Pages

24/08/2023

వీరయ్య - కృష్ణ గుబిలి

ఈ పుస్తకం 2020 లో విడుదల అయినప్పుడు ఆన్ లైన్ ప్లాట్ ఫారాలలో సంచలనం సృష్టించింది.  చాలా మంది చదువరులు ప్రశంసలు కురిపించారు. చాలా చోట్ల ఆన్ లైన్ రివ్యూలు చాలా పాసిటివ్ గా వచ్చాయి. అసలు నేను ప్రత్యేకం గా / కొత్తగా చెప్పేందుకు కొత్తగా ఏమీ లేకపోయినా, ఇది చాలా మంచి/బహుశా special, out of the box  పుస్తకం అని ఖచ్చితంగా చెప్పగలను. 

మనం బానిస వ్యవస్థ గురించి, తమ తమ ఊళ్ళలో ఉన్న ఆఫ్రికన్లని ఉన్నపాటుగా ఎత్తుకెళ్ళిపోయి, ఓడల్లో అమానవీయ పరిస్థితుల్లో కుక్కి, రేవుల్లో జంతువుల్ని అమ్మినట్టుగా అమ్మి, తల్లుల్నీ పిల్లల్నీ వేరు వేరుగా అమ్మి, వాళ్ళ జీవితాల్ని కొన్ని తరాల పాటూ సర్వనాశనం చేసేసి, వాళ్ళ మీద అత్యంత క్రూరమైన అత్యాచారాలకు పాల్పడటం, జాత్యహంకారాన్ని ప్రదర్శించడం గురించి చాలా సినిమాలూ చూసాము, చాలా పుస్తకాలూ చదివాం. 

కానీ బానిస విధానపు నిర్మూలన తరవాత, దాదాపు అదే స్థాయిలో వెట్టిచాకిరీ చేయడానికి భారత ఉపఖండం నుండి 1800-1900 మధ్యలో వేలాదిగా తరలివెళ్ళి, రబ్బరు, చెరుకు లాంటి కఠిన వ్యవసాయ ఉత్పత్తులను  పండించేందుకు, రక రకాల కొత్త దేశాలలో, ఖండాలలో అత్యంత ఘోరమైన పరిస్థితుల్లో ఊడిగం చేసి,   నానా కష్టాలు అనుభవించిన భారతీయుల గురించి, తిరిగి రాలేక, అక్కడి సమాజాలలో భారతీయ సంతతి వారిగా సమైక్యమైపోయి,  అక్కడే ఉండిపోయిన ప్రవాస భారతీయుల కథల్ని పెద్దగా చదవలేదు. మనకు దాదాపు ప్రవాసుల కథలు అభివృద్ధి చెందిన దేశాల నుంచే వచ్చాయి గానీ, ఖండాంతరాలలో మగ్గిపోయిన బీద  తెలుగు ప్రవాసుల గురించి పెద్దగా చదవడానికి ఏదీ దొరకలేదు. 

అలాంటి పరిస్థితుల్లో, కేవలం ఆసక్తి కొద్దీ, దక్షిణ ఆఫ్రికాలో కొన్నేళ్ళపాటూ పనిచేసి, పుట్టిన గడ్డకు తిరిగొచ్చి, మరణించిన తన ముత్తాత వీరయ్య గారి మూలాలను వెతుక్కుంటూ, కృష్ణ గుబిలి గారు చేసిన అన్వేషణ, దక్షిణ ఆఫ్రికా  లో తెలుగు, తమిళ ప్రవాసులు గడిపిన బానిస జీవితం గురించీ, వీళ్ళని తీసుకెళ్ళి, పని చేయించిన చెరకు తోటలు, పంచదార ఫాక్టరీల గురించి, కలుసుకున్న తన "విడిపోయిన" కుటుంబంగురించీ చాలా చక్కగా ఆయన రాసిన ఇంగ్లీష్ పుస్తకానికి, తన తండ్రిగారిచేతనే తెలుగులోకి అనువదింపజేసి తీసుకొచ్చిన పుస్తకం ఇది. 

