పాండోరా అనగానే నగలని తల్చుకుని ఆనందించే అమ్మలు, అమ్మాయిలకి క్షమాపణలతో మొదలుపెడుతున్నాను.
ఈ కథ గ్రీక్ మైథాలజీ లోనిది. మా అమ్మాయి కథల పుస్తకం లో చదివి, నాకు చాలా నచ్చి, ఇక్కడ చెప్తున్నాను. (From : Rapunzel and other stories by Miles Kelly)
సృష్టి మొదలయిన కొత్తల్లో, ఇదంతా చాలా ఆనందకరమైన ప్రాంతం. వెలుతురూ, నవ్వులతో కళ కళ లాడేది ప్రపంచం అంతా. అసలు ఎవ్వరికీ బాధ, కోపం, దుఃఖం, ఈర్ష్యా, అసూయ ఇలాంటి పదాలే తెలీదు. అలాంటి భావన ఎలా వుంటుందో కూడా ఎవరికీ తెలీదు. ప్రతీ రోజూ సూర్యుడు ప్రకాశించేవాడు. దేవుళ్ళు / దేవతలు స్వర్గం నుండీ భూమ్మీదకి వచ్చి ఈ లోక వాసులతో కబుర్లూ కాకరకాయలూ చెప్తూ కలిసి మెలిసి వుండేవాళ్ళు.
ఒక సారి ఓ మధ్యాహ్నం పూట ఎపిమెథియస్ అనే ఓ మనిషీ, ఆయన భార్య పాండోరా, వాళ్ళింటి బయట పూతోట లో తోటపని చేసుకుంటూ ఉన్నప్పుడు, వాళ్ళు మెర్క్యురీ దేవత రావడం చూస్తారు. ఆ మెర్క్యురీ ఒక పెద్ద చెక్క భోషాణం పెట్టె ని భుజాన వేసుకుని నడుస్తున్నాడు. పెట్టె బరువుతో అతని నడుమొంగిపోయింది. పాండోరా వెంటనే పరిగెట్టి ఈ దేవత కి సేద తీర్చేందుకని ఒక డ్రింక్ తెచ్చివ్వడానికి ఇంట్లోకి వెళ్ళింది. ఎపీమెథెయస్ మెర్క్యురీ భుజాన్నించి ఆ బరువైన పెట్టెని కిందకు దించడానికి సాయం పడతాడు. ఆ పెట్టె బంగారు తాళ్ళతో గాట్టి గా కట్టేసి, దాన్నిండా విచిత్రమైన ఆకారాలు చెక్కి చాలా దృఢంగా వుంటుంది.
"మీరు నాకో సాయం చేస్తారా?!" అని అడుగుతాడు మెర్క్యురీ వీళ్ళని. "చాలా ఎండగా వుంది.. ఈ పెట్టె కూడా చాలా బరువుగా ఉంది. మీ దగ్గర ఈ పెట్టె ని కాస్త వదిలి వెళ్ళనా ? " అని ప్రాధేయపూర్వకంగా అడుగుతాడు మెర్క్యురీ ! "అయ్యో! తప్పకుండా !" - అని వీళ్ళు ఒప్పుకుంటారు. దేవుడూ, ఈ మనుషులూ కల్సి చెరో దిక్కునా పట్టి, ఆ పెట్టెను ఇంట్లోకి చేరేస్తారు. "దీన్ని ఎవ్వరూ తెరవకూడదు.. చూడకూడదు. ఈ పెట్టె ని జాగ్రత్త గా చూస్కోండి. ఎవ్వరూ, ఎట్టి పరిస్థితి లోనూ ఈ పెట్టె ను తెరవకూడదు. నేను తరవాత వచ్చి తీస్కెళ్ళే దాకా" - అని ఎంతో ఆత్రుత తో, ఎంతో ఇది గా చెప్తాడు మెర్క్యురీ.
