Pages

18/12/2024

మృత్యుంజయ - అబ్బూరి చాయా దేవి






హైదరాబాద్ బుక్ ట్రస్ట్ 1993 లో ప్రచురించిన పుస్తకం ఇది. ఒక సెకండ్ హాండ్ పుస్తకాల అంగట్లో అబ్బూరి చాయా దేవి గారి పేరు చూసి, చటుక్కున కొనేసుకున్నాను. సామాన్యంగానే ఒక తండ్రీ, కూతుళ్ళ మధ్య ఉన్న బంధం అపూర్వమైనది. అందులోనూ, సింప్లిసిటీ, విద్వత్తూ, అందమైన స్నేహమూ ఉన్న ఇద్దరు తండ్రీ కూతుర్ల మధ్య నడిచిన ఉత్తరాలే ఈ పుస్తకం నిండా.  ఇది ఆమె చెప్పబోయిన తన తండ్రి జీవిత కథ, తన గాధ అనిపించింది. నేను పుస్తకం చదివి కదిలిపోయిన మాట నిజం. మా నాన్నగారిని బాగా గుర్తు చేసుకున్న మాటా నిజమే. చాయాదేవి గారి రచనల్లో ఇది నిజానికి "పెద్ద కథ" అని చదివాను. కానీ ఇది నవలో, కథో, ఆత్మ గాధో తెలియలేదు. ఏమైతేనేం, ఇది చదవడం వల్ల మనసు శుద్ధి చెందింది. 

ఏల్చూరి సుబ్రహ్మణ్యం గారు రాసిన 'ముందుమాట' పుస్తకం మీది గౌరవాన్ని అమాంతం పెంచేసింది. అసలు ఎన్నడూ విని ఉండకపోవడం వల్ల ఈ చిన్ని పుస్తకం నుంచి ఏమి ఆశించాలో తెలీని పరిస్థితిలో ఈ ముందుమాట గొప్ప మేలు చేసింది. పాఠకుడికీ, పుస్తకానికీ కూడా. 

లాయరుగా వృత్తిపరంగా బిజీగా ఉన్నా కూడా ఊరికే కూర్చునే రకం కాని 'నాన్నగారి  ఆధ్యాత్మిక భావాల సంగతితో పాటూ, అహంకారం సంగతి' కూడా బాగా తెలిసిన కూతురు ఆయన రాజమండ్రి నుండి హైదరాబాదుకి మకాం మార్చిన వార్త విని ఆదుర్దా చెందుతున్నపుడు  తండ్రి నుండి ఉత్తరం అందుతుంది.  'ఇదిగో ఫలానా పనికి రాజమండ్రి వెళ్ళొచ్చాను. ఇక లాయరుగా నా జీవితం సమాప్తమైందని నిశ్చయంగా చెప్పవచ్చు. ఆఖరి కేసు పూర్తిచేసాను. ఇక ఏ కోర్టు తోనూ ఇంక సంబంధం లేదు. సన్యాసి కావడానికి అడవులకు పోయి ఉండనక్కర్లేదు. మానసికంగా నిజమైన సన్యాసిగా ఉండవచ్చు. ఏవిధమైన గొడవలూ లేకుండా మనస్సుని ప్రశాంతంగా ఉంచుకుని, అన్ని కోరికలనూ, భయాలనూ త్యజిస్తే అదే నిజమైన సన్యాసం.. మీరు ఢిల్లీ వెళ్ళి అపుడే రెండేళ్ళు దాటింది. అవసరమైనవీ, కుతూహలమైనవీ, అన్ని విశేషాలతో పెద్ద ఉత్తరం రాస్తే నీకు కృతజ్ఞతలు తెలుపుకుంటాను.." అంటూ రాస్తారాయన.  అనగా ఆయన స్వచ్చందంగా వృత్తి విరమించి, తనకి కావల్సిన విధంగా రిటైర్డ్ లైఫ్ గడపాలనుకున్న వ్యక్తి. ఇంకా సంపాదించేయాలన్న ఆసక్తి లేని సింపుల్ (/చాదస్తపు) మనిషి.

అసలు ఉత్తరాలు రాసుకోవడం ఎంతందమైన కళ ! అందులోనూ, ఉన్నతాదర్శాలు, ఉత్తమ సంస్కారం గల మనుషుల మధ్య ! కుమార్తె తండ్రి ని 'పదవీ విరమణ చేసాక ఊరికే ఉండడానికి పిచ్చెక్కుతుంది. మీరు ఢిల్లీ వచ్చి కొన్నాళ్ళు కాలక్షేపం చేయమంటే' ఆయన అస్సలు ఒప్పుకోరు. నేనెక్కడున్నానో అక్కడే బావుంది. మీ అమ్మ(గారి) లాగా నాకు డిల్లీ, ఆగ్రా, బదరీనాధ్ అవీ చూడాలనే ఉత్సాహమేమీ లేదు అనేంత తాత్విక మనస్తత్వం ఉన్న మనిషి,  కొన్నాళ్ళకు ఎర్ల్ స్టాన్లీ గార్డ్నర్ నవలలు చదువుతున్నాననీ అవి న్యాయానికీ, చట్టానికీ సంబంధించిన సృజనాత్మక సాహిత్యంలో మేలైన రచనలనీ, ఉత్తరంలో రాస్తారు. గార్డ్నర్ రచనలు వరుసగా చదివి, రచయిత అభిప్రాయాలు, జీవన్మరణాలగురించిన తత్వం అచ్చు జిడ్డు కృష్ణమూర్తిగారి అభిప్రాయాలతో సరిపోలడం గురించి ఉత్తరం రాసారు.  ఆయన కాలక్షేపానికైనా వేదాంత గ్రంధాలనే చదివే వ్యక్తి. అలాంటి మనిషి డిటెక్టివ్ నవలలను చదువుతున్నారని ఉబ్బితబ్బిబ్బవుతుంది కూతురు. ఆషాడ బహుళ నవమిన అన్నదీ, తండ్రిదీ పుట్టిన రోజు. ఇద్దరికీ చెరొక "బెర్ట్రాండ్ రసెల్ స్పీక్స్ హిస్ మైండ్"  పుస్తకాన్ని బహుమతిగా పోస్ట్ చేస్తుంది.  

