Pages

29/05/2026

The Vegetarian - Han Kang




ఒక పుస్తకం గురించి చాలా విన్నాక, పత్రికలలో రివ్యూలు చదివాక, దాదాపు స్టోరీ ఏంటనేది చూచాయగా తెలిసిపోయాక, మంచి స్నేహితుడు చదవమని చేతిలో పెడితే, న్యూట్రల్ గా మొదలుపెట్టిన పుస్తకం ఇది. చదవడానికి సులువుగా ఉన్న భాష, దేశీ అనువాదం, (అనువాదకురాలు, డెబోరా స్మిత్ ఏషియన్ ఆత్మని పట్టుకోవడం కోసం ఉద్దేశ్యపూర్వకంగా అలా చేసుండొచ్చు) అందమైన కథనం, గబ గబా చదివించేస్తాయి. ఒక సారి చదివిన దానికీ, ఇంకోసారి నెమరువేసుకునేదానికీ అర్ధాలు కొత్తగా బోధపడతాయి. అది పూర్తిగా అనువాదం గొప్పతనం అనిపిస్తుంది. ఎప్పట్లాగే కవర్ పేజ్ చాలా అర్ధవంతంగా ఉంది. పుస్తకం ముగించాక అది తెలుస్తుంది. 


భార్య అంటే ఏ మాత్రం ఆసక్తి, ప్రేమా లేని భర్త. కూతురి మీద, అసలు తమ పిల్లలంటే విపరీతమైన కంట్రోల్ ఉన్న తల్లితండ్రులు. పురుషాధిక్యత.  హీరోయిన్ - యాంగ్ హై, మామూలు భార్య. ఆమె భర్త, కూడా సాధారమైన మనిషే. అయితే ఈ పిల్ల కి ఉన్న ఒక మొక్క లాంటి బ్రతుకు బ్రతకాలనుండడం అన్ని సమస్యలకీ బీజం. యాంగ్ హై కున్న అక్కయ్య ఇంగ్ హై, ఎంతో కుదురైన కూతురు. బాధ్యతకల చిన్నపిల్లవాడి తల్లి. డిజిటల్ కళాకారుడైన సంపాయించని భర్తని సాకుతూ, ఇంట్లో సకలం చూసుకునే సూపర్ వుమన్. ఈ ఇద్దరి అక్క చెల్లెళ్ళ జీవితం - ఈ వెజిటేరియన్. 


యాంగ్ హై కి చిన్నప్పటి నుండీ ఒక ఆక్రోశం. జీవితం అంటే. ఆమె కి పెళ్ళయాక జీవితం ఏమీ పెద్ద మారదు. భర్త చాలా సున్నితత్వం లేని మామూలు భర్త. అతనికి భార్య మీద ప్రేమ, ఆదరణా ఉండవు. అతనికి ఆమె అర్ధం కాదు. యాంగ్ హై కి ఉన్న మానసిక సమస్యలు అతనికి పట్టవు. ఆమెకు ఏమి కావాలో అక్కర్లేదు. ఆమె బాధ్యతగా, మర్యాదపూర్వకమైన భార్యగా మసులుకుంటే చాలు. 


