Pages

15/12/2023

The Breast Giver - Mahashweta Devi

 


"స్తనదాయిని"  / "బ్రెస్ట్ గివర్", మహాశ్వేతా దేవి రాసిన బ్రెస్ట్ స్టోరీస్ సంకలనం లోని కథ. ఈ సంకలనంలో విషయం, ముఖ్యంగా స్త్రీల స్తనాలు.   స్త్రీ శరీరం  మహా వృక్షంలాంటిది. అది మొలకెత్తిన దగ్గరినిండీ, చివురై, పెరిగి, వృక్షమయి, మరణించాకా కూడా మనిషికి ఎలా  ఉపయోగపడుతుందో, స్త్రీ శరీరాంగాలు కూడా అలానే మానవాళికి ఒక్కోలా,  ఆమె బ్రతికినన్నాళ్ళూ  ఉపయోగపడుతూ వస్తున్నాయి.  

రేప్ ని ఒక ఆయుధంగా వాడి, స్త్రీని మానసికంగా కృంగదీసేందుకు మనిషి యుగాలుగా ఎలా ప్రయత్నిస్తూ వచ్చాడో, ఆమె శరీరాన్ని, అమ్మతనాన్ని కూడా అతిగా వాడేసుకుంటూ, ఒక ఆధిపత్యం చలాయించాడు. ఆ మానవ జాతి ఆధిపత్య పరిణామాల్ని నిర్మొహమాటంగా బయటపెట్టిన మూడు కథల్ని ఈ సంకలనంలో ప్రచురించారు. వీటిల్లో స్తనదాయని ఒక ముఖ్యమైన / పెద్ద కథ. 

ఈ సంకలనంలో మొదటి కథ 1971 యుద్ధ సమయంలో  లక్షలాదిగా లైంగిక హింసకు, హత్యలకూ గురయిన బెంగాలీ మహిళల కథల్లో ఒక ఆదివాసీ మహిళా విప్లవకారిణి  'ద్రౌపది' పై జరిగిన అత్యాచారాన్ని వర్ణిస్తుంది. ఆమెను వైన వైనాలుగా గుంజలకు కట్టి అత్యంత హింసాత్మకంగా సైనికులు గాంగ్ రేప్ చేసాక చీలికలైపోయిన స్తనాలు, రక్తపు మడుగైపోయిన శరీరమూ, తిండి లేక, దెబ్బలు తిని విపరీతమైన నీరసంతో కూలిపోవాల్సిన ద్రౌపది, తననీ, తన గాయాల్నీ బట్ట తో కప్పుకునేందుకు నిరాకరించడం ఆమె ధిక్కారాన్ని, ధైర్యాన్ని, మానసిక దృఢత్వాన్నీ బయటపెడతాయి. 

అయితే 'స్తనదాయని' మాత్రం పూర్తిగా భిన్నమైన కథ. జశోద ఈ కథ కి హీరోయిన్. ఆమె భర్త కంగాళీచరణ్ కీ ఆమెకీ బ్రతికున్న పిల్లలూ, చనిపోయినవాళ్ళూ కలిపి 20 మంది పిల్లలు పుట్టారు.  జశోదకి తన రొమ్మున పాలుతాగుతూ ఒక శిశువయినా లేకుండా ఎప్పుడూ లేదు. పిల్లలకి పాలివ్వడంలో ఆమె ఆరితేరింది. ఒక రకంగా రచయిత్రి మాటల్లో జశోద ఒక "Professional Mother". 

