ఓడి గెలిచిన మనిషి - ఒక స్కీజోఫ్రెనిక్ ఆత్మ కథ
ఈ పుస్తకాన్ని హైద్రబాద్ బుక్ ట్రస్ట్ ప్రచురించింది. మానసిక అనారోగ్యం నుంచీ కోలుకున్న ఒక వ్యక్తి, వ్యాధితో తన నిరంతర పోరాటం గురించి రాసిన పుస్తకం ఇది. రచయిత, మొదట "సూర్య" అనే 'కలంపేరు'తో రెండు పుస్తకాలు రాసి, ఆ వ్యాధి చుట్టూ ఉన్న స్టిగ్మా, సామాజిక అపోహ ల ని తొలగించడానికి, తన సొంత పేరుతో రాసిన మొదటి (మూడో) పుస్తకం ఇది. ఈ పుస్తకాన్ని రచయిత ఎంత బాగా రాసారో, అంతే ధీటుగా, ఎంత పెద్ద, నిజ గాధని, సరళంగా, దాని టోన్ ని చాలా సమర్ధవంతంగా వినిపించేలా ఎడిట్ చేసి, చాలా బాధ్యతగా, ఆదరంగా హైదరాబాదు బుక్ ట్రస్ట్ వారు ప్రచురించారు. ఈ పుస్తకం చదివి కొంచం అన్నా ప్రయోజనం పొందే బాధితుల / వారి కేర్ గివర్స్ మీద, మనందరి మీదా ఆదరం తో, ఇది రాయమని మల్లారెడ్డి గారిని ప్రోత్సహించి, ప్రచురించినందుకు HBT వాళ్ళకి నా కృతజ్ఞతలు. ఎడిటర్ డా.శోభా దేవి గారికి కూడా చాలా గుర్తింపు నిచ్చే పుస్తకం ఇది.
నాకు ఈ పుస్తకం ఎందుకు అంతగా నచ్చినంటే, తనకు చికిత్స చేసిన డాక్టర్ అంటే, రోగి కి ఉండే మానసిక అనుబంధం, గౌరవం, ఆ కనెక్షన్, నాకూ ఉన్నాయి. నేను ఇంకొద్ది రోజుల్లో పేరా ప్లీజియాకు గురవ్వబోతున్నంత పరిస్థితి లో ఉన్నప్పుడు, నన్నాదుకున్న సర్జన్ డా.విష్ణు ప్రసాద్, నన్ను ఎంతో కష్టం మీద మళ్ళీ రెండు కాళ్ళ మీదా నడిపించిన నా ఫిసియోథెరపిస్ట్ డా.వినోద్ మీదా, నాకున్న కృతజ్ఞతా భావం మర్చిపోలేనిది. వాళ్ళు ఇద్దరూ కేవలం వృత్తి పరంగా ట్రీట్ చేసిన వేలాది పేషెంట్లలో నేను ఎవరో. కానీ వాళ్ళు నా జీవితంలో నా పట్ల చూపించిన ఆదరణ మర్చిపోలేనిది.
అలా, తనకు కొత్త జీవితం ప్రసాదించిన మానసిక వైద్యుడి పట్లా, ఆయన తదనంతరం, సోదరుడిలా ఆదరిస్తూ వచ్చిన డా.ధర్మేంద్ర పట్లా, రచయిత మల్లారెడ్డి గారి కృతజ్ఞతా భావన మాటల్లో చెప్పలేనిది. ఈ పుస్తకం అసలు తెలుగు రాని తన డాక్టర్ తో తన భావాలు పంచుకునే సాధనంగా రాసిన ప్రయత్నమే. అతని మొదటి పుస్తకం "An Autobiography of a Mentally Challenged Man "(2011) ఆన్లైన్ లో అందుబాటులో ఉంది.
