Pages

24/08/2012

The Insider (లోపలి మనిషి) - పి.వి. నరసింహారావు





ఈ మధ్య నేనో తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాను.  అది పూర్తిగా చేతనకి సంబంధించినది. మిగిల్న జీవితం సాధారణ ఒరవడి తో సాగుతున్నప్పటికీ, చేతన స్తంభించి, నిరాశ తో కూడిన స్తబ్దత చాలా కాలం పాటూ కొనసాగింది.  ఈ లోగా ఎన్నో పుస్తకాలు సగం వరకూ చదివి ముందుకు కదలనివీ, ఒక చాప్టర్ తరవాత ఉత్సుకతని రగిలించనివీ.. అన్నిట్నీ ఒక చోట చేర్చి, లైబ్రరీ కి వాపసు ఇవ్వడం కూడా జరిగింది.

చాలా రోజుల వరకూ ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడలేకపొయాను. ఏ పుస్తకమూ పట్టుకోలేదు, కొత్తది అనగా కొంచెం తోటపని, పూల పెంపకం మాత్రమే చేసాను.  ఎప్పుడో చిన్న రెమ్మ లాంటి అంటు తీస్కొచ్చి నాటిన రాధా మాధవీ పూల తీగ ఈ మధ్యనే ఎర్రని పూల గుత్తుల్ని వాల్చి గుప్పుమని పరిమళాల్ని విరజిమ్మింది.  ఎవరో ఆ పూలను గుత్తుల వాటం గా దొంగిలించారు కూడానూ. 

ఇంత నిరాసక్తత లో కాస్త ఉద్రిక్తత ని కలిగించి,  'గాడ్ ఫాదర్' లాంటి సినిమా కి ఎంత మాత్రం తగ్గనంత కట్టుదిట్టమైన కధనం తో, టెన్షన్ ని రగిలించిన రాజకీయ రచన ని అదీ, దేశం ఆరాధించే, మేధావి, పీ.వీ. నరసింహారావు రాసినదీ 'ద ఇన్సైడర్ ' (మాతృక ని 6 ఏళ్ళ క్రితం సగం చదివి, ఆ గాఢత ని తట్టుకోలేక వదిలేసిన తరవాత,  వయసు తో పాటూ వచ్చిన కొంచెం పరిపక్వత,  పుస్తకాన్ని చదవడం ముగించెయాల్సిందే అని తొందరపెడుతుండగా) ఈ వారమే చదివాను.  పడుతూ లేస్తూ,  మధ్యలో తప్పని సరిగా వచ్చే అంతరాయాల్ని కాచుకుంటూ,  ఏకబిగిన చదవడానికి వారం రోజులు పట్టింది.

ఇన్నాళ్ళుగా మనసులో పేరుకుపోయిన రక రకాల అనాసక్తుల పాచి వొదిలించుకుని,  ఒక నిబద్ధుడైన రాజకీయ వేత్త, మన అత్భుత ప్రజాస్వామ్య వ్యవస్థా, మన దేశ పరిణామం లో ప్రజా వాహిని లో ఒక చిన్ని బిందువుల మైన మన ఔన్న్నత్యం, ప్రాముఖ్యతా,  ముఖ్యంగా మన నాయకుల విజన్ (దూరదృష్టి ?)  వీటిని అర్ధం చేసుకున్నప్పుడు,  ఒక లాంటి శక్తి తాకిడి జరిగినట్టయింది.

కుళ్ళిపోయిన రాజకీయ వ్యవస్థ.. మనల్ని కండిషన్ చేసే ప్రచార మాధ్యమాలూ -  అందరమూ ఎరిగిన సత్యమే !  ప్రచార సాధనాల ప్రాబల్యం కేవలం పత్రికలకే పరిమితం అయిన ఆ రోజుల్లో కూడా పాత్రికేయులే సృష్టించిన రాజకీయ నాయకుల మర్మాలు బోధపడిన కొద్దీ, ఆశ్చర్యం కలుగుతుంది.  అన్నీ మనకి తెలిసినవే... కొన్ని ఊహకందనివి.   ఒక రాజకీయ నాయకుడూ, ఒక ప్రజా పతినిధీ, ఒక సివిల్ సర్వెంటూ.. ఇలా అధికారమూ, అలక్ష్యమూ, అవినీతీ అన్నీ బాలెన్సుల్లో  పంచుకుంటూ పోతాడు రచయిత. తూకం న్యాయం వైపుకా, అన్యాయం వైపుకా ? తేల్చాల్సింది, అంతిమంగా ప్రజలే !