ఒకరోజు ప్రమాదవశాతూ, జశోద భర్త యజమాని హల్దర్ కొడుకు కారు కంగాళీచరణ్ కాళ్ళ మీదుగా నడవడంతో అతని మోకాలి కింది భాగం, పాదాలు తీసేయాల్సి వస్తుంది. దాంతో అవిటి వాడైన కంగాళీచరణ్ భార్యా పిల్లల్ని పోషించుకోవడం ఎలా ? ఒక బ్రాహ్మణుడికి హాని చేసానే అన్న చింతతో హల్దర్ బాబు అమ్మవారి ఆలయం ముందర ఉన్న తన ఇంటరుగునే వీళ్ళకిచ్చి దాన్లో షాప్ ని పెట్టిస్తాడు. అమ్మవారి దర్శనానికొచ్చే భక్తుల కొనుగోళ్ళతో సంసారం ఎలాగో నడుస్తుంది. 

అయితే, కంగాళీ చరణ్ స్నేహితుడు, అదే ఆలయం లో భక్తులకు గైడ్ గా ఉన్న నబీన్ కు ఎప్పుడూ జశోద పెద్ద స్తనాలే ఆకర్షణ. అతని కళ్ళు, కలలు, ఆమె రొమ్ముల ఆకర్షణలో దినం రాత్రీ మెరిసిపోతుంటాయి. అతని ఆలోచనల్లో జశోద దొర్లిపోతూంటుంది. ఆమెను చూసి అతను తిరిగే ఇబ్బందికరమైన మెలికలు కంగాళీ చరణ్, జశోదల కంటపడకపోలేదు. తన కి కొత్తగా వచ్చిన అవకరం వల్ల ఎక్కడ భార్య అతని ఆకర్షణలో పడిపోతుందో అని భయపడే భర్తకి జశోద మాత్ర భర్తకి ప్రమాణపూర్వకంగా చెప్తుందేమిటంటే - తన అందమైన రొమ్ములని కంగాళీ తప్ప ఎవ్వరూ తాకలేరు అని ! ఎందుకంటే, ఆమెకి సాక్షాతూ ఆ  "సింహవాహని" అమ్మవారే  రక్షణ గా ఉంటానని కల్లోకి వచ్చి చెప్పిందంట మరి. 

ఈ చిక్కుల్లో హల్దర్ బాబు అకస్మాత్తుగా గుండెపోటొచ్చి మరణించడం - దాని వల్ల ఆ యజమాని అండ కాస్తా పోయి, జశోద కుటుంబం వీధిన పడడమూ జరుగుతాయి.  హల్దర్ బాబు భార్య కు అకస్మాత్తుగా వైధవ్యం తో పాటూ, ఆస్తి మీదా, కుటుంబం మీదా యాజమాన్య హక్కులు రావడం, ఆస్తి మీద పెత్తనం రావడమూ జరిగాయి కాబట్టి, కొత్తల్లో ఆమె కు ఈ బ్రాహ్మణ కుటుంబాన్ని పోషించడం పెద్ద వృధా ఖర్చు గా భావించి  దాంతో మెల్లగా వీళ్ళని వెనక్కు పెట్టడం జరిగింది. పిల్లలకి ఏ తిండి పెట్టి పెంచడమో, ఏ నూతిలో దూకడమో జశోదకు దిక్కు తోచలేదు. 

అయితే, జశోద అదృష్టానికి హల్దర్ బాబు కోడలికి పురుడొచ్చి, బిడ్డ పుట్టాక, ఆమెకు పాలు పడలేదు. దాంతో అర్జంటుగా పాలిచ్చే దాది కావల్సి వస్తుంది. అప్పటికి జశోద కి పాలు తాగే పిల్లలున్నందున, యజమాని ఇంటికి వారి అవసరార్ధం వెళ్తుంది జశోద.  అయితే, ఆ వెళ్ళడం, వెళ్ళడం, జశోదని ఆ మొత్తం కుటుంబానికే "పాల దాది" ని చేయడం జరుగుతుంది. 

