Pages

14/04/2024

UN Peace Operations - Maj Gen (Dr) AK Bardalai (Retd)

గడిచిన రెండేళ్ళూ,  ఐక్యరాజ్యసమితి కి  కష్టకాలం. ప్రపంచాన్ని కుదిపేసి వదిలిన  మహమ్మారి తగ్గుముఖం పట్టగానే యుక్రెయిన్ మీద రష్యా 22 ఫిబ్రవరి 2022 న దాడి కి నిర్ణయం తీసుకుంది. ఆయుద్ధం ఇప్పటికీ కొనసాగుతూనే వుంది.  ప్రపంచం ఎన్ని ఆక్రందనలు చేసినా పట్టించుకున్న నాధుడు లేడు. ఈ లోపు ఆఫ్రికా లో ఐక్యరాజ్యసమితికి చెందిన మాలీ మిషన్ (UN Multidimensional Integrated Stabilization Mission in Mali - MINUSMA)  ను దేశం వదిలి వెళ్ళాల్సిందిగా మాలి కోరింది. కాంగో కూడా ఏడాది చివర్లోగా మెల్లగా తప్పుకోవాల్సింది గా  చెప్పేసింది. (UN Organization Stabilization Mission in the Democratic Republic of the Congo (MONUSCO).  

ఇది చాలదన్నట్టు 7 అక్టోబర్ 2023 న హమాస్ ఇజ్రాయిల్ మీద దాడి చేసింది. ఇజ్రాయిల్ ఎదురుదాడి ఎలాగూ ఒకరు ఆపగలిగేవిధంగా లేదిప్పుడు. ఈ పరిస్థితుల్లో ఐక్యరాజ్యసమితికి చెందిన మూడు శాంతి  స్థాపక మిషన్ లు  ఇరుకున పడ్డాయి. అవి  UNTSO, UNDOF, UNIFIL. ఇవన్నీ పాలస్తీనా శాంతి ప్రక్రియ మీద ఆధారపడినవే. పాలస్తీనా లో పరిమిత యుద్ధం ఇప్పటికయితే ఆగేటట్టు కనిపించడం లేదు.  అసలు ఈ యుద్ధాలలో, మారుతున్న ప్రపంచ రాజకీయాలలో, గాజా లో అంతూ పొంతూ లేకుండా సాగుతున్న ఈ పరిమిత యుద్ధం ఎన్నాళ్ళు పరిమితంగా ఉండగలుగుతుందో, పూర్తిస్థాయి యుద్ధంగా మారకుండా ఉండడానికి  ఐక్యరాజ్య సమితి, Israel లో ప్రస్తుతం పనిచేస్తున్న  దాని అనుబంధ సంస్థలు United Nations Truce Supervision  Organization (UNTSO), UNDOF (United Nations Disengagement Observer Force), UNIFIL (United Nations Interim Force in Lebanon (UNIFIL), అసలు ఏమి చేస్తున్నాయో తెలుసుకుందాం.  సమితి నిర్దేశించిన ఆపరేషన్లు ఎలా ఈ పెద్ద పెద్ద పోరాటాలలో  అసలు ఎలా పనికొస్తున్నాయో / పనికి రాకుండా పోతున్నాయో కూడా ఓ సారి ఆలోచించాలి.  

మిడిల్ ఈస్ట్ రాజకీయాలలో పాలస్తీనా సమస్య ఈ మూడు మిషన్ లనూ  కలుపుతుంది. అసలు ఈ మూడు సంస్థలూ ఎలా ఏర్పడ్డాయో, వాటి చరిత్ర, పాలస్తీనా తో వాటి అనుబంధమూ ఏమిటో మొదట చూద్దాము. 

