Pages

29/06/2009

The Last king of Scotland

ఈ వారం అనుకోకుండా ఒక మంచి సినిమా చూసాను. ఇది 'ద లాస్ట్ కింగ్ ఆఫ్ స్కాట్లాండ్'. ఏదో మామూలు మూడ్ లైట్ చేసుకుందామని, దీని ఓ, నా, మా లు తెలీకండా, ఇదేదో ఫన్నీ సినిమా అనుకుని, చూసాను గానీ, కొంచెం కధ లో మునిగేదాకా నేనెందులో పడ్డానో తెలిసిరాలేదు. ఒకసారి నా బ్లాగ్ లో 'ఇండిపెండెంట్'గారు, 'కొలంబియా లో ఇంగ్రిడ్ విడుదల' గురించి రాసినపుడు, వ్యాఖ్యానిస్తూ, ఆపరేషన్ ఎంటెబ్ గురించి వీడియో లింక్ ఇచ్చారు. వీడియో పని చెయలేదు గానీ, దాన్ని గురించి అపుడే వికీపీడియాలో చదివి థ్రిల్ అయ్యాను. ఈ సినిమాలో ఆపరేషన్ ఎంటెబ్ కొంచెం కల్పితంగా ఉంటుంది.

ఈ సినిమా ప్రధానంగా, ఉగాండా నిరంకుశ అధినేత, నరరూప రాక్షసుడిగా పేరు తెచ్చుకున్న 'ఈడీ ఆమిన్' జీవితం గురించి - సగం నిజం, సగం కల్పనా కలిపి, ప్రముఖ జర్నలిస్ట్ గైల్స్ ఫోడెన్, తన కళ్ళారా చూసిన వాస్తవాల సాయంతో రాసిన నవల, 'The Last King of Scotland' ఆధారంగా తీసినది. సినిమా - స్కాట్లాండు లో అపుడే వైద్య విద్య లో పట్టబధ్రుడైన - విలాస పురుషుడు - జీవితంలో కొంత వినోదం, కొంత సాహసం ఉండాలనుకునే నవ యువకుడి పరిచయంగా - హీరో - డా.నికోలస్ గారిగన్ పరిచయంతో మొదలు ! కేవలం - సరదాకి, కొంచెం సాహస జీవితం అంటే ఉన్న కుతికీ - కోతి లాంటి బుద్ధితో, కేవలం చాన్సు తీసుకుని ఆఫ్రికన్ దేశమయిన ఉగాండా కి ఒక మిషనరీ కోసం పనిచేయడానికి వస్తాడు నికోలస్.


నికోలస్ దిగేసరికీ, దేశం అంతా, తుపాకులూ, టాంకులూ, సైనికులూ - భీభత్సంగా ఉంటుంది. ఇదేంటీ - అని అడిగితే, మిషనరీ నడిపే వ్యక్తి భార్య ఇది 'కూ' (సైనిక తిరుగుబాటు) అనీ, 'మిల్టన్ ఒబటు' ప్రభుత్వాన్ని కూలదోసి, కొత్తగా 'ఈడీ అమిన్' అధ్యక్షుడయ్యాడనీ, అందుకే ఈ సంత అంతా అని, కూల్ గా చెప్తుంది. ఉగాండా చాలా అస్థిరమైన దేశం. ఇక్కడ సైనిక పాలనా, తిరుగుబాట్లూ, నియంతృత్వం, ఆటవిక పాలనా, సర్వ సాధారణం.

మొత్తానికి ఆ దేశంలో జరుగుతున్న 'సంబరాన్ని ' కాస్త దగ్గరగా చూసే అవకాశం వస్తుంది. కొత్త అద్యక్షుడి స్వాగతం (!) కోసం నికోలస్ పని చేస్తూన్న మారుమూల ప్రాంతాల్లో, గన్ పాయింటు కింద ఉత్సవాలు జరుగుతాయి. ఈ సంబరాలకు ఈడీ అమిన్ వస్తాడు. ప్రజల ముందు 'నేనూ మీ వాడినే - అని ఉపన్యసిస్తాడు. ఆఫ్రికన్ పాటలు పాడతాడు. నృత్యాలు చేస్తాడు. అచ్చం మన రాజకీయ నాయకుల్లానే, ప్రజల మనసు గెలుచుకునే ఫీట్లు చేస్తాడు. ఇక్కడే అమిన్ ను మొదటి సారి చూసిన నికోలస్, ఈ అధ్యక్షుడు మంచివాడేనేమో అనుకుంటాడు. కానీ ఆ దేశంలో చాలా ఏళ్ళుగా ఉన్న మిషనరీ సభ్యురాలు మాత్రం, ఇదంతా బూటకమని చెప్తుంది.

