Pages

10/01/2026

The Duenna (అనువాద కథ)

 


                                        The Duenna

 

లారా డేలకోర్ట్, ఎంతో సంశయం, మీమాంసల తరవాత, తరతరాలుగా శీలం అని పిలువబడే సంకెలని,  జూలియన్ ట్రెవెల్ చేస్తూ వచ్చిన పలు విజ్ఞప్తుల సుడిగుండంలో ఉక్కిరిబిక్కిరై, ఎలానో పోగొట్టుకుంది.  వాళ్ళిద్దరూ ఇప్పటి దాకా స్నేహితులే. రేపట్నించి ప్రేమికులు.

 

అతని చేతుల్లో ఒదిగిపోయి, ఆమె తలని అతని వక్షం మీద వాల్చినపుడు, మధ్య మధ్య లో, అదురుతున్న వాళ్ళ అధరాలు వొణుకొతూ ముద్దులోకి కౌగిలించుకున్నప్పుడు, ఆమె మనసు లోకి, ఏవేవో పొంతన లేని విచిత్రమైన ఆలోచనలు, నీడల్లా కదిలి తనని ఎన్నో భయాందోళనలకు గురి చేస్తాయి. తన ఈ లొంగుబాటు ఏ విపరీత పరిణామాలకు దారితీస్తుందో అనే జంకు ఆమెను నిలవనివ్వదు.

 

ఆమె భర్త 'రోజర్ డేలకోర్ట్' ఆమె కన్నా ముప్ఫయ్యేళ్ళు పెద్ద. ఇప్పటికీ పటువైన వ్యక్తే అయినా అతని వయసు రీత్యా ఆ పటువు అతన్ని  అనాలోచితంగా, వెచ్చని తీరాలవైపు పరిగెట్టేలా చేస్తూంటుంది. అందుకే అతను క్రిస్మస్ మర్నాడే లండన్ విడిచి స్నేహితుని పడవ మీద మెడిటెరేనియన్ తీరానికి ఓ నెల రోజుల నౌకాయానానికి ప్రయాణమయ్యాడు. అక్కడికి వారం పోయాక, నిలువెత్తు స్వార్ధంతో తాను ఏనాడూ కాణీ అన్నా విలువ ఇవ్వని అతని భార్య తన జీవితంలో అసలు ఎన్నడూ చేయని సాహసానికి పూనుకుంటుందని అతను ఊహించి కూడా వుండడు.    అలానే ఆమె, తను కల్లో కూడా చేయబోని సాహసానికి పూనుకుని, ఒంటరి  ప్రయాణం చేసి, ‘ద ఫాలీ అనబడే ఆ ఒంటి అంతస్తు మేడ ఇంటిని చేరుకుంది. ఈ ఇల్లు ఆమె ప్రియుడు జూలియన్ ట్రెవెల్ ముత్తాతది.

 

ఎన్నో ఏళ్ళ పురాతనమైన ఆ అత్భుతమైన ఆ ఇల్లు ఓ విశాలమైన సెలయేటి ఒడ్డున ఉన్న ఇరుకు సందుచివర కట్టి ఉంది. ఈ ఇంటిని ప్రధానంగా ట్రవెల్ ముత్తాత తన ప్రియురాలు, ఒకప్పట్లో పారిస్ లో సుప్రసిద్ధ ఫ్రెంచ్ నృత్యకారిణి, అయిన ల బెల్ జూలీ కోసం ప్రత్యేకంగా కట్టించారు. పాపం ఆ పిల్ల అతని ప్రేమలో బందీ అయి, తన గత జీవితాన్ని అంతటినీ విడిచిపెట్టేసి, ఆ ఇంట్లో నిరంతర అజ్ఞాతవాసంలో చనిపోయేవరకూ గడిపిందని అంటారు. 

 

లారా, తన ప్రియుడి సామీప్యంలో  ఆశ్చర్యకరంగా ప్రశాంతతనే అనుభవించినా, అతని సాంగత్యం ఆమెను భయంలో, ఆందోళనలో ముంచెత్తేది. ఆమె ఆలోచనలన్నీ నిరంతరం, తన కొడుకు డేవిడ్ చుట్టూనే అల్లుకునేవి. ఇపుడు ఆమెను గుండెకు హత్తుకుని ప్రేమగా కౌగిలించుకుంటున్న మనిషి దొరికే ముందు వరకు లారా లోకం అంతా పిల్లవాడే. ఆమె నిరాశామయమైన శోకతప్త హృదయం, ఆ పిల్లాడి కోసమే కొట్టుకునేది. అతని వల్లే ఆమె కు బ్రతుకు మీద ఆశ జీవించి ఉంది.

ఆ పిల్లవాడు ఇపుడు కొత్త సంవత్సరం రోజుని తన తల్లి ప్రాణ స్నేహితురురాలి ఇంట్లో, మిగతా పిల్లల కేరింతల మధ్య ఆనందకరమైన వాతారణంలో గడిపే ఏర్పాటయింది. అందుకే తన కొడుకు తనని గురించి బెంగ పడడని లారా ఆశ. ఇదే ఇంకో సందర్భంలో అయితే అలా పిల్లాడిని విడిచిపెట్టి దూరంగా రావడం అన్న ఊహే ఆమెకు గుండెలో బాకుతో పొడిచినంత బాధ కలిగించి ఉండేది. కానీ ఇపుడు బాధ స్థానాన్ని భయం భర్తీ చేసింది. డేవిడ్ తండ్రికి, అనగా తన భర్తకు తన నిజం తెలిస్తే దానికి ప్రతిగా అతను విధించబోయే శిక్ష ఏమిటో ఆమెకు చూచాయగా తెలుసు.

 

తన తరానికి చెందిన ఎందరో మగవాళ్ళలా రోజెర్ డేలకోర్ట్ కు ఆడవాళ్ళంటే హీనాభిప్రాయమే ఉంది.  అతని ఉద్దేశ్యంలో ఆశపడిన ఆడది ఎప్పటికీ చెడినదే. అయితే, తన భార్య విషయం లో మాత్రం ఈ అభిప్రాయాంలో ఓ మినహాయింపు ఉంది. లారా ఎప్పటికైనా దేనిగురించైనా ఆశపడుతుందని, ఆమెకు కోరికనేది ఉంటుందనీ అతని మురికి, మూర్ఖపు మనసుకు తట్టదు. అతని దృష్టి లో ఒక వేళ ఆమె ఏ ఆకర్షణకైనా గురైనా దానిని అణుచుకోగలదు. వ్యతిరేకించగలదు. ఒకవేళ అలాంటి ఉద్రేకాలకేమైనా ఆమె లొంగిపోతేఆవిషయం గానీ తను పసిగట్టగలిగితే, దాని పర్యవసానం పిల్లవాడినుండీ, ఆమెను తక్షణం విడదీయడమే. ఆ తరవాతే విడాకులు ఇస్తాడు. అదీ ఆమెకు తగిన శిక్ష, ఆమె ఎన్నటికీ భయపడే శిక్ష.

ఆమె తల్లి ఆమెను ఈ విలాసపురుషుడితో, పెళ్ళి లోకి అమ్మేనాటికి లారా పదిహేడేళ్ళ పిల్ల. ఇప్పటికి అతనితో పదేళ్ళుగా బ్రతుకుతూంది. ఓ మూడేళ్ళు ఆమె ఓ ఆట వస్తువు. అపుడు హటాత్తుగా తమకు పుట్టిన పిల్లవాడికి రెండేళ్ళు వచ్చేసరికి, అతనికి ఆమె అంటే మొహం మొత్తింది. ఇపుడు ఒకరు లండన్ లోనూ,  ఒకరు గ్రామం లోనూ నివశిస్తూ 'ఒకే చూరు' కింద ఉన్నా, వాళ్ళని ఎరిగిన వాళ్ళ దృష్టి లో డేలాకోర్టు దంపతులు మిగిలిన ఆధునిక జంటల కన్నా నయమే. ఒకోసారి వారాల తరబడి విడి విడి గా ఉంటారు. రోజర్ డేలకోర్ట్ కు, వేట వినోదం, అతనింకా వేట కూ, చేపలు పట్టడానికీ, అంతులేను ఉత్సాహంతో వెళ్తూనే ఉంటాడు. అతని భార్యకు ఇవేవీ నప్పవు.

