స్త్రీ పక్షపాతం మీద పొద్దున్నే పెద్ద చర్చ లో ఆవేశంగా వాదించేసాను. ఎందుకో వాదించాలనిపించింది. అందరికీ అన్ని విషయాలమీదా బోల్డన్ని 'చెరపలేని అభిప్రాయాలు ' ఉంటాయి. బహుశా నాకూ కొన్ని గట్టి భావనలున్నాయి. వీటికి విరుద్ధమైన వాటి మీద అభిప్రాయాల్ని మనసుకి పట్టించుకోవాలంటే కష్టమే.
నేను 'ఫెమినిస్ట్ - హార్డ్ కోర్ ' తరహా ఏమీ కాదు. కానీ నేను pucca స్త్రీ పక్షపాతినే అనుకుంటాను.
అదేంటో.. కానీ పిల్లలని స్కూలుకి పంపి, వంటా, వార్పూ కానిచ్చి, ఇంటిపనులు చెక్కబెట్టుకుని, సిటీ బస్సులెక్కి పరుగులు తీస్తూ ఉద్యోగాలు చేస్తూ, ఆఫీసుకి అయిదు నిముషాలు లేట్ అయితే పనిష్మెంట్ కింద జీతాలు లేదా సెలవులూ కోల్పోయే ఆడవాళ్ళంటే నాకు కొంచెం సాఫ్ట్ కార్నర్.
మొగుళ్ళ అప్పులు తీర్చడానికి, వారి కుటుంబ బాధ్యతలని షేర్ చేసుకోవడానికీ, వారికి సాయం చేయడానికీ అని - పాలిచ్చే పసి పిల్లలని ఇళ్ళలో, క్రెష్ లలో వొదిలి ఆఫీసుకి వెళ్ళే ఆడవాళ్ళంటే, కొంచెం దయ.
వైధవ్యంలో చుట్ట పక్కాల ఆలంబన లేకుండా ఏదో చిన్నదో, పెద్దదో ఉద్యోగం ఉద్ధరించి, పిల్లలని పెంచి, ఒక స్థాయికి తీసుకొచ్చే తల్లులంటే కొంచెం గౌరవం.
ఆర్మెడ్ ఫోర్సెస్ లో నిర్దాక్షిణ్యమైన డిసిప్లిన్ నీ, కొంచెం వేధింపులని కేవలం 'ఈక్వాలిటీ' అనే ఒక విలువ ని నిరూపించడానికి కష్టపడే అమ్మాయిలని చూస్తే కాస్త గర్వం.
రాత్రిళ్ళు ఆఫీసు కెళ్ళే కాల్ సెంటర్ అమ్మయిలూ, పిల్లల గురించి బెంగపడే తల్లులూ, పిల్లల కోసం ప్రతిభ ని కొంచెం బజ్జోబెట్టి, కెరీర్ ని త్యాగం చేసే తల్లులూ.. వీళ్ళన్నా కాస్త ఇష్టమే.
కట్నం వేధింపులూ, ఆఫీసుల్లో ఆడవాళ్ళ లిప్స్టిక్ ని చూసి చెవులు కొర్రుక్కునే కొలీగ్లూ, వీళ్ళ సాధారణ బిహేవియర్ ని కూడా భూతద్దాల్లో వెతికే కొలీగ్లూ.. ఇంకా ఇంటి దగ్గర బయటా, ఈగో ప్రోబ్లెంలూ - ఇవన్నీ ఒంటిచేత్తో నెట్టుకొస్తూ, ఏదో సాహసంతో బ్రతికే ఆడపిల్లల్ని చూస్తే కొంచెం అభిమానం .
ఎంత చేసినా ఆడోళ్ళు 'ఇంకాంపిటెంటే !' ఆడవాళ్ళు అందంగా ఉన్నా కష్టమే, లేకపోయినా కష్టమే.
మంచిగా మట్లాడితే - అర్ధాలు తీయబడతాయి.
మాట్లాడకపోతే - లేబుళ్ళు అతికించబడతాయి.
శుభ్రంగా ముస్తాబు అయితే - అదేంటో వాళ్ళకోసమే అనుకుంటారు సహోద్యోగులు.
మొహం వేలడేసుకుని వెళ్తే - పెంటమ్మ అనుకుంటారు.
ఆడవాళ్ళు - కొంచెం వ్యతిరేకతనూ భరించాలి, కొంచెం 'ఎటెన్షన్ 'నూ ఫేస్ చెయ్యాలి.
