Pages
18/12/2024
మృత్యుంజయ - అబ్బూరి చాయా దేవి
10/11/2024
Roman Stories - Jhumpa Lahiri
లాహిరి ది ఇది ఇంకో అనువాదం. ఒరిజినల్ ఇటాలియన్ లో రాసినది. 'పెద్దగా కదిలించని పుస్తకం' గా పలు రివ్యూలలో చదివాను. చదవడానికి మనసు రానప్పుడు, ఊరికే తిరగేయడానికి పనికొస్తుంది. ఎప్పట్లాగే, ఒక దృక్కోణంతో చెప్పే కథలు. రచయిత్రి చాలా చోట్ల పాత్రధారిగా కనిపిస్తుంటుంది.
మొదటిది, ఒక శరణార్ధి కుటుంబపు కథ. అతనికి పూల వ్యాపారం ఉంటుంది రోం లో ! కానీ అతని పై ఒక సారి జాత్యాహంకార దాడి జరిగింది. ప్రపంచం ఎప్పట్లాగే 'వేరే ' వాడిని నిరాకరిస్తుంది. అతనికి పోషించుకోవడానికో కుటుంబం ఉంది. స్వదేశంలో ఉపాధి లేదు. ఒక మారుమూల పల్లెలో పొలం, ఎస్టేటూ చూసుకునే పనికి కుదురుతాడు. దాడిలో అతను భౌతికంగా దెబ్బతినిపోయినదే కాకుండా, మానసికంగా కూడా డస్సిపోతాడు. మాటలు పోతాయి. ఈ పల్లె బ్రతుకు భార్యకు ఇష్టం ఉండదు. ఐనా ఏమి చెయ్యగలం? ఇక్కడ మన జోలికి వచ్చేవారుండరు. ఎలాగో ఒకలా బ్రతుకుదాం. ఎవరి పొడా లేకుండా ! అనేది అతని ఉద్దేశ్యం. ఆ ఎస్టేట్ కి సీజన్ బట్టి అద్దెకు తీసుకుని వచ్చే కుటుంబాలుంటాయి. అతను కేర్ టేకర్. అతని భార్యా, కూతురూ, అతిధులకి అన్నీ సమకూరుస్తుంటారు. అదే జీవితం వాళ్ళకు.
బిజీ నగర జీవితాల నుండీ తప్పించుకునేందుకు వచ్చిన అతిధులకు ఆ గ్రామపు శూన్యతా, మౌనమూ కట్టిపడేసినట్టు అనిపిస్తాయి. దాదాపు ప్రతివాళ్ళూ వెళ్ళేటపుడు, మళ్ళీ ఇక్కడికి వస్తాం - అంటారు గానీ రారు. వీళ్ళని అతని కూతురు ఓ పదమూడేళ్ళది గమనిస్తూ ఉంటుంది. అతిధులు, వాళ్ళ పిల్లలు, వాళ్ళు వదిలేసి వెళ్ళిన సామాన్లు, వాళ్ళను గమనిస్తూ గడిపిన క్షణాలు మాత్రమే ఆమె మొనాటనీ కి కొంచెం ఆటవిడుపు. కథంతా ఈ పాప దృష్టిదే.
ఇలానే ఇంకో కథ : 'పి' పార్టీ లు. లాహిరి అన్ని కథల్లో లానే, ఏ పాత్రలకీ పేర్లుండవు. ఏ ప్రాంతాలకీ పేర్లుండవు. ఏ ద్వీపాలకీ, యాట్ లకీ, వేటికీ పేరులుండవు. పీ అనే ఆవిడ ప్రతి వేసవిలోనూ ఏర్పాటు చేస్తుండే పెద్ద పెద్ద పార్టీలకి హాజరవుతూ, అక్కడ ఒక తెలీని విదేశీయురాలితో ప్రేమలో పడిపోతాడు కథకుడు. ఎన్ని సంఘర్షణలో.. ఎన్ని సంభాషణలో, ఎంత రొటీన్ - యూనివర్సిటీకి వెళ్ళిపోయిన పిల్లాడిని మిస్ అయే తండ్రి ప్రేమ, మగాళ్ళ సున్నితత్వం ! ఆఖరికి జీవితం చాలా విచిత్రంగా ఉంటుంది. ఎన్నో ఏళ్ళుగా పార్టీలు, సందడీ, స్నేహితులూ అని కులాసాగా ఉండే పీ చనిపోతుంది. ఆమెకి ఏదో జబ్బు. ఒకసారి ప్రాణాల మీదికొస్తే ఎలానో బ్రతికింది. ఆఖర్న బ్రతకలేకపోతుంది. ఆమె ఫ్యూనరెల్ కూడా పార్టీలానే ఏర్పాటు చేస్తారు కుటుంబసభ్యులు. మనిషికి సాటి మనిషి మీద ఉండే ప్రేమ కి నివాళి ఈ కథ.
అయితే మనిషి సొంతవాళ్ళనే ప్రేమిస్తుంటాడు. రోం లాంటి ఊరిలో శరణార్ధులు ఎక్కువ. ఆఫ్రికా నుండీ, ఆసియా నుండీ డింగీలలో ప్రమాదకరంగా సముద్రాన్ని దాటి పారిపోయి వాళ్ళు చేరుకునే దేశం ఇటలీ నే. చాలా కథల్లో ఈ శరణార్ధులని ద్వేషించే సమాజం కూడా వుంటుంది. ఇద్దరు కన్న బిడ్డలతో, సంతోషంగా రోం లో జీవించిన ఒక తల్లి, భర్త పోయాకా, ఒంటరితనాన్ని ఈదేందుకు చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తుంది. అదీ, అనుకోకుండా, తెలిసినవాళ్ళు చూపించినవి. ఒక సారి స్కూల్లో చిన్న పిల్లల్ని చూసుకునేందుకు చేరుతుంది. అదీ లీవ్ వేకెన్సీ లో. టెంపరరీగానే. ఆ మాత్రం సమయంలోనే చిన్న పిల్లలే ఆమె కోటు జేబులో, 'నువ్వు మాకు నచ్చలేదు', 'నువ్వు మాకు వద్దు', 'నువ్వు బాలేవు', 'ముందుండే మిస్ బావుంటుంది'... వగైరా నోట్ లు పెడతారు. ఆవిడ చాలా బాధపడుతుంది. కొడుకులు వేరే దేశాల్లో ఉద్యోగాల్లో ఉన్నారు.వాళ్ళు తల్లికి ధైర్యం చెప్తుంటారు. స్కూల్ విడిచిపెట్టి వచ్చేసేటపుడు ఆవిడా ఆ నోట్ లన్నింటిని రిపోర్ట్ చెయ్యకుండా (అన్నాళ్ళూ కోట్ లోనే ఉంచుకుంటుంది) నమిలి మింగేస్తుంది. భూదేవికున్నంత క్షమ.
ఇంకో కథ లో ఒక శరణార్ధి కుటుంబం (ముస్లిం) ! వాళ్ళకి ఎన్నాళ్ళో టెంట్ లలో గడిపాక, ఒక హౌసింగ్ కేంప్ లో ఇల్లు కేటాయింపబడుతుంది. ఇక సుఖపడదామా అనుకునేసరికీ, అదే కేంప్ లో సాటి శరణార్ధులలోనే వేరే వేరే దేశాలవాళ్ళూ, ఇతర జాతి బీదవాళ్ళూ, ఇతరులు, అతని కుటుంబం జీవితాన్ని దుర్భరం చేసేస్తారు. ముసుగు వేసుకునే భార్య బురఖా, అన్ని చూపులు వీళ్ళ మీద పడేందుకు కారణం అవుతుంది. బెదిరింపులు సాధారణం అయిపోతాయి. ఏ క్షణాన ఏం జరుగుతుందో అని భార్య, పిల్లల్ని పట్టుకుని, కూడబెట్టిన డబ్బంతటితోనూ టికెట్ కొనుక్కుని స్వదేశానికి వెళిపోతుంది. అతను రోడ్డున పడతాడు. కానీ బ్రతుకుతెరువు కోసం ఆ దేశం లోనే ఉండాల్సిన పరిస్థితి.
ఇంకో కథ లో హీరోయిన్ కూతురు, బోట్లలో వచ్చే శరణార్ధులకు నీళ్ళూ, తిండీ, వసతీ, బ్లాంకెట్లూ, వైద్య సహాయమూ, అంత్యక్రియలు, డాక్యుమెంటేషన్ కూ సాయం చేసే వలంటీరు గా పనిచేస్తుంటుంది. తమ తమ దేశాల్లో యుద్ధం, కరువు, తీవ్రవాదం నుండీ జనాలు పారిపోతుంటారు. ఇటలీకి కొట్టుకొచ్చే వేల శవాలు ఈ మాట చెప్తుంటాయి. ఇటలీ నుండీ బారులు కట్టి యూరోపు కు నడిచెళ్ళే వాళ్ళు, ఆ దేశం లోనే వీళ్ళతో రొట్టెనీ, ఇళ్ళనీ షేర్ చేసుకునే మంచి పౌరులూ.. ఇలా ఎందరో ఉంటారు. అయితే ఇవి రోం కథలు కాబట్టి, పాక్షికంగానే ఈ ప్రస్తావనలు వస్తుంటాయి. రోం నగరం లో జీవితం ప్రధానంగా చెప్పబడుతుంది.
లాహిరి - కదిలించని కథలెలా రాస్తుంది ? కాలక్షేపం కోసం చదివే కథల్లో డాంటే వస్తాడు. ఒక టీనేజ్ అమ్మాయి కథ ఇది. ఆమె ప్రాణ స్నేహితురాలి బాయ్ ఫ్రెండ్, ఈమె పై ప్రేమ వ్యక్తం చేస్తాడు. కానీ దానివల్ల ఈమె ప్రాణ స్నేహితురాల్ని కోల్పోతుంది. అటు ఆ ప్రేమికుడూ తను చేసిన పనికి విచారించి, ఈమెకు దూరమవుతాడు. అదంతా ఎలా వుంటుందంటే, బాల్యం లో ఈ పిల్ల ఒంటరిగా ఇంటి వెనక పెరటి అడవిలో ఆడుకునేటప్పుడు ఒకసారి నేల మీద మన్నులో ఉన్న ఒక మాదిరి సైజ్ రాయి ని తొలగించి చూస్తుంది.
దానికింద వానపాములూ, పురుగులూ వంటి (ఈమె అక్కడ లేవనుకున్న) జీవరాశి లుకలుకలాడుతూ కనిపిస్తుంది. వాటిని చూసి ఈ పిల్ల ఆ రాతిని మళ్ళీ ఎక్కడ తీసిందో అక్కడే జాగ్రత్తగా పెట్టేస్తుంది [వాటిని డిస్టర్బ్ చెయ్యకుండా]. ఈ స్నేహితురాలి బాయ్ ఫ్రెండ్ తన టీనేజ్ అయోమయం లో, అచ్చు 'తన లో లేవనుకున్న ఫీలింగ్స్' ని ఒక ప్రేమలేఖ రాసి, ఆమె సరిగ్గా ఆ రాయిని తొలగించి చూసినట్టు, తనలోకి తొంగి చూసునట్టు ఊహించుకుంటుంది. ఈమె హృదయ స్పందన వినేసి, మళ్ళీ రాతిని మూసేసి వెళ్ళిపోతాడు ఆ అబ్బాయి. అతను ప్రేమలేఖ లో రాసిన మారు పేరు 'డాంటే'. ప్రేమ పోతే పోయింది గానీ 'డాంటే' ఆమెను ఆకర్షించేస్తాడు. ఇక ఈ పిల్ల తండ్రి చదువుకొమ్మన్న సైన్స్ ని వదిలేసి, డాంటే నే చదువుకుంటుంది యూనివర్సిటీ లో.. ఈ కథ నాకు చాలా నచ్చింది. ఇది కూడా ఇమిగ్రెంట్ కుటుంబమే (బహుశా ఇండియన్).
ఏదో చదివించే గుణం ఉంటుంది లాహిరి లో. మా స్నేహితుల్లో ఒకమ్మాయి, కాఫీ తాగడాన్నీ, డాబామీద ఆరేసిన బట్టల్ని తీసుకురావడాన్ని కూడా కవితాత్మకంగా, తాద్యాత్మంగా చెప్తూండేటపుడు, ఆమె జీవితోత్సాహాన్ని చూసి ఎంత మెచ్చుకుంటూ, నవ్వుకునేదాన్నో గుర్తొస్తుంటుంది ఈ కథలు చదివితే! ఈ మధ్య, వయసుతో పాటూ, రచయిత్రీ, నేనూ ఎంతో మారాం. కరుడు కట్టిన రచనా విధానాలనుండీ, లేత కొబ్బరి జున్ను లాంటి మనసులున్న మనుషుల కథలు చదవడం పెద్ద ఉపశమనం. చాలా మటుకూ శరణార్ధుల కథలే. రోమన్ కథ లనగానే రొమాన్స్ ని ఊహించుకుంటే దెబ్బ తగులుతుంది. ఒక్కోసారి కష్టమైన జీవితాన్ని నమ్మకంతో ఈదడమే రొమాన్స్.
***
అవిశ్రాంత బాటసారి - కాజీ నజ్రుల్ ఇస్లాం
ఇరుకుగా ముళ్ళతో నిండిపోయి నడవటానికి వీల్లేని అడవి బాటలో నడుస్తున్నాడు ఆ బాటసారి. ఉన్నట్టుండి తనమీద కోట్లాది చూపులు పాకుతున్నట్టు అనిపించి వెనక్కి తిరిగి చూశాడు. ఆ చూపులు దివ్యమైన ఉత్సాహంతో వెలిగిపోతున్నాయి. ఆ చూపులు అతని హృదయాన్ని చెప్పలేనంత గర్వంతో నింపేసాయి. ఎంతో తృప్తిగా అనిపించింది. చిరునవ్వు చిందిస్తూ చాలా ఒద్దికగా అడిగాడు "భాయీ, మీకంత శక్తివంతమైన చూపు ఎక్కడనించి వచ్చింది?"
కోట్లాది నక్షత్రాల్లా వెలిగిపోతున్న ఆ కళ్ళు "ఓ ధైర్యశాలీ, నీవు నడిచి వచ్చిన దీర్ఘమైన దారినంతా అలా చూడగా, చూడగా అబ్బిన శక్తే మా చూపుది!" సమాధానమిచ్చాయి.
అప్పుడు మృదువైన వెచ్చని చూపు మాత్రం ఆతనికి ఒక సందేశాన్నిచ్చింది. "ఇదిగో! ఈ అష్ట కష్టాల బాట ఇంతకుముందు ఇటుగా నడిచిన యువ బాటసారులెవరూ తప్పించుకోలేనటువంటి మృత్యువుకే దారితీసింది!!" అని. అదివినీ వినంగానే, కోట్లాది గొంతులు అరిచాయి… "నోరుముయ్యవోయి పిరికివాడా… ఇది అనంతమైన, నిజమైన మానవత్వపు ఆత్మ వైపు చేసే పయనానికి దారి"
ఆ బాటసారి తన రెండు కళ్ళనూ విప్పార్చుకుని పరోపకారతత్వం తొణికిసలాడే ఆ కోట్లాది చూపులను తృప్తిగా తాగాడు. సరిగ్గా శృతిచేసిన వీణ ఎలాగైతే ఒక వేలు మీటగానే నిద్రాణ స్థితినుండి లేచి ప్రాణధ్వని వినిపిస్తుందో సరిగ్గా అలాగే అతనూ చటుక్కున మేల్కొన్నవాడిలా 'పద ఇక ముందుకు ' అని తనని తాను ఉత్తేజపరచుకున్నాడు.