యాంగ్ హై పెద్ద సౌందర్యవతి కాదు. కానీ మంచి సాంప్రదాయక కొరియన్ కుటుంబంలో పుట్టింది. చెప్పిన మాట వినే రకం. అంతే. ఆమెకు బ్రా వేసుకోవడం, రొమ్ముల్ని బట్టతో బంధించడమూ అంటే అసలు ఇష్టం ఉండదు. దాని వెనకున్న హైపర్ సెన్సిటివిటీ అతనికి అర్ధం కాదు.  అసలు ఆమె భయాలూ, వేదనా, అతనికి పట్టవు. పిల్లలు అప్పుడే వద్దనుకున్నారు.  ఆమె కు ఏవో కలలొస్తున్నాయి. హఠాత్తుగా వెజిటేరియన్ అయిపోతుంది.  అతనికి ఈ మార్పు సహించదు. కారణాలడగడు. ఆమె సమస్యకు ఏదైనా పరిష్కారం ఉందా అని ఆలొచించడు. ఆమె భయాలు అతనికి అనవసరం. పూట పూటకీ, తనకు అన్నీ అమర్చిపెట్టే, విధేయురాలు ఎక్కడ అని అతనికి సందేహం. ఆవిడ ఓ మనిషనేది అతనికి పట్టదు. ఆమె తండ్రి చిన్నపుడు ఆమెని ఎలా చూసాడో, భర్త కూడా అదే నిరాసక్తి తో, నిర్లక్షంగా చూడడం - అదీ తన దృష్టి కోణంలో తనదేమాత్రం తప్పులేదనే విధంగా చెప్తూండడం - ఇదంతా సహజమే కదా అనిపించేలా ఉంటాయి.  

దానితో ఇద్దరి మధ్యా ఘర్షణ మొదలవుతుంది. ఆమెకు చెట్లలా బ్రతకాలనుంటుంది. నాన్ వెజ్ తినడం వల్ల పీడ కలలు రావనుకుంటుంది. కానీ ఆమె ఎంత దూరంగా పారిపోయినా, పీడకలలు వెన్నాడడం ఆగవు. ఆమె కొరియన్లు సాధారణంగా తినే భోజనం మానేస్తుంది. ఈమె మాంసాహారం ముట్టకపోవడం వాళ్ళందరినీ కుదిపేస్తుంది. భర్త, అత్త మామలకు కంప్లైంట్ చేస్తాడు. అతనికి సమాజంలో అదో పెద్ద అవమానం. తండ్రీ, తల్లీ బలవంత పెడతారు.  ఆమె తిరగపడుతుంది. సెల్ఫ్ హార్మ్ చేసుకునే దాకా వెళ్తుంది.  నిజంగా ఎటువంటి అనారోగ్యం ఉన్న స్త్రీ పరిస్థితి అయినా, సరైన కుటుంబ ఆదరణ లేకపోతే ఎలా దిగజారుతుందో అనిపిస్తుంది.  

ఆ తరవాత చాప్టర్లలో  'బులీమియా' దాకా వెళ్తుంది. తిండిని పూర్తిగా వదిలేసి, చావు అంచుల్లో యాంగ్ హీ వెళ్ళేసరికీ, ఆమె అక్కయ్యకు కూడా తమ సమాజం మీదా, వాళ్ళకి ఆడ పిల్లల మీదా, స్త్రీల మీదా ఉన్న చులకన భావమూ, మాట విని తీరాలనుకునే తత్వమూ, తమ vulnerabilities ని advantage గా  తీసుకునే వాళ్ళ మీద కోపం, విరక్తీ కలుగుతాయి.  తన 'ఫార్మాట్ ప్రకారం, రూల్స్ ప్రకారం జీవించే' జీవితం మీద విసుగు పుడుతుంది. అక్క చెల్లెళ్ళిద్దరూ జీవితం లో అలా కొట్టుకెళిపోతారు. మధ్య వచ్చే అధ్యాయాలలో వాక్యాల అందం, మనుషుల భావాల, ప్రవర్తనల విచిత్రం - జీవితం తీసుకునే మలుపులు, మనుషుల నిర్ణయాల ప్రభావాలూ నిజంగానే ఆశ్చర్యానికి గురి చేస్తాయి. 


