"గ్రేట్ ఫేమిన్ ఆఫ్ బెంగాల్" గురించి అమర్త్య సేన్, శశి థరూర్ పుస్తకాలు రాసారు. ఉపన్యాసాలిచ్చారు. చరిత్ర పాఠాల్లోకి అంతగా ఎక్కని ఈ ఘోర పాలనా తప్పిదాన్ని గురించి ఈ మధ్య జగ్గీ వాసుదేవ్ కూడా ప్రముఖంగా ప్రస్తావించారు. ధాన్యాగారమైన బెంగాల్ లో, పంటలు లేక కాదు. దుర్మార్గమైన ప్రభుత్వ విధానాల వల్ల తినేందుకు తిండి దొరక్క, ప్రజలు వీధుల్లో పడి లక్షలాదిగా చనిపోయారు. ఎక్కడో జరిగబోయే యుద్ధం కోసం, బ్రిటీషు ప్రభుత్వం పిచ్చిగా, బలవంతంగా సేకరించిన ధాన్యాలు ఓడల్లో ముక్కిపోతుంటే, ఊర్లకూర్లు జనం "తెచ్చిపెట్టుకున్న క్షామం"తో తిండి లేక మరణించారు. చెప్పలేనంత అరాచకాలు, చీకటి బజారులలో బోల్డంత వెల పోసి బియ్యం కొనుక్కోవాల్సి రావడమూ జరిగాయి. వీటిని బ్రిటీషు ప్రభుత్వం తమ పార్లమెంటు కు సరిగ్గా నివేదించనే లేదు. జాత్యాహంకారం, మన బానిస జీవితమూ - మన తరఫున పోరాడేందుకు శక్తివంతమైన నోరన్నది లేకపోవడమూ వల్ల ఇవి జరిగాయన్న స్పృహ మేథావులలో కలిగింది.
ఈ ఘోరాన్ని రికార్డ్ చేసేందుకు, మృత్యువు, ఆశ, నిరాశలూ, మెల్లగా కమ్ముకొచ్చే క్షామమూ ఎలా వుంటాయో, ఒక్కో దారీ మూసుకుపోతున్నపుడు జీవితం ఎలా వుంటుందో, గుంపులుగా తిండి కోసం వలసపోయి, తాగేందుకు గంజి కూడా దొరకక పిట్టల్లా జనం చనిపోవడం, భయాందోళనలూ, పుకార్లూ అతలాకుతలం చేసిన గ్రామీణ జీవితాన్ని అందరికీ తెలిపేందుకు, బిభూతిభూషణుడు ఈ "అశని సంకేత్" నవలని రాసారు. దీనిని సత్యజిత్ రే ఇదే పేరుతో బెంగాలీ లోనూ, డిస్టంట్ థండర్ (Distant Thunder) అనే పేరుతో ఇంగ్లీషు లోనూ (Dubbed Version) సినిమా తీసారు. పుస్తకం చదివాక సినిమా (ప్రైం లో వుంది) వెతుక్కుని తప్పకుండా చూస్తాం. రెండిటిలో చిన్న చిన్న మార్పులుంటాయి. పుస్తకం చాలా వివరంగా వుంటుంది. సినిమా లో చిన్న మార్పులున్నా, అది దృశ్య కావ్యం కాబట్టి, ఇంకాస్త ప్రభావ వంతంగా ఉంటుంది.