UNTSO (United Nations Truce Supervision  Organization) : 

29 మే 1948 అరబ్ - ఇజ్రాయిల్ యుద్ధానంతరం ఇజ్రాయిల్, తన ఇరుగు దేశాలయిన ఈజిప్ట్, జోర్డన్, లెబనాన్, సిరియా లతో మధ్యవర్తిత్వం నెరిపేందుకు ఏర్పడిన సంస్థ ఇది.  పాలస్తీనా భూభాగంలో "ఇజ్రాయిల్"  ఏర్పడుతున్నట్టు బ్రిటన్ 11 మే 1948 న ప్రకటించగానే ఈ "అరబ్ - ఇజ్రాయిల్  యుద్ధం",  పాలస్తీనా కి మద్దతుగా  మొదలయింది. ఈ యుద్ధం ఐక్యరాజ్యసమితి military observers జోక్యంతో ముగిసింది. అలా UNTSO మొట్టమొదటి శాంతి స్థాపక బృందంగా 29 మే 1948 న ఏర్పడింది.  ఇజ్రాయిల్ తో నాలుగు పొరుగు దేశాలూ కొట్టుకుని చచ్చిపోకుండా శాంతి కోసం జరిగిన ఒప్పందాలని సరిగ్గా అమలు జరిగేలా చూసే బాధ్యత UNTSO  పైన పడింది. అయితే 1978 లో UNTSO పరిశీలకులు రెండు గ్రూపులు గా ఏర్పడ్డారు. Observer Group Golan (OGG), Observer Group Lebanon (OGL).  ఈ గ్రూపులన్నీ సమన్వయంతో పనిచేస్తూ వస్తున్నాయి. ఈ పీస్ కీపింగ్ మిషన్ లలో భారత సైన్యం చాలా ఏళ్ళుగా మిలిటరీ, నాన్ మిలిటరీ భాగస్వామ్యం కలిగి ఉంది. ముఖ్యంగా సిరియా, ఇజ్రాయెల్ సరిహద్దుల్లో గోలన్ హైట్స్ వద్ద నేపాల్, భారత్ సైన్యాలు వంతుల వారీగా పరిశీలకులుగా పనిచేస్తున్నాయి.  


UNDOF (United Nations Disengagement Observer Force)  :

ఇది కూడా పాలస్తీనా భౌగోళిక నైసర్గిక రాజకీయాల పరిణామాలతో ముడిపడిన అంశాలను ఆధారంగా చేసుకుని మొదలయిన సంస్థ. గాజా పై ఇజ్రాయిల్ డిఫెన్స్ ఫోర్సెస్ దాడుల కు ప్రతీకారంగా 1956 లో పాలస్తీనా ఫిదాయీన్ దాడులు జరిగాయి. వీటి అనంతరం ఇజ్రాయిల్, ఈజిప్ట్ బంధాలు తీవ్రంగా చెడిన తరవాత,  ఈజిప్ట్ సూయెజ్ కెనాల్ లో ఇజ్రాయిల్ కదలికల్ని కట్టడి చేసింది. ఈ కట్టడి టిరాన్ స్ట్రైట్ లో కూడా తీవ్రతరం చేసింది. ఇది సూయెజ్ కాలువ సమస్యని అంతర్జాతీయ సమస్య గా మార్చింది. బ్రిటన్, ఫ్రాన్స్ రహస్యంగా సూయెజ్ కాలువ ను తమ స్వాధీనంలోకి తీసుకోవాలనే ఒప్పందానికి వచ్చాయి. 29 అక్టోబర్ 1956 న ఇజ్రాయెల్ ఈజిప్ట్ సరిహద్దుల్ని దాటొచ్చి ఈజిప్ట్ పై దాడి మొదలుపెట్టింది. దానికి మద్దతుగా 31 అక్టోబర్ న ఉత్తరాన్నుంచి బ్రిటన్, ఫ్రాన్స్ లు ఈజిప్ట్ ని చుట్టుముట్టాయి. ఈ పరిణామాల అనంతరం United Nations Emergency Force ని ఏర్పాటు చేసారు.  