ప్రధాన మంత్రి గా ఎదిగే వరకూ, పీ.వీ. ప్రస్థానం ఈ 'లోపలి మనిషి ' చాలా విస్తారంగా ప్రస్తావిస్తాడు. ప్రధాని అయ్యాకా, ఈ బహు భాషా కోవిదుడూ, ఎందరో కలం స్నేహితులకు అక్షరాలా చేత్తో ఉత్తరాలు రాస్తూ వొచ్చిన మంచి తాతయ్యా.. బొత్తిగా నిష్క్రియా ప్రియత్వం కలిగిన ప్రధాని గా పత్రిక ల చేత వల్లించబడ్డాడు.   కానీ పీ.వీ. దార్శనికత, ఈ దేశానికి చాలా ఉపయోగపడింది.   కాస్త లో కాస్తయినా ఉరకలు వేసే కొత్త తరం తాలూకూ ప్రాధామ్యాలను,  అపారమైన రాజకీయ అనుభవంతో నిదానంగా, చెక్కుకుంటూ పోయాడు. వీటి వెనుక తన పేరు మార్మోగాలని గానీ,  మరేదో గానీ సీక్రెట్ ఎజెండా వుండాలని ఆయన కోరుకోనే లేదు.

ఈ ఇన్సైడర్ లో హీరో ఆనంద్ కు కూడా సరిగ్గా అలాంటి లక్షణాలే ఆపాదించాడు. బిజినెస్ ఈస్ బిజినెస్స్.  చెప్పిన పని నిబద్ధత తో (కాస్త సమయస్పూర్థి కూడా కలిపి) చేస్తూ పోవడమే ఆనంద్ కర్తవ్యం. వ్యవస్థ లో  వంద లోపాలుండనీ, సన్నిహితులే తనను వెన్నుపోటు పొడవనీ, ఎన్నలేనన్ని అపవాదులు తన ని నీడలా వెంటాడనీ,  కొన్ని అసాధ్యమనిపించె పనులు చేయడానికి ఆనంద్ మాత్రమే సరిపోయే నాయకుడిగా ఇందిరాగాంధీ  నిర్ణయానికి రావగలగడానికి ఈ సమర్ధతే కారణం అవుతుంది.    పుస్తకమైతే ఒక రోలర్ కోస్టర్ రైడ్.  ఉథాన పతనాలూ, ఎవరెస్టు అధిరోహణలూ ఒకదాని వెమ్మట ఒకటి,  జరిగిపోతుంటే,  ఆనంద్.. తన 'తామరాకు మీద నీటి బొట్టు' వ్యక్తిత్వం మాత్రం వొదులుకోకుండా,  ఒక ముని లాగా తన కర్తవ్య నిర్వహణ చేస్తూ సాగుతాడు.

ఏది ఏమైనప్పటికీ, అధికార దాహం  రాజకీయ నాయకుల చేత ఎన్నెన్ని  చెత్త పన్లు చేయిస్తుందో,  దానికి నాలుగో ఎస్టేటు ఎంత కొమ్ము కాస్తుందో,  లాబీ లలో నడిచే లాబీయింగూ,  నమ్మకస్తుడైన పత్రికా ప్రతినిధి  చేసే పరువు తక్కువ ప్రచురణలూ,   షాక్ నే కలిగిస్తాయి.

