Pages

22/01/2023

The Living Mountain - Amitav Ghosh


ఇది అమితవ్ ఘోష్ రాసిన ఒక చిన్న కథ. చాలా చిన్న పుస్తకమే. గంట లో ఊదిపారేయొచ్చు. కానీ ఇది మన మనసుమీద చూపించాల్సిన ప్రభావం మాత్రం బహుశా జీవితకాలమూ ఉంటుంది. 


దేవాంగనా ఘోష్ అందమయిన బొమ్మలతో ఈ పుస్తకాన్ని నింపేసారు. చిన్న పిల్లల పుస్తకం చదువుతున్నట్టుంటుంది. కానీ ఇది పెద్దవాళ్ళమయి, మన తరవాత రాబోయే తరాలకి ఈ భూమి మీద జీవికనేదేదీ మిగల్చకుండా, అత్యాశకు పోయి  భూమి మీదున్న అన్ని శక్తులనూ, వనరులనూ, గాలినీ, చెట్టు చేమలనూ, ఆఖరికి పర్వతాలనూ విచక్షణా రహితంగా చెరిచి, చంపి, చెరపట్టి, సర్వనాశనం చేసే మనందరికోసమూ రాసిన కథ. 

ఒక చిన్న పిల్ల కథ చెప్తుంటుంది.   హిమాలయల్లో ఒకానొక ప్రాంతంలో ఒక లోయప్రాంతపు ఊరికవతల, ఒక 'బతికున్న' మంచుపర్వతం ఉంటుంది. దాని శిఖరం మేఘాల్లో మునిగిపోయి ఎప్పుడూ స్పష్టంగా కనిపించదు.   అక్కడ చాలా పర్వతాలే ఉన్నాయిగా.  ఈ పర్వతాన్ని అక్కడివాళ్ళు "మహాపర్వతం" అని పిలుస్తారు. అది వారికి అత్యంత పవిత్రమైన పర్వతం, పూజలందుకుంటూండే ఓ సాంస్కృతిక చిహ్నం. 




హిమాలయ శ్రేణులన్నిట్లోనూ,  దాదాపు అన్ని పర్వతాలూ,   కొన్ని స్థానికాచారాల ప్రకారం, సాక్షాత్తూ భగవత్స్వరూపాలే. హిమాలయాల్లో చాలా పవిత్ర నదులు, తటాకాలూ,  అక్కడ మాత్రమే కనిపించే అరుదైన వృక్షరాశులూ,  వాటిక్కాసే మహిమ గల  పళ్ళూ.. ఒక్కటేంటి, అన్నీ ఆయా  ప్రాంతవాసుల (మూఢ) నమ్మకాల ప్రకారం గొప్పవి. ఈ మూఢ నమ్మకాలు పర్వతాలనీ, వాటి మీద ఆధారపడుతూండే మనుషుల్నీ కొన్నేళ్ళ పాటూ రక్షించాయనే చెప్పొచ్చు. పవిత్రమని స్థానికులంటే నవ్వి పోయే పర్యాటకులు ఉండే కాలం ఇది. ఆయా పవిత్ర స్థలాల్ని ఫోటోల కోసం దర్శించేసాకా, చెత్త తో నింపెళ్ళే నాగరిక పర్యాటకులం మనం. 

సరే ! మళ్ళీ కథ లోకొస్తే,  ఈ "మూఢ" విశ్వాసాల పరంగా చూస్తే వీళ్ళ ఊర్లో పూర్వీకులందరూ, ఈ పర్వతానికి 'ప్రాణం' ఉందనీ, ఈ పర్వతమే ఊర్నీ, ఆ ప్రాంతాన్నీ తరతరాలుగా రక్షిస్తూ వచ్చిందనీ, నూరిపోస్తారు.  ఆ పవిత్రత కారణంగా ఆ పర్వతంపై ఎవ్వరూ పాదం మోపనే కూడదు అని ఒక ఆంక్ష కూడా తరతరాలుగానే ఉందక్కడ.  

అందరూ ఆ పూర్వీకుల మీద గౌరవంతో పర్వతాన్ని కంటికి రెప్పలా కాపాడుకునేవారు. ఆ పర్వతం మీదనుండీ కిందికి ప్రవహించే ఓ సెలయేటి పక్కన ఒక "మేజిక్" చెట్టు కూడా వుంది. అది ఆ లోయలో తప్ప ఎక్కడా లేదు. ఆ చెట్టు అక్షయంగా చెక్క  ఇచ్చేది. దాని వేళ్ళకు అత్యంత రుచికరమైన పుట్టగొడుగులు మొలిచేవి. ఆ చెట్టుకు పూసిన పువ్వుల్లో అత్యంత మధురమైన తేనె వుండేది. ఆ చెట్టునుండీ వచ్చే సుగంధం తో పోల్చదగిన సుగంధం ఎక్కడా లేదు. పైగా ఆ చెట్టుకు ఔషధ లక్షణాలుండేవి.  

