Pages

10/11/2024

Roman Stories - Jhumpa Lahiri

 


 

 

లాహిరి ది ఇది ఇంకో అనువాదం. ఒరిజినల్ ఇటాలియన్ లో రాసినది. 'పెద్దగా కదిలించని పుస్తకం' గా పలు రివ్యూలలో చదివాను. చదవడానికి మనసు రానప్పుడు, ఊరికే తిరగేయడానికి పనికొస్తుంది. ఎప్పట్లాగే, ఒక దృక్కోణంతో చెప్పే కథలు. రచయిత్రి చాలా చోట్ల పాత్రధారిగా కనిపిస్తుంటుంది.

మొదటిది, ఒక శరణార్ధి కుటుంబపు కథ. అతనికి పూల వ్యాపారం ఉంటుంది రోం లో ! కానీ అతని పై ఒక సారి జాత్యాహంకార దాడి జరిగింది. ప్రపంచం ఎప్పట్లాగే 'వేరే ' వాడిని నిరాకరిస్తుంది. అతనికి పోషించుకోవడానికో కుటుంబం ఉంది. స్వదేశంలో ఉపాధి లేదు. ఒక మారుమూల పల్లెలో పొలం, ఎస్టేటూ చూసుకునే పనికి కుదురుతాడు. దాడిలో అతను భౌతికంగా దెబ్బతినిపోయినదే కాకుండా, మానసికంగా కూడా డస్సిపోతాడు. మాటలు పోతాయి. ఈ పల్లె బ్రతుకు భార్యకు ఇష్టం ఉండదు. ఐనా ఏమి చెయ్యగలం? ఇక్కడ మన జోలికి వచ్చేవారుండరు. ఎలాగో ఒకలా బ్రతుకుదాం. ఎవరి పొడా లేకుండా !   అనేది అతని ఉద్దేశ్యం.    ఆ ఎస్టేట్ కి సీజన్ బట్టి అద్దెకు తీసుకుని వచ్చే కుటుంబాలుంటాయి. అతను కేర్ టేకర్. అతని భార్యా, కూతురూ, అతిధులకి అన్నీ సమకూరుస్తుంటారు. అదే జీవితం వాళ్ళకు.  

బిజీ నగర జీవితాల నుండీ తప్పించుకునేందుకు వచ్చిన అతిధులకు ఆ గ్రామపు శూన్యతా, మౌనమూ కట్టిపడేసినట్టు అనిపిస్తాయి. దాదాపు ప్రతివాళ్ళూ వెళ్ళేటపుడు, మళ్ళీ ఇక్కడికి వస్తాం - అంటారు గానీ రారు. వీళ్ళని అతని కూతురు ఓ పదమూడేళ్ళది గమనిస్తూ ఉంటుంది. అతిధులు, వాళ్ళ పిల్లలు, వాళ్ళు వదిలేసి వెళ్ళిన సామాన్లు, వాళ్ళను గమనిస్తూ గడిపిన క్షణాలు మాత్రమే ఆమె మొనాటనీ కి కొంచెం ఆటవిడుపు. కథంతా ఈ పాప దృష్టిదే.

ఇలానే ఇంకో కథ : 'పి' పార్టీ లు. లాహిరి అన్ని కథల్లో లానే, ఏ పాత్రలకీ పేర్లుండవు. ఏ ప్రాంతాలకీ పేర్లుండవు. ఏ ద్వీపాలకీ, యాట్ లకీ, వేటికీ పేరులుండవు. పీ అనే ఆవిడ ప్రతి వేసవిలోనూ ఏర్పాటు చేస్తుండే పెద్ద పెద్ద పార్టీలకి హాజరవుతూ,  అక్కడ ఒక తెలీని విదేశీయురాలితో ప్రేమలో పడిపోతాడు కథకుడు. ఎన్ని సంఘర్షణలో.. ఎన్ని సంభాషణలో, ఎంత రొటీన్ - యూనివర్సిటీకి వెళ్ళిపోయిన పిల్లాడిని మిస్ అయే తండ్రి ప్రేమ, మగాళ్ళ సున్నితత్వం ! ఆఖరికి జీవితం చాలా విచిత్రంగా ఉంటుంది. ఎన్నో ఏళ్ళుగా పార్టీలు, సందడీ, స్నేహితులూ అని కులాసాగా ఉండే పీ చనిపోతుంది. ఆమెకి ఏదో జబ్బు. ఒకసారి ప్రాణాల మీదికొస్తే ఎలానో బ్రతికింది. ఆఖర్న బ్రతకలేకపోతుంది. ఆమె ఫ్యూనరెల్ కూడా పార్టీలానే ఏర్పాటు చేస్తారు కుటుంబసభ్యులు. మనిషికి సాటి మనిషి మీద ఉండే ప్రేమ కి నివాళి ఈ కథ. 

