Pages

17/08/2026

Houti Attacks in the Red Sea and the Shifting Paragigms of Modern Warfare - AVM PK Mallick, VSM (Retd)

Houti Attacks in the Red Sea and the Shifting Paragigms of Modern Warfare - AVM PK Mallick, VSM (Retd)

చైనా టిబెట్ లో ప్రపంచం లో అతి మెగా అతి పెద్ద డాం ని నిర్మిస్తూంది. ఒక వేళ ఏ భూకంపాలకో, లాండ్ స్లైడింగ్ వల్లనో, చైనా కనుక ఆ డాం ను నియంత్రించలేకపోయినా, లేదా ఆ డాం పగిలినా, నిజంగానే చైనా ఉద్దేశ్యపూర్వకంగా డాం ని బద్దలు కొట్టినా, ఆ నది నీరు, కింద ఉన్న అరుణాచల్ ప్రదేశ్, అసాం, బాంగ్లాదేష్ లను సమూలంగా ముంచెత్తగలదు.  ఒక విధంగా  నీరు ఒక ఆయుధం. అదేదో అంటామే - ఒక సారి వినాశనం సృష్టించే మెగా మాస్ డిస్ట్రక్టర్.  ధన ప్రాణ నష్టంతో పాటూ, ఇలాంటి అవకాశాల వల్ల జరిగే ఎకాలజికల్ విధ్వంసం కూడా ఈ ప్రాంతాలు త్వరగా కోలుకోనివ్వవు.   ఇలా ప్రకృతిని, భౌగోళిక సంపదలనూ, ప్రాదేశిక వాతావరణాన్నీ, బూచి గా మార్చడాన్ని మానవుడు ఎపుడో నేర్చేసుకున్నాడు.  చైనా ఇపుడు ప్రపంచంలోనే బలమైన దేశం, సార్వభౌమాధికారం ఉన్న ఒక దేశం.  కానీ ఏ సార్వభౌమత్వమూ, రాజ్యమూ లేని చిన్న ఉగ్ర మూక, పర్యావరణ బాంబుల్నీ, చిన్న చిన్న పడవల్నీ, ఆయుధాలనీ వాడి, ప్రపంచ వాణిజ్యాన్ని అతలాకుతలం చెయ్యగలగడం, దాని ముందు పెద్ద పెద్ద నేవీలు, సైన్యాలు కూడా దిక్కు తోచని పరిస్థితి కి నెట్టివేయబడడం ఇప్పుడు చూస్తున్నాం. 


దాని గురించి రాసిన ఈ బుల్లి 62 పేజీల పెద్ద వ్యాసం / ఈ-బుక్ గురించి నేను చేస్తున్న చిన్న పరిచయం ఇది. యుద్ధ కళ బాగా మారింది. ఆధునికం కాస్తా అత్యాధునికం అయింది. కృత్రిమ మేధ - రకరకాల మనుషుల్లేని విమానాలు, ఇంటర్ నెట్, బిగ్ డేటా, టెక్నాలజీ, సింథటిక్ బయాలజీ, వగైరాలు అందరి నాలుకలపై తిరుగుతున్నాయి. 

ఎర్ర సముద్రం లో ఇప్పుడు  ఉన్న పరిస్థితులు, వాటి వెనకున్న మర్మాలు, గొడవలు, ఆయుధాలూ వీటన్నిటి గురించి ఇంకా, సాంప్రదాయ సైన్యానికి ఉన్న పరిమితులు, సొంతింటి గూళ్ళలోంచీ స్థానబలిమితో అనువైన  పోరాటం చేసే ఈ కాలపు తీవ్రవాదులూ, సాయుధ మూకలూ, ప్రపంచం లోకెల్లా అత్యంత సమర్ధవంతమైన నౌకా సైన్యాన్ని సైతం ఎదుర్కోగల వాటి బుద్ధి బలం, పాటించే చిన్న చిన్న వ్యూహాల సామర్ధ్యం గురించి రచయిత ఈ పుస్తకం లో వివరిస్తారు. 


నిజానికి ఎర్ర సముద్రం లో ఇప్పుడు జరగాల్సిన యుద్ధం పెద్ద పెద్ద వార్ షిప్ ల తో కాకుండా తీరాల్లో గస్తీకీ యుద్ధానికి వాడే చిన్న నౌకలకూ, ఈ మూకలు వాడే బోట్లకూ మధ్యే జరగాలి.  దీన్ని బట్టి సముద్రం లో శాంతినీ, స్థిరత్వాన్ని ఈ అతి పెద్ద అత్యాధునిక యుద్ధ నౌకలు, శక్తివంతమైన నౌకా దళాలూ తీసుకొస్తాయన్న గారంటీ అయితే లేదు అన్న సంగతి అర్ధం అవుతుంది.  అయితే వీటిలో కొన్నిటిని లోతుగా పరిశీలించాల్సిన అవసరం ఉంది. 


సౌదీ అరేబియా కూ, యెమెన్ కూ మధ్య ఉన్న సమస్యలూ, యెమెన్ కూ దిజిబూతీ కీ మధ్య దగ్గర దగ్గర కనిష్టంగా 20 మైళ్ళ వైశాల్యం మాత్రమే ఉండిన 'బాబ్ ఎల్ మండెబ్' జలసంధి తాలూకూ ప్రాధాన్యతా - ఇపుడు ప్రపంచానికి తెలుసు. సౌదీ, యునైటెడ్ అరబ్ ఎమిరైట్స్ కూ, ఇరాన్ కూ మధ్య ఉన్న ప్రాధమిక వాణిజ్య రహదారి అయిన హర్మూజ్ జల సంధి ని ఇరాన్ ఆపేశాకా, దాదాపు పెట్రోల్ ఉత్పత్తి చేసే దేశాలన్న్నీ సౌదీ కి దిగువన ఉన్న ఈ బాబ్ ఎల్ మెండెబ్ జల సంధి ద్వారా తమ క్రూడ్ ఆయిల్ నూ, ఎల్ ఎన్ జీ నీ సరఫరా చేస్తున్నాయి. ఇరాన్ హర్మూజ్ ని మూసివేయడానికి తోడు, దానికి మద్దతుగా,   ముఖ్యంగా 'బాబ్ ఎల్ మెండెబ్' జల సంధి లో ట్రాఫిక్ కీలకంగా మారిన కొన్ని నెలలకు హౌతీలు దీనిలో నౌకల మీద దాడులకు తెగబడి, అమెరికాను మరింత ఇరకాటంలోకి నెట్టేయడం, అది యుద్ధాన్ని ప్రభావితం చెయ్యడం, ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన అమెరికా సాయుధ సంపద, ఈ గుంపు ముందు, ఈ గుంపు వాడే చిన్నా చితకా ఆయుధాల ముందు బెదరాల్సి రావడం విచిత్రం.  అందువల్ల ఆధునిక కాలం లో స్పేస్ వార్ లు / సమాచార యుద్ధాలు లాంటివి ఎలా గెలవాలనేదాంతో పాటు, ఇలా నదుల నీళ్లు, సముద్ర మార్గాలూ కూడా ఆయుధాలయ్యే యుద్ధం గెలవాలంటే ఏం చెయ్యడం అనేది అందరూ తెలుసుకోవలసిన విషయాలు. 


బాబ్ ఎల్ మెండెబ్,   మెడిటెరేనియన్ సముద్రాన్నీ, హిందూ మహా సముద్రాన్ని కలిపే చోట ఉన్న  ఓ కీలకమైన జల సంధి.   దీనికి పశ్చిమాన ఆఫ్రికా తీరం  లోని దిజిబూతి, తూర్పున యెమెన్ ఉన్నాయి. పెరిం ద్వీపం (జబాల్ అల్ టాయిర్) ఈ సంధిని రెండు ప్రధాన సముద్రయాన మార్గాలుగా (కాలువలు) విడదీస్తుంది. 



* కుడి కాలువ"  (బాబ్ ఇక్సెందర్) : రెండు మైళ్ళ వెడల్పు, దగ్గరదగ్గర 98 అడుగుల లోతు తో అంత పెద్దవి కాని నౌకలకి సరిపోతుందిది. 


* "పడమటి కాలువ" : 16 మైళ్ళ వెడల్పు, 1017 అడుగుల లోతు తో, లోపలికీ, బయటికీ రెండువైపులా నౌకలు ప్రయాణించడానికి రెండు రెండేసి మైళ్ళ ఇరుకు ఉన్న ట్రాన్సిట్ కారిడార్లతో ఉంటుంది. 

ఈ ఇరుకు దారి లో వెళ్ళే వాణిజ్య నౌకల పరిస్థితి ఎంత సున్నితంగా ఉంటుందో ఊహించుకోండి. సాధారణంగా వాణిజ్య నౌకలు బోల్డంత బరువుల్ని మోసుకుపోతూ, అతి నెమ్మదిగా ప్రయాణిస్తూంటాయి. వీటి మీద దాడి జరిగితే ఎంత కష్టం? పైగా అవి క్రూడ్ ని తీసుకెళ్ళే నౌకలయితే ? 

రష్యన్ ఆయిల్ మీద నిషేధం విధించిన తరవాత 2021 నుండీ 2023 మధ్య ఈ "బాబ్ ఎల్ మెండెబ్" తాలూకు ప్రాముఖ్యత పెరిగింది. రష్యా,  సూయెజ్ కెనాల్, ఆ తరవాత బాబ్ ఎల్ మెండెబ్ గుండానే తన ఆయిల్ ను ఇండియా చైనాలకు పంపించేది.  అదే విధంగా సౌదీ, యూఏఈ వంటి దేశాలు, తమ ఉత్పత్తులను  యూరొపు కి పంపేందుకూ ఈ మార్గమే సరైనది.  ఈ జల సంధి మీద అధికారం ఎవరిదీ అనే ప్రశ్న, యెమెన్ లో అంతర్యుద్ధం పొడుగూతా రేగుతూనే వచ్చింది. 2015 లో యెమెన్ తన తీరాన్నంతటినీ, దీవులనూ తన సాయుధ దళాలతో నింపేసింది. 2015 నుండీ 2017 వరకూ హౌతీలు ఈ ద్వీపాలను ఈ జలసంధి గుండా ప్రయాణించే నౌకల మీద దాడి చేయడానికి వాడేవారు. వీటిని కొత్త లో యూఏఈ వగైరా దేశాలు చిన్న చిన్న నౌకల సాయంతో బానే ఎదుర్కొన్నారు. వాళ్ళని బాబ్ ఎల్ మెండెబ్ దరి దాపుల్లోంచీ, పెరిం దీవి నుండీ ఎన్నోసార్లు తరిమి కొట్టారు. అయితే హౌతీలు ఓడిపోలేదు. వెనుదిరగలేదు. ఎప్పటికప్పుడు ఏదో రకంగా తమ అదుపుని కొనసాగించారు. హోడిడా లాంటి కీలకమైన పోర్ట్ నగరాన్ని తమ ఆధీనం లోనే ఉంచుకున్నారు. 


2023 నవంబర్ ఒకటిన ఇండియా నుండీ టర్కీ కి కార్లని రవాణా చేస్తున్న ఒక వాణిజ్య నౌక ' గేలక్సీ లీడర్" ని బంధించారు. దీనిని ఒక జపాన్ కంపెనీ నడిపింది. బెహమీస్ జెండా ఉంది గానీ దీని ఓనర్ ఒక బ్రిటిష్ కంపెనీ. కానీ ఇంకో పార్ట్నర్  (ఓనర్) ఒక ఇస్రాయిలీ అనే సాకు హౌతీలకి ఉంది. దీన్ని తీస్కెళ్ళి తమ ఆధీనంలో ఉన్న హౌడీడా పోర్ట్ లో బంధించుకున్నారు. నౌకలకి ప్రత్యేకంగా ఒక దేశం ఉండదు. బందీలయిన ఓడ సిబ్బందిలో ఒక్కరూ ఇస్రాయిలీ లేరు.  అయితే, ఈ దాడితో హౌతీల ప్రభ వెలిగింది. అసలు హౌతీల గొడవ ఏమిటా అని అందరూ తల తిప్పి చూశారు.   అయితే, హౌతీలు అంతకన్నా పురాతనమైన వాళ్ళే. 