 

రోజులు గడిచే కొద్దీ లారా కు ఈ ఆనందం లేని బ్రతుకు దుర్భరం అవుతూ వచ్చింది. అయితే ఆమె జీవితంలో కొడుకు ఆగమనం మళ్ళీ వెలుగు తెచ్చినట్టే. ఆమె మసక నీడల్లాంటి ఆలోచనల్ని, పిల్లవాడి బాధ్యతలు మెరుస్తూ కప్పిపెట్టేవి. అయితే, గొప్ప ప్రేమ వెనుక గొప్ప భయం కూడా ఉంటుంది. ఏడాది క్రితం, తండ్రి ఆజ్ఞ మీద, డేవిడ్ ప్రిపరేటారీ స్కూల్ కి  వెళ్ళీప్పట్నించీ, అతని తల్లి తీవ్రమైన ఒంటరితనంలో కూరుకుపోయింది. ఈ రోజుల్లోనే ఆమె ఈ జూలియన్ ట్రెవిల్ ని కలవడం.

 

జీవితంలో అనూహ్యంగా జరిగే ప్రమాదాలతోనే మానవ జీవితం నిండిపోయినట్టు, ఆమె, అతనూ యార్క్ షైర్ పల్లె లో ఒక పార్టీలో కలిసారు. వీళ్ళని ఆహ్వానించిన ఓ అన్నా చెల్లెళ్ళు లారా కు దూరపు బంధువులు. ఆనాటి అతిధులు వీరిద్దరే. ఆ అన్నా చెల్లెళ్ళు జాన్, మేరీలు, వీళ్ళిద్దరూ అకస్మాత్తుగా స్నేహితులయిపోవడాన్ని ఆనందంగానే చూసారు. మేరీ జాన్ తో అయితే, కాస్త అసౌకర్యంగా, "లారా, ట్రెవిల్ లు మంచి స్నేహితులు మాత్రమే" అంది. ఒక మంచి మగవాడికి ఒక మంచి పెళ్ళయిన ఆడ స్నేహితురాలుండడం మంచి విషయమే.

 

అది జరిగి ఎనిమిది నెలలయింది. అప్పటినించి ట్రెవెల్, లారా కోసం తన జీవితాన్నే పూర్తిగా మార్చేసుకున్నాడు. ఆమె, ఇప్పటికీ అతని నుంచి అనంతంగా  'పొందుతూనే' ఉంది గానీ, ఏన్నడూ ఇవ్వగలిగే స్థితిలో లేదు. అది సాధారణంగా ఆత్మగౌరవంతో మసిలే ఆడమనిషి ప్రవర్తనే అనొచ్చు.

 

ఫాలీకి చేసిన సుదీర్ఘ ప్రయాణంలో  ప్రేమికులు పెద్దగా మాటాడుకో లేదు.. ఆ ఏకాంతంలో ఒకరికి ఒకరు తోడుగా కాసేపు గడపగలగడమే వాళ్ళిద్దరికీ పెద్ద వరం లా అనిపించింది. 

 

ట్రెవెల్ ఆమెను ఓ దూరాన ఉన్న రైలు జంక్షన్ లో కలుసుకున్నాడు. 'మిసెస్ డార్సీ' అనే మహిళ పేరు న అద్దెకు తీసుకున్న కారు ఆమె ను తీసుకుని ద ఫాలీ కి తీసుకెళ్ళింది. ఈ ఏర్పాటు, ఒకవేళ ఎవరన్నా గమనిస్తే, లారా, ట్రెవెల్ సవితి తల్లి ఇంటికి, 'మిసెస్ డార్సీ' అతిధి గా వచ్చినట్టు భావించాలన్న ఉద్దేశ్యంతో చేసినది.

డార్సీ అనేది లారా వివాహపూర్వపు పేరు. ఆ పేరు ఒకటే, ఆమె తన స్వతంత్రతను ఎరిగేలా చేయగలదు. ఆమె, ఆమె ప్రియుడు ఇద్దరూ, స్త్రీ పురుషులు మాత్రమే ఆడగల ఇలాంటి  ప్రమాదకరమైన, ఉత్తేజితమైన నాటకాలకు బొత్తిగా కొత్త.

 

వారి అద్దె కారు వాళ్ళను విశాలమైన మార్గాల నుండీ, ఈ ఒంటరి దారుల్లోకి తీసుకొచ్చింది. ఇపుడు వాళ్ళు ట్రెవెల్ పాలెస్ జాడలకు అత్యంత వేగంగానే చేరుకున్నారు. వాళ్ళ ప్రయాణం, గమ్యాన్ని చేరుకుంది.

 

అతని ఇరుగు పొరుగుల్ని అడిగితే, వాళ్ళు జూలియెన్ ట్రెవెల్ ఓ మొహమాటస్తుడైన మంచి పిల్లాడనే చెప్తారు. లారా డేలకోర్ట్ అతను ప్రేమించిన మొదటి మహిళ. ఇప్పటికీ, ఈ అనుకోని, సాహసానికీ, ఈ ఆశపడిన ఆనందానికీ ముందు కూడా ఇలా లారాని ఇబ్బంది పెట్టి, ఇలా తనతో రమ్మని ఒప్పించి, ఆమెతో ఇలా గడిపి, తరవాత పట్టుబడితే ఆమె ఎదుర్కోబోయే అవమానానికి, భంగపాటుకూ కారణం అయే హక్కు తనకు  ఉందా అని ప్రశ్నించుకుంటున్నాడు.  ఇద్దరికీ కంగారుగానే ఉంది. ఏదో  చెడు జరగనుందేమో అన్న భయమూ ఉంది. అయినా లారా దీనంతటికీ తన భయాలకు అర్ధం లేదనీ, తాను తగైన ఏర్పాట్లు, చేసుకునే వచ్చిందనీ ధైర్యం చెప్పుకుంది. ఈ ఆందోళనకు తన మనస్సాక్షి మాత్రమే కారణమని, దాన్ని కాసేపు పక్కన పెడితే అంతా సర్దుకుంటుందేమో అనీ ఆమెకి అనిపించింది. ఆమె భయాలన్నీ అతనికీ అర్ధమవుతున్నాయి. ఆమె గౌరవం, ఆమె ఆత్మాభిమానం, ఆమె లజ్జా - అన్నిటినీ అతనూ ఆరాధనతో పరికిస్తూ, ఆ భయాలనన్నింటినీ, ఎరిగినవాడే. ఆమె ఆందోళనని అతను అంతగా పరిశీలించడం, అర్ధం చేసుకోవడమూ, ఆమె గమనించడాన, అతనిపై ఆమె ప్రేమ, అబిమానమూ రెట్టింపయ్యాయి.  అతను అపుడు ఆమెను ఏకాంతంగా ఆ సాయంత్రం గడిపేందుకు సౌకర్యంగా ఉండే ఏర్పాటు చేసాడు. ఫాలీ ని చూసుకునేందుకు ఓ ముసలి ఫ్రెంచు మహిళ, తన భర్త తో కలిసి ఉంటూంటుంది. ఫాలీ కి అరుదుగా వచ్చే అతిధులను చూసుకోవడం ఆమె విధి.