ఆయన ఏకబిగిన దాన్ని చదివి, అనువాదం చేసేసేంతగా నచ్చేస్తుంది ఆ పుస్తకం. "నువ్వు పంపిన పుట్టినరోజు బహుమతి అద్భుతమైనది. గత కొద్దిరోజులుగా నేను బెర్ట్ రాండ్ రసెల్ సాన్నిధ్యంలో ఉన్నాను. ఆయన సాన్నిధ్యాన్ని నేనెంతో ఆనందించాను. పదిరోజులక్రితం రాత్రి 8 గంటలకి అనువాదం ప్రారంభించి ఈరోజు మద్యాహ్నం 3 గంటలకి పూర్తి చేసాను..  బెర్ట్ రాండ్ రసెల్ కీ, జిడ్డు కృష్ణమూర్తి గారికీ చాలా సామ్యం కనిపించింది. ఇద్దరూ ప్రపంచ విఖ్యాత మేధావులు, తత్వవేత్తలు, బోధకులు.  అయితే లార్డ్ రసెల్ బోధకుడవునో కాదో చెప్ప్పలేకపోవచ్చు కానీ ఆయన నిశ్చయంగా మహా మేధావి, తత్వవేత్త.  ఆయన అభిప్రాయాలు విప్లవాత్మకమైనవే కాదు. ఎంతో వినూత్నమైనవి. ఆయన (పుస్తక పఠనా..) సాన్నిధ్యం నాకెంతో ఆనందం కలిగించింది" అంటూ జవాబు రాస్తారు. 

ఇద్దరూ ఉత్తరాలు రాసుకుంటున్నప్పుడు, కొన్నాళ్ళకు తండ్రి హఠాత్తుగా సంతకానికి బదులు చుక్కలు పెట్టడం గమనిస్తుంది కూతురు. "ఈసారి నుండీ నా చిరునామా లో అసలు పేరు స్థానంలో మృత్యుంజయ అని రాయు. ఇది నేను పెట్టుకున్న పేరు. ఎప్పుడో అప్పుడు గతమంతా నశించాలి. ఒక కొత్త అధ్యాయం ప్రారంభమైంది. నాయీ కోరిక అనుకో, లేదా మానసిక బలహీనత అనుకో, దాన్ని మన్నించు. చెప్పినట్టుగా చెయ్యి. చిరునామాలో ఇంటి నెంబరు వేయాలి సుమా" అని చమత్కరించి రాసిన ఉత్తరంలో సంతకం స్థానంలో మృత్యుంజయ అని సంతకం చేసారు. 

ఇద్దరి మధ్యా రకరకాల ఉత్తరాలు. ఆమె ఆరోగ్యం, అనారోగ్యం, ఆయన చదివిన పుస్తకాలు, చేస్తున్న అనువాదాలు. దీపిక కోసం రాసిన వ్యాసాలు, మిగిల్న తోబుట్టువుల గురించి, బంధువుల ఇళ్ళలో పెళ్ళిళ్ళ గురించి, దివ్యజ్ఞాన సమాజం గురించీ, హోమియో పతీ మందుల సూచనలు, ఆమె చదువులు, చేయాల్సిన కోర్సులు, చైన్సీస్ విద్యా, అల్లుడి ఉద్యోగమూ, దిల్లీ రమ్మనడం, ఆయన వద్దనడం, కుమార్తె అత్తమామల గురించి హెచ్చరికలు, వారిని గురించి రాయకపోవడం గురించి మందలింపులు, వారి ఆదరణ గొన్నందుకు కూతురికి ప్రశంసలు, ప్రస్తావనలు వగైరాలు.  వీటన్నిటిలోనూ ఇద్దరి వ్యక్తిత్వమూ, కష్టపడే తత్వమూ, జీవితపు మిగిల్నకోణాల పట్లా, మనుషుల పట్లా, బంధాల పట్లా ఉన్న అవహాహన, ప్రేమ, వ్యక్తమవుతూ ఉంటాయి.


ఆయన రాసిన ఉత్తరాల్లో కొన్ని వాక్యాలు చూడండి.

(i) ఒకడు కొండల కింద, చీకటి లోయల చుట్టూ ఎప్పుడూ ఏదో తడుముకుంటూ, లొడ లొడ వాగుతూ, సణుక్కుంటూ, అష్టకష్టాలు పడుతూ, సంపాదిస్తూ, పోగు చేసుకుంటూ ఉంటాడు.  మరొకడు మేఘాలులేని ఆకాశంలోకి దూసుకుపోయి అత్యున్నత పర్వత శిఖరాగ్రాల కింకా పైన ఏ విధమైన ఆటంకాలూ ఎదురవని చోట, ప్రగాఢమైన పరిపూర్ణ నిశ్శబ్దత, ప్రశాంతత ఆవరించి ఉన్నచోట తేలుతూ ఉంటాడు.  ఈ ఇద్దరిమధ్య ఉండే వ్యత్యాసం గురించి నీకేమనిపిస్తుంది ? 

(ii) అమ్మా, మనం మన గూళ్ళలో నివసిస్తూనే, మబ్బుల్లేని అనంతాకాశంలో తేలుతూ, వర్ణనాతీతమైన ఆనందాన్ని చవిచూడటం సాధ్యం అంటావా, కాదంటావా ? 

(iii) ఏసుక్రీస్తు చెప్పిన మాటల్ని మనం మరచిపోకూడదు. "నీ దగ్గర రెండు కప్పుకునే దుస్తులుంటే ఒకటి అసలు లేనివాడి కి  ఇయ్యి" నన్ను ఇలా సాదాగా, నిరాడంబరంగా ఉండనీ..."

(iv)   నీకు నిజంగా నా మీద ప్రేమ ఉంటే, నేను త్వరగా ఏ వ్యాధి, ఏ బాధా లేకుండా, ఎవరికీ ఏ బాధా కలుగజేయకుండా, దగ్గరగా ఉన్నవాళ్ళకు గాని, దూరంగా ఉన్నవాళ్ళకు గాని, ఎవరికీ కష్టం కలుగజెయ్యకుండా నేను తనువు చాలించాలని మనసారా కోరుకోమని నిన్ను బ్రతిమాలుకుంటున్నాను. 