హౌతీల అసలు పేరు అన్సర్ అల్లా ("Ansar Allah") (దేవుని మద్దతుదారులు) - వీళ్ళ కథ  1990 ల లో మొదలయింది. యెమెన్ లో షియా ముస్లిం లలో వీరిదొక మైనారిటీ వర్గం. పేరు జైదీలు. వీళ్ళకి ఈ పేరు వారి పోరాటాన్ని ముందుకు తెచ్చిన "హుసేన్ అల్ హౌతీ" పేరు మీదుగా వచ్చింది. షియా ల లో జైదీలు వేరు. వీళ్ళు దక్షిణ సౌదీ అరేబియా లోనూ, ఉత్తర యెమెన్ లోనూ కనిపిస్తారు. వీళ్ళకూ మామూలు షియాలకూ కొన్ని తేడాలున్నాయి.  వీళ్ళు మొదట యెమెన్ అధ్యక్షుడు 'అలీ అబ్దుల్లా సలేహ్ '  మీద తిరుగుబాటు చేయడం ద్వారా తమ పోరాటాన్ని మొదలు పెట్టారు. సలెహ్ ని సపోర్ట్ చేయడం వల్ల సౌదీ అరేబియా వీళ్ళకు శత్రువైంది. 

సలేహ్ 2003 లో వీళ్ళ మీద సౌదీ అరేబియా మద్దతుతో తీవ్రమైన దాడులు చేసాడు. 2004 మొదటి కల్లా సలేహ్ దాడుల్లో వీళ్ళ లీడర్ "హుసేన్ బద్రెద్దిన్ అల్ హౌతీ" మరణించాడు.  ఈ అణిచివేతను హౌతీలు తిరస్కరించారు. తిరగబడ్డారు. అరబ్ స్ప్రింగ్, యెమెన్ లో 2011 లో సలేహ్ ని గద్దె దించింది.  హౌతీలు, 2014 లో  యెమెన్ రాజధాని సనా ని తమ ఆధీనం లోకి తీసుకున్నారు. అప్పటి నుంచీ హౌతీలు యెమెన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తూనే ఉన్నారు. 

2014 లో హౌతీ ల ఎదుగుదల చుట్టు పక్కల రాజ్యాలని గాభరా పెట్టింది. సౌదీ అరేబియా, యూఏఈ లను ప్రధానంగా కలవరపెట్టింది. పైగా హౌతీలకు హిజబొల్లా, ఇరాన్ ల మద్దతు ఉండడం అందరినీ ఆందోళనకు గురి చేసింది.  దానితో, ఒక గ్రూప్ గా ఏర్పడి, అమెరికా, బ్రిటైన్, ఫ్రాన్స్ ల తో కల్సి, ఆ కూటమి యెమెన్ లో హౌతీ ప్రాంతాల మీద వైమానిక దాడులు చేసారు. అవి చిచ్చుని మరింత రాజేసాయి. ఈ దాడుల వల్ల యెమెన్ కు లాభం కన్నా నష్టమే జరింగింది. యెమెన్ లో 21 మిలియన్ల ప్రజలు ఇళ్ళూ పొళ్ళూ కోల్పోయి రోడ్డున పడ్డారు. తీవ్ర మానవ  సంక్షోభం ఏర్పడింది. లక్షలాది మంది తిండి, రక్షణా లేక చనిపోయారు.  ఆఖరికి 2022 లో అప్పటి యెమెన్ అధ్యక్షుడు అబ్ద్రబుహ్ మన్సూర్ హదీ, తన అధికారాన్ని యునైటెడ్ నేషన్స్ గుర్తించిన "ప్రెసిడెన్షియల్ లీడర్ షిప్ కౌన్సిల్" కు బదలాయించాడు. 

అయితే ఈ ప్రభుత్వం హదీ 2015 లో సౌదీ అరేబియా  కి పారిపోయిన దగ్గరనుంచీ రియాద్ లోనే ఉంది. అంటే ప్రపంచం అధికారికంగా గుర్తించిన యెమెన్ ప్రభుత్వం, యెమెన్ కు  అవతల ఉంది. యెమెన్ లోపలి నుంచీ పాలిస్తున్నది, ప్రపంచం గుర్తించని ఉగ్ర మూక - హౌతీలు.  సనా పగ్గాలు చేపట్టిన దగ్గర్నించీ హౌతీలు తమని తాము బలోపేతం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ వచ్చారు. సాధారణ గొరిల్లా గ్రూప్ దగ్గరనుంచీ ఎదిగి,  ఒక దేశ ప్రభుత్వానికి కావలసైన పద్ధతీ, సరంజామా, స్ట్రక్చర్ ఏర్పరచుకున్నారు. తమ సైన్య సామర్ధ్యాలని పెంచుకున్నారు. పన్నులూ, స్మగ్లింగూ, సుంకాల ద్వారా ఆదాయం గడించారు. ప్రపంచం తమని గుర్తించాలని కోరుకునేవాళ్ళు వారి స్లోగన్ " God is Great; deat to America; death to Israel; damn the Jews, Victory for Islam". ఇక్కడే అందరికీ ఇబ్బంది.

ఇంత వరకూ అందరికీ తెలిసిన విషయలయ్యాక, హౌతీల యుద్ధ నీతి గురించి చెప్పుకోవాలి. వాళ్ళు పర్యావరణాన్ని నాశనం చేస్తామని బెదిరింపులకు పాల్పడి సంవత్సరాల పాటూ 'హొడీడా ' తీరం మీద పట్టుని కోల్పోకుండా ఆపారు. అదెలా అంటే దాదాపు 1.1 మిలియెన్ బారెళ్ళ లైట్ క్రూడ్ తో నిండి ఉన్న ఒక తీరానికి కొట్టుకొచ్చిన పాత, పిప్పి పట్టిన ఓ స్టోరేజ్ టేంకర్ ని ఎన్విరాన్మెంటల్ వెపన్ గా వాడుకున్నారు. దాన్ని పరిశీలించడానికి యూ.ఎన్. పరిశీలకులకు హౌతీలు అనుమతి ఇవ్వలేదు. ఆ టాంకర్ కి ఏదైనా జరిగితే, జరిగే ఆయిల్ స్పిల్ వల్ల ఆ ఇరుకు జల సంధి లో జరిగే పర్యావరణ వినాశనానికి భయపడి, ఎవరూ యెమెన్ లో, ముఖ్యమైన హౌడీడా ప్రాంతం మీదా దాడి చేయనీకుండా ఈ పర్యావరణ బెదిరింపు ఆయుధం ఇప్పటికీ కాపాడుతుంది. 

గాజా లో యుద్ధం, హౌతీలకు ఇంకో ఆయుధం. నిజానికి హౌతీల ప్రభుత్వం పాలనలో ఆర్ధిక పరిస్థితి కుదేలయి, సాధారణ యెమెన్ ప్రజలలో అసంతృప్తి మొదలయి, విప్లవ ధోరణులు కనపడే వేళలోనే,  సెప్టెంబర్ 2023 లో యెమెన్ లో దేశ వ్యాప్త ప్రదర్శనలు జరిగాయి. సరిగ్గా అక్టోబర్ 7 2023 న ఇజ్రాయిల్ మీద దాడి జరగడం తో హౌతీల దృష్టి మళ్ళింపు పోరాటం మొదలయింది.  ఇరాన్, హమాస్, హిజబుల్లా, హౌతీలు ఫ్రెండ్స్ కాబట్టి, వీళ్ళ ఉత్సాహం కూడా పెరిగింది. సడెన్ గా యెమెన్ లో హౌతీలు ఇస్లాం ఆత్మగౌరవం గురించి మాటాడడం వల్ల ప్రజల  పొలిటికల్ మూడ్ మారింది.  

గాజా యుద్ధం మొదట హౌతీలు తెలిసీ తెలీకండా ఇజ్రాయిల్ మీద దీర్ఘ శ్రేణి క్షిపణుల్ని ప్రయోగించారు.  అయితే, డోం లు వాటిని అడ్డుకున్నాయి. ఆ తరవాత ఈ "గేలక్సీ లీడర్" ని పట్టుకున్నారు. దానితో వారి ప్రభ వెలిగింది. ఇదేదో బావుందనుకుని, యెమెనీ సరిహద్దు లో తిరిగే వాణిజ్య నౌకల మీద దాడులు చెయ్యడం మొదలు పెట్టారు. వీటికి ఒక సారి ప్రయోగించే డ్రోన్ లు, ఏంటీ షిప్ క్రూయెజ్ మిసైళ్ళు, ఏంటీ షిప్ బాలిస్టిక్ మిసైళ్ళు, చిన్న చిన్న డ్రైవర్ లేని స్పీడ్ బోట్లు (పేలుడు పదార్థాలు నింపిన బోట్లు) - వీటన్నిటితో దేశం తొ సంబంధం లేకుండా అన్ని నౌకల్నీ దాదాపుగా అల్లరి పెట్టారు.  బయటకు మాత్రం ఇజ్రాయెల్ తో సంబంధం ఉన్న నౌకలని మెండెబ్ లో తిరగనివ్వం అన్నా,  ఆ విచక్షణ  లేకుండా  ఏ దేశ నౌకా ఈ దాడులకు అతీతం కాలేకపోయింది.

అసలు నౌకలు ఆ జలాలలో ఎక్కడున్నాయో హౌతీలకు ఎలా తెలుస్తుంది ? వాళ్ళు ఇంటర్నెట్ లో అందుబాటు లో ఉండే ఓపెన్ సోర్స్ వెబ్ అప్లికేషన్ ల ద్వారా ఓడల ట్రాకింగ్ డాటా ని సేకరించేవాళ్ళు. తీరం వెంబడి చిన్నా చితకా ట్రాన్స్పోండర్ డాటాబేస్ లను, మరైన్ రాడార్ లనూ నెలకొల్పారు. పైగా ఎర్ర సముద్రం మధ్యలో తిరుగుతూ ఉండే ఇరాన్ ఇంటెలిజెన్స్ షిప్ "బెహ్షాద్" కూడా వీళ్ళకు ఓడల సరైన "ఎడ్రసులు" (coordinates) ఇచ్చేది. దానితో తమకున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని, తమకున్న పరిధుల్లోనే పెంచుకుంటూ, ప్రిసిషన్ దాడులకు పాల్పడేవారు.  ఆ దాడులు  కొన్ని ఓడలను పాక్షికంగా దెబ్బ తీసేవి. కొన్ని తీవ్రంగానూ దెబ్బ తీసేవి. దెబ్బకి వాణిజ్య నౌకల బిజినెస్ లో చాలా మార్పులొచ్చాయి. ఓడల భీమా మొత్తాలు పెరిగాయి. అమెరికా ఏ నౌకలకీ రక్షణ ఇచ్చే పరిస్థితి లో లేదు. సడన్ గా బాబ్ ఎల్ మెండెబ్ సున్నితత్వం బయటపడింది. 

ఈ జలసంధినో, హర్మూజ్ నో ఇరాన్ ఆపేసినా, ప్రపంచ వాణిజ్యానికి కొద్దిపాటి ఇబ్బంది ఉంటుంది గానీ, మొత్తంగా దెబ్బ తిని పోదు. పనామా కెనాల్ లో కరువు వల్ల సరిగ్గా వర్షాలు పడక, నీళ్ళు నిండకపోతే అది మూసేస్తారు కొన్నాళ్ళు. సూయెజ్ కెనాలూ ఎన్నో సార్లు మూత పడింది. ఓడలు ఇంకొన్ని రోజులు ఎక్కువైతేనేం ఆఫ్రికా చుట్టూ తిరిగి సరకునైతే రవాణా చేస్తాయి. అసలు ఇంతింత దూరం ఎక్కువ బరువులు మోసుకెళ్ళేందుకే పెద్ద పెద్ద నౌకల్ని కూడా నిర్మించారు. ఇవసలు కృత్రిమమైన కెనాళ్ళ లో సరిపోను కూడా సరిపోవు. కాబట్టి ఇక్కడ ప్రశ్న వాణిజ్యానిది కాదు. ఈ గొడవల వల్ల మన ఇళ్ళలోకి వంట గేస్ రావడం ఇబ్బంది అవుతూంది. నిజమే. కానీ ప్రపంచం ఇప్పుడు ప్రత్యామ్నాయాల వైపు కూడా చూస్తుంది. ప్రపంచం అంతా ఎలక్ట్రిక్ వాహనాల వైపు మళ్ళిందనుకోండి. అపుడు పెట్రోల్ డిమాండ్ ఎక్కడుంటుంది. అయితే అది వెంటనే జరగకపోవచ్చు. అంత వరకూ మాత్రమే ఈ ఇబ్బంది, సందిగ్ధత. 