చెట్లతో నీండిన ఆ అనంతమైన విస్తీర్ణం, బాటసారికి హఠాత్ యవ్వనం ప్రసాదించేసి ఒక ప్రకటన చేసింది - "నీ నుదుట్న యవ్వనపు సార్వభౌమత్వాన్ని ఒక ముద్రలా వేసిస్తానుండు. ఇది నిన్ను నిత్య యవ్వనునిగా, చిరంజీవిగా చేస్తుంది!!" అల్లంత దూరంలోనున్న క్షితిజరేఖ ఇతని వైపుకు వంగి ఆశీర్వదిస్తూ తలను ముద్దాడింది. బాట పక్కనున్న చెట్లు తమ కొమ్మల్ని ఆడిస్తూ శుభాకాంక్షలు తెలిపాయి. ఆ సుదూరపు క్షితిజరేఖ అతనికి అస్పష్టంగానే అయినా, స్వతంత్ర దేశపు ఆనవాలను చూపించింది. ఆ స్వతంత్ర దేశపు ముఖద్వారంలో భయానకమైన వేకువ పాట ఒకటి వేణునాదమై బాటసారిని, ఆ వనంలోని ఒక హిరణ్యాన్ని మైమరిపించేసినంతగా కట్టిపడేసింది. ఆ గాన మోహం లో పడి, అతను స్వాతంత్రం వెంట పరుగులు పెడుతున్నాడు. "అహో! నీ స్వతంత్రపు ప్రధాన ద్వారం ఎక్కడ? తెరువు ఆ తలుపుల్ని… తెరువు… నాకు వెలుతురిని చూపించు. దారిని చూపించు!"
విశ్వపు మార్మిక దివ్యత్వం అతన్ని కమ్మేసి చెప్పింది "ఇంకా చాలా దూరం ఉంది. నడు". అతను హతాశుడై, 'హేయ్! నేను వెతుకుతున్నది నిన్నే!" అని అన్నాడు.
అప్పుడే పరిచయం అయిన ఆ సహ పాంధుని గొంతు ఇలా అంది, "నన్ను పొందేందుకు నువ్వు చాలా దుర్గమ మార్గాన్ని దాటాల్సుంటుంది."
అలుపెరగని బాటసారి తన గమనాన్ని తొందర చేసాడు. "అవును భాయీ ! అదే నా లక్ష్యం". ఈ హడావిడికి, హద్దుల్లేని ఆకాశం క్షణమాగి ఒక చిన్న సందు చూసుకుని కిందున్న 'అంతులేని ఆ అడవి' కేసి తొంగి చూసింది. వెనకున్న కోట్లాది యువ గొంతుకలతని మాట విని.. "మాదీ అదే లక్ష్యం.. పద భాయీ… ముందుకు పద. నువ్వు ముందుకెళ్ళు - మేము నీ అడుగుల్ని అనుసరిస్తాం" అంటున్నాయి.
గర్వాన్నీ, సంతృప్తినీ బయట పడనీయకుండా తొక్కిపట్టలేకపోయినప్పటికీ బాటసారి వారికో మాట గుర్తు చేసాడు 'కానీ ఈ పయనం మృత్యువు వైపు కదా!'
కోపాన్నణుచుకోలేని ఆ యువ గళ కోటి అతని హెచ్చరికను తిప్పికొడుతూ అరిచింది. "మేము దాన్ని పట్టించుకోము. ఇది చావు కాదు. ఇది అసలైన బ్రతుకుకి, ఒక కొత్త మొదలు!"
కొంచెం వెనగ్గా బలహీనమైన గుండె గల ఒక వృద్ధుల గుంపు చావు భయంతో వణుకుతూ ఉంది. వాళ్ళ భుజాల మీద నొక్కిపట్టి కూచుని వికృతమైన నవ్వుతో వాళ్ళని హేళన చేస్తూ… "చూడండి. నేనే మృత్యువును. ఇక్కడే ఉన్నాను" అంటోంది ఒక స్వరం.
అక్కడికి దగ్గరలో, ముదిమితో చీకటి చిమ్మిన కళ్ళకు 'వెలుగు తాలూకూ అనుభూతిని' ఇచ్చేందుకని సువాసనలు వెదజల్లుతున్న ఒక చితి మంట మండుతూ ఉంది. పొట్ట చెక్కలు చేసేటంతటి నవ్వుని ఎలానో ఆపుకుంటూ, వాళ్ళను ఆ చితి వైపు నడిపించి "ఇదిగో చూడండి ఇదే మీ మోక్ష మార్గం!! ఎందుకిలా మీ వృద్ధాప్యంలో ఈ దీర్ఘమైన కఠిన మార్గాన్ని ఎన్నుకుంటున్నారు? ఎప్పటికైనా ఆ బాటసారి గానీ, అతని అనుచరులు గానీ చేరుకునేది మృత్యువు ఒడికేగా?!" అన్నదో గొంతు.
వారిలో కురువృద్దుడొకడు ఒకడు రెండు చేతులూ పైకి చాచి "అవును.. నిజమే!" అని అన్నాడు.
ఒక కొంటె గొంతు హెచ్చరికగా అంది. "మూర్ఖులారా ! ఎవరినీ ఎప్పుడూ దేనికోసమూ అడుక్కోమాకండి. వాళ్ళు మెల్లగా మిమ్మల్ని ఆ చితిలో వేసి చచ్చేవరకూ కాలుస్తారు."
వారి నాయకుడొకడు ఇంకో ఉప్పెన వంటి నవ్వును బలవంతంగా అణుచుకుంటూ "కాదు కాదు వాళ్ళ మాటలు వినొద్దు. వాళ్ళ దారి ప్రమాదాలతో నిండినదీ, దీర్ఘమైనదీనూ. పైగా దారంతా కష్టాలు, ఆటంకాలు, దుఃఖాలు… మీ విడుదల దగ్గర్లోనే ఉంది" అన్నాడు.
అలుపెరగని బాటసారి మాత్రం, స్వాతంత్రపు ముఖద్వారపు వేణుగానం మాయలో పడి కొట్టుకుపోతున్నాడు. స్వతంత్రం వైపు అడుగులు వేస్తూనే ఉన్నాడు. దారి బాధల పిశాచాలు ఇపుడతన్ని హింసలపాలు చెయ్యబూనాయి. అతనికి తడబడిన పాదముద్రలు కనిపిస్తున్నాయి… అవి ఇంకా వెళ్ళాల్సిన దారి చాలానే ఉన్నట్టు సూచిస్తున్నాయి. కష్టాల ముళ్ళ బాట కి రాణైనటువంటి ఒక పిశాచం, ఒక కపాలాన్ని అరచేత పట్టుకుని బాటసారికెదురుగా నిలబడి… 'చూడు. నీ ముందు వెళ్ళిన వాళ్ళ పని ఇక్కడితో ఇలా సమాప్తం అయింది!!' అంది.
ఆ కపాలాన్ని తన నెత్తిన పెట్టుకుని ఆ బాటసారి ఇలా అన్నాడు "ఆహా! వీళ్ళే కదా నన్ను ఈ దారిలోకి పిలిచింది. నేను కోరుకునేది కూడా ఇదే. ఇలాంటి అంతమే నాకూ కావాలి. నా దారి ననుసరించి రాబోయే ఇలాంటి లెక్కలేనందరు యువతతో కలిసి నేనెప్పుడూ ఉంటాను'.
పిశాచి 'ఎవరు నీవు?' అనడిగినపుడు బాటసారి ఇలా అన్నాడు. "నేను స్వతంత్రాన్ని కోరుకునే నిత్యాన్వేషిని. ఇలా ఇక్కడ పరుచుకున్న కపాలాలలోని వాళ్ళందరూ మృతులూ కారు, జీవితులూ కారు. వీళ్ళందరూ నా వంటి అన్వేషకులను ఈ దారెమ్మట వచ్చేందుకు ప్రోద్బలమిచ్చినవారు. వీళ్ళు నాలో నూతన యవ్వనాన్నీ, శక్తినీ, ఉత్సాహాన్నీ, మెరుపునీ ఇస్తూ వచ్చారు. మేమంతా స్వతంత్ర సాధకులం. మేము చిరంజీవులము".
పిశాచి వణుకుతూ, తెగువ తెచ్చుకుని ఇలా అరిచింది. "నేను నీకు తెలియదా? నేను మూర్తీభవించిన బానిసత్వాన్ని. నువ్వేమన్నా సరే ,నా లక్ష్యం నిన్ను ఉనికి లేకుండా చేయడం. నిన్ను బంధించడం, నీ స్వతంత్రాన్ని శృంఖలాలతో బంధించడమే నా నెలవు . నువ్వు నా చేతిలో చావాల్సిందే".
బాటసారి క్షణమాగి సమాధానం ఇచ్చాడు. "సరే. చంపు. బంధించు. కానీ నిజంగా నువ్వు నన్ను పూర్తిగా నిర్బంధించలేవు. చావు నన్ను సర్వనాశనమేమీ చెయ్యలేదు. నేను ఎప్పటికప్పుడు తిరిగి వస్తూనే ఉంటాను."
ఆ పిశాచం అతని దారికెదురుగా మళ్ళీ నించుని ప్రకటించింది. "నాలో ఏ మాత్రం శక్తి మిగిలున్నా సరే… నువ్వు తిరిగొచ్చిన ప్రతిసారీ నిన్ను చంపక మానను. నీలో శక్తి ఉంటే నన్ను చంపు. లేదా నేను పెట్టే హింసను భరించు!"
దూరాన బారుగా తెరిచి ఉన్న స్వతంత్రపు ఉత్థానం పైన అప్పటికే ప్రాణత్యాగం చేసిన ఇతర బాటసారులంతా పూర్తి యవ్వనంతో ప్రకాశించుతూ ఉత్సాహంతో గుమిగూడి, చిరునవ్వులతో అతన్ని తమ వైపుకు చేతులు జాచి ఆహ్వానిస్తున్నారు. బాటసారి వాళ్ళనడిగాడు "జీవితపు పరమార్ధం దాన్ని పరిత్యాగంలోనే ఉందా ?"
ఒక స్వతంత్ర ఆత్మ, స్వతంత్ర ఉత్థానం పైనుండీ బదులిచ్చింది - దాని గొంతు చాలా లేతగా, మృదువుగా ఉంది. "అవును భాయీ! తరతరాలుగా జీవితం ఇలాంటి కీర్తనల్నే పాడుతూ వచ్చింది. నువ్వెలా బ్రతికావన్నది, నువ్వెలా పోయావన్నది, నీ నడత ఇతరుల జీవితాల్ని ఎలా ప్రభావితం చేసిందన్నది ముఖ్యం. నీ బ్రతుకు గాని, చావు గాని, అందరి స్మృతుల్లో అమరత్వాన్ని పొందేందుకు, ఇతరుల్లో నిత్య చైతన్యాన్ని, వికాశాన్నీ రగిలించేందుకూ ఉపయోగపడాలి."
ఇది వింటూనే యువ బాటసారి పరాక్రమవంతంగా పిశాచానికి తన చాతీని ఎదురొడ్డి "ఝుళిపించు నీ ఆయుధాన్ని!" అంటూ ముందుకు ఉరికాడు. అతనిని అందాకా అనుసరించిన యువత అతని ప్రాణంలేని దేహాన్ని తమ తలల మీదుగా మోసుకెళ్తూ "మళ్ళీ నీవు తిరిగి రావాలి" అని అరిచింది.
సుదూరాన క్షితిజం వెనక నుండీ ఇంకొన్ని గొంతుకలు ఇంకో వాద్య గోష్టి వినిపించాయి.
"నీవు మ్రోగించిన ఢంకా దరువులు ఇక్కడి దివ్య ఆత్మలను తమ లయబద్ధ విన్యాసాలతో తాకాయి. నిను అనుసరించేందుకు, నీ స్థానాన్ని భర్తీ చేసేందుకు నీవంటి ధీరులు ఇంకొందరు తరలి వస్తున్నారిదిగో!"
***
English Title : The Restless Traveller : A Vignette
Written by : Kazi Nazrul Islam
Translated from Bangla to English : Dhrubajyoti Sarkar
Frontline Magazine Short Story, Nov 2024
(Free Test Translation, need a lot of improvement, suggestions welcome pl) * Permissions not taken.
Context : revolution, freedom fight.
26/08/2024
Banned Books (DK Series)
మనం రాయడం మొదలు పెట్టినదగ్గరినుండీ, పుస్తకాల మీద నిషేధాలు ఉన్నాయి. వాటిని జాబితాలలో చేర్చడమూ ఉంది. 1559 లో కేథలిక్ చర్చ్, నిషేధింపబడిన పుస్తకాల జాబితాను " Librorm Prohibitorum" (Index of Prohibited Books) అనే పేరుతో తీసుకొచ్చింది. ఆ నిషేధ సంస్కృతి నాలుగొందల సంవత్సరాల తరవాత ఇరాన్ కు చెందిన 'ఆయతుల్లా రొహల్లా ఖొమైనీ', 'ద సాటనిక్ వెర్సెస్' అనే పుస్తకం రాసినందుకు సాల్మన్ రష్దీని చంపేయమని ఫత్వా జారీచేసేంతవరకూ వచ్చింది. సంపూర్ణ నిషేధాలు - అంటే ఒక పుస్తకం ప్రచురింపబడకుండా, అమ్ముడుపోకుండా చేయడం, సెన్సార్ చేయడం మాత్రమే కాకుండా చేయడమే కాకుండా, ఒకవేళ అప్పటికే అందుబాటులో ఉంటే, లైబ్రరీలనుండీ తీసేయడం, పాఠకులకు దొరకనీయకుండా చేయడం వగైరాలు కూడా.
ఫ్రెంచ్ విప్లవం జరిగినపుడు మొదటి సారి "ఫ్రీడం ఆఫ్ స్పీచ్" అనే అంశం 1789 లో తెరపైకి వచ్చింది. రెండేళ్ళ తరవాత అమెరికాలో ఫర్స్ట్ అమెండ్మెంట్ లో ఇదే అంశాన్ని తీసుకున్నారు. ఇవి ఉన్నాకూడా పుస్తకాలని నిషేధించడం ఎక్కడా ఆగలేదు. రచయితల హక్కులు, పాఠకుల హక్కులని పరిమితం చేసారు. వ్యాజ్యాలు నడిపారు. పుస్తకాలని సంవత్సరాల కొద్దీ నిషేధించారు. డీసెంట్ గా లేవనో, హింస నో సెక్స్ నో ప్రేరేపిస్తున్నాయనో నిషేధించడం కాస్త అర్ధం చేసుకోదగినదే. అయితే, జాత్యాహంకారులు, యుద్ధోన్మాదులు, రాజకీయ వాదులు, చరిత్రనో, సైన్స్ నో అంగీకరించని వారు కూడా నిషేధాలని నడిపించారు. అయితే ఎన్నో గొంతులు కలిసి చేసిన పోరాటాలవల్ల, రాసిన వాళ్ళూ, చదివినవాళ్ళూ, నిషేధించినవాళ్ళూ, ప్రభావితులవడం వల్ల, మనలో మెల్లగా మార్పు వచ్చింది. మానవత్వాన్ని గుర్తు చేసే హక్కు పుస్తకాలకు ఉన్నంతకాలం, నిషేధాలు వాటిని ఆపలేవు.
