Pages

31/07/2008

కధలు - ఆర్ కే నారాయణ్

ఈ రోజు రెండు ఆర్.కె. నారాయణ్ కధలు చదివాను. కధ చదివాకా.. ఎప్పట్లాగే ఒక 'ఎఫెక్ట్' పడింది గానీ.. ఈ సారి ఈ 'ఎఫెక్ట్' తో పాటూ కధ అసలు ఎలా రాయాలన్నదాన్ని గురించి కూడా ఆలోచించేను.


ఈ రెండూ కధలూ Super funny గా ఉన్నాయి. వీటిలో మొదటిది - Woman in the Window

ఈ కధ భలే ఉంది. దీనిలో మన హీరో ఒక ఆడిటరు. సివిల్ / ప్రొడక్షన్ సైట్ కి డెప్యూట్ అయి, వెళుతూ, చిన్న ఆడిట్ పనులు చూసుకుంటూ వస్తూ ఉంటాడు. ఈ సైట్లు ఎక్కడో కారు అడవుల్లో లేదా కుగ్రామాల్లో ఉంటాయి. ఈయన మరీ పిరికి వాడు కాకపోయినా - సైట్ లో తన దగ్గరికి వచ్చే బిల్లుల్లో దేన్నీ ప్రశ్నిచేంత ధైర్యం లేనివాడు. ఎప్పటికప్పుడు పని ముగించుకుని వెళదాం లే అనుకునే సాధారణ యువకుడు ! ఇతనికి, సైట్ లో ఒక ఇల్లు ప్రొవైడ్ చెయ్యబడుతుంది ! ఆ ఇంట్లో అంబీ అనే ఒక వంట వాడు -కం- నౌఖరు ఉంటాడు.

ఈ అంభీ ఒక వాగుడు కాయ ! సినిమా పత్రికలు చదువుతూ సినిమా హీరోయిన్ ల గురించి భలే గాసిప్ చెప్తూ ఉంటాడు ! రాజకీయ నాయకులూ - ఊర్లో ఏనుగు దాడి చేస్తే తను చేసిన హీరో పన్లూ.. ఒకటి కాదు. ఏదో ఒకటి చెప్తూనే ఉంటాడు. ఈ చెప్పడం కూడా ఎంత రసరమ్య శ్రవణానందకరంగా చెప్తాడంటే - మన హీరో గారికి అదొక్కటే టైం పాస్. ఆ అరణ్యంలో బయటికి వ్యాహ్యాళికి పోదామన్నా ఏ పాములో కుట్టేస్తాయని భయం ! ఏ పుస్తకమో పట్టుకుందామంటే, అంభీ మాటలు దాన్ని డామినేట్ చేసేస్తాయి. So, ప్రపంచం లో తనకు తెలియని వింతలూ విశేషాలూ అంభీ గొంతులో వింటూ కాలక్షేపం చేస్తూ ఉంటాడు మన హీరో.

అయితే ఆఖరికి ఒక నాడు ఈ అంభీ - కబుర్లు దెయ్యాల మీదికి మళ్ళుతాయి. దెయ్యాలంటే నమ్మకం లేని హీరో - అంభీ వర్ణనలకూ, తను చెప్పే కబుర్లకి తీసుకొచ్చే ప్రమాణాలూ మాత్రం ఎక్కడో హీరో ని ఇరుకుని పెడతాయి. వాళ్ళు ఉంటూ ఉన్న ఇల్లు శ్మసానంలో కట్టినదనీ - చనిపోయిన వాళ్ళ అంతిమ సంస్కారాలు జరగక పోతే వాళ్ళు దెయ్యాలవుతారనీ - అలాంటి దెయ్యాన్ని - ఒక స్త్రీ దెయ్యాన్ని తను చూసేడనీ - చాలా నమ్మకంగా చెప్తాడు ! ఆ చెప్పడం కూడా ఎంత వివరంగా చెప్తాడంటే, హీరో కి వొళ్ళు గగుర్పొడుస్తుంది. ఆ ఫలానా స్త్రీ దెయ్యం బహుసా గర్భవతి అయుంటుందనీ, ఎందుకంటే ఆవిడ నడుము కి ఒక చిన్న పిల్ల వాని (Foetus) అస్పష్ట రూపం చేతుల్తో చుట్టుకుని వేలాడుతూ ఉంటుందనీ - తల పండిన హారర్ రచయిత లాగా చెప్తాడు అంభీ !