రచయిత చెప్పేదేమిటంటే, దీనిలో ప్రపంచాన్ని, క్రూడ్ బిజినెస్ నూ ఇబ్బంది పెట్టగలిగే శక్తి కేవలం ఒక అనాగరిక ఉగ్ర మూక కు ఉండడం ఏం బావుంటుంది ? అగ్ర రాజ్యాలు కూడా ఊరుకోలేదు. వీలైనన్ని సార్లు యెమెన్ మీద రక రకాల స్థావరాల నుండీ దాడులు చేశాయి. బ్రిటైన్, అమెరీకా లు తమ దగ్గర ఉన్న పెద్ద పెద్ద యుద్ధ నౌకల్ని మోహరించాయి. ఉదాహరణ కు  USS Dwight D Eisenhower (with 22 Fixed Wing Aircrafts), USS Pilippine Sea, USS Gravely, USS Mason, USS Florida, యెమెన్ మీద దాడి కి వాడిన కొన్ని ప్రముఖ ఆపరేషన్ లలో పనిచేసాయి. 12 Jun 2024 లో క్రూయిస్ మిసైళ్ళను ప్రయోగించి, వైమానిక దాడుల్నీ చేపట్టాయి. సైప్రస్ నుండీ విమానాలు బయల్దేరి వచ్చాయి. తోమహాక్ లు వాడారు. 150 precision guided munitions of various types,  వాడారు.  F/A-18 Super Hornet లు వాడారు.  ఎంత చేసినా హౌతీలు తోక ముడవలేదు. వాళ్ళ వ్యూహాలు వేరు. 


సౌదీ మిత్ర పక్షాల తో దశాబ్దం గా చేసిన యుద్దం హౌతీలను బలోపేతం చేసింది. ఎప్పటికప్పుడు తమ సైన్య స్థావరాలను మార్చడం, ట్రక్ ల మీద నుండీ ప్రయోగించే మిసైళ్ళను వాడుతూ, ఆ ట్రక్ లను ఒక చోట నుండీ ఇంకో చోటికి వెంట వెంటనే మారుస్తూ ఉండటం, సొరంగాల ద్వారా కదలికలు, సొరంగాలలో ఆయుధాగారలను  దాయడం, ముఖ్యంగా ఇరాన్ నుండీ ఆగకుండా అందే ఆయుధాలూ, హౌతీలను కొంత సమర్ధులను చేసాయి. 


ఈ దాడులకు హౌతీలు కూడా ప్రతిదాడులు చేసారు జనవరి 2024 లో USS Laboon మీద మిసైళ్ళు వేసారు కానీ అవి మధ్యలోనే నిలువరించబడ్డాయి. మరునాడే మూడు anti ship ballistic missiles, Gibraltar Eagle  అనే అతి పెద్ద అమెరికన్ వాణిజ్య నౌక మీదికి ప్రయోగించారు. వాటిలో రెండు గురితప్పాయి. మూడోది నౌక కి తాకినా, పెద్ద నష్టం జరగలేదు. 


జనవరి 28 న, "టవర్22" అనే కీలక అమెరికన్ సైనిక స్థానం మీద దాడి చేసారు. దీనిలో ముగ్గురు అమెరికన్ సైనికులు చనిపోయారు. 40 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు.  ఇది సిరియాకీ ఇరాక్ కీ మధ్య ఉన్న కీలక స్థావరం. ఇక్కడి నుండే అమెరికన్ సైన్యాలు ఐసిస్ మీద దాడులు చేసేవి. ఇది పెద్ద దెబ్బ.   అసలు ఈ చిన్న చిన్న మూకలు చేసే తక్కువ ఖర్చు దాడులకీ, అగ్ర రాజ్యాలు చేసే అత్యాధునిక దాడులకీ ఎంత తేడా ఉందో. పేట్రియాట్ మిసైల్ బేటరీలు ఒక సారి వాడేందుకు ఒకో మిసైల్ కూ 3-4 మిలియన్ డాలర్ ల ఖర్చవుతుంది. అలాంటిది టవర్ 22 ను పేల్చేందుకు హౌతీలు చవకైన ఆత్మాహుతి డ్రోన్ లు వాడారు.  ఒక సైనిక స్థావరం మీద అంత పెద్ద దాడి ని అగ్ర రాజ్యం కనుక్కోలేకపోవడానికి కారణం, సరిగ్గా అదే సమయానికి అమెరికన్ డ్రోన్ ఒకటి సర్వైలెన్స్ చేసి, బేస్ కు వాపసు రావాల్సి ఉంది. దాని రాకతో వార్నింగ్ సిస్టం లు ఎలర్ట్ అయి ప్రతి దాడి చేస్తాయేమో అనే (కాస్ట్ కటింగ్ మరియూ) భయం + తద్వారా జరిగే ఫ్రెండ్లీ ఫైర్ ను నివారించేందుకు డ్రోన్ లను పసిగట్టే వ్యవస్థను కాసేపు నిలిపేసారు. అదే సమయానికి హౌతీ డ్రోన్ రావడం వల్ల, టవర్ 22 దాడి సాధ్యమయింది.   ఇలా ఇలాంటి యుద్ధాలలో వాడే యుద్ధ తంత్రాలు, ఆయుధ శ్రేణి, వాటి ఖర్చులు, వాటి పరిమితులు, ఎదుటి వారు వాడే పద్ధతులు, వ్యూహాలూ, డేటా ఫ్యూజన్, ఇంటెలిజెన్స్ సేకరించే పద్ధతులు, ఇరాన్ సాంకేతిక సామర్ధ్యం, వీటన్నిటి గురించీ చక్కగా మిలిటరీ భాషలో వివరించారు రచయిత.  సైన్యం వాడే పద్ధతులు, మారాల్సిన కొత్త కొత్త పోరాట పద్ధతుల గురించి ఇంటరెస్టింగ్ గా రాయడం వల్ల, ఇవన్నీ, న్యూస్ పేపర్లలో చదివే వ్యవహారాలే అయినప్పటికీ, క్షిపణి వ్యవస్థలు, ఒక వేళ నౌకల మీద ఆయుధ శ్రేణులన్నీ వాడేస్తే వాటిని ఎలా రీఫిల్ చేస్తారు? వాటి పరిమితులేంటి ? యుద్ధం లో పార్టిసిపేట్ చేసే యుద్ద నౌకలు ఎందుకు వెనక్కి రాలేవు.. ఇలాంటివన్నీ చదివితే నిజంగా ఇన్ని నెలలు గా సముద్రం లో చిక్కుకుపోయిన నావికుల మీదా, సైన్యాల మీదా చాలా సానుభూతి కలుగుతుంది.  


అత్యంత ఖరీదైన రక్షణ వ్యవస్థలు, అంతు లేని దాడుల వల్లా, యెమెన్ అంతా చెల్లా చెదురుగా విస్తరించిన హౌతీల ని నిలువరించడం సాధ్యం కాదు. రక రకాల రాజకీయ కారణాల వల్ల జరిగే ఈ ఎడ తగని ఈ రకమైన పోరాటాల వల్ల ఈ కొత్త రకం యుద్ధాలు, కొత్త సాంకేతికతలూ  ఈ కొత్త వ్యూహాలూ - అయితే, ఇవేవీ కావు సొల్యూషన్ ! మంచి నాయకులూ, మంచి పద్ధతులూ, మంచి నిర్ణయాలూ తప్ప మరేవీ ఈ ప్రపంచాన్ని బాగు చెయ్యలేవు.   యుద్ధం చాలా ఖరీదైనది. అది ధనిక దేశాల ఆర్ధిక వ్యవస్థలని  ఇబ్బంది పెట్టగలదు. అమెరికన్ నేవీ వాడే టాక్టికల్ ఇంటర్సెప్టర్ లు, మల్టీ మిలియన్ డాలర్ల ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు ఎంత ఖరీదైనవంటే  Standard Missile-2 (SM-2) అనేది 2.2 మిలియన్ డాలర్లుంటుంది. అదే  SM-6 - 5.3 మిలియన్లు, SM-3 -  28.7 మిలియన్లు.   ఒక పేట్రియాట్ ఇంటర్సెప్టర్ ఖరీదు దాదాపు 4-5 మిలియన్ డాలర్లు ఉంటుంది. అన్నిటి కన్నా చవక రకం AIM-9X సైడ్ విండర్ ఒక షాట్ కి 400,000 డాలర్లుంటుంది. అంటే యుద్ధం, ఆయుధ వ్యాపారులకి తప్ప ఎవరికీ లాభం కాదు. అలాంటిది, ఇంతా ఖర్చు పెట్టి అమెరికన్లు సాధించినది ఏముందా అంటే ఏదీ లేదు. చిన్న చిన్న గుంపులుగా విడిపోయి, చవక రకం చిన్న ఆయుధాలతో తమ ప్రాదేశిక  బలిమి వల్ల, ప్రపంచానికి చాలా అవసరమైన జలసంధిని ఆధీనం లోకి తెచ్చుకుని హౌతీలు చేస్తున్న పోరాటం వెంక ఉన్న బలం వాళ్ళ రాజకీయ పట్టుదల అనేది, బహుశా అమెరికన్లు గుర్తించాల్సి ఉంటుంది.  

ఇట్లాంటి సమస్యలకి రాజకీయ, దౌత్య పరిషారాలు వెతకాల్సిందే తప్ప, ఎడా పెడా సైన్యాలను, సైనిక ఆస్తులనూ తాకట్టు పెట్టడం ఎవరికీ మంచిది కాదు. పైగా ప్రపంచ రాజకీయాలలో ఇపుడు ఏర్పడిన సున్నితత్వం ఇంతకు ముందెన్నడూ లేదు. కల్సి కట్టుగా అగ్ర రాజ్యాలు పోరాడే రోజులు దగ్గర్లో లేవు. నాటో గొడవల వల్ల ఇప్పుడు ఈ సుదీర్ఘ యుద్ధాలలో అమెరికా ఒంటరై పోయింది. ఇలాంటి చిక్కు ముళ్ళకు పరిష్కారం తొందరగా దొరకదు.  ఇలాంటి ప్రపంచంలో మిలిటరీలు పోషించే పాత్ర ఎంత కీలకం ?! అంతే ఇంపార్టెంట్ దౌత్య వేత్తలు చేసే పని కూడా. అయితే  వీటికి కాస్త పొలిటికల్ విల్ తోడు ఉండాలి. అంతే. యుద్ధాలు టెక్నాలజీ వల్ల కాంప్లికేట్ అయితే, మంచి మాటల వల్ల, మంచి దౌత్యాల వల్లా ముగుస్తాయి. అయితే ప్రతీ సైన్యమూ సదా సర్వ సన్నద్ధంగా ఉండటమే ధర్మం కాబట్టి, ఇలాంటి యుద్ధాలు ఎలా గెలవాలో చెప్పేందుకే చేసిన ప్రయత్నం ఈ పుస్తకం.