మంచి ఎక్సెక్యూటివ్ స్థాయి ఉద్యోగిని - నిర్ణయాలు తీసుకునే ఉద్యోగిని కీ - మగ వాళ్ళతో సమానంగా గౌరవం లభిస్తుందా ? కొంచెం కష్టమే. పైపైకి అంతా బానే కనిపిస్తుంది. కానీ అంతర్లీనమైన వివక్ష వారిని బాధిస్తుంది.
ప్రతీ స్త్రీ - అనర్ఘ స్త్రీ రత్నమే - కానక్కర్లేదు కదా ! కానీ ఎవరికి మటుకూ వారికి ఎన్ని చాలెంజెస్ ఉంటాయో కూడా కొంచెం ఊహించాలి !
ఈ మధ్య ఇంకో ధోరణి కూడా ప్రస్ఫుటం ఔతుంది. ఈ ఎలుకల పందెం లో ప్రతీ వారూ పెర్సనాలిటీ అని - ఒకటుంటుందని అని ఒక విషయానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. అది బయటికి కనిపించేది కూడా ! దీని వల్ల ఇతరులకు మన మీద ఒక ఇంప్రెషన్ పడుతుంది.
దీనిలో భాగంగా, చెక్కని చిరునవ్వు, స్నేహపూర్వక సంభాషణ, చెక్కని డ్రెస్ సెన్స్, కొంచెం మేక్ అప్ - అందరూ తమ వ్యక్తిత్వానికి ఆపాదించుకుంటున్నారు.
ఆడవాళ్ళు తమ గురించి తాము ఈ విధంగా ఒక స్టేట్మెంట్ ఇస్తున్నారు. ఇది లౌడ్ అండ్ క్లియర్ అయిపోయి, స్త్రీ పక్షపాతులు కానివారు కొంచెం తట్టుకోలేకపోతున్నారు.
ఆడవాళ్ళ మేక్ అప్ బిల్లులు - బట్టలకయ్యే ఖర్చూ - భర్త బేచ్ ని ఆందోళనపరుస్తుంది. కానీ వారికి వెంటనే, మగ వాళ్ళ వస్త్రాలు కూడా ఎంత ఖరీదయ్యాయో గుర్తు రావు.
అమ్మా - స్త్రీ రత్నాలారా - ఏమీ పట్టించుకోవద్దు. మీ పని మీరు కానివ్వండి. ఆడవాళ్ళని ఎప్పటికైనా ఆదుకునేవి, విద్య, ఆర్ధిక స్వాతంత్ర్యమే.
ఫెమినిసం - అంతా స్త్రీ విద్య, స్త్రీల వృత్తి ఉద్యోగాల పెంపు చుట్టూనే తిరగాలి. కెరీర్ లో చిన్న చిన్న గుసగుసలూ, దగ్గులూ, చెణుకులూ కామన్. మనం మన అంతరాత్మకు సమాధానం చెప్పుకోగల పరిస్థితిలో ఉంటే అదే పదివేలు !
"అమ్మా - స్త్రీ రత్నాలారా - ఏమీ పట్టించుకోవద్దు. మీ పని మీరు కానివ్వండి. ఆడవాళ్ళని ఎప్పటికైనా ఆదుకునేవి, విద్య, ఆర్ధిక స్వాతంత్ర్యమే. "
ReplyDeleteఅవును!
very nice post and couldnt agree more. keep it up!!
ReplyDeleteఎందుకో వాదించాలనిపించింది. - వాదించినందుకు నెనర్లు!! I'm happy you did at right place :-)
ReplyDeleteమీరు చెప్పిన అన్ని ఉదహరణల్లో, మగవారన్న అహం చూపిస్తున్నప్పుడల్లా "సో వాట్!!" అనుకుంటూ ముందుకు వెళ్ళడమే శ్రేయస్కరం. అన్నీ మనం ట్ర్తై చేయాలని కాదు కానీ, మనకి నచ్చింది చేయటానికి ఇలాంటి వన్నీ అడ్డురాకూడదు అని నా అభిప్రాయం.
మీ వ్యాసంలో ప్రత్యక్షరంతోనూ ఏకీభవిస్తాను. కానీ "విద్య, ఆర్ధిక స్వాతంత్ర్యం" అంటే నన్ను ఎప్పటినుండో దొలిచేస్తున్న ప్రశ్న మిమల్ని అడుగుతున్నాను. చదువుకునీ, సంపాదిస్తున్న కొంత మంది స్త్రీలు పరిస్థితులకి తలొగ్గి ఎందుకు పోరాడడం మానేస్తున్నారు. నిన్నే ఓ స్నేహితురాలు, ఇంగ్లండులోని డొమెస్టిక్ వయొలెన్స్ గురించి చెప్తూ ఉంది. అలాంటి ఆపదల్లో మన వాళ్ళు ఎందుకు బయటకు రాలేకపోతున్నారు. నాకు ఏవేవో కారణాలు కనిపిస్తున్నాయి. మీరేమంటారు??
