తెలుగు చలనచిత్ర పరిశమ లో / భారతీయ చలన చిత్ర చరిత్రలో డా|| భానుమతీ రామకృష్ణ రచయిత్రిగా, గాయనిగా, సంగీత దర్శకురాలిగా, దర్శక నిర్మాతగా అలా అన్ని రంగాలలోనూ పేరు పొందిన బహుముఖ ప్రజ్ఞాశాలిని. పద్మభూషణ్ డా|| భానుమతీ రామకృష్ణ రాసిన ఈ జీవిత చరిత్ర - 1994 సంవత్సరానికి ఉత్తమ జీవిత చరిత్రగా జాతీయ బహుమతి కూడా పొందింది.
భానుమతి గారు రాసిన "అత్తగారి కథలు", "భానుమతి కథలు", ప్రచురించబడినా, సేకరించలేక చరిత్రలో కలిసిపోయిన కొన్ని ముందుకాలపు రచనలు, పాఠకులకు భానుమతి గారి సులువుగా కథ చెప్పగలిగే హాస్యచతురత ను, రచనా కౌశలాన్నీ పరిచయం చేసినా, ఈ "నాలో నేను" - కల్పన లేకుండా - స్వగతంగా తన గురించి ఆమె నిర్మొహమాటంగా, ఖచ్చితంగా, ఎవరైనా ఏమైనా అనుకుంటారన్న భయం లేకుండా చెప్పిన ఆత్మకథ కాబట్టి, ఎక్కడా గొప్పలు పోకుండా, విర్రవీగకుండా ప్రాక్టికల్ గా, నిజాయితీ తో రాయడం వల్ల - మరింత ఆకట్టుకుంటుంది. .
ముదుమాట లో డీవీ నరసరాజు గారు చెప్పినట్టు ఈ స్వగతాన్ని, జీవిత యదార్ధ గాధ ని సినిమాగా తియ్యాలనుకుని, స్క్రిప్ట్ కూడా దాదాపుగా రాసుకుని, కొన్ని కారణాల వల్ల ఆ ఆలోచనను విరమించుకున్నారు భానుమతి. నాకు మాత్రం ఇది పుస్తకం గానే ఎంతో బావున్నట్టు అనిపించింది. జీవితంలో అతి ముఖ్యమైనది భానుమతి గారి దృష్టి లో సంతృప్తి ! "నేనింక ఏదీ సాధించేందుకు మిగలలేదు, జీవితంలో అన్నీ సాధించాను " - అనే సంతృప్తి ఆమెకు కలగడానికి కారణం తన భర్త, ఇంకా శృంగేరి జగద్గురువు ఆశీర్వాదాలు అని చెప్తూ, ఎంతో చక్కగా డాక్యుమెంట్ చేసిన ఈ మహనీయురాలి జీవిత చరిత్ర, నిరంతర ఆలోచనల ప్రవాహం ఈ "నాలో నేను".
ఒకోసారి మనం అవసరమైనవెన్నో మర్చిపోతుంటాము కానీ కొన్ని పనికిమాలిన జ్ఞాపకాలు కూడా మనసులో ఎంత పాతుకుంటాయో, వాటిని పెద్దయ్యాక కూడా ఎందుకు మర్చిపోలేమో వివరించలేము. ఈ కథ లో భానుమతి వీధి బడి, రంగయ్య పంతులు, బెత్తం వంటి అనుభవాల నుండీ, తన ఆహార్యం, మేచింగ్ పట్టు పావడాలు, తల్లో పువ్వులు వగైరాల తో పాటు ఆరోజుల ఫాషన్ గురించి, తన బొద్దు తనాన్ని గురించి హాస్యంగా చెప్పినా, తెలివితేటల పరంగా, ఆ పసి వయసులోనే తన బుద్ధి కి అర్ధం అయేటన్ని మానవ స్వభావాల గురించి, అమాయకత్వపు రోజుల్లోనే ఆమె కు ఎంత అవగాహనో చదివితే భలే ఆశ్చర్యం వేస్తుంది. బడిలో పిల్లల పట్ల పంతుళ్ళ బిహేవియర్, శిక్షలు - లౌక్యాలు ఎంత జ్ఞాపకంగా హాస్యంగా చెప్పారో!