ఈ పుస్తకంలో వివాదాస్పదమనో, రెచ్చగొట్టే స్వభావం ఉన్నందుకో, విప్లవ భావాలను ప్రచురించినందుకో నిషేధింపబడిన పుస్తకాల గురించి సమాచారం ఉంది. వీటిని చరిత్రలో ఎక్కడో ఓ చోట, ఏదో ఒక టైం లో ఆపేందుకు ప్రయత్నించారు. పుస్తకాల్ని నిషేధించడం, వాటి ప్రతుల్ని దొరకనీయకుండా చెయడం, కుప్ప పోసి తగలబెట్టడం, వాటి గురించి ప్రజలెవ్వరూ మాటాడకుండా చెయ్యడం, ఇల చాలానే జరిగాయి. అయితే, ఇవి ఆయా పుస్తకాలకి మంచే చేసాయి. నిసేధింపబడిన చాలా పుస్తకాలు సూపర్ డూపర్ హిట్ లు అయ్యాయి. జనం లో వాటిని చదవాలన్న ఉత్సుకత పెరిగింది. మార్క్ ట్వైన్ అన్నట్టు పుస్తకాల అందుబాటుని పరిమితం చేస్తే, వాటి అమ్మకాలు పెరుగుతాయి. ఎందుకంటే, నిషేధింపబడిన పుస్తకాన్ని చదివేందుకు అందరికీ ఆసక్తి ఉంటుంది.
- Pre - 1900
- 19 Century
- Between the Wars
- The Post War Years
- The Late 20th Century
- The 21st Century
- The Canterbury Tales
- Wycliffe's Bible
- Grimm's Fairy Tales
- Frankenstein
- The History of Mary Prince
- Te Communist Manifesto
- Madame Bovary
- On the Origin of Species by Means of Natural Selection
- Adventures of Huckleberry Finn
- The Earth
- The Awakening
- Ulysses
- Mein Kamph
- Lady Chatterley' Lover
- The Well of Loneliness
- A Farewell to Arms
- All Quiet on the Western Front
- As I Lay Dying
- Brave New World
- Gone with the Wind
- Their Eyes were watching God
- The Grapes of Wrath
- The Diary of a Young Girl
- Nineteen Eighty Four
- The Catcher in the Rye
- Fahrenheit 451
- The Lord of the Files
- Lolita
- Doctor Zhivago
- Things Fall Apart
- A Raisin in the Sun
- To Kill a Mockingbird
- Catch - 22
- One Flew over the Cuckoo's Nest
- The Autobiography of Malcom X
- I Know Why the Caged Bird Sings
- Slaughterhouse-Five
- Black Voices from Prison
- Maurice
- The Color Purple
- The Handmaid's Tale
- Beloved
- Spycatcher
- The Satanic Verses
- The Alchemist
- Final Exit
- American Psycho
- Shame
- The God of Small Things
- The Harry Potter Series
- The Kite Runner
- The Bastard of Istanbul
- The Cartoons that Shook the World
- Melissa (formerly George)
- The Hate you Give
- I Have Men
- 1000 years of Joys & Sorrows
18/08/2024
Operation Khukri - Major General Rajpal Punia, Damini Punia
'దామినీ పునియా' భారతదేశపు రిపబ్లిక్ దినోత్సవ వేడుకలకు ఒక అఫీషియల్ కామెంటేటర్. ఆమె తండ్రి 'మేజర్ జెనరల్ పునియా' తో కలిసి రాసిన నిజ జీవిత కథ ఈ "ఆపరేషన్ ఖుక్రి". కొన్ని దేశాల సైన్యాలు కలిసి సంయుక్తంగా ఓ ఇరవయినాలుగేళ్ళ క్రితం ఆఫ్రికా లో జరిపిన ఓ అసాధారణ rescue operation ఈ పుస్తకం లో ప్రధాన వస్తువు. వీళ్ళిద్దరి ప్రొఫెషనల్ స్కిల్స్ ఈ పుస్తకంలో కనిపిస్తాయి.
సియెర్రా లియోన్ పశ్చిమ ఆఫ్రికాలో ఒకప్పుడు బ్రిటీష్ వలస పాలనలో గడిపిన ఒక దేశం. అరేబియా సముద్రం ఓ వైపు హద్దుగా, లైబీరియా, గునియాల మధ్య ఉన్న ఈ దేశం వజ్రాల ఉత్పత్తికి ప్రసిద్ధి చెందినది. అత్భుతమైన నైసర్గిక సౌందర్యం, అపారమైన ఖనిజ నిక్షేపాలు ఉన్న దేశం. కాకపోతే, ఈ దేశం 1990 ల లో తీవ్రమైన సంక్షోభం లో పడింది. ఇక్కడ ఇబ్బడి ముబ్బడిగా దొరికే నాణ్యమైన ముడి వజ్రాల కోసం చుట్టుపక్కల దేశాలనుంచి, దూరతీరాల్లోని ధనిక, నాగరిక దేశాల దాకా ఈ సియెర్రా లియోన్ ని పీల్చి పిప్పి చేసేసాయి. అధికారం కోసం, ఆ ప్రాంతం మీద అదుపు కోసం, జరిగిన అంతర్యుద్ధం వల్ల, దేశం లో అవినీతి, అక్రమాలు పెచ్చరిల్లాయి. సాధారాణ ప్రజల జీవితం దుర్భరమైపోయింది.
సియెర్రా లియోన్ లో కేవలం 90 లలోనే అంతర్గత యుద్ధాలలో 50,000 మంది ఊచకోతకు గురయ్యారు. మిలియన్ కన్నా ఎక్కువమంది ఇళ్ళు వదిలి పారిపోయారు. తొమ్మిదేళ్ళకు పైగా ప్రజలు శాంతి అన్న మాట తెలీకుండా గడిపారు. 30% ప్రజానీకం అంగచ్చేదులు. నిర్దాక్షిణ్యమైన ఊచకోతలు, amputations ఇక్కడ సర్వసాధారణం. దీని రాజధాని ఫ్రీ టౌన్. ఒకప్పుడు సంపన్న దేశాలు ఈ నగరంలో తమ బానిసలను ఫ్రీగా వొదిలేసేవి. అందుకని ఈ నగరం పేరు ఫ్రీటౌన్. ఇక్కడ ఉన్నవాళ్ళందరూ బానిస జీవితం నుండీ విముక్తులయిన స్వేచ్చాజీవులన్నమాట. ప్రధానంగా వీరి మతం ఇస్లాం.
1961 లో స్వతంత్రం వచ్చాక, అక్కడి ప్రభుత్వాలు అవినీతిని అస్సలు అదుపులో పెట్టలేకపోయాయి. 1980 ల మధ్యలో అవినీతి వల్ల దేశం అథోపాతాళానికి చేరాక ప్రజల్లో తిరుగుబాటు మొదలయింది. "ఫోడే సేయ్ బానా సంకో" అనే ఒక మామూలు ఆర్మీ కార్పొరల్ తిరుగుబాట బాట పట్టి, ఒక సంస్థని స్థాపించాడు. అదే రివల్యూషనరీ యునైటెడ్ ఫ్రంట్ (RUF) "ఇదిగో మార్పు, ఇదిగో విప్లవం" అని అతను చూపించిన మార్గం ప్రజలకి ఎంతో నచ్చింది. తన ఆదర్శ భావాలతో ప్రజలు ప్రభావితం అయ్యారు. ఇలా 'పరివర్తన తాంబూలాలను' ఎరవేసి సంపాయించిన ప్రజామద్దతు తో, ప్రజాస్వామ్యయుతంగా ఎన్నుకోబడ్డ ప్రభుత్వాన్ని పడగొట్టి అధికారాన్ని ఫోడే సంకో చేజిక్కించుకున్నాడు. అదీ పొరుగుదేశం లైబీరీయా అధ్యక్షుడైన చార్ల్స్ టేలర్ సహకారంతో ! చుట్టుపక్కల రాజ్యాలు సియెర్రా లియోన్ లో ధారాళంగా దొరికే ముడి వజ్రాల కోసం, అక్కడి అస్థిరతని ఎంతమాత్రం తగ్గించే ప్రయత్నం చేయలేదు. వాళ్ళు ఈ రెబల్స్ కు ముడి వజ్రాలకు బదులుగా అత్యాధునిక ఆయుధాలనిచ్చారు. వజ్రాల స్మగ్లింగ్ నిరాటంకంగా సాగేది.
ఒక దేశ సైన్యం కు ఉండదగ్గ ఆయుధాలతో RUF శక్తివంతమైన, మరీ ముఖ్యంగా అత్యంత బ్రూటల్ గెరిల్లా దళం గా తయారయింది. ఊళ్ళకు ఊళ్ళు తుడిచిపెట్టబడ్డాయి. ఆడవాళ్ళ మానభంగాలు, మగవారి హత్యలు, పిల్లని ఎత్తుకుపోవడాలు, మారణహోమాలు నిత్యకృత్యాలయ్యాయి. సైనికులు maximum టీనేజర్లు. వీళ్ళని భయపెట్టి, తొమ్మిదీ పదేళ్ళ వయసులో చంపడం నేర్పించి దళంలోకి బలవంతంగా లాక్కొచ్చారు. చంపడం, నరకడం లాంటి పద్ధతులతో ప్రజల్ని టెర్రరైస్ చేసారు. వీరి అదుపులో ఉన్న ప్రాంతాలలో ప్రజల జీవితం అత్యంత దుర్భరం. పాశవిక పద్ధతులు, పారిపోవడానికి ప్రయత్నించే ఊహలే రానీయకుండా చేయగల పనిష్మెంట్ ల ద్వారా అత్యంత ప్రమాదకరమైన దళంగా RUF మారింది.
సామాన్య జనం ఉద్యమంలో చేరకుండా తటస్థంగా ఉండేందుకు వీలు లేకుండా పోయింది. ఇంట ఉన్న మగపిల్లల్ని ఎత్తుకుపోయి దళంలో చేర్చుకునేవారు. ఆ పిల్లలు పారిపోయేందుకు గానీ ప్రయత్నిస్తే చేతులు ఖండించేవాళ్ళు. ఈ శిక్ష కి ముచ్చటగా "లాంగ్ స్లీవ్", "షార్ట్ స్లీవ్" అని పేర్లుండేవి. అంటే చేతిని "మోచేతి నుండీ తొలగించడం", లేదా జస్ట్ "మణికట్టు దగ్గర కత్తిరించడం". ప్రజల్లో భయంకరమైన టెర్రర్. జీవితాల్లో అంతులేని విషాదం. భర్త, పిల్లలు చంపబడి అనాధలయిపోయిన స్త్రీలెందరో, ప్రాణాలున్నా, జీవితేచ్చ లేని తల్లితండ్రులెందరో, అన్నీ ఉన్నా తినేందుకు అన్నం లేక, తినాలన్న ఇచ్చ లేక, మృత్యువు కోసం ఎదురుచూసే వృద్ధులు - బీదరికం, విద్య, భవిష్యత్తూ లేకపోవడం, అక్కడి జీవితం.
ఈ పశ్చిమాఫ్రికా దేశానికి మాటసాయంగా ECOMOG (Economic Community of West African States Monitoring Group)ని నైజీరియా అధ్యక్షత న ఏర్పరిచారు. దాన్ని చాలా నిర్దాక్షిణ్యంగా ఓడించాడు ఫోడే సంకో. అప్పటినిండీ RUF, ఒక్క "ఫ్రీ టౌన్" లో తప్ప మొత్తం సియెర్రా లియోన్ లో అధికారాన్ని హస్తగతం చేసుకుంది. డ్రగ్స్, డైమండ్ స్మగ్లింగ్ దాని ప్రధాన ఆదాయ వనరు. ఆఖరికి అక్కడి ప్రజల జీవితానికి ఉన్న కష్టాన్ని అంతర్జాతీయ సమాజం పట్టించుకోవాల్సి వచ్చినప్పటికి ప్రజలు చాలా ఘోరమైన చిక్కుల్లో ఉన్నారు. తిండి, electricity, కనీసవసరాలు తీరే దారి లేని పరిస్థితి. దేశం అధోగతిలో ఉన్నట్టే. ఐక్యరాజ్య సమితి, ఆర్యుఎఫ్ ఒక ఒప్పందానికి (లోమె పీస్ ఎగ్రీమెంట్ - Lomé Peace Agreement) కి రావడం జూలై 1999 లో జరిగింది. దీని ప్రకారం RUF ఆయుధాలను, పోరాటాన్ని వదిలిపెట్టి, దేశంలో శాంతియుతమైన ప్రభుత్వం ఏర్పడేందుకు సహకరించాలి. ఇక్కడ RUF ఒక తటస్థ సైన్యం ముందు మాత్రమే నిరాయుధీకరణ కు ఒప్పుకుంది. ఇలా ఆయుధాలు విడిచిపెట్టాక, సాధారణ జీవితం గడిపేందుకు గెరిల్లా పోరాటం తప్ప ఏమీ ఎరగని ఆ RUF సభ్యులకు సాయపడేందుకు ఐక్యరాజసమితి ఒక DDR (Disarmament, Demobilization and Rehabilitation Program) ప్రోగ్రాం ని కూడా సిద్ధపరిచింది. ఆయుధాలతో లొంగిపోయే రెబల్స్ కు పునరావాసం కల్పించేందుకు ఒక తటస్థ సైనిక సంస్థ అవసరం అపుడు ఏర్పడింది. దీనిలో భాగంగానే మన దేశ సైన్య బెటాలియన్ సియెర్రా లియోన్ కు UNAMSIL (United Nations Mission in Sierra Leone) శాంతి పరిరక్షక దళం గా ప్రయాణమయ్యారు.
ఈ బెటాలియన్ లో రెండు కంపెనీలకు 'దారూ', 'కైలాహున్' అనే రెండు ప్రాంతాలలో పనిచేయాలని ఆదేశాలున్నాయి. నిజానికి ఇవి రెండూ రెబెల్స్ ఆధీనంలో ఉన్న ప్రాంతాలు. మరీ ముఖ్యంగా 'కైలూహాన్' చాలా కష్టమైన ప్రదేశం. ఎందుకంటే ఇది RUF కు ప్రధాన స్థావరం. కెన్యా తో సహా ఇతర ఏ దేశమూ ఇక్కడ డిప్లాయ్ అవడానికి ఒప్పుకోలేదు. భారత దేశానికే చెందిన (UN) ఫోర్స్ కమాండర్ జెనరల్ జెట్లీ, తన దేశపు ట్రూప్స్ ని కైలాహూన్ లో పనిచేయమని ఆదేశించారు. ఈ డిప్లాయ్‌మెంట్ లలో కొన్ని దేశాలు అయితే ప్రత్యేకంగా 'డైమండ్ ఏరియా'ల్నే కోరుకునేవి. కైలాహూన్ లాంటి ప్రమాదకరమైన ప్రదేశాల్ని నిరాకరించేవి. ఇలాంటి పరిస్థితుల్లో, మేజర్ పునియా తన బెటాలియన్ లో అతి చిన్న భాగాన్ని అడ్మినిస్ట్రేటివ్ సాయం కోసం "దారూ" లో విడిచిపెట్టి, మిగతా భాగంతో (233 గురు) "కైలాహూన్" కి బయల్దేరారు. వారిని అక్కడ deploy చేసిన ప్రాంతం RUF కు గుండెకాయ లాంటి అత్యంత ప్రమాదకరమైన ప్రాంతం. అక్కడికి వెళ్ళేందుకు ఎన్నో దేశాల పీస్ కీపింగ్ ఫోర్స్ సభ్యులు నిరాకరించారు. ఆఫ్రికా సంగతి తెలిసిన కెన్యా సైన్యమే అక్కడ విడిది చేసేందుకు నిరాకరించింది. అలాంటిది, ఇచ్చిన మాట కోసం, ఒప్పుకున్న పని చేసేందుకని నోరెత్తకుండా అక్కడికి బయల్దేరిన ఈ పటాలం, తదనంతరం బయల్దేరిన పోట్లాటల ఫలితంగా నెలల తరబడి RUF చేత చుట్టుముట్టబడింది.