ఇలా ఉంటూండగా, ఒకసారి, డాక్టర్ని వెతుక్కుంటూ, నికోలస్ దగ్గరికి సాయుధ సైనికులు కొందరు వస్తారు. అధ్యక్షులవారికి ఆ పల్లెటూరి దారెమ్మట వెళ్తూంటే, రోడ్డు పక్కన నడుస్తున్న ఒక ఎద్దు కొమ్ము తగిలి, చేతికి గాయమైంది. ఎద్దు కూ ఆయన ప్రయాణిస్తున్న జీపు తగిలి గాయాలయ్యాయి. ఎద్దు మరణ యాతన పడుతూ ఉంటుంది. దాన్నీ, దాన్ని పట్టుకున్న రైతునూ రోడ్డు పక్కకు ఈడ్చి, అధ్యక్షులు నొప్పితో చిందులు వేస్తుంటే, ఆ పల్లె లో డాక్టరు కోసం వస్తారు వీళ్ళు. నికోలస్ - వెంటనే వెళ్ళి, ఆమిన్ కు పరిచర్య చేస్తాడు. ఈ లోగా ఎద్దు - ఆ పక్కనే పడి, గోల గోలగా రోదిస్తూంటే, విసుక్కుని, ఆమిన్ పిస్టల్ తీసుకుని దాన్ని కాల్చి చంపేస్తాడు నికోలస్. ఆ ధైర్యానికి, ఈడీ అమిన్ పిస్టల్ నే తీస్కుని, అతని ఎదుటనే - ఎద్దుని చంపిన అతని సాహసాన్నీ, ఈడీ అమిన్ అభిమానిస్తాడు. మాటలు పొడిగిస్తూ, నికోలస్, స్కాట్ లాండ్ నుండీ వచ్చినట్టు తెలుసుకుని, ఈడీ ఆమిన్ స్నేహ హస్తం చాస్తాడు.


తనకు పెర్సనల్ డాక్టర్ గా ఉండమని, నికోలస్ ను కంపాలా వచ్చేయమని, ఆహ్వానిస్తాడు. మొదట ఈ ఆహ్వానాన్ని తిరస్కరించినప్పటికీ, అమిన్ చరిష్మా ని చూసి, భ్రమలో - నికోలస్ ఒప్పుకుంటాడు. సహజంగా, అతను స్కాటిష్ బూర్జువా కుటుంబం నుంచీ వచ్చినవాడు కావడం వల్ల, కంపాలా లో విలాస వంతమైన జీవితం, పూల్ సైడ్ పార్టీలూ, అందమయిన భవంతులూ, అమిన్ స్వయంగా బహూకరించిన మెర్సిడెస్ కారూ, నికోలస్ది కూడా, ఇది ఎన్నాళ్ళు జరుగుతుందో చూద్దాం - అనుకునే తత్వం వల్ల... అతను ఉగాండా దేనికొచ్చాడో మరిచిపోయేలా - చేసి, చూస్తూండగానే నికోలస్ రోజు రోజుకీ ఊబిలో కూరుకు పోతూంటాడు.

ఈ లోగా బ్రిటిష్ డిప్లోమాట్ లు - నికోలస్ తో మంతనాలు చేస్తుంటారు. నికోలస్ ఈ నియంత కు వ్యక్తిగత డాక్టర్, పైగా సన్నిహితుడు గాబట్టి, అతని ద్వారా, ఈ నియంతను తుదముట్టించేందుకు ప్రయత్నాలు జరుగుతుంటాయి. అయితే, ఈడీ అమిన్ - దురాగతాల గురించి చూచాయ గా తెలిసినా, ఉగాండా గురించి అతను ఏదో కల కంటున్నాడనీ, ఉగాండా లో మంచి పరిస్థితులు రావడం కోసమూ, ప్రత్యర్ధులను తొలగించుకోవడం కోసమూనే అమిన్ అలా రాక్షసుడి లా మారణ హోమాలు జరిపిస్తున్నాడనీ, అమిన్ మామూలుగానైతే మంచోడే అని - తాను ఇందులో పార్ట్ కాననీ - నికోలస్ భ్రమల్లో ఉంటాడు.

