Pages

08/03/2023

బహుళ - అట్టాడ అప్పల్నాయుడు




కొన్నిపుస్తకాలు చదవడానికి రాసిపెట్టుండాలి. పుస్తకం గురించి అస్సలేమీ తెలీనప్పుడు, రచయిత ప్రసిద్ధులే కాబట్టి పేరు వినడమే తప్ప ఆయన రచనా చదవక పోవడమూ వంటి అజ్ఞానంలో ఉండిపోయినప్పుడు, నాలుగొందలకు పైగా పేజీలున్న పుస్తకాన్ని పోస్ట్ చేసి, చదవమని చేతిలో పెట్టిన  నేస్తానికి  వేలాది  థాంకులు.   [బావిలో కప్పలా ఉండిపోతున్నానని కొత్త కొత్త రచయితల్ని పరిచయం చేస్తూ, ఫలానాది బావుంది, చదవమని చెప్పి ; నేను బద్ధకిస్తే, పుస్తకాలు ఇచ్చి,  "చదివావా?", "మొదలు పెట్టావా?" - అని వెంటబడే నేస్తాలూ ఉన్నందుకు జీవితం ధన్యం అని చెప్పుకోవచ్చు]   ముఖ్యంగా ఈ పుస్తకం ఎక్కడా అమ్మకానికి అందుబాటులో లేనపుడు, అండర్ లైన్లు చేసి, పేరాలు మార్క్ చేసుకునున్న సొంత కాపీని ఇచ్చినందుకు, అంత ప్రేమించిన రచననని నా చేత చదివించాలని అనుకున్నందుకు,  సృజనా - చాలా థాంక్స్. I cherished reading this book. 

ముందుమాటలు ఠారెత్తించి, రచనను టాల్ స్టాయ్ రచనతో పోల్చి, అంచనాలను పెంచేస్తున్నప్పుడు ఒక హెచ్చరిక కూడా వినిపించింది. నిజానికి ఇది కాస్త స్వీయ జీవిత అనుభవం / ఆటో బయాగ్రాఫికల్  ఫిక్షన్  కాబట్టి తనకెంతో ఇష్టమైన "కవితాత్మక శైలి, సునిశి వ్యంగ్య మిళితమైన క్రుద్ధ వచనం, హాస్య చతురత.. నవలలో ఒకటి రెండు సందర్భాలలో మాత్రమే మెరుపులా మెరిసిపోతాయనీ, పైపెచ్చు ఇదీ అని చెప్పలేని విషాద గంభీర స్వరం నవల పొడుగునా కనిపిస్తుందని," .కె.ప్రభాకర్ గారు రాసారుఅంటే, రచయిత తన సహజ శైలిని, రచనలో ఉబికొచ్చే కొన్ని వరదల్నీ, జ్వరాలనీ, కంట్రోల్ చేసుకుంటూ ఒక కథని చెప్తున్నారని కదా అర్ధం.  ముందుమాట చదివే - 'ఇగ ఈ రచయిత ఇతర రచనలని కూడా చదవాలి సుమా' అనిపించింది. 

 

ఒకప్పుడు వెనకబడిన ప్రాంతాలలో, అణిచివేత ఎక్కువ ఉన్న ప్రాంతాలలోనూ, కొన్ని వర్గాలలో ఎగిసిన సామాజిక చైతన్యం, అసమానతల పట్ల వ్యతిరేకత, రాజకీయాలూ, పల్లెల్లో యజమానులకూ, పనివారికీ మధ్య అనుబంధమూ, శ్రీకాకుళ ఉద్యమం, ఉద్యమకారుల ఎదురీతలూ, త్యాగాలూ, ప్రేమలూ, వాళ్ళ జీవితం, వాళ్ళ ఆదర్శాలూ ఎలా ఉండేవి అనే విషయాలకు పెద్ద నవల సాక్షం.  