యుద్ధం వల్ల చాలా దుష్పరిణామాలుంటాయి. బర్మా నుండీ దిగుమతవాల్సిన ధాన్యం రావడం ఆగిపోతుంది. ఆర్ధిక మాంద్యం, దానికి తోడు బలవంతపు ధాన్య సేకరణ ! భయంకరమైన ధరల సెగ, ప్రజానీకాన్ని ఎంత దీనత వైపు తోసేస్తాయో. ఈ నవల లో గ్రామీణులలో చదువుకున్న వారు చాలా తక్కువ. 1943 ప్రాంతాలలో వారికి పరాయి పాలన కన్నా, సమాజంలో పాతుకుపోయిన భూస్వామ్య, నిరంకుశ కుల వ్యవస్థ ఎక్కువ బాధించేవి. బ్రాహ్మణుడు గ్రామంలో ఎంతో గౌరవించదగ్గ వ్యక్తి. అన్ని ప్రాంతాలలోగానే ఇలాంటి కష్టాలు సంభవించినప్పుడు నష్టపోయేది దిగువ ఆదాయ వర్గాల వారే. వారిలో బ్రాహ్మణులూ ఉన్నారు, హరిజనులూ ఉన్నారు. "గుడ్ ఎర్థ్" నవల్లో లాగా గ్రామీణులు, చిన్న వృత్తి, వ్యవసాయ దారులూ, నగరాలకు తిండి కోసం వలస పోయారు. సైన్యంలో చేరిన వారు, విదేశాలకు వెట్టి చాకిరీకి తరలించబడినవారూ పెరిగారు. దళారీలు తోడేళ్ళలా గ్రామాల మీద పడ్డారు. బ్లాక్ మార్కెట్ ప్రభావాల వల్ల ధనికులు మరింత ధనికులయ్యారు. గ్రామాలలో మిగిలిపోయిన జనం, ఆకులు, దుంపలు, జల చరాలూ తింటూ, జబ్బుల పాలై మరణించారు.
ఇలాంటి ఘోరాలు మొదలవ్వకముందే ఒక గ్రామానికి, వర్షాలు లేక కరువొచ్చిన ప్రాంతం నుండీ ఒక బ్రాహ్మణ కుటుంబం బ్రతుకు తెరువు వెతుక్కుంటూ వస్తుంది. మొదట్లో ఈ గ్రామంలో వారికి సరిపోయేంత ఆదాయం దొరుకుతుంది. ఎన్నో ఏళ్ళకు వీళ్ళు కడుపునిండా తిండీ, వొంటినిండా బట్టా కట్టుకోగలుగుతారు. ఆ ఇంటి ఇల్లాలు చాలా మంచి అమ్మాయి. ఎవరైనా ఇంటికొస్తే, ఉన్న దాంట్లోనే ఇంత పెట్టే మంచి మనసున్న మనిషి. ఈ కృత్రిమ కరువు మొదలయ్యాకా, ధాన్యం కోసం ఒక్కోటీ ఆవిడ వొంటి మీదున్న కాస్త బంగారమూ అమ్మేసుకుంటారు. పొరిగూరి నుండీ ఏ పరిచయమూ లేని ఇంకో బ్రాహ్మణుడు వచ్చి తిండి కోసం తిష్ట వేసినా భరిస్తుంది. తను కడుపు మాడ్చుకుని భర్త నానా పాట్లూ పడి తెచ్చిన బియ్యం తో ఎలాగో అందరి ప్రాణాలూ నెలబెడుతుంది.
పరిస్థితులు మెల్లగా దిగజారుతుంటాయి. వేరే ఊర్ల నుండీ బీదా బిక్కీ, తిండికోసం అడుక్కుంటూ వస్తూంటారు. ప్రజలు ఇళ్ళలో అన్నాలు రహస్యంగా వొండుకు తినే పరిస్థితి వస్తుంది. ఆడవాళ్ళు అడవుల్లోకెళ్ళి దుంపలు, ఆకులూ సేకరించాల్సొస్తుంది. చెరువుల్లో నత్తలూ, చేపల్నీ కూడా వెతుక్కుంటూ బురదమయం చేసేస్తుంటారు. ఎక్కడా కొనుక్కుందామన్నా తిండి దొరకదు. బియ్యం కోసం కొందరు స్త్రీలు వొళ్ళమ్ముకుంటారు. పరిస్థితులు పూట పూటకీ దిగజారుతుంటాయి. బియ్యం బజారునిండీ తెచ్చుకునేలోగా దోపిడీలు చేయడమూ ఎక్కువవుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో, మానవ సంబంధాలు ఎలా వుంటాయి? సాయం కోసం తలుపు తట్టే సాటి మనిషిని ఆదరించే సహృదయత ఎంతమందికి ఉంటుంది. అసలు సాయం చేసేందుకు వీళ్ళకంటూ ఏదో ఒకటి ఉండాలి కద. ఈ బ్రాహ్మణుడు వీధి బడి నడిపే పంతులు. కరువులో పిల్లలని చదువు కెవరు పంపుతారు ? ఆదాయం ఉండదు. ఆకలి తీర్చాల్సిన నోర్లు పెరుగుతుంటాయి. భార్య చాలా మంచిది కాబట్టి, ఉన్నప్పుడూ, లేనప్పుడూ భర్తకి ధైర్యాన్నిస్తూ, తను తినీ తినకుండా అందరికీ భోజనం పెడుతుంది.
