Telugu : చెదిరిన సమాజం - చినువా అచెబీ
(అనువాదం : శ్రీ కొలసాని సాంబశివరావు)
ఈ పుస్తకం (Things Fall Apart), నైజీరియన్ నవలాకారుడు చినువా అచెబీ మొదటి నవల. 1958 లో ప్రచురించబడింది. ఇప్పటి వరకూ దాదాపు 20 మిలియన్ కాపీలకు పైగా అమ్ముడైన ఈ నవల, ఇంగ్లీష్ లో వచ్చిన తొలితరం ఆఫ్రికన్ సాహిత్యపు అక్షయ పాత్ర. 1923 నుండీ 2005 దాకా ఇంగ్లీషు లో వచ్చిన 100 గొప్ప పుస్తకాలలో ఒకటి గా Time చేత కీర్తించబడింది. 50 కి పైగా భాషల్లోకి అనువదించపడి, ఆఫ్రికా గురించి లోకం తెలుసుకునేలా చేసిన నవలల్లో ప్రసిద్ధి చెందినది. నైజీరియాలో ఊహాజనితమైన ఒక గ్రామం, అక్కడి తెగలు, వాటి శౌర్యం, కట్టుబాట్లు, ఆచారాలు, మూఢ నమ్మకాలు, చిక్కుముళ్ళు, సాంప్రదాయాల గురించి చాలా సహజమైన చిత్రణతో రూపుదిద్దుకున్న నవల ఇది. ఆఫ్రికన్ సమాజపు జీవితం, క్రైస్తవ మిషనరీల రాకతో ఎంతగా మారిపోతుందో - డాక్యుమెంట్ చేసిన నవల. అచెబీ తరవాత ఆఫ్రికన్ జీవన విధానం గురించి అలవొకగా రాయగలిగిన స్థానిక రచయితల్ని బాగా ప్రభావితం చేసిన నవల కూడా.
ఒకొన్ క్వో ఈ నవలలో ప్రధాన పాత్ర. అతను దుర్భర బీదరికం నుండీ తనను తాను రక్షించుకుని, కఠోర శ్రమతో తన జీవితాన్ని ఒక దారిలో పెట్టుకున్నవాడు. శ్రమకోర్వలేని, పిరికివాడయిన తన తండ్రి, తన భార్యాపిలల్ని అర్ధాకలిలోనే జీవితాంతం ఉంచడాన్ని, అప్పుల్లో మునిగి తేలి ఆడడాన్ని అస్సలు సహించని కొడుకు గా, సామాజికంగా, ఆర్ధికంగా ఎదిగి, ముగ్గురు భార్యలు, పిల్లలతో, 'తెగ పెద్దల్లో' ఒకడుగా చలమణీ అయే స్థాయికి ఎదిగిన ఒకొన్ క్వో చుట్టూనే కథ నడుస్తుంది.
అదృష్టవశాత్తూ ఈ నవలని తెలుగులో చదివి, తెలుగు భాషా సౌందర్యం, చదవడంలో సౌలభ్యంతో అసలు ఇంత సింపుల్ గా చక్కగా అనువదించినందుకు అనువాదకుడికీ, ఇంత సులువు భాషలో రాసినందుకు నైజీరియన్ రచయితకూ నమస్కారం పెట్టుకోవాలనిపించింది. W.B. Yeats రాసిన The Second Coming అనే కవిత లోంచి శీర్షికనూ వస్తువునూ రచయిత స్వీకరించారు.
----------------------------------------------------------------------------
Things fall apart ; the centre cannot hold ;
Mere anarchy is loosened upon the world.
అన్నీ చెల్లా చెదురైపోతాయి. ఎవరూ దాన్ని ఆపలేరు.
ప్రపంచమంతటా అరాచకత్వమే వెల్లివిరిసింది.