 

ఈ వయసు మీరిన దంపతులు 1871 లో తమ యవ్వనంలో, ఓ పారిస్ కమ్యూన్ లో ఓడిపోతున్న వర్గం వైపు పోరాడి పట్టుబడినపుడు, తనని తాను లిబరల్ గా పిలుచుకునే ట్రెవెల్ నాయనమ్మ రక్షించింది.  ఆమె చట్టానికి  భయపడని ఓ ఉన్నతాదర్శాలున్న స్కాటిష్ మహిళ.    ఆమె వాళ్ళను ఇంగ్లండు కు తీసుకొచ్చినప్పటించి దాదాపు యాభై   ఏళ్ళకు పైగా వాళ్ళు ఫాలీకి అర ఫర్లాంగు దూరంలో ఉన్న కాటేజీ లోనే ఉంటూ వచ్చారు. 

నిజం చెప్పాలంటే ట్రెవెల్, ఈ వృద్ధ దంపతుల్ని చూసి భయపడే పనే లేదని ఎంత నచ్చజెప్పినా లారా కి వాళ్ళంటే గగుర్పాటు, భయమే కలిగింది.  అందుకే ఈ ప్రేమికులిద్దరి మధ్యా ఓ ఒప్పందం జరిగింది. ఆమె ఫాలీ లో ఏకాంతంగానే రాత్రి గడిపేటట్టూ, వాళ్ళిద్దరూ కలుసుకోవడం అనేది జరిగేదల్లా ట్రెవెల్ ఆ రోజుకు వేట ముగించి, "మిసెస్ డార్సీ" ని డిన్నర్ కు మర్యాదపూర్వకంగా కలిసేటప్పుడు మాత్రమే అని.

 

కారు ఆగగానే, అప్పటిదాకా ఒకరికొకరు అల్లుకుని కూర్చున్న ఈ ప్రేమికులిద్దరూ చప్పున విడిపడ్డారు. మనం ఇక్కడ దిగ్గాలి. ఎందుకంటే, ఫాలీ వరకూ కారు వెళ్ళదు. నడుచుకుంటూ వెళ్ళాలి. నేను నీ బాగ్ పట్టుకుంటాను అన్నాడు ట్రెవెల్.  నటన లో భాగంగా ఆమె కారు డ్రైవరుకు డబ్బు చెల్లించి, అతన్ని పంపించేసింది. 

 

సాయంత్రం సంజ కమ్ముకుంటున్న లేత వెలుగుల్లో లారా తనకు ఎడమ వైపు సెలయేటి ఒడ్డు వైపుకు కుంగిన వాలు నేల ను చూసింది. ఏట్లో నీరు ఊదారంగులో ఆకాశాన్ని ప్రతిబింబిస్తూ ఒక చోట ఇరుకైపోయింది. అక్కడ ఓ చిన్న మేడ. చూడడానికి ఏదో పద్ధెనిమిదో శతాబ్దపు టీ రూం లా ఉందే గాని మనుషులు ఉండడానికి కట్టిన మహల్లాగ ఏమీ లేదు. అయితే దాన్లో ఏదొ చెప్పలేని మార్మిక సౌందర్యం, లారాకయితే నమ్మశక్యం కాని ఫెయిరీ ఇల్లు లా అనిపించింది. లారా ఎన్నడూ అడుగుపెడతానని అనుకోని ప్రేమ సామ్రాజ్యం లా ఉందే తప్ప అక్కడ ఓ పురుషుడూ, స్త్రీ నివసించి, తమ ఆనందమూ విషాదమూ పంచుకుని బ్రతికి, మరణించిన ప్రదేశం లానే అనిపించలేదు.

 

'ఇక్కడికి ఎందుకొచ్చానా అని నువ్వు బాధపడకూడదని నా కోరిక' - ట్రెవెల్ గుసగుసగా అన్నాడు.

 

ఆమె చప్పున అంది - 'నేను ఎప్పటికీ సంతోషిస్తాను జూలియన్. బాధపడను'.

 

అతను ఆమె చేతిని తన చేతిలోకి తీసుకుని తన పెదవులకు ఆనించుకున్నాడు. అప్పుడు అన్నాడు. "ముసిలి సెల్సెటీన్ ఈ ఫాలీ ని 'ల బెల్ జూలీ' ఆత్మ పట్టుకుని వేలాడుతుంటుందని చెప్తూంటుంది. నువ్వు అదేమీ నమ్మకు. నీకు దయ్యాలంటే భయంలేదుకద ప్రియతమా?"

 

లారా మసక వెలుగులో బలహీనంగా నవ్వింది. "రక్తమాంసాలున్న మనుషుల పట్ల నాకుండే భయం కన్నా, దయ్యాల భయం తక్కువే"  అని మెల్లగా గొణిగింది. "సెల్సెటీన్, ఆమె భర్తా ఎక్కడ ఉంటారు జూలియెన్?"

వాళ్ళ కాటేజీ ఇక్కడికి కనిపించదు గానీ దగ్గర్లోనే ఉంది. అతని గొంతు గుండెలోకి జారింది. "నీకు ఇక్కడ ఒంటరిగా ఈ రాత్రి గడపడానికి భయం ఏదీ లేదనే చెప్పాను వాళ్ళకి"

 

వాళ్ళిద్దరూ ఆ కాలిబాట చివరిదాకా వచ్చారు. ఆమె దగ్గరితనం ఇచ్చే ఆనందంతో అతన్ని హత్తుకుంటూనే నడిచింది. చివరికి రాళ్ళు పరిచిన ఊదా రంగు ఇంటి వాకిటికీ, సెలయేటికీ మధ్యకు  వచ్చేవరకూ వచ్చేసరికి, ఎటునుండి వచ్చిందో తెలీకుండా అకస్మాత్తు గా తన ముందు ప్రత్యక్షమైన దెయ్యంలాంటి మనిషి అవతారాన్ని చూసి లారా భయపడి కెవ్వుమంది.

 

ఇతను ముసలి జాకెస్.. అన్నాడు చిరాకును అణుచుకుంటూ ట్రెవెల్. ఇతను ఎప్పుడూ అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తుంటాడు.

ఆ చిన్న ఫ్రెంచు పురుషుడు చేతులూపుతూ చాలా ఉత్సాహంగా మాటాడుతున్నాడు. అతిధిని వెచ్చగా ఉంచేందుకు పొద్దుటినుండీ మూడు గదుల్లోనూ నెగడు కాల్చాడంట. మేడం ని ఆహ్వానించేందుకు, ఆతిధ్యాన్ని ఇచ్చేందుకు కాసేపట్లో సెల్సెటీ స్వయంగా ఫాలీ కి రానున్నదంట.

 

ఆ ముసలాడిని మెల్లగా వదిల్చుకున్నాక, జూలియన్ ట్రెవెల్ తాళం కప్ప లోకి తాళాన్ని పెట్టి తిప్పి ఆ బరువైన పురాతన ద్వారాన్ని తెరిచాడు. లారా చిన్ని దేహాన్ని తన దారుఢ్యమైన బాహువుల్లోకి తీసుకుని, గుమ్మం మీంచి ఆమెను ఎత్తుకుని ఏకంగా  లివింగ్ రూం లోకి తీసుకెళ్ళాడు. ఆ గది వందేళ్ళకు పైగా ఎటువంటి మార్పులూ లేకుండా ఉండటాన అక్కడ కాలం అనంతంగా స్థంభించినట్టుగా ఉంది.

 

లారా సంతోషంతో కేక పెట్టింది. ఎంత అందమైన ప్రదేశం జూలియెన్ ! అసలు ఇలా ఉంటుందని నేనెన్నడూ అనుకోలేదు ...."