ఈ పరిస్థితుల్లో గ్రామంలో స్త్రీలు కులాలకతీతంగానే స్నేహంగా వుంటారు. వారిని కలిపి ఉంచేది బీదరికమే. అస్సలు తిండి లేని నాళ్ళలో అడవుల్లో ఒకరికొకరు సాయంగా వెళ్ళి కందమూలాలు తవ్వుకుని తెచ్చుకుంటారు. అలా వీరి స్నేహితురాలైన / పరిచయమున్న ఒక దళిత అనాథ స్త్రీ ఈ బ్రాహ్మణ కుటుంబం ఉండే ఇంటికి సమీపంలో తిండి లేక, నేల మీద పడి మరణిస్తుంది. తన దగ్గర ఏదో ఆహారం దొరుకుతుందని వస్తూంటుందని, పాపం నిరాహారంగా చనిపోయిందనీ ఈవిడ కన్నీరు మున్నీరు అవుతుంది. నిజానికి ఆకలి చావుల గురించి వారు అంత వరకూ పుకార్లే వింటారు గానీ, ప్రత్యక్షంగా ఇంత సమీపం లోంచీ చూడడం వీళ్ళందరికీ ఇదే మొదటి సారి. ఆ హరిజనురాల్ని శవాన్ని చూసి, ఆ చనిపోయింది తాము కాదని అందరూ సంతోషిస్తారు. కానీ భయం గుండెని కమ్ముకుంటుంది.
కానీ కులాచారాల ప్రకారం ఆమెను దహనం చేసేందుకు ఎవరూ రాకపోతే, ఈ బ్రాహ్మణ కుటుంబమే, ఆ శవాన్ని తాకి, తరవాతి కార్యక్రమాలకు ముందుకొస్తుంది. ఆ నిరంకుశ కుల వ్యవస్థ ని ఈ కరువు కాసేపు పక్కన పెట్టేలా చేస్తుంది. (మొన్నటి కరోనా లాగా Equaliser) కరువు కూడా అందరికీ సమానమే అని అందరికీ అర్ధమవుతుంది.
ఈ సినిమాని చూసినప్పుడు, తిండి కోసం ఒక ముఖం కాలిపోయిన ఇసుక బట్టీ యజమాని తో లేచిపోయేందుకు సిద్ధ పడిన అందమైన యువతిని చూస్తాం. ఆవిడ భర్త తిండి కోసం కుటుంబాన్ని వొదిలి అప్పటికే ఎక్కడికో వెళిపోయుంటాడు. హీరోయిన్ బంగ్లాదేశీ అని చదివాను. ఆమె కూడా చాలా అందంగా ఉంది. బెంగాలీ గ్రామాల అందాలని ఒడిసిపట్టడంలో రే అగ్రగణ్యుడు. చుట్టూ పచ్చదనం ఉన్నా, పండిన పంట అంతా ప్రభుత్వానికి తరలించాల్సొచ్చి, ఆకలిచావులు సంభవించడం, బెంగాలీ జాతీయ స్పృహ ని తాకుతాయి. ఈ బాధితులకు జర్మనీ, యుద్ధమూ, వగైరాల గురించి ఏమాత్రమూ తెలీదు. అవెక్కడ ఉంటాయో కూడా తెలీదు. చనిపోయినవాళ్ళందరూ, "అన్నం, అన్నం" (భాత్, భాత్) అని తలుచుకుంటూ చనిపోతారు. అదో హృదయ విదారక దృశ్యం. అతి పెద్ద మానవ తప్పిదం. ఈ ఫేమిన్ బ్రిటీష్ ప్రభుత్వ పునాదుల్ని కదిలించడంలో ప్రముఖ పాత్ర వహించింది. వారి నిరంకుశ పరిపాలనా విధానం, వలస దేశాలలో ప్రజని జంతువులకన్నా హీనంగా పరిగణించడమూ, దేశాన్ని ఆగ్రహంలో ముంచెత్తాయి.
