Pages

09/01/2018

A Fine Balance - Rohington Mistry


ఎమర్జెన్సీ,  ప్రజాస్వామ్య దేశమైన భారత దేశంలో మర్చిపోలేని చీకటి అధ్యాయం. దీన్ని గురించి ఎన్నో నవలల్లో విస్తారమైన చర్చ చదివాము.  మొన్న మొన్నటి "మినిస్ట్రీ ఆఫ్ అట్ మోస్ట్ హాపీనెస్"  లో కూడా ఎమర్జెన్సీ నాటి అకృత్యాల గురించి ప్రస్తావన ఉంటుంది.   'ఎ ఫైన్ బాలన్స్'   లో కూడా ఆ డార్క్ డేస్ గురించి, అస్సలు తెలీని వాళ్ళని పాఠకుల్ని నివ్వెరపోయేలా చేసిన  కథలు ఉంటాయి.

కథ ఎమర్జెన్సీ చుట్టూ తిరగకపోయినా, అధిక భాగం,  అవే చీకటి  రాజ్యపు అన్యాయాలకి బలైపోయిన జీవితాల గురించి, ముఖ్యంగా కుల ప్రాతిపదికన,  విడిపోయిన సమాజం,  కులం పేరుతో జరిగిన అన్యాయాలు, చమార్ (పశు చర్మంతో చెప్పులు తయారుచేసే వాళ్ళు) లు, సామాజికంగా తమ జీవితాల్లో మార్పు తెచ్చుకోవడానికి ప్రయత్నించినపుడు  గ్రామంలో పెద్దమనుషులు వాళ్ళని కుటుంబ సమేతంగా సజీవ దహనం చెయ్యడం,    కాలేజీల్లో  ప్రాణాంతకమైన రాగింగ్,  ఓ పక్క దేశ రాజకీయాలకు సంబంధం లేని కుటుంబ రాజకీయాలు, చెల్లెలినే తప్పుగా చూస్తూ పెరిగిన అన్న,  ఆర్ధికంగా పరిస్థితి తల్లక్రిందులైనా,  ఆధారం లేకపోయినా అటువంటి అన్న ని, అతని ఆస్థిని, అతన్ని జీవితాంతం తప్పించుకుంటూ, తిరిగే చెల్లెలు.   వీటన్నింటి మధ్యా ఓ ఫైన్ బాలెన్స్ ఇది.

ఒక (బొంబాయేనేమో) ఊహా నగరం లో ఒక పార్శీ కుటుంబం లో ఒకమ్మాయి,   గ్రామ స్పర్ధల్లో కుటుంబంలో అందరూ చంపబడగా మిగిల్న ఇద్దరు చమార్లు (వాళ్ళు అంటరానితనాన్ని తప్పించుకునేందుకు ఒక ముస్లిం స్నేహితుని సాయంతో దర్జీ పని నేర్చుకుంటారు),  వాళ్ళతో పాటూ, పెద్ద చదువులు చదివేందుకు నగరానికొచ్చిన  ఈ పార్శీ స్త్రీ స్నేహితురాలి కొడుకు,  వీళ్ళ ముగ్గురిదీ ఈ కథ.

దీనా దయాల్ ఒక పార్శీ  పెద్దమనిషి కూతురు. పార్శీల్లో అమ్మాయిలు ఎలా సాంప్రదాయంగా, అణుకువగా పెరుగుతారో అలా పెరుగుతుంది.  అయితే తండ్రి మరణానంతరం దాదాపు పిచ్చి దానిలా మారిన తల్లి కారణాన అన్నే ఇంటికి పెద్ద దిక్కవుతాడు, కానీ ఆ అన్నది వక్ర బుద్ధి.  పెద్దయ్యాకా మధ్య తరగతికి చెందిన ఒక మంచి మనిషిని ప్రేమించి పెళ్ళి చేసుకున్నా, అతను రోడ్ ప్రమాదంతో మృతి చెందినా, అతనితో గడిపిన చిన్న ఇల్లే తన లోకం అనుకుని, ఇక పుట్తింటికి తిరిగి వెళ్ళడానికి ఇష్టపడకుండా, తనకు చాతనయిన కుట్టు పనితో కాంట్రాక్ట్  కి  బండెళ్ళ చొప్పున బట్టలు కుడుతూ, వయసు పెరిగాక, సాయానికి ఇద్దరు దర్జీలని అసిస్టెంట్లు గా పెట్టుకుని తన చిన్న వ్యాపారం నడుపుకుంటుంది.