సున్నిత మనస్కుడైన ఒకమోతుబరి రైతు కొడుకు, ఎటువంటి హింసనూ చూసి తట్టుకోలేని సౌమ్యుడు మల్లారెడ్డి. కుటుంబ కలహాల వల్ల, చదువులో వెనకబడడం వల్లా, విపరీతమైన మానసిక ఒత్తిడి కి గురయ్యి, మానసిక వ్యాధి బారిన పడతారు. ఆయనకు కలిగిన కష్టం, మాటల్లో వర్ణించలేనిది. మానసిక అనారోగ్యం పట్ల అవగాహన లేని రోజుల్లో, కుటుంబ కక్షలూ, హత్యలూ సాధారణమైన రాయలసీమ ప్రాంతాల వ్యక్తి కావడాన, ఈయన అకారణ భయాలను స్నేహితులూ, బంధువులూ.. అసలు గుర్తించనే లేక పోవడం వల్ల, వ్యాధి ముదిరి, చదువు, కెరీర్ దిబ్బతింటాయి
అతని జీవితం లో వచ్చిన ఘోరాతి ఘోరమైన కుదుపులు, కష్టాలు, వర్ణనాతీతమైన బాధ, చాలా అదృష్టవశాత్తూ అతనికి దక్కిన వైద్యమూ.. ఇవన్నీ ఏ విజయగాధకూ తీసిపోవు. కాకులు తరచుగా కనిపిస్తుండడం, శరీరం బలహీనంగా ఉండడం, వ్యాయామం చేయాలనిపించడం, ఆలోచనలు, ఎడతెరిపి లేకుండా, తట్టుకోలేనన్ని ఆలోచనలు, కాకులు తనకేదో చెప్తూన్నట్టు ఊహించుకోవడం, అవి చెప్పినట్టు తను చెయ్యడం, తన ఆలోచనలు ఇతరులు చదివేస్తున్నట్టు భయపడడం, వాటిని అణుచుకునేందుకు ప్రయత్నించడం, ఈ తీవ్ర సంఘర్షణ కారణంగా అలిసిపోవడం- ఇదీ అతని మొట్టమొదటి అనుభవం. మాటల్లో చెప్పలేని అనుభవం. ఇదీ అని చెప్పలేని ఆందోళన, వొత్తిడిని కలిగించే అనుభవం.
ఇలాంటి రిపీటెడ్ ఎపిసోడ్స్ ఒక చదువుకునే అబ్బాయిని ఎన్ని ఇబ్బందులకు గురి చేస్తాయి ? ఒత్తిడికి కారణాలు అనేకం. మల్లా రెడ్డి గారి తండ్రి ఒక నిరంకుశ మోతుబరి రైతు.
విద్య అందరికీ ఓ ప్రాధమిక హక్కు. కానీ ప్రభుత్వం ఉచితంగా నడిపే బళ్ళో కూడా గ్రామం లో అందరు పిల్లలు చదువుకోగలిగేవారు కాదు. బడి పంతులు స్కూల్ కి వచ్చిన పిల్లలకు బడికి రాని పిల్లల్ని బడికి తీసుకురావడం అనే బాధ్యత ఇచ్చేరోజులవి.
అలా బడికి రమ్మని తమ తండా లోని లంబాడా వారి పిల్లల్ను పిలుచుకు రావడానికి వెళ్ళిన మల్లారెడ్డి కి రియాలిటీ ఎలా ఎదురవుతుందంటే, "మా పిల్లలను బడికి పంపితే, మీ ఇంట్లో ఎనుములను ఎవరు చూస్తారు ? వాటి పేడ ఎత్తేది ఎవరు ? మాకెందుకు బాబూ చదువులు ? మీ నాయన దగ్గర నేను చేసిన అప్పు తీరేదాక, వీనిని మీ ఇంట్లో జీతానికి పెట్టకపోతే, మీ నాయన మమ్మల్ని బ్రతకనిస్తాడా ? ఎందుకొచ్చిన గొడవ ?" అన్న లంబాడా కూలి మల్లారెడ్డి మనసుని చివుక్కుమనిపిస్తాడు. అదొక షాక్ ఈ చిన్నబాబుకి.