***


References:


 https://www.csis.org/analysis/houthis-enter-iran-war-and-everything-gets-worse#:~:text=Iran%20war.%20Reports-,of,-new%20Houthi%20attacks


https://youtube.com/watch?v=Ana7W_rqKk8&si=_oRq8quaEVvuu4uZ


Author :-

https://www.vifindia.org/author/maj-gen-p-k-mallick-1 


15/08/2026

Yazeed by Saadat Hasan Manto (Telugu Translation)

Yazeed



1947 లో జరిగిన అల్లర్లు ఎలా మొదలయ్యాయో అలానే ముగిసిపోయాయి. అచ్చం ఋతువులు మారినపుడల్లా మధ్యలో వస్తూండే గడ్డు కాలాల్లాగా! కరీందాద్ అన్ని ప్రతికూల పరిస్థితుల్నీ దేవుడి నిర్ణయం అని నిర్ణయించేసి మౌనంగా ఊరుకోలేదు. తనకి ఎదురయిన విపత్తులను, విషాదాలనూ, ఓ మొగవాడికుండాల్సిన మనోధైర్యంతో శాయశక్తులా ఎదుర్కొన్నాడు. ఎప్పటికపుడు, ప్రతికూల పరిస్థితులతో తలపడ్డాడు. అతని ఉద్దేశ్యం కేవలం పట్టుదలతో అలా ముఖాముఖీ సమస్యలని ఎదుర్కోవడమే తప్ప, వాటిని ఓడించేయగలనని కాదు. శత్రువు తనకన్నా బలవంతుడని, సంఖ్యాపరంగా కూడా శక్తిమంతుడనీ అతని చేతిలో ఓడిపోవడం తథ్యమని తెలిసినా కూడా, అసలు పోరాడకముందే ఓటమిని అంగీకరించడం, అస్త్రసన్యాసం చేయడం, అవమానం అని నమ్మే మనిషి. నిజం చెప్పాలంటే లోకానికి అతనిమీదున్న అభిప్రాయం కూడా అదే. అత్యంత క్రూరులైనవాళ్ళతో కూడా అతను ఎంతో గుండె ధైర్యంతో తలపడి, పోరాడడం కళ్ళారా చూసారు. కానీ ఎవరైనా కరీందాద్‌ను ఆ మాట అడిగితే, పరిస్థితులను ప్రతిఘటించకుండా ముందుగానే ఓటమిని అంగీకరించేసి, నేరుగా తలవంచడమన్నది తనొక్కడికే పరాభవం కాదు, సమస్త మానవాళికే జరిగే పరాభవంగా భావిస్తాడా అనిపించేలా - ఏదో క్లిష్టమైన గణిత సమస్య తీర్చమని అడిగినట్టు దీర్ఘాలోచనలో పడిపోతాడు. 



కరీందాద్‌కు కూడికలు, తీసివేతలు, హెచ్చివేతలు, భాగాహారాలూ లాంటి లెక్కలేవీ రావు. 1947 నాటి మత కల్లోలాల తరవాత జనం కూర్చుని ధన, ప్రాణ నష్టాలను లెక్కకట్టడం మొదలుపెట్టారు. కానీ కరీందాద్‌ను ఇవేవీ తాకనుకూడా లేదు. అతనికి తెలిసిన లెక్క ఒక్కటే. అది, తన తండ్రి రహీందాద్ ఈ యుద్ధంలో 'ఖర్చ'యిపోయాడన్నదే! ఆనాడు, అతను తన తండ్రి మృతదేహాన్ని ఎత్తుకుని భుజాలమీద స్వయంగా మోసుకొచ్చి ఒక బావి పక్కన పూడ్చిపెట్టాడు. 



గ్రామంలో ఎందరో మరణించారు. వేలాది యువకులు, ముసలివాళ్ళూ చంపబడ్డారు. ఎంతో మంది అమ్మాయిలు అదృశ్యమయిపోయారు. మరెందరో అత్యంత పాశవికంగా మానభంగానికి గురయ్యారు. బాధితులంతా గుండెలవిసేలా రోదించారు. వాళ్ళంతా తమ దురదృష్టాన్ని తలచుకుని, ఆ అకృత్యాలకు పాల్పడిన కిరాతకుల్ను శపిస్తూ ఏడ్చాడు. కానీ కరీందాద్ మాత్రం ఒక్క కన్నీటి చుక్కయినా కార్చలేదు. చివరి శ్వాస వరకు పోరాడిన తన తండ్రి ధైర్యసాహసాలను తలచుకుంటే అతనికి చాలా గర్వంగా అనిపించేది. అతని తండ్రి నిరాయుధుడై ఉండి కూడా, కత్తులు, గొడ్డళ్ళతో మీదపడిన పాతిక ముప్పై మంది ముష్కరులను ఒంటి చేత్తో ఎదిరించాడు. దాడి చేసిన వాళ్ళతో తన తండ్రి ధైర్యంగా పోరాడుతూ మరణించాడని విన్నాక, తండ్రి ఆత్మతో వీడ్కోలుగా చెప్పేందుకు అతనికి ఏదీ తోచలేదు - "యార్, పెద్ద పొరపాటు చేసావు. నీదగ్గర ఎప్పుడూ కనీసం ఒక్క ఆయుధమైనా ఉంచుకోమని చెప్పాను కదా!" అని మాత్రం అన్నాడు.



ఆ మాట అన్నాకా, తండ్రి శవాన్ని మోసుకెళ్ళి, ఒక బావి పక్కన గుంత తవ్వి పూడ్చిపెట్టాడు. సమాధి పక్కన నించుని, ప్రార్ధనగా కూడా ఒక్కటే అన్నాడు, "దేవుడు పాపపుణ్యాల లెక్కలు చూసుకుంటాడు. నీకు స్వర్గం ప్రాప్తించాలిగాక!" 

రహీందాద్‌ను అతికిరాతకంగా చంపేశారని విన్నవాళ్ళందరూ ఆ దుండగులను శపించారు కానీ కరీందాద్ ఒక్క మాట కూడా అనలేదు. కోతకు సిద్ధంగా ఉన్న పంటపొలాలను దుండగులు పెట్టిన మంటలవల్ల కోల్పోయాడు కరీందాద్. అతని రెండు ఇళ్ళను కూడా అంతకు ముందే తగలబెట్టారు. అయినా, అతను ఆ నష్టాలను, తన తండ్రి ప్రాణ నష్టంతో లెక్కకట్టలేదు. అతను ఒకటే అనేవాడు. "ఏది జరిగినా సరే, అది ఇలా జరిగిందంటే, అది మన తప్పే!". అలాంటపుడు ఎవరైనా ఆ తప్పు ఏంటని అడిగితే, మౌనంగా ఉండిపోయేవాడు. 



గ్రామమంతా ఈ అల్లర్లలో మరణించిన వాళ్ళను తలచుకుంటూ శోక సంతాపాల మధ్య ఉన్నపుడు, కరీందాద్ పెళ్ళి చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. చామనచాయతో ముద్దులొలికే ‘జీనా’ అనే అందమైన అమ్మాయి మీద ఎన్నాళ్ళుగానో అతనికి మరులు. జీనా అప్పటికి తీరని దుఃఖంలో మునిగి ఉంది. ఆమెకు ఉన్న చెట్టంత అన్నను దుండగులు, ఆ మతకల్లోలాలలో నిర్దాక్షిణ్యంగా చంపేసారు. జీనా తల్లితండ్రులేనాడో పోయారు. ఆమెకు మిగిలిన అండా దండా, ఈ అన్న ఒక్కడే. జీనాకు కూడా కరీందాద్ అంటే ప్రేమే. కానీ తన అన్నను ఆ విధంగా కోల్పోవడం వల్ల కలిగిన శోకంలో జీనాకు ప్రేమకూడా భారంగా మారిపోయింది. ఎప్పుడూ నవ్వుతూ ఉండే ఆమె కళ్ళు ఇప్పుడు సదా దుఃఖంతో, కన్నీళ్ళతో నిండి ఉన్నాయి. 



కరీందాద్ కు, ఏడుపులన్నా, రోదనలన్నా అసహ్యం. జీనా అలా శోకదేవతలా కనిపిస్తూ ఉంటే, అతనికి చాలా చిరాకు కలిగేది. కానీ తొందరపడి మాటలు తూలి, అసలే గాయపడి ఉన్న స్త్రీ హృదయాన్ని మరింత గాయపరచకూడదన్న స్పృహ అతనికి ఉండేది. ఒకరోజు పొలంలో ఆమె ఒంటరిగా ఉండగా, ప్రేమ గా, ఆమె చేయి పట్టుకుని అన్నాడు. "పోయినవాళ్ళని మనం పాతిపెట్టేసి ఏడాదయింది. ఇంకా ఎన్నాళ్ళయినా మనం ఇలా ఏడుస్తూ ఉంటే, ఆ వెళ్ళిపోయిన ఆత్మలు కూడా మన దీర్ఘ సంతాపాన్ని చూసి విసిగిపోతాయి. ఇక ఈ దుఃఖాన్ని విడిచిపెట్టు ప్రియా! ముందు ముందు మనం ఇంకా ఎన్ని చావులు చూడాల్సి వస్తుందో ఎవకికి తెలుసు? ఈ కన్నీళ్ళను రేపటి కోసం కూడా దాచుకో!" 



జీనాకు ఆ మాటలు నచ్చలేదు. కానీ అతనంటే ఉన్న ప్రేమతో, అతను చెప్పిన మాటల గురించి పదే పదే ఆలోచించింది. ఒంటరిగా ఉన్నపుడల్లా ఆ మాటల్నే తలచుకుంటూ, వాటి వెనుక ఉన్న సత్యమేమిటో తెలుసుకునేందుకు ప్రయత్నించేది. అలా చివరికి కరీందాద్ చెప్పింది నిజమేనని ఎలాగో ఒప్పుకుని, తన దు‌ఃఖంనుండి బయటపడింది. 

 

కరీందాద్, జీనాల పెళ్ళి ప్రస్తావన వచ్చినపుడు, గ్రామ పెద్దలు మొదట అభ్యంతరం చెప్పారు. కానీ వాళ్ళ నిరసనలో పస లేదు. ఏడాది కాలం సుదీర్ఘంగా, పోయిన పిల్లలనీ, పెద్దలనీ తలచుకుంటూ, అంతులేని వేదనతో, ఏడుపులతో గడిపి విసిగిపోయిన వాళ్ళకు ఈ పెళ్ళిని అడ్డుకోవడానికి పెద్ద కారణాలు ఏవీ కనపడక, వారి అభ్యంతరాలన్నీ వీగిపోయాయి. అలా, కరీందాద్ పెళ్ళి జరిగింది. సంగీతవాయిద్యాలవాళ్ళను, పాటలు పాడేవాళ్ళనూ పిలిచారు. ప్రతి తంతూ పద్ధతిగా, సక్రమంగా జరిపించారు. అలా కరీందాద్ తన ఇంటికి, తన ప్రేయసిని, చట్టబద్ధంగా వివాహం చేసుకుని, భార్యగా తీసుకొచ్చుకున్నాడు. 



మతకల్లోలాల తర్వాత గ్రామం మొత్తం ఒక పెద్ద స్మశానంలా మారిపోయింది. కరీందాద్ పెళ్ళి ఊరేగింపులో బాజాబజంత్రీలు విని కొందరు గ్రామస్తులు భయపడిపోయారు - అది ఏ దెయ్యాల ఉత్సవమో అనుకున్నారు. ఈ విషయం కరీందాద్ స్నేహితులు అతనికి చెప్పినపుడు పగలపడి నవ్వాడు. కానీ కరీందాద్ నవ్వుతూ ఈ విషయాన్నే కొత్త పెళ్ళికూతురికి చెప్తే, ఆమె భయంతో వణికిపోయింది. 



కరీందాద్, ఎర్రని గాజులు వేసుకున్న జీనా చేతుల్ని తన చేతుల్లోకి తీసుకుని, ఆమె కళ్ళల్లోకి ప్రేమగా చూస్తూ, "ఈ దయ్యం నిన్ను జీవితాంతం వెంటాడుతూనే ఉంటుంది. ఏ భూతవైద్యుడూ, నీ నుండి నన్ను, అంటే ‘నా’ భూతాన్ని ఎంత పెద్ద తంతులు చేసినా వదలించలేడు"అన్నాడు కొంటెగా.



జీనా తన గోరింటాకు చేతి వేలిని మునిపంట పెట్టి, సిగ్గుతో గొణిగింది "కీమె.., నీకు దేనికీ భయపడవు కదా!"