ఇదిలా వుండగా ఈజిప్ట్ ఇజ్రాయిల్ పై సూయెజ్ కాలువ పొడుగునా తిరుగుదాడులు మొదలు పెట్టింది. అటు సిరియా సేనలు  1973 అక్టోబర్ 6 న గోలన్ పర్వతశ్రేణుల పై ఇజ్రాయిల్ పోస్ట్ లపై దాడులు  మొదలు పెట్టాయి. ఈ యుద్ధం ముగిసాక, సిరియా, ఇజ్రాయిల్ ల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం మే 1974 లో జరిగింది. దీని అమలును పర్వవేక్షించేందుకు UNDOF ఏర్పడింది.అయితే దీనిలో  సైనికుల బృందాలుంటాయి. వీటి పాత్ర,  ఆయుధాలని Self-Defence కు  ఉపయోగించడానికే పరిమితం.  


UNIFIL (United Nations Interim Force in Lebanon (UNIFIL) : 

ఇది మూడో శాంతి స్థాపక మిషన్. ఇది ఇజ్రాయిల్, లెబనాన్ ల మధ్య ఘర్షణలను తగ్గించేందుకు ఏర్పడింది. ఇది కూడా పాలస్తీనా కు లెబనాన్ మద్దతు ఇవ్వడం వల్ల ఏర్పడిందే. ఇజ్రాయిల్ స్థాపన ప్రకటన వెలువడ్డాక, అప్పటి దాకా పాలస్తీనా భూభాగం లొ ఉండిన "యూదులు కాని ప్రజలనందరిని"  వెస్ట్ బాంక్, గాజాలకు నెట్టేసారు.  ఈ ఉదంతం కారణాన  వేలాది పాలస్తీనియన్లు లెబనాన్ కు శరణార్ధులై పారిపోయారు. లెబనాన్ లో సివిల్ వార్ తరవాత PLO (Palestine Liberation Organization) దక్షిణ లెబనాన్ లో  బలం పుంజుకుని ఇజ్రాయిల్ మీదికి దాడులు మొదలు పెట్టింది. ఇజ్రాయిల్ తిరగబడి లెబనాన్ ని స్వాధీనం చేసుకునేందుకు మార్చ్ 1978 లో ప్రయత్నించింది. అప్పుడే ఐక్యరాజ్య సమితి జోక్యం చేసుకుని, యుద్ధాన్ని ఆపి, దక్షిణ లెబనాన్ లో UNIFIL  ను స్థాపించింది.  అయినాసరే ఇజ్రాయిల్ 5 జూన్ 1982 న ఇంకోసారి,  హిజబొల్లా ఎత్తుకెళ్ళిన తన సైనికులను విడిపించేందుకని లెబనాన్ పై దాడి చేసి ముఖ్యంగా బీరూట్, దక్షిణ లెబనాన్ లలో PLO టార్గెట్ లను నాశనం చేసింది. ఇక్కడ అతి పెద్ద యుద్ధం జూలై 2006 న మొదలై 34 రోజుల పాటు సాగింది. 

ఇప్పటికీ దశాబ్దం పాటు యుద్ధం లాంటిదేదీ జరగక పోయినా ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (IDF), హిజబొల్లా ల మధ్య శతృత్వం బాగానే బలపడింది.  లెబనాన్ ఆర్ధికంగా చిక్కిపోయినా సరే పెరిగిన హిజబొల్లా ఆధునికీకరణ, దాని కొత్త ఆయుధ సాంకేతిక సంపత్తి, ఇజ్రాయెల్ ను  బాగా ఇరుకున పెట్టే విషయం.  హిజబొల్లా విజయం అంతా లెబనాన్ ప్రభుత్వానికీ, లెబనాన్ ప్రజానీకానికీ కేవలం తను మాత్రమే ఇజ్రాయిల్ దాడుల్నిండీ లెబనాన్ ని రక్షించగలదు అనే భావనను కలిగించడం పైనే ఆధారపడి ఉంది.  పాలస్తీనా కు మద్దతు ఇవ్వడం హిజబొల్లా ఉనికికి కీలకం కాబట్టి పాలస్తీనా ని ఘోరంగా అణిచేయడానిని నియంత్రించగల సత్తా హిజబొల్లాకు ఎంతోకొంత ఉందని ఇజ్రాయిల్ కు గుర్తుంటుంది. .  

