Pages

04/03/2010

Angela's Ashes

సాహిత్యంలో ఎప్పటికైనా పావర్టీ గొప్ప ఇదైన సబ్జెక్టు. మనిషికీ మనిషికీ ఉన్న సామ్యత ని తెలియచేసేది, మనసుల్ని ఒద్దిక చేసేది కూడా ఈ దారిద్ర్యమే. ఇంత దాకా సాహిత్యంలో చాలా ఎక్కువ ప్రసిద్ధ రచనలు, ముఖ్యంగా ఎందరో మహానుభావుల ఆత్మ కధలు ఈ పావర్టీనే అల్లుకుపోయాయి. ఆయా రచయితలు తమ బాల్యం లో అనుభవించిన దారిద్ర్యం, కష్టాలూ - ఆ కష్టాల్లో మమతలూ, కలతలూ, త్యాగాలూ, ప్రేమలూ - ఇలా ఎన్నో నిరుపమానమైన జీవితపు రంగుటద్దా ల్లో తమ కధ ని - కాదు కాదు ఆ బీదరికపు కధ ని చెప్పుకొస్తే, మనం కళ్ళార్పకుండా చదువుతాం. కష్టాల్లోనే చాప్లిన్ తరహా హాస్యాన్ని ప్రదర్శిస్తే ఎంతో ఆనందిస్తాం.

ఇదెందుకో యూనివర్శల్ ట్రూథ్ ! మన దేశంలో ఇంకా ఎందరో బీదలు. రోజురోజుకీ పెరుగుతున్న బీద వారి సంఖ్య. బీదరికం ఒక శిక్ష. ఒక చాలెంజ్. కేవలం సరయిన ఆధారమూ, ఆదాయమూ లేక పిల్లలకు కడుపు నిండా తిండి పెట్టలేక, స్కూళ్ళకు పంపలేక కళ్ళల్లో కన్నీటితో బ్రతుకు పోరాటం చేస్తున్న తల్లులకూ తండ్రులకూ ఈ బాధ తెలుస్తుంది. ఏ వైద్యమో అందివ్వలేక కన్న పిల్లల ప్రాణాలు గాల్లో కలిసిపోతుంటే చూస్తూ ఉండిపోవాల్సిన నిస్సహాయత బీదలది.


అందుకేనేమో - ఎన్నో ప్రపంచ ప్రసిద్ధి చెందిన సాహిత్య లోకపు అవార్డులు తమ రచనలతో బీదరికపు స్మృతులని పాఠకులతో పంచుకున్న రచనలని వరించాయి. కొడవటిగంటి కుటుంబరావు గారు తన 'చదువు ' లో అన్నట్టు 'ఇక ఇందే ఆఖరు.. జీవితం ఇంతకన్నా ఘోరంగా దిగజారడానికి వీల్లేదు!' అనుకునే అసంఖ్యాక సందర్భాలు ఎదురయ్యే జీవితం గురించి చదువుతుంటే, అలాంటి జీవితం లోంచి కూడా కుసుమాలు వికసిస్తాయి అనే ఆశ, నమ్మకం కలుగుతుంటే - అదో చక్కని ఫీలింగ్. జాలి, సానుభూతి కోసం కాకుండా రచయితలు ఆయా రచనల లో ఇంకేదో వ్యూహాన్ని అనుసరిస్తారు. అందుకే కొన్ని రచనలు, వాటి సౌరభాలతో మనల్ని కొన్ని రోజుల పాటూ కమ్ముకునే ఉండిపోతాయి.

ఎన్నాళ్ళుగానో ఈ పుస్తకం (Angela's Ashes) గురించి రాద్దామని అనుకున్నా, ఈ నిరుత్సాహ పరిచే బీద రచన ని గురించి ఏమి రాయడం అనిపించేది. కానీ ''ఏంజెలాస్ యాషెశ్' లో ఏదో ఉంది. ఇది ఐరిష్ దారిద్ర్యాన్ని గురించి వచ్చిన అత్యుత్తమ రచనలలో ఒకటి. యుద్ధ సమయంలో, గ్రేట్ డిప్రెషన్ లో - ఉద్యోగాలు పోయి, ఆదుకునే దిక్కులేక, దుర్భర దారిద్ర్యంలో వలస పోయిన అమెరికా నుంచీ అయిన వాళ్ళ దగ్గరకి ఐర్లాండు చేరి, అక్కడ కూడా ఉద్యోగాలు దొరకక, పసి పిల్లలతో నానా అవస్థలూ పడిన ఐరిష్ కుటుంబపు కధ.

