Pages

16/02/2024

ఆవిష్కరణ - శ్రీదేవీ మురళీధర్

 ఆవిష్కరణ, (ఆల్కహాలిక్ ల పిల్లలు - ఒక అవగాహన) - శ్రీదేవీ మురళీధర్ 



ఆల్కహాలిజం ఒక (సామాజిక) రుగ్మత.  అధిక ఆదాయం తెచ్చిపెట్టే ఆల్కహాల్ వల్ల ప్రభుత్వాలు నడుస్తున్నాయి. మద్య విధానాలు అవి తెచ్చి పెట్టే సంపద వలనా, సామాజికంగా, ఆర్ధికంగా వచ్చిన కొత్త మార్పుల వలనా, ఆల్కహాలిజం చాప కింద నీరులా మన సమాజంలో పాకిపోయి ఉంది. దీనివల్ల కుటుంబాలు ఎలానూ నాశనమవుతాయి. ముఖ్యంగా  ఆల్కహాలిక్ ల పిల్లలు ఎదుర్కొనే బాధలు,  "నొచ్చుకోళ్ళ స్థాయిలనుండి, అత్యాచారాలవరకూ, శారీరక మానసిక వేధింపులు, సామాజిక వెలివేత - ఆర్ధిక వెనుకబాటు" - వీటి మధ్య నలుగుతున్న పిల్లలు! వీళ్ళ గురించి ఎంతో చక్కగా రాసిన పుస్తకం ఇది. 


ఆల్కహాలిజం ఒక వ్యాధి. దీని బారిన పడినవాళ్ళు తాగకుండా ఉండలేరు. దీని నుండీ బయటపడడం అసాధ్యమేమీ కాదు. దానికి సంకల్ప బలం ఉండాలి. ఇది తరవాత. ముందు, ఆల్కహాలిక్ ల కుటుంబ సభ్యులు దీనికి ఎలా బలవుతారో, దీనికి పరిష్కారం ఏమిటో తెలియాలి. సోషల్ డ్రింకింగ్ వేరు, మెల్లగా అలవాటు పడిపోవడం, అది వ్యసనంగా మారడం, మత్తు కోసం కుటుంబ సభ్యులను, వృత్తిని నిర్లక్ష్యం చేయడం, ప్రమాదాల బారినపడడం, లేదా ఇతరులను వేధించడం వేరు.  ఆల్కహాలిక్ ని కుటుంబం ఎలానో ఒకలా రక్షిస్తూ ఉంటుంది. అతని భార్య పిల్లల కడుపు నింపడం కోసం ఎలానో బాధ్యతల్ని తలకెత్తుకుంటుంది. పైగా బయటివారికి చాలా వరకూ తమ ఇంటిలో ఆల్కహాలిజం సమస్య ఉన్నట్టు తెలియడం అవమానకరం / ప్రమాదం అనుకుంటుంది.  ఇలాంటి స్టిగ్మా లు, త్రాగుడు అవమానకరం గా భావించడం, తండ్రి ఎప్పుడు చూసినా మత్తులో మునిగి ఉండడం - భార్యా, పిల్లల పరిస్థితి అగమ్యగోచరంగా మారడం వగైరాలు మనం తరచుగా చూస్తూంటాము. సమాజం త్రాగుబోతు కుటుంబాన్ని ట్రీట్ చేసే పద్ధతి గురించి కూడా అందరికీ తెలిసినదే. 


పిల్లలు తల్లి తండ్రుల మధ్య సంఘర్షణకు ప్రత్యక్ష సాక్షులు. మత్తు లో జరిగే నేరాలు - పైగా పిల్లల ఎదుటే భార్యను కొట్టడం, కొన్ని విపరీత పరిస్థితుల్లో చంపడం, దానికి పిల్లలు అతి దగ్గరి, సాక్షులవడం మనకు పేపర్లలో / వార్తల్లో తెలుస్తుంటుంది. ఒక వేళ హింస ఇంత స్థాయిలో లేకపోయినా, ఆల్కహాలిక్ ల పిల్లలు - చిన్నబోవడం, ఇతరుల్లా తమ బాల్యం ఎందుకు చీకూ చింతా లేకుండా గడవదో తెలియకపోవడం, తల్లి నిస్సహాయత, తండ్రి ఆదరణ కు నోచుకోకపోవడం / ఉన్న డబ్బల్లా ఆల్కహాల్ కే ఖర్చుకావడం వల్ల ఆర్ధికంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి రావడం - ఇవన్నిటికీ గురవుతారు.  పిల్లల్ని తమ రెక్కల మధ్య పొదువుకోవల్సిన తల్లిదండ్రులు ఆల్కహాలిసం కారణంగా పిల్లలను ఎంత అంధకారంలోకి నెట్టేస్తున్నారో తెలుసుకోవాలి. (ఈ పుస్తకంలో - బీద మధ్యతరగతి భారతీయ కుటుంబాలను ప్రస్తావించారు. ఈ కుటుంబాలలో స్త్రీల కన్నా, పురుషుల్లో ఆల్కహాలిసం ఎక్కువ. కొన్ని సార్లు స్త్రీలు కూడా ఈ వ్యసనానికి గురయి ఉండవచ్చు, ఈ రోజుల్లో పిల్లలలో కూడా త్రాగుడు, డ్రగ్ ఎడిక్షన్, ప్రవర్తనా దోషాలు మొదలయ్యాయి. వీటికి ఇలాంటి ఆల్కహాలిజపు కుటుంబ నేపధ్యం ఉండడం చూస్తున్నదే).   