ఈ పుస్తకాన్ని తెలుగులో కాత్యాయని గారు అనువదించారు. "ఇచ్చామతీ తీరాన" కూడా ఆవిడే అనువదించారు. కేవలం టైటిల్ తప్ప మిగతా అన్ని భాగాలూ ఎలానూ 'చాలా బాగా' అనువాదం చేసారు. బహుశా "అశని సంకేత్" అనే పదానికి తెలుగు అర్ధం తట్టలేదేమో.. లేదా సరైన ఇంపాక్ట్ కలిగించేందుకు యధాతథంగా ఉంచారో అని అనిపించింది. కానీ అదృష్టవశాత్తూ మిత్రులు విన్నకోట నరసింహారావుగారు నా సందేహాన్ని తీర్చారు. 'అశని' అంటే 'పిడుగు' అని అర్ధం ఉంది. అశనిపాతం అనగా పిడుగు పడడం అని అర్ధం. అంటే ఈ డిస్టంట్ 'థండర్' అన్న ఇంగ్లీషు అర్ధాన్నన్నా నేను చూసుకునుండాల్సింది. కాబట్టి ఇది సరైన టైటిలే అనుకుంటున్నాను. ఇది చాలా మంచి రచన. కథా వస్తువు పాతది, క్లాసిక్ ఇండియన్ నవల ఇది. ఇంత మంచి నవలని తెలుగులోకి తీసుకొచ్చినందుకు HBT వాళ్ళని అభినందించాలి.
ఒకలాంటి రొమాంటిసిసం తో ఆకట్టుకునేలా, ప్రపంచం అంతా చుట్టేసినట్టు రాసే బిభూతి భూషణుడు రాసిన నవలల్లో ఇదో అత్భుతం. "ఇచ్చామతీ తీరాన" కూడా బావుంది. కానీ అదో వేరే రాజకీయ వాతావరణపు దృశ్యం. కానీ ఈ పుస్తకం చదివాక "ఇలాంటి కథ చెప్పడానికి చాలా సాహసం కావాలి" అనిపించింది. పరిస్థితులు నెమ్మదిగా మన కళ్ళ ముందే దిగజారుతుంటాయి. వాటిని చూస్తూ ఆత్మ స్థైర్యాన్ని నిలుపుకోవడం మానవ అస్థిత్వానికి చాలా ఇంపార్టెంట్. ఏదేమైనా ఇది చాలా మంచి పుస్తకం అని చెప్పొచ్చు. [గ్లూమీ సంగతులు - బాధ, కోపం కూడా వస్తూంటుంది. పూర్తిగా అవాయిడబుల్ కరువు. దాని దుష్ప్రభావాల ముద్రలు బెంగాల్ లో ఇంకా మిగిలే ఉన్నట్టు అనిపిస్తుంటుంది]. It was important to document this event in literature. చాలా గొప్ప ప్రయత్నం.
Notes :
Distant Thunder (Film adaptation) - Available in Prime.