దిలీప్, - థాంక్స్ !
ReplyDeleteపూర్ణిమా.. ఒక సంగతి చెప్పనా? కొంచెం ఈగో మనకి కూడా అవసరమే. మీరడిగిన ప్రశ్నకు సెంటిమెంట్ సమాధానం కావచ్చు, ప్రేమ కూడా సమాధానం కావచ్చు. నాకు తెలిసి, భర్త కు నచ్చే విధంగా డ్రెస్ చేసుకోవటం, భర్తకు నచ్చే హేర్ స్టైల్, ఇలా.. తమలో అన్నీ మార్చుకునే ఆడవాళ్ళున్నారు. తమ స్నేహాల్ని వొదులుకుని, తమ వైపు చుట్టాల్ని పట్టించుకోకుండా, పూర్తిగా భర్త తోడిదే జీవితం అన్నట్టు మారిపోతారు. ఒకట్రెండు సంవత్సరాలు గడిచాక గానీ వాళ్ళకు తాము ఏమి కోల్పోతున్నామో అర్ధం కాదు. పెళ్ళయ్యాకా హీరోయిన్ల లాగా ప్రవర్తించడం, తమకే నష్టం అని గ్రహించుకోవాలి వీళ్ళు.
గృహహింస ను భరించేది ఇంకో రకం. వీళ్ళు సమాజం, తల్లిదండృలు బాధపడతారనీ.. ఇలా సబ్మిసివ్ గా ఉండిపోతారు. అలాంటప్పుడు ఈగో అనేది రక్షిస్తుంది. ఒక్క తిరగబడిన క్షణంలో పిల్లి, పులవుతుంది.
Tink.. thanks a lot!
ReplyDeleteInteresting!! Its the ego tht saves.. exactly!! I'll hav to seriously work on this topic now.
ReplyDeleteThanks!!
చాలా బాగా చెప్పారు. ఇలాంటి విషయాలకెప్పుడూ రెండుకోణాలుంటాయి.కాకపోతే ఈ మధ్య కాలంలో పలుకోణాలుంటున్నాయి. Every angle is valuable and important to understand life in a better way.
ReplyDeleteపూర్ణిమ,
ReplyDeleteఎందుకు అలా అయిపోతారు?
ఆ ప్రశ్నకి నేను కూడా నా ఆలోచనని "ఆడవాళ్ళమండీ మేమూ.." లొ రెండు టపాల్లోనూ రాసాను... వీలైతే ఇంకోసారి చదువు.. నీకా ప్రశ్న ఉదయించింది కాబట్టి...
ఈగో వల్ల అది మగ వాడిదైనా ఆడదానిదైనా సమస్యలే వస్తాయి... అహం కన్నా ఆత్మాభిమానం ముఖ్యం, జాగురూకత(consciousness ) ముఖ్యం.
ఆడదాని బలహీనత ప్రేమ,భద్రత,పిల్లలు... చాలా వరకు ఇవే చాలా మంది ఆడవాళ్ళని వాళ్ళ భర్తలతో విభేదించకుండా చేస్తుంది. విభేదిస్తే ఏమవుతుందో అన్న అలజడితో, రిస్క్ తీసుకోరు...
Kudos Sujanta గారూ.. నేను ఇప్పటివరకూ చదివిన మీ బ్లాగుల్లో ఇది best one and a very well written one. ప్రతి వ్యాక్యంతో అందరూ ఏకీభవించాల్సిందే.
ReplyDeleteసలామ్ మేడమ్!
వినమ్రతతో... (తల వంచి Bow చేస్తున్నట్టుగా ఊహించుకోండి ఒకసారి).
సుజాత గారూ, చాలా బాగా రాశారు! ఆలోచన, ఆవేశం, ఆవేదన అన్నీ కనిపిస్తున్నాయి!!
ReplyDelete"దీనిలో భాగంగా, చెక్కని చిరునవ్వు, స్నేహపూర్వక సంభాషణ, చెక్కని డ్రెస్ సెన్స్, కొంచెం మేక్ అప్ - అందరూ తమ వ్యక్తిత్వానికి ఆపాదించుకుంటున్నారు.
ఆడవాళ్ళు తమ గురించి తాము ఈ విధంగా ఒక స్టేట్మెంట్ ఇస్తున్నారు. ఇది లౌడ్ అండ్ క్లియర్ అయిపోయి, స్త్రీ పక్షపాతులు కానివారు కొంచెం తట్టుకోలేకపోతున్నారు."