ఈ మూడు సంస్థలూ ప్రస్తుతం గాజాకు మాత్రం పరిమితమైన యుద్ధం నాలుగువైపులా విస్తరించకుండా ఇకపై  ఎలా ప్రభావితం చేయగలవో చూడాలి. 

GAZA WAR : 

UNTSO, UNDOF, UNIFIL లు పాలస్తీనా సమస్య ఆధారంగా ఏర్పడినవే కాబట్టి, పాలస్టీన్ లో జరిగే ఘటనల ప్రభావం ఈ సంస్థల మీద ఖచ్చితంగా ఉంటంది.  గాజాలో పరిణామాల నేపధ్యంలో మిడిల్ ఈస్ట్ లో నెలకొన్న అనిశ్చితి నుండీ లాభపడాలని చూసే దేశాలూ బాగానే ఉన్నాయి. యుద్ధం నుండీ గడించాలని చూసే వాళ్ళు దానికి ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ మద్దతు ఇస్తారు.  గాజా మండిపోతుంటే ఆ మంటలలో చలికాచుకునే దేశాలున్నాయి. కాబట్టి ఈ యుద్ధానికి, మారణహోమానికీ మద్దతూ ఎక్కువగానే ఉంది. ఈ సమస్యకి  పరిష్కారం  దౌత్య పరంగా చిక్కాల్సిందే.  ఈ రెండు దేశాల మధ్యా ఇంత విపరీతమైన తరతరాలనాటి చారిత్రక శతృత్వం ఉన్నప్పుడు, ప్రతీకారేచ్చతో ఇరు వర్గాలూ ఊగిపోతున్నప్పుడు ఈ యుద్ధం శాంతియుతంగా ముగుస్తుందనుకోవడం అసాధ్యం.  కాకపోతే, ఈ యుద్ధం పెద్దదవడం, పాల్గొనబోయే దేశాలు ఎక్కువవడం, అగ్రరాజ్యం కూడా యుద్ధంలో ప్రత్యక్షంగా చేరాల్సి రావడం లాంటివి జరగడం, ప్రపంచానికి మంచిది కాదు.   

అయితే ప్రణాళిక ప్రకారం జరిగే 2006 నాటి లెబనాన్ యుద్ధం, 2023 అక్టోబర్ హమాస్ దాడులు, వంటి Political గా ప్రేరేపింపబడిన దాడులను ఆపడం సాధ్యం కాదు.  Wimmen and Wood for Crisis Group పరిశీలన ప్రకారం, లెబనాన్ గానీ,  UNIFIL గానీ హిజబొల్లా ని నియంత్రించగలిగే స్థితిలో లేవు. అయితే ఇలాంటి పరిమిత స్థాయి యుద్ధాలలో సూత్రధారులు ఇతర శక్తుల్ని కూడా పాల్గొనేలా రెచ్చగొట్టే విధానాలకు దిగుతున్నప్పుడు వివిధ లౌక్య విధానాల ద్వారా వాటిని ఆపడం అవసరం. ఈ పనులు చెయ్యడానికి UNTSO, UNDOF, UNIFIL లు పనికొస్తాయి. అయితే, సరిహద్దుల్లో ఈ సంస్థలు  ఉన్న ప్రాంతాల పరిసరాల్లో దాడులకు దిగడం, బ్లూ లైన్ లలో పౌరులు సైతం నిరసన ప్రదర్శనలు చెయ్యడం రెచ్చగొట్టే విధానాల కిందికే వస్తాయి.   ఇవి సులువుగా పరిస్థితులు దిగజారడానికి కారణం కావచ్చు.  గాజా మద్దతు దారుల సంఖ్య కూడా తక్కువేమీ కాదు. నిజానికి ఈ మద్దతుదారు దేశాలు పాలస్తీనా లో విపరీతమైపోతున్న మారణహోమాన్ని ఆపేందుకు తమ ప్రయత్నాలు తాము చేస్తాయి. ప్రతీకాత్మక దాడులని అయినాసరే చేస్తాయి. 