కరీందాద్ నారింజ రంగు మీసాలను తన నాలుక అంచుతో తడుపుకుంటూ నవ్వి, "ఎవరైనా దేనిగురించయినా అసలు ఎందుకు భయపడాలి?" అన్నాడు. 



జీనా గుండెను కస్సున కోసే దుఃఖపు అంచు తన వాడిని మెల్లమెల్లగా కోల్పోసాగింది. ఆమె త్వరలో తల్లి కాబోతుంది. కరీందాద్ ఆమెలో విరుస్తున్న మాతృత్వాన్ని చూసి ఎంతో మురిసిపోయాడు. "దేవుని సాక్షిగా జీనా, నువ్వు రోజు రోజుకీ మరింత అందంగా మారిపోతున్నావు. నువ్వు, ఇంత అందంగా నా కొడుకు మూలానే తయారవుతున్నావు! వాడూ నేను ఇక నీకోసం ఒకరితో ఒకరం పోట్లాడుకుంటూ ఉండిపోతామేమో చూడు”, అని ఆటపట్టించేవాడు.



జీనా సిగ్గుతో, తన శాలువతో పొట్టను కప్పుకుంది. కరీందాద్ నవ్వుతూ ఆమెను మరింత ఆటపట్టించాడు. "ఎందుకు దాచడం? నువ్వు పడుతున్న ఈ తపనా, నీ తాపత్రయం అంతా నా ఈ పంది వెధవ గురించేనని నాకు తెలీదా?



జీనాకు సర్రున చిర్రెత్తింది. "నీ కొడుకుని అలా ఆ చెడ్డ మాట అనడానికి నీకు నోరెలా వచ్చింది?"



కరీందాద్ గోధుమవన్నె మీసం నవ్వుతో వణికింది. "కరీందాద్ అందరి కన్నా పెద్ద పంది కనుక".



మొదటి ఈద్ వచ్చింది. తరవాత రెండోది. కరీందాద్ రెండు పండగల్నీ ఎంతో సంబరంగా జరుపుకున్నాడు. నిరుడు సరిగ్గా ఈద్‌కు 12 రోజుల ముందే దుండగులు ఆ గ్రామం మీదికొచ్చారు. అప్పటి అల్లర్లలోనే, ‘రహీందాద్’, జీనా అన్న ‘ఫజల్ ఇలాహీ’లు చంపబడ్డారు. జీనా రహస్యంగా ఇద్దరినీ తలుచుకుని ఏడ్చింది. కరీందాద్ లాంటి ఏడుపు, విచారం అంటే పడని మనిషి సాంగత్యంలో, జీనాకు తనివితీరా ఏడ్చుకోవడానికి కూడా వీలుపడలేదు. 



ఎపుడు జీనా తన జీవితాన్ని ఆకళింపు చేసుకునేందుకు ప్రయత్నించినా, ఆమెకు తన గత జ్ఞాపకాల నుంచి, గత జీవితాన్నుంచీ తను ఎంత దూరంగా ప్రయాణించేసిందో అర్ధం అయి, ఆశ్చర్యం కలిగేది. తన తల్లితండ్రుల మరణాలు జ్ఞాపకం లేవు. ‘ఫజల్ ఇలాహీ’ ఆమె కన్నా ఆరేళ్ళు పెద్ద వాడు. అతడే, ఆమెకు తల్లీ, తండ్రీ, సోదరుడూ అన్నీ. తన అన్న తనవల్లనే పెళ్ళి చేసుకోలేదని ఆమెకు తెలుసు. జీనా మానాన్ని రక్షిస్తూనే ఫజల్ ప్రాణాలు కోల్పోయిన సంగతీ ఊర్లో అందరికీ తెలుసు. అన్న మరణం ఆమె జీవితంలో అత్యంత విషాదకరమైన అఘాతంగా మారిపోయింది. ఆమె మీదకు ఆ దుఃఖశిఖరం ఏ హెచ్చరికాలేకుండా విరుచుకుపడింది. అదీ రెండో ఈద్‌కు సరిగ్గా పన్నెండు రోజుల ముందు. ఆమెకు ఈ విషయం ఎపుడు గుర్తొచ్చినా, ఆ రోజు నుండీ తను ఎంత దూరం కొట్టుకుని వచ్చేసిందో, ఆ ఘోరం తరవాత, ఆ దుఃఖం నుండి బయటపడేందుకు, తన తలరాత ఎలా మారిందో అనే సంగతి ఆమె ఆలోచనల్లో చేరిపోయి కలవర పెట్టేది. 



ముహర్రం నాటికి, జీనా కరీందాద్‌ని తన మొట్టమొదటి కోరిక కోరింది. ‘ప్రసిద్ధికెక్కిన గుర్రాన్ని, తాజియానూ ఊరేగింపులో చూడాలని చెప్పలేనంత ఉబలాటంగా ఉంది‘ అంది. ఆమె తన స్నేహితుల దగ్గర ఈ ఊరేగింపు గురించి ఎంతో గొప్పగా వింది. ఆమె కరీందాద్‌తో "నాకు బాగుంటే, ఈ ఊరేగింపుకు నన్ను తీసుకు వెళ్తావా?" అని అడిగింది.



కరీందాద్ నవ్వి, "నీకు బాలేకపోయినా కూడా నిన్ను తీసుకుని వెళ్తాను.. ఇంకా నా పంది వెధవ ని కూడా!" అన్నాడు. 



అతను పుట్టబోయే తన పిల్లాడ్ని అలా పంది అనడం ఆమెకు అస్సలు నచ్చదు. అలా అతను అన్నపుడల్లా ఆమెకు కోపంతో విసుగొచ్చేసేది. కానీ అలా అన్నపుడు కరీందాద్ గొంతులోని మార్దవం, జీనా కోపాన్ని కాస్తా చెప్పలేనంత ఆనందానుభూతిగా మార్చేసేది. అతను అంత ప్రేమని అలా "పంది వెధవ" అనే చెత్త పదంలోకి ఎలా కుదించగలుగుతున్నాడా అని ఆశ్చర్యపోయేది. 



ఇండియా, పాకిస్తాన్ మధ్య యుద్ధం గురించిన వార్తలు అప్పటికే కొన్నాళ్ళుగా వినిపిస్తున్నాయి. నిజానికి పాకిస్తాన్ ఏర్పడిన తరవాత, రెండు దేశాల మధ్యా యుద్ధం జరగడం దాదాపు ఖాయం అయిపోయింది. అసలు యుద్ధం ఎపుడు మొదలవుతుందో గ్రామంలో ఒక్కరికీ తెలీదు గానీ, అందరూ అలజడిగా ఉన్న ఆ రోజుల్లో, కరీందాద్‌ని ఈ సంగతి అడిగితే, క్లుప్తంగా, "ఎపుడు జరగాలో అపుడు జరుగుతుంది. ఇప్పుడు దానిగురించి ఆలోచించడం దేనికి?" అని అనేవాడు.



జీనాకు యుద్ధం అన్న మాటకే వణుకు పుట్టేది. ఆమె సహజంగా శాంతిని ఇష్టపడే వ్యక్తి. ఊరికే స్నేహితుల మధ్య జరిగే చిన్న చిన్న గొడవలకు కూడా గాబరాపడిపోయేది. అలాంటిది, ఆమె అప్పటికి చాలానే హత్యలనూ, దోపిడీలు, దొమ్మీలను అతి సమీపాన్నించి, కళ్ళారా చూసేసింది. తన సొంత అన్న హత్యను ఆమె మర్చిపోలేకపోతోంది. ఒక రోజు భయంతో, "కీమె, ఇపుడు ఏమి జరుగుతుంది?" అని కరీందాద్‌ను అడిగింది. 

 

కరీందాద్ నవ్వి, "అమ్మాయి పుడుతుందో, అబ్బాయి పుడతాడో నాకెలా తెలుస్తుంది?” అన్నాడు. ఆమెకు చిరాకు కలిగినా కరీందాద్ చెప్పే కబుర్లలో, హాస్యాలలో, తన తలలో కమ్ముకుంటున్న యుద్ధ భయాలని మర్చిపోయేది.


కరీందాద్ నిర్భయుడు, బలశాలి, జీనా అంటే అపారమైన ప్రేమ కలవాడు. అతను ఒక రైఫిల్ కొని, దాన్ని గురి తప్పకుండా పేల్చడం నేర్చుకున్నాడు. వీటన్నిటి వల్లా, జీనాకు కొంత ధైర్యం చిక్కినా, గ్రామస్తుల నోట యుద్ధం గురించి ఏ పుకారు విన్నా, మళ్ళీ ఆమెను భయం కమ్ముకునేది. 

 

ఒకరోజు మంత్రసాని ‘భక్తో’ రోజూలానే జీనాను చూసేందుకు వచ్చినపుడు, భారతీయులు 'నది'ని మూసేస్తున్నారన్న వార్త తెచ్చింది. జీనాకు ఆ మాట అస్సలు అర్ధం కాలేదు. భక్తోను అడిగింది, "నది ని మూసేయడం ఏమిటి?" అని. 



"మన పొలాల్లో పంటలు పండనివ్వుకుండా వాళ్ళు నదిని మూసేస్తారంట" అంది భక్తో. 

జీనా ఓ నిముషం ఆలోచించి, పకాలుమని నవ్వి, "నువ్వు పిచ్చి దానిలా మాటాడుతున్నావు. అంత పెద్ద నదిని ఎవరు మూసేయగలరు? అది నది! ఇంటి వెనక పారే మురికి నీటి కాలువ కాదు!" అంది. 

భక్తో జీనా పెరిగిన పొట్ట మీద మృదువుగా తడుముతూ, "నాకు తెలీదు. నేను విన్నదేదో నీకు చెప్పాను. పేపర్ల నిండా ఇదే రాసుందంట" అంది.

 

"అది ఏమిటి?" జీనాకు అసలు నమ్మశక్యంగా లేదు. 

 

భక్తో తన ముడుతలు పడిన చేతులతో జీనా పొట్టని నిమిరి, "అదే… వాళ్ళు నది దారి మళ్ళిస్తారు, నీటి ప్రవాహాన్ని ఆపేస్తారు" అంది. ఆమె జీనా కమీజ్‌ను కిందికి లాగి, లేచి, అనుభవజ్ఞులైన మనిషికి ఉండే, నమ్మకమైన స్వరంతో "ఇలానే అంతా బావుంటే, పిల్లాడు ఇంకో పది రోజుల్లో బయటికొస్తాడు" అంది. 

 

కరీందాద్ ఇంటిలోకి అడుగు పెట్టీ పెట్టంగానే జీనా, అతన్ని నది సంగతి అడిగింది. మొదట ఆమె భయాలను కొట్టి పారేసేందుకే ప్రయత్నించాడు. కానీ ఆమె అదే పనిగా అడుగుతుంటే, "అవును నేనూ అలాంటిదే విన్నాను" అన్నాడు.

 

జీనా అడిగింది "ఏం విన్నావు?"

 

"హిందుస్తానీలు మన నది దారిని మూసేయబోతున్నారంట!"

 

"కానీ ఎందుకు?"

 

"అలా చేస్తే మన పంటలు ఎండి పోతాయని"



అప్పటికి నదుల ప్రవాహాన్ని కూడా మనుషులు ఆపగలరని ఎలానో జీనాకు నమ్మకం కలిగింది. ఆమె ఎలానో కూడబలుక్కుని నిస్సహాయంగా, "ఎంత క్రూరులు వాళ్ళు?" అంది. 



ఇది విని, కరీందాద్ చిరునవ్వుతో ఓ నిముషం ఆగి, "సరే ఇదంతా వదిలెయ్, భక్తో వచ్చిందా చెప్పు?" అన్నాడు.

 

ఆమె నీరసంగా, "వచ్చింది" అంది. 

 

"ఏమి చెప్పింది?"

 

"పిల్లవాడు ఇంకో పది రోజుల్లో పుడతాడని చెప్పింది"

 

కరీందాద్ ఆనందంతో గట్టిగా నవ్వి, "వాడు చల్లగా నూరేళ్ళు జీవించాలి" అన్నాడు.