కొరియన్ సంస్కృతి, ఆ ఆహారపు అలవాట్లూ మనకన్నా వేరే పద్ధతిలో ఉన్నా, వారిదీ, మనదీ, ఆ మాటకొస్తే, పురుషాధిక్యత ఉన్న అన్ని సమాజాలలో, స్త్రీ స్థానం, లైంగికత, మానసిక సంఘ్ర్షణ, అనారోగ్యాలు వెనకడుగే వేసుంటాయి.  ఎవరైన తమ జీవితం మీద గ్రిప్ ని సంపాదించారూ అనుకోవడం మిథ్య. సమాజపు చట్రాల కింద పడి, మానసికంగా నలిగిపోయే ఆడ బిడ్డల కథ ఇది.  మతం, సాంప్రదాయాలు తొక్కిపెట్టేసే మనుషులం మనం అందరమూనూ.  ఈ పుస్తకం చదివాకా, స్నేహితులతో దీన్ని గురించి చర్చిస్తాం. ఇలా ఎందుకు - అలా ఎందుకు అని విశ్లేషణలు చేస్తాం. జాలి పడతాం, తిట్టుకుంటాం. ఇల చదివి, అలా వదిలేసే సబ్జక్ట్ కాదు. చాలా రోజులు వెన్నాడుతుంది. 


ఆపకుండా చదివించగలగడం, పాత్రల పట్ల సానుభూతి కలిగించగలగడం, ఎవరెవరు ఎలాంటి ఎలాంటి సందర్భాలలో ఎలా ప్రవర్తిస్తారు అని చెప్పడానికి ప్రయత్నించే పుస్తకం. అందమైన వాక్యాలు, కొన్ని సారులు జుగుప్స కలిగించినా, పాత్రల మానసిక స్థితి ని వ్యక్తపరిచే సన్నివేశాలతో చాలా ఇంటరెస్టింగ్ గా అనిపిస్తుంది. చిన్న పుస్తకమే అయినా, చదివేవారిని షాక్ కి గురి చేస్తుంది.  ఏంటిది "పిచ్చి గా" అనిపిస్తుంది. కానీ, మనకి తెలీని ప్రపంచం అది. కానీ అదీ existence  లోనే ఉంది. చాలా బావుంది. చాలా సినిమాటిక్ గా. కొత్తగా. 

రచయిత్రి హాన్ కాంగ్ కు, ఈ పుస్తకానికి, "మేన్ బుకర్ ఇంటర్నేషనల్ ప్రైజ్" వచ్చింది. 2024 లో ఆమెకు నోబెల్ ప్రైజ్ కూడా వచ్చింది. అనువాదకురాలు డెబోరా స్మిత్, ఉత్తర భారత దేశంలోనే స్థిరపడిందని అన్నారు. వరండాలూ,  అరణ్యాలూ, కొండ వాలుల్లో చెట్లూ,  పూలూ, లతలూ, వర్షాలూ, రోడ్లను అందంగా వర్ణించి. పుస్తకానికో కవితాత్మక సౌందర్యాన్ని తేవడంలో ఆవిడ కృషి తెలుస్తూ ఉంటుంది. మంచి పుస్తకం. 