గది మధ్యలో గోడ లో కి ఉన్న లోతైన నెగడు లో నిప్పు పొడుగ్గా పైకి లేస్తూంది.   ఒక దీపం ఓ గుండ్రని బంగారం అంచున్న మార్బుల్ టేబుల్ మీద వెలుగుతూ ఉంది. ఆ టేబుల్ పక్కనే ఓ  వెడల్పుగా కుదురు పట్టిన ఆర్మ్ చైర్ ఉంది. రాజుల కాలం నాటి ఫర్నిచర్ మీద నెపోలియన్ పారిస్ ని ఏలే రోజుల్నాటి వెలిసిన పసుపు పచ్చ సాటిన్ తో కుట్టి ఉంది. ట్రెవెల్ చెప్పినట్టు ఫాలీ ని ఓ ఫ్రెంచు ప్రియురాలి కోసం కట్టించారు కాబట్టి, లోపల అలంకారాలన్నీ ఆమెకు నచ్చేట్టే ఉండేలా చూసారు. గోడలంతా నెమలి కంఠం రంగు పట్టు వస్త్రం తో  తాపడం చేసారు.  నెగడు పట్టీ అలంకారపు తొడుగు కి పై వైపుఒక నగిషీలు చెక్కిన బంగారు అంచుల అద్దం ఉంది. దానికి కుడి పక్కన ఓ కోడి గుడ్డు ఆకారంలో  ఉన్న ఫ్రేము లో బెల్లి జూలీ చిత్రపటం ఉంది.

 

ఒకరి చేతిలో ఒకరు చేయి వేసుకుని ఇద్దరూ ఆమె నవ్వుతున్న కోమలమైన ముఖాన్ని చూస్తూ నించున్నారు.  "నాకు తెలిసినంత వరకూ ఫ్రాన్సుని వదిలి వచ్చినపుడు ఈ పిల్ల తెచ్చుకున్నదల్లా ఈ చిత్రపటం ఒక్కటే. ఆ జుత్తు మీద ఉన్న పౌడర్ ని బట్టి చూస్తే, ఈ చిత్రాన్ని జూలీ టీనేజ్ లో ఉండగా వేసినట్టున్నారు. అదీ విప్లవానికి ముందు. మా ముత్తాత ఆమెతో ప్రేమలో తలమునకలుగా పడేనాటికి ఆమెకు ఓ ముప్పయ్యేళ్ళు ఉండొచ్చు".

 

అపుడు వాళ్ళు కారులో బైల్దేరినప్పట్నించీ పెట్టుకున్న మాస్క్ ని తీసి.. అతను అన్నాడు. లారా.. "ప్రియతమా.. మొత్తానికి, ఇన్నాళ్ళకు......"

 

అతనికీ, ఆమెకూ, ఆ క్షణం వాళ్ళ వాళ్ళ ప్రపంచం అంతా ఎక్కడికో కుంగిపోయింది. అయినా ఆమె భయాలూ - ఆమె అంతరాత్మా జాగృతమై ఉండడం వల్ల ఆమె తలుపులోకి ఎవరో తాళాన్ని పెట్టడాన్ని వినగలిగింది.

"ఇక నేను నిన్ను విడిచి వెళ్ళాల్సిన సమయం వచ్చినట్టుంది" అన్నాడు అతను అతి కష్టంగా చిన్న గొంతుతో.

 

ఆమె పెదవులు, అతనితో, తను, తన పట్ల అతి జాగ్రత్తతో ఉన్నాడనీ అదే విధంగా వాళ్ళిద్దరూ ఆరోజూ, మర్నాడూ కూడా తమని కుతూహలంతో వెంబడించబోయే  సెల్సెటీన్ చూపుల్నుండీ తప్పించుకోవాలనీ చెప్పబోయింది. తీరా ఆమె తగిన పదాల్ని వెతుక్కునేలోగా, రాతి మెట్ల మీద అడుగుల చప్పుడు వినబడింది.

 

ఆ వచ్చేది సెలెస్టీన్. 'తను రావాల్సిన సమయం కన్నా తొందరగానే వస్తూందే..' అన్నాడు ట్రెవెల్.  వాళ్ళ ముందున్న ద్వారం తెరుచుకుంది. లారా వెంటనే వెనక్కు తిరిగి, సన్నగా, పొడుగ్గా నల్లని దళసరి దుస్తులు ధరించిన ముసలావిడని చూసింది. ఆమె తన తెల్లని జుత్తు కు మస్లిన్ కేప్, భుజాలకు ఫర్ తొడుగూ తొడుక్కుంది.

 

తలుపు మూసి ఓ అడుగు లోపలికి వేసి, కాలం కాని కాలంలో ఫోలీ లో వారం రోజులు గడపడానికొచ్చిన  తన యజమాని వంక చాలా పరిశీలనగా చూసింది 

ఆ చూపు లో దయ తో కూడిన లోతైన సాధారణమైన భావనే ఉన్నా, లారాని మాత్రం అది కలవరపెట్టింది.

 

మంచి ఇంగ్లీషులో సెల్సెటీన్ అంది "మేడం కు ఇక్కడ సౌకర్యంగానే ఉందా అని కనుక్కోవడానికి వచ్చాను. ఏమయినా కావాలా ? వంట చేసి, టేబుల్ మీద వడ్డించడం తో పాటూ, ఇంకేమైనా చెయ్యమంటారా?"

 

"ఏమీ అవసరం లేదు. అంతా సౌకర్యంగానే ఉంది" మెల్లగా అంది లారా.

 

ఆ ముసలామె కొన్ని అడుగులు ముందుకు వేసి, కొత్తగా వచ్చిన లారా కి అర్ధమయినంతమటుకూ, డైనింగ్ రూం అనబడే గదిలోకి వెళ్ళి మాయమైంది.

 

ట్రెవెల్ వొదల్లేక వొదల్లేక "ఇక నేను వెళ్తాను --" అన్నాడు.

లారా బలహీనంగా గుసగుసగా అంది. "నేనో పిరికిదాన్ని జూలియన్ "

 

అతను  వెంటనే "నువ్వు ఇలా కాకపోయుంటే, నేను నిన్ను కోరుకునేవాణ్ణే కాదు" అన్నాడు.

 

ఆమె అతని చేతుల్ని తన చేతుల్లోకి తీసుకుని పెదవులకు తన చెంపకు ఆనించుకుంది.


"కేవలం డేవిడ్ కోసమే - నా భయమంతా - కేవలం వాడి మూలంగానే".

 

ఆమె అలా "భయం" అన్న పదం పలికేసరికీ ఫ్రెంచు స్త్రీ గదిలోకి మళ్ళీ వచ్చింది. "మేడం, నన్ను మీకు తోడుగా పడుకొమ్మంటారా ఈ రాత్రి?"

 

ట్రెవెల్ లారాకు బదులుగా సమాధానం ఇచ్చాడు. "మిసెస్ డార్సీ కి ఏకాంతంగా ఉండటమే ఇష్టం. నా సవతి తల్లి ఎలా అయితే ఫాలీ కి వచ్చినపుడల్లా  ఒంటరిగా ఉండేవారో అలానే తను కూడా ఉంటారు"

 

అతను లారా వైపు తిరిగాడు. "ఇంక నేను సెలవు తీసుకుంటాను. రేపు వేట నుండీ వచ్చాక మీరు దయతో ఆహ్వానిస్తున్నట్టు డిన్నరుకు వస్తాను" అన్నాడు.

లారా లోగొంతు తో సమాధానం చెప్పింది. "రేపు సాయంత్రం మిమ్మల్ని కల్సుకోవడం నాకు చాలా సంతోషాన్ని కలిగిస్తుంది"

 

"అన్నట్టు..." అతను ఓ క్షణం ఆగాడు.