-----------------------------------------------------------------------------
ఒకప్పుడు ఐక్యంగా ఉన్న తెగకు సంబంధించిన కథ ఇది. అప్పట్లో ఆ తెగలో వారందరిదీ ఒకే మాట. అందరిలోనూ ఒకేరకమైన చైతన్యం వుంటుంది. తెల్లవాడు వచ్చాక ఆ ఐక్యత భగ్నమవుతుంది పాత సమాజం క్రమంగా శిధిలం అయిపోతుంది. అశరీర వాణి (Oracle) ని దైవంగా ఆరాధించే ఒక ఆఫ్రికన్ తెగ - ఆ తెగ వారికీ ప్రకృతికీ గల అనుబంధం, కట్టుబాట్ల పేరుతో జరిగే న్యాయ తీర్పుల అన్యాయమూ, సంస్కృతి పేరుతో నడిచిన అనాగరికతలని గురించి, చెప్పిన రచయిత, చివరిదాకా - కథ ను గ్రిప్పింగ్ గా చెప్పుకుంటూ రావడం వల్ల, ఇప్పుడు ఎన్నో నాగరికతలు అంతరించిపోయి, రోజుకో కొత్త నాగరికత పుట్టుకొస్తున్న కాలంలో - కొత్త కొత్త తప్పొప్పుల మధ్య పాత విధానాలు సమసిపోయాక, ఏదో ఇతిహాసం చదివినట్టు అనిపిస్తుంది.
నైజర్ నది ఒడ్డున ఇబో గ్రామం లో ఉమ్యోఫియా తెగలో సోమరిపోతు తండ్రి ఉనోకా, అతని బలవంతుడైన కొడుకు ఒకోన్ క్వో ల కథ ఇది. ఉనోకా సంగీత కళాకారుడు. పిల్లంగోవి వాయిస్తాడు. కానీ అతనికి యుద్ధాలంటే భయం. ఒకోన్ క్వో కు బీదరికమంటే భయం. ఎవరయినా తనని అశక్తుడనో, భీరువనో అనుకుంటారని భయం. తన భయాలను అణుచుకునేందుకు అతనెంచుకునే మార్గం, ఎదురుదాడి, అహంకారం, శౌర్యం, కోపం. పైగా అతను తన తండ్రి చివరి దశను చూసి ఉన్నాడు కనుక, అలాంటి ఒంటరి చావు తనకు రాకూడదని, తన తెగలో పెద్దమనుషుల్లో ఒకడిగా - అందరి మధ్యా, తన పెద్ద కుటుంబంతో బ్రతకాలని ఆశిస్తూ, తన జీవితాన్ని కేవలం శ్రమతో, కష్టంతో, విపరీతమైన పట్టుదలతో మలచుకున్నవాడు. అతనికి ఉన్న అవలక్షణం విపరీతమైన కోపం. అతని భార్యలు అతనికి అణిగిమణిగి ఉండటానికి ఆ కోపమే అతనికి ఉపయోగపడుతుంది. అయితే అదుపులో ఉంచుకోలేని ఆ కోపమే అతని పతనానికి, వైఫల్యానికీ దారితీస్తుంది.