అలాగే, అప్పు తీర్చని వ్యక్తిని చిన్న బాబు ముందే, రక్తం కారేలా కొట్టిన తండ్రి కారణంగా, ఆ పిల్లాడి మనసులో ముద్రించుకుపోయిన అన్యాయం, వ్యవస్థీకృతమైన సామాజిక హింస, అతన్ని కుదిపేసిన సంఘటనల్లో ఒకటి. అలాగే పిచ్చుకల్లాంటి అందమైన ఎవరికీ ఎటువంటి హానీ తలపెట్టని బెల్లెగాళ్ళనే పక్షుల్ని చిన్న పిల్లాడి ముందే ఒకడు కేవలం ఫన్ కోసం తుపాకీ తో కాల్చి చంపడం, కూడా అతన్ని బాగా బెంగపడేలా చేసేస్తాయి.
1952లో, కడప లో, ఒక ఫేక్షనిస్ట్ వ్యవస్థలో ఉన్న పెద్ద రైతు కుటుంబంలో పుడతాడు. తండ్రికి ఇద్దరు భార్యలు. ఇతను రెండో భార్య కొడుకు. ఇతనంటేనే తండ్రికి ఎక్కువిష్టం అని మిగిలినవాళ్ళ భావన, కుటుంబ కలహాలు. ఇవి ఉన్నప్పటికీ ఇద్దరి తల్లుల పిల్లలూ, ముఖ్యంగా అతని అందరు అక్కచెల్లెళ్ళూ అతన్నెప్పుడూ ప్రేమగానే చూసేవాళ్ళు.
మిగిల్న వాళ్ళు పురిగొల్పడం వల్ల, తరవాత వ్యాధిగ్రస్తుడైన తనని ఇబ్బంది పెట్టిన తమ్ముడు (పెద్ద భార్య కొడుకు) కూడా, అన్న దుస్థితి చూసి చలించిపోయి, అతని మీద కేసు పెట్టినందుకు ఏడిచేస్తాడు. [అయితే ఈ కేసు వల్లనే మల్లారెడ్డి లా చదువుకుని, న్యాయవాది అవుతాడు]
గుర్రం పై తిరిగే తండ్రి, తనని కూడా అప్పుడప్పుడూ తీసికెళ్ళి తమ 'జమీ' నంతా చూపించడం, వగైరాల వల్ల, మల్లా రెడ్డికి గుర్రం అంటే ప్రాణం. కానీ తండ్రి ఎప్పుడూ సొంతానికి గుర్రాన్ని ఎప్పుడూ ఇవ్వలేదు కొడుక్కు. తండ్రి వెంట గ్రామాలు తిరుగుతున్నప్పుడే, మొట్ట మొదటి సారి అప్పుడప్పుడే వస్తున్న రైలు నీ, ఎలక్ట్రిక్ బల్బు ని చూస్తాడు.
అలా సాఫీగా సాగుతున్న జీవితంలో చదువు విషయంలో పెద్దలు తెలిసీ తెలియకుండా తీసుకునే నిర్ణయాలు శాపంగా మారుతాయి. చిన్నవాడిని ఎందుకనో పెద్ద క్లాసులో బలవంతంగా చేరుస్తారు. వాడు, నేర్చుకోలేక, చదువు అందుకోలేక, మానలేక, ఎదుర్కొన్న వొత్తిడి, తరవాత ఇంగ్లీషు చదవలేక ఎదుర్కొన్న బాధ, ఇవన్నీ కుంగదీసినా ఎలాగో గట్టెక్కి, పెద్ద చదువులకు ఊరొదిలి పోవాల్సి రావడం, పట్నాలలో, నగరాలలో ఎదుర్కొన్న వింత పరిస్థితులు అతన్ని కుంగదీస్తాయి.
కొత్త స్నేహాలు, మనుషులు, చూసిన వివిధ దౌర్బల్యాలు, బలాలు, అతన్ని ఆదరించిన స్నేహాలు, మానవత్వం చూపిన మనుషులూ, ఇవన్నీ రచయితకు పేరు పేరునా గుర్తుండడం, చాలా మంది వ్యక్తులతో చాలా రోజులు, ఇంత వ్యాధి లో కూడా నిలుపుకున్న స్నేహం, చాలా ఆశ్చర్యం కలిగిస్తాయి. ఎన్ని గాఢమైన ముద్రలు ఇవి ? మనం చేసే పనులూ, మాటాడే మాటలూ కొందరికి ఎంత గుర్తుంటాయో, వారిని ఎంత ప్రభావితం చేస్తాయో, మనం జీవితం లో ఎంత జాగ్రత్త గా మసులుకోవాలో చెప్తాయి.
