Pages

22/04/2013

గాంధీ, మై ఫాదర్



గాంధీ గారు - మహాత్ములు. దేశానికి అహింస అనే అజేయమైన ఆయుధాన్ని కనిపెట్టిచ్చిన శాస్త్రవేత్త. 200 సంవత్సరాలు విడదీస్తూ పాలిస్తూ, దేశాన్ని చిధ్రం చేసిన విదేశీ పాలన నుండీ, పేదా గొప్పా, పండిత పామరులనూ, స్త్రీలనూ, పురుషులనూ, వీరూ వారూ అన్న తేడా లేకుండా ప్రభావితం చేసి, స్వాతంత్ర్య పొరాటానికే దిశానిర్దేశం చేసి, జీవితాంతం ప్రజలకు ఆదర్శం గా నిలుస్తూ, మహాత్ముడై, జాతికి పిత యై, ఏకతాటి మీద స్వాతంత్ర్య పోరాటాన్ని ముందుకు నడిపించి, దేశానికి స్వాతంత్ర్యాన్ని సాధించిపెట్టిన మహనీయుడు.


ఇప్పటికీ, దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 65 ఏళ్ళు గడిచిపోయినా  "గాంధీ" నామం కాంగ్రెస్ కు ఆయువు పట్టు.  గాంధీ టోపీ అన్నా హజారేలకూ, అరవింద్ కేజ్రీవాల్ లకూ బ్రాండ్ ఎంబాసిడర్.  గాంధీ ఎవరో ప్రపంచం అంతా ఎరుగుదురు. ఓ నెల్సన్ మండేలా నూ, మార్టిన్ లూథర్ కింగ్ నూ ప్రభావితం చేయగల మహోన్నత వ్యక్తిత్వం గాంధీది. "గాంధీ గిరీ" సినిమాలకే కాదు ఇతరత్రా ప్రజాభిమానానికీ పనికి వచ్చే దివ్య సాధనం. కానీ ఆయన వ్యక్తిగత జీవితం ? అయోమయం. గాంధీ జీవితం  అంతా అతని ఆదర్శ పోరాటానికి రాలిన సమిధ.  గాంధీ కొడుకు హరిలాల్ మోహందాస్ కరం చంద్ గాంధీ కధ ఈ 'గాంధీ మై ఫాదర్ '.

ఈ సినిమా నా ఫేవరెట్ ఆక్టర్ 'అక్షయ్ ఖన్నా  సినీ జీవితం లో కలికి తురాయి అని చెప్పొచ్చు.  అక్షయ్ ఖన్నా గాంధీ ఓడిపోయిన కుమారుడు హరిలాల్ గా అత్భుతంగా నటించాడిందులో.  ఫిరోజ్ అబ్బాస్ ఖాన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ని నిర్మించింది బాలీవుడ్ హీరో అనిల్ కపూర్. దీన్ని కూడా అనిల్ కపూర్'s బెస్ట్ అని చెప్పొచ్చు.

చలిలో ఆస్థ్మాతో దీనాతి దీనంగా చనిపోతూ ఉన్న ఓ బిచ్చగాడిని ముంబాయి లో ప్రభుత్వాస్పత్రి వాళ్ళు తీస్కెళ్తారు. ఎవరు నువ్వు అని వాళ్ళు అడిగినపుడు నేను 'బాపూ కొడుకుని !' అని చెప్తాడు హరిలాల్. 'బాపూ ' పేరేంటి అంటే "మోహన్ దాస్ కరం చంద్ గాంధీ" ! అని అస్పస్ఠం గ చెప్తూంటాడు.  నిజానికి ఆ బిచ్చగాడు మహాత్మా గాంధీ మొదటి కొడుకు హరిలాల్ మోహన్ దాస్ కరం చంద్ గాంధీ. జీవితం లో అన్నీ కోల్పోయి, అనీ ఓడిపోయిన వ్యక్తి.  జీవితపు చరమాంకలో ఉన్న అతనికి గుర్తు వస్తున్నట్టు గా ఈ మొత్తం సినిమా అంతా, అతని కౌమార దశ నుండీ మృత్యువు దాగా, గాంధీ కధ అంతా తెర ముదు ప్రత్యక్షం అవుతుంది

