కోపెన్ హేగెన్ నౌకాశ్రయం దగ్గర, దిగువకు వెళ్తుంటే అక్కడ వెస్టెర్ వోల్డ్ అని ఒక వీధి ఉంది. అదో కొత్త, జనసంచారం లేని విశాలమైన వీధి. దానికి ఒక వైపంతా వరుసగా చెట్లు. వీధి వెంబడి, అక్కడోటీ, ఇక్కడోటీ చెదురు ముదురుగా ఇళ్ళుంటాయి. గ్యాస్ తో వెలిగే వీధి దీపాలు కూడా ఒకటీ, అరానే. మనుషులయితే ఎవ్వరూ కనబడనే కనబడరు. ఇప్పుడు వేసవిలో కూడా ఈ వీధిలో విహరించే జనం కనబడడం చాలా అరుదు.
నిన్నటి సాయంత్రం ఇక్కడో వింత సంఘటన నా అనుభవం లోకి వచ్చింది. ఇదే రోడ్డు మీద నేనప్పుడు అటూ ఇటూ పచార్లు చేస్తున్నాను. అపుడు నాకు సరిగ్గే వ్యతిరేక దిశలో ఓ మహిళ ఒంటరిగా నడుస్తూ ఎదురుపడింది. అప్పటికి చీకటి కమ్మి, వీధి దీపాలు వెలిగించడం కూడా పూర్తయింది. కానీ ఆ మసక చీకటిలో ఆమె ఎవరో, ఏమిటో సరిగ్గా పోల్చుకోలేకపోయాను. సాధారణంగా రాత్రి వేళల్లో తిరిగే రకం మనిషయి ఉంటుందని అనిపించింది. ఆమెను దాటిపోయాను.
రోడ్డువార్న వరుసగా ఉన్న చెట్ల దారి అంచు దాకా నడిచాక వెనక్కు తిరిగి ఇంటిబాట పట్టాను. అపుడే ఆ మహిళ కూడా దిశ ను మార్చుకుని వెనక్కి తిరిగి నడుస్తూ ఇంకోసారి ఎదురుపడింది. ఆమె ఎవరికోసమో వేచి చూస్తున్నట్టుంది.
ఆమె "ఎవరికోసం ఎదురు చూస్తుండవచ్చు..??" అనే ఉత్సుకత బయలుదేరింది నాలో. అలా అటూ ఇటూ జరుపుతున్న వ్యాహ్యాళిలో ఆమె మూడో సారి ఎదురయ్యాక, నేను ఏమాత్రం ఆగకుండా, టోపీ కాస్త పక్కకి తప్పించి, అభివాదం చేస్తూ, "గుడ్ ఈవినింగ్! మీరు ఎవరికోసమయినా ఎదురుచూస్తున్నారా ?" అని అడిగాను.
అనుకోనీ ఈ పలకరింపుకి ఆమె తుళ్ళిపడింది. బెరుకుగా "లేదు".. అని ఆగి "హ్మ్.. " అంటూ తడబడుతూ సమాధానం ఇచ్చింది.. సరే ఆమె ఎవరికోసమో ఎదురుచూస్తుంది.
"మరి మీకు ఇబ్బంది లేనట్లయితే ఆ వ్యక్తి వచ్చేదాకా నేను మీకు కాస్త తోడు ఉండనా ?"
"అయ్యో వద్దు!" అనందేగానీ పెద్దగా అభ్యంతరం చెప్పలేదు ఆమె.
మాటలు కలిసాయి. నాకు ధన్యవాదాలు చెప్తూ తన పరిస్థితిని వివరించింది. నిజానికి ఆమె ఎవరికోసమూ ఎదురుచూడటం లేదు. కేవలం చల్లగాలి పీల్చుకుందుకని బయటికి వచ్చింది. ఇక్కడ చూస్తే గాలి ఆడట్లేదు. అందుకే ఆ నడక!
అంతే, ఇక మేమిద్దరం ఒకరితో ఒకరం కలిసి నడవడం ప్రారంభించాము. అదీ ఇదీ మాటాడుకుంటూ, పెద్ద ప్రాధాన్యత లేని కబుర్లు దొర్లించాం. నేను ఆమె పట్టుకునేందుకు వీలుగా, మర్యాదకి నా మోచేతిని ఆమెకు అందించాను.
"థాంక్ యూ..! వొద్దు." అన్నది ఆమె తలూపుతూ.
"టైం ఎంతయింది ?" అని అడిగింది ఆమె.
ఆ విహారంలో పెద్ద మజా ఏమీ లేదు. పైగా ఆ చీకట్లో ఆమె మొహం ఆనవాలు ఏదీ తెలీట్లేదు. టైం చూసే మిష మీద అగ్గిపుల్ల గీసి, మంటని కాస్త పైకెత్తి, ఆమె ముఖాన్ని కూడా చూసాను.
"తొమ్మిదిన్నర!" అన్నాను.
ఆమె చలికి కాస్త వొణికింది. ఈ అవకాశాన్ని జారవిడుచుదలచుకోలేదు.
"మీకు చాలా చలిగా ఉంది. మనం ఏదయినా ప్రదేశానికి వెళ్ళి, ఏదయినా తాగుదాం "టివోలీ", "నేషనల్" ? ఎక్కడికి ? చెప్పండి !" అన్నాను.