బాబోయ్! ఈ Description కి ఝడుసుకు చచ్చినా, బయట పడకుండా ఎలానో నెట్టుకొస్తాడు హీరో. పైగా తన అధైర్యాన్ని బయటపెట్టకుండా పెద్ద జోక్ చెప్పినట్టు విరగబడి నవ్వుతాడు ! అది ఒక నదీ పరీవాహక ప్రాంతం. ఒకప్పుడెప్పుడో వరదలకి అక్కడి శ్మశానం కొట్టుకుపోయిందిట ! ఈ దెయ్యాల గొడవ నాకెందుకులే అనుకుని ఎంత త్వరగా ఆ ప్రాంతం నుండీ బయట పడదామా అని ఉంటుంది అతనికి ! ఈ లోగా అదృష్టవత్తూ అతనికి బదిలీ అవుతుంది. వెళ్ళాల్సిన తారీఖు కూడా తెలుస్తుంది. కానీ దెయ్యం ఆలోచెనల తో భయపడిన వాడు - ఎలానో నెమ్మదిగా అంభీ కబుర్లతో కాలక్షేపం చేస్తూ ఆ దెయ్యం ప్రస్తావనే రాకుండా చివరి రోజు దాకా నెట్టుకొస్తాడు. ఈ రోజుల్లో అంభీ అతని బెడ్ రూం పక్కనే నేల మీద పడుకుంటూ ఉంటాడు. దెయ్యం భయానికి హీరో గది తలుపులు క్రాస్ వెంటిలేషన్ కోసం అంటూ Bedroom Doors తెరిచే పెట్టుకుని నిద్రిస్తూ ఉంటాడు.


ఆఖరికి రేప్పొద్దున్నే బయల్దేరాలనగా - రాత్రి నిద్ర పోతున్నవాడికి హఠాత్తుగా మెలకువ వస్తుంది. టైం ఎంతైందో చూసుకోవడానికి ప్రయత్నిస్తుండగా ఒక స్త్రీ ఆకారం ఆ మసక చీకట్లో తన బెడ్ పక్కగా కనిపిస్తుంది. వీడికి పై ప్రాణాలు పైకి పోతాయి. ఆ స్త్రీ నడుముకి వేలాడుతున్న ఫీటస్ కూడా స్పష్టంగా కనిపిస్తుంది. నాలుగు కళ్ళూ అతన్ని చూస్తుంటే, ఆ దెయ్యం దెబ్బకి కళ్ళు గాట్టిగా మూసుకుని దుప్పటి కప్పుకుని పడుకుంటాడు. తెల్లారి ఎప్పుడో నిద్ర పడుతుంది.


అయితే, లేచాక మాత్రం - అపనమ్మకం, పిరికితనాల మధ్య ఊగుతున్న మనసుని అదుపు లోకి పెట్టేందుకు నానా రకాల ఆలోచనలు చేస్తాడు హీరో ! ''ఒకె ! ఇన్నాళ్ళూ అంభి గాడి వర్ణనలు విన్నాను కాబట్టి, అన్నం సరిపోక పోబట్టి, మగత నిద్ర లో ఏదో పిచ్చి కల కని ఉంటాను లే'' అని అనుకుంటూ ఉంటాడు.


స్నానించి, పక్కా బట్టలూ సర్దుకుని స్టేషన్ కు వెళ్ళేందుకు జీపు ఎక్కబోతుండగా అంభీ - అంటాడు 'ఇప్పటికైనా నమ్ముతారా సారు - దెయ్యాల్ని ?' అని ! హీరో కి మతి పోతుంది. 'అదేంటి' - అని అడిగితే, అంభి చెప్తాడు - 'రాత్రి మీరు ఆ ఆడ మనిషి దెయ్యాన్ని చూసారు సార్ ! నేనూ చూసాను !' అని! ఇంక అంతే!! సామాన్లు జీపు లోకి విసిరి, హీరో జీపు తో ఆ ప్రాంతం నుంచీ పరార్ !


ఇంకో కధ - The Gold Frame.


ఇదో ఫోటోలకు ఫ్రేములు కట్టే 'దాస్ ' కధ! దాస్ పనితనం పేరెన్నిక గన్నది. ఇతని షాపు కి రక రకాల ఫోటోలు ఫ్రేములు కట్టించడానికి వస్తూ ఉంటాయి. వీటిల్లో పెద్దవాళ్ళ ఫోటోలూ, దేవీ దేవతల ఫోటోలూ ఎక్కువ !