ఎంబయినో గ్రామం వాడొకడు వీరి గ్రామపు మహిళను హత్య చేయడంతో పరిహారంగా వారితో సంధి చేసుకోవడానికి ఒక పెద్ద మనిషిగా వెళ్ళి, (లేకపోతే ఉమ్యోఫియా తెగ వారు వారి గ్రామాన్ని మట్టి కరిపిస్తారు. వారికి, వారి తెగకూ, ఆ ప్రాంతాలలో కెల్లా గొప్ప యోధులని పేరుంది మరి) అక్కడి నుండీ ఒక కన్నెపిల్లనూ, ఎకెమి ఫ్యునా అనే పదిహేనేళ్ళ బాలుడినీ తీసుకొస్తాడు ఒకోన్ క్వో. పిల్లను మరణించిన మహిళ భర్తకు భార్యగా అప్పగిస్తారు. పిల్లవాడిని ఒకోన్ క్వో సంరక్షణలో నే ఉంచుతారు. ఆటవిక తెగల్లో, హత్యకు బదులు - హత్యే. ఈ పిల్లాడి సంగతి తరవాత చూద్దామని నిర్ణయిస్తారు. తన ప్రయాణం 'మృత్యువు వైపే' అని తెలీని ఆ పిల్లాడు మూడేళ్ళు తన సొంత ఇంటిని మరచి, వీళ్ళతోనే ఉంటాడు. ఒకోన్ క్వో ని "నాన్నా" అని పిలుస్తాడు. అతని కొడుకుతో కలిసే పెరుగుతాడు. అందరికీ అతనంటే వాత్సల్యం పెరుగుతుంది. కానీ దైవం చెప్పాడని, మూడేళ్ళ పాటు తన పిల్లలతో సమానంగా సాకిన ఆ పిల్లాడిని, నిర్దాక్షిణ్యంగా నరికేసి చంపేస్తారు. ఆ చంపేస్తున్న వాళ్ళ గుంపులో ఒకోన్ క్వో కూడా వుంటాడు. "నాన్నా, నన్ను చంపేస్తున్నారు!" అని అరుస్తూ తనకేసి పరిగెత్తుకొచ్చిన కుర్రాణ్ణి, "తెగ గౌరవం కోసం, మిగిలినవాళ్ళు తనను పిరికివాడనుకుంటారని భయంతో", నిలువునా నరికేస్తాడు.
ఆ పాప కార్యం - 'తెగ దేవుడి' వచనం (భవిష్య వాణి) ప్రకారం, తెగ కోసం, ప్రకృతి నియమాల కోసం అని సర్ది చెప్పుకున్నా కూడా చాలా రోజులు ఒకోన్ క్వో మనిషి కాలేకపోతాడు. ఒకోన్ క్వో కొడుకు 'న్యోయే' మాత్రం, తాత మనస్తత్వంతో పుడతాడు. అతను పిరికివాడు. అతనికి, నరకడాలు, చంపుకోవడాలు ఇష్టం వుండదు. ఎకెమి ఫ్యూనా మరణం, తనని తండ్రిని ద్వేషించేందుకు దోహదం చేస్తుంది. కథలో చివరికి అతను తెగ కట్టుబాట్లకు వ్యతిరేకంగా తిరగబడి క్రైస్తవ మిషనరీల ప్రభావంలో పడి క్రైస్తవుడవుతాడు. జీవితంలో ఒకోన్ క్వో వంటి వైభవం సంపాయించుకున్న నాయకుడు కూడా విధివశాత్తూ విఫలుడౌతాడు. అతనితో పాటు అతని తెగ కూడా చిద్రమయిపోతుంది.
తెగలో కొన్ని తీవ్రమైన కట్టుబాట్లుంటాయి. అక్కడ ప్రతి ఊరికీ, ఒక్కో "పాపిష్టి అరణ్యం" ఉంటుంది. కుష్టు, మశూచి లాంటి జబ్బులతో చనిపోయినవారిని ఆ అడవుల్లో పాతుతారు. ఉనేకా మరణించేటప్పటికి అతని శరీరం వాచిపోతుంది. అట్లా వాయటం వాళ్ళ నమ్మకాల ప్రకారం అరిష్టం. జబ్బు అంటే నేలతల్లికి ఇష్టం వుండదు. కాబట్టి ఆ జబ్బు మనిషిని బ్రతికుండగానే ఆ అరణ్యంలోకి తీస్కెళ్ళి వదిలేస్తారు. అటు వంటి వారి మృతదేహాలకు సంస్కారాలేవీ ఉండవు. అవి అడవిలో ఎండాల్సిందే. ఉనేకా ని అడవిలోకి ఈడ్చేటప్పుడు, అతను తన పిల్లంగ్రోవిని వెంట తీసుకుపోతాడు. ఊర్లో ఎవరికైనా కవలలు పుడితే, ఆ పసి కూనలని కుండ పెంకుల్లో పెట్టి, చావడానికి, అడవిలో వొదిలేస్తారు. కవల పిల్లలు పుట్టడం కూడా అపచారమే. అలా ఆ అరణ్యం దుష్ట ఆత్మలతో ఎప్పుడూ సజీవంగానే ఉంటుంది.