హల్దర్ బాబు కోడళ్ళూ, కూతుళ్ళూ ఒకరి తరవాత ఒకరు పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. పిల్లల్ని కంటున్నారు. ఎవ్వరూ తమ పిల్లలకు పాలివ్వడం ఇష్టపడలేదు. వాళ్ళకి కామధేనువులాంటి జశోద ఉందిగా!    ఈ పాలే తనకీ, తన కుటుంబానికీ అన్నం పెడతాయి కాబట్టి, తను ఎప్పటికీ పాలు కుడిపేందుకు వీలుగా తానూ ఎప్పటికప్పుడు గర్భం ధరిస్తూ,  పిల్లల్ని కంటూ, వాళ్ళకి పాలిస్తూ, రోజూ హల్దర్ బాబు ఇంటికెళ్ళి వాళ్ళ పిల్లలకు పాలిస్తూ, వాళ్ళిచ్చే వస్తువులు ఇంటికి తెచ్చి తన కుటుంబానికి ఇస్తూ... ఇలా జశోద కొన్ని సంవత్సరాలే బ్రతికింది.  అటు హల్దర్ బాబు కుటుంబమూ పెరిగింది. జశోద కనీసం 50 మంది పిల్లలకి పాలిచ్చింది. అయితే కాలం గడిచేకొద్దీ మార్పులు జరగడం సహజం. 

హల్దర్ కుటుంబం పెద్దదయింది. జశోద పాలిచ్చి పెంచిన పిల్లలూ పెద్ద వాళ్ళయ్యారు.  వాళ్ళ ఇల్లు చిన్నదయింది.  హల్ల్దర్ బాబు భార్య కూడా ముసలామె అయింది. పిల్లలు వేరు కాపురం పెడదామనుకుంటున్నారు. అంతవరకూ కలిసి ఉన్న కుటుంబం కాస్తా, ఒక్కో బిడ్డా తరలిపోతుండగా పాలిచ్చి పెంచాల్సిన  హల్దర్ శిశువుల సంఖ్యా తగ్గిపోయింది. పైగా కొత్త పాల పదార్థాలు కూడా అందుబాటులోకి వచ్చాయి.  శిశువును పాలసీసా తో పెంచడమూ ఒక పద్ధతే అనీ కొత్త అమ్మలు తెలుసుకున్నారు.

జశోద కూడా ముసలిదయింది. ఆమె నిజానికి ఎన్నో ఏళ్ళుగా హల్దర్ల ఇంట్లోనే ఉండిపోయింది. ఏ రాత్రప్పుడు ఏ శిశువు ఏడుస్తుందో అని, అక్కడే ఉండాల్సొచ్చేది. ఎప్పుడో గానీ ఆమె తన ఇంటికి వెళ్ళడం మానుకుంది. ఆమె బాగా పాలిస్తున్నన్నాళ్ళూ హల్దర్లు ఆమెను నెత్తిన పెట్టుకున్నారు. ఇంట్లో పనిమనుషులు కూడా జశోదకి ఓ ఉన్నత స్థానాన్నే ఇచ్చారు. నెమ్మదిగా వయసు మీరి, పాల అవసరమూ, ఉత్పత్తీ తగ్గీసరికీ జశోదకి కష్టాలు మొదలయ్యాయి.  ముసలి కాలాన శరీరపు వన్నె తగ్గింది కాబట్టి, ఇంక తన పాల అవసరమూ తగ్గింది.  పైగా హల్దర్ బాబు విధవ కూడా పెద్దదయిపోవడం వల్ల, ఆమెకూ ఇంట్లో అదుపు తగ్గి, జశోదని వాళ్ళు  రిటైర్  చేసే టైం కి ఆమె ఇంట ఓ ముసలం పుట్టింది.    

ఇన్నాళ్ళ మానసిక దూరం తన సొంత పిల్లలు ఆమెను పట్టించుకోకుండా చేసేసాయి. పైగా జశోదకి ఇంట్లో ఒక సవితి కూడా తయారయింది. పెళ్ళాంతో పడక సుఖం తగ్గి, పైగా పెళ్ళాం పాలమ్ముకుని సంపాదించిన దినుసులూ, డబ్బూ, కంగాళీ చరణ్ మనసును బోల్తా కొట్టించి, అతొనొహత్తెను ఉంచుకున్నాడు.   