యుద్ధవాతావరణం, దాడుల పరిస్థితులు,  శాంతి స్థాపక సంస్థల పనులను తీవ్రంగా దెబ్బతీస్తాయి. For eg, హమాస్ దాడుల అనంతరం UNDOF   పరిశీలకులను ఇజ్రాయెల్ ఎటూ కదలనివ్వలేదు.  ఒకవేళ ఈ ఉద్యోగులు క్షేత్ర స్తాయి లో జరిగేది తెలుసుకోవాలన్నా కూడా విచక్షణారహిత దాడులు వారి జీవితాల్ని కూడా ప్రమాదంలో పెడుతున్నాయి.  అయినప్పటికీ UN ఇజ్రాయిల్ లో చాలా మటుకు ఉద్రిక్తతల్ని నివారించిది. 

ఉదాహరణకు ఇజ్రాయెల్ లో "డ్రూజ్ కమ్యూనిటీ" ది ఒక ప్రత్యేక స్థానం. వీళ్ళు అరబ్బులే అయినా తమను తాము పాలస్తీనియన్లు అనుకోరు. వీరి విధేయత యూదుల వైపు ఉంటుంది. సిరియా, ఇజ్రాయెల్ సరిహద్దుల్లో ఇరువైపులా వీళ్ళు ఉంటారు. హమాస్ దాడుల అనంతరం, సిరియా వైపు ఉన్న డ్రూజ్ లు అందరూ ఇజ్రాయెల్ కు మద్దతు ప్రకటించారు. వాళ్ళ ఆవేశాలు ఎంత పెల్లుబికాయంటే, సిరియాలో తామున్న ప్రాంతం ఇజ్రాయెలైస్ చేయాలనుకున్నారు కూడా. ఇది సిరియా కు ప్రమాదకరం కాబట్టి,   UNDOF ఈ స్థానిక ఉద్రిక్తతని తగ్గించడంలో కీలక పాత్ర పోషించాల్సి వచ్చింది.  డ్రూజ్ ల పై దాడులు జరుగుతాయన్న భయాలనూ UNDOF చూసుకుంది వీటి వల్ల ఇంకో పెద్ద ప్రమాదం తప్పినట్లైంది. 

UNIFIL విషయానికొస్తే దక్షిణ లెబనాన్ లో సరిహద్దు గ్రామాల్ని ఖాళీ చేయించాల్సి వచ్చింది. ఈ ప్రాంతాల్లో హిజబొల్లా, IDF లు విపరీతంగా కాల్పులు, Shelling జరుపుకున్నాయి. ఇక్కడ కూడా UNIFIL బోల్డన్ని సమావేశాలు జరిపి కాల్పుల్ని ఆపించింది.  యుద్ధం లో జరిగిన బోల్డన్ని అన్యాయాల్నీ, హత్యల్నీ విచారించేందుకు ఈ బృందాలకు చోటు చిక్కట్లేదు. కీలకమైన సహాయక బృందాలే దాడుల్లో దుర్మరణాలు చెందుతున్నప్పుడు, జవాబుదారీతనం లోపించిన సైన్యాల ఉద్రిక్తతల మధ్య హిజబొల్లా నూ, IDF  నూ శాంతపరిచి ఆ ప్రాంతాలలో యుద్ధాన్ని ఆపడం చిన్న విజయం ఏమీ కాదు. అయితే ప్రస్తుతం లెబనాన్, ఇజ్రాయిల్ ల మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరినా సరే అవి రెండూ పూర్తిస్థాయి యుద్ధం చేయడానికి మాత్రం ఇష్టపడడం లేదు. హమాస్ ని నిర్మూలించేసేందుకని కంకణం కట్టుకున్న ఇజ్రాయిల్ హిజబొల్లా చేతుల్లో పడి తన దృష్టిని మళ్ళించుకోవాలనుకోవట్లేదు.  