చిన్న వయసులో మల్లారెడ్డి వాళ్ళింట్లో, గాదెలు (వెదురుతో చేసినవి), ఖర్దనాలు (రాతి గాదెలు) లో పంట దాచుకునేవారు. పాడి ఆవులు ఇంట్లోనే కట్టేసి ఉండేవి. వాటి వల్ల ఈగలు, రొచ్చు తో ఇంటి లోపలి పరిసరాలే అపరిశుభ్రంగా ఉండేవి. కుటుంబసభ్యులు, ముఖ్యంగా పిల్లలూ తరచూ జబ్బు పడుతుండేవారు. సంతానం ఎక్కువ కావడాన, చిన్న పిల్లల్ని ఎవరో ఒక అవ్వలాంటి పనిమనిషి సాయంతో పెంచేవారు. ఆవిడే వీళ్ళని ఆదరించి, శుభ్రం చేసి, భోజనం, ఆప్యాయతా పంచి పెట్టేది.
మల్లరెడ్డి కుటుంబం పెద్దగా చదువు సంధ్యలు ఉన్న బాక్ గ్రౌండ్ నుండీ రాకపోయినా, అతని అక్క చెల్లెళ్లు చదువుకున్నారు. మానసిక వైద్యం గురించి అవగాహన లేని తండ్రి, ఎంత ముతక మనిషైనా, డబ్బు పిచ్చి ఉన్న వాడైనా కూడా, బెంగళూరు తీసికెళ్ళి, ఒక ప్రముఖ మానసిక వైద్యుడి దగ్గరే కొడుక్కి వైద్యం ఇప్పించాడే తప్ప, దయ్యాలూ, మంత్రాలూ, తంత్రాలూ, తాయెత్తులూ అంటూ కాలయాపన చెయ్యలేదు. ప్రతి సారీ కోర్సు పూర్తయ్యేదాకా కొడుకు వెంబడే ఉండి వైద్యం చేయిస్తూ, కనిపెట్టుకుని ఉండేవారు.
చదువు చెప్పిస్తూ, డాక్టర్ చేద్దామనుకుని, డొనేషన్ కట్టడానికి ముందుకు వచ్చి కూడా, కొడుకు కు ఇష్టం లేదని బలవంతపెట్టలేదు. చెట్టంత కొడుకు పిచ్చివాడై దేశం మీద పడి, అపరిశుభ్రంగా, ఆకలి తో, బలహీనతతో, అనారోగ్యంతో పరుగులు పెడుతూంటే, ఆఖర్న ఆత్మహత్యా యత్నం చేసినప్పుడు, వైద్యం ఇప్పించేవాడు. నయమయిందీ అనుకున్నాక ఉద్యోగానికి విదేశం పంపి, సంబంధం చూసి, అతనికి పెళ్ళి కూడా చేసాడు.
అయితే అల్జీరియా లో అక్కా బావా చూపించిన ఉద్యోగం చేసేందుకు వెళ్ళిన మల్లారెడ్డి, అక్కడి శీతాకాలంలో, తరగని పొద్దూ, నిరాదరించే చల్లదనం, ఒంటరితనం వల్ల డిప్రెషన్ బౌట్ లను మళ్ళీ ఎదుర్కోవడం, మందులను సరిపడా తీసుకుని వెళ్ళకపోవడం వల్ల చికిత్స అందక, మళ్ళీ తీవ్ర బాధలు ఎదుర్కొని, ఇండియా అంటూ తిరిగొస్తే, మరిక వెళ్ళేది లేదని నిర్ణయించుకుంటాడు.
