చాలా సంవత్సరాల క్రితం జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత 'కురతులైన్ హైదర్' రాసిన ఉర్దూ నవల 'ఆగ్ కీ దరియా' [తెలుగులో నేషనల్ బుక్ ట్రస్ట్ చేయించిన] అనువాదం 'అగ్ని ధార' చదివాను. బంగ్లాదేశ్ ఉదయించకముందుండిన తూర్పు పాకిస్తాన్, భారత దేశం నుండీ విడిపోయినప్పటి సంగతులను రికార్డ్ చేసిన నవల ఇది.
మనకు విభజన సాహిత్యం అనగా, చాలా వరకూ, భారత దేశం, పశ్చిమ పాకిస్తాన్ ల విభజన, జన ప్రవాహం, అక్రమాలు, మత కల్లోలాలూ, కూనీలూ గుర్తొస్తాయి. బెంగాల్ విభజన అనంతరం మారిన డైనమిక్స్ మూలాన, మత ప్రాతిపదికన భారత దేశం చీలినపుడు, 'తూర్పు', 'పశ్చిమ' బెంగాల్ లు సైతం 'భారత దేశపు బెంగాల్', 'పాకిస్తానీ బెంగాల్' లు గా విడిపోయినపుడు అక్కడ జరిగిన ఘర్షణల గురించి ఈ నవల లో చాలా మంచి వివరాలుంటాయి.
తూర్పు పాకిస్తాన్ నుండి కూడా, ముసల్మాన్ కుటుంబాలు ఉపాధి కోసమో, రాజకీయ ఉనికి కోసమో పశ్చిమ పాకిస్తాన్ కు వలసపోవడం, సుందరమైన, అత్భుతమైన, పచ్చని బెంగాల్ ను, తమ తమ జమీల్నీ, నేలల్నీ విడిచి, ఉన్నతకుటుంబాలైతే, కేవలం కొద్దిసామాన్లు మాత్రమే సర్దుకుని అత్యంత దూరాభారమైన ప్రయాణం చేసి, పశ్చిమ పాకిస్తాన్ చేరుకోవడం, మనుషుల్లేని ఆ ఖాళీ ఇళ్ళల్లో, పిచ్చి గా పెరిగిన తోటలూ, చెల్లా చెదురుగా పడి ఉన్న సామాన్లలో బావురుమనే ఆయా కుటుంబాల గ్రూప్ / ఫేమిలీ ఫోటోల్ని చూసి బాధపడే హిందూ స్నేహితులు, వారి వారి మనసుల్లో సంఘర్షణల్ని పట్టిచ్చిన నవల ఇది. ముఖ్యంగా తూర్పు పాకిస్తానీ శరణార్ధుల గురించి నేను చదివిన మొదటి నవల కావడం వల్లనేమో - బాగా గుర్తుండిపోయింది. బుద్ధుడు తిరిగిన నేలలో మనిషి, సాటి మనిషి ని భాషని చూపో, కుల మతాల్ని చూపో విద్వేషించడం - ఎందుకు ఇవన్నీ ? ఇదంతా అధికారం కోసమే కదా - అని ప్రశ్నించిన నవల కూడా ఇది.
ఇరు దేశాల వాళ్ళూ, విభజన సృష్టించిన "దాటలేని అగాధాల్ని" చూస్తూ నిస్సహాయంగా ఎలా ఉండిపోయారో - ఆ బద్దలయిన హృదయాల గురించి ఓ స్త్రీ ఇంత చక్కగా రాయడం, స్త్రీ కావడం వల్లనే రాయగలిగారేమో అన్నంత బావుంటుంది ఈ పుస్తకం. విభజన వల్ల కొన్ని తరాలు జీవితాల్ని కోల్పోయాయి. ఉన్న ఇల్లు, కన్న దేశమూ, అస్తీ, పాస్తీ, గొడ్డూ, గోదా, చాలా సార్లు మరీ విపరీతంగా ధన, మాన, ప్రాణ దోపిడీలకి కూడా గురయ్యాయి. విభజన మన గుండెల మీద ఏర్పరచిన పెద్ద గాయం. దాని పచ్చి తడి ఆరదు. అయితే, కేవలం సాహిత్యం మాత్రమే, ఈ గాయాల్ని రికార్డ్ చేసి, మనం ఒకర్నొకరు చంపుకుని విజేతలమయ్యామా అని ప్రశ్నించి, 75 ఏళ్ళ విభజన తరవాత కూడా మనం ఇలానే ఉండాలా అని గట్టిగా బుద్ధి చెప్తుంది.