చూస్తూండగా, ఆమిన్ - 5గురు భార్యల్లో, నాలుగో భార్య, అందమయిన నల్ల శిల్పం, 'కే' తో పరిచయం మొదలవుతుంది. అప్పటికి - 'కే' కు ఒక మూర్చ వ్యాధిగ్రస్తుడైన కొడుకు పుట్టినప్పట్నించీ, అమీన్, ఆమెను దురదృష్టవంతురాలిగా భావించి, మిగిలిన భార్యల కు దూరంగా వేరొక భవంతి లో పెడతాడు. ఈ దురదృష్టవంతురాలికీ, నికోలస్ కూ ప్రేమ - ఆకర్షణా, రహస్య ప్రణయం కొనసాగుతాయి. కే కు తాను గర్భవతి అని తెలుస్తుంది. ఈ విషయం భర్త కు తెలిస్తే, తనని చంపేస్తాడని భయబ్రాంతురాలైన ఆమె, డా.నికోలస్ ను ఎబార్షన్ చేయమని అడుగుతుంది. కానీ అప్పటికే - అమీన్ - అన్ని రకాలుగా నికోలస్ ను చుట్టుముట్టి ఉంటాడు. తీయగా మాట్లాడుతూ, అనూహ్యమైన ఎత్తులు వేస్తూ, అతని పాస్పోర్ట్ కూడా నాశనం చేసి, అతనికి ఉగాండన్ పాస్పోర్ట్ ఇచ్చి - దిగ్భంధనం చేసేస్తాడు.

తీరా - అనుకున్న సమయానికి నికోలస్ రాలేకపోవడంతో నాటు వైద్యుడి దగ్గరకు వెళ్ళిన 'కే' ను అమిన్ ఆదేశాల మేరకు సైనికులు హత్య చేసి, ఆమె శరీరాన్ని ఖండఖండాలు గా నరికి, ప్రదర్శనకు పెడతారు - 'అధ్యక్షుడిని మోసం చేసే వారి గతి ఇంతే!' అని ప్రజలను భయపెట్టేందుకు. ఆ తరువాత అక్కడికి చేరుకున్న నికోలస్, ఆమె శవంలో, ఆమిన్ - రాక్షసత్వాన్ని చూసి, వెర్రెక్కిపోతాడు. అంతకు ముందే అధ్యక్షుడిని వ్యతిరేకించిన వారూ, ఉదారవాద ఉగాండన్లూ - అహింసావాదులూ ఒక్కొక్కరూ అదృశ్యం అవుతూండటం గురించి బ్రిటిష్ డిప్లొమాట్లు నికోలస్ తో ప్రస్తావిస్తూ ఉంటారు. ఇలా 'కే' చావు, తదనంతరం-తన చావు, తన ముందు కనిపిస్తూండే వరకూ, అమిన్ రాక్షసత్వాన్ని అర్ధం చేసుకోలేని నికోలస్, ఆ క్షణంలో ఆవేశంతో ఊగిపోతాడు. బ్రిటిష్ డిప్లొమాట్ ను కలిసి, తన పరిస్థితి చెప్పి, దేశం వదిలి వెళ్ళడానికి సహాయం కోరతాడు. ఆ డిప్లొమాట్ - అమిన్ ను చంపే షరతు మీద సహాయం చేస్తానంటాడు.