మోహన్ దాస్ కరం చంద్ గాంధీ - సౌత్ ఆఫ్రికా లో 'టాల్స్టాయ్ ఫార్మ్' రోజుల్నించీ  కధ మొదలవుతుంది.  పెద్దబ్బాయి హరిలాల్ (హరిలాల్, మనిలాల్, రాం దాస్, దేవదాస్ అనే నలుగురు కొడుకులు)  తన అడుగుజాడల్లో నడవాలని తండ్రి గా గాంధీ కోరుకుంటాడు. అదే అతని జీవితం లో చేసిన పెద్ద తప్పు. కొడుకు ఆశయాలకూ, అభిమతానికీ విరుద్ధంగా తనతో పాటూ జాతీయోద్యమం దిశగా కొడుకు నడవాలని, బారిస్టరు గాంధీ కోరుకుంటూంటాడు. హరిలాల్ చదువు మాతృభాషలో సాగాలని, సౌత్ ఆఫ్రికానుండీ, మెట్రిక్ చదివేందుకు రాజ్ కోట్ పంపేస్తాడు.  అక్కడ గులాబ్  అనే అమ్మాయినే హరిలాల్ కాబోయే భార్య గా కూడా నిర్ణయిస్తారు. కానీ హరిలాల్ చదువు ఆయా కారణాల వల్ల చెడుతుంది. సౌత్ ఆఫ్రికా కీ, ఇండియాకీ మధ్య దాదాపూ ఊగిసలాడుతున్న అతని చదువు, విసిగిపోయి, అతను గులాబ్ ను పెళ్ళి చేసుకోవాలని నిర్ణయించుకోవడం, తిరిగి తండ్రి పిలుపు పై గులాబ్ ను వొదిలి, సౌత్ ఆఫ్రికా రావడం జరుగుతుంది.   

హరిలాల్ నిజానికి చిన్నప్పటినించీ తండ్రిలా ఇంగ్లండ్ వెళ్ళి పెద్ద చదువులు చదివి బారిస్టర్ అవ్వాలని కలలు కంటూంటాడు. వీట్ని గురించి తెలిసినా గాంధీ ఒక రకమైన మొండితనంతో హరిలాల్ తన తో పాటూ దేశం కోసం పని చెయ్యాలని కోరుకుంటాడు. ఇది ఎంత తప్పుడు నిర్ణయమో అతనికి తెలియదు.

సౌత్ ఆఫ్రికా లో గాంధీ అపార్థీడ్ (వర్ణ వివక్ష ) కు గురి అవుతూ ఉన్న సమయం. బారిస్టర్ అయి వుండి, ఫస్ట్ క్లాస్ టికట్ ఉన్నా కూడా రైల్ లోంచీ నెట్టివేయబడతాడు. ఫుట్ పాత్ మీద అందరు తెల్ల వారితో సమానంగా నడిచినందుకు 'కూలీ ' అంటూ గద్దింపబడతాడు. అతనితో ఉన్న భారతీయులందరూ, మెల్లగా స్వతంత్ర్య భావనలతో ఉత్తేజితులవుతున్నారు. అపుడే వీళ్ళు ఆయా ప్రాంతాలలోకి వెళ్ళాలంటే వీళ్ళకు పాస్ లు ఉండాలంటూ కొత్త చట్టం తీసుకొస్తారు తెల్ల దొరలు. భారతీయులంతా తమ తమ పాస్ లను తగలబెడతారు. ఆ ఉద్యమం ఊపందుకుంటున్న నేపధ్యంలో హరిలాల్ తండ్రికి చేదోడు వాదోడుగా నిలుస్తాడు. జైలుకు వెళ్తాడు.

సహజంగా మొహమాటస్థుడూ, మిత భాషీ అయిన హరిలాల్ కు తండ్రి కన్నా తల్లి దగ్గరే చనువెక్కువ. తండ్రిగా గాంధీ చాలా క్రమశిక్షణ ని పాటిస్తూ, పిల్లల్ని తననుకున్న పద్ధతుల్లోనే పెంచుతూంటాడు.  భార్య కస్తూర్బా కూడా ఎన్నో త్యాగాలు చేస్తూ,భర్త అడుగుజాడల్లో నడుస్తూ, గాంధీ మార్గాన్ని సులభతరం చేసింది.   కాబట్టి తండ్రి దగ్గర చెప్పుకోలేని తన ఆకాంక్షల్ని తల్లితో పంచుకుంటాడు హరిలాల్. ఇద్దరూ ఎంత ప్రయత్నం చేసినా, మోహన్ దాస్ మనసు మార్చలేకపోతారు.  ఈలోగా ఊపందుకున్న పోరాటంలోకి హరిలాల్ కూడా యువకుడు కావడం వల్ల ఉత్సాహంగా దూకుతాడు. కానీ అతనికి తెలుసు - తన లక్ష్యం బారిస్టరు కావడం.

