ఏముంది ? ఇల్లు కట్టుకోవాలి - ఇది స్వప్నం ! ఇదే కధ ! వాస్తు ప్రకారం, భవిష్యత్ ప్రణాళికల ప్రకారం, అన్నిరకాలుగా సరిపోయే బంగారం లాంటి ఇంటి స్థలం, జీవితకాలపు ఆర్జనంతా మదుపుపెట్టి కొన్నారు. ఇల్లు 'ఇలా కట్టాలీ, అలా కట్టాలీ' అని ప్లాన్లు వేసుకుంటున్నారు. వారానికోసారి కాబోలు ఇంటిల్లిపాదీ స్థలం చూడ్డానికెళ్తారు. అదో తంతు ! పిల్లలకి తండ్రి చాదస్తం అంటే పరిహాసం, విసుగు ఇంకా.. సానుభూతి ! అయినా తప్పది. సొంతిల్లు, ఖోస్లా గారి కల ! ఈ కల కోసమే చాన్నాళ్ళు కష్టపడ్డారు !
తీరా 30 లక్షలిచ్చి స్థలం కొంటారు. ఒక ఆదివారం, ఎండలో సైటుకి వెళ్ళి చూస్తే, స్థలం కనబడదు. పటిష్ఠమైన కాంపౌండూ, దానిమీద వేరే వ్యక్తి పేరూ కనబడతాయి. లబో దిబో మనే ముందు ఏదో పొరపాటు జరిగిందనుకుంటారు. మెల్లగా ప్యార్ సే (ప్రేమగా) మాటడ్డానికి ప్రయత్నిస్తే, ఆ స్థలం ఖురానా అనే తిమింగలం గారు కబ్జా చేసారని తెలుస్తుంది. పాపం చిన్ని చేప ఖోస్లా గారు - నానా తిప్పలూ పడి, ఖురానా గారి ఎడ్రసు సంపాయించి, అవమానాల్నెదుర్కొని, తిమింగలం దగ్గరకు వెళ్ళి - మాట్లాడతారు. 15 లక్షలు (ఒరిజినల్ ధర మీద 50% చెల్లిస్తే) స్థలం తిరిగి మీ చేతికిచ్చేస్తాం అని కబ్జాదారులు చెప్తారు/బ్రోకరు ద్వారా చెప్పిస్తారు. పైగా ఇదేదో నిజం డీల్ లానే - ఇంత చీప్ గా మీకు సౌథ్ ఫేసింగ్ ఇల్లు దొరుకుతుందా చెప్పండి ? అని బుకాయించేసారు.
ఇదీ ఖోస్లా కా ఘోస్లా ! రియల్ ఎస్టేట్ దుండగత్వం, పెద్ద పెద్ద బిల్డర్లు చేసే కబ్జాలూ, అంకుల్జీ అంటూనే, తడి గుడ్డతో గొంతుకోసే రకాలూ - ఢిల్లీ, హర్యాణా వాసుల భాషా, దౌర్జన్యం - ఇవన్నీ చక్కగా పెనవేసి, మన కళ్ళ ముందే ఖోస్లా గారిని ముప్పతిప్పలు పెట్టించే ఈ సినిమా - ప్రధానంగా నిష్టూరమైన కామెడీ !
ఖోస్లా (అనుపం ఖేర్) ఒక సాధారణ డిల్లీ వాసి. రాజ్మా చావల్ తినడం (భార్యా బాధిత లక్షణం - ఈజీ కదా అని ఆవిడ రోజూ అదే వొండుతుంది), పొద్దున్నే వాకింగూ, లాఫింగ్ క్లబ్బులో సభ్యత్వం,చార్టెర్డ్ బస్సులో ప్రయాణం - ఇలా ఆయనొక సగటు ఢిల్లీ పౌరుడు ! ఈయనకున్న పిల్లల్లో చిన్నాడు చిరోంజీ లాల్ (చెర్రీ) ఒక్కడే కాస్త కుదురైనవాడు - మల్టీనేషనల్ లో సాఫ్ట్వేరు ఉద్యోగం చేస్తున్నడు. పెద్దాడు (రన్వీర్ షౌరీ) పెద్దగా చదూకోలేదు - షేర్ల వ్యాపారంలో ఉంటాడు. కూతురు టీనేజ్ పిల్ల !