నిజానికి ఈ డిప్లాయ్‌మెంట్ ఒక శాంతి పరిరక్షక దళానిది. స్థానికులకు వీరు ఎలాంటి పరిస్థితిలోనూ హాని కారకులు కారు. వీరు పెద్దన్నల లాంటి వాళ్ళు. ప్రమాదంలో ఉన్న స్థానికులకు సాయం చేసేందుకు వచ్చినవాళ్ళే. కాబట్టి స్థానికులతో తగినంత పరిచయం పెంచుకుని వారి విశ్వాసాన్ని గెలుచుకోవడం కూడా ఒక స్ట్రాటజిక్ అవసరం.
దీనిలో రెండు రకాల దళాలుంటాయి. ఆయుధాలు ధరించే పోరాట దళం, (మన దేశ సైన్యం లాంటిది) - ఇంకోటి ఆయుధాలు పట్టకుండా, కేవలం డిప్లమాటిక్ డ్యూటీ గా వచ్చిన అబ్సర్వర్ బృందం. వీరు నిరాయుధులు. వీరు డిప్లొమసీ, arbitration ని చదువుకుని, శాంతియుత పరిష్కారాల కోసం ఎలా పనిచెయ్యాలో తెలుసుకుని వచ్చిన వారు. సమిష్టిగా, వీళ్ళ డ్యూటీ ఇక్కడ RUF సాయుధులను వారి ఆయుధాలు విడిచేలా ఒప్పించి, జన జీవన స్రవంతి లో కలిసేలా చెయ్యడం, వృత్తి నైపుణ్యాలవీ నేర్పించడం.
(లొంగిపోయిన)/ ఆయుధాలు విడిచిపెట్టిన ప్రతి రెబెల్ కూ హాండ్సం గా డబ్బు (అప్పట్లోనే USD 300) రెండు విడతల్లో (150 + 150) ఇచ్చేవారు. అయితే, పథకం మొదలయిన కొత్త కొత్తల్లో కాబట్టి 'డబ్బు విడుదల' కావడం అనేది టైం పట్టే వ్యవహారం కాబట్టి, ఆయుధాలు విడవగానే ఒళ్ళో డబ్బు రాలిపళ్ళేదని కినుకతో ఎక్కువ RUF Rebel లొంగుబాట్లు జరిగేవి కాదు. లొంగిన వాళ్ళు చాలా మంది టీనేజర్లు లేదా అంత కన్నా చిన్న పిల్లలు. వాళ్ళ వయసుని చూస్తే గుండె బేజారయిపోయేది. వీళ్ళ అమ్మా నాన్నా అక్కా చెల్లెళ్ళు చాలా మందిని వీళ్ళకళ్ళ ముందే కాల్చేసారు. లేదా, వారిప్పుడు బ్రతికున్నారో లేదో తెలీని పరిస్థితిలో ఉన్న పిల్లలు వీళ్ళు. వీళ్ళు కూడా ఎందరినో చంపేసారు. గుక్కెడు నీళ్ళకోసం, గుప్పెడు అన్నం కోసం తుపాకీ ధరించి ప్రాణాలు తీయడమే వీళ్ళ కి తెలిసిన జీవితం. యుద్ధం లేని ఆటపాటల బాల్యం ఎలావుంటుందో వీరికి తెలిసే అవకాశమే లేదు.
భారత శాంతి పరిరక్షక దళం సియెర్రా లియోన్ లో డిప్లాయ్ చెయ్యబడ్డ ఒక 'సాయుధ' సైన్యం. పరిపాలన సౌలభ్యం కోసం వీరిని రెండు వేర్వేరు సైట్ లలో ఉంచారు. వీటిలో ఒకప్పుడు హాస్పిటల్ గా ఉపయోగింపబడిన రెండంతస్థుల బిల్డింగ్ ఒకటి, రెండోది ఏ భవనమూలేని ఎతైన గ్రౌండ్. ఈ భారత దళం స్థానికులతో కలిసిపోయి, వారి సమస్యల్ని తెలుసుకుంటూ, తాముంటున్న ఊరి పెద్దలతో సమావేశమవుతూ, తమ లక్ష్యాలని వారితో పంచుకుంటూ, శాంతియుతంగానే గడిపింది. నాయకుడిగా మేజర్ పునియా స్థానికులచేత గౌరవంగానే స్వాగతించబడ్డారు. స్థానికులతో చక్కగా కలిసిపోయి, వారితో మంచి బంధాన్ని ఏర్పరచుకున్నారు. గ్రామ పెద్ద మంచి దోస్త్ అయ్యాడు. ఇక్కడ గ్రామ పెద్ద అంటే, అక్కడి పద్ధతి ప్రకారం, చుట్టుపక్కల ప్రావిన్సెస్ లో ఉన్న పెద్దలందరికీ పెద్దన్నమాట. అతన్ని 'పాపా గీమా' (Papa Giema) అంటారు. అతని వాక్కు అందరికీ శిరోధార్యం. కాకపోతే అతను నిరాయుధుడు. రెబెల్స్ కు నచ్చ జెప్పగలడు తప్ప, వారిని శాసించలేడు.
భారత శాంతి పరిరక్షక దళానికి UN నుంచీ మంచి తిండి/రేషన్ దొరుకుతుంది, అదీ ఎక్కువ గానే, సౌకర్యంగానే దొరికేది. గ్రామ పరిస్థితుల్ని చూసి, వారిలో తిండి కి ఎంత కష్టంగా ఉందో గ్రహించి, తరచుగా తమ రేషన్ నుంచీ కాస్త తీసి, గ్రామస్తులకు పంచడం, యూనిట్ డాక్టర్ గ్రామస్తులకు వైద్య సేవలందివ్వడం వంటి humanitarian assistance ఇవ్వడం మొదలుపెట్టాడు. ఈ చర్య అతనికి ఎంతో పేరు తెచ్చింది. పిల్లా పాపలతో ప్రేమగా మాట్లాడడం, యువత తోనూ, కలిసిపోవడం, తరచుగా వాళ్ళతో వాలీబాల్ ఆడడం (మన క్రికెట్ లాగా - దౌత్యం, స్నేహం కోసం) వంటి పనుల ద్వారా, క్రమం తప్పకుండా ప్రతి రోజూ గ్రామం లోకి తన పెద్ద నల్ల గొడుగు తీసుకుని నడకకు వెళ్ళడం, తరచూ టచ్ లో ఉండడం ద్వారా కొన్ని పరిచయాల్ని పెంచుకుంటాడు మేజర్.
ఆ స్నేహాలు తరవాత అతనికి పనికొస్తాయి. లోకల్ ఇంటలిజెన్స్ కీ, డిప్లొమసీ కీ, పెద్ద నిర్ణయాలు తీసుకోవడానికి ఈ లోకల్ పరిచయాలు బాగా ఉపయోగపడతాయి. పైపెచ్చు, గ్రామస్తులతో, RUF నేతలతో స్నేహం పెరగడం వల్ల వాళ్ళను disarmament వైపు నడిపించొచ్చు. పైగా UNPKF లక్ష్యం అదే. అదే ఆశ తో అందరితో స్నేహం కల్పించుకుంటాడు మేజర్ పునియా. వచ్చీ రాని ఇంగ్లీష్ తో మాటాడే RUF యువకులు - మేజర్ తో పరాచికాలాడేంతవరకూ ఇవి కొనసాగాయి. వాళ్ళలో కొందరి కి ఎడమ చెయ్యి ఉండదు / కట్ చేసి ఉంటుంది. RUF చాలా తెలివైనది. ఈ పిల్లలు సాధారణంగా కుడి చేతితో నే రైఫిల్ షూట్ చెయ్యాలి కాబట్టి, ఎంత పెద్ద పనిష్మెంట్ అయినా (చావు తప్ప) కుడి చేతి జోలికి RUF ఎపుడూ పోదు.
మేజర్ మీద RUF ని disarmament/ లొంగుబాటు కి ఒప్పించమని ఒత్తిడి పెరుగుతూ ఉండగా, అకస్మాత్తుగా సియెర్రా లియోన్ లోనే ఇంకో దిక్కున ఒక అనూహ్య సంఘటన జరుగుతుంది. కెన్యా, నైజీరియా దళాలకు, RUF కు చిరకాల వైరం. ఒక గొడవ అనంతరం Kenyan దేశ UN దళాలతో RUF పోరాటానికి దిగినప్పుడు, UN తన వారిని కాపాడుకునేందుకు ఎటాక్ హెలికాప్టర్ లను పంపింది. అలా ఎయిర్ ఎటాక్ జరిగి, వందలాదిమంది RUF రెబెల్స్ మరణించారు. దానితో UN మీద వొళ్ళు మండిన RUF సియెర్రా లియోన్ లో విడిది చేసిన అన్ని దేశాల UN బెటాలియన్లనూ చుట్టుముట్టింది. చాలా మంది లొంగిపోయారు. ఆయుధాలు వదిలి, నిస్సహాయులైపోయారు. అదే ఊపులో కైలుహాన్ లో కూడా RUF మెరుపు దాడి చేద్దామనుకుంది. ఇక్కడి భారత దళాల కేంప్ ను చుట్టుముట్టింది. అధికారులను బందీలుగా తీసుకుంది. వీరిలో నిరాయుధ మిలిటరీ అబ్సర్వర్లు కూడా ఉన్నారు. వీళ్ళలో వేరే వేరే శక్తివంతమైన దేశాలవారితో పాటూ భారత దేశం, పాకిస్తానీ సైన్యాధికారులు కూడా ఉన్నారు. ఈ ఎయిర్ స్ట్రైక్ సమాచారం, కెన్యన్ దళాల లొంగుబాటు సమాచారం ఏదీ - ఎందువల్లనో మేజర్ పునియా కి / అతని బృందానికి చేరక, అంతా 'చంగాసీ' అనుకుని హాయిగా ఉన్నపుడు, ఇక తమ ప్రాంతాలలో రెబల్స్ త్వరలో ఆయుధాలను వదిలిపెడతారు, తమ అసలు పని మొదలుకానుంది అనుకుని చల్లగా ఉన్న భారత శాంతి పరిరక్షక దళం, కలలో కూడా అనుకోని పరిణామం ఇది.
ఆ స్ట్రైక్ జరిగిన మర్నాడుదయాన్నే ఈ భారత సైన్యపు అధికారిని మేజర్ పునియాని మీటింగ్ కి అని తమ స్థావరానికి పిలిచి, మిగిలిన అబ్సర్వర్లతో పాటు బందీ చేసారు. గన్ పాయింట్ మీద తమ తిరస్కారాన్ని వెళ్ళగక్కారు. వీరిలో కేప్టెన్ సునీల్ ని భారత దళాలున్న కేంప్ కు తీసుకెళ్ళి అతని తలకి తుపాకీ ఎక్కుపెట్టి - కేంప్ లో ఉన్న 233 మందినీ ఆయుధాలు విడిచిపెట్టి ముందుకు వచ్చి లొంగిపోతారా, మీ అధికారిని కాల్చమన్నారా అన్నారు. అయితే కేప్టెన్ సునీల్ (ఇపుడు బ్రిగేడియర్) ఆయుధాల్ని ఎట్టి పరిస్థితుల్లోనీ విడిచిపెట్టవద్దని హిందీలో అరుస్తూ తమ ట్రూప్స్ ని హెచ్చరించారు. అతని ఆదేశాల వల్ల, హెచ్చరికల వల్ల, ఈ విచిత్ర పరిస్థితుల్లో ఎలా మెలగాలో భారతీయ ట్రూప్స్ కు అర్ధమయింది. ఒక్కరూ ఈ బెదిరింపులకు లొంగలేదు. భారత బెటాలియన్ చుట్టుముట్టబడింది. వాళ్ళు అక్షరాలా RUF బందీలయ్యారు. సగౌరవంగానే, తమ తమ స్థానాలను కాపాడుకున్నారు. ఇది టర్నింగ్ పాయింట్. కథ మొదలు. పైగా పరిస్థితులు దిగజారడం వల్ల వారికి దగ్గరగా ఉన్న UN ఆఫీసులు కూడా చాలా కార్యకలాపాలను ఆపేశాయి. దాంతో మన సైన్యం ఒంటరిగా మిగిలిపోయింది.
నిజానికి సియెర్రా లియోన్ లో అప్పటికి, వారి చుట్టుపక్కల ప్రాంతాలలో ఉండిన మిగతా దేశాల శాంతి పరిరక్షక దళాలు లొంగిపోయి, ఆయుధాలతో పాటూ, యూనిఫాం కూడా లాక్కోబడి, అర్ధనగ్నంగా ట్రక్కుల్లో పశువుల్లా కుక్కబడి, ఊరేగించబడి, లొంగుబాటు మీద సంతకాలు చేసేందుకు లైబీరియా తీసికెళ్ళబడ్డారు. భారతీయ సైన్యం మాత్రం ఆయుధాలు విడవలేదు. సరెండర్ అయే ప్రశ్నే లేదన్నారు. 45 రోజులకు పైగా వేర్వేరు కేంప్ లలో బందీలు అయిపోయారు. గానీ పంతం విడవలేదు. ఆఖరికి తమని RUF అష్టదిగ్బంధనం చేసేసి, తిండి లేకుండా, రేషన్, ఉత్తరాలు అందనీయకుండా మిగిలిన ప్రపంచంతో సంబంధాలు కట్ చేసి నిర్బంధించినా సరే, సహనంగా చాతనయినంత కాలం శాంతి మంత్రాన్నే పఠించారు. దౌత్యవేత్తలు చర్చామార్గం పట్టారు. సంకో అస్సలు తలొగ్గలేదు.
కైలాహూన్ కు చెందిన 'పాపా గీమా', మేజర్ పునియాను ఎంతగానో అభిమానించే వాడు. అతన్ని సాంప్రదాయక రీతిలో RUF తుపాకీ అంచున బందీని చెయ్యడాన్ని వ్యతిరేకిస్తాడు. అతన్నిని RUF స్థావరంలో విడిగా కాకుండా తన ట్రూప్స్ తోనే ఉండగలిగేలా చెయ్యడంలో కీలక పాత్ర పోషిస్తాడు. సాధారణంగా సైన్యంలో పై అధికారి స్థానంలో శూన్యత ఉండకూడదు. పై అధికారి బందీ అయితే, మొత్తం సైన్యం నిస్తేజం అయిపోతుంది. ఈ పాపా గీమా, మేజర్ పునియా తన సైన్యం తోనే ఉంటూ, స్వేచ్చగా గ్రామంలో తిరిగేందుకు సహకరిస్తాడు. అంటే తనవాళ్ళందరూ కార్డన్ (ముట్టడి) లో ఉండగా, మేజర్ పునియా మాత్రం రెబెల్స్ తో సంభాషించగలిగేందుకు బయటికి రావడం జరుగుతుండేది. అది కాస్తా అతనొక్కడే బయట తిరిగి, పరిస్థితులను బేరీజు వేసుకోవడానికి పనికొచ్చేది.