***



28/05/2026

Shiva to Shankara - Devdutt Pattanaik




మా చిన్నప్పుడు పిల్లలకి కాలక్షేపానికి తోటల్లో, వీధుల్లో ఆటలూ, పుస్తకాలు చదువుకోవడమూ తప్ప వేరే సాధనాలేవీ లేని కాలానిది ఈ మాట. తిరుమల తిరుపతి దేవస్థానం, ధర్మ ప్రచార పరిషత్ వాళ్ళు పిల్లలు చదువుకునేందుకు అనుగుణంగా చిన్న చిన్న పోకెట్ పుస్తకాలు ప్రచురించే వారు. ఆ పుస్తకాలలో, ఒకో దేవీ దేవతలు, మహనీయులు, పురాణ కథలు, గురువుల గురించి ఆసక్తి కరమైన కథలుండేవి. వాతిల్లో సతి నాకు చాలా ఇష్టమైన కథ. సతిని పరమ శివుడు అత్యంత గాఢంగా ప్రేమిస్తాడు. అమ్మ చుట్టూ తిరిగే పసి వాడిలా ఆమె చుట్టూ తిరుగుతూ ఉంటాడు. తన సర్వస్వమూ ఆమెదే. ఆమె జూకాలు, గొలుసు పేటలు, పమిటంచులూ, గాలికి చెదిరే జుత్తూ... పల్చని పాదాలూ, అన్నీ అబ్బురమే ఆయనకు. అలాంటిది, సతీ వియోగం తో రుద్రుడై, తరవాత అన్నీ వొదులుకుని, ఆమె శవాన్ని భుజాన వేసుకుని గడ్డ కట్టిన శోకంతో, విరాగిలా తిరుగుతుంటాడు. ఆయనని మళ్ళీ పెళ్ళాడిన పార్వతి, తిరిగి అంతటి ప్రేమని పొందిందా అని అనుమానం కలుగుతుంది. కానీ ఘనీభవించిన శివుడిని, అతని తపశ్శక్తిని, ఆమె జీవ శక్తి గా మారుస్తుంది. అమ్మ వారు, అయ్య వారూ సృష్టికి అవసరం. జీవానికి, అమరత్వానికీ,  వినాశనానికీ, వారే ఆధారం.  సతి, శివుడి తొలిప్రేమ. అసలు హిందూ ధర్మం లో మహా దేవి, శివుడు, వారి వారి భిన్న రూపాలు, వాటి వెనకున్న కథలు, వీటన్నిటి గురించి దేవదత్ పట్నాయక్ రాసిన పుస్తకం "Shiva to Shankara : Giving Form to the Formless",


లింగాకారంలో పూజలందుకుంటుండే శివుడి ఆకారం ఏమిటి ? అసలెందుకు ఈ లింగాకారం? కాలంతో మాటు మారుతూండే ధర్మం, హిందూ మతానికి ఉన్న లక్షణం. ఒకప్పుడు వేద పఠనం, యజ్ఞ యాగాదులే కొమ్ము గా ఉండే మతం, ఎందరో దేవుళ్ళని ఆరాధించే ధర్మమూ మారి, అరణ్యాలలో తిరుగాడుతూ జీవనం గడుపుకునే జనం, వ్యవసాయం చేస్తూ, మైదానాలలో స్థిర  పడినపుడు మారింది. వేలాది దేవుళ్ళ బదులు ఒకే శక్తి వంతమైన దైవారాధాన మొదలయింది. కొందరు విష్ణువునూ, కొందరు శివుడినీ, మరి కొందరు శక్తి నీ ఆరాధించడం మొదలయింది. వీటిల్లో పోటీలు, తమ తమ దేవుళ్ళే గొప్ప అని పోట్లాడుకునే తత్వమూ మొదలయాయి. ఒక్కో మతమూ, ఒక్కో దేవుడిని ఆరాధించాయి. వేద కాలంలో శివుడు రుద్రుడు. రుద్రుడు భయం కలిగించేవాడు. యజుర్వేదంలో శతరుద్రీయంలో శివుడు పరమ శక్తివంతుడుగా అభివర్ణించబడినా, అతను చాలా ప్రమాదకరమైన వాడు గా కూడా చెప్పబడ్డాడు. బ్రాహ్మణాలలో, 'అతని పేరే తలవకూడదు సుమా!' అని కూడా ఉంది. అతనో బయటి దేవుడు. యజ్ఞాలలో మిగులూ తగులూ మాత్రమే నివేదన చేయదగ్గ దేవుడు. వీటన్నిటి వల్ల, వేదకాలాల మునుపటి జ్ఞానం వల్లా, శివుడసలు వేదాల దేవుడే కాదు. అతనో ఆటవికుడు. దక్షిణాది వ్యవసాయ కుటుంబాలకు చెందిన ద్రవిడుడు. ఆర్యుల దేవుడు కాడు. దక్ష యజ్ఞాన్ని వినాశనం చేసి, సతి కాలిన శరీరాన్ని భుజాన వేసుకుని వెళ్ళిన శివుడు,  మొదటి సారి వైదికులలో గౌరవాన్ని సంపాదించుకున్న అనార్యుడు.  