హరిలాల్ భార్యని వొదిలి తండ్రి తననైమైనా బారిస్టరీ చదివిస్తాడేమో అనే ఆశతోనె సౌత్ ఆఫ్రికా వస్తాడు. అక్కడ పుస్తకం లో దాచుకున్నముగ్ధ లా వున్న అతని భార్య ఫోటోని చూసి, గాంధీ సెక్రటరీ, వెంటనే గాంధీ గదిలోకి వెళ్ళి : "మిస్టర్ గాంధీ - ఈ ఫోటో చూడండి ? వీళ్ళిద్దర్నీ విడదీయడానికి మీకు మనసెలా వొప్పింది?" అని అడుగుతుంది చనువుగా. వెంటనే గులాబ్ (భూమికా చావ్లా) ని సౌత్ ఆఫ్రికా పిలిపిస్తారు. కానీ కొన్నాళ్ళ సంసార జీవనం తరవాత, హరిలాల్ జైలుకి వెళ్ళాక, గులాబ్ నీ, పిల్లల్నీ (హరిలాల్ ఆదర్శ జాతీయోద్యమ జీవితానికి అడ్డురాకుండా వుండేందుకని) తిరిగి ఓడ లో ఇండియా కి పంపేస్తాడు మోహందాస్ గాంధీ.

గాంధీ కుమారుడిగా హరిలాల్ కు ఒక సంపన్న గుజరాతీ 'బారిస్టరీ ' చదవడానికిచ్చిన స్కాలర్ షిప్ ను తమకు తెలిసిన 'సొరాబ్జీ' ల అబ్బాయి కి మళ్ళిస్తాడు తండ్రి. ఇలా రెండు సార్లు చేతి దాకా వచ్చిన అవకాశాన్ని తండ్రి తిప్పికొట్టడం చూసిన హరిలాల్ చాలా హతాశుడైపోతాడు.  

ఇవన్నీ (తన నిర్ణయాలకూ, తన ఇస్టాయిస్టాలకూ సంబంధం లేకుండా) అన్నీ తానై తనకి వ్యతిరేకంగా ఉన్నందుకు తండ్రిని అసహ్యించుకునే పరిస్థితికి హరిలాల్ దిగజారుతాడు. ఇక్కడ ఆయా నటుల నటనా, మోహన్ దాస్ గాంధీ గా చేసిన జరీలాల్ నటనా చాల బావుంటాయి.  ఆ ద్వేషం హద్దులు దాటి, తండ్రినీ, అతని ఆదర్శాల్నీ ధిక్కరించి ఇండియా వచ్చేస్తాడు హరిలాల్. అప్పటికీ తండ్రిని ఎదిరించలేక, మారువేషం తో డర్బన్ లో ఓడ ఎక్కేందుకు ప్రయత్నిస్తుండగా పట్టుబడి ఇల్లు చేరతాడు. ఆ తరవాత తండ్రీ కొడుకుల మధ్య చినుకులా మొదలైన వాగ్వివాదం ముదిరి, తండ్రి ని తనని రాజ్ కోట్ పంపించేయమని బ్రతిమలాడి ఇండియా వచ్చేస్తాడు హరిలాల్.  ఇక్కడ తండ్రి గా గాంధీ తన తప్పిదాన్ని గుర్తించినా,  ఆదర్శాల కోసం దాన్ని సరిదిద్దలేక, అర్ధం చేసుకోని కొడుకు బాధనీ అర్ధం చేసుకుంటాడు. అక్కడితో ఒక అధ్యాయం ముగుస్తుంది.

