Pages

29/05/2022

విభజన - Gulzar

1984-85 ప్రాంతాలలో ఇక్బాల్ సింగ్ అనే పేరున్న సజ్జనుడు నాకు తరచూ లేఖలు రాస్తూండేవాడు. ఆయన ఒక ప్రొఫెసర్. ఆయన లేఖల్లో, నేను దేశ విభజన సమయం లో తప్పిపోయిన ఆయన సొంత సోదరుణ్ణని చాలా దృఢంగా నమ్మకం వ్యక్తపరచేవాడు. కొన్ని ఇదే తరహా లేఖలు అందుకున్న తరవాత నేను ఒకసారి ఆయనకు ఒక దీర్ఘమైన ప్రత్తుత్తరం రాసాను. దానిలో నేను దిల్లీ లో నా తల్లితండ్రులతో పాటూ కలిసి జీవించేవాడినని, దేశాన్ని విడగొట్టిన మత కల్లోలాలలో ఎన్నడూ నా సొంత వారినుంచి తప్పిపోనట్టు, నా సోదరీసోదరులనైతే ఎప్పుడూ కోల్పోలేదనీ, వివరంగా రాసాను. 

ఇదంతా జరిగినప్పటికీ, ఇక్బాల్ సింగ్ నా మాటలు నమ్మినట్టు లేదు. నేనే అతని తప్పిపోయిన సోదరుడిగా భావించి లేఖలు రాస్తూనే ఉన్నాడాయన. ఇక ఆయన ని ఒప్పించలేక, నొప్పించకుండా ఉండేందుకూనూ, నేనూ ప్రత్యుత్తరాలు రాయడం పూర్తిగా నిలిపేసాను. ఒక సంవత్సరం గడిచాకా, సినిమాలు తీసే సాయీ పరాంజపే, దిల్లీలో ఉండే హర్బజన్ సింగ్ అనే పెద్దమనిషి నన్ను కలవాలనుకుంటున్నట్టు, నాకో సందేశం పంపారు. 

 దాని గురించి ఆలోచించేలోపే, నెల కల్లా మాజీ ఆర్ధిక మంత్రి భార్య శ్రీమతి దండావతే నుండీ నాకు ఫోన్ కూడా వచ్చింది. పంజాబ్ ప్రభుత్వంలో సివిల్ సప్లైస్ మంత్రి గా పని చేస్తూ, ప్రస్తుతం దిల్లీ లో ఉన్న శ్రీ హర్భజన్ సింఘ్ విభజన సమయంలో తప్పిపోయిన ఆయన కుమారుడిని, బహుశా నేనే నని భావిస్తున్నారనీ, అందుకే ఓ మారు నన్ను కలవాలనుకుంటున్నారనీ, ఆమె తెలిపారు. నేను దిల్లీ వచ్చి ఆయనను కలుసుకుంటానని శ్రీమతి దండావతే కు చెప్పాను. 

 ఆ తరవాత జనవరి లో దిల్లీ వెళ్ళాను. అదే నేను హర్భజన్ సింగ్ గారినీ, నా ఉత్తరాల సోదరుడు ఇక్బాల్ సింగ్ నూ, వారి కుటుంబ సభ్యులనూ వారి ఇంట కలవవడం. హర్భజన్ సింఘ్ గారు నన్నెంతో ఆపేక్షగా కలిసారు. ఒక వృద్ధురాలిని ని పరిచయం చేస్తూ.. ఆయన "ఈమె నీ తల్లి" అని, తరవాత, జరిగిన కథని చెప్పడం మొదలు పెట్టారు. 

 "అప్పుడు భయంకరమైన కల్లోలాలు జరిగాయి. ఎటు చూసినా అగ్నికీలలు, దహనమైపోయిన జీవితాలూ, భవనాలూ, ప్రాణాలూ.. ఈ మసి పట్టిన గాలుల్లో తేలి మా చెవులకు ఏవో పుకార్లు చేరేవి. మా పని ఇప్పుడో అప్పుడో అనేటట్టుండేది. అప్పటికింకా మేము దేశాన్ని విడిచేద్దామని అనుకోలేదు. మా నాన్న స్నేహితుడైన జమీందారు అఫ్జల్ చాచా మమ్మల్ని కళ్ళలో పెట్టుకుని కాపాడేవారు. మా కుటుంబానికి ఆయన అండ ఉందని పట్టణానికంతా తెలుసు. ఆయన మీద గౌరవం కొద్దీ వేళ కాని వేళ మా ఇంటి తలుపుతట్టేందుకు కూడా ఎవరూ సాహసించలేదు. 