అనారోగ్యాలతో, అశుభ్రత తో ఎందరో శిశువులు మరణిస్తుంటారు కదా. ఒక తల్లికి ఇలా పదే పదే పిల్లలు పుట్టి మరణిస్తుంటే, అలా మళ్ళీ మళ్ళీ పుట్టీ, చచ్చీ, తమ తల్లుల్ని క్షోభ పెడుతున్న్నందుకు ఆ చనిపోయిన శిశువు తాలూకు ఆత్మ, మళ్ళీ పుట్టేందుకు / పుట్టి మళ్ళీ చనిపోయేందుకు భయపడేలా ఆ మృతదేహాన్ని (ఆత్మ భయపడే విధంగా చిద్రం చేసి), ఖండ ఖండాలుగా నరుకుతారు. మళ్ళీ నేల తల్లి గౌరవార్ధం, పంట వేసాక, ఒక వారం (శాంతి వారం) పాటూ, గ్రామంలో ఎవరూ ఎటువంటి కోపతాపాలకూ, హింసకూ పాల్పడకూడదు. తప్పుల్లో, కావాలని చేసిన తప్పులు 'మగ' తప్పులు, పొరపాట్న జరిగిన తప్పులు 'ఆడ' తప్పులు గానూ పరిగణిస్తారు. వీటికి వేరే వేరే శిక్షలుంటాయి. తెగ లో నిషిద్ధం అని నిశ్చయం అయిన బోల్డన్ని పన్లు, ఎందరినో ఆశాంతికి గురి చేసినా కట్టుదిట్టంగా అమలు జరిపేంత ఐకమత్యం తెగ లో ఉంటుంది. ఈ ఐక్యతని (మత ప్రచారం ముసుగులో) తెల్లవాడు చెల్లాచెదురు చేస్తాడు. ఈ సంక్షోభం నుంచీ తెగని కాపాడుదామని బయల్దేరిన ఒకోన్ క్వో జీవితం కూడా చెదిరిపోతుంది.
ఒకోన్ క్వో కూడా "ఆడ" తప్పు (అనుకోకుండా జరిగిన హత్య) ఒకటి పొరపాట్న చేసి, ఏడేళ్ళ పాటు గ్రామ బహిష్కృతుడవుతాడు. అతను తన శిక్షాకాలం ముగిసి గ్రామానికి తిరిగొచ్చాక, సాంఘికంగా, రాజకీయంగా, మత పరంగా అక్కడ ఎన్నో మార్పులు చోటు చేసుకుంటాయి. క్రైస్తవం, స్కూళ్ళూ, వ్యాపారమూ పెరుగుతాయి. ప్రజలు తెగ కోసమో, సాంప్రదాయాలకోసమో పాకులాడరు. ఒకోన్ క్వో లా తెగ కోసం, తన బిడ్డ లాంటి పిల్లాడిని చేతులారా చంపుకునేంత మూఢత ఎవరిలోనూ మిగలదు. పదే పదే కవలల్ను వరుసగా కని, వారిని చేజేతులా అడవిలో చావడానికి వదిలేయాల్సొస్తుండే యువతి, ఈ సారి గర్భంతో ఉండగానే క్రైస్తవం లోకి చేరుతుంది. మూఢ నమ్మకాలనూ, ఉనికి పేరిట బూజు పట్టిన పాత మతాన్నీ, కట్టుబాట్లనూ, చదువు, ఆరోగ్యం, ఆయుష్హూ ఇవ్వని తెగ దురాచారాలని కొత్త తరం ద్వేషిస్తుంది.