ఏం చెప్పారండి!
తట్టుకోలేక వాళ్ళు అనే మాట 'అబ్బో, ఆ అమ్మాయి చాలా ఫాస్టు!'
సుజాత,
ReplyDeleteమీకు రెండు విషయల్లో థాంక్స్ చెప్పుకోవాలి. ఒకటి ఈ విషయం పై ఇంత సంయమనంతో రాసి మెప్పించినందుకు.రెండోది రెండు నాల్కల ధోరణి లేకుందా మీరు స్త్రీపక్షపాతినని ధైర్యంగా సూటిగా చెప్పుకున్నందుకు.
కల్పనారెంటాల
నేను కూడా మీ ప్రతీ అక్షర0తోనూ ఏకీభవిస్తున్నాను.చాలా మ0చిగా స్ప0ది0చారు.కామె0ట్లలో మీరు చెప్పి0ది కూడా చాలా బాగు0ది.మీకు థా0క్స్.అలాగే అభిన0దనలు.
ReplyDeleteఈ టాపిక్ మొదలైనప్పటి నుంచీ, అందరూ "స్త్రీ పక్షపాతం/పక్షపాతి" అని అందరూ అనాలోచితంగా వాడేస్తున్నారు. అది కొంచెం uncomfortable గా వుంది నాకు. Feminism అంటే "స్త్రీ పక్షపాతం" కాదనుకుంటా..Feminist ని "స్త్రీ వాది/స్త్రీత్వ వాది" అనొచ్హా? "పక్షపాతం"(bias) అనే పదంలోనే ఒక "defeating argument to start with" కనబడుతుంది నాకు.
ReplyDeleteAlso, దిలీప్.... "ఆడవాళ్ళని ఎప్పటికైనా ఆదుకునేవి, విద్య, ఆర్ధిక స్వాతంత్ర్యమే. ". ఇంకో ముఖ్యమైనది add చేయండి, అది "భావ/ఆలోచన స్వాతంత్రం". మొదటి రెండిట్లో మధ్యతరగతి కుటుంబాల్లో బానే విప్లవం వచ్హింది, కాని దీంట్లో ఇంకా రాలేదు..అది చాలా వరకూ తండ్రుల(1st responsibility)/తల్లుల(2) భాధ్యతే.
అయినా ఒక్క మాట చెప్పనా...అందరూ ఇలా మహేశ్ మీద విరుచుకుపట్టం బాలేదు. ఆయన చాలా క్లియర్ గా డిక్లేర్ చేశారు..original article లో.."అందరూ ఇలాగే ఉంటారా?" అనే ప్రశ్న ఇక్కడ అప్రస్తుతం. ఎందుకంటే, అందరూ ఇలా ఎప్పుడూ ఉండరుగనక" అని.
కల్పన గారు..ఎప్పుడైనా, ఏ విషయంలో నైనా ఒక వైపు "పక్షపాతి" ని అని చెప్పుకోవడం, (గర్వకారణమో, కాదో పక్కన పెడితే) basic credibility of the person ని దెబ్బతీయట్లేదా? Yes...Granted...Not everyissue in this world has equal and opposite arguments/cases but ఇష్హ్యూ కి ఉన్న ఒక కోణపు ఉనికిని గుర్తించకపోవడం/గుర్తించకపోవడానికి ప్రయత్నించకపోవడం కరక్ట్ కాదు అని మీరూ అంగీకరిస్తారు కదా.
సుజాతగారూ,
ReplyDeleteమళ్ళీ వచ్చి వ్యాఖ్య రాస్తాను! మా పాప స్కూలు బస్సెక్కే వరకూ నేను ఏమీ బుర్రకెక్కించుకోలేను.
100% facts.
ReplyDelete100% convincing
100% agreed
bollojubaba
సుజాత గారు,
ReplyDeleteచాలా ఆవేశంలో రాసినట్టున్నారు. అయినా ప్రత్యక్షరమూ సత్యమే! మీకు కాస్త ఇష్టమైన ఆడవాళ్ళలో నేను కూడా ఉన్నందుకు ఆనందం!భర్తకు నచ్చే హేర్ స్టైల్స్, భర్త వైపు చుట్టాలు వీటన్నిటిని గురించిన వ్యాఖ్యలు కూడా నాకు బలే నచ్చాయి.ఇలాంటి ఆడాళ్ళ మీద జాలిపడినా, వ్యతిరేకించినా మనం "స్త్రీత్వ" లక్షణాలు తక్కువని బాధపడే మహిళలు కూడా ఉంటారండి. "ఈగో" కి అహంకారంగా, పొగరుగా ముద్రలు వేసేది కూడా ముందు ఆడవాళ్ళే!వీళ్ళు ఎక్కడినుంచో ఊడిపడరనుకోండి.