అయితే మనిషి సొంతవాళ్ళనే ప్రేమిస్తుంటాడు. రోం లాంటి ఊరిలో శరణార్ధులు ఎక్కువ. ఆఫ్రికా నుండీ, ఆసియా నుండీ డింగీలలో ప్రమాదకరంగా సముద్రాన్ని దాటి పారిపోయి వాళ్ళు చేరుకునే దేశం ఇటలీ నే. చాలా కథల్లో ఈ శరణార్ధులని ద్వేషించే సమాజం కూడా వుంటుంది. ఇద్దరు కన్న బిడ్డలతో, సంతోషంగా రోం లో జీవించిన ఒక తల్లి, భర్త పోయాకా, ఒంటరితనాన్ని ఈదేందుకు చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తుంది. అదీ, అనుకోకుండా, తెలిసినవాళ్ళు చూపించినవి. ఒక సారి స్కూల్లో చిన్న పిల్లల్ని చూసుకునేందుకు చేరుతుంది. అదీ లీవ్ వేకెన్సీ లో. టెంపరరీగానే. ఆ మాత్రం సమయంలోనే చిన్న పిల్లలే ఆమె కోటు జేబులో,  'నువ్వు మాకు నచ్చలేదు', 'నువ్వు మాకు వద్దు', 'నువ్వు బాలేవు', 'ముందుండే మిస్ బావుంటుంది'... వగైరా నోట్ లు పెడతారు. ఆవిడ చాలా బాధపడుతుంది. కొడుకులు వేరే దేశాల్లో ఉద్యోగాల్లో ఉన్నారు.వాళ్ళు తల్లికి ధైర్యం చెప్తుంటారు. స్కూల్ విడిచిపెట్టి వచ్చేసేటపుడు ఆవిడా ఆ నోట్ లన్నింటిని రిపోర్ట్ చెయ్యకుండా (అన్నాళ్ళూ కోట్ లోనే ఉంచుకుంటుంది) నమిలి మింగేస్తుంది. భూదేవికున్నంత క్షమ. 

ఇంకో కథ లో ఒక శరణార్ధి కుటుంబం (ముస్లిం) ! వాళ్ళకి ఎన్నాళ్ళో టెంట్ లలో గడిపాక, ఒక హౌసింగ్ కేంప్ లో ఇల్లు కేటాయింపబడుతుంది. ఇక సుఖపడదామా అనుకునేసరికీ, అదే కేంప్ లో సాటి శరణార్ధులలోనే వేరే వేరే దేశాలవాళ్ళూ, ఇతర జాతి  బీదవాళ్ళూ, ఇతరులు, అతని కుటుంబం జీవితాన్ని  దుర్భరం చేసేస్తారు. ముసుగు వేసుకునే భార్య బురఖా,  అన్ని చూపులు వీళ్ళ మీద పడేందుకు కారణం అవుతుంది.  బెదిరింపులు సాధారణం అయిపోతాయి.   ఏ క్షణాన ఏం జరుగుతుందో అని భార్య, పిల్లల్ని పట్టుకుని, కూడబెట్టిన డబ్బంతటితోనూ టికెట్ కొనుక్కుని స్వదేశానికి వెళిపోతుంది. అతను రోడ్డున పడతాడు. కానీ బ్రతుకుతెరువు కోసం ఆ దేశం లోనే ఉండాల్సిన పరిస్థితి.

ఇంకో కథ లో హీరోయిన్ కూతురు, బోట్లలో వచ్చే శరణార్ధులకు నీళ్ళూ, తిండీ, వసతీ, బ్లాంకెట్లూ, వైద్య సహాయమూ, అంత్యక్రియలు, డాక్యుమెంటేషన్ కూ సాయం చేసే వలంటీరు గా పనిచేస్తుంటుంది.   తమ తమ దేశాల్లో యుద్ధం, కరువు, తీవ్రవాదం నుండీ జనాలు పారిపోతుంటారు. ఇటలీకి కొట్టుకొచ్చే వేల శవాలు ఈ మాట చెప్తుంటాయి. ఇటలీ నుండీ బారులు కట్టి యూరోపు కు నడిచెళ్ళే వాళ్ళు, ఆ దేశం లోనే వీళ్ళతో రొట్టెనీ, ఇళ్ళనీ షేర్ చేసుకునే మంచి పౌరులూ.. ఇలా ఎందరో ఉంటారు.  అయితే ఇవి రోం కథలు కాబట్టి, పాక్షికంగానే ఈ ప్రస్తావనలు వస్తుంటాయి. రోం నగరం లో జీవితం ప్రధానంగా చెప్పబడుతుంది.