ఈ కుటుంబంలోని జంట ప్రేమ వివాహం చేసుకుంటారు. ఉత్తర ఐర్లండ్ లో స్వతంత్ర పోరాటంలో సాయుధుడై పోరాడిన ఐరిష్ తండ్రి మెక్ కోర్ట్, తన తల కి వెల కట్టబడి, ప్రభుత్వం నుంచీ,దేశం నుంచీ అమెరికా పారిపోయి, అక్కడ పరిచయమయిన ఇంకో ఐరిష్ యువతి యేంజెలా ను పెళ్ళి చేసుకుంటాడు. వీళ్ళ పెద్ద కొడుకే (ఫ్రాంక్ మెక్ కోర్ట్) ఈ నవలా రచయిత.


స్వదేశానికి తిరిగి రావడానికి యేంజెలా తల్లి ఎలాగో టికెట్లు పంపిస్తే, షిప్ లో ఐర్లెండు చేరిన ఈ కుటుంబం అప్పటి నించీ మరిన్ని కష్టాల్ని ఎదుర్కొంటుంది. యుద్ధం వల్ల ఎక్కడా ఉద్యోగాలు ఉండవు. అందునా ఐర్లండ్.. ఇక్కడ చాలా మంది పురుషులు ఇంగ్లండు కి వెళ్ళి, ఆ దేశ సైన్యంలో చేరుతారు. ఇండియా కి, ఇతర ఆసియా దేశాలలోనూ డెప్యూట్ చెయబడతారు. వీళ్ళకి యుద్ధమే జీవనాధారంగా తయారైంది.

వీళ్ళ పెళ్ళి ఎంతమాత్రం ఇష్టం లేని ఇద్దరి తల్లి దండ్రులూ, చిన్న పిల్లల మొహం చూసి కూడా ఎంతమాత్రం సహాయం చేయరు. మెక్ కోర్టులయితే, ధనికులయినా కనీసం ఆశ్రయం ఇవ్వడానికి కూడా నిరాకరిస్తారు. ఫ్రాంక్ భాషలో ఆ చిన్న హృదయం, తమ కష్టాలను అర్ధం చేసుకునే వయసు లేకపోయినా, తల్లి తండ్రుల నిస్సహాయతని, భయాలనూ చక్కగా వర్ణిస్తుంది.

ఫ్రాంక్ తండ్రి తాగుబోతు. కొన్నాళ్ళకి ఆ కుటుంబం ఎట్లాగో స్థిరపడినా, తన సంపదనంతా తాగడానికే వెచ్చించడంతో, ఆకలి, దాహం, చలి - ఇలా అన్ని కష్టాలూ ఆ కుటుంబాన్ని ముంచెత్తుతాయి. వీటిల్లో ఏంజెలా ఎన్నో సార్లు తన పిల్లల్ని అనారోగ్యాలనుచీ కాపాడుకోలేక, చనిపోతున్న పిల్లలని తలుచునుని రోదిస్తూ, బ్రతికి ఉన్న పిల్లలతో ఎలానో కాలక్షేపం చేస్తుంటుంది.

కొన్నాళ్ళకి ఫ్రాంక్ తండ్రి పని కోసం, బ్రతుకు తెరువు కోసం ఇంగ్లండ్ వెళ్తాడు. కొన్నాళ్ళు డబ్బు సరిగానే పంపినా తరవాత తాగుడుకి బానిసై, జబ్బుపడి తిరిగొచ్చి, ఐర్లండ్ లోనే కన్నుమూస్తాడు. అనాధ అయిన ఈ కుటుబానికి అద్దె చెల్లించుకునే స్తోమత లేక ఒక పెళ్ళికాని చుట్టం ఇంటికి తరలాల్సి వస్తుంది. అక్కడ ఈ చుట్టం (అంకుల్) కారణంగా పిల్లలూ, ఏంజెలా కూడా ఎన్నో అవమానాలకు గురి ఔతారు గానీ, ఆఖరుకి తన పిల్లల కోసం యేంజెలా అవన్నీ పంటి బిగువున భరిస్తూ ఉంటుంది. అతనికి ఉంపుడుగత్తెగా ఉండాల్సి వచ్చినా, పిల్లలకి వెచ్చగా ఉండడానికి ఒక గూడంటూ ఉంటుంది కదా అని అతని ఇంట్లో పనిమనిషి లా పడి ఉంటుంది. చిరిగిన సాక్సులూ, కప్పుకోవడానికి వాడే చిరిగిన కోట్లూ - కప్పులు లేక పాత జాం జార్లలో టీ తాగడం, చర్చి చదువులూ, ఇలా నానా కష్టాలూ పడుతున్న పిల్లలు కనీసం ఈ అంకుల్ ఇంట్లో ఉంటే రాత్రి వెచ్చగా ఉంటారనే తల్లి ప్రేమని ఏ కొడుకు మర్చిపోగలడు ?