ఆమె దగ్గ చేరిన దర్జీలే ఈష్వర్ దర్జీ, ఓం ప్రకాష్ దర్జీ.  వీళ్ళు ఇద్దరూ నిజానికి చమార్లు. కానీ కొంచెం చదువుకున్నాక  అంటరానితనం నేరమని తెలుసుకుంటున్న తరం అది.  చమార్ వృత్తి చేసుకుంటూంటే తామెన్నటికీ అంటరానివారి గానే మిగిలిపోయే ప్రమాదం ఉందని, బ్రతుకు తెరువు కోసం దర్జీ పని నేర్చుకుంటారు.  వీరి వృత్తి మార్పు గ్రామం లో మిగిల్న వారికి కంటగింపు అవుతుంది. చిన్న బేధాభిప్రాయంతో గ్రామ పెద్దల  తీర్పు ననుసరించి కొంతా, కుట్ర కారణంగా కొంతా, ఆగ్రహించిన గ్రామస్తులు వీళ్ల ఇంటికి నిప్పు పెట్టేస్తారు. కుటుంబం మొత్తం,  కుటుంబ పెద్దా,  తల్లీ పిల్లలూ, సజీవ దహనం అవుతారు.   ఆ సమయానికి ఇంట్లో లేని ఓం ప్రకాష్, ఈశ్వర్ దర్జీలే మిగుల్తారు.  వీళ్ళు దీనా దగ్గర  కూలీ దర్జీలు గా చేరి, తమ పనితనం తో మెప్పించినా, వీళ్ళకి  ఆ నగరంలో నిలువ నీడ లేదు.   రాత్రిళ్ళు రోడ్ మీద నిద్రపోవడం, బిచ్చగాళ్ల తోనూ, వీధి రౌడీల తోనూ, దొంగల తోనూ నిద్రపోవడం,  పగలంతా అలివి కానంత పని చేసి, రాత్రి సుఖంగా నిద్ర పోవడానిక్కూడా లేక,  రోడ్ మీద పడుకున్న వీళ్ళని ఒక రాత్రి (ఎమర్జెన్సీ సమయం లో) పోలీసులు వచ్చి లారీల్లో ఎక్కించి నగరానికి దూరంగా ఎక్కడికో బట్టీల్లోకి తీస్కెళ్ళి  వెట్టి చాకిరీ చేయిస్తారు.  తాము బిచ్చగాళ్ళం కామన్నా వినే నాధుడెవరూ లేరు.  అక్కణ్ణించి తప్పించుకున్నాక దీనా ఇంట్లోనే ఓ మూల నిద్ర పోగలగడం, ఒక మజిలీ. వీళ్ళ జీవితాల్లో. 

మూడో పాత్ర  సున్నిత మనస్కుడైన మానెక్ కోలా.. కొండల్లో (బహుశా హిమాచల్) ఉండే ఓ ఊరు నుండీ నగరానికి చదువుకోవడానికి వస్తాడు. అతని తల్లి ఒకప్పుడు దీనా స్నేహితురాలే.  తండ్రికి ఓ చక్కని కిరాణా షాపు.  అందమైన బాల్యం. కానీ చదువు కోసం నాలుగో క్లాసు నుండే బోర్డింగ్ స్కూల్లో పడిపోవడం అతని సున్నిత హృదయాన్ని తీవ్రంగా గాయపరుస్తుంది.  తల్లీదండృలను విడిచి ఉండటం అతనికి అస్సలు ఇష్టం లేకపోయినా చిన్నప్పట్నించీ అతని గురించిన నిర్ణయాలన్నీ తల్లితండృలే తీసుకుంటూండడం, ఆఖరికి రిఫ్రెజరేషన్, ఏర్ కండీషనింగ్ కోర్స్ చేయడానికి నగరానికి రావడం జరుగుతుంది.  మొదట హాస్టల్లోనే ఉన్నా, అక్కడ భయంకరమైన రాగింగ్ ని భరించడం చాలా కష్టం అవుతుంది.  శవప్రాయంగా  మారిపోతున్న కొడుకుని చూసి భయపడి, తల్లి అతన్ని దీనా దగ్గరకి పీ.జీ గా ఉండేందుకు పంపిస్తుంది.  దీనా కి ఈ పేయింగ్ గెస్ట్ ఇచ్చే డబ్బులు అవసరమై ఒప్పుకుంటుంది.  మొత్తానికి ఈ నలుగురూ, దీనా ఫ్లాట్ లో ఎలాగో సర్దుకుని,  మెల్లగా మంచి స్నేహితుల్లా మారతారు.