 

'బహుళ', పేరుకు తగ్గట్టు గానే, బహుళ అంశాలను స్పృశిస్తుంది. బహుళంగా మనుషులూ, పాత్రలూ, తరాలూ, కాలాలూ సజీవంగా కదులుతూ వెళ్తుంటారు. అయితే, ఇంత పెద్ద సినిమా లాంటి నవలలో ఎక్కడా తికమక పెట్టకుండా, ముందు వెనకలకి వెళ్ళిపోకుండా, ఎక్కడ ఏమి జరిగి ఉంటుందా అని పాఠకుడు తల బద్దలు కొట్టుకుని, ఆలోచించుకోనక్కర్లేకుండా, మనుషులు వచ్చి, తమ తమ కథల్ని చదివించేసి, జరిగిపోతూ ఉంటారు. ఒక తరం తరవాత ఇంకో తరం ముందుకొస్తుంది. గడిచిపోయిన పాత్రల పట్ల, తమ తాత తండ్రుల పట్లా, గౌరవాభిమానాలతో పాత్రలు వర్తమానం లో బ్రతుకుతుంటాయి .  

 

అయితే గతం చెప్తూనే కాలమాన పరిస్థితుల్నీ, రాజకీయాలనీ పరిచయం చెయ్యడం, నవల సాధించిన విజయం. ఇంతేసి మంది మనుషులు, ఒకరికొకరు చుట్టాలు, బంధువులు, స్నేహితులువివిధ కులాల వారు, వివిధ (రాజకీయ) వర్గాల వాళ్ళూ, వీరందరి మనసుల్లో ఆలోచనలు, 'ఎవరు' , 'ఎందుకు',  'ఎప్పుడు', 'ఎలా' స్పందిస్తారు అని కూడా విడమరిచి రాసి, రక రకాల వ్యక్తిత్వాలని పరిచయం చేస్తారు

కథ లో విస్తృత శ్రేణి లో బోల్డన్ని పాత్రలు, వాటి మధ్య  సమన్వయం చాలా బావుంది. చివరికొచ్చీసరికి కొంచెం బోరు కొట్టింది. అంతవరకూ పల్లెటూరి ప్యూరిటీ చదివీ చదివీ ఆధునిక పోకడల్లో కొత్త తరం పరిచయం అయి, వాళ్ళ ఇంగ్లీషు + తెలుగు సంభాషణలు చదివి, అస్సలు 'ఇదినచ్చలేదు. దానికి కారణం, నేను అంతకు ముందుదాకా,  మూడు తరాల గురించి "అచ్చ తెలుగులో" చదవడం వల్ల కాబోలు!   మెల్లిగా కొత్త పాత్రలు కూడా పూర్వీకపు వాసనకు అతుక్కుని, స్వచ్చపడతాయి. అప్ప్పుడు "హమ్మయ్య!" అనిపిస్తుంది

 పాత్రలు బోలెడు అన్నాము కదా. వీరిలో సమాజానికి మంచి చేద్దామని రాజకీయాల్లోకి వచ్చి, సొంత డబ్బులు ఇచ్చి, ఊర్ని అభివృద్ధి చేసి, కుటుంబ బాధ్యతల విషయంలో దెబ్బతిని, రాజకీయాల్లోంచీ ఉపసంహరించుకున్న మంచి వాళ్ళ దగ్గర నుంచీ,    తను అప్పులిచ్చి, వసూలు చేసుకొచ్చే క్రమంలో ఊరంతా క్షామంలోకి,బీదరికంలోకీ కూరుకుని పోవడానికి కారణం అయ్యే వ్యాపారి వరకూ ఉంటారుఅమ్మలూ, అత్తయ్యలూ, పెద్దమ్మలూ, లోతైన మనసుల ఆడవాళ్ళు - మన కథలకి అవసరమైన వాళ్ళందరూ సరదాగా, బాధగా, ఓర్పుగా, బేలగా, ధైర్యంగా, చాలా బోలెడు స్త్రీలు కథ కూడా స్త్రీ పాత్ర తోనే అల్లుకుని, ఆమెతోనే ముగుస్తుంది