ఎపుడో చిన్నప్పుడు స్పాండిలైటిస్ లాంటి వెన్నుపూస సమస్యతో ఆ రోజుల్లో వైద్య సదుపాయాలు లేకనో, బీదరికం వల్లనో ఎప్పుడూ తల పైకెత్తి, ఆకాశం వైపు చూసి నడుస్తూ కాళ్ళకు ఎదుర్రాయి దెబ్బలతో బాధపడుతూండే ఓ ముసలాయన జ్ఞాపకం , తనకు పెద్దయ్యి వెన్ను సమస్య వచ్చాక తనకు అర్ధం కావడం, "అబ్సర్వేషన్" అను తన జబ్బు గురించి - వివరిస్తూ, చిన్నతనాన పొరుగున ఉండిన పంజాబీ తాత ఒకరు చిన్నప్పుడెప్పుడో ఇచ్చిన ఉల్లిపాయల కూర తనకు ఎంతగానో నచ్చడం గురించి కూడా మురిపెంగా గుర్తుచేసుకోవడం, తినాలనిపించినప్పుడు స్వయంగా వంటింటి లోపలికెళ్ళి ఆ కూర చేసుకోవడం - తన ప్లెయిన్ హార్టెడ్ నెస్ ని, తన బాల్యాన్నీ, తన లోపలి బాలిక నీ, వొదులుకోని స్త్రీ గా ఎంత బాగా చెప్పారో. నాకూ వ్యక్తిగతంగా ఉల్లిపాయ, మీగడతో చేసే ఈ కూర చాలా చాలా ఇష్టం. అందుకే ఎక్కువ కనెక్ట్ అయిపోయినట్టున్నాను. 😆
అలా చిన్నప్పట్నించీ ఎన్ని జ్ఞాపకాలో, తన కజిన్లు, వారి వెధవ వేషాలు - చేసిన తప్పుడు పనులు, చుట్టు పక్కల ఇరుగు పొరుగుల గురించి, వారి దగ్గర తాను నేర్చుకున్న ఎన్నో మంచి విషయాల గురించి, వారి వారి బలం, బలహీనతల గురించి, రకరకాల మనుషుల గురించి, వారు తన పట్ల చూపిన ఆదరం, అనాదరాన్ని గురించి చెప్తున్నప్పుడు, పసి మనసుల అద్దంలాంటి నిర్మలత్వం లో మనం వదిలే ఇంప్రెషన్ ల ప్రభావం మనకు అర్ధం అవుతుంది. తనలో చిన్నప్పటి సంస్కృతాధ్యయనం వల్ల ఒరవడిన ఆధ్యాత్మిక భావనల గురించి పొల్లు పోని క్లుప్త ప్రస్తావనలు - ప్రవాహంలా ఆయా ఈవెంట్లను అల్లుకుంటూ రావడం భానుమతి గారి ప్రత్యేకత.