వృద్ధాప్యం కమ్ముకొచ్చేస్తున్న తల్లితండ్రులను ఊర్లో ఒంటరిగా వొదిలి, వాళ్ళకు ఆరోగ్యం బాలేనపుడల్లా అప్పటికే మధ్యవయసుకొచ్చి, బాధ్యతల్లో మునిగిపోయిన పిల్లలు పడే ఆవేదన అందరికీ అనుభవంలోకి వచ్చేదే.  తండ్రి వీలయినంత శారీరక శ్రమ, మొక్కలకు నీళ్ళు తోడటమూ, కూరలు తీసుకురావడమూ, చదువుకోవడమూ, ఉత్తరాలు రాయడమూ, భార్యకు సాయపడటమూ, ఆవిడ ఊరెళ్తే, మొత్తం పనిచేసుకోవడమూ - ఇలా తనకు ఓపికున్నన్నాళ్ళూ చేస్తూనే ఉంటారు. సైంటిస్ట్ అయిన కొడుకు డెహ్రాడూన్ లో ఉండటం వల్ల, వీళ్ళకు వెళ్ళే ఉద్దేశ్యమూ ఉండదు. అయితే విధివశాత్తూ, ఆయనే 84 ఏళ్ళ వయసులో కొడుకు హఠాన్మరణంతో ఇంకొన్ని కుటుంబ బాధ్యతలు స్వీకరించాల్సొస్తుంది. కాటరాక్ట్ తో కళ్ళు కనిపించడం తగ్గుతుంది. 

తల్లితండ్రులను గురించి, ముఖ్యంగా తండ్రి గురించి ఎంతో బెంగ పెట్టుకుని మనసారా ప్రేమించిన పిల్లలకు ఆయన చివరి రోజులు భారమవుతాయి. తండ్రిని గురించి రాస్తూ కూతురు రాసిన ఆఖరి పేరాల లో కొంత భాగం :- 

ఒక్క సంగతి మరచాను. నాన్నగారు 'మృత్యుంజయ' అన్న సంగతి. కొడుకు మరణాన్ని కొండంత స్థైర్యంతో స్వీకరించారు. కోడలి కోరిక ప్రకారం యధావిధిగా కర్మకాండ జరిపారు. కొడుకు కొడుక్కి ఉపనయనం కానందున తను ఏనాడో విసర్జించిన జంద్యాన్ని మళ్ళీ వేసుకుని కర్మ చేసారు. కేటరాక్ట్ ముదిరిపోయింది. రెండు కళ్ళూ చీకటి గూళ్ళు. మంచమే శరణ్యం అయింది. మరణం కోసం ఎదురు చూడ్డమే మిగిలింది. బ్రతికినన్నాళ్ళూ కోరికలని చంపుకుంటూనే బ్రతికారు. మరణించాలన్న కోరిక ఒక్కటే ఆయన చంపుకోలేకపోయింది. దానికే శిక్ష అనుభవించినట్టున్నారు.  కంటికి రెప్పలా చూసుకోవాల్సిన కొడుకు ముందే పోయాడు.  అన్నయ్య పోయిన రెండేళ్ళకు నాన్నగారి రెండు కళ్ళూ పోయాయి. వాటితో పాటే నేనూ నా చిరకాలపు 'కలం స్నేహితుణ్ణి'  కోల్పోయాను".

తండ్రులతో గాఢమైన అనుబంధం ఉన్న కూతుర్లకు ఈ పుస్తకం చాలా నచ్చుతుంది. అదెలాగూ ఉన్నదే. ఈ పుస్తకంలో అంతకు మించిన స్నేహానురక్తి ఉంది. మృత్యుంజయ దివ్యజ్ఞాన సమాజాన్ని, కృష్ణమూర్తి బోధనలనూ  నమ్మిన వ్యక్తి. "నవ్య మనస్సు" అనే శీర్షికన దివ్యజ్ఞానం పై అనేకమైన ప్రసంగ వ్యాసాలను రాశారు. జిడ్డు కృష్ణమూర్తి, దివ్యజ్ఞానము అనే అంశాలపై వివిధ నగరాల్లోనూ, రేడియోలోనూ తెలుగు, ఇంగ్లీషుల్లో ప్రసంగించారు. ఆయన వ్యాసాలు రెండు భాషల్లోనూ అచ్చయ్యాయి. ఆయన హైదరాబాదు లో జిడ్డు కృష్ణమూర్తిగారి ప్రభోధాలను వివరిస్తూ చేసిన ప్రసంగాన్ని విని, దివ్యజ్ఞాన సమాజం హైదరాబాదు శాఖ వారు ప్రచురించి దేశమంతా పంచిపెట్టారు. ఈ విషయాల్ని రాస్తూ, జిడ్డు కృష్ణమూర్తి తత్వాన్ని, తనకు చేరినంత జ్ఞానాన్ని, వీలయినంతగా వ్యాప్తి చెయ్యాలంటే ఏమి చెయ్యొచ్చో చెప్పాల్సిందిగా కోరారు. ఆమె ఇచ్చిన సలహానీ స్వీకరించారు. 

ఈ మధ్య 'మినిమలిజం ' గురించి ఒక స్పృహ వృద్ధులలోనూ మొదలయినట్టు చదివాను. చనిపోయే ముందు ఇంట్లో వస్తువుల పట్లా, పేర్చుకుపోయిన బంధనాల పట్లా బాధ్యతాయుతమైన డిటాచ్మెంట్, వదిలించుకోవడమూ గురించి ఆలోచనలు బాగా చదివాను. మృత్యుంజయుని గా  మారిన కొత్తల్లోనే, పూర్తి స్పృహతో ఆయన రాసుకున్న వీలునామా చదివితే ఆయన ఎంత నిరాడంబరంగా జీవించారో, ఎంత ఉన్నతాదర్శాలతో బ్రతుకుని తీర్చిదిద్దుకున్నారో తెలుస్తుంది.   తన నిర్దుష్టమైన బాధ్యతలను గుర్తెరిగినట్టు భార్య పేరిట కాస్త సొమ్ము, తన దహన సంస్కారాలకోసం కేటాయించిన సొమ్ము ఖచ్చితంగా కేటాయిస్తారు.  దహనానంతరం తన బూడిదను వారణాసిలో గట్రా కలపొద్దు, దహనం జరిగిన ప్రదేశానికి దగ్గరలోని నీటిప్రవాహంలో కలిపితే చాలు అని రాస్తారు. కర్మ కాండ పట్ల ఆయనకు నిర్దుష్టమైన అధునాతన అభిప్రాయాలున్నాయి. తనకై కర్మకాండ అస్సలు జరిపించవద్దని చాలా విపులంగా రాస్తారు. రిస్టువాచీ, బట్టలూ, హోమియోపతి పుస్తకాలు, మందులూ, ఎవరికి ఆసక్తి ఉంటే వారు తీసుకోవచ్చు. దహనానంతరం డబ్బు మిగిలితే కుష్టురోగులకు భోజనం పెట్టాలి. తన బట్టలన్నీ బీదలకు పంచాలి.. తన ఫలానా వస్తువులన్నీ ఫలానా అందరికీ ఇవ్వాలి అని రాసి, ఆఖర్న, "మృత్యుంజయ తన అనంతరం వదిలివెళ్ళేది సుహృద్భావం, ప్రకృతిలోని ప్రతి ప్రాణి పట్ల ప్రేమ - అంతకు మించి మరేమీ లేదుఅని రాసారు.  