జమీందారు గారి కుమారుడు 'ఆయాజ్' నాతోనే స్కూల్ లో చదువుకునేవాడు. అయినా మా ప్రాంతం మీదుగా ఉన్న ఖాళీ నేలల్లో, మిడతల దండు లా స్వదేశం లోనే కాందిశీకులైన హిందువుల ప్రవాహం వెళ్తున్నపుడల్లా, మా గుండెలు దడదడాలాడేవి. ప్రతీ ఊరిలోనూ హత్యలూ, మానభంగాలూ, లూటీలూ అడ్డూ అదుపూ లేకుండా జరిగేవి.  ప్రతీ రోజూ జమీందారు గారు వచ్చి మమ్మల్ని ఊరడించేవారు. భయపడవద్దని, తనని నమ్మమని ప్రార్ధించేవారు. నా భార్యని తన కుమార్తె లా భావించేవారు ఆయన. మా పెద్ద కుమారుడు 'ఇక్బాల్' కి ఆయనే పేరు పెట్టారు. 

ఒకరోజు మా పట్టణం ముందు నుండీ భారతదేశానికి పారిపోతున్న ప్రజల ప్రవాహం సాగింది. తీవ్ర గాయాలతో బాధపడే వారి కేకలూ, ఆత్మీయుల్ని కోల్పోయిన వారి రోదనలూ, నిట్టూర్పులూ, మా పూర్తి పట్టణాన్ని ఎంత వ్యాకుల పరిచాయంటే, ఆ రాత్రంతా మిద్దెల పైనుండీ మీము ఆ జన ప్రవాహాన్ని చూస్తూనే గడిపాము.   అదో కాళరాత్రనీ, తెల్లవారితే పరిస్థితి ఎందుకో ప్రశాంతంగా ఉండదనీ అనిపించింది.  ఈ జనవాహిని ని చూస్తే మమ్మల్ని వేళ్ళతో సహా పెకలించి ఈ దేశాన్నించీ విసిరికొడుతున్నట్టు అనిపించింది. ఇదే చివరి రాత్రి అయినట్టూ, మా పట్టణంలో మాకు అట్టే రోజులు రక్షణ ఉండదనీ, ఏదో ఉపద్రవం రానున్నట్టూ అనిపించింది. మా ముందు నుంచీ వెళిపోతున్న జన వాహిని అదే చివరిదేమో అన్నంతగా భయపడి, జమీందారుకి చెప్పకుండా, దొంగల్లా, ఆయనకు ఎల్లకాలమూ శ్రమ ఇవ్వడం ఇష్టం లేక, ప్రాణ రక్షణ కోసం, కుటుంబంతో సహా బ్రతుకుజీవుడా అని కల్లోల మనసులతో ఊరు నుండీ బయటపడ్డాము. 

మా మనసుల్ని కలత లేకుండా తేటగా ఉంచుకునేందుకు విపరీతమైన వ్యర్ధ ప్రయత్నాలు చేసాము. నిజానికి మేము పరిస్థితులకు పూర్తిగా బెంబేలెత్తిపోయి ఉన్నాము. మియావలీ నుండీ జమ్మూ చేరిపోగలిగితే, అక్కడి నుండీ సాయుధ రక్షణ తో మేము భారత దేశానికి వెళ్ళగలమని విన్నాము. వెంటనే ఎవరికీ అనుమానం రాకుండా మా ఇళ్ళ తలుపులు తెరిచే ఉంచి వచ్చేసాము. కట్టు బట్టలతో, పుట్టిన ఊరినీ, గిట్టాల్సిన మట్టినీ విడిచిపెట్టి, ఇద్దరు పెద్ద కొడుకులు, ఎనిమిదీ-తొమ్మిదేళ్ళున్న కూతురినీ, అంతకన్నా చిన్నవాడైన నిన్నూ పట్టుకుని, సుదీర్ఘ ప్రయాణాం మొదలు పెట్టాము. 