 

సెలెస్టీన్ ఎందుకు అక్కడ వాళ్ళని చూస్తూ నిలబడే ఉందో ? ఆమె అక్కడినించి వెళిపోతే బావుణ్ణు. అతని సవతి తల్లి వచ్చినపుడు క్షణం కూడా నిలబడకుండా పారిపోయేదే.. ఇప్పుడు ఇలా..

 

మొత్తానికి అతను వాక్యాన్ని పూర్తి చేసాడు. " ఫాలీ నుండీ, నా లైబ్రరీ గదికి, ఇక్కడొక ప్రైవేటు టెలిఫోను లైను ఉంది.. మీకు నాతో మాటాడాల్సిన అవసరం ఉంటే దానిని వాడవచ్చు"

చివరికి ఆమె ప్రేమికుడు, సెల్సెటీన్, ఇద్దరూ సెలవు తీసుకుని వెళ్ళాక తన మటుకు తను ఏకాంతం లోకి వచ్చిన అనుభవం కలగగానే లారా కూర్చుని రెండు చేతులతో ముఖాన్ని కప్పుకుంది. ఆమెకు సంతోషంగానూ ఉంది, భరించలేనంత బాధ గా కూడా ఉంది. ఆమె మనసులో సంబరమూ, భయమూ పోటీపడుతున్నాయి.

 

చివరకు ఆమె కరుణాత్మక ఆలోచనలు, 'ల బెల్ జూలీ' మీదకు మళ్ళాయి.   ఆమె ప్రాపంచికంగా తనకున్నదంతా విడిచి పెట్టేసి, ఒక పురుషుడి ప్రేమ కోసం, జాలిగొలిపే గృహ బహిష్కరణ కు లోనై, ఎన్నటికీ అంతమవని అరణ్యవాసం లో ఎలా గడిపిందో.  అలాంటి ధైర్యం, తెగువా తనకూ ఈ రాత్రి కలిగుండేవే, తానే ఓ పిల్లాడి తల్లి కాకపోయి ఉంటే!

 

ఆమె లేచి మెల్లగా ఆ గది పొడవునా నడిచి.. అందమైన జూలీ ఈ సుదీర్ఘమైన దినాల్ని ఒంటరిగా ప్రియుని కోసం వేచి చూస్తూ ఎలా గడిపి ఉండేదో అనుకుంది.

 

ఇప్పుడు ట్రెవెల్ ఈరోజు లారాకి చేసినది ఆనాటి ట్రెవెల్ జూలీ కోసం ఇలానే చేసి ఉంటాడాఆమె పిరికి భయాలను ఇలానే గౌరవించి ఉంటాడా? ఆమె కు ఏదీ తెలీలేదు. బహుశా జూలీ యొక్క ట్రెవెల్ వెళ్ళుంటాడు కానీ జూలీ యొక్క ట్రెవెల్ వెంటనే వచ్చేసి కూడా ఉంటాడు. కానీ లారా యొక్క ట్రెవెల్ మాత్రం ఈ రాత్రికి మరి రాడని ఆమెకు తెలుసు.

 

ఆమె అపుడు ఆ గదిలోని కదలని గాలిలోంచీనడిచి దూసుకొచ్చిన ఓ నిట్టూర్పుని విని వెంటనే వెనక్కి తిరిగింది. 

 

ఆ గదికున్న కర్టెన్ వస్త్రాల పొరల్లో ఏదో ముఖం తప్పుకున్నట్టనిపించి, వెంటనే తెరను తొలగించి చూసింది. ఆ తలుపు తెరవగా బయట ఓ కారిడార్ ఉంది.  కారిడార్ లోకి ఓ అడుగు వేసి పరీక్షగా చూసింది. అక్కడెవరూ లేరు.

 

వెనక్కి వచ్చి, ఆమె మంట పక్కనే ఉన్న కుర్చీ లో చూసింది. అలసటగా ఉండటం వల్ల ఏదో భ్రమ కలిగి ఉంటుంది లే అని ఊరుకుంది. ఆమె ఆలోచనలు మళ్ళీ జూలీ మీ దికే వెళ్ళాయి. ఆమెకు ఎందుకో, తనకూ, ఆ మరణించిన నృత్యకారిణికీ ఏదో బంధం ఉన్నట్టనిపించింది. ఆ బంధం ఎలాంటిదంటే, ఇద్దరూ ఇలానే తమ ప్రేమికులని కలుసుకునేందుకు ఇలా అన్నిటినీ పణంగా పెట్టి, ధైర్యం చేసి,  ప్రమాదపుటంచుల్లో నడిచిన వాళ్ళే. ఈ ప్రేమ కూడా ఎలాంటిది? అక్రమమైనది.


2

 

ఆ రోజు సెలెస్టీన్ తన ఫ్రెంచు ప్రతిభల్నేమీ మర్చిపోలేదని నిరూపించుకుంది. కానీ లారా బాగా అలసి పోవడం వల్లా, బాగా ఉద్రేకంగా ఉండటం వల్ల కూడా అసలు ఏమీ తినలేకపోయింది.  సెలెస్టీన్ పెద్దగా ఏమీ మాటలు కల్పించుకోలేదు గానీ, ఈ 'మిసెస్ డార్సీ' చక్కని ఫ్రెంచు మాటాడగలదని తెలుసుకున్నాక మాత్రం వాగుడు ఆపలేకపోయింది. రాత్రి నిద్రపోయినపుడు ఎటువంటి నిట్టూర్పులో, కీచు గొంతుతో ఏ సన్నని ఏడుపో వినిపించినా భయపడవద్దని. అవి కేవలం జూలీ ఇక్కడ చేసిన 'పాపాల' ఫలితంగా అమె ఆత్మ ఇక్కడే బంధింపబడిపోవడం వల్ల కలిగిన కోపం వల్ల ఇలా చేస్తూంటుందనీ ఏదేదో చెప్పింది.

కానీ లారాకి జూలీ కన్నా, సెలెస్టీన్ అంటేనే భయం కలిగింది. ఆమె మెరిసే బ్రౌన్ కళ్ళు, తోలు మొహాన్ని చూస్తేనే భయం కలుగుతుందసలు. ఆ ముసలావిడ వెళ్ళాకనే లారా అసలు సరిగ్గా ఊపిరి తీసుకోగలిగింది.

 

ఆమె పడుకున్న బెడ్ రూం ఓ వంద సంవత్సరాలకు పైగా ఏ మార్పు చేర్పులకూ గురయినట్టు లేదు. ఆ మంచానికున్న తెరలు లావెండర్ సిల్క్ వి. నేలమీద అబూసాన్ కార్పెట్ ఉంది.  గది చివరి, ఓ విశాలమైన పొట్టి, యువ నెపోలియన్ కాలం నాటి పేరిస్ నుండి తెచ్చినట్టున్న 'లూయీ కాలం' నాటి మంచం ఉంది.

 

ట్రెవెల్ చెప్పిన టెలిఫోన్ ఆమె తలదిండు కు దగ్గరగా ఉన్న ఓ టేబుల్ మీద ఉంది. జూలీ కి ఇలా ఓ స్త్రీ తన బెడ్ మీద పడుకుని ఎక్కడూ దూరాన ఉన్న ప్రియుడితో మాటాడగలగడం సాధ్యమే అని తెలిస్తే ఎంత ఆనందించి ఉండేదిఅదీ జూలీ కున్న ప్రేమికుడి లాంటి వాడు.. ఈ ఫాలీ కి మైలు దూరంగా ఉన్న పెద్ద ఇంటి తాలూకు  యజమాని. 