అటు ఉత్తరాన సిరియా లో UNDOF ద్వారా కూడా హిజబొల్లా ని వెనక్కు తగ్గమని చెప్పించే ప్రయత్నం జరిగింది.  ఇదే సమయంలో  సిరియా సరిహద్దుల్లో  UNDOF లోని పరిశీలకులుగా  పెద్ద యెత్తున ఉన్న ఫ్రాన్స్ దళాలు  కూడా, ఇజ్రాయెల్ యుద్ధం సిరియా సరిహద్దులకు విస్తరించకుండా ఆపేందుకు ఒక కారణం. తన స్నేహితులైన ఫ్రాన్స్ సైనికుల ప్రాణాలకు హాని కలిగించి, అంతర్జాతీయంగా తన స్థానాన్ని బలహీనపరుచుకోవడం ఇజ్రాయిల్ కు మంచిది కాదు. కాబట్టి నెతన్యాహూ యుద్ధోన్మత్తత కు ధీటు గా,   సరిహద్దుల్లో వివిధ స్నేహపూర్వక దేశాల సైనికులతో నిండిన  UN దళాలు వారి భూభాగాలలో physically ఉండడం వల్ల యుద్ధం మొత్తం గాజా కే పరిమితం అయింది. ఇజ్రాయెల్ వ్యతిరేక సరిహద్దు దేశాల ఉద్వేగమైన బదుళ్ళను UN సంస్థలు పరోక్షంగా నియంత్రించిన కారణంగా ఇజ్రాయెల్ యుద్ధ విస్తరణ రెండు సరిహద్దులలో ఈ విధంగా  నిలువరించడం జరిగింది.    అతిశయోక్తి అనుకోకపోతే,  ఒకరకంగా ఈ యుద్ధం ఓ మోస్తరు ప్రపంచ యుద్ధం కాకపోవడానికి, UNDOF, UNIFIL, UNTSO ల Lobbying, బాక్గ్రౌండ్ వర్క్  తప్పకుండా పనికొచ్చింది. 


ఇది పెద్దస్థాయి యుద్ధం కాకపోవడానికి లెబనాన్, ఇజ్రాయిల్, సిరియా ల సందిగ్ధత తో పాటు   "ఇది ఈ రీజియన్ కు మంచిది కాదన్న భావన"  కూడా కారణం.    ప్రస్తుతం గాజా యుద్ధం విషయం లో  అమెరికా తప్ప ఇజ్రాయెల్ కు ప్రపంచ దేశాల మద్దతు పెద్దగా ఏమీ లేదు. గోలన్ పర్వత శ్రేణుల్లో సిరియా సరిహద్దులకు సమీపంలోకి రష్యా సేనలు చేరడం  ఇజ్రాయెల్  సిరియాను గట్టిగా వ్యతిరేకించే సాహసం చేయకపోవడానికి ఇంకో ప్రధాన  కారణం. అంటే ఉదాహరణ కు UNDOFకు ట్రూప్స్ ని ఇచ్చే ఫ్రెండ్లీ దేశాలు (TCC -Troop Contributing Countries) ను ఇబ్బంది పెడితే, వారిపై దాడులకు దిగితే  అంతర్జాతీయంగా ఏకాకై పోవడం తప్పదు. ముఖ్యంగా ఆ UN Peace Keeping సైనికుల మాతృదేశాలు బలవంతమైన  రాజ్యాలైతే మరీనూ. దీన్ని బట్టి శాంతి స్థాపక బృందాలు యుద్ధాల్ని ప్రభావితం చేయగలవన్నది స్పష్టం అయింది. 

హిజబొల్లా కూడా నోరు మూసుకోవడానికి చాలా వరకూ UNIFIL ప్రెసెన్స్ కారణం. హమాస్ డెప్యూటీ నాయకుడు 'సలె అల్ అరౌరీ' ని గానీ సీనియర్ హిజబొల్లా కమాండర్ 'విసం హసన్ అల్ తవీ' ని గానీ  లెబనాన్ భూభాగం మీద డ్రోన్ తో దాడి చేసి ఇజ్రాయెల్, చంపినపుడు హిజబొల్లా ప్రతీకార దాడులకు చప్పున దిగలేకపోవడానికి కారణం  UNIFIL Contingent కు ఏమైనా హాని (collateral damage) జరుగుతుందేమో అన్న భయం తోనే.  