పెద్ద పెద్ద బిరుదులున్న గ్రామ పెద్దలూ క్రైస్తవులవుతారు. అప్పటికి తెల్లవాని వలస రాజ్యంగా మారిన నైజీరియా సామాజిక చిత్రం మారటాన్ని, తన సంస్కృతి మీద జరిగిన దాడిగా ఒకోన్ క్వో భావిస్తాడు. మార్పుని అర్ధం చేసుకోలేక, నైరాశ్యంతో అతను చింతకు గురవుతాడు. ఈ పరిస్థితుల్లో, తన దేవుడిని, తన ఉనికినీ, తన సమాజాన్నీ రక్షించుకోవడం, తన చేతుల్లో ఉందేమో అని ఒకోన్ క్వో భ్రమపడతాడు. మారిన వ్యవస్థ మీద తిరుగుబాటు చేసి, తనని తాను ఒంటరి గా చూసుకుని ఒకోన్ క్వో జీవితాన్ని, తండ్రి లాగే నిస్సహాయంగానే ముగిస్తాడు.
కోపంతో, తెగ కోసం ఒక కోర్టు ఉద్యోగిని చంపి, ఒకోన్ క్వో ఆత్మ హత్య చేసుకుంటాడు. అలా ఆత్మహత్య చేసుకోవడం ఆ తెగ ఆచారానికి విరుద్ధం. అది నేలతల్లి పట్ల నేరం. అపచారం. అలా చేసిన మనిషి శవాన్ని ఆ తెగ మనుషులు పాతి పెట్టరు. అతడి శరీరం దుష్ట శరీరం. దానిని కేవలం కొత్తమనుషులు తాకడానికి మాత్రమే వీలుంటుంది. అలా అపరిచితులు (ఒకోన్ క్వో ద్వేషించిన విదేశీయులు) అతని శవాన్ని దింపి ఖననం చేయడం, ఒక విచిత్రమైన సన్నివేశం. అదీ ఈ కథ కు ముగింపు. ఈ పుస్తకం జెర్మన్ లోకి అనువదించినప్పుడు ఆ పుస్తకానికి పేరు, "ఒకోన్ క్వో" అనే పెట్టారు. ఇది ప్రధానంగా ఒకోన్ క్వో జీవిత గాధే !
కథంతా చదవదగ్గదీ, నెమరు వేసుకోగలిగిన భాష తో, చెప్పుకోవాల్సిన సామెతలతో - అందమైన వాక్యాలతో నిండిపోయి ఉంటుంది. దీనికి కారణం రచయిత చెప్పినట్టే, "(ఇబో) ప్రజలలో సంభాషణా కళకు ఎంతో ప్రాముఖ్య త ఉంది. సామెతలు ఆ కళకు జవసత్వాలు ఇస్తాయి."