అలా పెళ్ళి కుదురాక దేశానికి వచ్చిన అబ్బాయి, తిరిగి ఉద్యోగానికి విదేశం వెళ్ళనని, ఇక్కడే ఉంటానని భీష్మించుకోవడం తండ్రికి నచ్చదు. అప్పటి నుంచీ తల్లితండ్రులు, అతని భార్య ఉమ ప్రోద్బలంతో ఈ నిర్ణయం తీసుకుని ఉంటాడని ఆమె మీద అలిగి, కొడుక్కు దూరమవుతారు. ఎందుకంటే ఆ రోజుల్లో విదేశాల్లో ఉద్యోగం అంటే, అప్పట్లో ఎంతో గొప్ప విషయం.
పెళ్ళయ్యాక, భార్యకు తన వ్యాధి విషయం చెప్పినా, ఆమె పెద్దగా బాధపడదు. నయమయిందనే అనుకుంటుంది. కానీ మందులు తీసుకోవడంలో నిర్లక్షం, తగ్గింది కదా అని మందులు వేసుకోవడం మానేయడం వగైరాల వల్ల, ఎపిసోడ్ లు తిరగబెట్టేవి. వ్యాధి తీవ్రత, అతన్ని ఉద్యోగం చేసుకోనివ్వలేదు. భార్య ని అనుమానించేలా చేసింది, పిల్లల్ని భార్యే ఎలానో టీచర్ ఉద్యోగం చేసి పెంచుకోవాల్సి వచ్చింది.
విపరీతమైన సిగరెట్ అలవాటు, వ్యాధి ముదరడం వల్ల ఏదీ చెయ్యలేక, (రెండోసారి) ఆత్మహత్యా యత్నం చెయ్యడం, వగైరాలతో అందరినీ తీవ్రంగా ఇబ్బంది పెట్టినా భార్యా, ఆమె కుటుంబ సభ్యులూ ఎంతో మానవత్వం తో అతన్ని బ్రతికించుకుంటారు. వైద్యం ఇప్పిస్తారు. అండగా నిలుస్తారు. నిజానికి వ్యాధి విషయం దాచి పెళ్ళి చేసుకున్నందుకు అతను ఎంతగానో బాధపడతాడు కూడా. కానీ చెపితే అతనికి పిచ్చివాడని ముద్రవేసి పిల్లనివ్వరేమో అని తల్లితండ్రుల బెంగ మరి.
మొదటి నుండీ అతనికి వైద్యం చేసిన డాక్టర్ కూడా మల్లారెడ్డిని సోదరుడిలా చూసుకుంటాడు. సిగరెట్ మానలేని ఈ మనిషిని ఆ దేవుడి లాంటి డాక్టర్ తీవ్రంగా మందలించడంతో ఇతను చలించి, అతి ప్రయత్నం మీద మాని, షేక్ హాండ్ ఇచ్చేందుకు వెళ్ళీనప్పుడు, ఎంత ప్రేమతో కౌగిలించుకుంటాడో తన పేషెంట్ ను!
బహుశా మానసిక వ్యాధి ఒక మనిషి ని ఎంత చిత్రవధ చేస్తుందో ఎన్నో కేసుల్లో ప్రత్యక్షంగా చూసినందునేమో ఆ డాక్టర్ కి తన పేషెంట్ మీద ఆ ఆదరం. కానీ అనారోగ్యంతో ఆ డాక్టరు మరణించడం మల్లారెడ్డి గారి జీవితంలో మరో పెద్ద విషాదం. కానీ చికిత్స పట్ల ఆ డాక్టర్ పట్టుదల గుర్తు తెచ్చుకుని, క్రమశిక్షణ తో ఆ కోర్సుల్ని కంటిన్యూ చెయ్యగలుగుతాడు ఆయన.
ఈ ఆటోబయాగ్రఫీ అంతా పెద్ద రోలర్ కోస్టర్ రైడ్. ఎన్ని జ్ఞాపకాలో, ఎన్ని పాత్రలో. ఎన్ని సాయాలో. మానవత్వం బ్రతికే ఉందని, "ఆశ" అనేది, ఎప్పటికీ ఉందనీ బుజ్జగింపో. మానసిక రోగి జీవితం అంతా ఎంత పెద్ద యుద్ధమో, ఆదరించే కుటుంబసభ్యులూ, స్నేహితులూ - ఎంతెంత యోధులో చెప్తుంది. కుటుంబ కలహాలు కూడా ఎంత ఎవాయిడబుల్ చిన్న చిన్న పట్టింపులవల్ల మొదలవుతాయో, వాటి వల్ల మనుషులకెంత నష్టమో కూడా చెప్తారు.