ఈ పుస్తకం ముందుమాట లో  సుబ్రహ్మణ్యం గారు రాసినట్టు, "ఎన్ని తరాలు మారినా, ఏ దిక్కు నుంచి ఎన్ని ప్రభంజనాలు వీచినా, విజ్ఞాన శాస్త్రంలో ఎన్ని మార్పులు వచ్చినా, వస్తున్నా, తండ్రీ తనయల స్వభావం మారనిది.  'మృత్యుంజయా, ఆయన కూతురూ,  ఒకే క్రాంతి చక్రంలో విక్రమిస్తున్నారు - ఒకరి వలయాన్ని ఇంకొకరు ఖండించకుండా, ఘర్షణ పడకుండా.. "

ఈ పుస్తకం చాలా రోజులకు నన్ను నవ్వించింది, ఏడిపించింది, కదిలించింది. మా నాన్నగారితో  నా అనుబంధం, చివరి రోజుల్లో ఆయన నన్ను పోల్చుకోలేకపోవడం, ఆయన్ని నేను బాధపెట్టిన సంగతులూ, ఆయన ఉత్తరాలు దాచుకోవడం, ఆయన సంతకమూ, ప్రోత్సాహ పూర్వక వాక్యాలూ, అందమైన దస్తూరీ.. ఇవన్నీ గుర్తొచ్చాయి. సరిగ్గా ఇలానే హోమియో మందులు సూచించడమూ, మా చదువుల్నీ, ఉద్యోగాల్నీ, కుటుంబాలనీ ఆయన ఎంత ఇంటరెస్ట్ గా సమకూర్చి పెట్టారో తలచుకున్నాను. ఆయన ఉండి వుంటే నేనిప్పుడు పడుతున్న చిన్నా పెద్దా కష్టాలకు ఆయన  ఓదార్పులు, ధైర్యవచనాలూ, నాకు ఎంత దన్నుగా ఉండేవో గుర్తు చేసుకున్నాను. ఇకపై అబ్బూరి చాయాదేవి రచనల్ని వెతికిమరీ చదవాలని నిశ్చయించుకున్నాను. 

***


10/11/2024

Roman Stories - Jhumpa Lahiri

 


 

 

లాహిరి ది ఇది ఇంకో అనువాదం. ఒరిజినల్ ఇటాలియన్ లో రాసినది. 'పెద్దగా కదిలించని పుస్తకం' గా పలు రివ్యూలలో చదివాను. చదవడానికి మనసు రానప్పుడు, ఊరికే తిరగేయడానికి పనికొస్తుంది. ఎప్పట్లాగే, ఒక దృక్కోణంతో చెప్పే కథలు. రచయిత్రి చాలా చోట్ల పాత్రధారిగా కనిపిస్తుంటుంది.

మొదటిది, ఒక శరణార్ధి కుటుంబపు కథ. అతనికి పూల వ్యాపారం ఉంటుంది రోం లో ! కానీ అతని పై ఒక సారి జాత్యాహంకార దాడి జరిగింది. ప్రపంచం ఎప్పట్లాగే 'వేరే ' వాడిని నిరాకరిస్తుంది. అతనికి పోషించుకోవడానికో కుటుంబం ఉంది. స్వదేశంలో ఉపాధి లేదు. ఒక మారుమూల పల్లెలో పొలం, ఎస్టేటూ చూసుకునే పనికి కుదురుతాడు. దాడిలో అతను భౌతికంగా దెబ్బతినిపోయినదే కాకుండా, మానసికంగా కూడా డస్సిపోతాడు. మాటలు పోతాయి. ఈ పల్లె బ్రతుకు భార్యకు ఇష్టం ఉండదు. ఐనా ఏమి చెయ్యగలం? ఇక్కడ మన జోలికి వచ్చేవారుండరు. ఎలాగో ఒకలా బ్రతుకుదాం. ఎవరి పొడా లేకుండా !   అనేది అతని ఉద్దేశ్యం.    ఆ ఎస్టేట్ కి సీజన్ బట్టి అద్దెకు తీసుకుని వచ్చే కుటుంబాలుంటాయి. అతను కేర్ టేకర్. అతని భార్యా, కూతురూ, అతిధులకి అన్నీ సమకూరుస్తుంటారు. అదే జీవితం వాళ్ళకు.  

బిజీ నగర జీవితాల నుండీ తప్పించుకునేందుకు వచ్చిన అతిధులకు ఆ గ్రామపు శూన్యతా, మౌనమూ కట్టిపడేసినట్టు అనిపిస్తాయి. దాదాపు ప్రతివాళ్ళూ వెళ్ళేటపుడు, మళ్ళీ ఇక్కడికి వస్తాం - అంటారు గానీ రారు. వీళ్ళని అతని కూతురు ఓ పదమూడేళ్ళది గమనిస్తూ ఉంటుంది. అతిధులు, వాళ్ళ పిల్లలు, వాళ్ళు వదిలేసి వెళ్ళిన సామాన్లు, వాళ్ళను గమనిస్తూ గడిపిన క్షణాలు మాత్రమే ఆమె మొనాటనీ కి కొంచెం ఆటవిడుపు. కథంతా ఈ పాప దృష్టిదే.

