పుస్తకం తెరవగానే "కథాకాలం : 1971-80, రచనాకాలం : 1979-81" అని చూసి మానసికంగా పెద్ద "పాత" కథ కు సిద్ధమయి చదవడం లోకి దూకగలం. ఇతివృత్తంలోని ఒకరికొకరు పరిచయముండే అసంఖ్యాక పాత్రలు ఒకే పెట్టున పలకరిస్తూ యూనివర్సిటీ కేంపస్ లో ఎదురవుతాయి. నవల అంతా ఆయా పాత్రల జీవితాల్ని, ముఖ్య సంఘటనల్నీ, విడి విడిగానూ, అప్పుడపుడూ అల్లుకుంటూనూ సాగుతుంది. ముఖ్యంగా భారత చరిత్రలో ముఖ్యమైనటువంటి ఎమర్జెన్సీ రోజుల గురించి, అంచెల్లో, ఎలా ఏయే పరిస్థితులు, రాజకీయ పరిణామాలు రూపుదిద్దుకున్నాయో, వాటి వల్ల సాధారణ జనం పడిన అగచాట్ల గురించి విస్తారంగా వివరిస్తుందీ నవల.
[కథాకాలంగా 1971-1980 ని తీసుకోవడానికి ప్రత్యేక కారణాలంటూ యేం లేవుగానీ ఈ దశాబ్దం కొన్ని విశేష లక్షణాలున్న దశాబ్దంగా నాకు అనిపించింది. స్వపరిపాలనా భారతావనిలో అవిచ్చిన్నంగా కొనసాగుతూ వొస్తున్న వొకానొక రాజకీయ పరిపాలన వొక "డింకి" వేసిన దశాబ్దం. అన్ని రకాలగానూ యెన్నడూ యెదగని కొన్ని దేశాలలా కాక - ధనమ్మూల మిదం జగత్తైనప్పటికీ, అనార్ధికమైన యెన్నో అంశాలకి సంబంధించి శతాబ్దాలుగా యెంతొ యెదిగి వొదిగి యెదిగిన భారత దేశంలో యే పరిస్థితులు యెలా వున్నా పౌరులందరికీ వోటు హక్కు ఉన్న ప్రజాస్వామికం వున్నప్పటికీ, వ్యవ్స్థికంగా సమూలమైన మార్పు కోసం నినాదోద్యమ కెరటం లేచిపడిన దశాబ్దం. - వడ్డెర చండీదాస్]
ఈ పుస్తకం గురించి ఇన్నేళ్ళ తరవాత పరిచయం రాయాలనుకోవడం చాలా అసమంజసం. అయినా, కొన్ని చెప్పుకోదగ్గ అనుభవాలు, విశేషాలూ ఉన్నాయి. నాకు ఏకబిగిన ఏ పుస్తకమూ చదవలేని, ఏ సినిమా కూడా ఒకే షాట్ లో చూడలేని మనస్థితి నుండీ బయటపడ్డట్టే అనిపించింది. ఒకే రోజులో ఆపకుండా చదివించడం, తెరలు తెరలుగా వేరే వేరే జీవితాల కథలు అంకాలుగా మారుతూ మధ్యలో ఆనాటి రాజకీయ వాతావరణం గురించి, మార్క్సిసం, విరసం, వంటి భావజాలాలతో అల్లుకుపోయిన జీవితాల గురించీ విడమర్చి చెప్పిన కొన్ని కథల వల్ల, ఈ పుస్తకం రీడబిలిటీ పెరిగిందనిపించింది. ఎప్పుడో, నేను పుట్టక మునుపు కాలం లో కథాంశాన్ని, ఇన్నేళ్ళ వయసులో చదువుతూ, ఆయ జీవితాల గురించి ఆలోచిస్తుంటే, సాంఘికంగా మనం పెద్ద దూరం ప్రయాణించకపోయినా, దేశంగా చాలా ముందుకు వచ్చామేమో అనిపించింది.
అందమయిన + వ్యక్తిత్వం ఉన్న ఆడవాళ్ళు, వాళ్ళ తాత్విక సౌందర్యం తో పాటూ, నిజాయితీపరులైన రచయితల కళ్ళల్లో పడి బ్యూటీ షేమింగ్ కు గురయిన ఫ్లాట్ చెస్టెడ్ మహిళల నుంచీ, సూట్ కాకపోయినా వికారమైన చీరకట్లతో ప్రపంచాన్ని ఠారెత్తించే వారు, విపరీతమైన కోరికల మత్తులో కొట్టుకుపోయేవారు, మొగుడి చేష్టలకు జడిసి, వేగలేక ప్రాణాలు తీసుకునే వారు, ఉన్మత్తులు, మత్తులు, కుటిలులూ, ధీరలు, కుక్క కాట్లకు చెప్పుదెబ్బలిచ్చుకునే మహిళలు, అతి నిజాయితీపరురాళ్ళూ, క్షణికావేశులూ.. ఇలా ఎందరో ఆడవాళ్ళు, వాళ్ళనల్లుకునే ఎందరో నీచులూ, మాన మర్యాదలున్న మగవాళ్ళు, ప్రేమికులూ, చేతులడ్డుపెట్టి రక్షించుకున్న తండ్రులు, వీరు వారు అని కాకుండా బోల్డన్ని రకాల పాత్రలు.