దంపతులిద్దరూ.. "అదేంభాగ్యం.. ఎవ్వరూ తెరవరు లెండి " అని హామీ ఇచ్చి, దేవత కి వీడ్కోలిస్తారు. అయితే ఇలా మెర్క్యురీ వెళ్ళగానే, పాండోరా కి ఎవరో వీళ్ళ పేర్లు గుసగుస గా పిలుస్తున్నట్టు అనిపిస్తుంది. ఈవిడ చెప్పిన ఆ పిలుపుల సంగతి, మొదట, భర్త నమ్మడు. కొట్టి పారేస్తాడు. కానీ ఇద్దరూ మళ్ళీ చెవులు నిక్కించి ఆ శబ్దాల్ని వింటారు. మొదట కాసేపు పిట్టల కువ కువలే వినిపిస్తాయి. ఆ తరవాత కాసేపటికి ఎవరో తమ పేర్లను పిలుస్తున్నట్టు ఇద్దరికీ వినిపిస్తుంది. ఇది 'మన మితృల పిలుపే - నేను చూసొస్తాన'ని చెప్పి, భర్త ఇంటి బయటకు వెళ్తాడు. పాండోరా ఒక్కతే ఆ గదిలో వుంటుంది. భర్త బయటకు వెళ్ళగానేఅ ఆ పెట్టె లోంచీ "పాండోరా", "పాండోరా" అని దీనమైన పిలుపులు వినిపిస్తూంటాయి. అవి ఆ పెట్టె లోంచీ వస్తున్నట్టు ఈమె కు అర్ధం అవుతుంది.
పెట్టెకి చెవిని ఆనించి వింటుంది. "మమ్మల్ని రక్షించు పాండోరా.. మేము ఈ చీకటి పెట్టె లో బందీలం ! " అంటూ ఎవరో వేడుకోలుగా, చాలా దీనంగా, హీన స్వరంతో ప్రార్ధిస్తున్నట్టు ఆమెకు వినిపిస్తుంది. పాండోరా తుళ్ళి పడి - ఆశ్చర్యం తో, ఏమి చెయ్యాలో తోచక స్థంబించిపోతుంది. మెర్క్యురీ ఏమో - ఎట్టి పరిస్థితుల్లోనూ పెట్టె ను తెరవద్దని అన్నాడు. ఇక్కడ చూస్తే, పెట్టె లో ఎవరో ఉన్నారు. ఎలా ఏమి చెయ్యడం ఇప్పుడు ?
భయభ్రాంతురాలై - పెట్టె లో చిక్కుకుపోయిన ఎవర్నో రక్షిద్దామనే మంచి భావన తో, పాండోరా మొత్తానికి ఆ బంగారు తాళ్ళను బలవంతంగా విప్పి, పెట్టె ను తెరుస్తుంది. పెట్టె ను తెరవగానే తను చేసిన తప్పు తెలుసుకుంటుంది పాండోరా. ఆ పెట్టె నిండా "ఈ లోకం లోని చెడు" అంతా నిండి వుంటుంది. అవన్నీ వేలాది నల్లని తుమ్మెదల్లాంటి కీటకాల రూపంలో బిల బిల లాడుతూ ఉంటాయి. పెట్టె తెరవగానే అవన్నీ ఒక్క పెట్టున బయటికి ఎగురుతూ వస్తాయి. అవన్నీ ఈ లోకంలో మనుషుల్ని కుట్టి, బాధించి , బాధ, నొప్పి, చింత, నైరాశ్యం లాంటి "చెడు" ని అవి ఎటు వెళ్తే అటు వ్యాపింపచేయడానికి సిద్ధంగా వుంటాయి. అన్నీ పాండోరా చర్మాన్నంతా ఆక్రమించేసి, కుట్టి, హింసిస్తూ, ఆనందంగా తమ తమ రెక్కలు కొట్టుకుంటాయి. పాండోరా కి మొదటి సారిగా బాధ అనుభవం లోకి వస్తుంది. వెంటనే పెట్టె మూత ని మూసేస్తుంది ఆమె.