సెలెస్టీన్ ఆ బరువైన ఎంబ్రాయిడరీ చేసున్న పెద్ద పసుపు పచ్చ కర్టెన్లతో కిటికీ తలుపులు మూసివేయడం మర్చిపోయింది. లారా తనకు దగ్గరగా ఉన్న కిటికీ దగ్గరకు నడిచి, బయట మెరుస్తున్న నీళ్ళతో ఉన్న సెలయేటిని చూస్తూ నించుంది.

 

అక్కడ సెలయేటి కట్ట మీద గుత్తులుగా పూచే గులాబీ పొదలు, ఎడమ వైపు పొడవైన ఇప్పుడు ఆకులులేని మొండి చెట్ట్లు ఆ చీకటి చలికాలం రాత్రిని ఇంకొంచం భయంకరంగా కనిపించేలా చేస్తున్నాయి.

 

టెలిఫోన్ బెల్ మోగింది. ఆమె వెనుతిరిగి గది లోకి పరిగెత్తింది. ఆమె దానిలో జూలియెన్ బలమైన గొంతు వింది.. స్పష్టంగా తొణికిసలాడే ప్రేమాస్పదమైన అతని గొంతు.. అచ్చం అతను ఆమెతో పాటూ అక్కడే ఉన్నట్టు.

 

మరునాడు సూర్యుడు చల్లని అందమైన మృదు శీతాకాల ఉదయాన మెరుస్తూ దర్శనమిచ్చాడు. లారా కు వణికించే సంబరం కలిగింది. దాంతో పాటూ ఆమెకు ఎన్నడూ అనుభవంలోనికి రాని ఒక భావన కూడా కలిగింది. అది - ప్రశాంతత.  ఆమె వెంటనే సెలయేటి ఒడ్డున్న వ్యాహ్యాళికి వెళ్ళింది. సెలెస్టీన్ తయారు చేసిన భోజనం చేసింది. సెల్సెటీన్, లారాని తన సొంత యజమానురాలికన్నా ఎక్కువ శ్రద్ధతోనే చాలా బాగా చూసుకుంది. అన్ని పన్లూ చేసిపెట్టింది.

మూడు గంటల వేళ లారా మళ్ళీ బయట తిరిగేందుకు వెళ్ళింది. ఓ గంట తరవాత తిరిగొచ్చింది. అప్పటికి బాగా చీకటి పడకపోయినా హాలు లో దీపం పెట్టి ఉంది.

 

ఆమె అక్కడినించి బెడ్రూం లోకి వెళ్ళింది. అపుడు ఆమెకు టెలిఫోన్ బెల్ మోగినట్టు అనిపించింది. దాని శబ్దం గట్టిగా రావట్లేదు గానీ, మోగడం మాత్రం సరిగ్గా రాత్రి మోగినట్టే కానీ చాలా చిన్నగా నీరసంగా మోగుతోంది.

 

ఆమె వెంటనే మంచానికి అటుగా వెళ్ళి రిసీవర్ తీసుకుని పట్టుకోగానే, ఎక్కడో సుదీర తీరాల్లోంచీ, యుగాల దూరం నుంచీ  వినిపిస్తున్నట్టు జూలియెన్ ట్రెవెల్ గొంతుక వినిపించింది.

 

ఉన్నావా ప్రియతమా.. నేను చాలా చీకట్లో ఉన్నాను. కానీ మన ప్రేమ నాకు వెలుగు నిచ్చే  దీపం. నా గుండె నిండా నీవే ఉన్నావు... “   అంటూ అతని గొంతు ఎటో మునిగిపోయింది.

అంటే అతను వేట నుండీ ఇంటికి వచ్చేసాడన్నమాట. తొందరగానే వచ్చేసాడే! అయితే కాసేపట్లోనే ఇక్కడికొస్తాడు.

 

ఆమె తన హేట్, కోట్ తీసి, జూలియన్ ఒకసారి తనకి ఎంతో ఇష్టం అని చెప్పిన గౌను వేసుకుంది. ముస్తాబయి, అతని కోసం ఎదురుచూస్తూ హాల్ లో కుర్చీలో కూర్చుంది. క్షణాలు నిముషాలయ్యాయి. నిముషాలు గంటలు.. సమయం బరువుగా నెమ్మదిగా కదులుతూంది. అతను రానేలేదు.

 

చివరికి తలుపులో ఎవరో తాళం పెట్టి తిప్పిన చప్పుడు వినిపించింది. ఆమె చటుక్కున లేచి నించుంది. కానీ వెంటనే ఆమెను నిరుత్సాహం కమ్ముకుంది. ఆ వచ్చింది ఫ్రెంచు మహిళ,  సెల్సెటీన్.

 

సెలెస్టీన్  తన వెనుకగా తలుపు మూసి ముందుకు వచ్చింది. లారా చలి మంటకు దగ్గరగా ఉన్న కుర్చీలో మెల్లగా కూలబడింది. 

"మేడం ! ". ….ఆమె ఆక్రోశిస్తూ అంది. అంటూనే ఆగింది. ఆమె మొహం నిండా విషాదం కమ్ముకుంది.

 

లారా ఆలోచనలు పిల్లాడి మీదికి వచ్చాయి. ఆమె కుర్చీ లోంచి ఉరికింది. "ఏమైంది సెలెస్టీన్? నాకేమైనా సందేశం వచ్చిందా ?"

 

ఆమె భయపడినట్టే, సెల్సెటీన్ మెల్లగా అంది. "దుర్వార్తకు సిద్ధపడండి".

 

"దుర్వార్తా? ఒహ్ ! అసలు తాను పిల్లవాడిని వదిలి ఎలా రాగలిగింది ?"   "ఏమైంది? ఏ దుర్వార్త ?”  లారా ఆందోళన పట్టలేక అరిచింది.

 

"మీకోసం ఏ సందేశమూ రాలేదు. కానీ, కానీ, …మన మంచి, దయామయుడైన యజమాని. మిస్టర్ ట్రెవెల్ మరణించారు. అతను వేటకు వెళ్ళినపుడు చనిపోయాడు. ఈ వార్త తెలిసేసరికి నేను గ్రామంలోనే ఉన్నాను" ఆమె గబ గబా మాటాడుతుంది. "అతని గుర్రం.. ఎలా చెప్పను.." ఆమె ఆగి, సరైన పదం కోసం తడుముకుని, చివరికి తనకి కావల్సిన పదం దొరకగానే "......తడబడింది".. అని పెద్దగా ఏడ్చింది.

లారా ఒక్క క్షణం అలా నిశ్చేష్టురాలై నిలబడిపోయింది.  కాసేపటి వరకూ తను విన్నదేమిటో, తన ఎదుటనున్న వ్యక్తి చెప్తున్నదేమిటో అర్ధం కానంత సందిగ్ధం లో, అపనమ్మకం లో  ఉండిపోయింది. అర్ధమయ్యాక, గొంతులో ఉరిపోసుకున్న కేక తో పెనుగులాడి, సెలెస్టీన్ ని ఆసరాగా తీసుకుని గొల్లుమని ఏడవబోయింది. కానీ సెల్సెటీన్ ఆమెను తన గుండెకు అదుముకుని. పాపం అమ్మా..నువ్వు!  నేను చూసాను. నువ్వు అతన్ని ప్రేమించావు. అతను నిన్ను ప్రాణంగా ప్రేమించాడు. కానీ ఇప్పుడు నువ్వు తక్షణం ఫాలీ వదిలి వెళ్ళాలి. వాళ్ళు ఇప్పటికే  మిసెస్ ట్రెవెల్ కు టెలిగ్రాం ఇచ్చారు అంది.