ఇదిలా ఉండగా మధ్యలో తమ వారు ఇలా వేర్వేరు కేంప్ లలో బందీలుగా ఉండడం మంచిది కాదని గ్రహించుకుని, RUF వేరే కార్యక్రమాలలో బిజీగా ఉన్నపుడు, పహారా కాసే రెబల్స్ సంఖ్య కుదించబడిన సమయంలో, ఒకసారి ధైర్యం చేసి హాస్పిటల్ సైట్ లో ఉన్న మేజర్ , స్ట్రాటజిక్ గా తక్కువ రక్షణ కల్పించగల హాస్పిటల్ కేంప్ నుండీ, హై గ్రౌండ్ కేంప్ కు తన దళాలతో, వాహనాలతో సహా, పెళ్ళున వర్షం పడుతున్న రాత్రి ఎస్కేప్ అవుతారు. ఇలా ఒకే కేంప్ లో అందరూ చేరడం ఒక మొరేల్ బూస్టర్ అవుతుంది.
పైగా విడుదలెప్పుడో తెలీనిపరిస్థితులలో చిక్కుపడి, ముట్టడి లో రోజులతరబడి ఉండడం వల్ల కలిగే స్ట్రెస్ ని తగ్గించుకునేందుకు, బందీలుగా ఉండడం వల్ల చేతులు కట్టేసినట్టయి, అలా ఉండిపోకుండా కేంప్ లోపల ట్రెంచ్ లు తవ్వడం, వాలీబాల్ ఆడడం, శత్రువు లకు అనుమానం రాకుండా యుద్ధానికి సన్నద్ధంగా ఉండడం తప్పనిసరి అవుతుంది. బయటి ప్రపంచంతో, ఫేమిలిలతో, సంబంధం తెగిపోయి కొద్దో గొప్పో డీలా పడి ఉన్న తన బృందాన్ని ఎప్పటికపుడు ఉత్సాహపరుస్తూ ఉండడం ద్వారా బెటాలియన్ లో అధికారులు బిజీగా ఉండేవారు.
విడుదల చేస్తారా, వీర స్వర్గం బాట పట్టిస్తారా అనేది RUF చేతిలో మాట. వాళ్ళు కాస్తా మొండి వాళ్ళు. 'అందరూ లొంగిపోయారు. ఈ ఇండియన్లు ఎందుకు లొంగరు ? ఎన్నాళ్ళు లొంగరు?' అని పంతం వాళ్ళది. "మేజర్ నువ్వు ఇంటికి వెళ్ళవా?'' అని పరిహాసం చేసేవారు. "మీ దేశం అందమైనది. ఇక్కడే ఉండిపోతా, వెళ్ళేటట్టయితే, నా ఆయుధాలతో, నా బెటాలియన్ తో సగౌరవంగా వెళ్తాను" అని ఇతను బదులిచ్చేవాడు. వీళ్ళ కార్డన్ మొదలయినపుడు వీరి సమాచారం కోసం దారూ నుండీ వచ్చిన ఒక భారతీయ సైనికుల పెట్రోలింగ్ బృందాన్ని RUF అడవిలోనే బంధిస్తుంది. ఇరవై ఒక్క సభ్యులున్న ఈ బృందం హేయమైన పరిస్థితుల్లో నెలన్నరకు పైగా బందీలుగా ఉన్నారు. వీరి విడుదల కూడా దేశాల మధ్య రాజకీయ చర్చలకు దారితీసింది. వీరి విడుదల కూడా మేజర్ పునియా ప్రయత్నాల వల్ల సాధ్యపడింది. వీరి విడుదల జరిగే వరకూ ఎటువంటి ఆపరేషన్ చేపట్టినా, అడవిలో బందీలుగా ఉన్న వీళ్ళ ప్రాణాలు ప్రమాదంలో పడేవి. కాబట్టి ఆపరేషన్ ఖుక్రీ ప్రారంభం కావడానికి ఈ రిస్క్ ఎలిమెంట్ కూడా లేకుండా పోవడం మొదటి మెట్టు. పునియా ఒంటి చేత్తో ఓర్పుగా ఒక్కో చిక్కుముడీ అలా విప్పుకురాగలిగారు.
వీరిని గురించి ప్రధాని వాజపేయి పార్లమెంట్ లో ప్రసంగించారు. యునైటెడ్ నేషన్స్ నీ, సియెర్రా లియోన్ నీ వీళ్ళని విడుదల చేసేలా ప్రయత్నించాలని విజ్ణప్తి చేసారు. ఆ విషయం తెలిసాక, తమ నిర్బంధం గురించి / క్షేమం గురించి తన భార్యకు తెలిసి ఉంటుందని మేజర్ పునియాకు అనిపిస్తుంది. అతను కేంప్ కు వచ్చేముందు, సియెర్రా లియోన్ లో తాము లేండ్ అయిన ఆ దేశపు ఏకైక విమానాశ్రయం లుంగీ నుండి భార్యకు ఫోన్ చేసాడు. మొబైల్ లు అంతగా లేని కాలం అది. కార్గిల్ యుద్ధం జరిగిన మరుసటి సంవత్సరం. కేవలం ఇక్కడ విమానాశ్రయంలో మాత్రమే ఐ.ఎస్.డీ సౌకర్యం ఉండేది. దేశంలో ఇంకెక్కడా, టెలిఫోన్, విద్యుత్ సదుపాయం కూడా లేదు. అక్కడి దట్టమైన అడవుల్లో, జంతువులు కూడా లేవు. అవన్నీ ప్రజల ఆకలి కి ఆజ్యమైపోయాయి. అంత దారుణమైన పరిస్థితులు. అప్పట్నించీ బెటాలియన్ లో ఎవరికీ ఫోన్ కాల్ సదుపాయం లేదు. ఉత్తరాలూ ఇప్పుడు బంద్ అయిపోయాయి. అసలు తాము బ్రతికే ఉన్నామని తమ కుటుంబాలకు తెలుసో లేదో తెలీని పరిస్థితి ఈ సైనికులది.
ఆఖరికి, వర్షాకాలం సమీపిస్తున్నపుడు, తమ దగ్గరున్న ఆహారం వారం రోజులకు మాత్రమే సరిపోతుందని తెలిసినపుడు, ట్రూప్స్ లో బెంగ మొదలయిందని గ్రహించినపుడు, మేజర్ పునియా, ఊహించని నిర్ణయం తీసుకుంటారు. ఇక దౌత్య విధానాల ద్వారా విడుదలకు ప్రయత్నించి లాభం లేదని, వొదిలేయదల్చుకుంటే, RUF ఎపుడో పంతం వీడేదని గ్రహించాడు. అతనెరిగిన నాయకులు "మేజర్ మీ దేశానికి వెళ్ళవా?" అని గేలి చేయడం ఎక్కువయింది. మానసిక దాడి ఇది. మనోబలాన్ని తెగ్గొట్టడం వారి వ్యూహం. పైగా మేజర్ నెరపిన ప్రజారంజకత్వపు వ్యూహం వల్ల అతని పట్ల, భారతీయులపట్ల, స్థానికుల్లో సానుభూతి ఉంది. RUF ఒకవేళ వీరిమీద కాల్పులకు తెగబడితే, వారు స్థానిక ప్రజల మద్దతు కోల్పోయే ప్రమాదం ఉంది. అందుకే RUF కేవలం మనో యుద్ధానికే కట్టుబడింది. వారి ఉద్దేశ్యం United Nations ని అవమానించడం. తాము invincible అని, ప్రపంచం తన వ్యవహారాలలో జోక్యం చేసుకోవద్దని, తమని UNPKF బలవంతంగా నిరాయుధీకరణ వైపు నెడుతోందనీనూ వీళ్ళ కోపం. ఈ అహంకారం వల్లనే RUF ఎప్పుడూ చర్చలకు సిద్ధం కాదు. ఒప్పందాలను ఖాతరూ చెయ్యదు. దీన్ని ఎదిరించాలని మేజర్ పునియాకు, రేషన్ సప్లై, ఉత్తరాలు లాంటివి లేకుండా రెండు నెలల దిగ్బంధనం లో తన వాళ్ళతో గడిపిన తరవాత బలంగా అనిపిస్తుంది. పైగా పెట్రోలింగ్ బృందం విడుదల, రాబోతున్న వర్షాకాలం, నిర్ణయానికి రావాల్సిన సమయం ఆసన్నమయిందన్న క్లియర్ మెసేజ్ ని ఇస్తాయి. తాను, తన వారూ ప్రాణాలతో, గౌరవంతో బైటపడాలంటే ఆ నిర్ణయం తప్పనిసరి మార్గం కూడా. "పిల్లిని ఒక గదిలో బంధిస్తే..." అనే నానుడి గుర్తుంది గా. పైగా RUF పెట్టుకున్నది అప్పుడే (Kargil) యుద్ధం గెలిచొచ్చిన సైన్యంతో! RUF అతిశయాన్ని బ్రేక్ చెయ్యాలని, "యుద్ధం ఎల్లకాలం సాగకూడదని" వాళ్ళకు గుణపాఠం చెప్పేందుకు మేజర్ నిర్ణయించుకుంటాడు.
సియెర్రా లియోన్ లో వర్షాకాలం అత్యంత ప్రమాదకరమైనది. ఎంత విస్తారమైన భయానకమైన కుంభవృష్టి కురుస్తుందంటే, గ్రామాలు నెలలతరబడి వరదలో, బురదలో, రోగాలలో మునిగి ఉంటాయి. ఒక వైపు తిండి లేక, తమ పై ముట్టడి ముగిసే సమయం, పద్ధతీ ఏమీ తెలీని వేళ, stand-off లో చేతులు కట్టుకుని కూచుంటే లాభం లేదని, అక్కడే ఉంటే అందరం చస్తామని, పునియా యుద్ధానికి సిద్ధపడ్డారు.
పై నుండి రేడియో లో ఆదేశాల కోసం అర్జీ పెట్టుకు ని ఎదురు చూసారు. ఇలాంటి క్లిష్ట సమయాల్లో మేన్ ఆన్ ద గ్రౌండ్ (యుద్ధ క్షేత్రం లో ఉన్న అధికారి) గా తన లిమిటేషన్ లను, అవసరాల్ని, ఫీల్డ్ కమాండర్ తో పంచుకున్నారు. అలా ఆపరేషన్ ఖుక్రీ మొదలయింది. యుద్ధం డ్రాయింగ్ బోర్డ్ మీద మొదలయింది. ఫీల్డ్ కమాండర్, వివిధ దేశాల సైనిక ప్రతినిధులతో కలిసి వ్యూహాలు రచించారు. వివిధ దేశాలకు చెందిన దళాలతో, పారా కమాండోలతో ఆయుధాలను, హెప్టర్ లను, ఎటాక్ హెలెకాప్టర్లను, సిద్ధం చేసారు. మూడు ప్లాన్ లు సిద్ధమయ్యాయి వాటిని రేడియో ద్వారా మేజర్ కు వివరించారు. ప్రతి వ్యూహం లో నూ ఉన్న రిస్క్ లను చర్చించుకున్నారు. ప్లాన్ ఏ, బీ, సీ లలో అత్యంత క్లిష్టమైన, risky, ఎక్కువ చావులకు కారణమవగలిగే వ్యూహం (plan C) ఎన్నికయింది. పునియా తన అధికారులతోనూ, సైనికులతోనూ సాధ్యాసాధ్యాలను చర్చించారు. ఏకాభిప్రాయం సాధించారు. వ్యూహంపై అనుమానాల్నీ, వ్యతిరేకతల్నీ, మొగ్గ దశలోనే తుంచేసారు. ఒకటీ అరా తిరుగుబాట్లనీ అంతకు ముందే అణచేసారు. తమని రక్షించేందుకు ఎవరూ రారని, తమని తామే రక్షించుకోవాలనీ భారత దళానికి అర్ధం అయింది. భారత దళం యుద్ధానికి సిద్ధమైంది. ఈలోగా భారత దేశం నుండి ఇంకో 'para special forces కమాండోలు, ఎటాక్ విమానాల తో సైనిక బృందం' సియెర్రాలియోన్ వచ్చి చేరింది. ఈ కొత్త గా పెరిగిన బలగం, ఆపరేషన్ లో భారతసైన్య విజయావకాశాలను పెంచింది.
ఈ ఫైనల్ ప్లాన్ ప్రకారం అసలు ఆపరేషన్, బందీలు గా ఉన్న "ఫారెన్ అబ్సర్వర్లను" హెలికాప్టర్ ద్వారా ఎయిర్‌లిఫ్ట్ చెయ్యడంతో మొదలవుతుంది. హెలికాప్టర్ ని చూసి దళాలు వాటిని కాల్చగలిగే ఆయుధాలకోసం 'ఆయుధాగారానికి' వెళ్ళినపుడు, దాన్ని రాకెట్ తో లేపేసి, వాళ్ళ కమ్యూనికేషన్ యూనిట్ ని ఇంకో టీం, నాశనం చెయ్యాలి. ఈ దాడి నుండీ RUF కోలుకునేలోగా కైలూహాన్ పట్టణానికి సరిగ్గా మధ్యలో ఉన్న రోడ్ మార్గం గుండా నుండీ దారూ వైపు వెళ్ళాలి. కైలూహాన్ పట్టణానికి నడిబొడ్డున బహుశా నివాశితుల పైన కూడా బాంబులు, రాకెట్లు, పేల్చాల్సి రావచ్చు. (Collateral Damage). పునియా, గ్రామం లో తప్పనిసరి వ్యాహ్యాళి, స్థానికులతో ముచ్చట్లు పెట్టుకోవడం వంటివి ప్రతిరోజూ చేయడం ద్వారా RUF ఆయుధాగారం గా వాడుకుంటున్న తెల్లని భవనం, వారి కమ్యూనికేషన్ భవనం ఎక్కడున్నాయో ఖచ్చితంగా తెలుసుకుని టార్గెట్ పై నిర్ణయం తీసుకోగలుగుతారు.
ఎన్నో మల్లగుల్లాలు పడి, ఇదే సరైన వ్యూహం అని నమ్మి, ఈ వ్యూహం ప్రకారం, కైలాహున్ ను తగలబెట్టి, ఊరిలోంచి దూసుకొచ్చే ఫైరింగ్ ని ఎదుర్కొంటూ, రాకెట్ దాడులను నియంత్రిస్తూ, దానిలో భాగంగా తాము జరపాల్సొచ్చే కాల్పుల్లో, అప్పటిదాకా తమ స్నేహితులైన స్థానికులను కూడా చంపుకుంటూ, టౌన్ దాటి అడవిలోకి ప్రవేశించి, అటునుండి దారూ (DARU) పట్టణం వైపుగా వీళ్ళు సాగాలి. దారూ నుండి ఇంకో దళం తగినన్ని వాహనాల్ని, ammunitionనీ, సాయుధుల్నీ తీసుకొచ్చి వీళ్ళని రక్షిస్తుంది. పైనుండి ఎటాక్ హెలికాప్టర్లు ఫైర్ చేస్తాయి. దారంతా అడవుల్లో గెరిల్లాలు అడుగడుగునా దాడి చేస్తారు. వాళ్ళని కాల్చుకుంటూ, దొరికినవాడిని దొరికినట్టు చంపుకుంటూ వెళ్ళి బయటపడాలి. ఇదీ ప్లాన్.