లోయలో ప్రజలు మిగతా ఏ విషయాల్లో కొట్టుకు చచ్చినా మహాపర్వతాన్నిరక్షించుకోవడానికి  ఈ ప్రాంతాలకి కొత్త వారిని అస్సలు రాకుండా కట్టడి చెయడంలో ఐకమత్యం పాటించేవారు. ఎవరైనా  ఈ ప్రాంతాల్లో ఏదైనా వెతుకుతూ వచ్చినా, వారిని కాపలా దార్లు ఆపేసే వారు. లోయనీ 'మహా పర్వతాన్నీ' చెడ్డవారి దృష్టి తాకకుండా కాపాడుకునేవారు.

ఏడాదికోమారు మంచు కురవడం తగ్గాక, లోయ దిగువున, ఓ వారం పాటూ సంత జరిగేది. ఈ లోయ గ్రామాల పెద్దలు మాత్రం అక్కడికి వెళ్ళి, దిగువ ప్రాంతాలవారికి కావల్సినవి అమ్మి, వీరికి కావలసిన వస్తువులు వాళ్ళ దగ్గర కొనుక్కునేవారు. 
 లోయలో ఉత్పత్తయిన అత్భుతమైన తేనె, వన మూలికలూ, ఇక్కడి పంటలూ, అవీ ఆ సంత జరిగే వారమంతా అమ్మి, లోయకి సంబంధించని కొనుగోలుదార్లూ, కొత్తవాళ్ళందరూ ఆ ప్రాంతం వదిలి వెళ్ళాక, మళ్ళీ లోయ రక్షణ బాధ్యతల్ని కాపలాదార్లకప్పగించి, లోయని సీల్ చేసేసుకుని మళ్ళీ వెనక్కి వచ్చేసేవారు. ఇలా తరాల పాటు జరిగింది. 

లోయలో బ్రతకడం కష్టమే.  తిండి కోసం చాలానే కష్టపడవలసి వచ్చేది. పండించే పని లేనన్నాళ్ళూ, పోట్లాటలతో కాలక్షేపం జరిగేది. అయితేనేం. అందరూ తృప్తిగానే బ్రతికేవారు. పదే పదే అదే తృప్తితో, ఆ మహా పర్వతం గురించిన పాటలవీ పాడుకుంటూ, నృత్యాలు చేసుకుంటూ,  ఉండేవారు.  అక్కడి ఆచారం ప్రకారం,  ఎక్కువగా ఆడవాళ్ళే నృత్యాలు చేసేవారు. మగవాళ్ళు రాజ్యం చేసేవారు. ఆడవారి పాదాల గుండానే ఆ పర్వతపు గుండె చప్పుడు వినిపించేది. ఏతావాతా, పర్వతం చెప్పేఊసులన్నీ వినగలిగేది ఆడవారే.  పాలించడానికి కాస్తో కూస్తో కర్కశత్వం కావాలి కాబట్టి మగవాళ్ళు ఆ పని చేసేవారు.  ఆడవారి మెదడుకి, మనసుకీ గౌరవం ఇచ్చేవారు. అలా జీవితం సాగిపోతూ ఉండేది. 




బాగా నర్తించే ఆడవారి పట్ల అందరికీ అసూయగా ఉండేది. ఆ పాటలూ, నాట్యాల సంబరాల్లో ఆడవారు ట్రాన్స్ లోకి వెళ్ళిపోయి, 'మహా పర్వతాన్ని'   ఫీల్ అయేవారు. వారి ద్వారానే మహాపర్వతం తమతో communicate చేస్తుందని నమ్మకం.  అందుకు.  ఈ నాట్యకత్తెలు తమ చెవుల్ని భూమికి ఆనించి ఆ పర్వతపు సందేశాలను వినేవారు.  అలా వీరే ఆ పర్వతానికి చెవులూ, నోరూనూ. చూశారా వీళ్ళ శక్తి?!

ఇలా సాగుతూన్న జీవితంలో ఒక ఉపద్రవం వస్తుంది. సంత జరిగిన వారంలో ఒక సారి మాత్రం ఒక కొత్తవాడు లోయ లో అత్భుతాల మీద ఎనలేని ఆసక్తిని వ్యక్తపరిచాడు.  మృదు మర్యాద పూర్వక సంభాషణల్తో ఊరి పెద్దల్ని ఎలాగో ఒప్పించి, రక్షణ వలయంలో ఉంటున్న ఈ ప్రాంతాల్లోకి అడుగు పెట్టేసి, లోయ లో గ్రామాల్ని, ముఖ్యంగా ఈ మహా పర్వతాన్నీ  కళ్ళారా చూసేసేడు.  ఊరి వారి నమ్మకాల్నీ, పర్వతంలో కల్పతరువులాంటి వృక్షాల గొప్పతనాల్నీ చెవులారా వింటాడు. ఉన్నన్నాళ్ళూ స్నేహంగానే వుండి,  తిరిగెళ్ళి, లోయ మీద దండెత్తే పెద్ద దళాన్ని తెస్తాడు. ఈ కాలకేయులకీ ఓ పేరుంది. 