నిజానికి మియావలీ కి రెండు రోజుల నడక ప్రయాణమే. కానీ తీవ్ర ఉద్రిక పరిస్థితుల మధ్య ఆ ప్రయాణం ఎలా సాగిందో వర్ణించలేను. మియావలీ కి చేరేసరికీ మా సమూహపు జనాభా విపరీతంగా పెరిగిపోయింది. ఎక్కడెక్కడినుంచో జనం మాలాగే ప్రాణాలరచేతిలో పెట్టుకుని ప్రయాణించి వస్తున్నారు. మేము మియావలీ కి అర్ధరాత్రి చేరగలిగాము. ప్రయాణం మధ్యలో ఎన్నో సార్లు తీవ్రంగా తొక్కిడి జరిగింది. ఏ తొక్కిసలాట సమయంలో మా చేతులు మీ చిన్ని చేతుల్ని వదిలేసాయో తెలీదు. మీ పేరులు ఎన్ని సారులు గట్టిగా అరుస్తూ గుంపంతా వెతికామో గుర్తులేదు. అక్కడ తొక్కిసలాట జరుగుతూనే ఉండేది. తప్పిపోయిన పిల్లని వదిలి, ఉన్న వాళ్ళనీ, పెద్దవాళ్ళనీ, కాపాడుకుంటూ ఎలాగో దేశం చేరాము. దారంతా ఏదో ఒక చోట మామీద దాడి జరుగుతుందేమో అనే భయం పీక్కు తినేసేది. దానికి తోడు పుకార్లు. ఆ రాత్రి మియావలీ లో అలసి సొమ్మసిల్లిన ఆ జనంలో నేను విన్న భయంకరమైన భయాన్ని, భయానకమైన నిశ్శబ్దాన్నీ ఎన్నడూ వినలేదు." 

దార్ జీ.. [తాతగారు] గా పిలవబడే హర్భజన్ సింగ్ గారు అప్పటి దాకా చెప్పినది ఆపి హఠాత్తుగా మూగబోయారు. అప్పటివరకూ 'తల్లి గారు', నన్ను నిర్లిప్తమైన భావనతో కన్నార్పకుండా చూస్తూనే ఉన్నారు.  అప్పుడప్పుడు అస్పష్టంగా ఏదో అనడం తప్ప,  ఆవిడ మొహంలో ఎటువంటి ఎమోషన్ లేదు. కాసేపటికి తాతగారే గొంతు పెగుల్చుకుని.. "ఆ రాత్రి, ఆ ప్రయాణంలో మా ఇద్దరు పిల్లల్నీ ఎలా పోగొట్టుకున్నామో మాకు తెలియనే లేదు.." అన్నారు. 

మరికాస్త గుండె పట్టేసే నిశ్శబ్దం తరవాత. ఆయన మళ్ళీ చెప్పడం మొదలు పెట్టారు. "జమ్మూ చేరాక, వెనక వారితో కలిసి పిల్లలు వస్తారేమో అని ఎంతో ఎదురు చూసాము. ప్రతీ కాంపు కూ వెళ్ళి మా పిల్లలు కనిపిస్తారేమో అని అని వెతుక్కునే వాళ్ళం. అక్కడ అసంఖ్యాక జన సందోహం. వాటిల్లో కొన్ని జన సమూహాలు పంజాబ్ వైపు మళ్ళాయి. కొందరు ఎక్కడ వారి చుట్టాలుంటే ఆయా ప్రాంతాలకు వెళ్ళారు. పిల్లలు దొరుకుతారన్న ఆశలన్నీ అడియాసలయ్యాక, మేమూ పంజాబ్ వెళ్ళాము. అక్కడా అన్ని కేంపుల్లోనూ వెతికాము. మా పిల్లలు దొరకలేదు. మా ఆశలు గట్టెక్కాయి. 

ఇరవయ్యేళ్ళయ్యాక, భారత దేశం నుండీ ఒక గుంపు పాకిస్తాన్ లో 'పంజా సాహిబ్' కు తీర్ధయాత్రకు వెళ్ళారు. అప్పటికి వెనక్కి తిరిగి వెళ్దామని ఎన్నో సార్లు అనుకున్నా, పూర్వపు భయానక స్మృతులతో వెళ్ళేందుకు సాహసించలేదు. పైగా (తన భార్య వైపు చూపిస్తూ) ఈమె ఆ భావనకే ఎన్నో ముక్కలయిపోయేది. జమీందారు ని మోసం చేసి, ఆయనని నమ్మకుండా ఆ పట్టణాన్ని వదిలి వచ్చేసినందుకు మా మీద మాకే అసహ్యమేసేది. 

ఎలాగో ఒకలా, వెళ్ళేందుకు మనసు కూడగట్టుకున్నాక, జమీందారు అఫ్జల్ చాచాకూ, అయాజ్ కూ కు ఓ లేఖ రాసాను. నేను చేసిన పనికి క్షమాపణలు చెప్పుకున్నాను. మా ప్రయాణాన్ని గురించీ, మా చిన్న పిల్లలిద్దరు, పాప సత్య, బాబు సంపూరన్ లు తప్పిపోవడం గురించీ ఆయనకు రాసాను. 