ఇలానే ఇంకో కథ : 'పి' పార్టీ లు. లాహిరి అన్ని కథల్లో లానే, ఏ పాత్రలకీ పేర్లుండవు. ఏ ప్రాంతాలకీ పేర్లుండవు. ఏ ద్వీపాలకీ, యాట్ లకీ, వేటికీ పేరులుండవు. పీ అనే ఆవిడ ప్రతి వేసవిలోనూ ఏర్పాటు చేస్తుండే పెద్ద పెద్ద పార్టీలకి హాజరవుతూ,  అక్కడ ఒక తెలీని విదేశీయురాలితో ప్రేమలో పడిపోతాడు కథకుడు. ఎన్ని సంఘర్షణలో.. ఎన్ని సంభాషణలో, ఎంత రొటీన్ - యూనివర్సిటీకి వెళ్ళిపోయిన పిల్లాడిని మిస్ అయే తండ్రి ప్రేమ, మగాళ్ళ సున్నితత్వం ! ఆఖరికి జీవితం చాలా విచిత్రంగా ఉంటుంది. ఎన్నో ఏళ్ళుగా పార్టీలు, సందడీ, స్నేహితులూ అని కులాసాగా ఉండే పీ చనిపోతుంది. ఆమెకి ఏదో జబ్బు. ఒకసారి ప్రాణాల మీదికొస్తే ఎలానో బ్రతికింది. ఆఖర్న బ్రతకలేకపోతుంది. ఆమె ఫ్యూనరెల్ కూడా పార్టీలానే ఏర్పాటు చేస్తారు కుటుంబసభ్యులు. మనిషికి సాటి మనిషి మీద ఉండే ప్రేమ కి నివాళి ఈ కథ. 

అయితే మనిషి సొంతవాళ్ళనే ప్రేమిస్తుంటాడు. రోం లాంటి ఊరిలో శరణార్ధులు ఎక్కువ. ఆఫ్రికా నుండీ, ఆసియా నుండీ డింగీలలో ప్రమాదకరంగా సముద్రాన్ని దాటి పారిపోయి వాళ్ళు చేరుకునే దేశం ఇటలీ నే. చాలా కథల్లో ఈ శరణార్ధులని ద్వేషించే సమాజం కూడా వుంటుంది. ఇద్దరు కన్న బిడ్డలతో, సంతోషంగా రోం లో జీవించిన ఒక తల్లి, భర్త పోయాకా, ఒంటరితనాన్ని ఈదేందుకు చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తుంది. అదీ, అనుకోకుండా, తెలిసినవాళ్ళు చూపించినవి. ఒక సారి స్కూల్లో చిన్న పిల్లల్ని చూసుకునేందుకు చేరుతుంది. అదీ లీవ్ వేకెన్సీ లో. టెంపరరీగానే. ఆ మాత్రం సమయంలోనే చిన్న పిల్లలే ఆమె కోటు జేబులో,  'నువ్వు మాకు నచ్చలేదు', 'నువ్వు మాకు వద్దు', 'నువ్వు బాలేవు', 'ముందుండే మిస్ బావుంటుంది'... వగైరా నోట్ లు పెడతారు. ఆవిడ చాలా బాధపడుతుంది. కొడుకులు వేరే దేశాల్లో ఉద్యోగాల్లో ఉన్నారు.వాళ్ళు తల్లికి ధైర్యం చెప్తుంటారు. స్కూల్ విడిచిపెట్టి వచ్చేసేటపుడు ఆవిడా ఆ నోట్ లన్నింటిని రిపోర్ట్ చెయ్యకుండా (అన్నాళ్ళూ కోట్ లోనే ఉంచుకుంటుంది) నమిలి మింగేస్తుంది. భూదేవికున్నంత క్షమ. 

ఇంకో కథ లో ఒక శరణార్ధి కుటుంబం (ముస్లిం) ! వాళ్ళకి ఎన్నాళ్ళో టెంట్ లలో గడిపాక, ఒక హౌసింగ్ కేంప్ లో ఇల్లు కేటాయింపబడుతుంది. ఇక సుఖపడదామా అనుకునేసరికీ, అదే కేంప్ లో సాటి శరణార్ధులలోనే వేరే వేరే దేశాలవాళ్ళూ, ఇతర జాతి  బీదవాళ్ళూ, ఇతరులు, అతని కుటుంబం జీవితాన్ని  దుర్భరం చేసేస్తారు. ముసుగు వేసుకునే భార్య బురఖా,  అన్ని చూపులు వీళ్ళ మీద పడేందుకు కారణం అవుతుంది.  బెదిరింపులు సాధారణం అయిపోతాయి.   ఏ క్షణాన ఏం జరుగుతుందో అని భార్య, పిల్లల్ని పట్టుకుని, కూడబెట్టిన డబ్బంతటితోనూ టికెట్ కొనుక్కుని స్వదేశానికి వెళిపోతుంది. అతను రోడ్డున పడతాడు. కానీ బ్రతుకుతెరువు కోసం ఆ దేశం లోనే ఉండాల్సిన పరిస్థితి.

ఇంకో కథ లో హీరోయిన్ కూతురు, బోట్లలో వచ్చే శరణార్ధులకు నీళ్ళూ, తిండీ, వసతీ, బ్లాంకెట్లూ, వైద్య సహాయమూ, అంత్యక్రియలు, డాక్యుమెంటేషన్ కూ సాయం చేసే వలంటీరు గా పనిచేస్తుంటుంది.   తమ తమ దేశాల్లో యుద్ధం, కరువు, తీవ్రవాదం నుండీ జనాలు పారిపోతుంటారు. ఇటలీకి కొట్టుకొచ్చే వేల శవాలు ఈ మాట చెప్తుంటాయి. ఇటలీ నుండీ బారులు కట్టి యూరోపు కు నడిచెళ్ళే వాళ్ళు, ఆ దేశం లోనే వీళ్ళతో రొట్టెనీ, ఇళ్ళనీ షేర్ చేసుకునే మంచి పౌరులూ.. ఇలా ఎందరో ఉంటారు.  అయితే ఇవి రోం కథలు కాబట్టి, పాక్షికంగానే ఈ ప్రస్తావనలు వస్తుంటాయి. రోం నగరం లో జీవితం ప్రధానంగా చెప్పబడుతుంది.