కథ కు వచ్చేసరికీ హీరో "పెదనారాయుడుఒకె లెజెండ్. జముకుల పాటగాళ్ళ ప్రదర్శనల్లో, జానపదుల కళల్లో ప్రజలు దేవుళ్ళా ఆరాధించుకునే ఒక నాయకుడు. తెల్లదొరల పాలనలో, జమీందారులు ప్రజలను పీడించుకుని తినే రోజుల్లో, ఒక పెద్ద రైతు ఇంట పుట్టి, తండ్రికి చేదోడు వాదోడుగా వ్యవసాయంలో సాయం చేస్తూ, క్రమంగా అన్యాయాలను ఎదురిస్తూ, తన బుద్ధి, భుజ బలాలతో, మంచితనంతో, ధైర్యంతో విప్లవాత్మక ఆలోచనల్తో, ప్రజలు ఆరాధించే రూపమవుతాడు. బలహీనుల పక్షాన నిలబడి, బలవంతులకి కన్నెర్ర అయిన హీరో ఒక తుఫాను రాత్రి, ఎవరు చంపారో, ఎలా జరిగిందో తెలీని విధంగా, పెద నారాయుడి శవం "ఊరి ముందరి పందెపుతోట మధ్యలో అంటు మామిడి కొమ్మకు వేలాడుతూ కనిపిస్తుంది. అతని రెండు చేతులూ  విరిగిపోయాయి. కనుగుడ్లు లేవు. శరీరమంతా నెత్తుటి మరకలు."

అమాయక గ్రామీణులు హత్య కు ఎలా  స్పందించారు ?  "పెదనారాయుడి అస్తికలను ఒక సమాధి లో పెట్టుకుని పూజించుకున్నారు. సమాధి  దగ్గర ప్రతి యేటా తిరునాళ్ళు జరుగుతున్నాయి. ఆయన్ను దేవుడి గా భావించుకున్నారు. మొక్కులు మొక్కుకోవడం, పిల్లలకు ఆయన పేరులు పెట్టుకోవడం, ఆయన కథ ను బోనెల పాట గాను, ఒగ్గు పాటగానూ, బుర్ర కథ గానూ పాడుకుంటుంటారు".   ఆయన వంశస్తుడే కథకుడు.

కురుపాం జమీ గ్రామాల్లో, బహుశా భూమి అంతా జమీందారుదేరైతులకు వ్యవసాయం చేసుకునేందుకు భూమి కావాలి కద.   Land ownership ఆ రోజుల్లో  ఎలా వుండేదో చూడండి. 

కురుపాం జమీగ్రామాల్లో, అలనాటి రోజుల్లో, భూమి కోసం రైతులు జమీందారీ ఉద్యోగుల చుట్టూ తిరుగాడేవారు. ఎవరెక్కువ శిస్తు చెల్లిస్తే వారికి ఎక్కువ భూమి మీద  హక్కు దొరికేది.  భూమి హక్కంటే, ఆ రోజుల్లో, శిస్తు చెల్లించి సాగుజేసే హక్కు మాత్రమే ! తెల్ల దొరల పాలనలో సెటిల్ మెంట్ చట్టం ప్రకారం, జమీందార్లకే భూమి మీద హక్కుండేది.  జమీందార్లు తమ జమీ ప్రాంతానికి నిర్ణీత కప్పం తెల్లదొరలకు చెల్లించే వారు. రైతుల నుంచి మాత్రం యేడాదికో ధర నిర్ణయించి శిస్తులూ, దస్తులూ వసూలు జేసుకునే వారు. జమీందార్ల అవసరాలు, విలాసాల బట్టే శిస్తులూ దస్తులూ ఉండేవి. పంటల బట్టి కాదు. 

 

'పెద నారాయుడు' హీరో కాబట్టి, అతని గురించి చదివేటప్పుడల్లా చాలా బావుంటుంది. అతని సాహసాలూ, అమాయకత్వం, అతని పెంపకం, అతని తండ్రి చెప్పిన కథలూ, పాత్రల మధ్య అన్యోన్యత, అనుబంధాలూ.. ఆయన పెళ్ళీ, పిల్లలూ అయింతరవాత కూడా ప్రజా జీవితానికి తన జీవితాన్ని అంకితం ఇచ్చేసిన పెద నారాయుడు చాలా తెలివయిన వాడుఅతన్ని పరీక్షించేందుకు పిల్లనిచ్చిన మామ గారు ఒక తెలివిమాలిన రాజు కథ గురించి చెప్పినప్పుడు పెద నారాయుడి విశ్లేషణ ఎలా ఉంటుందంటే :  రాజు, రాజు పరివారం మీద కోపంతో ఎవరో  కత కల్పించేరుకడుపులో మంట చల్లారడానికి ఆళ్ళని యెగతాళి జేసేరు. గానీ.. రాజు గానీ, రాజు పరివారంగానీ అంత తెలివి మాలినోళ్ళవరు ! దురుమార్గపోళ్ళనండి, కర్కోటకులనండి, వీరులూ, ధీరులూ అనండి. నమ్ముతాను. గానీ తెలివి మాలినోలంటే నమ్మను! తెలివిమాలినోళు సింహాసనమ్మీదెన్నాళ్ళో వుండరండీ ! “  అంటాడు.