మన దేశం మత ప్రాతిపదికన చీలిపోయి, 75 ఏళ్ళయ్యాయి. "ఆజాదీకా అమృతమహోత్సవం" జరిపిన చేత్తోనే భారత ప్రభుత్వం 'విభజన సమయాన దేశం ఎదుర్కొన్న ఘోర కలిని ఈ తరాలకి కూడా తెలిసేందుకు' "Partition Horrors Remembrance Day", ఆగస్టు 14 న నిర్వహించింది. ప్రజలకి సేవలందించే ప్రభుత్వ కార్యాలయాల్లో, ఉదాహరణకి పోస్ట్ ఆఫీసుల్లో, రైలు స్టేషన్ ల లో, విభజన సమయంలో జరిగిన వివిధ అకృత్యాల ని ప్రచురించిన ఆనాటి వార్తా పత్రికల ఫ్రంట్ పేజీల కత్తిరింపుల్ని, ఫోటోలనీ విస్తారంగా పోస్టర్లు గా సిద్ధం చేసి, ప్రదర్శించారు. ఈ లింక్ నుండీ, ప్రదర్శనకు కావల్సిన సామాగ్రిని డౌన్ లోడ్ చేసుకోవచ్చు. వాటికి సూచనలు కూడా ఉన్నాయి. తప్పని సరి అని కాదు గానీ, ఇష్టమున్న ఎవరైనా ఈ మెటీరియల్ ని తీసుకోవచ్చు. వాటిని దేశవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ కార్యాలయాలూ, ఇష్టమున్న ప్రైవేటు సంస్థలు కూడా, తమ తమ కారిడార్లలో, ఆఫీసు ప్రాంగణాల్లోనూ ఏడాది పొడుగునా ప్రదర్శించవచ్చు.
మరుసట్రోజు దేశ వ్యాప్తంగా ఉత్సాహంగా "ఘర్ ఘర్ తిరంగా" అంటూ, ఉత్సాహంగా జెండా ఉత్సవం జరుపుకుంది. దేశమంతా హోటళ్ళ నుండీ, చాయ్ అంగళ్ళ వరకూ, ప్రభుత్వ భవనాల నుండీ, సినిమా హాళ్ళ వరకు మూడు రంగుల విద్యుత్ కాంతుల్లో ధగధగలాడాయి. దేశం తాను సాధించిన ప్రగతి చూసి, సాధించాల్సిన విజయాల ని తలచుకుని, ఉప్పొంగిపోయింది. స్వాతంత్రం కోసం పోరాడి, ప్రాణాలర్పించిన నేతల్ని తలచుకుంది. మరుసట్రోజు మర్చిపోయే, దేశ భక్తి తో ఊగిపోయింది. కానీ ఆగస్టు 14 న విభజన ఘోరాల్ని గుర్తు చేసుకుందో లేదో పెద్దగా తెలీలేదు.
పత్రికలు, ఎలక్ట్రానిక్ మీడియా, కొన్ని విశ్వవిద్యాలయాలూ, మెట్రో సంస్థలూ కొన్ని కార్యక్రమాలనైతే నిర్వహించాయి. దక్షిణ భారత దేశం లో, విభజన దుఃఖం అంత గా అంటని నిక్షేపమైన వారసులమే ఉండటాన, ఆ విషయాలు మనకి ఆ విషయాలు పట్టింపుకే రాలేదు. అయితే మత పరమైన విద్వేషం ఎంత ఘోరంగా ఉంటుందో ఇప్పుడు మనకూ తెలుసు. విభజనా కాలం నాటి మాదిరి, అంత పెద్ద ఎత్తున కాకపోయినా, మన దేశం ఈ తరాన కొద్దో గొప్పో మూక అల్లర్ల, భ్రమల బారిన పడింది. ఘోరాల్ని కన్నా విన్నా అనంతరం విచక్షణ మరిచి , ఉన్నట్టుండి రాక్షసుడయ్యే స్నేహితుడిని చూసింది.