వీరయ్య చాలా కష్టపడి పైకొచ్చిన మనిషి. ఆయన బోల్డన్ని కష్టాలనుభవించి, దళారుల వలలో పడి, కూలీ గా దక్షిణాఫ్రికా చేరి, అక్కడ కొన్నేళ్ళ పాటూ కూలీగా పనిచేసి, తన సామర్ధ్యాలు, కష్టపడే తత్వం కారణంగా సూపర్వైసర్ (సర్దార్) గా ఎదిగి, ఒక స్థాయికి తన కుటుంబాన్ని చేర్చిన వ్యక్తి. తను చిన్ననాట వదిలి వెళ్ళిన తన కుటుంబాన్ని వెతుక్కుంటూ ఆయన ఇండియా తిరిగిరావడం ఒక కథ.   బాధలు పడ్డా,  కష్టాన్ని ఆసరాగా చేసుకుని  బోల్డంత ధనం సంపాదించగలిగినా, చివరకు "బంధు" రాబందుల చేతిలో అన్నీ కోల్పోయి, కళ్ళెదురుగానే పిల్లల్ని కోల్పోయి, అసహాయుడైపోయి,  వృద్ధాప్యంలో  మనోవ్యధ తో  మరణించారు. 

అయితే, ఆయన కోడలు నాంచారమ్మ గారు (కృష్ణ గారి నాయనమ్మ) మాత్రం, మామగారిని మర్చిపోలేదు.  ఆవిడనే అసలు ఈ పుస్తకం బయటకు రావడానికి   ప్రేరణ.  ఆమె ఒక కూతురిలా చెల్లాచెదురైన  తన  కుటుంబం గురించి ఆరాటపడి, ఎటువంటి కమ్మ్యూనికేషన్ సాధ్యం కాని రోజుల్లోనే,  రికార్డ్ గా పనికొచ్చే ప్రతి అంశాన్నీ దాచి, తన మనుమలకు తమ మూలాలను గురించి చెప్తూ,  ఆసక్తి రగిలించడంలో,  ఖండాంతరాలలో చెదిరిపోయిన  కుటుంబాన్ని కలుసుకోవాలనే కోరికను సజీవంగా ఉంచడంలోనూ ప్రధాన పాత్ర వహించారు.  

నాయనమ్మ వర్ణనల్లో తమ తాతయ్య, ముత్తాతలు హీరోలు, ఆజానుబాహులు, ఆదర్శ పురుషులు, కానీ నిజానికి వారి గురించి వివరాలేవీ తెలీని పరిస్థితుల్లో, కృష్ణగారు సరదాగా మొదలుపెట్టిన వంశవృక్షపు ప్రాజెక్టు, ఒక్కో వివరమూ తెలిసేకొద్దీ, దక్షిణాఫ్రికాలో సగం, ఇండియాలో సగం గా చెల్లాచెదురైన బంధువుల్ని వెతుక్కుంటూ, బదులు రాని అసంఖ్యాక ఉత్తరాలు రాస్తూ, ఒక్కో గొలుసునీ నిర్మించుకుంటూ వస్తూన్నకొద్దీ, ఒక్కో బంధువూ దొరకడం చాలా ఓపికగా ఒక్కో ఫేస్ నూ దాటుకుంటూ, మొత్తానికి దక్షిణాఫ్రికా వెళ్ళి, అక్కడి ఒక Institution లో ఎంతో వెతుకులాట అనంతరం, ఇండియానుంచి వచ్చిన ఒక "ఓడలో దిగిన వారి లిస్టు" లో తమ ముత్తాతయ్య   వీరయ్య గారి పేరును కనుక్కుంటారు. 

కుటుంబం మొత్తానికి కలుసుకుంది. అదీ, దక్షిణాఫ్రికాలో  అపార్థీడ్ రోజులు ముగిసాక. అంటే, నెల్సన్ మండేలా జైల్ నుండీ విడుదలయ్యాక, ఆయన అధికార పీఠాన్ని ఎక్కాక. అంతవరకూ, కనీసం ఉత్తరం రాయగలిగే పరిస్థితుల్లో కూడా లేరు అక్కడి ప్రవాస భారతీయులు.  అదీ వారి స్వాతంత్రం.  ఇలా వేలాది చిక్కుల్ని ఒక  Consistent  పోరాటం వల్ల, కృష్ణ గారు అధిగమించగలిగారు.  అయితే ఈ అన్వేషణలో ఆయన చాలా చేదునిజాల్నే తెలుసుకోవల్సి వచ్చింది. ఇలా తమ మూలాల్ని కనుక్కోగలిగే ఓపిక, ఆసక్తి, నిజాయితీ, స్పూర్థి, కాస్తో కూస్తో దారి చూపించే అదృష్టమూ, అందరికీ ఉండకపోవచ్చు. అందుకే  ఆ ప్రయాణాన్ని డాక్యుమెంట్ చెయ్యడం అవసరం గా భావించి, దాన్ని తెలుగులోకి కూడా తీసుకురావడం, ఈ పుస్తకం విలువని గుర్తించి,  "అన్వీక్షకి"  దాని చక్కగా ప్రచురించడం, మెచ్చుకోదగిన విషయాలు. 

