తాతయ్య అంత్యక్రియల తర్వాత నేను గమనించింది ఏంటంటే, ఆయన స్నేహితులు మెల్లగా నా చుట్టూ చేరడం, నన్ను చాలా జాగ్రత్తగా పరామర్శించి, అవి, ఇవి, ముచ్చట్లాడి మెల్లగా, తాతయ్య ఏ రకం పొగాకు చుట్ట కాల్చేవాడో ఆరా తీయడం. "ఆ పొగాకులో ఏదో గడ్డి, లేదా ఏ మూలికో కలిపేవాడురా! భలేగా ఉండేది!! అది ఏ గడ్డి ? నిమ్మగడ్డి కాదే, అది ఏదో నబ్బా!!! ఆ పొగ మాత్రం అద్భుతంగా ఉండేది!!" అని ముక్కుపుటాలు ఎగరేసే వాళ్ళు. నాకైతే తాతయ్యకి, ఆ రహస్య విచిత్ర 'గులేబకావళి' తరహా గడ్డికి ఏ సంబంధం లేదని గట్టి నమ్మకం. అదే చెప్పేసరికి మా ఊళ్లో జనం, నా నిజాయితీని శంకించి దూరం పెట్టేసేవాళ్ళు.
తాతయ్య పొగ తాగే విధానం నాకు గుర్తుంది ఆయన దగ్గర ఒక మామూలుదే అయినా మంచి నాణ్యమైన పైపు ఉండేది. కూడా ఎప్పుడు ఒక చిన్న సంచిలో మామూలు పొగాకు ఉండేది. మధ్యాహ్నం పొలంలో పనిచేసేటప్పుడు అలుపు తీర్చుకోవడానికి, చిన్న విరామం తీసుకుని తన పనిముట్లను పక్కనపెట్టి, ఎత్తుగా పెరిగిన అడవి గులాబీల పొద పక్కన, రేగు చెట్టు నీడన హాయిగా పొగ తాగేవాడు. ఒకసారి ఆ రేగు చెట్టు కిందనే, ఆయనకి ప్రాణాంతకం అయిన 'ఆస్తమా ఎటాక్' వచ్చింది. అది ఆయన యౌవనంలో 'ఏకాంత వాసపు జైలు శిక్ష' అనుభవించినప్పుడు లైజాల్ తాగిన కాంక్రీట్ గచ్చు మీద ఎన్నో రోజులు పడి, గడిపిన దాని ఫలితం. *
ఎటాక్ తర్వాత తాతయ్య పొగ తాగడం ఆపేసాడు. కానీ పొగ తాగాలన్న కోరికను అణుచుకునేందుకు, కొన్ని నెలలపాటు ఆయన జేబులో ఎండు రేగు పండ్లను పెట్టుకుని వాటిని నమిలేవాడు. పిల్లలు ఆయన వెంటపడి ఆ పండ్లను అడిగి తీసుకునే వాళ్ళు. తాతయ్య పోయే నాటికి, ఆయన దగ్గర 1950 నాటి విషపూరితమైన రకానికి చెందిన మఖోరా పొగాకు సగం ప్యాకెట్, హెర్జ్ గోవినా - ఫ్లార్ సిగరెట్లు ఓ రెండు ప్యాకెట్లు, ఎవరో "మతి లేని" వాడు"మింట్ '' అని పేరు పెట్టిన సోవియట్ చేదు ఫిల్టర్ సిగరెట్లు మిగిలాయి. అప్పుడప్పుడు ఈ ముసలి వాళ్లు నా దగ్గరకు వచ్చి ఆ 'రహస్య గడ్డిని' గురించి కూపీలు లాగేవాళ్ళు. నేనెంత నాకు తెలియదు బాబోయ్! అని మొత్తుకున్నా సరే, కనీసం వాళ్లకు ఆ గడ్డిని చూపించినా చాలునంట. మొదట్లో నవ్వులాటగానే ఉన్నా కొన్నాళ్ళకు ఇదేదో తాతయ్యకి సంబంధించిన "పెద్ద" రహస్యమే అని తెలిసి వచ్చింది.
చాలా ఏళ్లు గడిచాక ఓసారి క్రిస్మస్ పండక్కని కొన్ని సామాన్లు అవసరమై, ఆటకని వెతికాను. అక్కడ ఒక బుల్లి రేకు డబ్బాలో "లువ్యేవ్ కాఫీ పొడి"** కనబడింది. డబ్బా మూత తీసి చూద్దును కదా - అమోఘమైన పరిమళం గుప్పుమంది. అది వేసవి పూదోట పరిమళం. తోటల్లో పండే తీయని మధుర ఫలాల పరిమళం. మాంత్రికమైన మూలికల మీద తేనె పరుచుకున్న పరిమళం. క్షణంలో నాకు ఆ కమ్మని వాసన ఏంటో గుర్తొచ్చేసింది. అది నా వరకు ఒక చిన్ననాటి జ్ఞాపకం. ఆ వాసన ప్రత్యేకంగా తాతయ్యదే!! అప్పుడే ఇంకో సంగతి కూడా గుర్తొచ్చింది - ఆయన పైపులో పొగాకు నింపాక ఈ కాఫీ పొడి ఓ చిటికెడు దానిపై చల్లేవాడు. ఈ చిన్న డబ్బాలో దాగున్నదే, ఈ ముసలి వాళ్ళంతా నా చుట్టూ మూగి 'సంగ్రహించాలి అనుకున్న రహస్యం' అన్నమాట !! ఇది తాతయ్య నుండి నాకు చిక్కిన మొత్తం వారసత్వ సంపద అంతటిలో అన్నిటికన్నా ఎంతో విలువైనది.
ఆయన కనుక్కున్న ఈ కాఫీ + పొగాకు మిశ్రమం, ఆ నిష్పత్తి, ఒక "కళాఖండం". ఇది చెత్త రకం పొగాకును 'మంచి'గా మారుస్తుంది. మేలు రకం పొగాకును 'అద్భుతం'గా మారుస్తుంది. తాతయ్య తలుచుకునుంటే, లేదా ఆయన ఏ ప్రపంచంలో వేరే ఏ ఇతర ప్రాంతానికి చెందినా గాని, ఆయన పొగరాయళ్ళు అందరిలోనూ పెద్ద హీరో అయి ఉండేవాడు. ఈ ఫార్ములా ఆయన్ని పెద్ద బిజినెస్ మాగ్నెట్ చేసీసి ఉండేది. కానీ ఆయన ఈ బాధ్యతను నా మీద వదిలి వెళ్ళిపోయాడు. తాతయ్య జ్ఞాపకార్థం ఈరోజు ఆ మార్మిక కాఫీ పొడిని ఓ చిటికెడు తీసి నా 'డచ్ పొగాకు' లో కలుపుకుని, పైప్ లో నింపుకుని నాకు నేనే ఒక పార్టీ ఇచ్చుకున్నాను. అయితే ఈరోజుకీ ఆ పొడిలో ఏ మూలిక/గడ్డి కలిసి ఉందో నాకు తెలియనే లేదు!!
From : Writing from Ukraine. Fiction, Poetry and Essays since 1965 (2017), Penguin 2022.
Written by : Taras Prokhako, "FM Galicia", 2010.
(ఊరికే సరదాగా చేసిన అనువాదం)
* Subjecting to solitary confinement for years is in vogue for the Ukrainian revolutionaries.
** Lviv Ground Coffee
**********
No comments:
Post a Comment
వ్యాఖ్యానించినందుకు చాలా చాలా థాంక్స్.