ట్రూప్స్ లో అధికంగా ఉన్న గూర్ఖాల వీరత్వానికి ప్రతిబింబంగా వారి ఆయుధమైన ఖుక్రీ పేరుని ఈ ఆపరేషన్ కు పెట్టారు. కీలక ఆదేశాలను రేడియో సందేశాలను, RUF వినవచ్చనే ఉద్దేశ్యంతో మళయాళం లో ప్రసారం చేసారు. భారత బెటాలియన్ లో మళయాళీలు, ఎక్కువ ఉన్నారు. హిందీ ని కూడా RUF network క్రాక్ చేసుండగలిగేది కాదు. అయినా రిస్క్ తీసుకోలేదు. కార్గిల్ లో కూడా కమ్యూనికేషన్ ని మదరాసీ భాషలో (తమిళం) నిర్వహించారు. పుష్తూన్, కష్మీరీ, హిందీ, ఉర్దూ, ఇంగ్లీష్, అఫ్గానీ భాషల్ని అర్ధం చేసుకున్నంత సులువుగా మన తమిళాన్ని పాకిస్తానీలు అర్ధం చేసుకోలేకపోయారు.
పై అధికారులు ఈ ఆపరేషన్ లో కనీసం 30% మంది సైనికులు మరణిస్తారని ప్రాధమికంగా అంచనా వేసారు. ఎందుకంటే RUF అత్యంత పాశవిక, గెరిల్లా నైపుణ్యం ఉన్న సంస్థ. అప్పటి దాకా దాని స్థానబలం, ఆయుధ బలం వల్ల విజయావకాశాలు ఎక్కువ, అపజయం అన్న మాటే ఎరగని సైన్యం దానిది. వాళ్ళ దగ్గర ఉన్న అపారమైన ఆయుధ సంపత్తి, హెలికాప్టర్లను, ఫైటర్ విమానాలనూ కూల్చగల సామర్ధ్యం, చిక్కని అడవుల్లో చిక్కకుండా దాడి చేసేది, దాని వ్యూహం, కౄరత్వమూ మామూలు సైన్యాలకు ఊహకు కూడా అందనివి. కాబట్టి, శత్రువుని తక్కువ అంచనాలు వేయకుండా, అత్యంత వ్యూహాత్మకంగా ప్లాన్ ను సిద్ధం చేసి, ఆపరేషన్ ను నడిపించారు.
ఈ ఆపరేషన్ లో ఒకే ఒక్క సైనికుడు, అదీ కొన్ని కారణాల వల్ల దారూ లో ఉండిపోయి ముట్టడిలో బందీ కాకుండా అప్పటిదాకా ఫ్రీ గా ఉండిన హవిల్దార్ కృష్ణకుమార్ మాత్రమే మరణించారు. మిగిలిన వారికి కొద్దినష్టమే జరిగింది. ప్రాణాంతకమైన గాయాలు కాలేదు. ఆస్తి నష్టం కొద్దో గొప్పో జరిగినా, RUF ఆస్థాన 'కైలాహున్' పట్టణం నడి మధ్య నుంచీ, ఫైర్ పవర్, చెక్కుచెదరని ధైర్యంతో, మొండి పట్టుదలతో ఆ పట్టణాన్ని బుగ్గి చేసి, భారతీయ సైన్యం కేవలం నడక ద్వారా, మెల్లగా నడిచే సైనిక వాహనాల లోనూ, అచ్చు సినిమాల్లానే బయటికొచ్చింది. ఊర్నించీ వచ్చాకా దట్టమైన అడవిలో దారూ వైపు పరయాణించింది. మార్గ మధ్యంలో వాహనాలు చెడిపోయాయి. RUF Rebels రోడ్డు తవ్వేసారు. అప్పటికప్పుడు బ్రిడ్జ్ మెటీరియల్ ని హెలికాప్టర్ ల ద్వారా దగ్గరి బేస్ నుండీ రప్పించి, భారీ వాహనాలు నడవగలిగే బ్రిడ్జి ఆఘమేఘాల మీద కట్టేసి, పటాలాన్ని ముందుకు నడిపించారు.
తప్పించుకుంటున భారత సైన్య కేన్వాయ్ 3 బృందాలుగా విడిపోయింది. రెండు బృందాలు నడక, వాహనాల్లో, దారూ చేరాయి. ఇంకో బృందం కేప్టెన్ సునీల్ సారధ్యాన ఎయిర్‌లిఫ్ట్ చెయ్యబడింది. అంటే, మొదటి రెండు బృందాలూ ప్రమాదభరితమైన జోన్ నుండీ తప్పించుకునేవరకూ కెప్టెన్ సునీల్ బృందం రెబెల్స్ పై ఫైర్ చేస్తూనే ఉంది. ఆఖర్న వాళ్ళు నేలకి కొన్ని అడుగుల ఎత్తులో హెలికాప్టర్ లాండ్ అవకుండా, తేలుతూ ఉండగా ఉరుకులు పరుగుల మీద హెలికాప్టర్ లోకి దూకి, వెను వెంటనే గాల్లోకి హెప్టర్ లేవడం ద్వారా రక్షించబడ్డారు. ఆఖరి నిముషం వరకూ వారిని బుల్లెట్లు వెంటాడాయి. కానీ దుర్గామాత దయ వల్ల ఒక్క ప్రాణం పోలేదు. (ప్రతి సైనిక బృందానికీ ఒక కులదైవం లాంటి సింబల్ ఉంటుంది. వీరి దైవం దుర్గా మాత).
కేవలం హవిల్దార్ కృష్ణ కుమార్, RUF రాకెట్ పొట్టలో దూసుకుపోవడం వల్ల మరణించాడు. ఆయన దారూ నుండీ తన ట్రూప్స్ ని కాపాడేందుకు కావల్సిన ఆయుధాలతో నిండి ఉన్న ట్రక్ తీసుకొస్తున్నారు. ఆ రాకెట్ ట్రక్కుని గనుక తాకి ఉంటే జరిగే విధ్వంశంలో ఆపరేషన్‌లో కాపాడవలసిన సైనికుల ప్రాణాలు గాల్లో కలిసిపోయేవి. కానీ పొట్టలో రాకెట్ తాకి, తీవ్ర రక్తస్రావం అవుతున్నా సరే, ట్రక్కుని క్షేమంగా పక్కకు తీస్కెళ్ళి నిలిపిన తరవాతే ఆయన వాలిపోయాడు. అతనికి మరణానంతరం ప్రతిష్టాత్మక సేనా మెడల్ దొరికింది. ఆయన పేరిట ఒక స్మారక చిహ్నం సియెర్రా లియోన్ లో ఇప్పటికీ ఉంది.
ఈ ఆపరేషన్ లో మరణించిన తన సియెర్రా లియోన్ పౌర స్నేహితులని తలచుకుని పునియా గుండె చాన్నాళ్ళు మూగబోయింది. తన బిడ్డల్లంటి ట్రూప్స్ ని ప్రాణాలతో భారతమాతకి అప్పచెప్పగలిగినందుకు, ఆపరేషన్ లో బందీలుగా ఉన్న తనవారిలో ఒక్క ప్రాణం కూడా పోనందుకూ ఎంతో సంతోషంగా ఉన్నా, అమాయక ఆఫ్రికన్ స్నేహితులు మరణించడం, అసలు వాళ్ళు ప్రాణాలతో మిగిలారో లేదో, శిధిలాల్లో బ్రతికే ఉన్నారో లేదో కూడా తెలుసుకోగలిగిన అర్హత , సమయం, అవకాశం తనకు లేనందుకు guilt అతని మనసులో ఇప్పటికీ గుచ్చుకుంటూనే ఉంటుంది. పాపా గీమా, తనకు సోదరి లాంటి 'సిస్టర్' అనే మహిళా, మార్టిన్ అనే ఒక RUF కేప్టెన్ - ఇతర ఎరిగిన ముఖాలూ - తాను వాళ్ళనన్నా కాపాడుకోలేకపోయాడే అన్న బాధ, మేజర్ పునియాను ఇప్పటికీ వేధిస్తూనే ఉంది. ముందు రాత్రే వాళ్ళను కల్సినా ఆపరేషన్ గురించి హెచ్చరించలేకపోయానే అనే బాధ (సమాచారం లీక్ అవుతుందేమో అన్న భయం వల్ల వారిని హెచ్చరించలేకపోతాడు) అసలు 'కైలాహున్' ని ఎటాక్ చేస్తూ విడిచిపెట్టాల్సి రావడం అతనికి కోలుకోలేని బాధ. అసలు 'పాపా గీనీ' వల్లనే కదా తను ఫ్రీ గా తిరగగలిగింది, పరిస్థితుల్ని అంచనా వేయగలిగింది అనే బాధ, అతన్ని రక్షించలేకపోయానే అనే పశ్చాత్తాపం, అతన్ని ఎప్పటికీ విడువదు. వృత్తిధర్మం ముందు స్నేహ ధర్మం, మానవతా ఓడిపోయాయి. సైనికుడిగా తన కర్తవ్య పాలన, తన దేశం పట్ల విశ్వాసం మాత్రమే తన మొదటి ధర్మంగా తీసుకోవాల్సొచ్చింది.
మొత్తానికి కైలాహున్ లో చిత్తుగా ఓడిపోయి, 233 మంది భారతీయుల్లో ఒక్కరినయినా బంధించలేక / చంపలేకపోవడం, అంతవరకు మెత్తగా, శాంతియుతంగా, స్నేహపూర్వకంగా ఉన్న భారత సేన, ఉగ్ర రూపం దాల్చడం, వారి ఫైర్ పవర్, నైపుణ్యం, వ్యూహాలు, RUF పొగరుని, అహంకారాన్నీ చావుదెబ్బకొట్టాయి. కేవలం ఆపరేషన్ ఖుక్రీ కారణాన ఇప్పుడు సియెర్రా లియోన్ ఒక శాంతియుత దేశమైంది. ఈ ఆపరేషన్ ముగిసాక RUF అహం వీడి (తోక ముడిచి) మర్యాదగా చర్చలకు టేబుల్ దగ్గరకొచ్చింది. దేశం లో అరాచకం తగ్గింది. ఎప్పుడూ జీవితాల్లో ఒకదాని వెంబడి ఒకటి గా జరిగే సంఘటనల వెనుక భగవంతుడి హస్తం ఉంటుంది. ఏది ఎలా ఎప్పుడు జరగాలనుందో రాసిపెట్టి ఉంటుంది.
ఈ ఆపరేషన్ ఖుక్రీ ని SRK (షాహ్ రుఖ్) హీరో గా సినిమాగా తీయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. డాక్యుమెంటరీలు అందుబాటులో ఉన్నాయి. సాధారణం గా ఎంత గొప్ప ఆపరేషన్ లో అయినా ప్రాణనష్టం జరగడం అనేది సహజమే అయినా అప్పటి దాకా పునియా వర్ణనల్లో జీవించిన కేరక్టర్స్ మరణించడం అనేది పాఠకుడి హృదయాన్ని కాల్చేస్తుంది. అయినా ఎక్కువ రిస్క్ తో గూడిన ప్లాన్ సీ ఎంపికవడం, తక్కువ ప్రాణనష్టం కలిగే అవకాశాలుగా చర్చినపడ్డ ప్లాన్ ఏ, బీ లు ఎంపికవకపోవడం వెనక లాజిక్ ని పాఠకుడి మనసు ఒప్పుకోదు. బ్రిగేడియర్ సునిల్ తో కలిసి పనిచేసినందున ఆ సున్నిత మనస్కుడికి కూడా కైలాహున్ లో తాము సృష్టించిన అగ్ని కీలల ఎస్కేప్ రూట్ పూర్తి సంతృప్తిని ఇచ్చిందందుకోను. కాకపోతే, శవంగా ఇంటికి తిరిగిరావడం కన్న, లేదా లొంగిపోయి ప్రాణాలు కాపాడుకొని పరాభవంతో జీవితాంతం బ్రతకాల్సి రావడం కన్నా, pusillanimous గా ఉండిపోకుండా, కంట్రోల్ ని తమ చేతుల్లోకి తీసుకుని ముందుకు ఉరకడం, సైనికుడిగా పోరాడడమే సరైన నిర్ణయంగా వీళ్ళు భావించి ఉండొచ్చు.
ఏదిఏమయినా భయంకరమైన శత్రువు తమని అన్యాయంగా బంధించినపుడు టిప్పింగ్ పాయింట్ దాకా వేచి ఉండగలగడం కూడా పోరాటమే. దీనిలో కూడా మన సైన్యం ఈ ఆపరేషన్ లో గెలిచింది. మిలిటరీ పదజాలం, పటాలాల సామర్ధ్యం, పేర్లు వంటి వైపు పోకుండా కేవలం జరిగింది టూకీగా చెప్పడం మాత్రమే ఇక్కడ చేసినా కూడా వ్యాసం పొడుగు ఆంజనేయుడి తోకలా పెరిగిపోతూనే ఉంది.
పుస్తకం లో కొన్ని ఎక్కువయ్యాయి. రెండు మూడు చోట్ల సీక్వెన్స్ మిస్ అయింది. కొన్ని చోట్ల ఏమి జరిగిందో నాకు అర్ధం కాలేదు. గూగుల్ నీ, వికీ ని, USI నీ ఆశ్రయించాల్సొచ్చింది. డేట్లు, టైం లైన్ లు లేవు. కొన్ని నెలలల పాటు జరిగిన సీజ్ గురించి కేవలం డైరీల ఆధారంగా గుర్తు చేసుకుంటూ, నాటకీయంగా రాసినందున కొన్ని ముందువెనుకలు, కొన్ని రిపిటీషన్ లు వచ్చాయి. అయినా సరే చెప్పదలచుకున్నది సరిగ్గా చెప్పడం జరిగింది. ఇది బేసిక్ గా ఒక పశ్చాత్తాప ప్రకటన పుస్తకం! తమ వేలర్ని, ప్రతిభనీ చెప్పుకునేందుకు రాసినదని పూర్తిగా అనుకోలేం. అయితే అతి గ్లోరిఫికేషన్, అతి రొమాంటిసైసేషన్, అతి నిర్బంధం, అతి అధికారం, అతి విశ్వాసం, అతి సామర్ధ్యం, అతి విధేయత, ఆశ్చర్యం కలిగిస్తాయి. అయితే మంచి టీం లో భాగంగా, మంచి లక్ష్యాలకోసం, మంచి పోరాటాలు చేయడం, దానిలో గెలుపును వరించడం అందరికీ ప్రాప్తం కాదు.
పుస్తకంలో సూటిపోటి మాటలూ ఉన్నాయి. సాధారణంగా నిజ కథ ని రాసినప్పుడు కొందరు (పెద్దవాళ్ళ) చేసిన తప్పుల్ని కప్పిపుచ్చుతాం / ఎదిరించం / క్రిటిసైస్ చెయ్యం. దీనిలో క్రిటిసైస్ చెయ్యడమూ ఎక్కువే ఉంది. తన చర్యలను తాను అతిగా సమర్ధించుకోవడమూ ఉంది. అయితే ఆయన సూచించిన సమర్ధనల్లో కాస్త నిజం, కాస్త అతీ కనిపిస్తూ ఉంటుంది. అయితే ఆర్మీ లైఫ్ లో ఆ మాత్రం డ్రామా ఉండడం తెలిసిందే. కూతురు సహ-రచయిత అవటం వల్ల, లేదా కూతురే తండ్రి పాత్రను హీరోయిక్ గా వివరించడం వల్ల ఎక్కడో ఈ రచన కాస్త కారెక్టర్ సెంట్రిక్ గా సాగింది. మిగిలిన ఆఫీసర్ ల, జవాన్ల సాహస చర్యల వర్ణన తక్కువగానే ఉంది.