కావాలని స్వతంత్ర పోరాటంలో దూకి ఆత్మ బలిదానాలు చేసుకున్న భారతీయులు కాకుండా, హాయిగా ఏ గ్రామంలో సుఖాన వుండవల్సిన కుటుంబం - ఉన్నట్టుండి ఏ ఊచకోతనో మరణించాల్సి రావడం, ఆడపిల్లలు, మహిళలు, వృద్ధులు తప్పిపోవడం, వేలాది. లక్షలాది మంది, కాలినడకన, దారి తెలీని భవిష్యత్తును వెతుక్కుంటూ, కట్టుబట్టలతో తరలిపోవడం, దోపిడీ, అనారోగ్యం, అత్యాచారం, హత్య, ఎత్తుకుపోవడాలు, అమ్మబడడాలు, మానసిక, శారీరక వేదనలకు బలవంతాన గురి కాబడడం, ప్రపంచ చరిత్రలో ఎన్నడూ లేనంత పెద్ద విషాదంగా మిగిలిపోవడం, మన విభజన ఫలం. మొహాలు, పేరూ లేని ఎందరో, వాళ్ళ తప్పు లేకుండా చచ్చిపోతే, మనం ఇప్పుడిలా ఉన్నాం. మా దేశం గొప్పదీ, మీ దేశం అధమపుదీ అని కొట్టుకు చస్తూనే ఉన్నాం.
మన లాగే పాకిస్తాన్ కూడా, గుండె నిండా దుఃఖాన్నే మోసుకుని స్వతంత్ర దినం జరుపుకుంది. మొట్ట మొదటి స్వతంత్ర దినాన్ని ఎలా జరుపుకుందో, పాకిస్తానీ సినిమా 'జిన్నా' లో చూపిస్తారు. పాకిస్తాన్ ఏర్పాటయ్యి, భారత దేశం నుండీ ఇక్కడికి రాబోతున్న ప్రజల కోసం జిన్నా లహోరు స్టేషన్లో చేతిలో పూదండలతో నించునుంటాడు. ఒకే ఒక రైలు స్టేషన్ లోకి మెల్లగా వచ్చి ఆగుతుంది. కంపార్ట్మెంట్ల లోంచీ ఎవరూ దిగరు. నిశ్శబ్దమైన ఆ ట్రైన్ లోకి ఎక్కి చూస్తే, బోగీల నిండా ప్రయాణీకుల శవాలే. డ్రైవర్ తప్ప ఆ ట్రైన్లో ఎవరూ ప్రాణాలతో మిగలరు. శవాల మధ్య, కరవాలాలను తప్పించుకున్న ఓ ఏడుస్తున్న ఓ శిశువు దొరుకుతుంది.