కానీ కాల క్రమాన, దీనా ఉంటున్న ఇంటి ఓనర్ ఇంతమంది జనాల్ని చూసి గోల పెట్టడం వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి.  అప్పుడు ఓం ప్రకాష్ కి పెళ్ళి చెయ్యడానికి ఈశ్వర్ (ఓం ప్రకాష్ తండ్రికి అన్న ఈ ఈశ్వర్ - అంటే పెదనాన్న - కాబట్టి ఆ బాధ్యతతో)  సొంత  ఊరికి ప్రయాణం కడతాడు. మానెక్ చదువయ్యాక తల్లి తండృల ఆకాంక్ష మేరకు  దుబాయ్ కి వెళిపోతాడు.  చివరికి  ఒంటరితనంతో వేగలేక, ఆ  వృద్ధాప్యంలో  ఇంటి ఓనర్, తనను  ఇంటి నుండీ నెట్టేయాల్సి రావచ్చనేంత గా  పరిస్థితి వచ్చాక, దీనా తప్పనిసరై అన్నా, వదినల దగ్గరికి వెళిపోతుంది. 

అక్కడ  సొంత ఊరు ఏమీ అక్కున చేర్చుకోక పోగా, గ్రామ పెద్ద (ఠాకూర్) కుట్ర మూలంగా  ఈశ్వర్, ఓం ప్రకాష్ లు బలవంతపు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ ల కు గురి అవుతారు.  పరిశుభ్రత అన్నదే పాటించకుండా, జంతువులకు చేసినట్టు, పెళ్ళి కాని ఓం ప్రకాష్ కు కూడా వేసెక్టమీ చేస్తారు.  పరిశుభ్రత లేక జరిపిన ఈ ఆపరేసన్ వల్ల ఈశ్వర్ కాళ్ళు ఇంఫెక్ట్ అయి,  రెండు కాళ్ళనీ మూలం నుండీ  తీసేయాల్సి వస్తుంది.  దాంతో అన్యాయంగా అతను కాళ్ళు లేనివాడయిపోతాడు.     అదే వేసెక్టమీ కేంప్ లో,  కుల వ్యవస్థ మీద తన కుటుంబం తిరగబడిన పాపాన,  గ్రామ ఠాకూర్ డాక్టర్ కి లంచమిచ్చి ఓం ప్రకాష్ ని కేస్టరేట్ చేయించేస్తాడు.   ఇలా జీవితం చీకటిమయం చేసిన ఆ గ్రామం నుంచీ ఎలాగో నగరానికి చేరుకున్న దర్జీలకు మళ్ళీ తిండీ, నీడా గగనమవుతాయి. దీనా ఇప్పుడు ఆ ఇంట్లో లేదు.  కానీ ఎలాగో ఈ పాత స్నేహితులు కలుసుకుని,  ఎప్పుడో ఓ సారి, ఏ వారానికోమారో, దీనా తన అన్నా వదినలు లేని సమయాన వీళ్ళిద్దరికీ అన్నం పెట్టే ఏర్పాటు చేసుకుంటారు. 

అటు మానెక్ తండ్రి మరణానంతరం దుబాయ్ నించీ తిరిగొచ్చి,  తీవ్రమైన ఒంటరి తనానికీ, డిప్రెషన్ కూ గురవుతాడు. తండ్రి జ్ఞాపకాలు అతన్ని స్థిరంగా ఉండనివ్వవు.  ఆ మానసిక క్షోభ కు  తోడు గా , తన చుట్టూ జరుగుతున్న  అన్యాయాలు, ఆత్మ హత్యలు,  అతన్ని తీవ్ర నైరాశ్యంలో ముంచేస్తాయి. , పాత మితృలను కల్సుకొనేందుకు  వచ్చి,  దీనా ని కలుసుకున్నాక,  ఓం, ఈశ్వర్ ల జీవితాన్ని గురించీ విని, ఇంక తట్టుకోలేక, రైలు కింద పడి ఆత్మ హత్య చేసుకుంటాడు.  ఇంత పెద్ద కథ ని, ఇంత నైరాశ్యాన్నీ, ఇంత ఒంటరి తనాన్నీ, ఇన్ని వ్యవస్థల్నీ, వివక్షల్నీ,  మన దేశంలో పాతుకుపోయిన సామాజిక దురాచారాల్నీ,  వాటి వల్ల నాశనమైపోయిన తరాల్నీ, ముఖ్యంగా ఎమర్జెన్సీ సమయాన దేశంలో మరణించిన వ్యక్తి స్వాతంత్రాన్నీ,  కను మరుగయిపోయిన మానవత్వాన్నీ - అన్నిట్నీ కేనడియన్ రచయిత  రోహింగ్టన్ మిస్త్రీ  చక్కగా పట్టుకున్నారు.