ఈ పుస్తకం, మొదట రాసిన ఇంగ్లీష్ పుస్తకానికి 'అనువాదం' కాదు. ఆ ఇంగ్లీష్ పుస్తకం రాయడానికి, 15 గంటల ముప్పయి నిముషాలే పట్టింది. దాని తెలుగు అనువాదం కూడా ఈయనే చేసారు. ఈ పుస్తకం తను ట్రీట్ మెంట్ చేయించుకున్న క్లినిక్ లో వస్తూండే పేషెంట్లకు పనికొస్తుందని, అవగాహన కోసం రాసినదే. ఈ పుస్తకాన్ని తన డాక్టర్ గారికి అందిస్తే, ఆయన ఈ ఆత్మకథ ని చదివి మెచ్చుకుని ఎంతగానో ప్రోత్సహించారు. అయినా కొంత అస్పష్టతను తగ్గించేందుకు ఈ మూడో వెర్షన్ ను మొత్తం తెలుగులో 'తిరగ'రాసారు. 'సూర్య' అనే కలంపేరు వద్దని, సొంతపేరునే వాడమని పబ్లిషర్ సూచిస్తే, ధైర్యంగా సొంత పేరుతో ఈ పుస్తకాన్ని తీసుకొచ్చారు. ఈ 'రాయడం', తన గుండె మీద బరువుని తగ్గించడమే కాకుండా, తనలాంటి ఘోర యుద్ధం చేసే రోగులకు ధైర్యం ఇస్తుందని నమ్మి ఈ ప్రయత్నం చేసారు. 'మానసిక రోగం మనకి రాదు!' అని గుండె మీద చెయ్యేసుకుని ఇది మన జబ్బు కాదు అని తోసిపారేయకూడదు ఎవరైనా.
ఈ డిప్రషన్, ఆత్రుత, ఆందోళన, ఇవన్నీ ఎందరిని ఆత్మ హత్యలకు ప్రేరేపిస్తున్నాయో మనకు తెలుసు. ఆయా వ్యక్తులకు ఆత్మీయతా, ఆదరణా, కరువయ్యి ఈ పనులు చేస్తున్నట్టు సాధారణంగా అనుకుంటాము మనం. కానీ వారిని వేధిస్తున్నమానసిక వ్యాధిని గుర్తించలేము.
ఆత్మహత్యా యత్నంలో విఫలమైన మనిషి బ్రతికితే కొన్నాళ్ళ కౌన్సిలింగ్ ఇచ్చి వదిలేస్తామేమో. కానీ దానికి కారణం అయిన వ్యాధి ని గుర్తించేందుకు ఏమి చెయ్యాలో మనకు తెలీదు.
ఇదే 'హైద్రబాద్ బుక్ ట్రస్ట్", డాక్టర్ ఆలూరి విజయలక్ష్మి గారు అనువదించిన "మానసిక వైద్యులు లేని చోట " అంటూ మానసిక వ్యాధుల గురించి ఒక గైడ్ లాంటి చాలా మంచి పుస్తకం ప్రచురించింది. మిగిలిన ఏ ప్రచురణ సంస్థలు ఇలాంటి బాధ్యతా యుతమైన పనులు చేస్తాయో నాకు తెలీదు.