చాలా సార్లు ఈ పిల్లలు అపరాధ భావంతో, న్యూనత తో బాధ పడతారు. ఈ పిల్లలు  మగపిల్లలయితే, చిన్నవయసు నుందే కుటుంబ బాధ్యతల్ని మోయాల్సొస్తుంది. తమ లక్ష్యాలనూ, ఇష్టాలనూ, ఆటపాటలను పక్కన పెట్టి చిన్న చిన్న ఉపాధి మార్గాలను ఎన్నుకోవాల్సి ఉంటుంది.  ఆడ పిల్లలయితే, చాలా మటుకూ బడి మానేసి, తమ కన్నా చిన్న పిల్లల్ని సాకాల్సొస్తుంది.  తండ్రి తాగి తాగి ఉపాధి కోల్పోయాక, తల్లి సంపాదించేందుకు, ఇంటి పని నీ, తన కన్న చిన్న వయసు  పిల్లల్ని,  ఆడ పిల్లల కు అప్పజెప్పి పనికి వెళ్ళాల్సి వస్తుంది.  


ఆల్కహాలిక్ లు కూడా పిల్లల వల్ల పెరిగిన కష్టాలవల్లే తాగుతున్నామని వాళ్ళ మీద నిందలేస్తారు. తల్లులు పిల్లల కు తండ్రి నిద్రపోతున్నాడనో, జ్వరం వచ్చి పడుకున్నాడనో అబద్ధం చెప్తారు. వీళ్ళ కుటుంబాలలో రాయని రూల్స్ ఉంటాయి. నిశ్శబ్దం, ఎప్పుడేం జరుగుతుందో అనే భయం, వేలాడుతుంటాయి. అందుకే చాలాసార్లు పిల్లలు "మా నాన్న తాగకుంటే ఎంత బావుండేది ? మా నాన్న తాగుడు ను నేను మానిపించలేనా ?"  అని బాధపడుతుంటారు. తండ్రి తాగి వచ్చి పడిపోతే పిల్లకి ఎంత అవమానంగా, బాధగా ఉంటుందో. వాళ్ళకి ఒక రోల్ మోడల్ ఉండరు. ఎవరి నుంచి ఏ మంచిని గ్రహించాలో తెలియదు. తల్లి అవమానంగా ఫీల్ అవుతుంటుంది. పిల్లలు ఇతరులతో తమను తాము పోల్చుకుంటారు. చదువులో వెనుకబడతారు. ఇతరుల మీద జెలసీ ని పెంచుకుంటారు. న్యూనతను బయటికి కనిపించనీయకుండా అతి ఏక్టివ్ గా, జోకర్ల లా / అతి పని మంతుల్లా, అతి మంచి వారిలా అందరి  acceptance కోసం ఎదురుచూస్తూ, పొగడ్తల కోసం, గుర్తింపు కోసం వెంపర్లాడుతూ, పని రాక్షసులు కూడా అయిపోతారు.  