 

జీనా తన అసహనాన్ని ప్రదర్శిస్తూ, "నువ్వర్థం కావు నాకు. ఇలాంటప్పుడు కూడా ఎలా నవ్వుతావో! ఏ ఉపద్రవం పొంచిఉందో, ఏ కర్బలా మనల్ని ముంచేసేందుకొస్తుందో ఆ దేవుడికే ఎరుక!” అంది. 

 

కరీందాద్ రచ్చబండ దగ్గరకు వెళ్ళాడు. అక్కడ గ్రామంలోని మొగవాళ్ళంతా అప్పటికే గుమిగూడున్నారు. అందరూ గ్రామ పెద్ద 'చౌదరీ నత్తూ' చుట్టూ మూగిపోయి, నదిని ఆపేయడం గురించే ప్రశ్నలు అడుగుతున్నారు. వాళ్ళలో ఒకరెవరో, పండిట్ నెహ్రూని నానా తిట్లూ తిడుతున్నాడు. ఇంకొకడు శాపాలు పెడ్తున్నాడు. ఇంకొకడు, అసలు నది గతిని మార్చగలగడం అన్న భావననే నమ్మనంటున్నాడు. వాళ్ళలో ఇంకొకడు అసలు ఏమి జరగనుందో అంతా మన తప్పులకు దేవుడు వేయబోయే శిక్ష అని తీర్మానిస్తున్నాడు. ఈ ఘోరంనుండీ తప్పించమని దేవుడిని వేడుకునేందుకు అందరూ మసీదుకు వెళ్దామని ఇంకొకడు ప్రతిపాదిస్తున్నాడు.



కరీందాద్ ఓ మూల కూర్చుని, తన చుట్టూ సుడులు తిరుగుతున్న మాటల్ని మౌనంగా వింటున్నాడు. హిందుస్తానీలను తిట్టడం లో చౌదరీ నత్థూ మొదట ఉన్నాడు. ఈ గోలంతా విని కరీందాద్ అసహనంగా కదులుతున్నాడు. అందరూ ఒక విషయాన్ని మాత్రం ఒప్పుకున్నారు - నదిని ఆపడం అనేది, చాలా నైతికంగా దిగజారిపోయిన వారి కుయుక్తి అని. అది మానవత్వం, మనస్సాక్షి లేనివారి అత్యంత హేయమైన, నీతిబాహ్యమైన చర్య. ఈ చర్య ‘యజీద్’ చేసిన పాపకార్యంతో సమానం. (యజీద్, కర్బలాలో జరిగిన యుద్ధంలో ప్రవక్త మనవడిని, అతని పరివారాన్ని, యూఫ్రటిస్ నది నుండీ నీరు వాడుకోనీయకుండా చేసి, తదనంతరం అతన్ని చంపిన వాడు. ఈ యుద్ధం తరువాత ముస్లిములు సున్నీలు, షియాలుగా విడిపోయారు. ఈ యుద్దం గెలిచిన యజీద్, రెండో కాలిఫ్ అయాడు.)

 

కరీందాద్ రెండుసార్లు దగ్గి, ఏదో చెప్పేందుకు గొంతు సవరించుకున్నాడు. కానీ అప్పటికి చౌదరీ నత్తూ నోటి వెంట బూతుల ప్రవాహం విరుచుకుపడింది. కరీందాద్ ఇక ఆగలేకపోయాడు, "వాళ్ళను తిట్టకు చౌదరీ!" అని అరిచాడు.

 

భయంకరమైన 'అమ్మ బూతు తిట్టు' ఒకటి చౌదురీ గొంతు లోనే ఇరుక్కుపోయింది. కరీందాద్‌ను ఆశ్చర్యంగా చూస్తూ తన తలపాగాని సవరించుకుంటూ, "ఏమన్నావు?" అన్నాడు చౌదరీ. 

 

కరీందాద్ నెమ్మదిగా ఖచ్చితమైన స్వరంతో, "నేను వాళ్ళను తిట్టొద్దు అన్నాను" అన్నాడు.

 

చౌదురీ తన గొంతులో ఆగిపోయిన బూతుని ఖాండ్రించి ఉమ్మేసి, కరీందాద్ వైపు తిరిగి కోపంగా, "ఎవరిని తిట్టొద్దంటున్నావు? వాళ్ళు నీకేమవుతారు?" అని, చుట్టూ చూసి, చౌపాల్ దగ్గర గుమిగూడినవాళ్ళతో అన్నాడు "విన్నారా మీరంతా? వీడి మాటలు? వాళ్ళను తిట్టొద్దంట. అందరూ అడగండి వీడ్ని… వాళ్ళు వీడికి ఏమవుతారో!". 

 

కరీందాద్ ఓపిగ్గా, "నాకు వాళ్ళేమవుతారు? వాళ్ళు నా శత్రువులు. అంతకంటే ఇంకేం కారు!” అన్నాడు.

 

ఏ పెద్ద నవ్వు లాంటి బొంగురు శబ్దం చౌధురి నోటి నండీ ఎంత వేగంగా బయటికొచ్చిందంటే, అతని మీసంలోని వెంట్రుకలు కూడా అదిరాయి! "విన్నారా? వాళ్ళు వీడికి శత్రువులంట. మరి మన శత్రువు ని ప్రేమించమంటావా, నాయనా?”



కరీందాద్ సమాధానం ఇస్తున్నట్టు, "కాదు చౌదరీ, నేను అలా అనట్లేదు. నేను అన్నదంతా - వాళ్ళను తిట్టొద్దు అని మాత్రమే" అన్నాడు.



కరీందాద్ పక్కనే కూర్చున్న అతని చిన్ననాటి స్నేహితుడు మీరాన్ బక్ష్ అడిగాడు "కానీ ఎందుకు?"

 

కరీందాద్ నేరుగా మీరాన్ బక్ష్‌తో, "వాళ్ళను తిట్టి ఏం లాభం, యార్? వాళ్ళు నదిని మూసేసి మన పంటలను నాశనం చెయ్యాలని చూస్తున్నారు. నువ్వు వాళ్ళను తిట్టి ఆ లెక్క సరిచేయగలనని అనుకుంటున్నావా? నువ్వు తిట్టినంత మాత్రాన ఆగుతారా? అసలు దీనికి ఏమైనా అర్ధం ఉందా? మన దగ్గర ఇంకే సమాధానమూ లేనపుడే ఎదుటివాళ్ళను తిడతాం" అన్నాడు.

 

మీరాన్ బక్ష్, "మరి నీ దగ్గర ఏమైనా సమాధానం ఉందా?" అని అడిగాడు. 

 

కరీందాద్ ఒక క్షణం ఆగి, "ఈ సమస్య నా ఒక్కడిది కాదు. ఇది వేలాది మందికి సంబంధించిన విషయం. నా సమాధానం అందరి సమాధానం కాలేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఎంతోలోతుగా ఆలోచిస్తే అందరికీ అంత సంతృప్తికరమైన సమాధానం దొరకుతుంది. వాళ్ళు నదీ ప్రవాహాన్ని ఒక్కరోజులో ఆపలేరు. వాళ్ళకు ఆ పని చేసేందుకు ఏళ్ళు పడతాయి. కానీ మీరేమో వాళ్ళ మీద మనసులో పేరుకుపోయిన కక్షనంతటినీ ఒక్క క్షణంలో బూతులుగా మార్చి తిట్టేసి దులిపేసుకుంటున్నారు". కరీందాద్, మీరాన్ బక్ష్ భుజం మీద చెయ్యేసి ఆప్యాయంగా, "నాకు తెలిసిందల్లా ఒక్కటే యార్. హిందుస్తాన్‌ను నీతిమాలిందని, కౄరమైందని, అల్పమైనదని చిన్న మనసుదనీ అనడం తప్పు."

 

మీరాన్ బక్ష్ బదులు చౌదురీ నత్తూ అరిచాడు, "ఇప్పుడు ఇది వినండి మరి!"

 

కరీందాద్, మీరాన్ బక్ష్‌తో తన మాటలు కొనసాగించాడు. "నా ప్రియ మిత్రమా, ఇది మూర్ఖత్వం! శత్రువులనుండి కనికరాన్ని ఆశించడం మూర్ఖత్వం. యుద్ధం వచ్చినపుడు మన దగ్గర ఉన్నదానికంటే శత్రువు దగ్గర పెద్ద ‘బోరు’న్న రైఫిలు ఉందని ఏడవడం లాంటిది! మనం చిన్న చిన్న బాంబులు విసురుతూ వాళ్ళు పెద్ద పెద్ద బాంబులు వాడుతున్నారని ఫిర్యాదు చేయడం లాంటిది! చిన్న కత్తి అయినా పెద్ద కత్తిలాగే ప్రాణాలు తీయగలదు కదా. నేను చెప్పేది నిజం కాదా?"

 

మీరాన్ బక్ష్ బదులు, చౌధరీ నత్తూ ఆలోచనలో పడినా, వెంటనే తన చిరాకుని ప్రదర్శిస్తూ, "కానీ ఇక్కడ సమస్య అది కాదు, వాళ్ళు మన నీళ్ళను ఆపబోతున్నారు. మనం ఆకలితో, దప్పులతో చావాలని కోరుకుంటున్నారు."

 

కరీందాద్ తన చేతిని మీరాన్ బక్ష్ భుజంమీదనుండి తీసి, చౌదరీ వైపు తిరిగి, "మనం ఒకరిని శత్రువు అని ప్రకటించేసాక, వాళ్ళు మనల్ని ఆకలీ, దాహాలతో చంపడానికి ప్రయత్నిస్తున్నారు అని ఫిర్యాదు చేయడం దేనికి? మనన్ని ఆకలికి ఎండగట్టకుండా, మన పచ్చని పొలాలను బీడు భూములు చేయకుండా మన ఇంటికి డేగిశాల నిండా పులావులూ, కుండల నిండా తీయని షర్బత్‌లూ పంపుతారనీ, మనం ఆడుకోవటాని కోసం తోటలూ, తోపులూ పెంచుతారనుకుంటామా?"



ఇది చౌదరికి మరింత కోపాన్ని తెప్పించింది. "ఏంటి ఈ అర్థం పర్థం లేని మాటలు?" అని అడిగాడు ఆగ్రహంగా.



మీరాన్ బక్ష్ కూడా మెల్లగా, "అవును యార్, ఏంటిది అర్ధం లేకుండా?" అడిగాడు.



"ఇది అర్ధం లేని విషయం కాదు మీరాన్ బక్ష్!" అన్నాడు కరీందాద్ సేహితుడికి విషయం భోధపరిచేందుకు ప్రయత్నిస్తూ, "ఆలోచించు! యుద్ధంలో రెండు పక్షాలూ ఎదుటివాళ్ళను ఓడించేందుకే ప్రయత్నిస్తారు. కుస్తీ పోటీలో వస్తాదు అన్నిటికీ సిద్ధపడి నడుం బిగించి రంగంలో ఎలా దూకుతాడో, ఎదుటివాడిని మట్టికరిపించడానికి తనకు చేతనయిన అన్ని యుక్తులనూ వాడి, తన శాయశక్తులా ఎలా పోరాడతాడో ఇది కూడా అంతే." 

 

మీరాన్ బక్ష్ ఒప్పుకున్నట్టు నున్నగా గుండు చేసున్న తన తల ఊపుతూ, "అవును, అది నిజమే" అన్నాడు.

 

కరీందాద్ నవ్వి, "అలాంటప్పుడు నదిని మూసేయడం కూడా సరైనదే. అది మనకు కౄరత్వంలా అనిపించచ్చు. కానీ, వాళ్ళ దృష్టిలో అది సరైన చర్యే"

 

"దాహంతో నీ గొంతెండిపోయి, నాలుక పిడచకట్టుకున్నప్పుడు అ‍‍డుగుతాను ఇది సరైన పనో కాదో! నీ పిల్లలు అన్నం ముద్ద కోసం ఏడ్చినప్పుడు కూడా ఇదే మాట అంటావా? నదిని ఆపడం సరైన పనేనని!"