ముఖ్యంగా చివరి పేరా
"ఫెమినిజం అంతా స్త్రీల విద్య, వృత్తి ఉద్యోగాల పెంపు చుట్టూనే తిరగాలి" ఇది మాత్రం సూపర్. మీ టపాలో ప్రతి అక్షరంతోనూ ఏకీభవిస్తున్నాను.
ఎవరి ప్రవర్తన వారిది, ఎవరి వ్యక్తిత్వం వారిది. ఎవరో మహానుభావుడు అన్నట్లు "అంతా మనది అయితే దానిలో లోపాలు బహుస్వల్పం, కాకపోతే లోపాలు బహుమెండు". అమ్మాయి కాస్త గోముగా మాట్లాడితే చాలు కరిగిపోతారు అని రాశారు, ఈ statement ఇచ్చింది కరిగిపోయే మగవారు కాదు, అసూయ పడే మగవారేమో అని ఎందుకు ఆలోచించరు? ఇగో ఇగో అని మాట్లాడుతున్నారు. ఈ పురుషాధిక్య సమాజంలో కొంచెం మా ఉనికిని నిలబెట్టుకోవాలంటే పోరాటం అవసరమే, ఆ పోరాటం చేసే శక్తి మాకు రావాలంటే, లేదా ఆ పోరాటాన్ని మేము మధ్యలోనే ఆపకుండా ఉండాలంటే మాకు కాస్త ఇగో అవసరమే, అది ఇగో కాదు ఆత్మాభిమానం అని ఫెమినిస్టులు అంటారు. మాకు కుడా విద్య, ఉద్యోగాలు, ఆర్ధిక స్వాతంత్ర్యం అవసరమే అని, కాని ఆ స్వేచ్చనిచ్చే తల్లితండ్రులు ఎంతమంది?
ReplyDelete@నిశిగంధగారు, మీతో ఏకీభవిస్తున్నా. తట్టుకోలేక కారుకూతలు కూసే దాంట్లో కూడా ముందు మన ఆడవాళ్లే ఉంటారన్న సంగతి మనం మర్చిపోకూడదు.
@independent గారు మీరన్నది అక్షరాలా నిజం.
ఏదేమైనా మంచి చర్చకు దారితీసే టపా రాసారు సుజాతగారు.
మీకో ఆసక్తికరమైన విషయం చెప్పనా? మగ వాళ్ళలో కంటే ఆడవాళ్ళలోనే పురుషాహంకారాన్ని సమర్థించేవారెక్కువ. మరో ఆడది తనకన్నా మెరుగైన జీవితాన్ని గడపటం వీరికి ఇస్టముండదు. తను కష్టపడింది కాబట్టి తన చుట్టు ఉన్న ఆడవాళ్ళు అలాగే వుండాలని కోరుకుంటుంది. అవసరమైతే అనేక నిందలు వేయటానికీ, అపవిత్రతను ఆపాదించటానికీ వెనుకాడదు. మగవాడికంటే ఇటువంటి ఆడవారివల్లనే ఎక్కువ నష్టం. సమాజంలో ఇటువంటి వారి సంఖ్య తక్కువేమీ కాదు.
ReplyDeleteనేను ఈ మద్య "గ్రంధాలయం" సంకలనం చెయ్యాలని మొదలుపెట్టాను. కాని ఈ చర్చ, విషయమూ చూస్తుంటే "స్త్రీ పక్షపాతం" సంకలనం చేస్తే భవిష్యత్తుకు ఉపయుక్తమైన అంశాలు, ఆలోచనలు రికార్డు అవుతాయనిపిస్తుంది
ReplyDeleteదిలీప్ గారు - ఇంకో సారి థాంక్స్.
ReplyDeleteనిషిగంధ, కల్పన, పూర్ణిమ, సుజత గారు, పెదరాయడు గారు, కల గరు, రాధికా... థాంక్స్.
ఇండిపెండెంట్ గారు - మీ వ్యాఖ్య చాలా బావుంది. పిల్లలు స్త్రీ ల జీవితాలలో ఒక మేజర్ ఇష్యూ. వీళ్ళ వల్ల కూడా స్త్రీలు కొంచెం బాధ పడుతూనే సంసారాలు సాగిస్తారు. ఇంకో మాట. కత్తి గారి మీదే కత్తి దూసేంత పని నేను చెయ్యట్లేదు. ఆయన నాణానికి ఒక వైపు గురించి చెప్తె, నేను ఇంకో వైపు గురించి చెప్పను అంతే!