రాజ్ కోట్ లో భార్యా, నలుగురు పిల్లతో, అద్దె ఇంట్లో హరిలాల్ ఇబ్బందులు పడుతూ, అటకెక్కిన చదువుని గాడిలో పెట్టే ప్రయ్తంతం చేస్తూంటాడు. మెట్రిక్ మూడు సార్లు తప్పుతాడు. ఈలోగా లోకమాన్య తిలక్ తదితరుల ఆహ్వానం పై గాంధీ భారత్ తిరిగి వస్తాడు. తల్లి తండ్రుల ని కలుసుకుని, వారి ప్రధమపర్యటన పర్యాంతం, కుమారుడిగా తన బాధ్యత గా తోడుంటాడు హరిలాల్. అప్పటికే గాంధీ పేరు భారత దేశం అంతటా మహాత్ముని పేరు మారుమోగుతూంది. కొత్తగా దిగివచ్చిన దేవత లాంటి భావన, ప్రజలందర్లోనూ, తీవ్రమైన ఎక్స్పెక్టేషన్ ! సౌత్ ఆఫ్రికా లో గాంధీ చేసిన పోరాటం, అంత పెద్ద బారిస్టరూ, దేశ పురవీధుల్లో సామాన్యుడిలా పర్యటించడం, ప్రజల్ని విపరీతంగా ఆకట్టుకుంటాయి.  గాంధీ కొడుకుగా హరిలాల్ పతనం కూడా పూర్తి స్థాయికి చేరుకుంటూంటుంది.

హరిలాల్, ఉద్యోగం కోసమో, ఆర్ధిక సహాయం కోసమో తండ్రిని చేసిన అభ్యర్ధనలు నిరాకరించబడతాయి. గాంధీ పేరు, అతనికి ఏ విధం గానూ సహాయపడదు. నలుగురు పిల్లలూ, నిరుద్యోగం, జీవితం లో అపజయం, హరిలాల్ ని కుంగదీస్తాయి. తండ్రి అంటే ద్వేషం పతాక స్థాయికి చేరుకుంటుంది. కొందరు మోసగాళ్ళు గాంధీ పేరును ఉపయోగించుకునేందుకు హరిలాల్ ను వాళ్ళ మిధ్యా వ్యాపారాల్లోకి లాగి, అతన్ని అధో పాతాళానికి చేరుస్తారు. తాగుడు కు బానిస అవుతాడు. అప్పుల వాళ్ళ బెదిరింపులు ఎక్కువవుతాయి. అలాంటి తండ్రికి పుట్టిన కొడుకువా అని నిందలూ మొదలవుతాయి. తండ్రి పేరు కున్న పెద్ద నీడ లో గాంధీ అసమర్ధ కొడుకుగా తనకున్న పేరుతోనూ, అవస్థలు పడుతూ, హరిలాల్ మానసిక, ఎమోషనల్ చిత్రవధ ని అనుభవిస్తాడు. పోషించుకోవడానికి హరిలాల్ భార్య, పిల్లని తీసుకుని కన్నవారింటికి చేరుతుంది.  అక్కడే హరిలాల్ కొడుకు మరణిస్తాడు. ఆ వార్త విని మామ గారింటికి చేరిన హరిలాల్ కి భార్య మృత్యు వార్త కూడా ఎదురయి, నిలువునా దుఃఖ సాగరంలో మునిగిపోతాడు.   హరిలాల్ లో ఉన్న విచక్షణ అంతా అంతరించుకుపోయి మనిషి పూర్తిగా మారిపోతాడు.


ప్రశాంతత కోసం ఇస్లాం స్వీకరిస్తాడు. ఆతరవాత వేశ్యా వాటికల కి వెళ్తాడు, అప్పుల వాళ్ళని తప్పించుకుని తిరుగుతూంటాడు.  వ్యక్తిగా దిగజారుతూంటాడు.  తల్లి కస్తూర్బా వచ్చి అతని పరిస్థితి చూసి బాధపడితే, ఆమె కోసం మళ్ళీ బ్రహ్మ సమాజం లో చేరి, హిందువు గా మారతాడు.  అయితే, జీవితంలో ఓటమి, అతని స్థాయిని దిగజార్చి తాగుడుకు బానిస గా చేస్తుంది.  తండ్రి అంటే ఎలానూ ప్రేమ లేదు. తల్లిని  మాత్రం కలవడానికి అదీ కొద్ది నిముషాలు మాత్రమే ! ప్రయత్నిస్తాడు. ఎక్కడన్నా తల్లీ తండ్రీ, ఏ గృహనిర్బంధం లో ఉన్నపుడో, దేశంలో ఎక్కడికైనా రైల్లో ప్రయాణం చేస్తున్నపుడో తారసపడుతుంటాడు. దాదాపు బిచ్చగాడిలా, జేబులో కాణీ లేక, ఒక్క క్షణం ప్రత్యక్షమై, తల్లిని పరామర్శించి మళ్ళీ అదృశ్యం అవుతుంటాడు. గాంధీ, ఎంతో సాదరంగా కొడుకుని ఇంటికి ఆహ్వానిస్తూనే వుంటాడు. అయినా, తండ్రి కళ్ళలోకి చూడ్డానికి కూడా హరిలాల్ ఇష్టపడడు.