బయట ఉన్న ఎపీమెథెయస్ భార్య కేకలు విని పరిగెత్తుకుంటూ లోపలికి వస్తాడు. ఈ పురుగులు కిటికీ లోంచీ బైటికి వెళ్ళిపోయే ముందు అతన్ని కూడా కుట్టి బాధిస్తాయి. జరిగిన ఘోర తప్పిదాన్ని చూసి, ఎపీమెథియస్ భార్య మీద పట్ట రాని కోపం తో కేకలేస్తాడు. పాండోరా కూడా అతని మీద కేకలేస్తుంది. వీళ్ళిద్దరూ అలా దెబ్బలాడుకుంటూండే సరికీ, "నన్ను బైటికి రానివ్వండి" అని ఒక పెద్ద స్వరం వినిపిస్తుంది. ఆ స్వరం పెట్టె లోంచీ వస్తుంది.
"భయపడకండి! నన్ను బైటికి రానివ్వండి!! నేను మీకు సాయం చేస్తాను!" అంటుంది ఆ స్వరం. పాండోరా కళ్ళు పెద్దవి చేసి, భర్తని "ఏమి చేద్దాం?" అని అడుగుతుంది.
"ఇంకేమి చేస్తాం ? చేసిందంతా చేసేవు కదా .. వెళ్ళి పెట్టె తెరువు !" అని గొణుక్కుంటాడు ఎపీమెథియస్. పాండోరా ఎలాగో ధైర్యం చేసి, కళ్ళు గాట్టి గా మూసుకుని మెర్క్యురీ పెట్టె ను తెరుస్తుంది. ఆ నల్లని లోతైన పెట్టె అడుగు నుంచీ ఒక తెల్లని ప్రకాశవంతమైన సీతాకోక చిలుక బయటకి వస్తుంది. అది తన సున్నితమైన రెక్కల తో పాండోరా, ఎపీమెథియస్ ల గాయాల్ని స్పృశించి మాపుతుంది.
ఆ పెట్టె లోంచీ చెడు ని బయటకి రానిచ్చినందుకు, మెర్క్యురీ కి ఇచ్చిన మాట ని తప్పినందుకు బాధ తో బిక్క చచ్చిపోయిన పాండోరా, ఎపీమెథియస్ లు ఇద్దరూ ఆ సీతా కోక చిలుక ప్రేమాస్పద స్పర్శ కు కదిలిపోయి, వెక్కి వెక్కి ఏడుస్తారు. ఆ సీతాకోక చిలుక పేరు "ఆశ" ! (Hope) ఆశ కూడా వీళ్ళింట్లోంచీ కిటికీ గుండా బయటకి చెడు వెనకే, ఎగిరిపోతుంది. అదృష్టవశాతూ.. మనతోపాటూ మన లోకంలో ఆ ఆశ ఎప్పటికీ ఉండిపోయింది.
ఎంత బావుంది కదా కథ. ఎన్ని కష్టాలొచ్చినా, ఎంత బాధ కలిగినా మనని కలిపి ఉంచేది ఆశ మాత్రమే కదా. దాన్ని కాపాడుకున్నంత వరకూ, మనకు ఎటువంటి గాయాలు (మానసికమైనవి), బాధలూ బాధించవు. అదీ ఈ కథ చెప్పే నీతి.
* * *
Other Stories in this book are :
The Fairy Cow
Paddy Corcoran's Wife
The Three Wishes
The Mermaid of Zennor
Rapunzel
The Fairy Blackstick
Other Stories in this book are :
The Fairy Cow
Paddy Corcoran's Wife
The Three Wishes
The Mermaid of Zennor
Rapunzel
The Fairy Blackstick
కథ చాలా బావుంది... ఇంకా ఏమేమి కథలు ఉన్నాయో అవి కూడా చెప్పండి...
ReplyDeleteAdd చేసానండీ. Thank you.
DeletePandora's box గురించి వినడమే కానీ పూర్తి కథ ఇప్పటిదాకా చదవలేదు. పరిచయం చేసిన మీకు థాంక్స్!
ReplyDelete:)
DeletePandora's Box ఒక profound కథ. మాకు కాలేజ్ మొదటి సంవత్సరంలోపాఠంగా ఉండింది. మా ఇంగ్లీష్ మాస్టార్ చక్కగా బోధించడమే కాక Pandora's Box నానుడి ప్రయోగం కూడా ఇప్పటికీ గుర్తుండిపోయేలా బాగా వివరించారు మహానుభావుడు.
ReplyDeleteHow lucky you were andi.
Delete