ఈ ఫ్లాటు గొడవల్లో, చిన్నాడు చెర్రీ అమెరికా వెళిపోతానంటాడు ! ఫ్లాటు చూస్తే కబ్జా అయింది. ఖురానా గారు ఫ్లాటులో గూండాలని పెట్టి ఉంటాడు. ఇంక లాభం లేదని జబర్దస్తీ గా పెద్ద కొడుకు - పహిల్వాన్లతో స్థలం ఖాళీ చేయిస్తాడు. తెల్లారేసరికీ పోలీసులు ఖురానా స్థలాన్ని ఖోస్లానే ఆక్రమించబోయాడని, ఇంటికొచ్చి అరెస్టు చేసి తీసుకుపోతారు. సామ, దాన, దండో పాయాలు పనిచేయకపోగా, ఖోస్లా గారి కుటుంబం పరువు వీధినపడుతుంది.
సరే ! ఆ భూమి కి 12 లక్షలివ్వండి - ఖాళీ చేస్తానంటాడు తిమింగలం. అన్నివిధాలా దెబ్బతిన్న ఖోస్లా గారు దిగాలుపడిపోతారు. స్థలాన్ని తమకు అమ్మిన బ్రోకరు కూడా తిమింగలం తో చేతులు కలిపాడని నెమ్మదిగా అర్ధం అవుతుంది. ఈ పరిస్థితుల్లో చెర్రీ అమెరికా వెళ్ళడం అనేది ఊగిసలాడుతూ ఉంటుంది. చెర్రీ కి వీసా ఇప్పించబోయిన ఇంకో బ్రోకరు విషయం తెల్సుకుని సహాయం చేస్తానంటాడు. ఆ తరవాతంతా మలుపులూ, ఉత్కంఠా, కేవలం చాన్స్ తీసుకుని - చేసిన ఈ ప్రయత్నంలో అన్నీ అనుకూలించి, పెద్ద తిమింగలాన్ని బుట్టలో వేసి, మోసం చేసి, ప్రభుత్వ భూమినే అంటగట్టి, అమ్మి, కసి తీర్చుకుంటారు ఆ తిమింగలం బాధితులు. ఈ మోసం (రివర్సు మోసం) చేస్తున్నంత సేపూ నిజాయితీపరుడైన ఖోస్లా గా అనుపంఖేర్ అంతర్మధనం, తండ్రి మీద కుటుంబ సభ్యుల ప్రేమాదరాలతో కూడిన ఆప్యాయతా, అయినా తండ్రి కోసం, ఆయన ఎదుర్కొన్న మానసిక వ్యధ కు, కోల్పోయిన ధన, మనశ్శాంతులకోసం పిల్లలు పడే తాపత్రయం - వారి స్నేహితుల ఉదారత, ఇవన్నీ కదిలిస్తూ ఉంటాయి. ఈ కామెడీ డ్రామాని చూస్తే తప్ప నిస్సహాయతలో - 'క్యా కరేంగే భయి - కహా జాయెంగే భయి ?' అని పాడుకోవడంలో కిక్కు తెలిసి రాదు.