ఈ అవమానం, ప్రేమ రాహిత్యమూ భరించలేక జశోద హల్దర్ బాబు భార్యని ఆశ్రయం అడుగుతుంది. ఏదో చిన్నా చితకా పని చేసుకుంటూ మిగిలిన పనివాళ్ళతో కలిసి వారింటనే ఉండే ఏర్పాటు జరిగింది.   పెద్ద కోడలు ఇప్పుడు ఆ ఇంటికి యజమానురాలు. ఈ సారి ఇంటిలో వాళ్ళూ, పనివాళ్ళూ జశోదని హీనంగానే చూసారు. కానీ ఆమెకింకో గతి లేదు. 

ఆమె కంచమూ, బట్టలూ ఇక శుభ్రం చేసేది లేదని పనివాళ్ళు చెప్పేసారు. రొమ్మున పిల్లాడు లేక జశోదకు సగం మతి పోయింది.  వృద్ధాప్యమూ, అనారోగ్యమూ ఆమెమీద దాడి చేసాయి.  ఒంటరితనం ఆమెను ముంచెత్తింది.  జశోద తనలో తాను మాట్లాడుకునే స్థాయికి దిగజారిపోయింది.  తిండి అసలే సయించడంలేదు. 

రోజంతా జ్వరమూ, వొళ్ళు నొప్పులూ. కుడి రొమ్ము మీద ఏదో మచ్చ పడింది. అది రోజులు గడిచే కొద్ది పెద్దదయింది, వాచింది. రక్తమూ, రసీ కార్చింది. ఆమె అనారోగ్యం హల్దర్ బాబు పెద్ద కోడల్ని భయపెట్టింది. మొదట వంటింటి చిట్కాలనూ, ఆయుర్వేద  పై పూతలనీ ప్రయోగించారు. ఏ మాత్రమూ ఫలితం లేదు. మనిషి తిండి లేక  చిక్కిపోయింది. రొమ్ములు మాత్రం గుది బండల్లా బరువైపోయాయి. ఇంటికొక వైద్యుడొస్తే అతనికి జశోదని చూపించాలనుకుంటుంది పెద్ద కోడలు. జశోద మాత్రం ఇంకో మగాడికి తన రొమ్ముల్ని చూపించడానికి ఇష్టపళ్ళేదు. అప్పటికే ఆమె రొమ్ము మీద పలచని కొంగు ని కూడా కప్పి ఉంచలేకపోతుంది. భయంకరమైన బరువెక్కెన తన  రొమ్ముల్ని మొయ్యలేక నేల మీద వాటిని వాల్చి, పక్కకు తిరిగే పడుకునుండేది. డాక్టర్ గది బయటనుండే ఆమె లక్షణాలని కోడలి ద్వారా అడిగి తెలుసుకుని ఆమెను కేన్సర్ హాస్పిటల్ కి తీసుకుని వెళ్ళమంటాడు.  

కేన్సర్ నిర్ధారణ అయింది. ఆరోజుల్లో అంత గొప్ప చికిత్సలేమీ అందుబాటులో ఉండేవి కాదు. కానీ జశోద స్త్రీ సహజమైన సిగ్గుతో + సాంప్రదాయపు కట్టుబాటు, కండిషనింగ్ వల్లానూ  తన బాధని డాక్టర్ కు చూపించుకోకపోవడం వల్ల,  శరీరం సగానికి పైగా కుళ్ళే వరకూ డాక్టర్ దగ్గరకే పోనందున,  వ్యాధి అప్పటికి  చేతులు దాటేసి ఉంటుంది. ఆమె శరీరం బ్రతికున్నప్పటికీ  "కుళ్ళిన శవం" వాసన కొడుతుంటుంది. 