పార్శీ ల సామాజిక వ్యవస్థ దగ్గర్నుంచీ, జుత్తు కోసం బిచ్చగాళ్ళని హత్య చేసే హంతకుడి దాకా, [బొంబాయి లాంటి]  నగరం ఎంత మందికి ఉపాధి ని ఇచ్చి, ఎన్ని జీవితాల్ని నిలబెట్టినా అక్కడి పేదరికంలో కూడా పాతుకుపోయిన వ్యవస్థ లు. ఎప్పటివో 1984 నాటి వరకూ పరిస్థితులు,  ఇందిర మరణానంతరం జరిగిన సిక్కు హత్యలు, అంతకు ముందు నుండీ జరుగుతున్న ఘోరాలు, కట్నాలు, చావులు,    అన్నిట్నీ చర్చించి, - ఇంత నిరాశ లో కూడా "కింద పెట్టనివ్వకుండా" చదివించారు రచయిత.  పేదరికమే అన్యాయం. దాన్లో అంటరానితనం ఇంకెంత అన్యాయం.  ఇలాంటి సాంఘిక దురాచారం ఉన్నంత వరకూ ఏ గ్రామ స్వరాజ్యాలు ఏర్పడతాయి ? ఏ దేశం సుభిక్షం అవుతుంది ? అనిపిస్తుంది.   ఎమర్జెన్సీ ఒక పీడ కల.  ఆ పీడ కలని మర్చిపోతే మాత్రం ప్రజాస్వామ్యానికే పెద్ద దెబ్బ.   ఇదీ ఈ ఫైన్ బాలెన్స్.


...................................................................................................................................................................
Notes:

ఎమర్జెన్సీ :  1971 ఎన్నికల తరవాత, "గరీబీ హాటావో" అనే నినాదంతో ప్రజల్లోకి వెళ్ళి, బలమైన మెజారిటీ తో కాంగ్రెస్ గెలిచాక, బాంగ్లా విముక్తి యుద్ధానంతరం (1971) భారత విజయం తరవాత ప్రతిపక్ష నాయకుని చేత "దుర్గా మాత"  గా పిలవబడ్డాకా,   ఇందిరా గాంధీ  (ఇందిరే ఇండియా, ఇండియానే ఇందిర అనే భ్రమలో)   ప్రధాని గా దేశం మీద తన పట్టు ను మరింత బిగించేందుకు,   అప్పటికే రాజ్యాంగేతర శక్తి గా ఎదిగిన సంజయ్ గాంధీ కి మరింత అండ ని ఇచ్చేందుకు, ప్రధాన మంత్రి, ఆమె కోటరీ ఏకపక్షంగా, తీసుకున్న నిర్ణయాల పరిణామం.

25 జూన్ 1975 - 21 మార్చ్ 1977  దాకా ప్రధానికి సర్వోన్నతాధికారాలు కట్టబెట్టి,  సాధారణ ప్రజల జీవితాల్ని అల్ల కల్లోలం చేసిన సమయం.  ప్రభుత్వాన్ని ప్రశ్నించే ప్రతీ గొంతు నీ నొక్కి, వందలాదిగా ప్రత్యర్ధుల్ని జైళ్ళలో పెట్టి, పత్రికల్ని సెన్సార్ చేసి, పోలీసులకి అపరిమిత అధికారాలు కట్ట బెట్టి, జనాభా నియంత్రణ కోసం అంటూ  లక్షలాదిమందికి అమానవీయంగా, అశాస్త్రీయంగా  కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేసి,  ప్రజల హక్కుల్ని కాలరాసిన సమయం.   రోడ్డు మీద బిచ్చమెత్తుకునే అభాగ్యులని కూడా వొదలకుండా ట్రక్కుల్లో తీసుకుపోయి వెట్టి చాకిరీ చేయించడం,  బీదవాడి బ్రతుకుని దుర్భరం చేయడం,   ఇలా ప్రజా జీవితాన్ని అతలాకుతలం చేసిన సమయం.


No comments:

Post a Comment

వ్యాఖ్యానించినందుకు చాలా చాలా థాంక్స్.