రచయిత్రి ఎడిక్షన్ కౌన్సెలర్ గా పనిచేస్తున్నారు. తన 28 సంవత్సరాల అనుభవం తో ఈ పుస్తకాన్ని ఆల్కహాలి క్ ల పిల్లల వైపు మన దృక్పథం మారాల్సిన సంగతి గురించి చర్చించేందుకు రాసారు. సామాజికంగా ఒక లాంటి మానసిక & ఎమోషనల్ వెలివేత ని పిల్లలు ఎలా ఎదుర్కోవాల్సొస్తుందో, వాళ్ళ ప్రవర్తనల్లో తేడాల కారణంగా టీచర్లు, కౌన్సెలర్ లు ఎలా గుర్తించాలో చెప్తారు.  చదువులో వెనకపడిన పిల్లలు, చుట్టూ ఉన్న పరిస్థితులకు ఎటువంటి స్పందననీ వ్యక్తపరచకుండా మౌనంగా ఉండిపోవడమే మేలనుకునే పిల్లలు, ఎవరినైనా  నమ్మడం అనవసరం అనుకునే పిల్లలు, తమలో బాల్య చాపల్యం వల్లో, మానవ సహజ నైజం వల్లో ఏవైనా కోరికలు ఉన్నా కూడా వాటిని ఎటూ నెరవేరవు కదా అని అణుచుకుని, చిన్నబోయి ఉండే పిల్లలు - బహుశా ఇంట్లో ఏదో రకమైన అబ్యూస్ కి గురవుతున్నవారు, అలవి కాని బాధ్యతల్ని మోయాల్సొచ్చేవారు - ఇలా ఆల్కహాలిక్ ల పిల్లలు ఎన్నో రకాలు. అయితే వీళ్ళ సంఖ్య తక్కువేమీ లేదు. వీళ్ళు 'ఎవరో ' చాలా తక్కువ పెర్సెంటేజీలలో లేరు. ప్రపంచ వ్యాప్తం గా ఉన్న పిల్లలలో ఆల్కహాలిజం బారిన పడిన కుటుంబాల పిల్లలే 20% ఉన్నారు. లైంగిక వేధింపులకు గురయ్యే పిల్లల కేసుల్లో 90% మంది నేరస్తులు ఆల్కహాలిక్ లే. 




ఈ పుస్తకం రాయడం వెనుక మంచి ఉద్దేశ్యమే ఉంది. ఆల్కహాలిజం తాలూకు పర్యవసానం భయంకరమైనది. అదుపుతప్పిన మద్యపానం కాలక్రమేణా మతిభ్రమణం లేదా మరణం వైపు దారితీస్తుంది. ఈ వ్యాధిని పూర్తిగా నియంత్రిచ్చవచ్చు. 

ఈ వ్యాధి పట్ల సరైన అవగాహన ఉన్న డాక్టర్ వైద్యసేవను, ఎడిక్షన్ కౌన్సిలింగ్ ను పొంది, త్రాగుడు కు స్తస్తి చెప్పడంతో ఒక ఆల్కహాలిక్ తప్పకుండా స్వస్థుడు కావచ్చు.  Alcoholics Anonymous  అనే స్వచ్చంద సంస్త ప్రపంచ వ్యాప్తంగా ఆల్కహాలిజం వ్యాధిన పడిన పేషెంట్ ల కోసం అపూర్వ సేవాభావంతో దశాబ్దాలుగా కృషి జరుపుతుంది. వాళ్ళని పూర్తిగా త్రాగుడు మానిపించగలిగేలా చేసింది. ఏ fee / కనీసం పేరు కూడా అడగకుండా ఈ సంస్థ తన సేవలను అందిస్తుంది. ఈ సంస్థ మన దేశంలో వివిధ ప్రాంతాలలో నడుస్తుంది. వాటి వివరాలు, ఎడ్రసులు, ఫోన్ నెంబర్లు పుస్తకంలో ఉన్నాయి. తాగుడు కు దూరంగా ఉన్న పేషెంట్ తప్పకుండా మంచి జీవితం మొదలుపెట్టగలుగుతాడు. ఇది స్వచ్చందంగా, మనస్పూర్తిగా పేషెంట్ తరఫునుండీ రావలసిన కోరిక / మార్పు. అలా ఆల్కహాల్ లేకపోతే చచ్చిపోతానేమో అనే భయాన్నిండీ, మానేసాక తన జీవితం ఎంత బావుండబోతోందో ఆలోచించుకునేలాగా చేయగలగడం, ఆ తరవాతి ప్రాసెస్ - దానికి ఈ సంస్థ ఇచ్చే తోడ్పాటు ల గురించి చాలా మంచి ఫీలింగ్ కలుగుతుంది.  ఎందుకంటే  ఆల్కహాలిజం కేవలం త్రాగే మనిషిని మాత్రమే కాకుండా, అతని కుటుంబ వ్యవస్థ ని పునాదులతో సహా కూల్చేసే ప్రమాదకరమైన వ్యాధి. 