ఇలా ఈ నవల సంప్రదాయ సంభాషణా చతురుని నైపుణ్యంతో సామెతలను వాడడం వల్ల, సామెత భావాలని స్పష్టంగా వివరించడమే కాకుండా ఆ భావాన్ని పాఠకుడి మనసులో శాశ్వతంగా పాతుకునేట్టు చేస్తుంది ఈ నవల్లో ఉపయోగించిన సామెతలతో పాటు జానపదకథలు, వారి తెగ కు చెందిన సంప్రదయాల, నిషిద్ధాల జాబితా కూడా పెద్దది. మల్ల యుద్దం, వివాహ పద్ధతి, వ్యవసాయ పద్ధతులు, అంతిమ సంస్కారాలు - ఇలా ఎన్నో అంశాలు తెలుసుకోవచ్చు. . ఉదాహరణకు కొన్ని వాక్యాలు చదవండి :
(i) ఈ మతప్రచారకుని మాటలకు మంత్రముగ్దుడైన యువకుడొకడున్నాడు. వాడి పేరు న్యోయే. ఒకోన్ క్వో పెద్ద కొడుకు. అతనిని వశపరచుకున్నది పవిత్రత్రయపు పిచ్చి తర్కం కాదు. అది అతనికి అర్ధం కాలేదు. అతనిని వశపరచుకొందేమిటంటే, అది ఈ కొత్తమతంలోని కవిత్వం. అది అతని ఎముకలలోని మూలిగను కదిలించింది. చీకట్లో భయంభయంగా కూర్చున్న సోదరుల గురించి తెలియజెప్పిన ఆ పాట. అతని లేత ఆత్మను వెన్నాడుతున్న ఒక వీడని అస్పష్టప్రశ్నకు జవాబు చెప్పింది. ఆ ప్రశ్న - పొదలలో విలపిస్తున్న కవల పిల్లల ప్రశ్న - చంపబడిన ఇకెమి ఫ్యూనా వేసిన ప్రశ్న. ఎండిపోయిన అతని ఆత్మపై ఆ పాట అతడికి ప్రశాంతినిచ్చింది. ఆయాసంతో రొప్పుతున్న ఎండిన నేలతల్లి నాలుకపై కరుగుతున్న మంచుగడ్డల బిందువుల్లా వున్నాయి ఆ పాటలోని మాటలు. న్యోయే పసితనపు మనసు అయోమయంలో పడింది.
(ii) అతడు మన భాష కూడా మాట్లాడలేకపోతుంటే, ఇక ఆచారాలు, వ్యవహారాలు ఎలా అర్ధం చేసుకుంటారు ? కాని వాడు మన ఆచారాలు చెడ్డవని అంటున్నాడు. వాడి మతం పుచ్చుకున్న మన సోదరులు కూడ మన ఆచారాలు చెడ్డవి అంటున్నారు. మన సోదరులే మనకు వ్యతిరేకమైనప్పుడు మనం వాళ్ళతో ఎలా పోరాడగలమని నువ్వు అనుకుంటున్నావు? తెల్లవాడు చాలా తెలివిగలవాడు. వాడు తన మతంతో పాటు నిశ్శబ్ధంగా, ప్రశాంతంగా ప్రవేశించాడు. వాడి తెలివితక్కువ తనం చూసి, నవ్వుకుని వాడుండడానికి అనుమతినిచ్చాము. ఇప్పుడు మన సోదరులను తన వైపు త్రిప్పుకున్నాడు. మన తెగ ఒకే మాటపై ఇక ముందు ఏ పనీ చేయలేదు. ఏ విషయాలైతే మనందరినీ ఐక్యంగా నిలబెడుతున్నాయో, వాటన్నిటి మీదా వాడు కత్తి మోపాడు. దాంతో మనం చెల్లాచెదురైపోయాం.
(iii) వేలాడుతున్న తన స్నేహితుడి శరీరాన్ని అదే పనిగా చూస్తున్న ఒబైరికా అకస్మాత్తుగా జిల్లా కమీషనరు వైపు తిరిగి ఆగ్రహంతో అరిచాడు. "అతను ఉమ్యోఫియాలో గొప్ప వాళ్ళలో ఒకడు. మీరు అతనిని ఆత్మహత్య చేసుకునేట్టు చేసారు. ఇప్పుడు అతను కుక్కలాగా పాతిపెట్టబడుతున్నాడు...." అతడు ఇంక ఏమీ మాట్లాడలేకపోయాడు. అతని గొంతు వణికి, మాటలు రాకుండా పోయాయి.
సంభాషణల్లో పొదిగిన కొన్ని సామెతలు :
(1) ఎత్తయిన ఇరోకో చెట్టు నుండి కిందపడ్డ బల్లి ఎవరూ తనని పొగడకపోతే, తనకు తానే పొగుడుకుంటానందంట.