కాలక్రమేణా బౌద్ధం, జైన మతం వగైరా మతాలు ప్రజాదరణ పొందడం మొదలయాక, దేవుడు యజ్ఞ శాలలని వీడి ఒక ఆకారాన్ని పొంది, ప్రజలకు దగ్గరగా, సామాన్యులకు అర్ధమయే పూజా విధానాలు కనిపెట్టబడడం ద్వారా  మెల్లగా విశిష్టత ను సంపాదించుకున్నాడు. వేద పురాణేతిహాసాలు సామాన్య ప్రజలకు, పామరులకు చేరాయి. కొందరు శివుడిని 'బ్రాహ్మణుడినే' చేసారు. ప్రజలు అబ్బురపడే కథలు, లీలలు ప్రచారంలోకి వచ్చాయి. ఎవరికి ఎలా అర్ధమైతే అలా శివుడు రూపాంతరం చెందాడు. 


చాలా వరకూ వియోగి, ఏమీ అక్కర్లేని వాడూ కావడాన, భక్త సులభుడయాడు. ఎక్కువ శ్రమ పడకుండానే భక్తులను అనుగ్రహిస్తాడు. విష్ణుడి లా ప్రాపంచిక భోగాలవసరం లేదు. పూలూ, వెన్నలూ, పాలు తేనెలూ అవసరం లేనివాడు. ఇవన్నీ శివుడి లక్షణాలు. ఏది మంచి, ఏది చెడు, ఎవరు స్త్రీ, ఎవరు పురుషుడు, ఏది అందమైనది, ఏది అందవిహీనమైనదీ కూడా తెలీని భోలా శంకరుడు. అతంకి నీ ఆత్మ శుద్ధి చాలు. ఆ ఆత్మ తొడుక్కున్న దేహం పాపిదా, పుణ్యాత్ముడిదా, రాక్షసుడిదా, రాజుదా, స్త్రీ దా, పురుషుడిదా, అని చూడని వాడు. నిరాకార స్వరూపుడు ఆయన. మరి ఈ పురుషాంగ ఆకారం దేనికి, అదీ యోనిలోంచి చొచ్చుకొచ్చి, ఆకాశాన్ని ఊర్ధ్వ ముఖంగా చూసే ఈ లింగాకారం వెనకున్న రహస్యం ఏమిటి ? లింగ పూజ అనాదితనం ఏమిటి ? ఒక హిందువు ఎటువంటి సిగ్గుకూ లోనవకుండా ఈ లింగానికి పూజ చేయడం వెనక ఉన్న తత్వం ఏమిటి అని అందరికీ ఒక అనుమానం ఉంటుంది. 

దానికి సమాధానం చెప్పేందుకు ఈ పుస్తకం కొద్దో గొప్పో ప్రయత్నిస్తుంది. లింగ పురాణం, తమిళ జానపదాలు, హిమాలయ జానపద గాధలు, రక రకాల ఉపనిషత్తులూ, భాగవత పురాణం, బసవ పురాణం, రామాయణం, మహా భారతం, శివ పురాణం, బ్రహ్మాండ పురాణం, నవనాథ చరిత్ర, కాశీ స్థల పురాణం, స్కంద పురాణం, కాళికా పురాణం, నారద పురాణం నుండి వివిధ కథల్ని ఎంచుకుని దాని నుంచి శివ పార్వతుల కథ ని చెప్తూ, ఒకరిని విడిచి ఒకరికి అర్ధం లేని ఈ జంట ఉనికి గురించి వివరిస్తుంది. గంగ ని తలపై మోసేందుకు, నీల కంఠుడి గా గరళాన్ని గొంతులోనే అదిమి పట్టేందుకు, సంసారాన్ని అసలు పట్టించుకోని స్థితి నుండి, ఎప్పుడూ 'సత్ చిత్ ఆనందం' కోసం తీవ్ర సాధనలో తపస్సు లో ఉండే యోగి గా జీవించే రుద్రుడు, శివ స్థితి నుండి, అమ్మవారి అండ వల్ల ఇలా భక్తులను కరుణించే సృష్టి కి, తపశ్శక్తికీ, జ్ఞాన వైరాగ్యాలకూ, ఆది అంతాలకూ మూలమై, గురువై, తండ్రి అయి, శంకరుడిగా ఎలా రూపాంతరం చెందాడో వివరిస్తుంది.  