ఇలాంటి శవాల ట్రైన్లు సరిహద్దుకు అటూ ఇటూ కూడా ప్రయాణం చేసాయి. ఇలా చంపుకున్నాం మనం. ముస్లిములం, హిందువులం, సిక్కులమూ. ఇలా ఇంటికి ఒక మతస్తులు అగ్గి పెట్టి వెళ్తే, అదే మతపు వాళ్ళు తెచ్చిన ఫైర్ ఇంజన్, పెట్రోలు తెచ్చి, నీళ్ళ లాగా ఆ ఇంటిపై చిమ్ముతుంది. ఒక మతపు మనిషిని చంపాలంటే, ఇంకో మతపు గుంపు రావాల్సిందే. మానవత్వమే లేని, ద్వేషపు దినాలవి. తెల్లారితే, ఎక్కడో ఒక చోట, తెలిసిన చాయ్ అమ్మే కుర్రాడి శవమో, పాల వాడి శవమో, బాట మీద పడుండేది. నగరాలూ, గ్రామాలూ ఒకేలా విద్వేషించుకున్నాయి. వీటన్నిటి గురించి, ఆనాటి రచయితలు బాగానే రాసుకొచ్చారు. వీళ్ళలో మంటో ఈ ఘోరాలకు, ప్రత్యక్ష సాక్షి గా ఎన్నెన్నో కథలు రాసాడు. విభజన ని మొదట తీవ్రంగా వ్యతిరేకించిన వాడు. ఆ తరవాత విభజన ఘొరాల్ని ప్రత్యక్షంగా చూడడం వల్ల, ఇటు భారత దేశం లోనూ, పాకిస్తాన్ కు వలస వెళ్ళాక, అక్కడ కూడా తాను ఎదుర్కొన్న విద్వేషం గురించి, విభజన మిగిల్చిన నెత్తుటి మరకల గురించి విస్తారంగా రాసాడు.
అమృతా ప్రీతం, గుల్జార్, కుష్వంత్ సింగ్, ఫైజ్ మహమ్మద్, మహమ్మద్ ఇక్బాల్, సల్మాన్ రష్దీ, సాహిర్ లూధ్యాన్వీ, ఇస్మత్ చుగ్తాయ్ వగైరా ప్రఖ్యాత రచయితల సాహిత్యంలో ఈ విషాదాల కథలు చదివాము. వీరిలో ముఖ్యంగా సాదత్ హసన్ మంటో కథలు, విభజన ఘోరాల్ని కళ్ళకు కట్టినట్టు వివరించడంతో పాటూ, అతను పట్టు బట్టి మరీ ఇదే విభాగం మీద తాను చూసినవీ, అనుభవించినవీ, తిరుగాడిన ప్రాంతాల గురించీ చాలా మటుకూ నిజానికి దగ్గరగా కథలు చెప్పడంతో, విభజన సాహిత్యం లో అతని పేరు ప్రత్యేకం. ముఖ్యంగా అతని కథలు జడ్జ్మెంట్ కు దూరంగా, నిర్లిప్తంగా, జరిగినది జరిగినట్టుగా చెప్పడం వల్ల, పాఠకుడే కథ చదివి నిర్ణయించుకోవాల్సిన రీతిలో ఉండడం వల్లనా, చిన్న చిన్న కథలు కోకొల్లలుగా రాయడం వల్లనా, మంటోది, అన్ని వర్గాలవారికీ అందుబాటు లోనూ ఉన్నతనం.
మంటో భారత దేశాన్నుండీ, పాకిస్తాన్ కు వలస వెళ్ళిన వేలాది లక్షలాది కాందిశీకుల్లో ఒకడు. స్వతంత్రం ప్రకటించే ముందూ, తరవాతా తను బాంబే లో చూసిన మత కల్లోలాలనీ, విభజన సమయాన సరిహద్దులు దాటుతున్నప్పుడు చూసిన ఘోరాల్నీ, ఆయన రాసుకొచ్చాడు. సాధారణ జీవితాన పెద్ద కుదుపు, దేశాల చరిత్రను మారుస్తున్నపుడు, సామాన్యుడి గొంతై, సాదత్ హసన్ మంటో నిలబడ్డాడు. ముఖ్యంగా ఆనాటి కలి ని, విద్వేషాన్నీ, చనిపోయిన వారి తరపున గొంతై వినిపించాడు. అతని జీవితాన స్త్రీ ల బాధల్ని గురించి రాసి తెచ్చుకున్న "చెడ్డ!!" పేరొక ఎత్తు, విభజన అకృత్యాల డాక్యుమెంటింగ్ ఒక ఎత్తు. వేశ్యల వ్యధలు రాసినందుకు ఆయన అశ్లీల రచయిత అని తన దేశపు చాందస సమాజం పేరిచ్చేసింది. ఆయన రాసిన విభజన సాహిత్యం వైపు మాత్రం వేలెత్తి చూపలేకపోయింది.