 

3

 

ఓ గంట అనంతరం లారా తిరుగు ప్రయాణానికి సిద్ధంగా దుస్తులు ధరించి ఉంది. కాసేపట్లో సెల్సెటీన్ వచ్చి, తన లగేజీ తీసుకుని,  అద్దెకు మాటాడి తెచ్చిన కారు లో చేరిస్తే, దానిలొ తను దూరాన ఉన్న స్టేషన్ లో, నిన్న ట్రెవెల్ ను కలుసుకున్న స్టేషన్ లో, ట్రైన్ ఎక్కాలి. నిన్న.… ఆ సంగతి జరిగి ఎన్నో యుగాలయినట్టు ఎందుకు ఉంది?

 

హఠాత్తుగా తలుపు మీద ఎవరో బలంగా మోదుతున్న శబ్దం వినబడింది. వెంటనే ఆమె గది లొంచీ నడిచొచ్చి తలుపుల్ని విశాలంగా తెరిచింది.

 

ఎప్పుడు ఆమెకు ఏ భయాలూ లేవు. ఇపుడు రోజెర్ డేలకోర్ట్ గదిలోకి చొచ్చుకు వచ్చినప్పుడు ఆమెకు ఎటువంటి ఆశ్చర్యం కలగలేదు. పైగా ఎన్నో మైళ్ళ దూరం నుడే ఆమె అతను వస్తాడని నమ్మినట్టు అనిపించింది.

 

నువ్వు ఒంటరిగా ఉన్నావా లారా?”  అడిగాడతను విసురుగా.

అతని మొహంలో ఒకలాంటి క్రౌర్యం ఉంది. యవ్వనం కరిగిపోయి, ఒకనాడు ఆడవాళ్ళను ఆకర్షించిన విలాసం నశించిన దెబ్బ తిన్న పులికి ఉండే ఆగ్రహం తో భగ భగ లాడుతున్నాడు.

 

ఆమె ఏమీ అనలేదు. అతని వైపు కేవలం ఒక విషాద దైన్యతతో నిండిన చూపు చూసింది. ఆ చూపులో వెరపు కూడా ఉంది.   అతను హేళనగా మాటాడుతున్నాడు. "నువ్విక్కడున్నావని నాకెలా తెలిసిపోయిందా అనుకుంటున్నావా ? ఇక్కడ ఏ పనిమీద వచ్చావో ఎలా తెలిసిపోయిందనుకున్నావు. నేను నీకో క్లూ ఇస్తాను. దాన్ని బట్టి నువ్వే గ్రహిస్తావు. నేను అనుకోకుండా ఇంగ్లండ్ తిరిగొచ్చాక నువ్వు పిల్లాడి వార్త నీకు చేరవేయడానికి ఎవరికైతే నీ చిరునామా ఇచ్చావో వాళ్ళ దగ్గరే ఇక్కడి చిరునామా తీసుకున్నాను. నీ స్నేహితులే నిన్ను పట్టిచ్చారు".

 

ఆమె, అప్పుడూ ఏమీ అన్లేదు. అతను కొనసాగించాడు. "మూర్ఖురాలా! నువ్వో మంచి మనిషివనుకున్నాను. కానీ ఇప్పుడు తెలిసింది. నువ్వు, నీ ప్రియుడు ఆ జూలియన్ ట్రెవెల్.. ఇక ఊరుకునేది లేదు. మీరిద్దరూ ఎంత తరుచుగా ఇక్కడికి వస్తున్నారో తెలుసుకుంటాను".

 

'నేను ఇదే మొదటిసారి ఇక్కడికి రావడం..' అంది ఆమె నిస్తేజంగా.

 

అప్పుడు ఆమెని బయట శక్తులేవో మాటాడిస్తున్నట్టు "నువ్వనుకున్నట్టు నేను ఇక్కడికి ఒంటరిగా రాలేదు రోజర్.." ఆమె కు కొడుకుని తలచుకోగానే వెన్నులో వొణుకు పుట్టింది.

 

"ఒంటరిగా రాలేదా"? అన్నాడు అతను చాలా అపనమ్మకంగా. అపుడు అతను చూపు కర్టెన్ తెర  పొరల వెనక ఏదో కదలడాన్ని పసిగట్టింది. అక్కడ ఎవరో ఉన్నారు. వింటున్నారు.

 

అతను అడుగులు ముందుకు వేసి, కర్టెన్ సర్రున లాగాడు. అక్కడ ఆ గది వెనుక గుడ్డి వెలుతుర్లో కారిడార్లో ఎవరూ కనిపించలేదు. ఎవరు తమ మాటలు వింటున్నారో, వారు ఎక్కడికో జారుకున్నారు.

 

అతను ఇందాక ఎక్కడ నిలబడ్డాడో అక్కడికొచ్చి నించున్నాడు. కోపంతో, చిరాకుతో, అనుమానంతో ఉన్నా అతని మనసు లోతుల్లో ఏదో రిలీఫ్. లారా లాంటి అమాయకురాలు ఎవరో స్నేహితురాలిని రక్షించడానికి ఇలా ఒంటరిగా ఇక్కడికి వచ్చుండవచ్చనే ఆలోచన మెదిలి కుదురుకున్నాడు.  ఆ అనుమానం ఆమె పాలిపోయిన ముఖాన్ని చూసి బలపడింది. ఇన్నాళ్ళ వైవాహిక జీవితంలో ఆమె ముఖంలో  పశ్చాత్తాపాన్ని అతను ఎన్నడూ చూడలేదు.

 

అంతే. అదే అయుంటుంది. ఈ మనిషి చేసిన దుస్సాహసం వెనుక ఉన్నది అదే. లారా.. పిచ్చి పిల్ల. ఇద్దరు తప్పు చేస్తున్న ప్రేమికులకు అడ్డుతెరలా నిలబడబోయింది. ముప్పయ్యేళ్ళ క్రితం ఒక స్త్రీ ఇలానే అతని స్వంత దుస్సాహసానికి తెరలానే నిలిచింది.  

"నీ స్నేహితురాలెవరు ?" గట్టిగానే అడిగాడు.

 

ఆమె పెదవులు కదల్లేదు. అతను మాత్రం, భయంతో ఆమె చచ్చుబడిందని సమాధానపడ్డాడు.

 

"ఎంత సేపట్నించి నువ్వు, నీ స్నేహితురాలూ ఇక్కడున్నారు? కనీసం అదన్నా చెప్పు"

 

చివరికి ఆమె గుసగుసగా ఓ తికమక సమాధానం ఇచ్చింది. "కేవలం వంద సంవత్సరాలు".

 

అపుడు చివ్వున వెనక్కి తిరిగి, ఆమె డైనింగ్ రూమ్నుంచీ బయటకు వెళ్ళి, తలుపులు మూసింది.

 

రోజెర్ డేలకోర్ట్ గదిలో అటూ ఇటూ పచార్లు చేసాడు. అతనికి తన జీవితం మొత్తానికి ఎన్నడూ కలగనంత దీర్ఘమైన అదృష్టం లాంటి, మూర్ఖత్వం లా  అనిపించినా, అద్వితీయమైన భావన కలిగింది. అది ఆనందం.

 

దీని పేరు 'ఫోలీ' నా? సరిపోయింది పేరు. రహస్య ప్రేమలకి సరైన వేదిక. అందమైనదే. ప్రేమికులకు కావలసినంత ఏకాంతం, ఉరుకుపరుగుల దైనందిన జీవితం నుండీ  దూరంగా. అతను అక్కడున్న చిత్రపటం వైపు దీర్ఘంగా చూసాడు. ఆ గదిలో ఉన్న ఏకైక చిత్రం అదే. ఎంత అందమైన ముగ్ధమనోహరమైన లలితమైన ముఖ సౌందర్యం. అది అతనికి తన యవ్వనంలో తెలిసిన ఫ్రెంచ్ అమ్మాయిని గుర్తు చేసింది.  ఆమె పేరు జీలీ మిగ్నార్డ్. ఆమె ఓ ముసిలి విధవరాలికి సహచరి.  ఆ విధవరాలి కొడుకుతో, లోరీ లో వేసవి సెలవులకు వెళ్ళినపుడే రోజెర్ కి ఆమె పరిచయం అయింది. ఆమె అతన్ని తీవ్రంగా ఆకర్షించింది. అప్పటికి ఇంకా బాలుడే అయినా, ఆమెను ఎలా అయినా అనుభవించాలని అపుడే నిశ్చయించుకున్నాడతను. కానీ ఆమె అతన్ని ఆపింది. అపుడు, తనకు తెలీకుండనే ఆమెతో ప్రేమలో పడిపోయాడతను. అదే అతని తొలి ప్రేమ. తిరిగి ఏమీ ఇవ్వని ప్రేమ.