ప్రతీ పాత్రదీ ఓ కథ. వాళ్ళలో 'స్వప్నరాగలీన' లాంటి ప్రత్యేక పాత్రలు.... ఆవిడ ని చూస్తే నైరూప్య లాలిత్యం హుందాతనంగా రూపుదిద్దుకున్నట్లు అనిపిస్తుందట. పైశాచికపు టాకలిజీవులు తప్ప అందరూ ఆరాధించే అసాధారణ అపూర్వ అపురూప సౌందర్య స్వాప్నిక నిజం లాంటి స్వప్న. ఈ పిల్లని చండీదాస్ చాలా ఉద్విగ్నంగా సృష్టించి ఉంటారనిపిస్తుంది. కానీ ఎవరో పాత్రల గురించి ఆయన్ని ప్రశ్న అడిగితే, "తనకు రచయితగా తాను సృష్టించే అన్ని పాత్రల్నీ సమానమే. ప్రతి ఒక్కరితో తాదాత్మ్యించే రాస్తాను యధాతథంగా" అని సమాధానమిచ్చారు.
నవల్లో ఒక్కో పాత్రదీ ఒక్కో బాధ, గాధ. నవల ముగిసాకా, జీవితం గుర్తొచ్చింది. దేవుడు కూడా మనల్నందరిని సృష్టిస్తాడు కదా.. మార్క్ ట్వైన్ చెప్పినట్టు - ఓ చేత్తో సృష్టిస్తాడు. ఇంకో చేత్తో లయం చేస్తాడు. మధ్యలో బ్రతికే బ్రతుక్కి కష్టాలు, సుఖాలూ, అనుభూతులూ ఇస్తాడు. వాటి నుండీ నేర్చుకోవడమే, దొరికిన వారికి దొరికినంత జ్ఞానం. ఎన్ని వికృతాలనో చూస్తాం. ఎన్ని ఘోరాలనో అనుభవిస్తాం. శాపనార్ధాలు పెడతాం. కొన్ని సార్లు ఉద్యమిస్తాం. ఎదురు తిరుగుతాం. కొన్ని సార్లు సర్దుకుపోతాం. మోసపోతాం. ఎవరో ఏదో నిర్ణయిస్తే, ఆ భారం మోస్తుంటాం. కాబట్టి, ఎందుకు ఈ తాపత్రయం ?
ఇంత ఫిలాసఫీ లోనూ కొంచెం "నిజాయితీ" వర్ణనలు. అందమైన స్త్రీ ని వర్ణిస్తే చక్కగా చదువుతామే. చాలీ చాలని బట్టతో కుట్టిన జాకెట్లేసుకుని, పొట్ట విరుచుకుని తిరిగే మహిళల్ని చూస్తే చూసేవారిలో కలిగే వికారాన్ని గురించి కూడా - "యీ బొడ్డుకింది చీరకట్టులో జనాన్ని చూడలేక డోకొస్తోంది. తిరగలి కంతలా బొడ్డు. మధ్యబాగం కాబట్టి నడుం అని అనుకోవాల్సొచ్చే నడుంకి అటు పక్క, ఇటుపక్క కిదికి జారిన కండలు, చిరు బొజ్జా - పవిట కప్పకూడదూ - యీ బొజ్జ రాణి - ఆహా ఆహా నన్ను చూడు - నా బొజ్జ చూడు నా కలుగుబొడ్డు చూడు అంటూ - యే ఘటోదరీ బొడ్డు కిందకి చీర కట్టడం నిషిద్ధం అని శాశనం చేస్తే బావుండును" అనుకునేట్టు.