చివరి క్షణాల్లో కస్తూర్ బా, హరిలాల్ ని గురించి తలుచుకుని బాధపడుతూనే కన్ను మూస్తుంది.   భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చినపుడు ఎవరో రోడ్డు పక్కన దీనాతిదీన స్తితి లో బిచ్చగాడిలా పడున్న హరిలాల్ చేతిలో లడ్డూ పెడతారు. అప్పటికే హరిలాల్ మానసిక సంతులితను కోల్పోయి వుంటాడు. స్వాతంత్ర్యం వచ్చినన్న స్పృహ లేనే లేదు.  గాంధీ కూడా చనిపోయే ముందు రోజు తన సెక్రటరీ ని హరిలాల్ ని ఇపుడు వెతకగలమా ? అతన్ని చూడాలనుంది అని అడుగుతాడు. కానీ హరిలాల్ ని వెతకడం ఎంత కష్టమో తెలిసి నిస్సహాయంగా ఫీల్ అవుతాడు. 

గాంధీ హత్య జరిగినపుడు హరి ఒక చిన్న హోటల్లో ఏదో తినడానికి వెళ్తాడు.  రేడియోలో గాంధీ మరణ వార్త విని సొంత తండ్రి పొయైనట్టే (బాపూ ) అంటూ బాధపడుతూ హరిలాల్ చేతిలో ఏదో తినడానికి పెట్టి, డబ్బులు తీసుకోకుండా కొట్టు మూసేస్తాడా హోటెలు యజమాని. అప్పుడూ, ఆ వార్త రిజిస్టర్ అయినట్టుండదు హరిలాల్ కి. 

అయితే పతనం లోకి జారిపోతున్న హరిలాల్, రోడ్డు పక్కన బిచ్చమెత్తుకునే బీద స్థితిలోకి వెళిపోతాడు. చలిలో, వర్షంలో రోడ్డు మీదే నివాసం. శ్వాస్ కోశ వ్యాధికి గురవుతాడు.  ఆ రోజున తండ్రినీ, తన జీవితాన్నీ తలుచుకుంటూ కళ్ళు మూసిన ఆబిచ్చగాడు   -  ఆ హరిలాల్ - ఆఖరి శ్వాస తీసుకున్నాకా, అతని జేబు లో దొరికిన ఫామిలీ ఫోటోలూ, వగైరాల ద్వారా అతనే హరిలాల్ అని అందరికీ తెలుస్తుంది. అలా.. మహాత్మా గాంధీ కొడుకు అత్యంత దీనమైన పరిస్థితి లో కన్ను మూస్తాడు.

గాంధీ జీవితంలో ఈ చీకటి కోణం,అపారమైన పుత్ర శోకం, చాలా మందికి తెలీదు. ఈ నిజ జీవిత కధను అత్యంత హృద్యంగా తెరకెక్కించిన దర్శకుడికి చాలా పేరు వచ్చింది.  చాలా జాగ్రత్తగా ఎన్నుకున్న తారాగణం, చారిత్రక చిత్రం కాబట్టి నిజాల్ని నిజాలుగానే వుంచుతూ, కల్పనల్ని పక్కన పెట్టి, చక్కగా తీసిన ఈ చిత్రం, ఓ అత్భుతం. యూ ట్యూబ్ లో పూర్తి సినిమా వుంది. గుజరాతీ సాంప్రదాయాన్ని ప్రతిబింబించే పాట ఒకటి చాలా బావుంటుంది. మంచి సినిమా ఈ "గాంధీ, మై ఫాదర్".