ఇంటర్ నెట్ విస్తృతంగా అందుబాటులోకి వచ్చాక, భారత దేశం లోనూ, పాకిస్తానీ సినిమా, టెలివిజన్, వార్తలూ, ఇంటింటికీ అందుబాటులోకొచ్చాయి. ఇంతకు ముందు కేవలం ఇటునుంచటే గాలి వీచేది. కేవలం బాలీవుడ్ సినిమాలు, బాంబే నుండీ, డిల్లీ నుండీ జరిగే టెలివిజన్ ప్రసారాల్ని పాకిస్తానీలు చూడటం, జరిగేది. పాకిస్తాన్ మీద కోపం వచ్చినప్పుడు భారత దేశం అటు సిగ్నళ్ళని ఓ పది రోజుల పాటూ నిలిపేసేది. ఇప్పుడు పాకిస్తాన్ మన ముంగిట్లోకొచ్చింది. కేవలం గాయకులే కాకుండా ఇతర ప్రఖ్యాత పాకిస్తానీ రచయితలు, నటీ నటులూ మనల్ని రంజింపజేయడం మొదలు పెట్టారు.
మన దేశం లోనూ ఈ తరం వాళ్ళు మారినట్టే ఉంది. కర్నాటక సంగీతం నేర్చుకునే ఓ శుద్ధ కన్నడ బ్రాహ్మణమ్మాయి, 'కోక్ స్టూడియో పాకిస్తాన్' లో సూఫీ సంగీతాన్ని వింటుంది. పాకిస్తాన్, ఇండియా క్రికెట్ మేచ్ జరుగుతూ, పాకిస్తాన్ గెలుస్తున్నపుడు, స్టేడియం లోనే ఉన్న పాకిస్తాన్ ఆటగాడి కుమార్తె, భారతీయ జెండాను ఊపుతుంటుంది. [ఇది మన దేశంలోని మార్పే అని, "వాళ్ళు" మనని ఇంకా ద్వేషిస్తున్నారనీ, కొందరు ఇంకా చెప్తుంటారు.] ఇరుదేశాల వారూ, డైలీ సీరియళ్ళు చూసుకుంటారు. 'జిందగీ గుల్జార్ హై' సీరియల్ ను తెలుగులో కాపీ కొట్టి, సీరియల్ తీసేసారు. మనం అంతా ఒకేలాంటి వాళ్ళం అని తెలుసుకుంటున్నాం. ఇలా జరగడానికి కారణం, కమ్యూనికేషన్ అని అనిపిస్తుంది. 'మనం ఒకర్నొకరం ఇలా చంపుకుని శవాల మీద నడిచొచ్చి కదా ఇలా ఉన్నాము' అని మన రెండు దేశాలూ కమ్యూనికేట్ చేసుకోవడానికి ఈ విభజన సాహిత్యం ఉపయోగపడాలి. మరింత విద్వేషం రగిలించడానికి కాదు.
విచిత్రంగా మంటో ని "పాకిస్తానీ" అని ఎవరూ మన దేశాన అనుకున్నట్టు లేదు. ఆయన తన భారతీయతను ఎప్పుడూ వొదులుకోనూ లేదు. అయినా రెండు దేశాల్లోనూ, ముఖ్యంగా ఇప్పటి యువత మరీ ప్రధానంగా మారుతున్న రోజులకి ఆయన రచనల పరామర్శనీ, ఇప్పటికీ మారని మానవ స్వభావం గురిచీ తరచి చూసుకునేందుకు, మంటో ను చదువుతూనే ఉంది. ఆయన గురించి ఆంగ్ల సాహిత్యం లో విస్తారమైన అనువాదాలు, సంకలనాల నివాళులతో బోల్డంత సమాచారం అందుబాటులో ఉంది. కానీ తెలుగులో, కొందరు అనువాదకుల వల్ల మంటో గురించి, సత్యవతి గారి దయన ఇస్మత్ చుగ్తాయి గురించి కూడా చదవగలుగుతున్నాము. 'ఎలమి' స్థాపించిన ప్రముఖ కొత్త తరం రచయిత పూర్ణిమ తమ్మిరెడ్డి, మంటో కథల్ని విస్తారంగా అనువాదం చేస్తూ, తెలుగులో మంటో పేర్న ఒక సమగ్ర వెబ్సైట్ కూడా నడుపుతున్నారు.