 

హఠాత్తుగా ఆ గదిలో స్తంభించిన కాలం లాంటి గాలిలో ఏదో కదలిక, ఓ నిట్టూర్పు శబ్దం. అతను వెంటనే చుట్టూ చూసాడు. అతనికీ, కర్టెన్ వెయ్యని కిటికీకీ మధ్య ఓ మాదిరిగా సన్నగా ఉన్న యువతి - లారా స్నేహితురాలు. సందేహం లేదు.

అతను ఆమెను స్పష్టంగా అయితే చూడలేకపోయాడు. అయితే దానికి బాధేమీ లేదు. తను అయితే ఎప్పటికీ ఇతరుల ఆనందాలకి అడ్డొచ్చే వ్యక్తి అయితే ఎప్పటికీ కాదు. అతనికి నవ్వొచ్చింది. తన భార్య లారా - శిలలాంటి - ఏ కోరికలూ లేని తన భార్య ఇలా ఇద్దరు ప్రేమికులను కలిపేందుకు సంరక్షకురాలై సాయం చేయడం తలచుకుని మనసులోనే నవ్వుకున్నాడు.

 

కఠినాత్ముడైనా, అతని వృద్ధ హృదయం ఈ తప్పు చేస్తున్న కొత్త వ్యక్తి పట్ల ఆదరణ వ్యక్తపరిచింది.  అతని మనసులో లేశమాత్రం లారా పట్ల అనుమానమేదైనా మిగిలి ఉన్నా, అది ఈ వ్యక్తినికలవడంతోనే తొలిగిపోయింది.

 

ఆమె చేతులు చాచడం చూసి, అతని మాయమైన యవ్వనం గుర్తొచ్చింది. ఆమే అన్నదా "జీలీ గుర్తుందా??" తనకి ఆ గదంతా అదే మాట వినిపిస్తున్నట్టు అనిపిస్తొందేమిటి

 

లేదు లేదు... అదంతా అతని గుండె లోనిదే. పూర్తిగా మర్చిపోయేంతలా ఆ భావాలు కరిగిపోయినట్టులేవు.  అతని తొలి ప్రేమిక పేరది.. ఎలా మర్చిపోగలడు.. ఇప్పుడు ఆలోచిస్తే అసహ్యమే కలుగుతుంది. ఇప్పుడు ఆమె ముసలిదైపోయుంటుంది.

 

అతను ఆమెని పరిశీలనగా చూసాడు. ఆ నీడలాంటి శరీరం, విద్ద్యుల్లతలా కదిలి, ఆ గదిలోంచీ బయటకి పొరల కర్టెన్ను తొలగించుకుని నడిచి వెళిపోయింది.

 

అతను కాసేపు వేచినట్టు ఆగాడు. ఆ తరవాత డైనింగ్ రూం ని దాటుకుని చలిమంట వెలుగుతున్న బెడ్ రూం కు నడిచి వెళ్ళాడు.

 

అక్కడ లారా కిటికీ దగ్గర నించుని బయటకు చూస్తూంది. ఆమె చూపులొ ఆమె స్నేహితురాలి మాదిరిగానే అంతులేని విషాదం.  ఆమె బయట చీకట్లోకి చూస్తోంది. ఆమె చేతులు ఆమెకు పక్కగా వాలి ఉన్నాయి. గది తలుపుల లోంచీ అతను వస్తున్న శబ్దానికి ఆమె తిరిగి చూడలేదు.

 

లారా ! అన్నాడు ఆమె భర్త కీచుగా. ఆమె అతని వైపు అపుడు తిరిగి, అభావంగా చూసింది.

 

"నువ్వు ఇక్కడ ఎందుకున్నావో అర్ధం చేసుకున్నాను. నా పిచ్చి అనుమానాలకు క్షమాపణలు అడుగుతున్నాను. నువ్వు చిన్న పిల్లవి కాదు. ఇలాంటి ఆటలు ఏ మగవాడూ తన భార్య ఆడాలని కోరుకోడు. నువ్వు, నీ స్నేహితురాలూ ఎన్నాళ్ళు ఉండదలచుకున్నారు ఇక్కడ?"

 

"పది రోజులు అనుకున్నాము" ఆమె శక్తి  లేనట్టు అంది. నువ్వు ఇపుడు తిరిగి వచ్చేసావు కద రోజెర్.. ఇక వెళ్దాం. నీకిష్టమైతే"

 

మరి నీ స్నేహితురాలి సంగతేమిటి?”

 

నాకు తెలిసి ఆమె కూడా ఈపాటికి  'ఫోలీ'ని విడిచి వెళి పోయుండచ్చు

 

ఆమె ఓ నిముషం ఆగి ఈ మాట కూడా చెప్పింది. జూలియెన్ ట్రెవెల్ ఈరోజు వేటకి వెళ్ళినపుడు ప్రమాదవశాతూ మరణించాడు. నీకు తెలిసే వుంటుంది.

దేవుడా! ఎంత ఘోరం?! నన్ను నమ్ము.. నాకు తెలియదు.


రోజెర్ డేలకోర్ట్ నిజంగానే చలించిపోయాడు. ఈ పరిణామాలతో అతను కూడా ప్రభావితుడయ్యాడు. నిజానికి లెస్టర్ షైర్ కు మరుసటి వారం వెళ్దామని మనసులో ప్రణాళికలు కూడా వేసుకున్నాడు. కానీ ఇప్పుడు ఈ పరిసరాల నుండీ  వెంటనే వెళ్ళిపోవలసిందే.

 

అపుడు, కొత్తగా వాళ్ళిద్దరూ టౌన్ వరకూ కలిసే ప్రయాణం చేసారు. ఈసారి అతను తన భార్య పట్ల ఎన్నో సంవత్సరాల తరవాత, ఆదరంగానే మెసిలాడు.  ఒకటి ఏంటంటే,  ఈ ఆసక్తికరమైన అధ్యాయం, లారా కి తననుకున్నంత కన్న పెద్ద హృదయమే ఉన్నట్టు నిరూపించింది. కానీ తనలాంటి భర్త, తనలాంటి పురుషుడూ, ఆమె చేసినదానిని సమర్ధించడు. తన లాంటి మచ్చలేని వ్యక్తిత్వానికీ, శీలానికీ ఇలాంటి సాహసాలు ఎంత ముప్పు చేస్తాయో, ఈ ఏర్పాటు ఎంత ప్రమాదమో తెలీని మనిషి లారా. ఇలా తప్పు చేసే స్నేహితురాళ్ళ వెనక సంరక్షకురాలిగా తిరిగితే ఎవరన్నా ఏమన్నా అనుకుంటారని తెలీని అమాయకురాలు. మొత్తానికి ఈ అనుభవం ఆమెకూ తనకూ ఓ గుణపాఠమే అనుకున్నాడు.

**********


 

Original : The Duenna by Mrs Belloc Lowndes (from The Ghost Book,1926)

 

From : Love Stories (anthology) Ruskin Bond

 

 

 

 

  

No comments:

Post a Comment

Thank you.