13 comments:

  1. ఇదంతా నిజమా. పాపం గాంధీ :(

    ReplyDelete
  2. సుజాత గారు, ఈ సినిమా నేను కూడా చూసానండి. మీ రివ్యు చాలా బాగుంది.
    అక్షయ్ ఖన్నా మనకున్న కొద్దిమంది మంచి నటులలో ఒకాడు. ఈ సినిమాలో పాత్రకి పూర్తి న్యాయం చేసాడు. కాని ఈ సినిమా చూసినప్పుడు,ఇది కల్పిత కథేమో అని చాలా సార్లు అనుకున్నాక, కాదు ఇది చాలా వరకు వాస్తవమేనని పలుమంది నాకు చెప్పారు. మీ రివ్యు చదివి మళ్ళీ ఒకసారి ఈ సినిమా కళ్ళ ముందు తిరిగింది.

    ReplyDelete
  3. ఎంత చక్కగా రాసారండి. తప్పకుండా చూస్తాను. చాలా ఏళ్ల క్రితం హిందూలోనో, మరో పేపర్ లోనో గాంధీ కుమారుడి ఇంటర్వ్యూ వేసారు..చాలా రొజులు దాచుకున్నా కూడా అది..ఎక్కాడో ఉండాలి.. అది మరి నలుగురిలో ఏ కుమారిడిదో! ఇతను కాకపోవచ్చు..

    ReplyDelete
  4. పిల్లల అభిరుచులు పట్టించుకోకపోతే ఏమవుతుందో ఒక గొప్ప అనుభవం. గాంధీ గారు ఆదర్శవాది కావచ్చు, కన్న పిల్లలని వారి కాళ్ళపై నిలబెట్టే అవసరాన్ని విస్మరించిన తండ్రి.నాకు సినిమాలకి సగమెరిక, మంచి రివ్యూ.

    ReplyDelete
  5. చక్కగా రాసారండి.రివ్యు చాలా బాగుంది.

    ReplyDelete
  6. చాలా బాగా రాశారు కదిలించింది ... ఈ దేశం గురించి చాలా ప్రాక్టికల్గా ఆలోచించిన మహాత్ముడు తన సొంత కుమారుడి గురించి ప్రాక్టికల్గా ఆలోచించలేక పోవడం బాధాకరం

    ReplyDelete
  7. జలతారు వెన్నెల గారు

    అవునండీ. చాలా బాధ, ఆశ్చర్యం కలిగేయి సినిమా చూస్తే. భూమికా చావ్లా (గులాబ్) మరణం తరవాత అక్షయ్ నటన చూసి, ఒక లాంటి స్టన్నింగ్ ఫీలింగ్ కలిగింది. చాలా టచింగ్.

    ReplyDelete
  8. తృష గారు


    ధన్యవాదాలండీ. చాలా రోజుల క్రితం చూసానండీ. ఇక్కడ పాటలన్నా ఎంబెడ్ చేద్దామంటే ఎందుకనో కావట్లేదు. మీరు పాటలు చూడండి యూట్యూబ్ లో. మీకు చాలా నచ్చుతాయి.

    ReplyDelete
  9. కష్టెఫలె గారు

    అవును. పాపం గాంధీ అనిపించక మానదు.

    ReplyDelete
  10. సునీత గారు

    థాంక్స్ అండీ.

    ReplyDelete
  11. మురళి గారు

    అవునండీ. కానీ గాంధీ కి హరిలాల్ దౌర్బల్యం అర్ధం అయేసరికీ పరిస్థితి చెయ్యి దాటిపోతుంది. పిల్లల వ్యక్తిత్వాన్ని గౌరవించక పోతే, వాళ్ళకీ, తలిదండ్రులకూ ఎంత దూరం పెరిగిపోతుందో చూస్తే ఆందోళన కలుగుతుంది.

    ReplyDelete
  12. హరిలాల్ గాంధి గురించి కొంచెం విన్నా గానీ ఇంత వివరంగా తెలీదు. మంచి సినిమా గురించి వివరంగా పరిచయం చేసారండీ.. థాంక్స్..

    ReplyDelete

వ్యాఖ్యానించినందుకు చాలా చాలా థాంక్స్.