ఆ ఉత్తరం నేను రాసినా పోస్ట్ చెయ్యలేదు. నేనే పంజాసాహిబ్ కు ఓ ఇరవై నుండీ ఇరవయ్యయిదు రోజుల యాత్రకు వెళ్ళి, అక్కడినుంచే పోస్ట్ చేద్దామనీ అనుకున్నాను. ఆయనకి ఇష్టముంటే ఆయన రమ్మని తప్పకుండా ప్రత్యుత్తరం ఇస్తారు. అప్పుడే ఆయన్ని స్వయంగా కలుసుకుని ఈ విషయాలు చెప్దామనుకున్నా. ఆయన్ని చెప్పా పెట్టకుండా వెళ్ళి ఇబ్బంది పెట్టి, పాత బాధాకరమైన జ్ఞాపకాల్ని తవ్విపోయడం మంచిది కాదని భావించాను." 

హర్భజన్ సింగ్ గారు పెద్ద నిట్టూర్పు విడిచారు. "ఈ ఉత్తరం నా జేబులోనే ఉండిపోయింది. తిరుగు ప్రయాణంలో మేము కరాచీ తిరిగొచ్చాకా, ఆరోజు మేము ఇక బయలుదేరతామనగా ఆ ఉత్తరాన్ని ఎలాగో ధైర్యం చేసి పోస్ట్ చేసాను. ఎనిమిదేళ్ళ తరవాత ఆ ఉత్తరానికి జవాబొచ్చింది. 

అఫ్జల్ చాచా, దేశ విభజన జరిగిన కొన్నేళ్ళకు మరణించారు. జమీందారీ బరువు బాధ్యతలు అయాజ్ భుజాల మీద పడ్డాయి. కొన్ని రోజుల క్రితమే, అయాజ్ కూడా మరణించాడు. అతని తదనంతరం అతని ఒక షర్ట్ జేబులో ఈ ఉత్తరం దొరికింది. అయాజ్ సంతాప సభలో ఈ ఉత్తరాన్ని బిగ్గరగా చదివినపుడు, ఆ ఉత్తరంలో చెప్పిన 'సత్య ని పోలిన కథ ఉన్న అమ్మాయి, మియావలీ నుండీ అయాజ్ మరణానికి తన సంతాపం తెలిపేందుకు వచ్చింది' అని ఎవరో అన్నారు. ఆ అమ్మాయిని పిలిపించి విచారిస్తే, ఆమే సత్య అని తేలింది. ఆ అమ్మాయి విభజన సమయంలో తలితండ్రులనుండి తప్పిపోయింది. ఇప్పుడు ఆమె పేరు దిల్షాద్!

తల్లి గారి కళ్ళు ఎండిపోయి గాజు కళ్ళలానే ఉన్నాయి. కానీ తాతగారి గొంతులో కన్నీళ్ళ ప్రవాహపు చప్పుడు మెత్తగా ధ్వనిస్తూనే ఉంది. "ఆ ఉత్తరం వచ్చాక మేము, అఫ్జల్ చాచా ఇంటికి వెళ్ళి దిల్షాద్ ను కలిసాము, ఆమెకు అంతా గుర్తుంది. "నేను నడిచీ నడిచీ అలసిపోయి, నిద్ర కమ్ముకుని రావడంతో దారిలో ఒక ఖాళీ ఇంటి బయట పొయ్యి వెనక పడి నిద్రపోయాను. తెలివి వచ్చి చూసాక, మీరెవరూ కనబడలేదు. ఆ రోజంతా మిమ్మల్ని వెతికి రాత్రయాక అదే ప్రదేశానికొచ్చి నిద్రపోయాను. మూడు రోజులలా గడిచాక, ఆ ఇంటి వారుతిరిగొచ్చి, నన్ను   అక్కడ చూసి  నిద్ర    లేపారు. మీరెవరయినా వెతుక్కుంటూ వస్తారేమో అని నన్ను వారి ఇంట్లోనే ఉంచి తిండీ బట్టా ఇచ్చి ఉంచుకున్నారు. నాకిపుడు పెళ్ళయింది. ఇద్దరు కొడుకులు. వారిలో ఒకడు పాకిస్తాన్ ఏర్ ఫోర్స్ లో , రెండోవాడు కరాచీలో ఉద్యోగం చేస్తున్నారు" అని  చెప్పింది. 

మిమ్మల్ని కలిసి ఆమె ఆశ్చర్యపోయిందా ? ఏడ్చిందా ?" అడిగాను నేను. 