లాహిరి - కదిలించని కథలెలా రాస్తుంది ?  కాలక్షేపం కోసం చదివే కథల్లో డాంటే వస్తాడు. ఒక టీనేజ్ అమ్మాయి కథ ఇది. ఆమె ప్రాణ స్నేహితురాలి బాయ్ ఫ్రెండ్, ఈమె పై ప్రేమ వ్యక్తం చేస్తాడు. కానీ దానివల్ల ఈమె ప్రాణ స్నేహితురాల్ని కోల్పోతుంది. అటు ఆ ప్రేమికుడూ తను చేసిన పనికి విచారించి, ఈమెకు దూరమవుతాడు.    అదంతా ఎలా వుంటుందంటే,  బాల్యం లో   ఈ పిల్ల ఒంటరిగా ఇంటి వెనక పెరటి అడవిలో ఆడుకునేటప్పుడు ఒకసారి నేల మీద మన్నులో ఉన్న  ఒక మాదిరి సైజ్ రాయి ని తొలగించి చూస్తుంది.

దానికింద వానపాములూ, పురుగులూ వంటి (ఈమె అక్కడ లేవనుకున్న) జీవరాశి లుకలుకలాడుతూ కనిపిస్తుంది.  వాటిని చూసి ఈ పిల్ల ఆ రాతిని మళ్ళీ ఎక్కడ తీసిందో అక్కడే జాగ్రత్తగా పెట్టేస్తుంది [వాటిని డిస్టర్బ్ చెయ్యకుండా].   ఈ  స్నేహితురాలి బాయ్ ఫ్రెండ్ తన టీనేజ్ అయోమయం లో,  అచ్చు 'తన లో లేవనుకున్న ఫీలింగ్స్' ని   ఒక ప్రేమలేఖ రాసి, ఆమె సరిగ్గా ఆ రాయిని తొలగించి చూసినట్టు, తనలోకి తొంగి  చూసునట్టు ఊహించుకుంటుంది.   ఈమె హృదయ స్పందన వినేసి, మళ్ళీ రాతిని మూసేసి వెళ్ళిపోతాడు ఆ అబ్బాయి.  అతను ప్రేమలేఖ లో రాసిన మారు  పేరు 'డాంటే'.  ప్రేమ పోతే పోయింది గానీ 'డాంటే'  ఆమెను ఆకర్షించేస్తాడు.   ఇక ఈ పిల్ల తండ్రి చదువుకొమ్మన్న సైన్స్ ని వదిలేసి, డాంటే నే చదువుకుంటుంది యూనివర్సిటీ లో.. ఈ కథ నాకు చాలా నచ్చింది.  ఇది కూడా ఇమిగ్రెంట్ కుటుంబమే (బహుశా ఇండియన్).

ఏదో చదివించే గుణం ఉంటుంది లాహిరి లో.    మా స్నేహితుల్లో  ఒకమ్మాయి, కాఫీ తాగడాన్నీ, డాబామీద ఆరేసిన బట్టల్ని తీసుకురావడాన్ని కూడా కవితాత్మకంగా,  తాద్యాత్మంగా చెప్తూండేటపుడు,   ఆమె జీవితోత్సాహాన్ని చూసి ఎంత మెచ్చుకుంటూ, నవ్వుకునేదాన్నో గుర్తొస్తుంటుంది ఈ కథలు చదివితే!   ఈ మధ్య, వయసుతో పాటూ, రచయిత్రీ, నేనూ ఎంతో మారాం.  కరుడు కట్టిన రచనా విధానాలనుండీ, లేత కొబ్బరి జున్ను లాంటి  మనసులున్న మనుషుల కథలు చదవడం పెద్ద ఉపశమనం.    చాలా మటుకూ శరణార్ధుల కథలే.    రోమన్ కథ లనగానే రొమాన్స్ ని ఊహించుకుంటే దెబ్బ తగులుతుంది.    ఒక్కోసారి కష్టమైన జీవితాన్ని నమ్మకంతో  ఈదడమే రొమాన్స్. 

 ***



అవిశ్రాంత బాటసారి - కాజీ నజ్రుల్ ఇస్లాం

 


 

ఇరుకుగా ముళ్ళతో నిండిపోయి నడవటానికి వీల్లేని  అ‍డవి బాటలో నడుస్తున్నాడు ఆ బాటసారి. ఉన్నట్టుండి తనమీద కోట్లాది చూపులు పాకుతున్నట్టు అనిపించి వెనక్కి తిరిగి చూశాడు. ఆ చూపులు దివ్యమైన ఉత్సాహంతో వెలిగిపోతున్నాయి. ఆ చూపులు అతని హృదయాన్ని చెప్పలేనంత గర్వంతో నింపేసాయి. ఎంతో తృప్తిగా అనిపించింది. చిరునవ్వు చిందిస్తూ చాలా ఒద్దికగా అడిగాడు "భాయీ, మీకంత శక్తివంతమైన చూపు ఎక్కడనించి వచ్చింది?" 


కోట్లాది నక్షత్రాల్లా వెలిగిపోతున్న ఆ కళ్ళు "ఓ ధైర్యశాలీ, నీవు నడిచి వచ్చిన దీర్ఘమైన దారినంతా అలా చూడగా, చూడగా అబ్బిన శక్తే మా చూపుది!" సమాధానమిచ్చాయి. 


అప్పుడు మృదువైన వెచ్చని చూపు మాత్రం ఆతనికి ఒక సందేశాన్నిచ్చింది. "ఇదిగో! ఈ అష్ట కష్టాల బాట ఇంతకుముందు ఇటుగా నడిచిన యువ బాటసారులెవరూ తప్పించుకోలేనటువంటి మృత్యువుకే దారితీసింది!!" అని.    అదివినీ వినంగానే, కోట్లాది గొంతులు అరిచాయి… "నోరుముయ్యవోయి పిరికివాడా… ఇది అనంతమైన, నిజమైన మానవత్వపు ఆత్మ వైపు చేసే పయనానికి దారి" 


ఆ బాటసారి తన రెండు కళ్ళనూ విప్పార్చుకుని పరోపకారతత్వం తొణికిసలాడే ఆ కోట్లాది చూపులను తృప్తిగా తాగాడు. సరిగ్గా శృతిచేసిన వీణ ఎలాగైతే ఒక వేలు మీటగానే నిద్రాణ స్థితినుండి లేచి ప్రాణధ్వని వినిపిస్తుందో సరిగ్గా అలాగే అతనూ చటుక్కున మేల్కొన్నవాడిలా 'పద ఇక ముందుకు ' అని తనని తాను ఉత్తేజపరచుకున్నాడు. 