ఇప్పుడు షుగర్, బీపీ ల లాగా, క్లినికల్ డిప్రషన్, పెద్దల్లో 'ఆల్జీమర్స్ డిసీస్' సాధారణం అవుతున్నాయి. నలభై దాటితే డిమెన్షియా వచ్చే అవకాశాలున్నాయి. వీటిల్లో కొన్ని ప్రాణాలు తీసే జబ్బులు. వాటి తీవ్రత మనకు తెలుసా ? మతిమరుపుతో రోజురోజుకూ ఆరోగ్యం దిగజారుతూ, బాధపడే వృద్ధుల్ని చూసుకునే కుటుంబ సభ్యులు, స్పెషల్ చిల్డ్రన్ ని కన్న తల్లిదండృలూ అనుభవించే మానసిక ఒత్తిడి మనకు తెలుస్తుందా ? ఇవన్నీ తప్పకుండా చదివి తెలుసుకోవాల్సిన విషయాలు.
ఇంత కథ చెప్పేసానని అనుకోవద్దు. "నిజ జీవిత కథ కదా, ఏముంది లే" అనుకోవచ్చు. 'నిజమే' 'కల్పన' కన్న ఎక్కువ ఆశ్చర్యకరం!! ఈ మనిషి మానసిక దృఢత్వం ఎలా సాధించుకుని, ఎక్కువ తక్కువలు లేకుండా, జీవితం పట్ల కృతజ్ఞతా భావంతో ఎంత పాసిటివ్ గా ఈ పుస్తకం రాసాడో తెలుసుకోవాలంటే చదవాలి. ఏకబిగిన చదివించి చాలా సంతృప్తి నిచ్చిన పుస్తకం ఇది. నిజంగానే ఓడి గెలిచిన మనిషి కథ ఇది.
నమస్తే,
ReplyDeleteనేను ఈరోజు మీరు నా ఆత్మకథ పై రాసిన సమీక్ష చదివి చాలా సంభ్రమాత్చర్యాలకు గురియైనాను. ఇంత లోతైన సమీక్ష వ్రాయడం, మీకు తెలుగు సాహిత్యం తోగల పరిచయం, మానసిక వ్యాధి గ్రస్తుల పైగల సానుభూతి తెలియజేస్తున్నాయి. మీ ఈ సమీక్ష కు నా ధన్యవాదాలు
ఇట్లు
తొడిమె మల్లారెడ్డి.
నమస్తే,
ReplyDeleteనేనీ రోజు నా ఆత్మకథ పై వ్రాసిన సమీక్ష చదివి, చాలా సంభ్రమాత్చర్యాలకు గురియైనాను. ఇంతలోతైన సమీక్ష వ్రాసినారంటే మీకు సాహిత్యం పై గల ఆసక్తి యింకా మానసిక వ్యాధి గ్రస్తుల పై గల సానుభూతి తెలుస్తోంది. ఇంత మంచి సమీక్ష వ్రాసిన మీకు నా ధన్యవాదాలు.
ఇట్లు,
తొడిమె మల్లారెడ్డి
మల్లారెడ్డి గారు, మీరే ఇలా కామెంట్ రాయడం నాకు చాలా ఆనందాన్నిచ్చింది. మీ సహృదయతకు చాలా ధన్యవాదాలు. అసలు మీరు ఇంత మంచి పుస్తకం రాసినందుకు కూడా చాలా థాంక్స్. చిన్న పుస్తకమే అయినా మీరు చాలా ప్రభావవంతంగా రాసారు. కొన్ని అనుభవిస్తే గానీ అర్ధం కావు. మానసిక రోగాల పట్ల మన అవగాహన పెంచుకోవడం అవసరం. మీ రచన నలుగురికీ ఉపయోగకరం. మీ కథ లో అందరూ హీరోలే. నమస్సులు.
Deleteచాలా గొప్ప రచన!
ReplyDeleteపుస్తక రచయిత అయిన మల్లారెడ్డి గారికీ పోష్టు వ్రాసిన సుజాత గారికీ అభినందనలు.ఇది అందరూ తప్పక చద్వాల్సిన విషయం కాబట్టి ముఖ ప్స్తకం దగ్గీర్ నేనూ పరిచయం చెయ్యాలని అనుకుంటున్నాను.సొంత మాటలు ఏమీ చెప్పను.ఇక్కడి సుజాత గారి వ్యాసాన్నే అక్కడ వేస్తాను.
సరేనా!
సరేనండీ. థాంక్స్.
ReplyDelete