తను కనిన పిల్లలూ, పాలిచ్చిన పిల్లలూ ఎవరూ ఆమె చనిపోతుంటే చూడడానికి రారు. భర్త ని హల్దర్లు పిలిపిస్తారు. హాస్పిటల్ నుండీ ఆమెను అతనే తీస్కెళ్ళాలనీ, ఇక తాము చూసుకోలేమనీ కబురు పెట్టబట్టి -  కంగాళీ వస్తాడు.  భార్య ని ఆ దశ లో చూసి అతనికీ కళ్ళ నీళ్ళు తిరుగుతాయి. 

ఆమెను ఎన్నేళ్ళు గానో కామించిన నబీన్ కూడా ఆమె ను చూసి హడలిపోతాడు. తనను ఎన్నో సంవత్సరాలుగానో కవ్వించిన ఆమె రొమ్ముల  పట్ల అతని దృక్కోణం, ఆమె హల్దర్ల ఇంట  'పాల దాది' గా చేరిననాటికే మారుతుంది.   ఆమెను తాను కొలిచే దుర్గా మాత కు ప్రతిరూపమే అనుకుంటాడు. ఎందరు పిల్లలకో తన రక్తం నుంచీ మార్చిన పాలిచ్చి బ్రతికించిన తల్లి కదూ ఇపుడు జశోద!   అయితే ఒంటి మీద స్పృహే లేక,  మృత్యువు నెమ్మదిగా తినేస్తుంటే పెద్ద పెద్ద నల్లని రాళ్ళై, దూది తప్ప ఆచ్చాదన లేని ఆమె రొమ్ముల్ని చూసి, "ఇవా తాను ఒకప్పుడు ఆరాధించిన రొమ్ములు.. ఇదా తానాశించిన శరీరం"  అనుకుంటూ వేదాంతి అయిపోతాడు. 

ఒక మంచి రోజు జశోద ఈ బాధల్ని అన్నిటినీ విడిచిపెట్టి మరణిస్తుంది.  ఆమెను ఎరిగిన అందరూ ఇక నిట్టూర్పు విడుస్తారు. ఇలా అందరికోసం తన ప్రాణాన్నీ, శరీరాన్నీ, యవ్వనాన్నీ, సర్వ శక్తుల్నీ ఒడ్డి, తనవాళ్ళనుకున్న వాళ్ళ కోసం బ్రతికిన జశోద, ప్రపంచంలో పెద్ద మార్పేమీ సృష్టించకుండా  ఎవరూ తన తోడు లేని పూట,  హాస్పిటల్లోనే రొమ్ము కేన్సర్ తో  కృశించి, కృశించి  మరణిస్తుంది. 

ఆమెకు అసలు రొమ్ము కేన్సర్ ఎందుకు వచ్చుంటుంది ? అంత మంది పిల్లలకి పాలిచ్చినందుకా ? ఏమో! డాక్టర్ దానికి "ఇదీ కారణం" అని చెప్పలేనంటాడు. ఆమె ఒక స్తనదాయిని. ఆమె పాలివ్వడం వల్ల హల్దర్ల కోడళ్ళు ఇంకా ఎక్కువ మంది పిల్లల్ని కనగలుగుతారు.  వాళ్ళ అందం చెక్కు చెదరదు. పైగా భర్తలతో గడిపేందుకు బోల్డంత సమయమూ దొరుకుతుంది. ఈ కిటుకు గ్రహించే హల్దర్ బాబు భార్య జశోదని ఒక "ప్రొఫెషనల్ స్తన దాయిని" గా మారుస్తుంది.  జశోద కుటుంబమూ ఆమె త్యాగం వల్ల బానే లాభపడింది. పాలివ్వాలనే మహా యజ్ఞం సుధీర్ఘంగా సాగేందుకు ఆమె భర్త ఆమె ద్వారా మరిందరు పిల్లల్ని కనేందుకూ పనికొస్తుంది.  వాళ్ళకు జరుగుబాటుకు లోటు ఉండకుండా కాపు కాస్తుంది.  ఇవన్నీ జశోదకు ఆఖరు సమయాల్లో పెద్ద సహాయం చెయ్యవు. ఇతరుల కోసం తనని తాను సమిధ గా మార్చుకున్న జీవితపు ఊబిలో జశోద కూరుకుపోతుంది. కేన్సర్ తో తొందరగా చావు రాకపోయుంటే, వృద్ధాప్యంలో తన వాళ్ళందరి నిరాదరణతోనే ఆమె  చనిపోయేదేమో. పెద్ద గుర్తింపుకు నోచుకోని జశోద జీవితం  - ఇలా ముగుస్తుంది. 