ఎలమి ప్రచురణ సంస్థ, పుడుతూనే మంటో రచించిన 'సిహా హాషియే' ను తెలుగు లోకి తీసుకొచ్చింది. సాధారణంగా అంతర్జాలంలో ఎక్కడో ఓ పత్రికలోనో, వెబ్ సైట్ లోనో ప్రచురితమయిపోయిన కథలే ఈ మధ్య సంకలనాలుగా వస్తున్నాయి. కానీ ఇది పూర్తిగా కొత్త అనుభవం.
"సియా హాషియే" ఒక ప్రత్యేకమైన పుస్తకం. దీనిలో రెండు మూడు లైన్ల కథ కూడా ఒక కథ ని చెప్తుంది. కేషువల్ / మామూలు సంభాషణల తో కూడా ఓ చిట్టి కథ, మనసును బెంబేలెత్తించగలదు. "సియా హాషియే" అంటే నల్ల మార్జిన్ / అంచు / బోర్డర్. పూర్వపు రోజుల్లో చావు, ట్రాజిక్ వార్తల్ని ప్రచురించేందుకు వార్తా కథనం చుట్టూ నల్ల బోర్డర్ ని వాడేవారు. ఆ నల్ల బోర్డరు వార్త ఏమి చెప్తుందో పాఠకుడు ముందే ఊహించగలిగేందుకు.
ఈ పుస్తకాన్ని రచయిత (మంటో) అంకితం ఇచ్చింది కూడా, అల్లర్లు జరుగుతున్నపుడు వొళ్ళు తెలీక, ఒక ముసలమ్మని క్షణికావేశంలో హత్య చేసి, విచారిస్తున్న ఓ మనిషి కే. ఈ పుస్తకం, విభజన నేపథ్యం, అల్లర్ల చిత్రణ, వాటి వెనక వున్న మానవ నైజం, ఆయా సమయాల్లో, పెనుగాలికి కొట్టుకెళిపోయే ఎండుటాకుల వలె, మనసు మత్తెక్కి మనిషి చేసే వింత ఘోరాల గురించి, తెలుగు పాఠకుడికి పూర్తి అవగాహన కల్పిస్తూ, ఒక గైడ్ లాగా పరిచయం చేస్తుంది. "అలా ఎలా చేస్తారండీ?" అని అడిగిన పాఠకుడికి అసలు ఎందుకు అలా జరిగిందో చెప్తూ ఈ కథల్నూ, విభజన వ్యాసాల్నీ, ఈ పుస్తకానికున్న అనుబంధాన్నీ చక్కగా, శ్రద్ధగా అనువాదం చేసారు. ఈ పుస్తకాన్ని చదివేసాక, మామూలుగానే మర్చిపోతామా ?
రాడ్ క్లిఫ్ లైనుకు ఇరు వైపులా, విభజన నెత్తుటి గాయాల గురించి అసంఖ్యాకమైన కథలు వచ్చాయి. మర్చిపోలేని సాహిత్యమూ వచ్చింది. వందలాది సినిమాలు తీసారు. నవలలు రాసారు. ప్రతి మనిషీ తన కథ ని చెప్పుకున్నాడు. పాకిస్తానీ విభజన సినిమాల్లో భారతీయ నటులు నటించారు. ఇండియా తీసిన సినిమాల్లో లో పాకిస్తానీలూ నటించారు. ఇప్పటికీ మన దేశ రక్షణ / రెవెన్యూ శాఖ అయితే, మన దేశాన్నుండీ కాందిశీకులు గా పాకిస్తాన్ వెళుతూ, ఇక్కడ వదిలి వెళ్ళిన ఇళ్ళను లిస్ట్ చేసి 'ఎనిమీ ప్రాపర్టీ ' గా పరిగణిస్తుంది. ఎవరు ఎవరికి శత్రువో తెలీదు. వాట్నిని చివరికి ఏమి చెయ్యాలో ఇప్పటికీ ఏమీ తేలలేదు. బహుశా వేలం వేసి అమ్మవచ్చు.