చెట్లతో నీం‍‍డిన ఆ అనంతమైన విస్తీర్ణం, బాటసారికి హఠాత్ యవ్వనం ప్రసాదించేసి ఒక ప్రకటన చేసింది - "నీ నుదుట్న యవ్వనపు సార్వభౌమత్వాన్ని ఒక ముద్రలా వేసిస్తానుండు. ఇది నిన్ను నిత్య యవ్వనునిగా, చిరంజీవిగా చేస్తుంది!!" అల్లంత దూరంలోనున్న క్షితిజరేఖ ఇతని వైపుకు వంగి ఆశీర్వదిస్తూ తలను ముద్దాడింది. బాట పక్కనున్న చెట్లు తమ కొమ్మల్ని ఆడిస్తూ శుభాకాంక్షలు తెలిపాయి. ఆ సుదూరపు క్షితిజరేఖ అతనికి అస్పష్టంగానే అయినా, స్వతంత్ర దేశపు ఆనవాలను చూపించింది. ఆ స్వతంత్ర దేశపు ముఖద్వారంలో భయానకమైన వేకువ పాట ఒకటి వేణునాదమై బాటసారిని, ఆ వనంలోని ఒక హిరణ్యాన్ని మైమరిపించేసినంతగా కట్టిపడేసింది. ఆ గాన మోహం లో పడి, అతను స్వాతంత్రం వెంట పరుగులు పెడుతున్నాడు. "అహో! నీ స్వతంత్రపు ప్రధాన ద్వారం ఎక్కడ? తెరువు ఆ తలుపుల్ని… తెరువు… నాకు వెలుతురిని చూపించు. దారిని చూపించు!"


విశ్వపు మార్మిక దివ్యత్వం అతన్ని కమ్మేసి చెప్పింది  "ఇంకా చాలా దూరం ఉంది. నడు". అతను హతాశుడై, 'హేయ్! నేను వెతుకుతున్నది నిన్నే!" అని అన్నాడు.


అప్పుడే పరిచయం అయిన ఆ సహ పాంధుని గొంతు ఇలా అంది, "నన్ను పొందేందుకు నువ్వు చాలా  దుర్గమ మార్గాన్ని దాటాల్సుంటుంది." 


అలుపెరగని బాటసారి తన గమనాన్ని తొందర చేసాడు. "అవును భాయీ ! అదే నా లక్ష్యం". ఈ హడావిడికి, హద్దుల్లేని ఆకాశం క్షణమాగి ఒక చిన్న సందు చూసుకుని కిందున్న 'అంతులేని ఆ అడవి' కేసి తొంగి చూసింది.    వెనకున్న కోట్లాది  యువ గొంతుకలతని మాట విని.. "మాదీ అదే లక్ష్యం.. పద భాయీ… ముందుకు పద. నువ్వు ముందుకెళ్ళు - మేము నీ అడుగుల్ని అనుసరిస్తాం" అంటున్నాయి. 


గర్వాన్నీ, సంతృప్తినీ బయట పడనీయకుండా తొక్కిపట్టలేకపోయినప్పటికీ బాటసారి వారికో మాట గుర్తు చేసాడు 'కానీ ఈ పయనం మృత్యువు వైపు కదా!' 


కోపాన్నణుచుకోలేని ఆ యువ గళ కోటి  అతని హెచ్చరికను తిప్పికొడుతూ అరిచింది. "మేము దాన్ని పట్టించుకోము. ఇది చావు కాదు. ఇది అసలైన బ్రతుకుకి, ఒక కొత్త మొదలు!"


కొంచెం వెనగ్గా బలహీనమైన గుండె గల ఒక వృద్ధుల గుంపు చావు భయంతో వణుకుతూ ఉంది. వాళ్ళ భుజాల మీద నొక్కిపట్టి కూచుని వికృతమైన నవ్వుతో వాళ్ళని హేళన చేస్తూ… "చూడండి. నేనే మృత్యువును. ఇక్కడే ఉన్నాను" అంటోంది ఒక స్వరం.  


అక్కడికి దగ్గరలో, ముదిమితో చీకటి చిమ్మిన కళ్ళకు 'వెలుగు తాలూకూ అనుభూతిని' ఇచ్చేందుకని సువాసనలు వెదజల్లుతున్న ఒక చితి మంట మండుతూ ఉంది. పొట్ట చెక్కలు చేసేటంతటి నవ్వుని ఎలానో  ఆపుకుంటూ, వాళ్ళను ఆ చితి వైపు నడిపించి "ఇదిగో చూడండి ఇదే మీ మోక్ష మార్గం!!  ఎందుకిలా మీ వృద్ధాప్యంలో ఈ దీర్ఘమైన కఠిన మార్గాన్ని ఎన్నుకుంటున్నారు? ఎప్పటికైనా ఆ బాటసారి గానీ, అతని అనుచరులు గానీ చేరుకునేది మృత్యువు ఒడికేగా?!" అన్నదో గొంతు.


వారిలో కురువృద్దుడొకడు ఒకడు రెండు చేతులూ పైకి చాచి "అవును.. నిజమే!" అని అన్నాడు. 


ఒక కొంటె గొంతు హెచ్చరికగా అంది. "మూర్ఖులారా ! ఎవరినీ ఎప్పుడూ దేనికోసమూ అడుక్కోమాకండి. వాళ్ళు మెల్లగా మిమ్మల్ని ఆ చితిలో వేసి చచ్చేవరకూ కాలుస్తారు." 


వారి నాయకుడొకడు ఇంకో ఉప్పెన వంటి నవ్వును బలవంతంగా అణుచుకుంటూ "కాదు కాదు వాళ్ళ మాటలు వినొద్దు. వాళ్ళ దారి ప్రమాదాలతో నిండినదీ, దీర్ఘమైనదీనూ. పైగా దారంతా కష్టాలు, ఆటంకాలు, దుఃఖాలు… మీ విడుదల దగ్గర్లోనే ఉంది" అన్నాడు. 