క్లైమాక్స్ లో అమిన్ కు తల నొప్పి మందు ఇచ్చే మిష మీద కలవడానికి వెళ్తాడీ డాక్టర్. అక్కడ ఈలోగా వివిధ దేశాల్లో జైళ్ళలో మగ్గుతున్న కొందరు కరుడుగట్టిన పాలస్తీనియన్ తీవ్రవాదుల విడుదల కోసం, ఏర్ ఫ్రాన్స్ విమానం ఒకటి పాలస్తీన్ తీవ్రవాద సోదరుల చేత హైజాక్ చేయబడి కంపాలాలో ఎంటెబ్ విమానాశ్రయంలో దిగిందని కబురొస్తుంది. వెంటనే అక్కడికి వెళ్తాడు అమీన్, వెంటే, నికోలస్! ఈ లోగా నికోలస్ మీద అనుమానంతో అతన్ని అరెస్ట్ చేస్తారు అధ్యక్షుడి అంగరక్షకులు! నికోలస్ అధ్యక్షుడికి ఇవ్వబోయేవి తలనొప్పి మందులు కావనీ, విషం అనీ కనిపెడతారు. అమిన్, ఇజ్రాయెలు ప్రభుత్వం తోనూ, అంతర్జాతీయ సమాజం తోనూ సంప్రదింపులు జరుపుతూ, తన దేశపు విమానాశ్రయాన్ని తీవ్రవాదుల అడ్డా గా ఉపయోగించుకోవడాన్ని సమర్ధిస్తూ - ఈ మధ్య లో ఒక సారి - నికోలస్ ను కలుసుకోవడానికొచ్చి, 'నీ గురించీ, కే గురించీ నాకు తెలుసు నికోలస్ - మా గ్రామంలో ఇలా ఇంకొకరి భార్య ను తీసుకున్నవాణ్ణి ఏమి చేస్తారో తెలుసా ? వాడి చర్మానికి హుక్స్ తగిలించి, వాణ్ణి అలానే చెట్టుకి ఎత్తులో వేలాడేస్తారు - ఆ రక్తం కారి కారి ఏ మూడు నాలుగు రోజులకో వాడు చస్తాడు. నువ్వూ అలానే చావాలి కన్నా !' అని చెప్పేసి, విశ్రాంతి తీసుకోవడానికి వెళిపోతాడు. సరిగ్గా ఇదే శిక్ష ని నికోలస్ కి అమలు చేస్తారు !

అప్పటికి - బందీ ల విషయం లో కొంత నిగోషియేష్ నడిచి, ఒక 100 మంది దాకా యూదులు కాని వారినీ, ఇజ్రాయిలీ లు కానివారినీ విడుదల చెయాలని నిర్ణయం జరుగుతుంది. మిగిలిన 122 మంది బందీలూ ఎంటెబ్ లాబీ లో ఉండిపోతారు. వీరిని తీసుకెళ్ళడానికి ఒక కార్గో విమానం వస్తుంది. దాన్లో వెళ్ళేందుకు బందీలను గుంపులుగా విడదీస్తూ ఉంటారు.

ఈ భయానక పరిస్థితుల్లో ఒక ఆశాకిరణం - అమిన్ కు ఇంతకు ముందు పెర్సనల్ డాక్టర్ గా పని చేసి, ఇప్పుడు కంపాలా లో అధ్యక్షుడు నిర్మించిన ఇంకో ఆధునిక ఆస్పత్రి లో పని చేస్తున్న డాక్టర్ - జుంజూ, ఆ సమయానికి విమానాశ్రయం లో క్షతగాత్రులయిన ఏర్ ఫ్రాన్స్ ప్రయాణీకుల కోసం వచ్చి వుంటాడు. అతనికి నికోలస్ పరిస్థితి మీద జాలి కలుగుతుంది. అప్పటికి - మొదట్లో నికోలస్ ను కొంచెం తిరస్కారంగా చూసినా, నికోలస్ కు మానవత్వం ఉందని, అతను అమిన్ కు అత్యంత సన్నిహితుడయ్యేంత రాక్షసుడు కాడనీ - అతను కేవలం ట్రాప్ చేయబడ్డాడనీ, అర్ధం చేసుకున్న డా. జుంజూ - ఒక హాలు లో చాతి కి ఇనుప కొక్కేలు తగిలించి సీలింగ్ కు వేలాడుతున్న నికోలస్ ను ఎవరూ చూడకుండా రక్షించి, డ్రెస్సింగ్ చేసి, రక్తాన్ని తుడిచి - ఇంక నువ్వీ దేశం లో ఉండొద్దు, బైటి ప్రపంచానికి ఈ దేశాన్ని గురించీ, అమిన్ గురించీ చెప్పు - అని - సగం మంది ప్రయాణీకులు విడుదల అవుతున్నారు - నువ్వు వాళ్ళలో కలిసిపో ! అని చెప్పి, నెమ్మదిగా విడుదల ఔతున్న కొందరు నాన్-ఇజ్రాయిలీ బందీ లతో నికోలస్ ను కలిపేస్తాడు. ఇలా నికోలస్ ను రక్షించినందుకు జుంజూ ను కాల్చి చంపేస్తారు.