పైగా మహిళా పాత్రల శరీరము, వారి సెక్సువాలిటీ మీద, వారి పార్ట్నర్స్ వెలిబుచ్చే "అభిప్రాయాలు", ఆయా పాత్రల సంకుచితత్వమూ, కధాకాలం ప్రకారం, ఎప్పటి కండిషనింగో - ఆడవారికి అపుడపుడే అబ్బుతున్న విద్య, (పెద్దగా చదువుకోని వారికి బయటి ప్రపంచాన్ని, రంగుటద్దల్లో అయితేనేం, అసలంటూ చూపించే నవలలు, పోచికోలు సాహిత్యం) పెద్ద ఆలోచనలూ, ఆశలూ లేకుండా జరిగే వివాహాలు, సెక్స్ కోసం అడ్డదారులు తొక్కే ఆడ వారు, భయంకరమైన కన్నింగ్ ఉన్న విషనాగుల్లాంటి మగవారూ, మంచి వాళ్ళు, చెడ్డవాళ్ళు, ఉన్న పెద్ద కేన్వాస్. ఇవన్నీ ఇప్పటికీ ఉన్నాయి. వాటి రంగులు మారాయంతే.
మధ్యలో అంతర్లీనమైన కథ "ఇందిర" ది. ఇందిరాగాంధీ ఉక్కు మహిళే. ఆవిడ "నిర్దాక్షిణ్యత", రాజకీయ కుయుక్తి, కోటరీ మాటలు విని దేశాన్ని చీకట్లోకి నెట్టేసిన పద్ధతీ, ఆపై ఎన్నికలు తనకు తానై ప్రకటించి, ఊహించని విధంగా ఓడి, తరవాత ఒక్కతీ ఉద్దండులైన ప్రత్యర్ధుల్ని ఎదుర్కొని, రాజకీయంగా దృఢమై, శక్తి పుంజుకుని, తానే ఊహించనంత మెజారిటీ తో గెలిచి, మళ్ళీ ప్రధానమంత్రి అయి.. ఇవే విజయాలు, ఇవే అణిచివేతలు, ఇవే నిర్ధాక్షిణ్యతలు, చూపించిన ఆమె మహిళ కాకపోయి ఉంటే అతి పెద్ద నాయకత్వ నిర్ణయాలుగా పేరుపొంది ఉండేవి. ఆ రోజుల్లో ప్రజల్లో ఉన్న విలువలు, ఒక "స్త్రీ" నాయకురాలవడానికి ఉపకరించేయి. ఈ నవల్లో ఒక పాత్రధారి, డబ్బు, సారాయి పంచకుండానే ఎలక్షన్లలొ గెలిచి, మంత్రి కూడా అవుతాడు. ఈరోజుల్లో ప్రజలే అమ్ముడుపోయినారు. ఎన్నికలొస్తే, ఓటుకింతని అమ్ముకునే ఓటరు ఓటుకా విలువ ?
బోల్డన్ని పాత్రలున్నందువల్ల సమాజంలో ఆడవాళ్ళ ప్రాముఖ్యతని రచయితే చాలా చోట్ల కొట్టొచ్చే విధంగ చెప్పే ప్రయత్నం చేసారు. "మన దేశంలో స్త్రీల వోట్లతో గెలుస్తూ, స్త్రీ పరిపాలనలో ఉన్నప్పటికీ ఇంకా పురుష దురహంకారధిక్య ద్వంద్వ ప్రమాణ నైచ్యంలోనే ఉన్నాం. ద్వంద్వ ప్రమాణ స్థితి అంటే నాకు అసహ్యం, అసహనం" అని ఒక పాఠకుడి ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. స్త్రీల నాయకత్వం సంగతి పక్కన పెడితే, ఈ నవల్లో లాగే అసంఖ్యాక పురుష పాత్రలు, ఆడవారి దేహాల్ని చూస్తూ జడ్జ్ చేస్తూ, అందానికీ, అనాకారితనానికీ, అన్నిటికీ వారినే విక్టిమైజ్ చేస్తూ, వారికో వ్యక్తిత్వం ఉంటుందనో, మనసు ఉంటుందనో బాధ్యతలు, జీవితమూ ఉంటుందనో పట్టించుకోకుండా మనసు లోపలనో / బరితెగించి బయటకో అడ్డమైన వాగుడూ వాగి, పైకి ఇది మామూలే అన్నట్టు ఉండడం.. ఇదే ప్రవర్తన, ఇన్ని సంవత్సరాల తరవాత, స్త్రీ విద్య పెరిగాక, స్త్రీలు ప్రశ్నించడం మొదలయాక కూడా కొనసాగుతూండడం చూస్తున్నాము. అలాగే ఈ పాత్రల్లోనే కొందరు జెంటిల్ మెన్ - వేశ్యలతో కూడా మానవత్వం తో వ్యవహరించగలిగే వారు, భార్యంటే ప్రాణం పెట్టే వారు, 'స్త్రీ' అవమానాన్ని సహించలేని మంచి మనసున్నవాళ్ళూ ఉన్న్నారు. వాళ్ళు ఇప్పటికీ మన చుట్టూ ఉన్నారు. మంచీ చెడూ ఎప్పుడూ, అన్ని కాలాల్లోనూ చెట్టాపట్టాలేసుకునే ఉంటాయి. ఎంతైనా ఇవన్నీ ప్రిమిటివ్ / ఆటవిక లక్షణాలు - ఇంకా నయం, మనం ఈ దేశంలో ఉన్నాం, మహిళల జుత్తు కనిపిస్తుందనో, కాళ్ళు కనిపిస్తున్నాయనో చంపేసే దేశం కాదు మనది అని ఆనందించబుద్ధవుతుంది. కానీ అల్టిమేట్ గా మహిళలు మన దేశపు వినోద పరిశ్రమ దగ్గర్నించీ, స్కూల్స్ లో టీచర్లుగా, నర్సులు గా, సేవా రంగాల నుండీ, పారిశ్రామిక వేత్తలుగా, సైంటిస్టులుగా, పైలెట్లు గా, ఇంజనీర్లుగా, సాఫ్ట్ వేర్ రంగం లో కూడా ఎక్కువ సంఖ్యలో పని చేస్తూ, మన కొనుగోలు శక్తుల్నీ ప్రభావితం చేస్తున్నారు. మహిళా వోటు - కి కూడా కాస్త విజ్ఞత అబ్బితే, లేదా సమాజంలో కావల్సిన మార్పులకి స్త్రీ పురుషులిద్దరూ కలిసి, ఒక్కో రెక్కా జేర్చి పూనుకుంటే, అప్పుడు కాస్తయినా ఈ ద్వంద్వత తగ్గుతుందని మనమే తెలుసుకోవాలి.
మొత్తానికి ఇది ఓ పొలిటికల్ / ఫిలాసఫీ / సాంఘిక / మానసిక / లైంగిక విషయాలగురించి మాత్రమే చర్చించే నవల కాదు. అంతా ముగుస్తుంది. కానీ ప్రకృతి వెంటనే ఇంకో కథ మొదలుపెడుతుంది. పాత్రధారుల పాత్రలవీ ముగిసాక, వారి చెల్లెళ్ళూ, తమ్ముళ్ళూ, పరిచయస్తుల పిల్లలూ, అదే యూనివర్సిటీ గడపలెక్కుతారు. కొన్ని రోజులకి ఆ తరవాతి తరం, ఇంకో తరం.. వారి బ్రతుకులు - వారి కష్టాలు, సుఖాలు, ప్రేమలు, చావులు, పుట్టుకలూ, ఇంకో చరిత్ర. కనురెప్ప పాటులో ముగిసి మళ్ళీ మొదలయ్యేదే ఈ జీవితం.. క్షణికం, అనుక్షణికం.
అందరూ పోతారు. ప్రతీదీ పోతుంది. యెవరూ పోరు. యేదీపోదు. పోనిదే రావటం యెలా? రానిదే పోవటం యెలా ? ఈ రావటం పోవటం లోంచి -
అన్నీ యధావిధి సాఫీగా కొనసాగుతున్నాయి. యీ మండే పగటెండ వెన్నెల వేళ మేలుకున్నవారి వ్యధా విధి తప్ప - అన్నీ యధావిధిగా సాఫీగా సాగిపోతున్నాయి.
క్షణం వెనుక క్షణం ముందు క్షణం లోన క్షణం కింద క్షణం పైన క్షణం వక్క క్షణం క్రితం క్షణక్షణం, క్షణికం ; క్షణిక క్షణిక క్షణంలో పుట్టుకే గిట్టుకలా అసలు ఆరంభమే అవనట్లుగా, గిట్టుకే పుట్టుకలా అసలు అంతమే అవనట్లుగా ; క్షణక్షణాల క్షణికాల, క్షణికక్షణికాల క్షణం; అంతలోనే అంతమయ్యే క్షణికాల దొంతర, యెంతకీ అంతమవని దొంతర క్షణికాల, విశ్వాంతర్ప్లావిత సంకీర్న క్షణికాలు. అంతలోనే అంతమయ్యే యెంతకీ అంతమవని నిరంతర క్షణికం అనుక్షణికం.
Many thanks to Ms Purnima Tammireddy, who sent this book to me, almost a year ago. But I could read it only today.
***
40 యేళ్ళ పాత రచనను ఇప్పుడు పరిచయం చేస్తున్నారా 🙂? అయినా ఫరవా లేదు లెండి. “అనుక్షణికం” వడ్డెర చండీదాస్ గారి magnum opus 🙏.
ReplyDeleteThank you so much sir
Deleteఈ రచయిత గురించి ఎక్కువగా వినలేదు అప్పుడప్పుడు తెలుగు బ్లాగుల్లో చదవడం తప్ప.
ReplyDeleteఎక్కువగా ప్రాచుర్యం పొందని మంచి పుస్తకాలను పరిచయం చెయ్యడం అభినందించదగ్గ విషయం.
Thanks andi
Delete