ఇదే "స్తనదాయిని" కథ.    గ్లోరిఫై చేయబడే స్త్రీ జీవితంలో ఆమె శరీరమే పెద్ద రాజకీయ సాధనం. త్యాగాల వెనుక, పెళ్ళిళ్ళ వెనకా, మాతృత్వం వెనకా కూడా పెద్ద రాజకీయ అణిచివేతే ఉంటుంది.  ఈ పుస్తకం మొదట 1997 లో ప్రచురితమైంది. అప్పటికే  ఇంత శక్తివంతమైన ఫెమినిస్ట్ రచన ని రచించిన మహాశ్వేత బెంగాలీ లో చాలా బాగా రాసిన కథలుగా ప్రాచుర్యం చెందాయి. . అనువాదం కూడా చాలా బావుంది.  

కొన్ని వాక్యాలు : 

(i)  Jashoda is "fully an Indian woman, whose unreasonable, unreasoning and unintelligent devotion to her husband and love of children, whose unnatural renunciation and forgiveness have been kept alive in the popular consciousness by all Indian women. She wants to become the earth and feed her crippled husband and helpless children with a fulsome harvest. 

(ii)  As Jashoda can only nurse if she herself is pregnant and nursing, she begins to have many children.  She is a professional mother and Kangali is a professional father.  Jasoda is highly valued at the Haldar place.

(iii)  Jashoda doesn't remember at all when there was no child in her womb, when she didn't feel faint in the morning when Kangali's body didn't drill her body like a geologist in a darkness lit only by an oil lamp. She never had the time to calculate if she could or could not bear motherhood. Motherhood was always her way of living and keeping alive her world of countless beings. Jashoda was a mother by profession, a professional mother. 

(iv)  Around the paved courtyard on the ground floor of the Haldar house, over a dozen auspicious milch cows live in some state in large rooms. Two Biharis look after them as Mother Cows. There are mountains of rind-bran-haygrass-molasses. Mrs. Haldar believes that the more the cow eats, the more milk she gives. Jashoda's place in the house is now above the Mother Cows. The Mistress's sons become incarnate Brahma and create progeny. Jashoda preserves the progeny. Mrs. Haldar kept a strict watch on the free flow of her supply of milk.

(v)   One has to die friendless, with no one left to put a bit of water in the mouth. Yet someone was supposed to be there at the end. Who was it? It was who? Who was it? Jashoda died at 11 p.m. The Haldar-house was called on the phone. The phone didn't ring. The Haldars disconnected their phone at night. Jashoda Devi, Hindu female, lay in the hospital morgue in the usual way, went to the burning ghat in a van, and was burnt. She was cremated by an untouchable. Jashoda was God manifest, others do and did whatever she thought.  Jashoda's death was also the death of God. When a mortal masquerades as God here below, she is forsaken by all and she must always die alone.


***

Originally written by : Mahashweta Devi in Bengali. 

Translation by : Gayatri Chakravorty Spivak

2 comments:

వ్యాఖ్యానించినందుకు చాలా చాలా థాంక్స్.