INDENTURED LABOUR (ఒక విధంగా ఒప్పంద కూలీలు) వ్యవస్థ గురించి వివరాలతో వచ్చిన తొలి తెలుగు పుస్తకం కూడా ఇదే. వనవాసి లో "మంచీ" ఏ అస్సాం టీ తోటలలో బానిసయిపోయిదో అని ప్రొటాగనిస్ట్ భయపడినట్టూ,   'బాలా' తీసిన "పరదేశి"  సినిమాలో, నెలలపాటు గొలుసులతో బంధించిన కాళ్ళతో మైళ్ళకొద్దీ నడిచి, టీ తోటల లో బానిసలుగా పనిచేసిన వేలాది తమిళ కూలీల వ్యధను చూసినట్టూ,  కూలీ భార్యాభర్తలను వేరు వేరుగా వేరువేరు తోటలకు (యజమానులకు) అమ్ముకోవడం, తల్లీ పిల్లల్ని విడదీసేయడం, భాష, చదువూ రానివారిచే కాంట్రాక్టుల మీద వేలిముద్రా సంతకాలు తీసుకుని, వారు దానికి కట్టుబడేటట్టు వంచించడం, ఈ ఇండెంచర్ కార్మికుల విషయంలో కూడా జరిగాయి. వీళ్ళలో కూడా, బీద, నిస్సహాయ మహిళలు దారుణమైన దోపిడీకి గురయ్యారు. 

కాలంతో పాటూ మారిన సామాజిక, ఆర్ధిక పరిస్థితుల వల్ల  మెల్లగా ఈ విధానం నశించి,  అక్కడ, నాటుకుని, జీవితాలని ఒక దారిలోకి తెచ్చుకుని, తరవాత వీరు వెస్టిండీస్ దీవులు, మారిషస్, ఫిజీ వంటి ఆయాదేశాలలో స్థిరపడ్డారు. వీరయ్య గారి కథ దక్షిణ ఆఫ్రికాకే పరిమితం అయినా, అనుబంధంలో ఏయే దేశాల్లో ఈ వ్యవస్థ ఉండేదో చక్కగా వివరించారు. ఇప్పుడు    ఆ దేశాలలో బానిసల్లా మగ్గిన ఇండెంచర్ కార్మికుల సంతతే ఇప్పుడు "భారతీయ" సంతతి అయ్యారు. ఆ విషయాల్నీ, నైపాల్ లాంటి ఇండెంచర్ కార్మికుల సంతతి ఎంత పైకెదిగారో, ఇలా ప్రతీ దేశం నుంచి, పేరొందిన ప్రవాస భారతీయుల సమగ్ర సమాచారాన్ని, కృష్ణ అందించారు. ఇది ఇండెంచర్ కార్మికులకు  తెలుగు దేశం చేసిన సలాం. 

బిభూతి భూషన్ బందోపాధ్యాయ్ రాసిన చంద్రగిరి శిఖరంలో భారతీయులు ప్రవాసంలో కనిపిస్తారు. ఉగాండా ఊచకోతల సమయంలో మార్వాడీలు టార్గెట్ అవడం గుర్తుండి ఉంటుంది. మొన్నే నేను చదివిన నట్మెగ్స్ కర్స్ లో, ఒక భారతీయుడే సంక్షోభ సమయంలో జాజికాయ, జాపత్రి విత్తుల్ని (నట్ ని) రక్షించి, అవి ద్వీపం లో బ్రతికుండేలా చేస్తాడు. ఇవే ద్వీపాలలో స్థానికుల్ని ఊచకోత కోసేందుకు జపాన్ సమురాయ్ (కత్తి యుద్ధ వీరులు) లని విస్తారంగా వాడారు. వాళ్ళు తలారుల్లా పనిచేసేవారు. వాళ్ళు జీవం తీస్తే,  ఒక ప్రవాసీ భారతీయుడు,  జాజి కాయ వంగడపు జీవాన్ని  రక్షిస్తాడు. This small act of kindness, మన దేశం గురించి మనల్ని గర్వపడేలా చేస్తుంది.  