అలుపెరగని బాటసారి మాత్రం, స్వాతంత్రపు ముఖద్వారపు వేణుగానం మాయలో పడి కొట్టుకుపోతున్నాడు.   స్వతంత్రం వైపు అడుగులు వేస్తూనే ఉన్నాడు.   దారి బాధల పిశాచాలు ఇపుడతన్ని హింసలపాలు చెయ్యబూనాయి.   అతనికి తడబడిన పాదముద్రలు కనిపిస్తున్నాయి… అవి ఇంకా వెళ్ళాల్సిన దారి చాలానే ఉన్నట్టు సూచిస్తున్నాయి.  కష్టాల ముళ్ళ బాట కి రాణైనటువంటి ఒక  పిశాచం,   ఒక కపాలాన్ని అరచేత పట్టుకుని బాటసారికెదురుగా నిలబడి… 'చూడు. నీ ముందు వెళ్ళిన వాళ్ళ పని ఇక్కడితో ఇలా సమాప్తం అయింది!!'  అంది. 


ఆ కపాలాన్ని తన నెత్తిన పెట్టుకుని ఆ బాటసారి ఇలా అన్నాడు "ఆహా! వీళ్ళే కదా నన్ను ఈ దారిలోకి పిలిచింది. నేను కోరుకునేది కూడా ఇదే. ఇలాంటి అంతమే నాకూ కావాలి. నా దారి ననుసరించి రాబోయే ఇలాంటి లెక్కలేనందరు యువతతో కలిసి నేనెప్పుడూ ఉంటాను'. 


పిశాచి 'ఎవరు నీవు?'   అనడిగినపుడు బాటసారి ఇలా అన్నాడు.    "నేను స్వతంత్రాన్ని కోరుకునే నిత్యాన్వేషిని.   ఇలా ఇక్కడ పరుచుకున్న కపాలాలలోని వాళ్ళందరూ మృతులూ కారు, జీవితులూ కారు.  వీళ్ళందరూ నా వంటి అన్వేషకులను ఈ దారెమ్మట వచ్చేందుకు ప్రోద్బలమిచ్చినవారు.   వీళ్ళు నాలో నూతన యవ్వనాన్నీ, శక్తినీ, ఉత్సాహాన్నీ, మెరుపునీ ఇస్తూ వచ్చారు. మేమంతా స్వతంత్ర సాధకులం. మేము చిరంజీవులము". 


పిశాచి వణుకుతూ, తెగువ తెచ్చుకుని ఇలా అరిచింది. "నేను నీకు తెలియదా? నేను మూర్తీభవించిన బానిసత్వాన్ని. నువ్వేమన్నా సరే ,నా లక్ష్యం నిన్ను ఉనికి లేకుండా చేయడం. నిన్ను బంధించడం, నీ స్వతంత్రాన్ని శృంఖలాలతో బంధించడమే నా నెలవు . నువ్వు నా చేతిలో చావాల్సిందే".


బాటసారి క్షణమాగి సమాధానం ఇచ్చాడు. "సరే. చంపు. బంధించు. కానీ నిజంగా నువ్వు నన్ను పూర్తిగా నిర్బంధించలేవు.   చావు నన్ను సర్వనాశనమేమీ చెయ్యలేదు. నేను  ఎప్పటికప్పుడు  తిరిగి వస్తూనే ఉంటాను." 


ఆ పిశాచం అతని దారికెదురుగా మళ్ళీ నించుని ప్రకటించింది. "నాలో ఏ మాత్రం శక్తి మిగిలున్నా సరే… నువ్వు తిరిగొచ్చిన ప్రతిసారీ నిన్ను చంపక మానను. నీలో శక్తి ఉంటే నన్ను చంపు. లేదా నేను పెట్టే హింసను భరించు!" 


దూరాన బారుగా తెరిచి ఉన్న స్వతంత్రపు ఉత్థానం పైన అప్పటికే ప్రాణత్యాగం చేసిన ఇతర బాటసారులంతా పూర్తి యవ్వనంతో ప్రకాశించుతూ ఉత్సాహంతో గుమిగూడి, చిరునవ్వులతో అతన్ని తమ వైపుకు చేతులు జాచి ఆహ్వానిస్తున్నారు. బాటసారి వాళ్ళనడిగాడు "జీవితపు పరమార్ధం దాన్ని పరిత్యాగంలోనే ఉందా ?"


ఒక స్వతంత్ర ఆత్మ, స్వతంత్ర ఉత్థానం పైనుండీ బదులిచ్చింది - దాని గొంతు చాలా లేతగా, మృదువుగా ఉంది. "అవును భాయీ! తరతరాలుగా జీవితం ఇలాంటి కీర్తనల్నే పాడుతూ వచ్చింది. నువ్వెలా బ్రతికావన్నది, నువ్వెలా పోయావన్నది, నీ నడత ఇతరుల జీవితాల్ని ఎలా ప్రభావితం చేసిందన్నది ముఖ్యం. నీ బ్రతుకు గాని, చావు గాని, అందరి స్మృతుల్లో అమరత్వాన్ని పొందేందుకు, ఇతరుల్లో నిత్య చైతన్యాన్ని, వికాశాన్నీ రగిలించేందుకూ ఉపయోగపడాలి."


ఇది వింటూనే యువ బాటసారి పరాక్రమవంతంగా పిశాచానికి తన చాతీని ఎదురొడ్డి "ఝుళిపించు నీ ఆయుధాన్ని!" అంటూ ముందుకు ఉరికాడు. అతనిని అందాకా అనుసరించిన యువత అతని ప్రాణంలేని దేహాన్ని తమ తలల మీదుగా మోసుకెళ్తూ "మళ్ళీ నీవు తిరిగి రావాలి" అని అరిచింది. 


సుదూరాన క్షితిజం వెనక నుండీ ఇంకొన్ని గొంతుకలు ఇంకో వాద్య గోష్టి వినిపించాయి.


"నీవు మ్రోగించిన ఢంకా దరువులు ఇక్కడి దివ్య ఆత్మలను తమ లయబద్ధ విన్యాసాలతో తాకాయి. నిను అనుసరించేందుకు, నీ స్థానాన్ని భర్తీ చేసేందుకు నీవంటి ధీరులు ఇంకొందరు తరలి వస్తున్నారిదిగో!"


***

English Title : The Restless Traveller : A Vignette 

Written by : Kazi Nazrul Islam

Translated from Bangla to English : Dhrubajyoti Sarkar

Frontline Magazine Short Story, Nov 2024

(Free Test Translation, need a lot of improvement, suggestions welcome pl) * Permissions not taken. 


Context : revolution, freedom fight.