ఈ ఆపరేషన్ లో పాల్గొన్న అధికారులకి గాలంట్రీ అవార్డులు వచ్చాయి. బహుశా పుస్తకం ప్రెస్ కి వెళ్ళేముందు "డైరీ" తప్ప ఇతర రిఫరెన్సులు తీసుకోకపోవడం వల్ల ఈ మాట ఇందులో చెప్పలేదు . కాకపోతే తన escape కి సైన్యం ఎంచుకున్నమార్గం వల్ల ప్రాణాలు కోల్పోయిన కైలాహున్ గ్రామ వాసులను తలచుకుంటూ తన హృదయంలో పేరుకుపోయిన పశ్చాత్తాపాన్ని ప్రకటించడం, దాని ద్వారా తన బరువు దించుకోవడం కోసం ఈ పుస్తకంలో 'జరిగిన సంఘటనలను నిష్పక్షపాతంగా చెప్పడం' ద్వారా (దాయకుండా, లేదా తీపి పూతల కవరింగ్ చేయకుండా రాడం) పునియా చాలా నిజాయితీ గానే ఈ పుస్తకాన్ని రాసుకున్నట్టయింది. ఏదేమైన మంచి పుస్తకం.
***
Mentions :
* RUF చేతికి లొంగిపోవడం అంటే ఓ రకంగా (ప్రాణాలతో) విడుదలే. ఆయుధాలు వదిలి, లొంగిపోయిన సైన్యాలను, గుంపులుగా తీస్కెళ్ళి మిత్రదేశమైన లైబీరియాలో విడదల చేసింది RUF. అతా సులువుగా, సింపుల్ గా కనిపిస్తుంది. కాకపోతే అది అవమానం, దేశద్రోహం. దానిలో Honor ఉండదు. మిలిటరీ లో లొంగుబాటు కి కొన్ని మర్యాదలు, సంప్రదాయాలు ఉంటాయి. RUF లాంటి brutal force కి ఏ మర్యాదలూ తెలీవు, పట్టవు.
* సియెర్రా లియోన్ లేదా ఇతర ఆఫ్రికన్ దేశాలలో 'బుష్ వైఫ్' అనే పద్ధతి ఉంటుంది. ముఖ్యంగా సివిల్ వార్ లో రెబెల్స్ - గ్రామాలలో స్కూలు పిల్లల్ని, ఇంట్లో ఉన్న అమ్మాయిల్నీ, కంటికి నచ్చినవాళ్ళనీ ఎత్తుకుపోయి, బలవంతంగా భార్యలుగా చేసుకుంటారు. ఈ అంతర్యుద్ధాన్ని స్థానికంగా బుష్ వార్ అంటారు. గొరిల్లా వార్ ఫేర్ ని బుష్ వార్ అని అంటారు. ఈ బుష్ వార్ వీరులు చాలా పేరున్నవాళ్ళు కూడా. దేశాధ్యక్షులు కూడా అయారు.
* సరిగ్గా ఇలానే బయటి దేశాల సైనికులు / UNPKF సైన్యాలు వచ్చినపుడు వేరే రకమైన బుష్ వైఫ్ లు తయారవుతారు. వీళ్ళుండిన రెండు మూడేళ్ళలో సెక్స్/ఎమోషనల్ అవసరాలకు వాళ్ళకు ఆడది కావాల్సి వస్తుంది. భయంకరమైన బీదరికం, పెద్ద జనాభా ఉండడం వల్ల, వారికి ఎవరో ఒక బుష్ వైఫ్ సులువుగా దొరికేవారు. వాళ్ళకి పిల్లలు కూడా కలుగుతారు. కానీ ఆయా ట్రూప్స్ తమ దేశాన్ని విడిచి వెళ్ళేటపుడు బుష్ వైవ్స్ వెనకే ఉండిపోతారు. కొత్తగా చంకలో బిడ్డ తో, ఎక్కువైన బాధ్యతతో, అదే నిస్సహాయతలో, బహుశా జబ్బులతో, గుండె కోత తో కూడా.
* సియెర్రా లియోన్ లో ఎయిడ్స్ ఎక్కువ. భారతీయ ట్రూప్స్ లాండ్ అవగానే, వారితో పరిచయం చేసుకునేందుకు ఆడపిల్లలు ఆసక్తి కనపరుస్తారు. కానీ మేజర్ పునియా ముందే వాళ్ళని గట్టిగా హెచ్చరిస్తారు. తమ సైన్యంలో ఎవరైనా ఇలాంటి రొమాంటిక్/ శారీరక బంధాలని ఏర్పరచుకోవడం జరిగితే సహించబోనని కూడా హెచ్చరించారు.
* మేజర్ పునియా తన పరిస్థితులని వివరిస్తూ, చాలా ఎమోషనల్ గా రాసిన కథనం ఇది. ఈ సంఘటన జరిగింది 2000 లో, మేజర్ పునియా ఈ కథనాన్ని, తాను మేజర్ జనరల్ అయ్యాక 2021 లో రచించి, ప్రచురించారు.
* 02 మే 2000 నాడు ఈ అధికారిని, ఇతరులతో కలిసి బందీ గా తీసుకున్నారు. మొదట RUF స్థావరంలో బందీ చేసినా పాపాగీమా దౌత్యం వల్ల అతన్ని, మిగిలిన అబ్సర్వర్ల తో పాటు విడిచిపెడతారు. వీళ్ళందరూ హై గ్రౌండ్ కేంప్ లో విడిది చేస్తారు. ఈ సీజ్ జరిగినన్నాళ్ళూ అబ్సర్వర్లు టెంట్లు లేని ఓపెన్ ఆకాశం కింద bivouacs అంటే టెంట్లు లేని తాత్కాలిక సైనిక స్లీపింగ్ బేగ్ లాంటి ఏర్పాట్లలో గడిపారు. స్పైసీ ఇండియన్ భోజనం తిన్నారు. కొందరు పారిపోవడానికి ప్రయత్నించారు. భారతీయ సెంట్రీలకు, అధికారులకూ చాలా చికాకులు కలిగించారు. అయితే వీళ్ళ నేషనాలిటీల వల్ల, భారత సైన్యం పై RUF ఏ దాడికీ దిగలేదు. ఎప్పటికప్పుడు తన వాళ్ళ సంఖ్యను పెంచుకుంటూ వచ్చినా కూడా, సంఖ్యాబలం వాళ్ళదే ఎక్కువయినప్పుడు కూడా, శక్తివంతమైన దేశాల ప్రతినిధులను చంపితే అంతర్జాతీయంగా బలహీనపడతామని తెలిసి, లొంగిపోయేందుకు భారత బెటాలియన్ పై ఒత్తిడి తెచ్చిందే గానీ తనకు తానై, వీళ్ళమీద దాడి చెయ్యలేదు. ఈ అబ్సర్వర్లను "ఎసెట్" గా పునియా భావించి, వాళ్ళను వేరేగా విడుదల కానివ్వలేదు. ఇదో game changer.
* 15 జులై 2000 న పొద్దున్న వేకువకు ముందు మొదలయిన ఆపరేషన్ కు 1030h కల్లా ముగింపు మొదలయింది. సాయంత్రానికల్లా అందరూ evacuate చెయ్యబడ్డారు. ఈ అబ్సర్వర్లను కాపాడుకునేందుకే రెండు చినూక్ హెలికాప్టర్లు కేంప్ లో లాండ్ అయ్యాయి. వీళ్ళిలా ఎదురుతిరుగుతారని RUF కి ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమానం కలగలేదు. చినూక్ లు పెద్దవి కాబట్టి వాటి లాండిగ్ కి , కేంప్ లో వాలీబాల్ కోర్ట్ కి పక్కనున్న చెట్లను తొలగిస్తున్నపుడు RUF అడ్డుకోబోతే, వాటిని ఆటస్థలం విస్తరణ కోసం నరుకుతున్నాం అని చెప్పారు. "మేజర్ ఇక నువ్వు ఇక నీ దేశానికి వెళ్ళవా?" అని RUF అబ్బాయిలు హాస్యమాడారు.
* అంతర్జాతీయ సైనిక సంస్థలు, ఎన్నో దేశాల దళాలూ ఈ ఆపరేషన్ లో పాల్గొన్నాయి. ఫోర్స్ కమాండర్ స్వయంగా దారూ లాంటి యుద్ధ క్షేత్రంలో సర్వసన్నద్ధంగా ఈ evacuation ను పర్యవేక్షించారు. తెల్లారి ఆపరేషన్ మొదలవుతుందని, రేపుదయం మీరు ఎయిర్ లిఫ్ట్ చెయ్యబడతారనీ, అబ్సర్వర్లకు అర్ధరాత్రి చెప్పారు. ఒకవైపు హెలికాప్టర్లను RUF కాల్చేస్తుందని భయపడినా, అబ్సర్వర్లు ఈ వార్త తెలియగానే పునియాను హత్తుకుని ధన్యవాదాలు తెలిపారు.
* సియెర్రా లియోన్ లో ఆహారకొరత ఎక్కువ కాబట్టి అక్కడి ప్రజలు రోజులో ఒక పూట మాత్రమే భోజనం చేస్తారు. చుట్టుముట్టబడిన తరవాత రేషన్ సప్లై నిలిచిపోవడంతో భారత సైన్యం కూడా ఒక పూట భోజనంతోటే 75 రోజుల పాటు గడిపింది.
* సియెర్రా లియోన్ ప్రజలు స్వయంగా "ఖుక్రీ వార్ మెమొరైయల్" ని మోవా నది తీరంలో నిర్మించేందుకు సహకరించారు. దీని ద్వారా అంతర్యుద్ధంలో వాళ్ళెంత నలిగిపోయారో అర్ధం చేసుకోవచ్చు.
***
02/07/2024
Whereabouts - Jhumpa Lahiri
17/06/2024
The Hungry Tide - Amitav Ghosh
ఒక వేళ అమితవ్ ఘోష్ ని చారు కాచడం మీద పుస్తకం రాయమంటే, చారు, దాని మూలాలు, దానిలో వాడే పదార్ధాల మూలాలు, వాటి చరిత్ర, అవి ఈ భూమి మీద, నీ తుచ్చ శరీరం మీదా, భవిష్యత్తరాల మీద వేయబోయే ఇంపాక్ట్, అన్నిటినీ ఒక నాలొగొందల పేజీల పుస్తకం రాసి, జీవితంలో చారు అంటే విరక్తి చెందేలా చేస్తాడనీ, however, చివరికి ఆఖర్లో చారు లేకపోతే బ్రతకలేం అనే స్పృహని కలిగించి, పాఠకుల్ని వంటింటి వైపు లాక్కునెళ్తాడనీ, ఫ్రెండ్స్ జోకులు వేసుకునేవాళ్ళు. అలాంటి అనుభవమే ఇస్తుంది ఈ పుస్తకం, ఘోష్ నాలుగో పుస్తకం. బొత్తిగా అమ్మాయిలు రాసిన రొమాన్స్ లా వుంటుంది. కాకపోతే, ఎప్పట్లాగే మానవత్వమూ, మనిషికి సాటి మనుషుల పట్లా, చుట్టూ ఉన్న ప్రకృతి పట్లా ఉండితీరాల్సిన ప్రేమ గురించి ఆంత్రోపాలజిస్టిక్ చూపుతో రాసిన పుస్తకం కాబట్టి చెప్పుకోవాలి.
దేశసరిహద్దులకు ఇరుపక్కలా ఉన్న బెంగాలు లో, మన దేశానికున్న తూర్పుతీరాన, సముద్రానికీ, నదులకూ మధ్య విస్తరించిన అతి పెద్ద చిన్ని చిన్ని ద్వీపాల సముదాయం సుందర్బన్ ప్రాంతం. ఈ చిన్నవీ పెద్దవీ ద్వీపాలు రోజువారీ సముద్రపు ఆటుపోట్లకు తరచుగా మారుతుండే లాండ్ స్కేపు లతో, భయంకరమైన పురుగూ పుట్రా, రాయల్ బెంగాల్ టైగర్లు, మొసళ్ళు లాంటి జీవులతో నిండి వుండి, దాదాపు మానవావాసానికి పనికి రాకుండా ఉన్నా కూడా, మనుషులు ఈ దీవుల్లో నివసించారు. కొన్ని నివాసయోగ్యమైన ఒకటీ అరా దీవులకి పశ్చిమ బెంగాల్ నుండి కొద్దో గొప్పో కనెక్టివిటీ ఉన్నా, అతి రిమోట్ దీవులు, కేవలం పడవల మీద ఆధారపడేవి కోకొల్లలు. పంటలు పండని ఉప్పు నేల. వంట చెరకుకోసం అడవిలోకెళ్తే ఏ పులో పట్టుకుపోయేది. చేపలు జీవనాధారం. ఉప్పు గాలి, పోటొస్తే ముంచెత్తే నీళ్ళు, వరదలు, విధ్వంసం, బీదరికం, నిరక్షరాశ్యత అక్కడి జీవన విధానం.
ఇలాంటి సుందర్బన్ లను ప్రధానంగా ఒక విషయంగా తీసుకుని రాసిన నవల ఇది. ఈ సుందరమైన (నిజంగానే అత్భుత ప్రకృతి సౌందర్యం ఈ నీటి గ్రామాల సొంతం) అభివృద్ధికి నోచుకోని ప్రాంతం, ఎన్నో వైవిధ్యమైన జీవరాసులకు ఆలవాలం. బెంగాల్ లో బ్రిటీష్ వారి రాజ్యం నడుస్తున్నపుడు జనం లేని ఈ కీకారణ్యాలలో ఉచితంగా భూమిని ఇస్తామని చెప్పి ఎందరో నిర్భాగ్యులను ఈ ప్రాంతాలవైపు ఆకర్షించారు. బీహారు, ఉత్తర్ ప్రదేశ్, ఒడిశా రాష్ట్రాలనుండీ, కడు బీదలు కట్టు బట్టలతో ఈ చిత్తడి నేలలకు వ్యవసాయం చేసుకుందామని ఆశతో తరలి వచ్చారు. అదృష్టం బావుంటే కొంత వరి పండే ఆ భూమికి చేరేసరికి, వాళ్ళలో సగం మంది ఆ నేల పై ఎదురయ్యే ప్రమాదాలకే బలయ్యారు. కొందరు రాజకీయాలకు బలయ్యారు. మిగిలిన వాళ్ళు ఎలాగో ఎదుగూ బొదుగూ లేని జీవితానికి అలవాటు పడ్డారు.