కత్తి మహేష్ గారు - Thanks! మీ వ్యాఖ్య కూడా బావుంది.
భర్తకి అందంగా కనిపించాలనేసరికి ఇగోలు అడ్డం. పెళ్లిళ్లకి, పేరంటాలకి ఊర్లోవాళ్ల కోసం ప్రత్యేకంగా సింగారించుకోవటానికి మాత్రం నిరభ్యంతరం! ఇదేం ఫెమినిజం?
ReplyDeleteఅబ్రకదబ్ర గారూ మీరు చెప్పినలా0టి డైలాగే ఇ0కొకటి....భార్యని నవ్వుతూపలకరి0చి ఏమన్నా సాయ0 కావాలా అని అడగడానికి ఇగోలు అడ్డ0.అదే ఆఫీసులోను, రోడ్డు మీదా,దారినపోయే ఆడాళ్ళను చూసి పళ్ళికిలిస్తూ మాట్లాడడానికి ఏ ఇగోలూ వు0డవు...కదా
ReplyDeleteరాధిక,
ReplyDeleteమీరు నా కామెంట్ వెనకున్న సందర్భాన్ని గ్రహించినట్లు లేరు. పైన సుజాతగారు 'భర్తకి నచ్చేలా తయారయ్యే ఆడాళ్లకి కాస్త ఇగో అవసరం' అన్న వ్యాఖ్యపై నా అభ్యంతరమే ఈ 'ఇదేం రకం ఫెమినిజం' అన్న నా ప్రశ్న. నేను చెప్పిన రకం ఆడాళ్లే కాదు, మీరు చెప్పిన రకం మగాళ్లని కూడా చెప్పుతో కొట్టాలి.
జాన్ హైడ్ గారు - మీరు ఒకవేళ ఇలాంటి ఇతివృత్తం ఎంచుకుంటే... దీని మీద ఇంకా ఎక్కువ విషయాలు తెలుస్తాయేమో - కానీ బ్లాగర్లలో గొడవలు జరిగిపోతాయి అనుకుంటాను. తమాషాకే లెండి.
ReplyDeleteఅబ్రకదబ్ర గారూ - నేను భర్త గురించి పూర్తిగా తాము మారిపొయే ఆడవాళ్ళ గురించి చెప్తున్నాను. భర్తలని ప్రేమించే భార్యలు వ్యక్తిత్వం లేనివాళ్ళని నా ఉద్దేస్యం కానే కాదు.
ReplyDeleteపెళ్ళయ్యాకా.. పూర్తిగా భార్య కే తమను తాము సమర్పించుకునే భర్తలు ఎందరున్నారంటారు ? వీళ్ళకు తమను సమాజం 'హెన్ పెక్డ్ ' అంటుందేమో అని చింత కదూ !
ఈగో అనేది, సంస్యల్ని అధిగమించడానికీ, పరిస్థితులకు పూర్తిగా లొంగిపోకుండడానికీ పనికి వస్తుందనే నా నమ్మకం.
ఆడవాళ్ళకు 'భర్త ని పిచ్చిగా ప్రేమించే ఫలానా - అనే ముద్ర పడటం' ఎందుకో చాలా ఇష్టం. భార్య కోసం ముస్తాబయ్యే, సిగరెట్లు మానేసే, స్నేహాలను మానేసే మొగుళ్ళు ఉన్నా, ఒక రెండో, మూడో శాతం మాత్రమే ఉంటారు.
'ఆ! వాళ్ళ కోసం మేమెందుకు మారాలి ?' అనే సందేహాలు మగవాళ్ళకు తప్పకుండా వస్తాయి. ఆడవాళ్ళకు వస్తే ప్రోబ్లెం. అదీ విషయం !
పూర్ణిమా,
ReplyDeleteపోకిరి సినిమా లో మహేష్ క్యారెక్టర్ ఎంత careless గా వుంటుందో తెలుసు గా. హీరోయిన్ తన ప్రేమ ఎంత సున్నితంగా వుందో చెప్పాలని ప్రయత్నిస్తున్నా వాడు వెటకారంగానే మాట్లాడతాడు. కానీ ఆ సినిమా లో ఆ క్యారెక్టర్ ని(వాడి లో carelessness ) ఇష్టపడే అమ్మాయిల సంఖ్య ఎంతో నేను చెప్పక్కర్లెదు. ఈ పోలిక సముచితమో కాదో తెలియదు గానీ, నా జీవితం లోకి వచ్చే అబ్బాయి ఇలా వుండాలన్న ఆలోచన లోనే లోపం వుంది. అబ్బాయిల్ని అందలం ఎక్కించటం లోనే లోపం జరుగుతుంది. నువ్వు నాకు దొరకాటం అనేది నా లక్కు అయితే, నేను నీకు దొర్కటం నీ జన్మజన్మల అదృష్టం అనేలా అమ్మాయిలు ఉంటే సమానత్వం గురించి, స్త్రీవాదం గురించి మనం ఇంత చర్చించక్కర్లేదు.