(2) (దీనికి ఏదో ఒక కారణం వుంటుంది). కప్ప ఉత్తపుణ్యానికి పట్టపగలు గెంతదు.
(3) (మనవాళ్ళు అన్నట్టు) పెద్దవారిని గౌరవించేవారు తమ పెద్దరికానికి బాట వేసుకుంటారు.
(4) వినికే పక్షి ఇలా అందంట : "గురి తప్పకుండా మనుష్యులు తనను షూట్ చెయ్యడం నేర్చుకున్న నాటి నుంచీ, తాను కూడా వాలకుండా ఎగరడం నేర్చుకున్నాను " అని.
(5) పట్టపగలే గంతులేస్తూ గోదురు కప్ప కనిపించిందంటే, దాని ప్రాణానికి ఏదో ముప్పు వచ్చినట్ట్లు తెలుసుకో.
(6) మండే మంటే ఎప్పుడూ చల్లటి, శక్తిలేని బూడిదనే పుట్టిస్తుంది.
(7) ఏమీ చెప్పనటువంటి మనిషిని ఎప్పుడూ చంపవద్దు. అతని నిశ్శబ్దం వెనుక ఏదో ఒక అశుభం వుంటుంది.
***
నైజీరియా దేశం తెల్లవాళ్ళ పాలనలో ఉన్నప్పుడు, ఆ Colonization ప్రభావాలలో ఒకటిగా దేశంలో ప్రవేశపెట్టబడిన ఇంగ్లీషు విద్య - అప్పుడు స్కూళ్ళలో చదువుకుని ప్రపంచాన్ని ఎరిగిన తరం లోని వాడు రచయిత చినువా. అందుకే అతను క్రైస్తవ మిషనరీల ప్రవర్తనలో తప్పుపట్టాల్సినదేదీ లేదన్నట్టూ, మిషనరీలు నడిపిన వారు స్థానికుల పై అత్యాచారాలకు పాల్పడినట్టూ రాయలేదు. పైగా కొత్త నీరు, పాత నీరుని తొలగించినంత సహజంగా నైజీరియాలో పురాతన తెగల వారు కూడా ఇతర మతాల వైపు ఆకర్షితులయి, కొత్త జీవన విధానాల్ని స్వీకరించినట్టు రాస్తారు. అయితే దీనినే ఇప్పటి ఆధునిక యుగంలోకి తీసుకుంటే, ఇప్పటి గ్లోబలైజేషన్ ఎలా కొన్ని సమాజాలను చెల్లాచెదురు / వినాశనం చేసేస్తుందో గమనించవచ్చు.
మొత్తానికి తేలిక పదాలతో, చక్కని భాషతో మూల రచయిత చెప్పదలచుకున్న కథ ని చాలా చక్కగా తెలుగులోకి అనువదించింది శ్రీ కొలసాని సాంబశివరావు గారు. ఈ పుస్తకం ఇప్పుడు తెలుగులో దొరికే అవకాశాలు తక్కువ కాబట్టి కథాప్రపంచం కిరణ్ గారు పంపిన జెరాక్స్ కాపీ (రెండు పేజీలు మిస్ అయ్యాయి) నే చదివి చాలా ఆనందించాను. ఒకసారి ఒకరు అపురూపంగా చదివి, అండర్లైన్లు చేసుకున్న పుస్తకాన్ని - అంతే మురిపెంగా పాత పుస్తకాల మార్కెట్ లో దొరకపుచ్చుకుని ఇంకొకరు ఆ పుస్తకానికి కొన్ని కాపీలు తీసి, పుస్తకప్రేమికులతో పంచుకోవడం ఒక మంచి అనుభూతి. మంచి పుస్తకాలు పాఠకుల్ని ఎలాగయినా చేరతాయి అనేందుకు ఇదో ఉదాహరణ.
No comments:
Post a Comment
వ్యాఖ్యానించినందుకు చాలా చాలా థాంక్స్.