అలాంటి సుందర్ బన్ జీవ వైవిధ్యానికి పేరెన్నిక కన్నది. ఇక్కడి ఇరవాడి డాల్ఫిన్ ల గురించి పరిశోధనలు చేయడానికి పియా (Piyali) అనే cetologist, సుందర్బన్ లోకి అడుగుపెడుతుంది. అక్కడి స్థానికులు రెండు దేశాల మధ్య సంధి ప్రాంతానికి చెందినవాళ్ళు. అక్కడి రాజ్యం ఫారెస్ట్ డిపార్ట్మెంట్ దే. అవినీతి, అరాచకం కమ్ముకుపోయిన ప్రాంతం అది. అలాంటి ప్రాంతానికి ఒంటరిగా వచ్చేందుకు పియాలీ అనే ఈ బెంగాలీ మూలాలు ఉన్న అమెరికన్ మెరీన్ బయాలజిస్ట్/cetologist సిద్ధపడడం ఇక్కడి స్థానిక సమాచారం లేకున్నా, భాష రాకున్నా ఏదో ఆవేశంతో దూసుకు పోవడం, ప్రధానంగా ఉంటుంది. ఈ పిల్ల రాకతో కరెస్పాండ్ అవుతూ, ట్రాన్స్‌లేటర్, రచయితా అయిన కనాయ్ కూడా సుందర్బన్ లలో లూసీబరీ అనే దీవికి వస్తాడు. అతను కోల్‌కతా వాసి అయినా, అతని అంకుల్, ఆంట్ లు లూసీబరీ లో స్కూలు నడుపుతూ అక్కడే స్థిరపడడం వల్ల, వాళ్ళని కలిసేందుకు కనాయ్ చిన్నతనంలో కొన్నిసార్లు లూసీబరీ రావడం వల్ల, అతనికి అక్కడి వాళ్ళతో కాస్తో కూస్తో పరిచయాలుంటాయి. అయినా ఎన్నో ఏళ్ళ తరవాత అతను లూసీబరీ కి ఆంటీ కోరిక మీద వస్తాడు. వీళ్ళిద్దరూ రైల్లో కలిసి, పరిచయం ఏర్పరుచుకుంటారు.
ఇప్పుడు కనాయ్ చిన్నప్పటికీ, కథాకాలానికీ ఎన్నో మార్పులు జరిగి ఉంటాయి. లూసీబరీ నిజానికి ఒక ఇంగ్లీషు దొర తన భార్య లూసీ కోసం, పేరు లేని ఆ కొత్త దీవిలో నిర్మించిన ఇల్లు. ఆవిడ ని ఈ ఆటుపోట్ల సముద్ర నదీ సంగమ ద్వారంలోకి పడవలో తీసుకొస్తున్నపుడు ఆ పడవ మునిగి పాపం మరణించింది. అయితే, ఆమె జ్ఞాపకార్ధం ఆ ఇంటినీ, ఆ దీవినీ కూడా స్థానికులు లూసీబరీ అనే పిలవడం మొదలయింది. అలాంటి లూసీబరీ లో కనాయ్ ఆంటీ, అంకుల్ లు వుంటారు. వాళ్ళకి పిల్లల్లేరు. వాళ్ళు బెంగాల్ లో విప్లవం వర్ధిల్లిన రోజుల్లో కమ్యూనిజం వంటబట్టించుకున్నా, అనారోగ్య సమస్యల వల్ల విప్లవాన్ని వదిలి, జనంకోసం జీవించే ముని దంపతుల్లా మిగిలిపోయి, అప్పటికి చదువూ, సంధ్యా, హాస్పత్రులూ లేని ఆ దీవికి తమంతట తామే వచ్చి, ఆ ఇల్లు కొనుక్కుని, జనానికి సేవలు చేస్తూ స్థిరపడతారు.
వీళ్ళ ప్రయాణంలో ఎందరో దీవి జనాలు తారసపడతారు. శుద్ధ పల్లె అమాయకత్వం, అవిద్యా, నిస్సహాయుల్ని చేసే బీదరికం, పులుల వల్ల కుటుంబ పెద్దలు మరణించడంతో వీధిన పడిన కుటుంబాలు, ఒంటరైపోయిన ఆడవాళ్ళూ, వారికి ఆడపిల్లలు ఉంటే, వాళ్ళని (కూడా) దళార్లు పని ఆశ పెట్టి కలకత్తా తీసుకెళ్ళి కామాటిపూరా లో వేశ్యలు గా అమ్మేయడం - సర్వ సాధారణం. కనాయ్ బంధువులు అక్కడి సామాజిక రాజకీయ బీదరికాల్లో, తమ సొంత ఆస్తులతో ఇలా అవసరం ఉన్నవాళ్ళకు దన్నుగా నిలవడం, ప్రభుత్వ పథకాలకు అర్హులుగా ఉన్న వాళ్ళకు అవి అందేలా చూడడం, మెయిన్ లాండ్ నుండీ అధికారన్నవాడు తొంగిచూడని ద్వీపాలలో అడపా దడపా అవేర్నెస్ ప్రోగ్రాములు పెట్టి, ఆడవాళ్ళని ఆదుకోవడం, చదువు చెప్పడం, చిన్న చిన్న నర్సింగ్ (ప్రథమ చికిత్స, టీకాలు) పనులు నేర్పడం లాంటివి చేస్తుంటారు. విధవలు, నిస్సహాయులయిన ఆడవారి తో స్వయం సహాయక సంఘాల వంటివి నడుపుతుంటారు.
పియాలీ పరిశోధనల కోసం కథా ప్రారంభంలో ఒక ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కు చెందిన లాంచ్ ఎక్కి నీళ్ళమధ్యకు ప్రయాణం చేస్తుంది. ఆమెకు అప్పటికే, రక రకాల ఏషియన్ దేశాలలో ఈ తరహా డాల్ఫిన్ల మీద పరిశోధన చేసిన అనుభవం ఉంది. అయితే, ఫారెస్ట్ గార్డు, ఆమె తెచ్చుకున్న గైడ్ ఆమెకు సాయపడేది పోయి ప్రతిబంధకాలుగా మారతారు. ఈలోగా ప్రమాదవశాత్తూ ఆమె నీళ్ళలోకి పడిపోతే, ఫకీర్ అనే బెస్తవాడు ఆమెను కాపాడతాడు. ఇక ఆమె ప్రయాణం అంతా అతనితోనే, అతని బోటు మీదే. అతనికీ, ఆమెకి మాటాడుకునేందుకు భాష లేకపోయినా, ఆమె కి కావల్సింది అర్ధం చేసుకున్నట్టుగా అక్కడి పరిసరాల మీద చిన్నప్పట్నించీ పుట్టిపెరిగిన అనుభవం వల్ల, రాత్రీ పగలూ, మారుతుండే అలలల రీతుల మధ్య ఆమెను డాల్ఫిన్లు తిరిగే చోట్లకు జాగ్రత్తగా తీసుకెళ్తూ ఉంటాడు ఫకీర్. ఆమెకు కొద్ది రోజుల్లోనే, తన పరిశోధనలకు నెలలు పట్టవచ్చని అర్ధం అవుతుంది. ఆ సమయం వీళ్ళిద్దరూ దగ్గరయేందుకు కూడా సాయపడుతుంది.
ప్రధానంగా కథంతా ఈ మూడు పాత్రల తోనే నడిచినా, ఈ నవల్లో హీరోలు సుందర్బన్, అక్కడి స్థానిక ప్రజలు, వాళ్ళ అంతులేని జీవన పోరాటం. సుందర్బన్ లో దట్టమైన అడవులు, ఆటుపోట్లకు నీళ్ళు వస్తూ పోతూ ఉండడం వల్ల విచిత్రమైన చిక్కదనంతో, గ్రీనరీతో, బలమైన వేళ్ళతో, తీరం పొడవునా ఉన్న మడ అడవుల్లో పెరిగే విచిత్రమైన చేపలు, విష సర్పాలు, మొసళ్ళు, పొదల్లో దాగి ఉన్న బలమైన పులులతో చాలా డేంజరస్ గా ఉంటాయి. రాత్రిళ్ళు పడవ ప్రయాణాలు ప్రమాదకరం. రాత్రిళ్ళు గ్రామాల బెస్తవాళ్ళు తమ పడవలు కొట్టుకుపోకుండా, తీరానికి కాస్త దూరంలో అన్ని పడవల్నీ తాళ్ళతో కట్టుకుని గుంపుగా మకాం వేస్తారు. ఫకీర్ మాత్రం వేటకు వెళ్ళినప్పుడు తన పడవ లో యోగి లా ఒక్కడే ఉంటాడు. తీరానికి మరీ దగ్గరగా పడవని ఉంచితే ఏ రాత్రప్పుడో పులులో ఇంకేవో జంతువులు పడవలోకి దూకగలవు. ఎక్కువ లోతున్న నీళ్ళలో ఉంచితే, తెల్లరేసరికి ఏ దీవికి కొట్టుకెళిపోతామో తెలీదు. ఈ పడవల బెస్తవాళ్ళకి అవే ఇళ్ళు. వేటకు వెళ్ళినపుడు, వండుకోవడానికీ, తినడానికీ, రాత్రిళ్ళు పడుకోవడానికీ, అన్ని ఫెసిలిటీస్ ఉన్న బీద గూటి పడవలు అవి. రాత్రంతా వలలేసి, చేపలు పట్టి, తెల్లారుతూ ఊరిలోని దళారులకు అమ్ముకోవడానికి తీసుకొస్తారు.
ఈ అడవుల్లో ప్రమాదాలు పిల్లా పాపా అందరికీ తెలిసినవే. అందుకే వాళ్ళకు "బొన్ బీబీ" వనదేవత ఉంటుంది. మంచి కర్మలు చేసేవాళ్ళకి, తనని మనసారా నమ్మేవాళ్ళకీ ఈ వన దేవత అండ ఉంటుందని స్థానికులు నమ్మేవారు. వారి నాటకాలలో "బొన్ బీబీ" కాపాడిన పిల్లల కథలుంటాయి. ఈ వన దేవి పాలిటికి "దక్ఖిన్ రాయ్" అనే విలన్ రాక్షసుడు అడ్డు తగులుతుంటాడు. ఆవిడ భక్తులను అమాంతం తినేస్తుంటాడు. వాడే ఈ డేంజరస్ "పులుల" దేవుడు. ఎవరైనా పులిబారిన పడ్డారంటే దానర్ధం ఈ రాక్షసుడి ఉచ్చులో మనం పడబట్టే అని. దీవులమీదికి రాత్రి పూట ఆవరించే చీకటిలో ఆ రాక్షసుడు దాక్కునుంటాడు. అతనికి చిక్కితే ఇంక అంతే సంగతులు.
ఈ నవల 2004 లో వచ్చింది. అంటే 20 ఏళ్ళ తరవాత చదువుతున్నాను. ఇప్పటికీ సుందర్బన్ ఇంతందంగా ఉందో లేదో తెలీదు. కథ లో చిన్న చిన్న పిల్లల కళ్ళ ముందే వాళ్ళ తండ్రులను పులులు మెడ దగ్గర కొరికి చంపేసి, శరీరాన్ని అడవుల్లోకి ఈడ్చుకుని పోతుంటాయి. 1978-79 ప్రాంతాలలో బాంగ్లాదేశ్ నుండీ పారిపోయొచ్చిన బీదసాదల్ని, ఈ సుందర్బన్ లో భయానక దీవుల్లో ఆశ్రయం పొంది, ప్రాణాలతో మిగిల్నవాళ్ళని బెంగాల్ ప్రభుత్వం సగానికి పైగా కాల్చి చంపేసింది. దీన్ని "మోరిచ్ ఝాపీ మసాకర్" అంటారు. ఆ మసాకర్ లోనే ఒకానొక ప్రధాన పాత్ర మరణిస్తుంది. ఆవిడ తరవాతి తరం వాళ్ళు ఈ కథ కి ప్రాణం పోస్తారు. ఈ పిల్లల Trauma చెప్పనలవి కానిది. తండ్రిని పులి చంపేస్తున్నపుడు బొన్ దీదీని ఎంత పిలిచినా, ప్రార్ధించినా, వచ్చి కాపాడలేదని ఒకప్పుడు ఎంతగానో బాధపడిన పిల్లే ఈ మరణించిన ప్రధాన పాత్ర.
కథలో అమితవ్ ఘోష్ కాసింత చరిత్రా, వైజ్ఞానిక శాస్త్ర ప్రభోధన చేస్తాడు. దాదాపు మౌలిక సదుపాయాలు శూన్యమైన ప్రాంతాలలో సాధారణ ప్రజలు మెయిన్ లాండ్ నుండీ వెళ్ళి చిన్న చిన్న వలంటరీ సంఘాలు స్థాపించి, అక్కడి ప్రజలతో పని చెయ్యడం ముఖ్యమైన అంశం. ఆసంఘాలు ఇప్పుడు చాలా దూరం ప్రయాణించి వ్యవస్థాత్మక మార్పులు చెందాయనుకోండి. అసలు మనిషన్నవాడు ఉండలేని ఆ కీకారణ్యాలలో బ్రతుకుతెరువు వెతుక్కుంటూ వచ్చి స్థిరపడి ప్రతి పూటా బ్రతికేందుకు ప్రాణాలడ్డం పెట్టి పోరాటం చేసిన పాటకజనం, ఒకనాడు కన్సర్వేషన్ పేరిట అక్కడనుండీ వెళ్ళగొట్టబడడం, ఎవడో ఇంగ్లీష్ వాడు హామిల్టన్ కట్టించిన స్కూలు భవనం, అక్కడి ప్రజల ఎకలాజికల్ నాలెడ్జ్ - వీటన్నిటినీ తెలుసుకోవచ్చు.
ప్రజల లో మతానిది పెద్ద విషయం కాదు. క్రూర జంతువులండీ, రోగాలు రొచ్చుల నుండీ, ఆకలి నుండీ తమని తాము కాపాడుకోవడమే వాళ్ళ గోల్. రోడ్లు లేని, బురద ప్రాంతాలలో వెలిసిన చిన్న చిన్న సెటిల్మెంట్లు ఇప్పుడు పట్టణాలయ్యేయి. సుందర్బన్ లో ఆకలి గొన్న పోటు జలాలు ప్రతీ సీజన్లోనూ పొలాల్ని ముంచెత్తి, ఉప్పుమయం చేసేస్తాయి. అక్కడి జంతుజాలం, ఆటుపోట్ల సంగీతాల రిథం కు అలవాటు పడి, తమ తమ బిహేవియర్లను మార్చుకున్నాయి. మనిషి కూడా దానికి మినహాయింపు కాదు. ఆ మాటకొస్తే ప్రతీ ప్రాణీ, కాలంతో పాటూ ఇవాల్వ్ అవుతూ ఉంటుంది.
ఈ వనంలో వచ్చిన భీకర తుఫానులు, ఆకాశమూ, సముద్రమూ కలిసే చోటి అందాల వర్ణనలూ రచయితని ఓ మెట్టు పైకి తీస్కెళ్ళినిలబెడతాయి. తుఫానులు సర్వసాధారణమైన బాంగ్లాదేష్ ని ఆనుకునున్న ప్రాంతం కాబట్టి, మడ అడవులు నీళ్ళలో మునుగుతూ, తేలుతూ, తీర ప్రాంతాల్ని రక్షిస్తూ, అక్కడి ఎకాలజీని పరిపుష్టం చేస్తుంటాయి. అక్కడి పడవలు,రకరకాల చేపలు, క్రాబ్స్, జంతువులు, కథాకాలం 70-80 ల మధ్యది కాబట్టి అప్పటి జీవన విధానం, అక్కడి నుండీ వచ్చి కలకత్తాలో జీవనం వెతుక్కున్న తరాల నాస్టాల్జిక్ తిరుగుప్రయాణాలు, ముఖ్యంగా కన్సర్వేషన్ గురించి, తెలుసుకోవాలంటే ఈ పుస్తకం ఒక మంచి రిఫరెన్స్. పాత సబ్జక్ట్, రచయిత రాస్తున్న మొదట్లో అప్పటి పుస్తకం కాబట్టి, కూడబెట్టి ఉన్న డేటాను విపరీతంగా ప్రవేశపెట్టడం వల్లానూ, బోరు కొడుతుంది. కానీ కొన్ని పుస్తకాలు ఇంఫోటైన్మెంట్ కోసం. ఇదీ అంతే.
***