గాంధీ లాంటి మహాత్ముడు దక్షిణాఫ్రికాలో ఈ ఇండెంచర్ కూలీల వైపునుండీ మాటాడడం ద్వారా తన ఉద్యమ జీవితాన్ని మొదలు పెట్టడం జరిగింది. గాంధీ ప్రవేశం తరవాత, ఆయన వీరి బాధల్ని గ్రహించి బ్రిటిష్ ప్రభుత్వంతో గొడవ పెట్టుకోవడం వల్లనే ఇండెంచర్ కార్మికుల జీవితాలలో కాస్త కుదురు వస్తుంది. గాంధీని ఇలాంటి కార్మికుల సంతతి వాడనుకునే,  రైల్లోంచీ నెట్టేయడం జరిగింది. దీన్ని బట్టి, పనులకోసం వేరే దేశాలకు మోసపూరితంగానో, ఇష్టపూర్వకంగానో తరలివెళ్ళిన మన పూర్వీకుల కృషి ని తెలుసుకోవడం అవసరమే అనిపిస్తుంది. 

చాలా మంచి పుస్తకం. కేవలం ఒక కుటుంబం కథ కాదు. "వీరయ్య" ఒక వసుధైవ కుటుంబకం గురించిన పుస్తకం. దాదాపు మూడు సంవత్సరాల తరవాత అయినా చదవగలిగినందుకు సంతోషం కలిగించిన తెలుగు పుస్తకం ఇది.  ముందుమాట రాసినది తనికెళ్ళ భరణి. ఈ పుస్తకం కూడా ఈ రూపు దాల్చడానికి వెనుక  ఒక పెద్ద "కుటుంబమే" ఉంది. అలాంటి సమిష్టి కృషి, సహకారం, ప్రోత్సాహం, ఈ మధ్యకాలంలో మనం చూసి ఉండం.  వీళ్ళందరికీ అభినందనలు. 


***

https://fb.watch/nLCKxRzoeP/?mibextid=NnVzG8&startTimeMs=113634



5 comments:

  1. పుస్తక పరిచయం ఆసక్తికరంగా ఉంది. పుస్తకం వెల, దొరికే చోటు (లేదా ఆన్ లైన్ లో ఆర్డర్ చెయ్యడానికి లింక్ / వెబ్ సైట్) వివరాలు ఇవ్వగలరా దయచేసి? Thanks.

    అన్నట్లు ఏమనుకోకండి గానీ “వసుధైక కుటుంబం” అన్న మాట సరియైనది కాదట. వసుధైవ కుటుంబకమ్ అనాలిట. ఈ మధ్యనే తెలిసింది. ఈ క్రింది బ్లాగ్ పోస్ట్ లో వివరంగా ఉంది.

    https://syamaliyam.blogspot.com/2023/08/vs.html?m=1

    ReplyDelete
  2. విన్న్నకోట నరసింహారావు గారు, చాలా థాంక్స్. "వసుదైక కుటుంబం" పదాన్ని ఇప్పుడే మారుస్తాను. థాంక్స్ అండీ.

    ReplyDelete
  3. వసుధైక కుటుంబం కూడా సరైనదే.

    ReplyDelete
  4. పదుగురాడు మాట పాడియై ధర జెల్లు -

    వసుధైవ కుటుంబకమే సరైన భాషణం కావచ్చును కానీ వాడుక,
    సంభాషణాన్ని బట్టి వసుధైక కుటుంబం ఉపయోగించడాన్ని తప్పుగా
    భావించనవసరం లేదు.

    ReplyDelete

వ్యాఖ్యానించినందుకు చాలా చాలా థాంక్స్.