"లేదు. ఆమె కు ఎటువంటి ఆశ్చర్యం లేదా సంతోషం కలిగినట్టు లేదు."  తాతగారు ఒక నిముషం ఆగి సాలోచనగా అన్నారు.  "నిజానికి ఇప్పుడు నేను తలచుకుంటుంటే గుర్తొస్తూంది. మేము ఆమెతో మాటాడినంత సేపూ ఆమె చిన్నగా నవ్వుతూనే ఉంది.  ఏదో కథ వింటున్నట్టు మా మాటలన్నీ వినింది. మేము తన అమ్మ నాన్నలమని ఆమెకు అనిపించిందని నేననుకోను." 

"మరి సంపూరన్ ? అతను ఆమెతో లేడా ?" 

"లేదు. ఆమెకు అతను కనీసం గుర్తు కూడా లేడు!" 

ఆ తరవాత తల్లిగారు తను ఇంతకుముందు రెండు సారులు అన్న ముక్కే మళ్ళీ జపించారు. "పున్నీ.. నువ్వు మమ్మల్ని నమ్మట్లేదెందుకు బాబూ ? నీకు గుల్జార్ అనే పేరు ఎవరు ఇచ్చారు ? నీ పేరు సంపూరన్ సింగ్." 

నేను తాతగారిని అడిగాను "నా గురించి మీకెవరు చెప్పారు ? నేనే మీ కొడుకుని అని మీరెలా అనుకుంటున్నారు ?" 

"ఇటు చూడు బాబూ.  మేము మా అమ్మాయిని ముప్ఫయీ, ముప్ఫయిదేళ్ళ తరవాత కలవగలిగినప్పుడు, మా అబ్బాయిని కూడా తప్పక కలుసుకోగలమనే ఆశ మళ్ళీ పుట్టుకొచ్చింది. ఇక్బాల్ అప్పుడే ఎక్కడో పత్రికలో నీ ఇంటర్వ్యూ చదివాడు. దానిలో నీ పేరు సంపూరన్ అనీ, నీవు పాకిస్తాన్ లో పుట్టాననీ చెప్పావు నువ్వు!" 

తల్లి గారు మళ్ళీ అంది. "కాకా.. నువ్వు నీకు ఇష్టమున్నచోట ఉండు. కానీ కనీసం నీవు మా కుమారుడు పున్నీవే అని ఒప్పుకో తండ్రీ!" 

నేను నాగురించి, నా కుటుంబం గురించి, పూర్తి వివరాలన్నిటినీ హర్భజన్ సింగ్ గారికి ఇచ్చి, ఆయన్ను నిస్పృహపరిచి, తిరిగి వచ్చేసాను. ఇది జరిగి ఏడెనిమిదేళ్ళయింది. ఇప్పుడు 1993 వ సంవత్సరం నడుస్తుంది. 

కొన్నేళ్ళ తరవాత నాకు ఇక్బాల్ సింగ్ గారి నుంచీ ఇంకో లేఖ వచ్చింది. దానిలో సర్దార్ హర్భజన్ సింగ్ గారు పరమపదించినట్టు తెలిపారు. తల్లి గారు, చిన్నవాడికి ఈ విషయం తెలియజేయమని అన్నారంట. అందుకే ఈ ఉత్తరం రాయటం!   

అది చదివాక, నాకు నిజంగా నా సొంత తాతగారినే కోల్పోయినట్టు అనిపించింది. 


 *** 



Gulzar - - అసలుపేరు సంపూరన్ సింగ్ కల్రా. గుల్జార్ గా సుప్రసిద్ధులు. 1934 లో జన్మించారు. కవి, గేయ రచయిత, స్క్రిప్ట్ రచయిత, కథకుడు, సినిమా దర్శకుడు. సాహిత్య ఎకాదమీ అవార్డ్, పద్మ భూషణ్, దాదాసాహెబ్ ఫాల్కే ఎవార్డ్,   2008 లో 'స్లం డాగ్ మిలీయనీర్' సినిమాలో జై హో పాట కై, రెహమాన్ తో సంయుక్తంగా ఆస్కార్ గెలుచుకున్నారు. ఇదే పాట కు 2010 లో గ్రామీ ఎవార్డ్ కూడా వచ్చింది. పలు జాతీయ, ఫిల్మ్ ఫేర్ ఎవార్డులను గెలుచుకున్నారు.

Disclaimer :  మా అమ్మాయి ఇంగ్లీష్ పాఠ్యపుస్తకం లో చదివి, చాలా ఇష్టపడి, ప్రాక్టీస్ కోసం , అనుమతులేవీ లేకుండా అనువదించిన రచన.   Suggestions/observations are welcome. 

No comments:

Post a Comment

వ్యాఖ్యానించినందుకు చాలా చాలా థాంక్స్.