: https://www.thedailystar.net/entertainment/tv-film/news/50-years-satyajit-rays-ashani-sanket-enduring-masterpiece-3394916
ReplyDeleteమూవీ ఇందాకే ప్రైమ్ లో చూసానండి (English sub-titles తో). బాగా తీసారు 👏. భారతదేశ చరిత్రలో ఒక విషాదకరమైన అంశం 1943 బెంగాల్ కరువు.
హీరోయినే కాదు హీరో సౌమిత్ర ఛటర్జీ కూడా యంగ్ గా, అందంగా ఉన్నాడు. బెంగాలీ చిత్రరంగంలో అగ్రగణ్యుడిగా వెలిగాడు.
సత్యజిత్ రే గారు ఈ చిత్రాన్ని Distant Thunder పేరుతో ఆంగ్లంలో కూడా తీసారు అని పైన రెండో పేరాలో అన్నారు మీరు. కానీ ఆంగ్లంలో వేరే నిర్మించారంటారా? బెంగాలీ సినిమాకే English sub-titles పెట్టి, అదే “అశని సంకేత్” పేరు ఉంచి ఆంగ్లంలో Distant Thunder అన్నారనుకుంటాను. పైన మీ పోస్ట్ లో చివర మీరిచ్చిన Distant Thunder అనే లింకులోకి వెడితే కనబడే మొదటి వాక్యం అదే ఉంది. పైగా ప్రైమ్ లో Distant Thunder అని వెదికితే దొరకలేదు; “అశని సంకేత్” అని టైప్ చేస్తేనే దొరికింది. నేనేమైనా పొరబడుతున్నానేమో - మీరు గానీ ప్రత్యేకించి ఆంగ్లంలో తీసిన చిత్రాన్ని చూసారా (English sub-titles తో కాకుండా)?
ఏమైనప్పటికీ విలువైన పుస్తకాన్ని పరిచయం చేసారు సుజాత గారూ. థాంక్స్. అశని అంటే పిడుగు అని తెలిసిందే కదా (అశనిపాతం అంటే పిడుగు పడడం కదా), కాబట్టి అనువాదంలో పుస్తకం పేరు ఒరిజినల్ పేరే ఉంచినా పెద్ద ఇబ్బందేమీ లేదనుకుంటాను లెండి.
మూవీ చూసిన తరువాత పుస్తకం ప్రతి కొనుగోలు కోసం ఆన్-లైన్ లో ఆర్డర్ పెట్టాను కూడా.
Interesting review. I heard about this famine but not this novel or movie. I used to hear from
ReplyDeletethe elders in our village in AP that their ancestors died of famine. Sad that it is a human created famine.
విన్నకోట నరసిమ్హారావు గారు,
ReplyDeleteఏవో టెక్నికల్ కారణాల వల్ల నా రిప్లయ్ పబ్లిష్ కావడం లేట్ అయిందండీ. వ్యాఖ్యానించినందుకు చాలా థాంక్స్. టైటిల్ కి సరైన అర్ధం సూచించినందుకు ధన్యవాదాలు. నేను బెంగాలీలోనే చూసాను. ఇంగ్లీష్ లో వెతకలేదు. మీరన్నది నిజమై ఉండొచ్చు. ఇంత ఇంటరెస్ట్ తో Comment రాసినందుకు థాంక్స్. మీ వివరణ తో పోస్ట్ ని సరిచేయవచ్చా.
థాంక్యూ సుజాత గారు.
Deleteనా వ్యాఖ్యలోని అభిప్రాయాలతో మీరు ఏకీభవిస్తున్నట్లయితే ….. మీ పోస్ట్ ని తదనుగుణంగా సరిచేయవచ్చు.
మీరు వ్రాస్తున్న ఈ రివ్యూలు చాలా బాగుంటాయి సుజాత గారు. ఇంత ఓపిగ్గా పుస్తకాలు పరిచయం చేస్తున్నందుకు ధన్యవాదాలు.
ReplyDeleteశారద
Thank you so much Sarada garu.
ReplyDelete