మహాపర్వతం లో బోల్డన్ని నిధులున్నాయని, దాన్ని గౌరవం పేరుతో, పవిత్రత పేరుతో "మూఢ"నమ్మకాల్తో అలా గాలికొదిలేయడం మంచిది కాదనీ వాదిస్తారు ఈ దళం వాళ్ళు. . పైగా ప్రాకృతిక వనరుల మీద అందరి "హక్కూ" ఉంటుందని, లోయ వాళ్ళది మాత్రమే కాదనీ, 'సార్వజనీనతా' వాదం తెస్తారు. గొడవలూ, యుద్ధాలూ, అయ్యాక, లోయ వాళ్ళని కొందరిని కూలీలుగా వాడుకుంటూ, ఏవో తవ్వుకుపోదామని పర్వతాధిరోహణం చేస్తారు.  

ఈ పరిణామాల్తో లోయలో ప్రజలు విడిపోతారు. అంతవరకూ ఉన్న శాంతంతా పోతుంది. పర్వతం మీద పాదమన్నా మోపని వారు, "సార్వజనీనతా వాదం" ప్రకారమూ, వారి తరాల నాటి నమ్మకాలు  "మూఢ" నమ్మకాలు మాత్రమే లెమ్మని ఈ బలమైన కొత్త వారు కొట్టి పారేయడం వల్లనానూ,  పర్వతం ఎక్కడం మొదలెడతారు. 

ఆఖరికి తీవ్ర సంఘర్షణా, జీవితం నేర్పే పాఠాలూ, మనుషులు ఒకర్నొకరు నమ్మడంలో, ద్రోహం చేసుకోవడంలో, శారీరక మానసిక సామాజిక దౌర్బల్యాలతో గెలవడమూ, ఓడటాల్లో చాలా కోణాల్ని చూసినతరవాత, హృదయం కొట్టుకుంటూండే, ఆ "బ్రతికున్న పర్వతం" తన పై జరుగుతున్న దాడిని సహించినంత సేపు సహించి, కోపం వచ్చి ఒక్క సారి గర్జిస్తుంది. అంతే. 

ఇదంతా ఒక చిన్న ప్రాంతపు జానపద కధ కాదు. ఇది మనందరి కథా. అభివృద్ధి పేరిట, పర్వతాల ఎకొలాజికల్ సిస్టం ను తోసిరాజని విపరీతంగా భారీ నిర్మాణాలు, ప్రాజెక్టులూ కట్టేస్తూ, హిమాలయాల్ని సర్వనాశనం చేసేసుకుంటున్న మనుషుల కథ ఇది. ఈ రోజున జోషీమఠ్ లాంటి ముఖ్య నగరమూ, రేప్పొద్దున్న కొండల నిండా ఎడాపెడా కట్టేసిన నిర్మాణాల బరువుకు కుంగిపోనున్న షింలా (Shimla) లాంటి చారిత్రక నగరమూ, ఇలా ఇవన్నీ గొంతు చించుకుని చెప్పే కథే ఇది. ఈ "లివింగ్ మౌంటెన్".   అమితవ్ ఘోష్, పతంజలి శాస్త్రి లలాగా పర్యావరణాన్ని గురించి రాసే రచయితలు చాలా తక్కువ. వీళ్ళు చెప్పేదికూడా తక్కువే. కానీ ఈ కథలను  మనం మన పిల్లల కోసమన్నా వినాలి.  

కధని చాలా మంది చదవరు/లేరు కనుక "పైపైన" చెప్పేయడం జరిగింది. ఇది ఎవరికీ తెలీని కథ కాదు. అందరూ తెలుసుకోవాల్సినది కూడా ఎంతో కొంత ఉంది. ఈ కథ లో కొన్ని గ్రూపులకి కొన్ని 'పేరు'లున్నాయి. అక్కడ కాపలా వారికీ, దండెత్తి వచ్చినవారికీ, పాటలు పాడేవారికీ, నాట్యం చేసేవారికీ.. ఇలా. వాటిని నిజ జీవితాలతో అన్వయించుకునే ప్రయత్నం చేయవచ్చు. అంతవరకూ ప్రశాంతంగా పర్వతం పై గౌరవంతో మాత్రమే పెరిగిన, బ్రతుకుతూన్న ప్రజలు ఎంత తొందరగా కొత్త (destructive) వాదాలకు ఆకర్షితులయిపోతారో.  అలాగే చేతులు కాలాక పట్టుకునేందుకు ఆకులు దొరక్క ఎలా తల్లడిల్లుతారో అదీ చూడొచ్చు. ఎన్ని జీవరాశులనో నాశనం చేసేస్తూ, ఆఖరికి అభివృద్ధీ, సుఖాల పేరిట తన గోతిని తానే తవ్వుకునే మానవుడి కథ ఇది. చదవండి. 

***



No comments:

Post a Comment

వ్యాఖ్యానించినందుకు చాలా చాలా థాంక్స్.