పెదనారాయుడి మనవడు చిన్న నారాయుడు, అతని గుండెలో సగభాగం, అతని భార్య బంగారమ్మదీ కథ. వీళ్ళిద్దరి లవ్ స్టోరీయే "బహుళ". ఎన్ని కష్టాలు పడుతుందీ జంట ?!   ఎన్ని నొచ్చుకోళ్ళు ?! విడదీయరాని జంట - విడిపోయిన జంట. బంధం ఎంత దృఢమయినంటే, 'తనని, తన కొడుకునీ వొదలి వెళ్ళడానికి బంగారమ్మ తన ఒంట్లో నరాలెన్ని తెగుంటాయో ! ఎంత కష్టపడుంటుంది!  ఎక్కడుందో, ఎలా ఉందో!!" అని కుమిలిపోకుండా, తనను తలచుకోకుండా, బెంగపడకుండా, బాధపడకుండా  ఒక్క రోజు కూడా జీవించని నారాయుడు భార్యని తల్చుకుంటూనే కన్నుమూయడం ఒక దీన సంఘటన.  అది జరిగిన తరవాత కొన్నేళ్ళకు అతని కొడుకు,  "పెదనారాయడి" జాతరకొస్తే, అతన్ని చూసుకుని చచ్చిపోవడానికి వచ్చిన బంగారమ్మదీ  'బహుళ' కథ

కథలో రాజకీయాలు బ్రతుకు పోరాటానివిఅసలు కుటుంబంలో / ఒకే కులంలో పెళ్ళిళ్ళు ఎందుకు జరిగేవి? ఒక స్త్రీ పాత్ర చెప్తుంది.    "నానా బదవలూ చేసి యకరమో సకరోమో బూమీపుట్టా సంపాదించినారు మన తాత్తండ్రులుజమీందార్ల కిస్తీలు కట్టడానికి మన పెద్దలు కడుపులు కాల్చుకునిఈవఒళ్ళు. ఇంత మడిసెక్క సంపాయించడానికి యెంత కడుపు కాల్చుకున్నారో, యెంత నెత్తురూ, సెమటా ధార బోసేరో మనకి తెల్దుఅలాగ సంపాయించిన మడిసెక్కలు పరాయోళ్ళ పాలబడకండా.. రక్త సంబంధాల మధ్యన పెళ్ళీ పేరంటం చేసీవోళు !" 

కులాల్లో ఎక్కువ తక్కువలు అన్ని ప్రాంతాల్లోనూ ఉన్నాయి. అయితే, కులాలూ, వృత్తులూ ఒకరి మీద ఒకరు విపరీతంగా ఆధారపడేవాళ్ళు. ఆధునికత కమ్ముకుని, వర్షాధార వ్యవసాయం అసమానతలని పెంచేసినప్పుడు, కులవృత్తులు కనుమరుగవుతూ కొన్ని వ్యత్యాసాల్ని ఇంకాస్త ఎక్కువ చేసినప్పుడు, అంట రాని కులాల వారు కూడా చదువుని ఆధారం చేసుకుని పైకొచ్చారు. చదువు తప్ప జీవితపు రక రకాల ఢక్కామొక్కీలనుంచీ కులం వారినైనా తప్పించే వేరే ఏక సాధనం లేదు. ఇలా మెల్లిగా సమాజాల్లో మార్పులు రావడం మొదలవుతుంది. పల్లెల్లో, అగ్ర వర్ణాల వారి పిల్లలు కూడా అంతో ఇంతో కుల వివక్షని ఎదిరించారు. ఇలా మెల్లగా ఊర్లకి ఊర్లు మారాయి. రాజకీయ, సామాజిక చైతన్యం వచ్చింది.