ఉదాహరణకి,  ఒక సాధారణ పాఠకుడికి పత్రిక ల్లో జరిగే దుష్ప్రచారాన్ని  విశ్లేషించుకునేంత సమయం, వివేకమూ ఉండకపోవచ్చు.   పత్రికలు మనల్ని ఉద్వేగపరిస్తే, మనమూ వెర్రి ఉద్వేగానికి గురవుతూంటాం. అలాంటిది ఈ పత్రికలే, కింగ్ మెకర్లు గా మారడం ఎంత సులువో చూడండి.  ఇప్పుడైతే, అందరు ప్రముఖులూ ఒక్కో వార్తా చానెల్ ను ఏర్పాటు చేసుకుని తమ తమ అనుకూల ప్రచార మాధ్యమం గా మార్చుకుంటున్నారు గానీ,  ఒక ఇరవై సంవత్సరాల క్రితం చూసుకుంటే,  ప్రజాభిప్రాయాన్ని  పత్రికలు ఎంతగా ప్రభావితం చేసేవో తల్చుకుంటే,  పాత్రికేయుల్ని కొనేసే ఆనాటి రాజకీయ 'చెద' రంగం అర్ధం అవుతుంది.

పాత్రికేయుల అతి ఉత్సాహానికి మన జమానా లో ఒక పెద్ద ఉదాహరణ కసబ్.  Kasab  ఏ పార్టీ అధికారానికీ నిప్పు పెట్టలేకపోవచ్చు.  భాతీయ దౌత్య వర్గాలు, కసబ్ ని ఒక 'టికెట్' గా దాచుకుంటున్నాయి. అతగాణ్ణి ఉరేయడం ఎంత సేపు ? కానీ భారతీయ న్యాయ శాస్త్ర, విదేశాంగ పాలసీ ల నిజాయితీ, నిబద్ధతకో దర్పణంలా,  ఇంకా ముఖ్యంగా 26/11 తీవ్రవాద దాడి లో మిగిల్న పెద్ద పాత్రధారులని చేరడానికి మన దర్యాప్తు సంస్థలకు, కసబ్ ప్రాణాలతో జీవించి ఉండడం అత్యంత అవసరం. ఈ విషయాన్ని సాధారణ పాఠకునికి సర్ది చెప్పకుండా, కసబ్ ని భారత ప్రభుత్వం కోట్లాది రూపాయల ఖర్చుతో మేపుతున్నట్టూ, (అతను రోజూ బిరియానీ తింటున్నట్టూ), అతన్ని ఉంచడానికి వాడే బులెట్ ప్రూఫ్ / బాంబ్ ప్రూఫ్ సెల్ల్ ఎన్నికోట్లతో కట్టిందీ, అతన్ని కాపలా కాయడానికి ఇండో టిబెటన్ బోర్డర్ పోలీసులకు ఎంత బిల్లు చెల్లిస్తుందీ ఒక పట్టిక తో సహా గ్రాఫిక్స్ జోడించి పత్రికల్లో వాత్రా కధనం ప్రచురిస్తూ,  వార్తా చానెళ్ళలో కసబ్ ని చంపమని ఉద్వేగ పూరిత వ్యర్ధ చర్చలూ చేస్తూ, మనల్ని ఈ వార్తా మాధ్యమాలు ఎలా కండిషన్ చేస్తున్నాయో- ఈ తరానికి చెప్పనక్కర్లేదు.


అయితే, కేవలం సెన్సేషన్ ని సృష్టించడం కోసం నాయకులు ప్రవర్తించరు. వాళ్ళ మీద ఇలాంటి సెన్సేషనల్ వార్తా కధనాలు ఎంత ఒత్తిడి కలిగిస్తాయో,  ఒత్తిడి ని మీరుతూ నాయకుడన్న వాడు వివేకం తో ఎలా నడుచుకోవాలో  పీ.వీ. ని (ఆనంద్ ని) చూస్తే తెలుస్తుంది.