ఈ సమయాన, ఎలమి విభజన సాహిత్యాన్ని ఎంచుకుని తెలుగులో ప్రచురించడం, చాలా ఆనందకరం. అదీ, చక్కగా సబ్జెక్టుని తెలీని వాళ్ళకి పరిచయం చేస్తూ ! [వాళ్ళకే తెలుస్తుందిలే ! అని అనుకోకుండా] ఇది నాకు చాలా నచ్చింది. ఉదాహరణకు, విభజన, అల్లర్లు, స్థల/దేశ మార్పు, మారిన రాజకీయ వాతావరణం, మనుషుల్ని తరాల పాటు ఎలా మానసికంగా, ఆర్ధికంగా, శారీరకంగా ప్రభావితం చేస్తాయో, సగటు పాఠకుడికి వివరించే ప్రయత్నం చేసారు. తోబా టేక్ సింగ్, ఖోలో వంటి కథలు ఈ మానసిక గాయాల ముద్ర ని చాలా గట్టిగా వివరించే ప్రయత్నం చేస్తాయి.
మంటోనే కాకుండా ఇంకా చాలా సాహిత్యాన్ని, ముఖ్యంగా దేశ విభజన నేపథ్యపు సాహిత్యాన్ని వాళ్ళు తెలుగులోకి తేబోతున్నారని తెలుస్తూంది. ఈ కొత్త కోణం లోకి తెలుగు వాళ్ళు తొంగి చూడటం చాలా తక్కువ. రష్యన్, ఇంగ్లిష్, చైనీస్, జాపనీస్ అంటూ ప్రపంచసాహిత్యాన్ని విస్తారంగా అనువాదాల్లో చదువుతారు గానీ, ఎందుకనో విభజన సాహిత్యం అంత గా ఏ విపుల లాంటి పత్రికల్లో తప్ప ఎక్కడా కనబడలేదు నాకు. ఈ సబ్జక్టు తెలుగు లోకి ఎక్కువగా అనువదింపబడకపోవడానికి కారణాలేంటో నాకు తోచలేదు. విభజన / మత కల్లోలాల నేపధ్యం లో వచ్చిన రెండు మంటో కథల్ని పరిచయం లాగా, గుల్జార్ కథ నొక దాన్నీ, ఒక రస్కిన్ బాండ్ రచనని నేనూ సరదాగా అనువదించాను. అయితే, అవి అన్నీ ఎక్కడో ఇంగ్లీషు లో చదివినవే.
ఈ పుస్తకాన్ని ఉర్దూ లోంచీ తెలుగులోకి అనువదించడం ప్రత్యేకం. పూర్ణిమ బహుముఖ ప్రజ్ఞాశాలి. ఆమె పట్టు బట్టి హిందూస్తానీ నేర్చుకుని, డైరెక్ట్ గా ఉర్దూ నుండే తెలుగులోకి ఈ పుస్తకాన్ని అనువదించారు. కాబట్టి, దీనిలో సొగసు తగ్గని భాష, భావం చెడని పదాలు, కృత్రిమత్వం లేని భావాలూ ఉన్నాయి. అలా అని అస్తవ్యస్తమైన తెలుగు కాకుండా, మంచి భాష లో, 'సమాచారాన్ని' ఇస్తున్నంత స్పష్టంగా అనువదించారు. ఎక్కడికక్కడ ఫుట్ నోట్స్, పాఠకుడు ఎటువంటి అయోమయానికీ గురికాకుండా ఆదుకుంటాయి. ఈ పుస్తకం తేవడానికి ఎలమి బృందం చాలా కష్టపడి వుండి ఉంటుంది. అచ్చు తప్పులు లేవు. పాఠకుణ్ణి దృష్టిలో పెట్టుకుని, గౌరవిస్తూ - ఎన్ని వేలసార్లు తప్పులు సవరిస్తూ ఎడిట్ చేసి ఉంటారో, మీ ఓర్పుకూ, ప్రొఫెషనలిజానికీ, మీరందరికీ అభినందనలు.