లెబనాన్ లోని అతిపెద్ద పాలస్తీనా శరణార్ధుల శిబిరం "అయిన్ అల్ హిల్వే" నుండి తయారయిన చిన్న చిన్న చిల్లర సాయుధ మూకలు ఎడా పెడా ఇజ్రాయెల్ లోకి రాకెట్ దాడులు చేయడం, దానికి హిజబొల్లా రక్షణ, శిక్షణ, హమాస్ సహకారం ఎప్పటుంచో ఉన్నవే. వాటిని పూర్తిగా నిలువరించడం సాధ్యం కాకపోయినా ఈ అంతర్జాతీయ సంస్థల కారణంగా చిన్న చిన్న ఉద్రిక్తతలు చినికి చినికి గాలివాన లా మారకుండా మాత్రం చాలా కాలం పాటు ఆగాయి.  అలా అని వీటి పాత్ర ని కొండంతలుగా చేసి కీర్తించక పోయినా ప్రస్తుతం ప్రపంచ శాంతి కల్ల అనీ, ఐక్యరాజ్యసమితి అసలు ఎందుకు ఉందని వెల్లువెత్తుతున్న ప్రశ్నల మధ్య మారుతున్న ప్రపంచ రాజకీయాలలో ఐక్యరాజ్య సమితి ఉపయోగం ఎంతమాత్రం కొట్టిపారేయాల్సింది కాదని చెప్పుకోవచ్చు.  


ఇకపై ఏమి జరగనుంది ? 


ఇప్పటి దాకా, అతివాద ప్రభుత్వం పదవిలో ఉన్నందున ఇజ్రాయెల్ దాడుల ప్రకోపం ఎక్కువ ఉంది, (ఇజ్రాయెల్ ది పైచేయి గా ఉంది అనట్లేదు) ఈ రోజుకీ హిజబొల్లా  కన్నా ఇజ్రాయిలే ఎక్కువ దూకుడు గా ఉంది. నిజానికి హమాస్ పని ముగిసినట్టే. అయినా కూడా ప్రజాభిప్రాయం మాత్రం ఇజ్రాయెల్ కు వ్యతిరేకంగానే ఉంది.  ఎది ఏమైనా ఇప్పుడు దౌత్యం అంతా కాల్పుల విరమణ, యుద్ధం ఆగడం చుట్టూ తిరుగుతున్నందున హమాస్ కూ, ఇజ్రాయెల్ కూ, సమాన భాగస్వామ్యం ఉన్న ఒప్పందం ఒకటి తీసుకురావాలి. దీనిని అమలు చేయడానికి ఐక్యరాజ్య సమితి లాబీయింగ్ చాలా అవసరం. తెగేదాకా లాగడం ఇజ్రాయిల్ కూ, హమాస్ కూ ఇద్దరికీ మంచిది కాదు.  ఇజ్రాయెల్ కు మద్దతుగా ఒక అగ్రరాజ్యం, వ్యతిరేకంగా ఇంకొక అగ్రరాజ్యం ఒకదానికొకటి ఎదురుగా నిల్చున్నాయి. ఒక వేళ ఏదో ఒక ఒప్పందానికొచ్చి కాల్పుల విరమణ జరిగినా కూడా, ఉద్రిక్తతల డిగ్రీల కారణంగా ఎప్పటికైనా పూర్తి స్థాయి యుద్ధం ఏక్షణానైనా మొదలవ్వొచ్చు. కాబట్టి ఇరువర్గాల్నీ ఆపాల్సిన అవసరం ప్రపంచానికుంది. 

అయితే పీస్ కీపర్ కి ఉండే అవరోధాల్ని కూడా పట్టించుకుంటే, వీళ్ళలో తక్కువ ఆయుధాలు కలిగిన వారు, హెవీగా ఆయుధాలు కలిగిన వారు, ఆయుధాలు లేని పరిశీలకులు, ఎక్కువ రోజులు ఫీల్డ్ లో ఉండాల్సినవాళ్ళు, ప్రమాదం అంచుల్లో, అనిశ్చితి లో తీవ్ర మానసిక ఒత్తిడి కి లోనయ్యే వాళ్ళు, ఒక డైరెక్షన్ లేక కేవలం దౌత్యం, నిలువరింపు కార్యక్రమాలకు, నిస్సహాయంగా, రాజకీయాలకు ప్రత్యక్ష సాక్షులుగా ఉండాల్సి రావడం - ఇవన్నీ కూడా మారాల్సిన విషయాలు. యుక్రయిన్ విషయం లో UN ఏమీ పెద్దగా చెయ్యలేకపోయింది. UN సంస్థల్లోని ఉన్నతాధికారులు తమ తమ స్వదేశాల పొసిషన్ కు కూడా రాయబారులు. ప్రపంచ శాంతి, సౌభ్రాతృత్వాలకు ప్రతీకలు. స్థానిక లాబీయింగ్ లో కూడా ఒకోసారి కీలక పాత్ర పోషిస్తారు.  కాబట్టి సరైన పీస్ కీపర్ ని నిష్పాక్షికంగా  మెరిట్ ప్రకారం, అందరికీ ఆమోదయోగ్యంగా ఎంచుకోవడం కూడా పెద్ద సవాలే.   

గాజా యుద్ధం ప్రాంతీయంగా ఉన్నంత సేపు మనం అందరం క్షేమంగా ఉన్నట్టు.  ఎర్ర సముద్రపు వాణిజ్య మార్గాల్లోకి కూడా యుద్ధం విస్తరించింది. కానీ అది ఇంకా ఎక్కువగా ఇతర ప్రాంతాల్లోకి చిందడం అస్సలు క్షేమం కాదు.   ఈ యుద్ధం ఇతర ప్రాంతాలకు విస్తరించిందో అది ఎంత పెద్దదవుతుందో ఊహించలేము. కాబట్టి ప్రస్తుతానికి  పరిస్థితుల్ని దేవుడికి వదిలేయకుండా UN ని  acknowledge చేయడం, దానిని మరింత బలోపేతం చేయడం, మనం చేయాల్సిన పని. 

Free Translation of the Article : "Role of UN Peace Operations : An Actor of Stability in the Middle East", by  Maj Gen (Dr) AK Bardalai (Retd), UN Journal 2024.

No permissions taken. 

***

2 comments:

  1. వ్యాసం చాలా బాగుందండీ. ఆయన ఓపికగా వివరించారు.మీరు అంతే ఓపికగా అనువాదం చేసారు.
    అయితే ఈ అంతర్జాతీయ వ్యవస్థలు నిజంగా ఎఫెక్టివ్‌గా పనిచేస్తున్నాయంటారా? ఒకటికి మూడు సంస్థలెందుకు? ఇన్నిన్ని సంస్థలూ, మెకానిజంలూ వున్నా యుద్ధాన్నెందుకు ఆపలేకపోతున్నాయో, అనే అనుమానం వస్తుంది నాకైతే. (బహుశా అది అంతర్జాతీయ వ్యవహారాల పట్ల వుండాల్సినంత జ్ఞానం లేకపోవడం వల్ల కూడా కావొచ్చు).
    శారద(బ్రిస్బేన్)

    ReplyDelete
    Replies
    1. చాలా చాలా థాంక్స్ శారద గారూ! ఈ యుద్ధం ఎప్పటికీ జరుగుతూనే ఉండడం మీద కొన్ని దేశాల భవిష్యత్తు ఆధారపడి ఉంది. నెతన్యాహూ తన అన్న ఫోటో చూపించి, గెలుస్తూ వస్తున్నాడు! ఆతను ఆపితే పదవి పోవడం ఖాయం. పాలస్తీనా ను తుడిచిపెట్టడమే అతని లక్ష్యం! అరబ్ నేషన్ లన్నీ కలిసికట్టుగా ఏమైనా చేసే పరిస్థితి కూడా లేదు. దేవుడన్నవాడుంటే అతనే దిక్కు పాలస్తీనాకు.

      Delete

వ్యాఖ్యానించినందుకు చాలా చాలా థాంక్స్.