పరమశివుడి రూపం, అతని తపో శక్తి, బీజం, నాడి, పరమాత్మ తత్వం, సృష్టి, స్థితి, లయ కారకత్వాలు, కామం, క్రోధమూ, ప్రాణ శక్తి, యోగాల గురించి వివరించే ప్రయత్నం చేస్తుంది. శివుడి లింగాకారం, దాని వెనక సాంప్రదాయ వాదుల కథలకూ, జానపద గాధలకు, తంత్ర సాధకులు చెప్పే కథలు, ఉపనిషద్, పురాణాలలో వ్యాప్తిలో కథలకూ ఉన్న తేడాలూ, సామ్యాలూ తెలుసుకోవచ్చు. ఇంకా వివరాలు రాయవచ్చునేమో గానీ ఈ పుక్కిటి పురాణాలు, బొత్తిగా జడుడైపోయి, తన చుట్టూ ఉన్న సంసారాన్నీ, జీవాన్నీ పట్టించుకోని స్థితి నుండీ బయల్దేరి వచ్చిన ఆయన లో తరాలుగా నిక్షిప్తమైన బీజ శక్తి నీ, ప్రాణం పోసే శక్తినీ తట్టి లేపే అమ్మ వారి సాంగత్యంవల్లనే సాధ్యమైనదనే చెప్తాయి. కాబట్టి అతని రూపం లేదా ఆకారం జీవ శక్తికీ, ప్రాణ శక్తికీ ప్రతీకలు. 


ఎప్పటికీ దేనికీ అంతం ఉండదు, నదిలో నీరెలా నిశ్చలమైనది కాదో, లోకంలో దేనికీ శాశ్వతత్వం ఉండదు. సృష్టి, దాని వినాశనం, పునః సృష్టీ, నిరంతరం జరుగుతూనే ఉంటాయి. ఈ పునఃసృష్టి కి, ఆ నిరంతర శక్తి ప్రవాహానికి శివుడు ఆధారం. ఆయన కేవలం లయ కారుడేమీ కాదు. చంద్రుడికి జవ సత్వాలు ప్రతిరోజూ ఇస్తూనే వస్తున్నవాడు. యుద్ధాలలో అస్త్రాలకు కూడా ఆయనే మూలాధారం.  ఒక సారి శివుడి కథనీ, ఆయన పిల్లల కథలనీ, అమ్మ వారి కథల్నీ, వాళ్ళ ప్రేమ పాశాలనీ, వాళ్ళ చుట్టూ అల్లుకున్న జానపద కథల్నీ, ఇంకోసారి చదువుకునేందుకు బావుంది ఈ పుస్తకం. 



2017 లో మొదట ఈ పుస్తకాన్ని  ప్రచురించారు. ఇపుడు మాత్రం హార్పర్ కాలిన్స్ వాళ్ళు ఒక సెట్ లో Indian Wisdom గా  అమ్ముతున్నారు.   ఇందులో ఉన్న మిగిలిన పుస్తకాలు కూడా మెల్లగా పరిచయం చేస్తాను. మొత్తానికి ఈరోజు అంతా నాస్టాల్జిక్ గా గడిచిపోయింది. చిన్నప్పుడు దేవీ భాగవతం / రామాయణ భారతాలు, భాగవత పురాణం లాంటి పుస్తకాలూ, శంకర్ బొమ్మలతో రామకృష్ణ ప్రభ వాళ్ళు ప్రచురించిన రక రకాల బొమ్మల కథలనూ చదువుకున్న బాల్యం మన తరానిది. ఈ కొత్త తరం పిల్లలకి దేవదత్తుడే దిక్కు. 

***