నక్సలిజం, కమ్మ్యూనిజం కొత్త ఊపుని తెచ్చాయి. దేశం కోసం, ప్రజల కోసం, ఎందరో స్త్రీ పురుషులు ఉద్యమం లోకి దూకారు. అన్యాయాల్ని ఎదిరించారు. చాలా బాధలు సహించారు.  బంగారమ్మ కి పుట్టిన, నారాయుడి 'అర్భకుడైన కొడుకు' చదువుకుని,  తన వంతు కష్టాలవీ తానూ అనుభవించి,  జీవితంలో పైకొచ్చి, "అర్బన్" నక్సలైటు అయ్యాడుఇదంతా ఇలా పెదనారాయుడి సంతతి కథనిజానికి ఒక కుటుంబానికి, ఒక హీరోకి, ఒక సమూహానిది అని గిరి గీసేసి వీళ్ళదే కథ అని చెప్పలేము. అలా ఎంతో పెద్ద కథ కాబట్టి పెద్ద నవల సమాజంలో మార్పుల చైన్ రియాక్షన్ గురించి చెప్తుంది కాబట్టి, దీన్ని చదివినప్పుడు నేను చాలా స్వీట్లీ సర్ప్రైస్డ్.

ఉద్యమాలలో మిస్ లీడ్ అయిన వాళ్ళ గురించి కూడా చెప్పకుండా వొదిలిపెట్టలేదు.  ఉద్యమంలో నానా బాధలూ పడి రోడ్డున పడిన ఒక పాత్ర అయితే   "రాజ్యమొచ్చినాక ఇదిగీ పట్నంలోన పెద్దపెద్ద బిల్డింగీలు ఔపడతన్నాయి గదా, ఆట్ని మన పేదల కిచ్చేత్తారట కదా ? మనం యేది కావాలో యెంచుకోడమేనాట కదా ? నిజింగే, ఆ బిల్డింగీలు మన రాజ్జెమొస్తే మనకే ఇత్తారా ? అని అడుగుతుంది.  ఆమెను ఆటపట్టించేదుకు అలా చెప్తున్నారని "మన రాజ్జమింత బేగీ రాదనీ, వొచ్చినా, ఇల్లూ, పొల్లూ అవన్నీ రాజ్జెం చేతిలో వుంటాయనీ, రాజ్జెం అన్నీ ఆలోచించి, అందరికీ సమానంగా అనీటినీ సమకూరుస్తాదనీ, వివరిస్తే, నిరాశగా "ఔనా ? ఇవ్వరా  ? మన రాజ్జెమొచ్చినా ఇవ్వరా ? ఇదేటమ్మీ ! మరి యేల ఈ ఇబ్బందులన్నీ మనకి ? అని అంటుంది.                                    

ఈ అమాయకత్వం పక్కన పెడితే, గ్రామంలో కరువు కాటకాల్లో కూడా కనికరం లేకుండా వడ్డీలు వసూలు చేసి, జనం ఇక భరించలేనంత కష్టాలకు గురి చేసిన షావుకారు, అంతకు పూర్వం ప్రజల చేతిలో హతమయిన క్రూర మిరాశీదారు - వీళ్ళందరూ కూడా తెగే దాకా లాగి ప్రాణాలు హరించుకునేలా చేసిన రాజకీయ చిత్రం - శ్రీకాకుళ ఉద్యమాన్ని, ఆ విశాలమైన రంగస్థలాన్నీ - కళ్ళ ముందు నిలబడగా చూడడం, రక్తి కట్టించే భాష, ప్రతి మనిషి మనసులోకీ తొంగి చూసి, అతను కంబారయినా, అంబరమెక్కిన రాజైనా, అన్ని అంతరంగాలనీ చదివించడం బహుళ ప్రత్యేకత.  నారాయుడి జీవితాన్ని చదవడం కోసం,  మూలాల్ని మరిచిపోని మనుషుల్ని చదవడం కోసం, బహుళ చదవాలి.  సరళంగా కథ చెప్పే నెరేషన్ తో, చాలా బావుంది. పెద్ద పుస్తకం - మనసు తీరేలా చదవొచ్చు.  

* * * 

No comments:

Post a Comment

వ్యాఖ్యానించినందుకు చాలా చాలా థాంక్స్.