 

కరీందాద్ ఎండిన తన పెదవుల్ని నాలుకతో తడుపుకుని సమాధానమిచ్చాడు, "అవును, అప్పుడు కూడా నేను ఇదే మాట అంటాను చౌదరీ. కేవలం వాళ్ళు మాత్రమే మన శత్రువులు కాదు, మనం కూడా వాళ్ళకు శత్రువులమే అన్న విషయం నువ్వు ఎందుకు మర్చిపోతున్నావు? మనకే వాళ్ళ అన్నపానీయాలను ఆపగలిగే వీలుంటే, నిర్దాక్షిణ్యంగా మనమూ అదే చేసుండేవాళ్ళము కదా. ఇపుడు వాళ్ళు మన నీళ్ళను ఆపేయగలిగి, నదిని మూసేయగల స్థితిలో ఉన్నపుడు పనికిమాలిన తిట్లవల్ల ప్రయోజనం ఏముంది? దీన్నుండీ బయటపడే మార్గం గురించి ఆలోచించాలి గానీ. శత్రువు మన కోసం ‘పాల నదుల’ను సృష్టించడు చౌదరీ. కానీ వీలుంటే మన వాటాకు వచ్చే ప్రతి నీటి చుక్కలోనూ విషం కలపగలడు. ఈ రకంగా ప్రాణాలు తీసే పద్ధతి నీకు నచ్చకపోవచ్చు. దాన్ని నువ్వు క్రూరత్వం అను, రాక్షసత్వం అను… కానీ ఇందులో వింతేముంది? యుద్ధం మొదలయే ముందే ఇరుపక్షాల వాళ్ళూ కూర్చుని కొన్ని షరతులూ, ఒప్పందాలూ మాట్లాడుకోవచ్చు కద… అంటే నిఖా చేసుకునేప్పటి మాటల్లాగా… మమ్మల్ని ఇలా ఆకలి, దాహాలతో చంపవద్దని, తుపాకులూ తూటాలతో చంపమని, అది కూడా మా దగ్గరున్నట్టే ఫలానా బోర్ ఉన్న తుపాకులతోనే రండి అని చెప్దామా? ఇవీ నిజానికి అర్ధం లేని మాటలంటే. నెమ్మదిగా, శాంతంగా ఆలోచించండి." 



అప్పటికి చౌదరి‌కి ఓపిక నశించి, నిరాశ అవధులు దాటింది, "ఎవరైనా ఓ మంచు పలక తెచ్చి నా గుండె మీద పెట్టండి" అని కోపంగా అరిచాడు.

 

"అది కూడా నేనే తెచ్చివ్వాలని ఆశిస్తున్నావా?" అని పకాల్న నవ్వాడు కరీందాద్. మీరాన్ బక్ష్ భుజం మీద చరిచి, లేచి, రచ్చబండ నుండి బయలుదేరాడు.



అతను ఇంటి గడప చేరీసరికీ ఇంటినిండీ బయటికొస్తూ భక్తో కనపడింది. ఆమె బోసినవ్వుతో "అభినందనలు కీమె! నీకు పండులాంటి బిడ్డ పుట్టాడు. వా‍డికి మంచి పేరు ఆలోచించు ఇప్పుడు" అంది.

 

"పేరా?" కరీందాద్ ఒక్క క్షణం ఆలోచించి అన్నాడు, "యజీద్… యజీద్."


భక్తో ఆశ్చర్యంతో నోరు తెరిచింది. ఆనందంతో ఉబ్బితబ్బిబ్బవుతూ కరీందాద్ ఇంటిలోపలికి వెళ్ళాడు. జీనా నులక మంచం మీద పడుకుని ఉంది. ఇంతకు ముందు కన్నా పాలిపోయి, నీరసంగా కనిపిస్తుంది. ఓ అందమైన శిశువు తన బొటనవేలిని చీకుతూ ఆమె పక్కనే పడుకుని ఉన్నాడు. కరీందాద్ ప్రేమగా, గర్వంగా వాడిని చూశాడు. వాడి లేత బుగ్గని చూపుడువేలుతో సున్నితంగా తాకి మృదువుగా అనాడు, "నా చిట్టి యజీద్!" 

 

జీనా ఆశ్చర్యంతో ఓ కేక వేసింది, "యజీదా?"

 

కరీందాద్ కొడుకు ముఖాన్ని దగ్గరగా చూస్తూ, వాడి పోలికల్ను గమనిస్తూ అన్నాడు, "అవును. యజీద్. ఇదే వీడి పేరు."

 

జీనా గొంతు నీరసబడిపోయింది, "ఏమంటున్నావు కీమె? యజీద్ ఏంటి…"

 

కరీందాద్ నవ్వి, "అందులో ఏముంది? అది కేవలం ఒక పేరు మాత్రమే!" అన్నాడు.

 

జీనా అతికష్టం మీద కీచుగా ఒక్క మాట అనగల్గింది, "కానీ… అది ఎవరి పేరు?" 

 

కరీందాద్ చాలా గంభీరంగా సమాధానమిచ్చాడు, "వీడు ఆ పాత యజీద్ అవ్వాలని ఏముంది. ఆ యజీద్ నదిని మూసేసాడు; మన కొడుకు దాన్ని తెరుస్తాడు."



***

మూలం: సాదత్ హసన్ మంటో కథ ‘యజీద్’

అనువాదం : నేను 🙎‍♀️

First published in Udayini Webzine.

***

Context of the story is weaponisation of natural resources.  Background is Indus Water Treaty between India and Pakistan & Op Sindhoor.

****

Notes : 

https://scroll.in/article/1081748/theyre-going-to-close-our-river-mantos-1950s-story-about-the-india-pakistan-water-dispute



https://www.rekhta.org/ebooks/detail/yaziid-saadat-hasan-manto-ebooks


https://urduadab4u.blogspot.com/2012/02/yazeed-interesting-urdu-short-story-by.html


The Book of Bullah, A Selection of Verses - Manjul Bajaj



బుల్లే షా, పంజాబ్ కు చెందిన ఒక ప్రసిద్ధ సూఫీ గురువు. శతాబ్దాలుగా జనరంజకమైన వాక్యాలని రాసి, వాటికి ఎప్పటికప్పుడు కాలానుకూలంగా సరికొత్త అర్ధాలు వెతుక్కునే పాఠకుల అభిమానానికి సొంతదారు.   అతని కవితల్లో తీవ్రమైన భావోద్వేగం, పిచ్చి పరవశం, ఉత్సాహం,  గాఢ అనురక్తి, మూఢ విశ్వాసాల పట్ల తీక్షణమైన తిరస్కారం, సాధారణం.  తన కవితలు/పాటలు చదివిన పాఠకుడిని ఆలోచించేలా చేసి, తద్వారా వారిని తీవ్రంగా ప్రభావితం చేయగల లక్షణం బుల్లే షా సొంతం.   'జీవితం', దాని అంతిమ లక్ష్యం, 'మృత్యువు', 'జీవన పరమార్ధం,'  'ఆధ్యాత్మిక చతురత', 'విశ్వాసం' లాంటి వాటి వైపు పాఠకుడి దృష్టి మళ్ళించగల బుల్లే షా కవిత శతాబ్దాలుగా పంజాబీ సాహిత్యంలో ఓ దిక్సూచిగా నిలబడింది.  

ఈ  పుస్తకంలో మంజుల్ బజాజ్ ఈ కవితలను సులువైన ఇంగ్లీషు లోకి తర్జుమా చేస్తూ, బుల్లే షాని ఆధునిక పాఠకుల చెంతకు వీలైనంత సరళంగా, సున్నితంగా, ప్రతిభావంతంగా తీసుకు రాగలిగారు.   


బుల్లే షా జీవిత కాలం బహుశా  1680 - 1758 మధ్యలో ఉండొచ్చు. అతని గురించిన సమాచారమంతా ఓరల్ గా మాత్రమే  చరిత్రలో నిలిచిన  అతని రచనల్లోనించి రాబట్టినదే. అతని జీవితమంతా ప్రేమను జీవిస్తూ బ్రతికేడు. అతని నిజమైన పేరు "అబ్దుల్లా షా". భక్తీ, ఆచారం కలిగిన సయ్యద్ కుటుంబంలో జన్మించాడు. ఉమ్మడి పంజాబు లోని  కాసుర్ లో బాల్యం, చదువూ గడిచాయి. తండ్రి మత విద్య లో పండితుడు. బుల్లే చిన్నపుడు పంజాబీతో సహా అరబ్బీ, పెర్షియన్ చదువుకున్నాడు. కురానూ, ఇస్లామిక్ న్యాయ సూత్రాలు, పెర్షియన్ సాహిత్యం కూడా అధ్యయనం చేశాడు.   యవ్వనంలోకొచ్చాకా,  మూఢమైన  మత విశ్వాసాలని ప్రశ్నించాడు. 

ఆ తరవాతే లహోరు లోని "షా ఇనాయత్ కాద్రీ" అనే గురువుని కనుగొని అతని పరంపరని ఎంచుకున్నాడు. 'షా ఇనాయత్ ఖాన్' కులం (తోట) 'మాలి'.  బుల్లా లాంటి వాడు,  'సయ్యదీ' అయి ఉండి తక్కువ కులస్తుడి శిష్యుడు కావడమేమిటని సమాజం వెక్కిరించింది.   అతన్ని ఆ పరంపర నుండీ తప్పించేందుకు ప్రయత్నాలూ జరిగాయి.  గురు శిష్యుల ఎడబాటు బుల్లే షాకి భరింపశక్యం కాలేదు. ఆ దుఃఖోద్వేగంలోనే చరిత్రలో  అత్భుతమైన కవిత్వం రాసాడు.    


ఈ గురువుతోని అతనికి కలిగిన ఎడబాటు అతని మనసుని ఎంతో చలింపజేసింది. విరహమే అతని ఎన్నో కవితలకు సబ్జెక్ట్ గా మారింది. ఒకానొక సందర్భంలో గురువు కొలువునుండీ బహిష్కరింపబడ్డాక, ఒక నాట్యకత్తె వేషంలో కొలువులోకి ప్రవేసించి, "తెరి ఇష్క్ నచియా" అనే ప్రసిద్ధమైన పాట పాడి, గురువు మనసు కరిగించాడని అంటారు. 

షా ఇనాయత్ 1728 లో మరణించాక, బుల్లే షా ఒక టీచర్ గా, కవిగా 'కాదిరీ' పరంపరలోనే కొనసాగాడు. అతని తుది జీవితం, కసూర్ లోనే గడిచింది. అతని తరవాత కవితలన్నీ ఆధ్యాత్మికత లో మునిగి తేలాయి. తన శిష్యులకి మంచీ చెడూ, న్యాయం, అన్యాయం, చావూ పుట్టుకల గురించి మంచి అవగాహన ఉండాలని బుల్లే అభిమతం. 

అతని చివరి దశకల్లా పంజాబులో రాజకీయ కల్లోలం మొదలయింది. ముఘల్ సామ్రాజ్య పతనం ఆరంభమైంది. చిన్న చిన్న రాజులు కూడా అణిచివేతలకు పాల్పడేవారు. సిక్కు  మతం పుట్టడం, ముస్లిముల ఘోరమైన అకృత్యాలతో, నాదిర్ షా,అహ్మద్ షా అబ్దాలీల ముట్టడులూ కలిసి, మత విశ్వాసాలను కూలగొట్టాయి. రాజకీయ సత్యాలు కూడా అతని కవితలకు వస్తువులయ్యాయి. నిస్పృహా, ఆశా, రాజకీయ పరిమాణాల పట్ల వెటకారం, వ్యతిరేకతా కూడా చోటు చేసుకోవడం మొదలు పెట్టాయి.