సినిమా రంగ ప్రవేశం, తండ్రి నేర్పిన సంగీతం, బాల్యంలోనే పాటల ద్వారా తనకు సరస్వతి కటాక్షం వల్ల అందరి లోనూ వచ్చిన మంచి పేరు - సాంప్రదాయ వాద పెంపకం వల్ల తండ్రి చాటు బిడ్డగా, క్రమశిక్షణ తో, హార్డ్ వర్క్ తో అప్పటికే స్టార్ గా ఉన్న ఆమె రామ కృష్ణ గారితో ప్రేమలో పడడం - ఆమె పెళ్ళి, పెళ్ళి తరవాత విడిచిన సినిమా రంగం, తాను కోరుకున్న కుటుంబ మధ్యతరగతి జీవితానికి వారు ఇష్టంగా అలవాటు పడినా, విధి లిఖితం వల్ల, పలువురు శ్రేయోభిలాషుల బలవంతం వల్ల, తండ్రికి ఎంతగానో ఇష్టమైన తన గాత్రం - నలుగురూ వినాలని ఆయనకు బలమైన కోరిక ఉండడం వల్ల, కొడుకు భవిష్యత్తు కోసం తల్లిగా ఆమె తపన పొందడం వల్ల, ఎందరో మేలు కోరే కుటుంబ సభ్యులు, స్నేహితుల ప్రోత్సాహంతో సినీ రంగంలోకి పునఃప్రవేశం చేసాకా చాలా మంచి మంచి సినిమాలో నటించి, ప్రొడ్యూస్ చేసి, దర్శకత్వం చేసి, తన గానంతో ఎన్నో శాస్త్రీయ సంగీతం దగ్గర్నించీ, పాశ్చాత్య సంగీతం దాకా ఎన్నో శైలులలో పాటలు పాడి, అలరించి, వివిధ రాష్ట్ర ప్రజలలో మంచి పేరు ప్రఖ్యాతులు గ్రహించి, ప్రభుత్వం దగ్గర ఎన్నో బిరుదులు, గౌరవ ఎవార్డులు, రివార్డులు పొందిన గొప్ప మహిళ భానుమతి గారు.
ముందస్తు హెచ్చరిక ఏమిటంటే : ఇది గొప్ప ప్రేమ కథ. దాదాపు పుస్తకం నిండా రామకృష్ణ భానుమతి, వారి ప్రేమ, పెళ్ళి, ప్రయాణం, వారి స్ట్రగుల్, విజయాలు. ఇదంతా చదవడానికి ఎంత బావుందో. ఒక స్త్రీ గా రొమాన్స్ ని ఎంత గొప్పగా వర్ణిస్తారో. తండ్రిని వొదల్లేక, ఒప్పించలేక, ఎదురు చెప్పలేక, రామకృష్ణ గారిని వొదులుకోలేక, చెల్లి సహకారంతో - స్నేహితుల తోడ్పాటుతో, నాటకీయంగా పెళ్ళి చేసుకోవాల్సి రావడాన్ని కళ్ళకు కట్టినట్టు వర్ణించి, మన గుండె ఆగేంత ఉత్కంఠ ని చాప్టర్ల వెంట పరిగెట్టిస్తారు. పుస్తకం ఆఖరున వారి వియోగం కూడా కంటతడి పెట్టిస్తుంది. ఇదంతా వారిద్దరి ప్రయాణం. అంతగా జీవితాలు పెనవేసుకుపోయిన ప్రేమికులు - అందునా కెరీర్ మనుషులు, కళాకారులు, సృజన రంగంలో తలలు పండినవారు - ఈరోజుల్లో దొరుకుతారా?
ఇంతటి బహుముఖ ప్రజ్ఞాశాలి - అందరితో మంచివాడు అని పేరు తెచ్చుకున్న ఆ చిన్న, బీద టెక్నీషియన్ని ప్రేమించడం - ఆయన కూడా ప్రతిభాశాలి కావడాన వారి ప్రయాణం సాఫీగా జరగడం, అత్తగారి, పెద్దత్త గారి ప్రోత్సాహం - ఈ స్టార్ నటీమణి, మధ్యతరగతి సాంప్రదాయ కోడలు లాగా వ్రతాలు, నోములూ, పూజలు, వంటలు చేసుకోవడం, ఆత్మీయంగా, అందరితోనూ కలిసి మెలిసి ఉండడమూ, తన కోసం స్క్రిప్ట్ లు రాయబడిన / మార్చబడిన, అందరి చేత గౌరవించబడిన తార - చిన్న చిన్న నటీనటులని కూడా గుర్తు పెట్టుకుని వారు తనకి అదెప్పుడో చేనిన చిన్న సాయాల గురించి / మేలు గురించి తన ఆత్మ కథ లో కూడా గుర్తు చేసుకోవడం చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఇదీ జీవితంలో మనం నేర్చుకోవాల్సిన ఒద్దిక అనిపిస్తుంది.