“కానీ.. చూడండి. నేనిప్పుడు ఎక్కడికీ వెళ్ళలేను.” సంకోచంగా అందామె. అప్పుడు మొదటి సారి సరిగ్గా చూసాను. ఆమె తల వెనుకగా ఒక పొడవైన నల్లని మేలి ముసుగు ధరించి ఉంది. నేను వెంటనే 'క్షమాపణలు' కోరాను. నేను పొరబడటానికి కారణం 'చీకటి' కాబట్టి దానికే దోషం అంటగట్టాను. ఆమె నా క్షమాపణను స్వీకరించిన పద్ధతిని బట్టి ఆమె ఊరికే రాత్రిళ్ళు బయట తిరిగే రకం మనిషి కాదనిపించింది.
సరే ! నా చేతిని తీసుకోండి" సలహా ఇచ్చాను. "కాస్త వెచ్చగా ఉంటుంది".
ఆమె నా మోచేతిని తన నాజూకు చేతితో మర్యాదగా అందుకుంది.
మేమిద్దరం ఆ వీధిలో అటూ ఇటూ కొన్నిసార్లు నడిచాక, ఆమె మళ్ళీ నన్ను టైం ఎంత అయిందో చూడమని కోరింది.
"పది అయింది". మీరు ఉండేది ఎక్కడ ?"
"గేమల్ కొంగేవీ లో"
నేనామెను ఆపేను. "మీ ఇంటి వరకూ నేను తోడు రానా ?"
"వొద్దు!" ఆమె అంది. "వొద్దు.. మిమ్మల్ని అలా చెయ్యనివ్వను. మీరుండేది బ్రెడ్గాడ్ లో!" సమాధానం ఇచ్చింది.
"మీకెలా తెలుసు?" ఆశ్చర్యంగా అడిగాను.
"ఒహ్! మీరు నాకు తెలుసు!"
ఒక చిన్న విరామం తరవాత మేమిద్దరం అలా చేతిలో చేయి వేసుకుని వీధి దీపాల వెలుగులో నడిచాము. ఆమె తొందరగా నడుస్తూంది. ఆమె పొడవైన ముసుగు జీరాడుతూంది.
"మనం త్వరగా వెళ్ళాలి!" అంది.
గామల్ కొంగేవీలో ఆమె ఇంటిదగ్గర, చాలా దయతో, తోడు వచ్చినందుకు, ధన్యవాదాలు చెప్పేందుకన్నట్లు ఆమె నావైపుతిరిగింది. ఆమెకు తలుపు తెరచి పట్టుకున్నాను. ఆమె మెల్లగా లోపలకు నడిచింది. నా భుజంతో తలుపుని మెల్లగా నెడుతూ నేనూ లోపలికి వెళ్ళాను. ఒకసారి లోపలికివెళ్ళగానే, ఆమె నా చేతిని గట్టిగా పట్టుకుంది. ఇద్దరమూ ఒక్క మాట అనలేదు.
రెండు అంతస్తులు మెట్లెక్కి మూడో అంతస్తు చేరాము. ఆమె స్వయంగా తన అపార్ట్మెంట్ తాళం తెరిచింది. ఆ తరవాత రెండో తలుపు తెరిచి, నా చేతిని పట్టుకుని మెల్లగా నన్ను లోపలికి తీసుకునివెళ్ళింది. అది బహుశా ఒక డ్రాయీంగ్ రూం అయి ఉంటుంది. అక్కడ గోడ గడియారం చేసే టిక్ టక్ శబ్దం విని పించింది. తలుపు లోపలికి వెళ్ళాకా, ఆమె ఒక్క క్షణం ఆగి, తన రెండు చేతులూ నా చుట్టూ వేసి, సన్నని కంపనతో, చాలా కోరికతో, పెదవులమీద ముద్దు పెట్టుకుంది తిన్నగా పెదవులపైనే!!
“మీరు కూర్చోరా ?” ఆమె సూచించింది. “ఇదిగో సోఫా.. ఉండండి నేను దీపం తీసుకొస్తాను.”
అప్పుడు దీపం వెలిగించింది. నేను ఆశ్చర్యంలోనే ఉన్నాను. నేనెక్కడున్నానో చూసుకున్నాను.
అదో విశాలమైన, చాలా అందమయిన ఫర్నిచర్ ఉన్న డ్రాయింగ్ రూం. దానికి అనుబంధంగా ఉన్న 'సగం తెరిచిన' తలుపులు చాలా గదులకు ద్వారాలని తెలుస్తూంది. ఆ క్షణం, నేనసలు 'ఎవరి'తో, ఎక్కడ' ఉన్నానో, 'ఆమె అసలు ఎటువంటిదో, నా పరిస్థితి ఏమిటో' అస్సలు తెలియలేదు.
“ఎంత అందమైన గది ? “ అన్నాను ఆశ్చర్యానందాలతో.. “ మీరు ఇక్కడ ఉంటారా ?”
Baagundi :) translation anukoledu, but that's not your way of writing too. got confused :)
ReplyDeleteThank you.
ReplyDelete