నికోలస్ ఆ విమానంలో ఉన్నడని అమిన్ కి తెలిసేసరికీ, విమానం టేక్ ఆఫ్ అయిపోతుంది. అలా మృత్యువు కోరల దాకా వెళ్ళి, వచ్చిన డా.నికోలస్ - కేవలం కల్పిత పాత్రే అయినా, అమిన్ రాక్షసత్వాన్ని బయట పెట్టేందుకు - చక్కని ఉదాహరణ ! కనీసం మూడు మిలియన్ల మంది అమాయక ఉగాండన్ ప్రజల్ని ఈడీ అమిన్ మట్టు పెట్టాడు. ఎపుడు తన మీద దాడి / హత్య కు కుట్ర జరిగినా తను ఎలా చనిపోతాడో,తనకు తెలుసు అనీ , తన చావు తన కల లోచూసాడనీ అంటూ - ఆవేశంతో మరిన్ని హత్యలకు పూనుకునే అమిన్ - ఫక్తు బ్రిటిష్ వ్యతిరేకి. స్వప్రయోజనాల కోసం, వివిధ దేశాల్లో పావులు కదుపుతూ, రాజకీయ అస్థిరత కు వాళ్ళే కారణమనీ, బ్రిటన్ పక్కనే ఉన్న స్కాట్లాండ్ వాసుల్లానే తమదీ, బ్రిటన్ తో పారంపరిక శతృత్వం అనీ, అందుకే స్కాట్లు తమ సోదరులనీ, తాను స్కాటిష్ కింగుననీ, తనకు తానే బిరుదిచ్చుకున్న ఘనుడు !


నెనెన్నో డీటైల్స్ చెప్పకుండా వొదిలేశాను గానీ - ఈ సినిమా లో - అమిన్ నిరంకుశత్వాన్ని, అతని రాక్షసతాన్నీ చూసేసరికీ గుండెలవిసి పోతాయి. పైగా నికోలస్ తో కూల్ గా చరిస్మాటిక్ గా వ్యవహరిస్తూ, పెద్ద ఉదారవాది లాగా ప్రపంచానికి ఫోసిచ్చే ఈ నియంత - రెండో కోణం - అత్యంత హేయం !!

అమిన్ గా నటించిన ఫారెస్ట్ స్టీవెన్ విటేకర్ కు అకాడమీ అవార్డ్ లభించింది. క్షణానికో మూడ్ లో ఉండే ఈ భయంకర పాత్ర పోషించినందుకు అతనికి జోహార్లు. మన ఎక్స్ ఫైల్స్ హీరోయిన్ స్కల్లీ ఎంతో అందంగా కనిపిస్తుంది మిషనరీ నడిపే అతని భార్యగా ! భీభత్సాన్ని తట్టుకోగలిగితే - తప్పకుండా చూడొచ్చు.

ఈ సినిమా కల్పిత ముగింపు తరవాత, ఎన్ని చర్చలు జరిపినా వినట్లేదని, నిజంగానే ఆపరేషన్ ఎంటెబ్ - అనే మిలిటరీ ఆక్షన్ ద్వారా - ఓ చీకటి వేళ, ఎంతో పక్కాగా ప్రణాళిక తొ సిద్ధమయి, నాటకీయంగా దాడి చేసి, ఎంటెబ్ విమానాశ్రయంలో ఏర్ ఫ్రాన్స్ బందీలందర్నీ ఇజ్రాయిలీ సైన్యం విడిపించుకు పోయింది. ఇలా దాడి చేసి, ఒక దేశపు సార్వభౌమత్వానికి విఘాతం కలిగించారని ఉగాండా - ఐక్యరాజ్య సమితి లో దొంగ ఏడుపులు ఏడిచింది. ఇలాంటి సినిమాలు చూస్తే, స్వతంత్ర భారత దేశం లో పుట్టినందుకు మనమెంతో పుణ్యం చేసుకున్నామని అనుకోవాలి.

2 comments:

  1. Mira Nair made "Mississippi Masala", an expat Indian origin family tale. It is a film about Indians leaving Amin's Uganda and reaching the US of A. I suggest you to watch it. Amazing music by L Subrahmaniam.

    ReplyDelete

వ్యాఖ్యానించినందుకు చాలా చాలా థాంక్స్.