లాహిరి - కదిలించని కథలెలా రాస్తుంది ?  కాలక్షేపం కోసం చదివే కథల్లో డాంటే వస్తాడు. ఒక టీనేజ్ అమ్మాయి కథ ఇది. ఆమె ప్రాణ స్నేహితురాలి బాయ్ ఫ్రెండ్, ఈమె పై ప్రేమ వ్యక్తం చేస్తాడు. కానీ దానివల్ల ఈమె ప్రాణ స్నేహితురాల్ని కోల్పోతుంది. అటు ఆ ప్రేమికుడూ తను చేసిన పనికి విచారించి, ఈమెకు దూరమవుతాడు.    అదంతా ఎలా వుంటుందంటే,  బాల్యం లో   ఈ పిల్ల ఒంటరిగా ఇంటి వెనక పెరటి అడవిలో ఆడుకునేటప్పుడు ఒకసారి నేల మీద మన్నులో ఉన్న  ఒక మాదిరి సైజ్ రాయి ని తొలగించి చూస్తుంది.

దానికింద వానపాములూ, పురుగులూ వంటి (ఈమె అక్కడ లేవనుకున్న) జీవరాశి లుకలుకలాడుతూ కనిపిస్తుంది.  వాటిని చూసి ఈ పిల్ల ఆ రాతిని మళ్ళీ ఎక్కడ తీసిందో అక్కడే జాగ్రత్తగా పెట్టేస్తుంది [వాటిని డిస్టర్బ్ చెయ్యకుండా].   ఈ  స్నేహితురాలి బాయ్ ఫ్రెండ్ తన టీనేజ్ అయోమయం లో,  అచ్చు 'తన లో లేవనుకున్న ఫీలింగ్స్' ని   ఒక ప్రేమలేఖ రాసి, ఆమె సరిగ్గా ఆ రాయిని తొలగించి చూసినట్టు, తనలోకి తొంగి  చూసునట్టు ఊహించుకుంటుంది.   ఈమె హృదయ స్పందన వినేసి, మళ్ళీ రాతిని మూసేసి వెళ్ళిపోతాడు ఆ అబ్బాయి.  అతను ప్రేమలేఖ లో రాసిన మారు  పేరు 'డాంటే'.  ప్రేమ పోతే పోయింది గానీ 'డాంటే'  ఆమెను ఆకర్షించేస్తాడు.   ఇక ఈ పిల్ల తండ్రి చదువుకొమ్మన్న సైన్స్ ని వదిలేసి, డాంటే నే చదువుకుంటుంది యూనివర్సిటీ లో.. ఈ కథ నాకు చాలా నచ్చింది.  ఇది కూడా ఇమిగ్రెంట్ కుటుంబమే (బహుశా ఇండియన్).

ఏదో చదివించే గుణం ఉంటుంది లాహిరి లో.    మా స్నేహితుల్లో  ఒకమ్మాయి, కాఫీ తాగడాన్నీ, డాబామీద ఆరేసిన బట్టల్ని తీసుకురావడాన్ని కూడా కవితాత్మకంగా,  తాద్యాత్మంగా చెప్తూండేటపుడు,   ఆమె జీవితోత్సాహాన్ని చూసి ఎంత మెచ్చుకుంటూ, నవ్వుకునేదాన్నో గుర్తొస్తుంటుంది ఈ కథలు చదివితే!   ఈ మధ్య, వయసుతో పాటూ, రచయిత్రీ, నేనూ ఎంతో మారాం.  కరుడు కట్టిన రచనా విధానాలనుండీ, లేత కొబ్బరి జున్ను లాంటి  మనసులున్న మనుషుల కథలు చదవడం పెద్ద ఉపశమనం.    చాలా మటుకూ శరణార్ధుల కథలే.    రోమన్ కథ లనగానే రొమాన్స్ ని ఊహించుకుంటే దెబ్బ తగులుతుంది.    ఒక్కోసారి కష్టమైన జీవితాన్ని నమ్మకంతో  ఈదడమే రొమాన్స్. 

 ***



No comments:

Post a Comment

వ్యాఖ్యానించినందుకు చాలా చాలా థాంక్స్.