ఇది కంప్లీట్ గా out of the context..but మీ బ్లాగులో క్రింద ఉన్న quote చూశాకా తమాషాగా కనిపించినా జీవితాల్లో జరిగే ట్రాజెడీని గురించి ఇలా చెప్పాలనిపించింది. .
ReplyDelete'When the only door closes, the bottom opens..."(into abyss).
మీ బ్లాగులో ఉన్న quote:
When one door of happiness cloes, another opens, but often we look so long at the closed door that we do not see the one that has been opened for us.
- Helen Keller
'భార్య కోసం మారే మగాళ్లు చాలా తక్కువ' అనే మీ వ్యాఖ్య తప్పు. అలాంటి వాళ్లు చాలా ఎక్కువ. బ్రహ్మచారి జీవితానికి, గృహస్థ జీవితానికీ ఉన్న తేడా త్వరగా అర్ధం చేసుకునేది పురుషులే. ఉదాహరణలు మీ ఇంట్లోనే దొరకొచ్చు - మీరు చూడాలనుకుంటే.
ReplyDeleteఇక ఇగో. ఇది ఎక్కడైనా ఉండొచ్చు కానీ భార్యా భర్తల మధ్య కాదు. భార్య ఎల్లప్పుడూ తను చెప్పినట్లే ఆడాలి అనుకోవటం ఎంత తప్పో, మొగుడు చెప్పే ప్రతిదాన్నీ 'ఓ మగాడు చెప్పేది నేనెందుకు వినాలి' అన్న కోణంలోనుండే చూడటమూ అంతే తప్పు. తమని తాము ఫెమినిస్టులనుకునేవాళ్లతో వచ్చిన తంటా ఇదే. వీళ్ల ఆలోచనలెప్పుడూ 'నేను, నా ఇష్టం' అన్నట్లే ఉంటాయి కానీ 'మనం, మన కుటుంబం' అన్నట్లుండవు. అదేమంటే, 'మగాళ్లు మాత్రం అలా చెయ్యరా, ఇలా చెయ్యరా అంటూ వితండ వాదాలు'. మొగుడు సిగరెట్లు, మందు తాగి చెడిపోతున్నాడని 'మేమేం తక్కువ. నేనూ అవన్నీ మొదలెడతా' అనుకోవటమా ఫెమినిజం? ఫెమినిస్టుని అనుకుంటూ ఇలా తయారయిన వాళ్లు నాకు తెలుసు మరి! ఎవరికి ఉపయోగం ఇటువంటివాటివల్ల?
చివరగా ఒకటి. రెండు చేతులూ కలిస్తేనే చప్పట్లు. లోపాలు లేని వాళ్లెవరూ ఉండరు. ఆడైనా, మగైనా, అవతలి మనిషిని మనిషిగా గుర్తించటం ముఖ్యం. దాన్ని గుర్తించకుండా ఆ ఇజమూ, ఈ ఇజమూ అనే పేర్లు తగిలించుకుని లోకంలో ఆడాళ్ల కష్టాలన్నిటికీ పురుషులే కారణం అన్నట్లు మాట్లాడటం సరి కాదు.
ఇండెపెండెంట్ గారు.. మీ కోట్ కూడా బావుంది. చాలా థాంక్స్. దానిని నోటీస్ చేసినందుకు.
ReplyDeleteమురళి - మీరన్న మాట చాలా బావుంది. అయితే, అలాంటి అబ్బాయిలు బాయ్ ఫ్రెండ్ లుగా ఒకే గానీ భర్తలుగా పనికిరారేమో! మీరు చెప్పేరే - అంత విజ్ఞత మగ పిల్లలూ, ఆడ పిల్లలూ ఇద్దరికీ వుంటే సమస్యలే ఉండవు గా ! అందుకే ఈ తంటా అంతా.
అబ్రకదబ్ర గారు -
ReplyDeleteమీరన్న విషయం గురించి ఆలోచించాను. మరి నేను ఫెమినిస్టుని కాదు. నా జీవితంలో అతి దగ్గరైన పురుషులు - మా నాన్న గారూ, మా వారూ.. జెంటిల్ మేన్ లు కావటం మూలానా నేను ఎక్కువగా తిరగబడను అనుకుంటాను. అయితే, మిగతా వారి ప్లయిట్ చూసి కాస్త ఆవేశపడతాను.