ఎలమి వారి హామీ అయితే, "పాఠకులుగా మమ్మల్ని కదిలించని సాహిత్యాన్ని మీకు అందించం" అనే. అదే నిజమైతే, వాళ్ళే అన్నట్టు 'మీ కష్టార్జితాన్ని అగౌరవపరచం" అంటూ చాలా కొత్త ప్రామిస్ లు చేసినందుకు గాను, వాళ్ళు ప్రచురించబోయే కొత్త పుస్తకాల పట్ల కుతూహలమైతే ఉంది. కానీ వివిధ వృత్తి ఉద్యోగ నిపుణులు పూనుకుని నడుపునందుకు, అంత త్వర త్వరగా పుస్తకాల్ని ప్రచురించరనే అనుకుంటున్నాను. క్వాలిటీ కి అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నారు కాబట్టి క్వాంటిటీ / నెంబర్లు వాళ్ళకు పెద్ద విషయం కాకూడదని కోరుకుంటున్నాను.
మూస ప్రచురణ / ప్రచార పద్ధతుల్నీ ఎంచుకోకపోవడం, టెక్నాలజీ ని వాడుకుంటూ, గూగుల్ ఫారాల ద్వారానూ, క్యూ ఆర్ కోడ్ స్కానింగ్ ల ద్వారానూ, రెండు వైపులా కమ్యూనికేట్ చేయగలిగే సౌకర్యాన్ని కల్పించడం, సరైన ట్రేడ్ ప్రాక్టీసులు, టేక్స్ వివరాలతో సహా, పక్కా ఇన్వాయిస్ ను ను అందివ్వడం, కొరియర్ చేసేందుకు ఇండియా పోస్ట్ ను ఎంచుకోవడం, నాకు చాలా నచ్చింది. పైగా అమ్మిన దాదాపు అన్ని కాపీల మీదా ఒక పెర్సనల్ నోట్ ని అతికించారు. పుస్తకం 'ఇలా వుండాలీ, ఇలా అమ్మాలీ' అనుకునే వారికి, వీరి పద్ధతి చాలా నచ్చుతుంది.
విభజన సాహిత్యం తెలుగులోకి మరింతగా తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నందుకు ఎలమి కి అభినందనలు, ధన్యవాదాలూనూ. అకారణ యుద్ధాలు, ద్వేషాలు, విషాలు చిమ్మటాలూ ఎక్కువయినప్పుడు, మతం గురించో, కులం గురించో చంపేసుకోవడం సాధారణమవుతున్నప్పుడు, ఈ ప్రాణం గాయపడిన కథ ఒక్కటి గుర్తొస్తే కాస్త విద్వేషమయినా తగ్గి, మనుషులకి, మానవత్వపు విలువ తెలిస్తే చాలు. అపుడే ఈ సాహిత్యానికి ప్రయోజనం చేకూరినట్టు.
Notes :
(1) From my blog :-
ఆసక్తి ఉన్నవాళ్ళకు నేను పరిచయం చేసిన మంటో కథలు Siraj, Mozelle
రస్కిన్ బాండ్ రచన : The playing fields of Shimla
(2 ) అగ్నిధార వివరాలు:
మచ్చుకి ఓ పేరగ్రాఫ్ : అప్పటి భారత దేశపు కేన్వాసులో ముస్లిముల పట్ల మత వివక్ష పాత్ర గురించి |
(3) సియా హాషియే వివరాలు :
* * *
Interesting.
ReplyDelete