కధా గమనం లో స్వాతంత్ర్యానంతరం వానపాముల మూకల్ని దాటుకుని  కేవలం 'ఆడది కదా'  అన్న నీరస ధోరణినీ, నిరాదరణ నీ,   శక్తివంతంగా ఎదుర్కొన్న నిరంకుశ నాయకురాలు ఇందిర గురించీ, ఆనంద్ అత్యంత నాటకీయంగా, భూ సంస్కరణల చట్టాన్ని  (Land Ceiling)  శాశన సభ లో ఆమోదింపచేయడం గురించీ ఉత్కంఠ భరితంగా చదివాక,  'అధికారం' అనే వింత వస్తువ గొప్పతనం అర్ధం అయింది.  ఈ ఆనంద్ అందరికీ ఆమోదయోగ్యుడూ, తెలంగాణా ఉద్యమం లో పాల్గొన్న చురుకైన కార్యకర్తా, ఎన్నో సంవత్సరాలుగా కాంగ్రెస్ లోనే ఉన్నా, ఏ వర్గానికీ, ఏ గూటికీ చెందని అరుదైన వ్యక్తిత్వం ఉన్నవాడు. అందుకే  అనంతర కాలం లో (రాజీవ్ తదనంతరం) ఇన్ని గ్రూపు సంఘర్షణల మధ్య కూడా నిస్సందేహం గా ప్రధాన మంత్రి పదవి కి సూచించబడతాడు ఈ మన 'లోపటి మనిషి '.  

పవర్ పాలిటిక్స్..  దీనికోసం కుమ్ములాటలూ,  కుట్రలూ, కుతంత్రాలూ, ఢిల్లీ కి వెళ్ళి పావులు కదపడం వగైరాల్ని పక్కన పెడితే,  అధికారం, ప్రజాస్వామ్యం మనకిచ్చిన బలం.  మన దేశం లో తుపాకీ పాలన మన్నిక లోకి రాదు. ప్రజలు -  అత్యంత పెద్ద నిరంకృశ బృందం.  రాజకీయ నాయకుల నెత్తి మీద వేలాడే కత్తులు.  వీళ్ళ ని ఏమార్చాలని చేసే అన్ని ప్రయత్నాలూ వ్యర్ధాలు.  కానీ మారుతున్న విలువల ఈ వేద కాలం లో సూక్తుల కన్నా, కార్యాచరణ ముఖ్యం.   ఇప్పటి నిస్సహాయ ప్రభుత్వం పరిస్థితి చూస్తుంటే,  ఏమనిపిస్తుంది ? నిమ్మకు నీరెత్తిన ప్రధాని మన్ మోహన్ గురించి అందరూ ఏమనుకున్నా గానీ, ఆయన్ గురువు నుంచీ,  నేర్చుకున్న విద్య ని అభినందించాల్సిందే అనిపిస్తుంది.   మొత్తానికి ఈ పుస్తకం నన్ను ఏదో నిద్ర నుంచీ లేపినంత  ఉత్తేజ భరితంగా ఉందని చెప్పగలను. దీన్ని తెలుగు లో కి అనువాదం చేసిన 'కల్లూరి భాస్కరం' గారు అభినందనీయులు.  దానికి తోడు చాలా రోజులకి మంచి పుస్తకం పూర్తి చేసిన అనుభూతి చాలా బావుంది కూడానూ.

11 comments:

  1. భాషమీద పట్టుతో, చెప్పే విషయం మీద పూర్తి అవగాహనతో ఒక మంచి పుస్తకాన్ని సమీక్షించారు. రాసే విధానంలో ప్రొఫెషనలిజం కనిపించింది. ఐ లైక్డ్ థిస్ పోస్ట్.

    ReplyDelete
  2. రివ్యూ అద్భుతం గా రాశారు సుజాత గారు..తప్పకుండ చదవవలసిన పుస్తకం అనిపిస్తోంది.ఇంత మంచి పరిచయం రాసినందుకు ధన్యవాదాలు...:-)

    ReplyDelete
  3. @ A Homemaker's Utopia -

    Thank you very much. I recommend this book. :D Hope I can read an English Review of the Original in your blog.

    ReplyDelete
  4. కిషోర్ వర్మ గారు

    మీ మంచి మాటలు నాకు చాలా ఆనందాన్ని కలిగించాయి. మీకు ఈ పోస్ట్ నచ్చినందుకు చాల సంతోషం, మెనీ థాంక్స్.

