర్త, అత్త మామలకు కంప్లైంట్ చేస్తాడు. అతనికి సమాజంలో అదో పెద్ద అవమానం. తండ్రీ, తల్లీ బలవంత పెడతారు.  ఆమె తిరగపడుతుంది. సెల్ఫ్ హార్మ్ చేసుకునే దాకా వెళ్తుంది.  నిజంగా ఎటువంటి అనారోగ్యం ఉన్న స్త్రీ పరిస్థితి అయినా, సరైన కుటుంబ ఆదరణ లేకపోతే ఎలా దిగజారుతుందో అనిపిస్తుంది.  

ఆ తరవాత చాప్టర్లలో  'బులీమియా' దాకా వెళ్తుంది. తిండిని పూర్తిగా వదిలేసి, చావు అంచుల్లో యాంగ్ హీ వెళ్ళేసరికీ, ఆమె అక్కయ్యకు కూడా తమ సమాజం మీదా, వాళ్ళకి ఆడ పిల్లల మీదా, స్త్రీల మీదా ఉన్న చులకన భావమూ, మాట విని తీరాలనుకునే తత్వమూ, తమ vulnerabilities ని advantage గా  తీసుకునే వాళ్ళ మీద కోపం, విరక్తీ కలుగుతాయి.  తన 'ఫార్మాట్ ప్రకారం, రూల్స్ ప్రకారం జీవించే' జీవితం మీద విసుగు పుడుతుంది. అక్క చెల్లెళ్ళిద్దరూ జీవితం లో అలా కొట్టుకెళిపోతారు. మధ్య వచ్చే అధ్యాయాలలో వాక్యాల అందం, మనుషుల భావాల, ప్రవర్తనల విచిత్రం - జీవితం తీసుకునే మలుపులు, మనుషుల నిర్ణయాల ప్రభావాలూ నిజంగానే ఆశ్చర్యానికి గురి చేస్తాయి. 


కొరియన్ సంస్కృతి, ఆ ఆహారపు అలవాట్లూ మనకన్నా వేరే పద్ధతిలో ఉన్నా, వారిదీ, మనదీ ఒకే లోకం. ఆ మాటకొస్తే, పురుషాధిక్యత ఉన్న అన్ని సమాజాలలో, స్త్రీ స్థానం, లైంగికత, మానసిక సంఘర్షణ, అనారోగ్యాలు వెనకడుగే వేసుంటాయి.  ఎవరైన తమ జీవితం మీద గ్రిప్ ని సంపాదించారూ అనుకోవడం మిథ్య. సమాజపు చట్రాల కింద పడి, మానసికంగా నలిగిపోయే ఆడ బిడ్డల కథ ఇది.  మతం, సాంప్రదాయాలు తొక్కిపెట్టేసే మనుషులం మనం అందరమూనూ.  ఈ పుస్తకం చదివాకా, స్నేహితులతో దీన్ని గురించి చర్చిస్తాం. ఇలా ఎందుకు - అలా ఎందుకు అని విశ్లేషణలు చేస్తాం. జాలి పడతాం, తిట్టుకుంటాం. ఇలా చదివి, అలా వదిలేసే సబ్జక్ట్ కాదు. చాలా రోజులు వెన్నాడుతుంది. 


ఆపకుండా చదివించగలగడం, పాత్రల పట్ల సానుభూతి కలిగించగలగడం, ఎవరెవరు ఎలాంటి ఎలాంటి సందర్భాలలో ఎలా ప్రవర్తిస్తారు అని చెప్పడానికి ప్రయత్నించే పుస్తకం. అందమైన వాక్యాలు, కొన్ని సారులు జుగుప్స కలిగించినా, పాత్రల మానసిక స్థితి ని వ్యక్తపరిచే సన్నివేశాలతో చాలా ఇంటరెస్టింగ్ గా అనిపిస్తుంది. చిన్న పుస్తకమే అయినా, చదివేవారిని షాక్ కి గురి చేస్తుంది.  ఏంటిది "పిచ్చి గా?!!!" అనిపిస్తుంది. కానీ, మనకి తెలీని ప్రపంచం అది. కానీ అదీ existence  లోనే ఉంది. చాలా బావుంది. చాలా సినిమాటిక్ గా. కొత్తగా. 

రచయిత్రి హాన్ కాంగ్ కు, ఈ పుస్తకానికి, "మేన్ బుకర్ ఇంటర్నేషనల్ ప్రైజ్" వచ్చింది. 2024 లో ఆమెకు నోబెల్ ప్రైజ్ కూడా వచ్చింది. అనువాదకురాలు డెబోరా స్మిత్, ఉత్తర భారత దేశంలోనే స్థిరపడిందని అన్నారు. వరండాలూ,  అరణ్యాలూ, కొండ వాలుల్లో చెట్లూ,  పూలూ, లతలూ, వర్షాలూ, రోడ్లను అందంగా వర్ణించి. పుస్తకానికో కవితాత్మక సౌందర్యాన్ని తేవడంలో ఆవిడ కృషి తెలుస్తూ ఉంటుంది. మంచి పుస్తకం. 

***