పెద్దయ్యాక పిల్లలు (చనిపోయినవాళ్ళు పోగా మిగిలిన వారు) ఎలానో ప్రయోజకులౌతారు. 19 ఏళ్ళ వయసులో Frank అమెరికా ప్రయాణం అవుతాడు. అమెరికా చేరాకా కొత్త జీవితం లోకి అతను చదువుకోవడం మీద కోటి ఆశలతో అడుగుపెట్టడంతో ఈ నవల ముగుస్తుంది. దీనికో సీక్వెల్ కూడా ఉంది. దాని పేరు 'Tis.

ప్రాధమికంగా ఈ రచనలో రచయిత ప్రతి పేరాగ్రాఫ్ లోనూ ఎంతో డీటైల్ తో - ఎక్కడా పొరపాటనేది దొర్లకుండా, ఐరిష్ జీవితాన్ని, బీదరికాన్నీ వర్ణిస్తాడు. ఆకలికి ఏడుస్తున్న తమ్ముళ్ళ నోటికి నీళ్ళు నింపిన బాటిళ్ళిచ్చి ఊరుకోపెట్టడం, ఇటాలియన్ పచారీ కొట్టువాణ్ణి ఈ మాటా,ఆ మాటా పెట్టి మభ్య పెట్టి అకణ్ణించీ అరటిపళ్ళు ఎత్తుకొచ్చి తన కన్నా చిన్న వాళ్ళకి తినిపించడం, ఇంట్లో ఫైర్ కోసం, రోడ్డు పక్కన బొగ్గులేరడం, పొద్దున్న పేపర్ బాయ్ గా పనిచెయ్యడం, తల్లి తండ్రుల ప్రేమనీ, వాళ్ళు పెద్దలనుంచీ ఎదుర్కున్న కష్టాలు అనిటినీ - చాలా హృద్యంగా వివరిస్తాడు.

యేంజెలాస్ యాషెస్ - నవల కాదు. ఇది ఫ్రాంక్ మెక్ కోర్ట్ తన బాల్య స్మ్ర్తులతో రాసిన ఆత్మ కధ అని చెప్పొచ్చు. దీనికి 1997 లో పులిట్జెర్ ప్రైజ్ లబించింది. అన్ని కష్టాల్లో, అంత బీదరికంలో నేను బ్రతికి బట్టకట్టడం విశేషమే. ఈ తరానికి తెలియని ఆ జీవిత పోరాటాన్ని మా అమ్మ స్మ్రుతికి అంకితం ఇస్తున్నా అంటాడు రచయిత. అయితే ఇన్ని కష్టాల్లో కూడా ఫ్రాంక్ ప్రదర్శించిన మంచి లక్షణం - దుఃఖం లో మునిగిపోకపోవడం. సెల్ఫ్ పిటీ లో కొట్టుకుపోకపోవడం. రచన అంతా మేటర్ ఆఫ్ ఫేక్ట్ గా కొనసాగుతుంది. అలా అని ఆ విషాదం మన హృదయాన్ని స్పృశించకపోదు. అదీ ఈ రచన ప్రత్యేకత. 2009 లో నేను చదివిన అన్ని పుస్తకాల్లో ఇదే ఎక్కువ నచ్చింది.

5 comments:

cbrao said...

దారిద్ర్యం ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీస్తుంది. అన్ని ప్రతికూల పరిస్థితులలో, మొక్కవోని ధైర్యంతో, ఫ్రాంక్, జీవితంలో పులిట్జర్ బహుమానం సంపాదించేలా ఎదగటం అభినందనీయం. ఈ పుస్తకం తరువాయి 'Tis ఒక అమెరికా మిత్రుడు నాకు బహుకరించారు. వీలుచేసుకొని పాఠకులకు పరిచయం చెయ్యాలి ఆ పుస్తకాన్ని.

కొత్త పాళీ said...

నే చదివాను.
మీ పరిచయం చాలా బాగుంది. ముఖ్యంగా మొదటి పేరాలు.

Sujata M said...

cbrao గారూ

'Tis చదవాలని కోరికైతే ఉంది. మీ పరిచయం కోసం ఎదురుచూస్తుంటాను.

థాంక్స్.

Sujata M said...

కొత్త పాళీ గారు

Angela's Ashes చదివితే, నా '' పై పై పరిచయం'' మీకు నచ్చకపోయి ఉండాలి.

మొదటి రెండు పేరాలు నచ్చినందుకు చాలా థాంక్స్.

మురళి said...

చదవాలండీ..