తిమింగలం ఖురానాగా బొమన్ ఇరానీ, ఖోస్లా గా అనుపం ఖేర్, ఎప్పట్లాగే సహజ నటనతో అదరగొట్టేసారు. నటన తో జనాల్ని మైమరిపింప చేసింది మిగతా నటీనట వర్గం ! రన్వీర్ షౌరీ, ప్రవీణ్ డబాస్ (పీటర్ ఇంగ్లండు మోడల్), వినయ్ పాఠక్ (ఈయన సినిమా 'భేజా ఫ్రై' - ఎన్నో ఆశలతో చూసాను ఖోస్లా కా ఘోస్లా అనుభవంతో ! చప్పగా ఉండింది) నవీన్ నిశ్చల్,తారా శర్మ ఇంకా, మిస్సెస్ ఖోస్లా గా కిరణ్ జునేజా - అతికినట్టు సరిపోయి, జీవించేసారు. ఢిల్లీ వాలాలు, వాళ్ళ జీవితాల్ని ప్రతిబింబించిన ఈ సినిమా, ప్రధానంగా - ఒక జరగగలిగే సంభావ్యతనే ఆధారంగా చేసుకుని అల్లిన కధని నమ్ముకుంది. హీరో ఎడంచేత్తో కొడితే, నాలుగయిదు పల్టీలు కొడుతూ ఒకేసారి నలుగురయిదుగురు ఫైటర్లు పడిపోవడంలో సాంభావ్యత ని అచ్చంగా నమ్మేసే ప్రేక్షకులు - ఖోస్లా గారి బుల్లి బృందం, మోసాన్ని మోసంతోనే కొయ్యడం అనే ప్రిన్సిపల్ మీద - ఖురానా అనే తిమింగలాన్ని మోసం చెయ్యడం - అనే దాన్ని కూడా నమ్మేయాలి ! కొన్ని సినిమాలు ప్రేక్షకుల్ని వెర్రివాళ్ళని చేసేస్తాయి. కానీ ఈ సినిమా అలా కాదు. ఆమధ్య తెలివయిన సినిమాలు కూడా వచ్చాయి. ఇదీ ఆ కోవలోనిదే !అసలీ సినిమానే ఒక తమాషా అయిన అనుభవం. ఎక్కడ తేడా / అనుమానం వచ్చినా, మొత్తం వ్యవహారం బెడిసికొట్టేది ! ఈ కామెడీ లో ఉత్కంఠ ని పట్టి ఉంచేలా చెయ్యడం దర్శకుని ప్రతిభకు నిదర్శనం. పాటలు బావున్నాయి. కధా బావుంది. దర్శకుడు దిబాకర్ బెజర్జీ - ఈ సినిమాతోనే మురిపించేసాడు! టైటిల్స్ దగ్గర్నుంచీ గమ్మత్తుగా అనిపించే సినిమా ఆరంభం కూడా - తెలివిగా, సరదాగా ఉంటుంది.
బోరుకొట్టిన సాయంత్రాలు - వర్షం కురిసే మద్యాహ్నాలూ, మసాలా తేనీరు సేవిస్తూ చూడాల్సిన సినిమా !
చూడాల్సిందేనండీ.. ఆ చేత్తోనే 'మసాలా తేనీరు' తయారు చేయు విధం వివరించేస్తే... మీరు రకరకాల తేనీళ్ళు (రైటేనా?) చేయడం వచ్చునని అప్పుడెప్పుడో మీ బ్లాగులో చదివిన జ్ఞాపకం..
ReplyDeleteసుజాత గారూ, ఇవాళ తీరిగ్గా మీ బ్లాగు తీసి పాత టపాలు, నేను మిస్ అయిపోయినవి చదూతూ కూచున్నా! ఈ సినిమా నాకు భలేగా నచ్చింది. ఒకసారి గోవా వెళ్ళినపుడు పెద్ద వర్షం పట్టుకుని బయటికి వెళ్ళడానికి లేక హోటల్ రూములోనే బందీ అయిపోయాం ఒక రోజంతా!ఆ రోజు టీవీలో చూశాను ఈ సినిమా! థాంక్యూ, మంచి సినిమా గుర్తు చేశారు.
ReplyDeleteఇంతా చేసి ఆ రోజు ఈ సినిమా పేరు చూడలేదు. అరగంట అయిపోయాక మొదలెట్టాను. సినిమా పేరు ఇవాళే తెలిసింది