    ReplyDelete
  5. Thanks for an interesting and inspiring review.
    Sharada

    ReplyDelete
  6. ఎనానిమస్ గారు,

    ఇన్ని రోజుల తరవాత ఆ విషయం గుర్తు చేసారు. పీ.వీ. దార్శనికత గురించి నాకు ఎప్పుడూ సందేహం లేదు. దాన్ని గురించి ఎవరైనా డైరక్ట్ గా రాస్తే తప్పక అర్ధం చేసుకోగలను. అజ్ఞాత సూచనలూ, ఇండైరెక్టు వ్యాఖ్యానాల్నీ అర్ధం చేసుకునే పరిణత నాకు ఇప్పటికీ కలగలేదు. కాబట్టి అప్పటి అపార్ధాన్ని గురించి గానీ, క్షమాపణల గురించి గానీ ఇప్పటికీ సరైన వివరణ ఇవ్వలేను. అయితే నా ఏకాకిత్వానికి ఇదీ కారణం అని కూడా చెప్పలేను. దురదృష్టకరమైన ఆయా సంఘటనల పట్ల సానుభూతి వ్యక్తం చేస్తున్నాను. ఎవరి మీదా 'దాడి' లేదా 'ఎదురు దాడి ' చేసే ఉద్ద్యేశ్యం నాకు లేవు. నా జ్ఞాన జ్యోతి గురించి నాకు పెద్ద పెద్ద నమ్మకాలు కూడా లేవు. నా అజ్ఞానమే నన్ను కాపాడుతూంది.

    ReplyDelete
  7. మీరు సంక్షోభం లో ఉన్నా, సంబరాల్లో ఉన్నా ఫ్యాన్స్ కి నెలకో మూడు నెలలకో కనిపించాలి :) ఇది ఆర్డరు అనుకొన్నా అభ్యర్ధన అనుకొన్నా మీ ఇష్టం :)

    రెండవపేరా అచ్చం గా మీలో కొత్త రచయితని పరిచయం చేస్తున్నట్లుందే!

    లోపలి మనిషి పై మీ వ్యాసం యాంత్రికం గా మొదలైనా పోను పోను ... చాలా చాలా ప్రభావవంతం గా వ్రాసారు. మిమ్మల్ని వెనక్కి తీసికోని వచ్చిన (బ్లాగ్స్ కి కూడా ;-)) కల్లూరి భాస్కర్ గారికి థాంక్సు లు.

    కసబ్ గురించి, మన్మోహన్ గురించి చర్చలు వృధా అని చెప్పడం చాలా బావుంది కాని... అందరు రాజకీయ నాయకుల నెత్తి పై వేలాడే కత్తులు అర్ధం అయినా , ఇంకా ఏదో భవిష్యత్ విశ్లేషణ మీ నుండి ఉంటె బావుంటుంది అనిపిస్తుంది.

    ReplyDelete
  8. మౌళి గారూ..

    అమ్మలూ.. హుషారైన వ్యాఖ్య కు థాంకులు. భవిష్యత్ గురించి మనమేం చెప్తాం చెప్పండి ? అదంతా ఆ పరమాత్మ కే వొదిలేయాలి. ఆయ్న తిప్పలు ఆయన పడతాడు.

    ReplyDelete
  9. పుస్తకం గూర్చి చాలా చక్కగా వ్రాసారు.నిజంగా ఆయన మనకు గర్వ కారణం

    ReplyDelete
  10. బ్లాగులు చదవడం నిర్లక్ష్యం చేసే ఇలాటి టపాలు మిస్ అవుతాం!ప్చ్
    ఈ పుస్తకం నాకూ చాలా నచ్చింది సుజాత గారూ!ముఖ్యంగా అనువాదం బాగుండటం వల్ల ఇష్టంగా చదవగలిగాను...
    మీ రివ్యూలో కసబ్ గురించి రాసిన మాటలు కూడా....ఎప్పుడూ నేను అనుకుంటూ ఉండేవి కూడాను..

    ReplyDelete
  11. వినాయకచవితి పర్వదిన శుభాకాంక్షలు.

    ReplyDelete

వ్యాఖ్యానించినందుకు చాలా చాలా థాంక్స్.