బుల్లే కవిత లు మధుర భక్తి ప్రధానాలు. దేవుడూ, భక్తుడూ వేర్వేరు  కాదని, ప్రియుడికీ, ప్రియురాలికీ మధ్య ఉండాల్సిన మోహమూ, ప్రేమా, వాత్సల్యమూ, స్నేహమూ, బంధాలుగా దేవుడికీ భక్తుడికీ ఉండాలన్నది అతని దృక్పథం.  బుల్లే కవితల్లో పొంగే భక్తీ, ప్రేమా, విరహమూ పాఠకుడిని వివశుడిని చేస్తాయి. "జీవితం ఎంత మధురమైనది? దానినెందుకు కట్టుబాట్ల పేరునో, కుల మతాల అంతరాల పేరుతోనో ద్వేషం, అహంకారంతో నింపేసుకుంటున్నాము ? చావు కూడా ఎంత అర్ధవంతమైన విషయం?" అని అనుకునేలా చేసినందునే, బుల్లే కవితలు కాలంతో ప్రయాణించాయి.  ఇండియా, పాకిస్తాన్ లోని రెండు పంజాబులకూ ఈ కవిత్వం  సొంతం.  


తాను జీవించినంత కాలమూ బుల్లే షా మతాన్ని, దాన్నంటిపెట్టుకున్న అంధత నీ విమర్శించాడు. పరమత అసహనాన్నీ,  మడీ,ఆచారాలనీ, అసలు మతంలోని 'అర్ధం పర్ధం లేని తనా'న్నంతా వ్యతిరేకించాడు. దేవుడికీ, మనిషికీ మధ్య మతం అనే ముసుగు దేనికి ?    అందుకే అతను మరణించాకా, అతని శరీరాన్ని పాతిపెట్టేందుకు మసీదు అంగీకరించలేదు. అయితే, విచిత్రమేమిటంటే,  ఇప్పుడు కసుర్ లోని బుల్లే సమాధి ఓ ప్రసిద్ధి చెందిన ప్రదేశం. అతని సమాధి ఇరుగు పొరుగునంతా ఊర్లోని ధనికులూ, గొప్పవాళ్ళూ పాతిపెట్టబడ్డారు. 

 పంజాబీ సాహిత్యానికి బుల్లే దన్ను ని ఇచ్చాడు.  బుల్లే కవిత్వమంతా పంజాబుకే చెందిన వ్యావహారిక మౌఖిక సాంప్రదాయంలోనే భద్రపరచపడింది.  అసలు పంజాబీ భాష ఎదుగుదల లో సూఫీ కవిత పోషించిన ప్రధన పాత్ర విచిత్రంగా ఉంటుంది. బుల్లేషా యొక్క మొదటి పంజాబీ సాహిత్య ఆధారం, బుల్లేకి ముందున్న 13 వ శతాబ్దికి చెందిన సూఫీ గురువు బాబా ఫరీద్ మూలాన  దొరికింది.  సింధు నాగరికత లో భాగంగా  ఉండిన పంజాబ్, ఆధునిక మానవుడి ప్రాచీన నాగరికతల్లో ఒకటిగా రికార్డయింది. తక్షశిల లో క్రీస్తు పూర్వం ఏడవ శతాబ్దంలో దాని గురించి ఆధారాలు దొరికినా, ఆ సాక్షం, పూర్తిగా రూపాంతరం చెందని ఫార్మ్ లోనే దొరికింది.  

పంజాబీ లిపి ప్రతులు హూణుల, గ్రీకుల ఘజనీ, ఘోరీల దండయాత్రల్లో పూర్తిగా మాయమయ్యాయని అంటారు. కాబట్టి ఏడవ శతాబ్దం నుండీ, పదవ శతాబ్దం దాకా పంజాబీ అంతా 'నాథ భాష' అనే ప్రాకృత  పంజాబీనే. దీనిలోనే 'నాథ జోగీ' లు రాయబడ్డాయి. సూఫీజం వచ్చాక ఘజ్ఞవీ రాజంలో ఈ ప్రాకృత భాష, పెర్షియను తో కలిసి, పెర్సియో-అరబిల్ లిపులు కలిసి, 'శ్రీముఖీ' లిపి మొదలయింది. సిఖు గురువులు ఆ తరవాత 'గురుముఖీ' అక్షరమాలను ప్రాచుర్యంలోకి తెచ్చారు. సిక్కు గురువుల కాలం నాటి వ్యావహారిక భాషే ఈ 'గురు ముఖీ'. అచ్చులు లేని వ్యాపారుల భాష ఇది.   ఈ లిపే ఇప్పటికీ పంజాబీ రాసేందుకు ఉపయోగపడుతుంది. పంజాబీని దేవనాగరీ లో కూడా రాస్తారంట. కానీ బుల్లే ఎంచుకున్నది 'శ్రీ ముఖి' లిపి. ఈ లిపిలో తరచుగా ఉర్దూ అక్షర మాల కూడా దొర్లేది. 

బాబా ఫరీద్ తరవాత నాలుగు తరాలలో సూఫీ కాఫీలు, సిక్కు షాబాద్ లు పంజాబీని ముందుకు నడిపించాయి. ప్రాక్ పశ్చిమ కవితల సౌందర్యాన్ని కలిపి, బ్రజ భాషను, పెర్షియన్  నూ కలిపి జానపద చాటువులూ, సామెతలూ, గేయాలు పుట్టాయి. 

ఇలా సూఫీ మతం, సిక్కు మతం, చుట్టు పక్కల ప్రబలిన 'భక్తి ఉద్యమం' కలిపి, పంజాబీని రూపు దిద్దాయి. గురు గ్రంధ సాహిబ్ లో బాబా ఫరీద్ పాటలూ, కబీరు దోహాలు కూడా ఉన్నాయి. బాబా ఫరీద్ తరవాత, బుల్లే షాకి ముందూ ప్రసిద్ధులైన షా హుసేన్, సుల్తాన్ బాహులు కూడా వివిధ పంజాబీ యాసల్లో రచనలు చేసారు. బుల్లే షా, అతని కాలానికే చెందిన వారిస్ షాల చలవ కారణంగా, మధ్య పంజాబు అనగా మాఝీ ప్రాంతం మొత్తం పంజాబీ సాహిత్య భాషకు పెట్టని కోట గా మారింది.   

బుల్లే రాసిన కాఫీలు విచిత్రమైనవి. వాటిలో భాష సొగసులు, విరుపులు ఏదీ ఉండదు. కవితాత్మకత కూడా తక్కువ. కానీ వాటి సూటిదనం వల్లనా, నలుగురికీ అర్ధమయ్యే భాష వాడడం వల్లా, అవి జనాన్ని బాగా చేరాయి. ఇవి రోజువారీ సంభాషణలు, చమత్కారాలు, తల్లి కూతుర్ల సంవాదాలు, పెళ్ళికూతురు అత్తవారింటికి వెళ్ళడం, ప్రియురాలూ, ప్రియుడూ అనుభవించే విరహ వేదనా, సమాజం కట్టుబాట్ల వల్ల గందరగోళాలయ్యే మనసుల గురించి ప్రస్తావనలూ, వాటి వెనకున్న తాత్విక అర్ధాలూ, ఈ కవితల్లో మార్మికత, ఎవరికి సంస్కారానికి తగినట్టు వారికి అర్ధమయే వేదాంతమూ అతన్ని ప్రత్యేకంగా నిలబెట్టాయి.   కొన్ని అతనివి 'కాని' కాఫీలు కూడా అతని పేరుమీదే చలామణీ అయ్యాయి. అతను మరణించిన వంద సంవత్సరాల దాకా కూడా అతని కవితలు రికార్డ్ చేయబడని కారణాన ఇప్పటికీ చాలా కవ్వాలీలు బుల్లే లైన్లూ, ఇతరుల లైనతో కలిపేసి కొత్త వి సృష్టించబడ్డాయి. చాలా మటుకూ పాకిస్తాన్, ఇండియా లలో ఈ కవాలీలు బుల్లే వి గా ఇప్పటికీ గౌరవించబడుతూనే ఉన్నాయి. అబీదా పర్వీన్, రబ్బీ షెర్గిల్ లు బుల్లే పాటల్ని బాగా ప్రాచుర్యం లోకి తెచ్చారు. 

పాపులర్ హిందీ సినిమా పాటలూ, ఇప్పటికీ హిట్ అయే బాలీవుడ్, ఇండీ, పంజాబీ పాప్ పాటలూ బుల్లే ని కొత్త తరానికి పరిచయం చేస్తూ వస్తున్నాయి.  పాత హిందీ సినిమాలలో చాలా సూపర్ హిట్ కవాలీ లు బుల్లే రచనల నుండీ తీసుకున్నవే.   చరిత్రనీ, ప్రేమనీ, కొంటె తనాన్ని, వేదాంతాన్నీ సమానంగా మోస్తూ ఆ పదాలు జనాల నాలుకపై నిలిచిపోయాయి. కొత్తర్ధాలు చెప్తున్నాయి. 

మంజుల్ ఇంగ్లీషు లో కి అనువాదం చేసిన ఈ పుస్తకంలో బుల్లే సాహిత్యం (అంటే ఇప్పటికి అందుబాటులో ఉన్న మాత్రంలో)  వంద  పాపులర్ కవితలే ఉన్నాయి. వీటిని ప్రేమగా సేకరించి, అనువదించి, చక్కగా ప్రెసెంట్ చేసారు. తను మొదటి సారిగా కనుగొన్న బుల్లే ద్విభాషా కవితల పుస్తకం చూసి, అంత వరకూ బుల్లే గురించి తెలీనిది ఏదైనా ఉందా అని పరిశోధించి, మనసు పెట్టి,  కాఫీల్ని తన కున్న పరిధుల్లో, ఒరిజినల్ కు దగ్గరగా ఉండాలనే స్పృహతో ఎన్నో సంవత్సరాల కృషి ని ఇన్వెస్ట్ చేసి, అనువదించానని చెప్పారు.  

పంజాబీ రానివారికి ఈ అమృతం రుచి తెలియాలని (ఒక వేళ) ఒరిజినల్ లో రైమింగ్ ని తేలేకపోయినా పర్లేదనుకుని ధైర్యం చెప్పుకుని,  అదే  సరళత తో అనువదించడానికి ప్రయత్నించారు.  నాకయితే, గీతాంజలికి చలం తెలుగు అనువాదంలా, ఆ లైన్లు మన తో జీవితాంతమూ మిగిలిపోయినట్టు (పెద్ద ప్రశంస కదా) - ఈ ఇంగ్లీషు బుల్లే కూడా అనిపించాడు.  పోయెట్రీ అంటే ఇష్టపడే వాళ్ళూ, ఇష్టపడని వాళ్ళూ మెచ్చుకుంటారు ఈ కవితల్నీ, ఈ ఎఫర్ట్ నీ.   బుల్లే షా మన రెండు దేశాల కూ చెందిన వారసత్వ సంపద. అలా అని ఒక భాష లోనే దాచేసుకుంటే ఎలా. అందరికీ ఈ సంపద చేరాలీ అంటే వీలైనన్నై భాషల్లో అతని కవిత్వం ప్రవహించాలి. కొన్ని విని చూడండి. 

***

The Most Popular Song "Bulla ki jana me koun":-
 
Bullah, how do I know
who am I?

I am not a believer among believers
Nor am I a disbeliever
Neither pure nor unclean
Neither Moses nor Pharoah

Bullah, how do I know 
who am I ? 

I am not in the Vedas or scriptures
Nor in alcohol or drugs
I am not a drunkard or a repentant
Not asleep nor awake 

Bullah, how do I know 
who am I ? 

Neither saint nor sinner
Neither happy nor unhappy 
Neither fire nor water
Neither earth nor wind

Bullah, how do I know 
who am I ? 

Not an Arab or a Lahori
Nor do I belong to Nagori
Not a Hindu, not a Turk
Nor a dweller of Nadaun

Bullah, how do I know 
who am I ? 

I do not know the secret of religions
I was not born of Adam and Eve
I am without a name 
Without faith or disbelief

Bullah, how do I know 
who am I ? 

I know only myself
Nothing other than the Self
Nothing greater than the Self
Who then is that I see watching me?


***


***



***

Finding God

If God was to be found
by washing and bathing,
frogs and fish would find him

If God was to be found 
by roaming in the wilderness
cows and calves would have him

Listen to Bulleh Shah
God comes to the pure of heart
those truthful in their ways

***
శుభం