ఒక రోజు ఒక కస్టమర్ ఒక ఫోటో ఫ్రేం కట్టించేందుకు తీసుకొస్తాడు. ఆ ఫోటోలోని పెద్దాయన మీద ఇతనికి ఎంత ప్రేమో, అభిమానమో వ్యక్తపరిచేందుకు అతనికి చాలా మంచి ఫ్రేం కావాలిట ! ఆ కస్టమరు మహా డిమాండింగ్ టైపు. నానా హంగామా చేసి ఒక ఫ్రేం - 'ద బెస్ట్ క్వాలిటీ' ది కావాలని గొడవ పెడతాడు ! ఆఖరికి దాస్ చెప్పగా గుండ్రని కటింగ్ ఉన్న గోల్డెన్ ఫ్రేం ఎంచుకుంటాడు ! దాస్ కూడా కొంచెం స్టైల్ కొడుతూనే ఉంటాడు. మొత్తానికి - ఫ్రేం కట్టడానికి రెండు వారాల వ్యవధి కి బేరం కుదురుతుంది.


అయితే, దురదృష్టవశాత్తూ ఆ ఫ్రేం కట్టబోయేంతలో పెద్దయన ఫోటో మీద ప్రమాదవశాత్తూ ఎనామిల్ చిందుతుంది. దాస్ ఆ షాక్ నుంచీ తేరుకుని చెరపబోయేంతలో ఫోటో కి చాలా డేమేజీ జరుగుతుంది. ఇలా ఫోటో తన చేతిలో నాశనం అవడం దాస్ జీవితంలో మొదటిసారి ! కాబట్టి తను చేసిన పనికి దాస్ కొద్ది క్షణాలు నిస్చేష్టుడౌతాడు ! అసలే ఈ కస్టమరు మహా ధనవంతుడు ! ఎంత డబ్బైనా పర్లేదు 'ద బెస్ట్' కావాలని డిమేండ్ చేసేడు. ఈ ఫోటో ని అతను చూస్తే ఏమయినా ఉందా! అని బెంగ పడతాడు.


అయితే అతని దగ్గర కొన్ని పాత ఫోటోలున్నాయి. వాటితో ఎలాగో ఒకలా మానేజ్ చేసి ఫోటొ ని ఎలానో ఒక రూపు కి తెస్తాడు. అయినా మారిన పెద్దాయన మొహానికి జరిగిన డేమేజ్ పూర్తిగా దిద్ద బడదు. ఎలానో దానికి అదిరే గుండె తో గోల్డెన్ ఫ్రేం కట్టి పేపర్ చుట్టి పెడతాడు కస్టమరు మహాశయుని కోసం ఎదురు చూస్తూ !


సరిగ్గా రెండు వారాలకి కస్టమరు గారు వస్తారు. దేవుడికి దణ్ణం పెట్టుకుని, గుండె చిక్కబెట్టుకుని పేపరు రాప్ ను విప్పి చూపిస్తాడు దాస్ ఆ ఫోటో ని అతనికి ! అంతవరకూ ఇంపేషంట్ గా ఎదురు చూసిన ఆ కస్టమరు దాస్ ఆ రేప్ ని వెప్పేందుకు చేస్తున్న ఆలస్యానికే విసుక్కుంటాడు ! తీరా ఫోటో ని చూసి ఏమంటాడో ఏమిటో అని బెంగ పెట్టుకున్న దాస్ కి రెలీఫ్ గా ఆ కస్టమరు ఒక్క మాటంటాడు - ఏం చేసేవబ్బా ఈ ఫోటోని ? నేను ఒవల్ షేప్ అంటే నువ్వు గుండ్రని షేప్ లో చేసేవేంటి ? అని!


ఈ రెండు కధలూ భలే ఉన్నాయనిపించింది. తెగే దాకా టెన్షన్ పెట్టి చంపి, నవ్వించేసాడు రచయిత మనల్ని. కధలు ఎలా రాయాలీ అంటే.. మంచి ఎఫ్ఫెక్ట్ కోసం వాటికి ఒక ముగింపు ఉండకూడదు ! వాళ్ళు ఇలా ఎందుకన్నారు, వీళ్ళు అలా ఎందుకు ప్రవర్తించేరు అని మనం విస్లేషించుకునీలా, గమ్మత్తుగా విడిపోవాలి. దటీస్ ఆర్.కే !

2 comments:

  1. సుజాత గారు,
    కథలు బాగున్నాయి. నేనే స్వయంగా చదివినట్లనిపించింది. తీవ్రవాదం గురించి మీరు రాసిన బ్లాగులు తీరిగ్గ చదివి కామెంట్ రాస్తాను.

    ReplyDelete

వ్యాఖ్యానించినందుకు చాలా చాలా థాంక్స్.