మిస్సమ్మ లో తాను మిస్ అయిన చాన్స్ సావిత్రి లాంటి మహానటిని చిత్ర పరిశ్రమ కు అందివ్వడం, తన జీవితం లో ఇష్టం లేకుండా చేసిన అమెరికా ప్రయాణం, కొడుకు జీవితం - ఇవన్నీ భగవంతుని ఆజ్ఞ ప్రకారం జరిగినవే నని, తాను ఇలా జీవితం లో కళాకారిణిగా పైకెదగడం, పేరు తెచ్చుకోవడం కూడా కర్మ వశాత్తూ జరిగిందే ననీ, తన గొప్పదనం కన్నా ఇదంతా డెస్టినీ అని నమ్ముతారు. అలా అని ఆమె భావ వ్యక్తీకరణ లో నిర్లిప్తతా, అయిష్టం ఏమీ లేవు. ఎన్ని డీటైల్స్, ఎన్ని జ్ఞాపకాలు - ఎన్ని అవమానాలు, మధుర ఊహలు, అనుభూతులు, కష్టాలు, దుఃఖాలు - వీటిని ఎంత చక్కగా జీవితపు ప్రతి క్షణాన్నీ ఉన్నది ఉన్నట్టుగా, స్వీకరిస్తూ, ఒప్పుకుంటూ, ఆనందిస్తూ జీవించడాన్నే ఆమె నమ్ముకున్నారు.
తాను పని చేసిన సినిమాల గురించి - రాసిన కథల గురించి మాత్రమే కాక, చూసిన వివిధ భాషల అజరామరమైన సినిమాలు, వాటి మెరిట్, సినిమా పరిశ్రమ లో పెరిగిన కమర్షియలిసం, మారిన విలువలు, సామాజికంగా రాజకీయంగా, సినిమాల లో తన కు కలిగిన అనుభవాలు, భర్త వియోగం తరవాత కొన్ని మంచి సినిమాలలో చిన్న చిన్న పాత్రలే వేసినా, అవి మహిళల వ్యక్తిత్వానికి పాసిటివ్ రిప్రసెంటేషన్ ను ప్రతిబింబించేలా ఉంటేనే, తాను అవి చెయ్యడాన్ని గురించి సమగ్ర వివరణ ఇచ్చారు.
ఎంత రొమాంటిక్ స్త్రీ / మాట జవదాటని కూతురు / కుమారుడిని అమితంగా ప్రేమించే తల్లి / పద్ధతైన కోడలు అయినా - ముందు ఆమె మంచి ప్రొఫెషనల్. అదీ ఎంతో ప్రతిభా, నిబద్ధతా ఉన్న కష్టపడే మనిషి. కాబట్టి ఈ డాక్యుమెంటేషన్ చాలా ప్రొఫెషనల్ గా, నైపుణ్యంతో నిండి ఉంటుంది. దీన్ని చదవడం చాలా మంచి అనుభవం. నా షెల్ఫ్ లో ఎన్నో ఏళ్ళుగా ఉండినా ఈ మధ్యనే చదవడానికి కుదిరింది. ఎంత బావుందో ఈ పుస్తకం... ఇన్నాళ్ళూ ఎందుకు చదవలేదా అనుకున్నాను. ఇదీ దైవ నిర్ణయం ఏమో. ఇప్పుడు ఈ వయసులో ఈ పుస్తకం ఒక కొత్త డైమెన్షన్ లో కనిపించింది. ఓ పదేళ్ళ క్రితం చదివి ఉంటే, ఏదో గడ గడా చదివేసేదాన్నేమో గానీ ఈ వయసులోనే ఎక్కువ అర్ధం అయింది, ఆ విలువలు, నిజాయితీ, భయం లేకపోవడం, అవేవీ పొగరుగా/అతిగా అనిపించకుండా, ఆత్మ విశ్వాసంగా / తనను తాను గౌరవించుకునే గొప్ప వ్యక్తిత్వం ఉన్న ఓ మహిళ జీవిత కథగా అర్ధం అయి, బాగా నచ్చింది.
***
No comments:
Post a Comment
వ్యాఖ్యానించినందుకు చాలా చాలా థాంక్స్.