ఆల్కహాలిక్ ల పిల్లలు సాధారణంగా పెద్దవాళ్ళయాక ఆల్కహాలిజం వైపు మళ్ళే అవకాశాలు ఎక్కువే.   ముందే చెప్పినట్టు, వాళ్ళు తమ రోల్ మోడళ్ళని కోల్పోతారు.  నిజానికి పిల్లలు ఆల్కహాలిజానికి కారకులూ కారు, ప్రేరకులూ కారు. కానీ దాని నష్టాలన్నీ పూర్తిగా అనుభవిస్తారు.  ఆదర్శంగా నిలవాల్సిన పేరెంటింగ్ వాళ్ళకు దక్కదు. అయితే, వాళ్ళని కౌన్సిల్ చేసే వాళ్ళు చేయాల్సిన మొదటి పని, తాము ఒంటరులం కాదని, తల్లితండ్రులు ఎడిక్ట్స్ అయితే దానిలో తమ తప్పు లేదనీ, తెలుసుకొనే లా చేయడం. ఇది వాళ్ళ గుండెల్లో భారాన్ని సగం తగ్గిస్తుంది. ఇంటిలో ఎలాంటి పరిస్థితులున్నా, హాయిగా ఆడుకోవడం, చిన్న చిన్న విషయాల్ని పట్టించుకోకుండా సంతోషంగా ఉండమని చెప్పడం ! అయితే ఎంతయినా అవి 100% భద్రతా భావాన్ని ఇవ్వవు. అ తల్లిదండ్రులు ఆల్కహాలిజం తాలూకూ విష వలయం నుండీ బయట పడి, వాళ్ళ కుటుంబం లో నార్మల్సీ రావడం మాత్రమే ఆ పిల్లలకి అవసరమైన భద్రత. 

పుస్తకంలో వివరాలు చాలా సమగ్రంగా ఉన్నాయి. పిల్లలు ఎన్ని బాధలు పడతారో, ఆ అనుభవాలు వాళ్ళ భవిష్యత్తును ఎలా మార్చేస్తాయో - పట్టికల లా, సైంటిఫిక్ ప్రశ్నావళులతో - ఉదాహరణలతో, డేటా తో చక్కగా వివరించే ప్రయత్నం చేసారు. ఈ పుస్తకం చేరాల్సిన వాళ్ళకు / సహృదయులకు తప్పకుండా చేరాలి.  నిజానికి అమూల్యమైన పుస్తకానికి ఏ వెలా లేదు. ఇది పుస్తక ప్రదర్శన లో ఉచితంగా పంచుతున్నారని విన్నాను. రచయిత్రి ఈ పుస్తకం తో పాటు నాకు 'బుజ్జి ఒక పని మనసు కథ ( Original : "Bottles Break" by Nancy Grande Tabor ) అని ఇంకో పుస్తకం కూడా పంపించారు. ఇది బొమ్మల పుస్తకం. బొమ్మలు బాలివి. ఇది కూడా ఉచితం. ఈ పుస్తకాలు నాకు పోస్ట్ లో వచ్చాకా ఎంత అయిందా అని వెల వెతుక్కున్నాను. జస్ట్ వివరాలడిగితే పుస్తకాలు పంపించారు. ఇంత మంచి పుస్తకాలు నిజంగా టార్గెట్ పాఠకులని చేరితే తప్పకుండా వాళ్ళ జీవితాల్లో మంచి మార్పుని తీసుకురాగలుగుతాయి.   

ఉదా : బుజ్జి నుంచి:-



పుస్తకాన్ని NS Mani Charitable Trust  తరఫున శ్రీదేవీ మురళీధర్ ప్రచురించారు. ఈ పుస్తకం అవసరమైన వాళ్ళకి / కావాలనుకున్న వారికి ఉచితం. ఇంత మంచి ప్రయత్నం చేసినందుకు, స్వచ్చందంగా దీనిని వీలైనంత మంది చదివేందుకు ఉద్దేశించినందుకు, శ్రీదేవి గారికి చాలా ధన్యవాదాలు, అభినందనలు. 

***

1 comment:

  1. వందేళ్ల తెలుగు సాహిత్యం నుంచి ఏర్చి కూర్చిన కవితలు, విశ్లేషణ వ్యాసాలు , ఇంకా అనేక ఆసక్తికరమైన అంశాలను పొందుపరిచిన వెయ్యి పేజీల గ్రంథం "కవన గర్బరాలు".. అమెజాన్ లో అందుబాటులో ఉంది. వెల ఆరువందల రూపాయలు.. సంపాదకులు చేపూరి సుబ్బారావు వి.కె.ప్రేంచంద్
    https://kavanagarbaralu-telugubook.blogspot.com/2024/01/blog-post.html

    ReplyDelete

వ్యాఖ్యానించినందుకు చాలా చాలా థాంక్స్.