ఫెమినిసం అంటే - మగవాళ్ళను ద్వేషించడం కాదేమో ! ఎవరి బ్రతుకు వాళ్ళు బ్రతికి, మిగతా వారిని బ్రతకనివ్వటమే న్యాయం. ఏ ఇజమైనా, ధర్మమైనా ఈ పాయింట్ చుట్టూనే తిరుగుతుంది. మన జోలికి ఎవరన్నా వస్తే తిరగబడటం, ఆత్మ రక్షణ చేసుకోవడం, ఒక జంతు లక్షణం... ఇది సర్వైవల్ కి కావాలి గా..! ఇప్పుడు ఇది జెండర్ స్పెసిఫిక్ కావడం.. కొంచెం ఆందోళన చెందాల్సిన విషయం. అంతే!
ఇక్కడ ఎవరూ పెర్ఫెక్ట్ కారన్న మాట నిజమే. నేనూ అందరు మగవాళ్ళ మీదా కత్తి దుయ్యలేదు. మీరు ఒక సెట్ ఆఫ్ విమెన్ గురించి ఆలోచిస్తే, నేనూ ఒక సెట్ ఆఫ్ మెన్ ఎలా అలోచిస్తారో చెప్పాను. మగాళ్ళే ఆడవాళ్ళ కష్టాలకు కారణం అనే థియెరీ ఏమీ లేదు ఇక్కడ. కొందరు మగవాళ్ళు - కొందరు ఆడవాళ్ళ కష్టాలకు కారణం. ఒకే ?
ఈ కొందరు ఆడవాళ్ళకు స్వావలంబన ఉండి ఉంటే, వీళ్ళ కష్టాల తీవ్రత తగ్గి ఉండేది. ఈ స్వావలంబన మీద ఒక్కొక్కరికీ ఒక్కొక్క అభిప్రాయం ఉంటుంది.
మనలో మన మాట - ప్రపంచం అంతా పెర్ఫెక్ట్ అయిపోతె ప్రోబ్లెం కదా. మనకి టైం పాస్ ఎలా ?
This comment has been removed by the author.
ReplyDeleteఆర్యా! స్త్రీ పక్షపాతం శీర్షికలో విషయమంతా అక్షర సత్యాలు.ఈ విషయంలో నిర్ద్వంద్వంగా నా అభిప్రాయాన్ని తెలియ జేస్తున్నాను " యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతాః "కాని ఇప్పుడు యిందుకు వ్యతిరేక పోకడలు సమాజంలో చోటు చేసుకొంటున్నాయి. నా ఆవేదనను శ్రీ శిరిడీశ దేవ శతకంలో ఒక పద్యం లో యిలావ్యక్తపరిచాను. చూడండి.
ReplyDeleteఉ:-సున్నితమైన దేహమున సూదులు గ్రుచ్చు నొకండు. దుష్ట సం
పన్నుడొకండు దౌష్ట్యములు పల్కుచు గాయము సేయు గుండెలో.
యెన్నని యోర్చుకో గలరు? ఎవ్వరి కేమని చెప్పుకొంద్రు? నీ
కన్నుల గావుమయ్య కులకాంతల శ్రీ శిరిడీశ దేవరా !
నామనసులోని ఉక్రోషం ఈ క్రింది పద్యంలో చూదండి.
చ:-మగువలపైన మూర్ఖత నమానుష హింసల నేచు మూర్ఖులన్
భగ భగ మండు యగ్ని పాలొనరింపుముపేక్ష యెల? యీ
మగువల కావకున్న వర మాతృ జనంబిక మృగ్యమౌను. నీ
తెగువను జూపి బ్రోవుమయ తీరుగ. శ్రీ శిరిడీశ దేవరా !
నాతో మీరూ యేకీభవిస్తారనుకొటాను.
నమస్తే
చింతా రామ కృష్ణా రావు.
{ఆంధ్రామృతం బ్లాగ్}
This comment has been removed by the author.
ReplyDeleteస్త్రీ పక్షపాతం వ్యాసంపై నా వ్యాఖ్యలో 2 వ పద్యంలో 2వ పాదంలో ఒక పదం పొరపాటున ముద్రితం కాలేదు.అది మళ్ళే వ్రాస్తున్నాను.
ReplyDelete" భగ భగ మండుయగ్ని పాలొనరింపు ముపేక్షయేల" { తప్పు}
" భగ భగ మండు యగ్ని శిఖ పాలొనరింపు ముపేక్ష యేల " {ఒప్పు}
చింతా రామ కృష్ణా రావు.
This comment has been removed by the author.
ReplyDelete