ఈ కథ - నాకు చాలా ఇష్టం అయిన పిల్లల కథ. ఒకరికి ఈ కథను చెప్పేందుకని రాసుకున్నాను. ఇప్పుడు నా బ్లాగ్ చదివేవారికోసం ఇంకొక్కసారి. ఈ కథ నిజానికి ఎంతో depth, value ఉన్న కథ.. ఎంతో గుర్తింపు తెచ్చుకోవాల్సిన కథ. తెలుగు కథయిపోయి.. ఇలా మిగిలిపోయింది.
సముద్రపు పిల్లాడు - MSK Krishna Jyothi
'చిన్నా' ఓ బెస్తవాళ్ళ గ్రామంలో ఉండే , మూడవ తరగతి చదివే చిన్న పిల్లవాడు. అతనికి స్కూల్ లో మిగతా పిల్లల కన్నా సముద్రం తోనే స్నేహం ఎక్కువ. వాడు చాలా చిన్నప్పుడు తల్లి అతనికి ఎండు చేప ముక్క ఓటి కాల్చి పెడుతుంది. వాడికి అది చాలా నచ్చేస్తుంది. ఇంకా కావాలని అడుగుతాడు. వాళ్ళ అమ్మ, పొట్ట నొప్పొస్తుందని తరవాత ఇస్తానమ్మా ఇప్పుడొద్దు అంటుంది. వెంటనే రోషం పుట్టి, జారిపోతున్న చెడ్డీని పైకి లాక్కుని సంద్రం వైపు నడుచుకుంటూ వచ్చేస్తాడు. తల్లి లబో దిబో మనుకుంటూ ఏడుస్తా పిల్లాడి కోసం వెళ్తుంది.
అప్పటికి చిన్నా సముద్రంతో తన బాధ చెప్పుకుని కళ్ళలొంచీ, ముక్కులోంచీ నీళ్ళు కారుస్తూ ఏడ్చాడు. సముద్రం కూడా "ఓ" మని గోస చేస్తుంది. ఇంక నాలుగడుగులు వేస్తే వీడు సముద్రం లోకి వెళిపోతాడనగా తీరంలో పిల్లలు కేకేసి వాడిని ఆపేస్తారు. వాళ్ళు వీడు చేప ముక్క కోసం ఏడుస్తున్నాడని తెలీకనే, వాళ్ళు అప్పుడు కాల్చుకుంటున్న చేప ని ఇస్తారు. అది చూసి చిన్నా చాలా ఆనందిస్తాడు. ఇంతలో అమ్మ వచ్చి చిన్నాని క్షేమంగా చూసి హమ్మయ్య అనుకుంటుంది.
ఇంటికెళ్ళాక, బాగా ముద్దులు పెట్టి, ఇంకాసిని చేప ముక్కలు కాల్చి పళ్ళెంలో పెట్టి ఇచ్చింది. చిన్నాకి అది మొదలు, తను ఆ రోజు సముద్రం దగ్గరికి పోయి ఏడ్వడం వల్ల సముద్రమే తన కోరిక అలా తీర్చిందని - నమ్మకం లా ఏర్పడిపోతుంది. అప్పటినిండీ ఏది కావలన్నా సముద్రానికి పోయి చెప్పుకుంటాడు. వాడికీ సముద్రానికీ మాత్రమే అర్ధమయ్యే ఒక భాష లాంటిది ఏర్పడుతుంది. ఏ కోరిక కలిగినా, సముద్రానికి చెప్పేసి, తరవాత ఇంటికొచ్చి అమ్మ కి చెప్తాడు. అమ్మ నానా తంటాలు పడి అతని కోరిక ని ఎలాగో తీరుస్తుంది. ఇంతకీ చిన్నా కోరికలు తన లానే చిన్నవి... సొరచేప తినాలనిపించడమో / ఎండు చేప ముక్క తినాలనిపించడమో - అలాంటివే!
కొంచెం పెద్దయ్యాక - - కొద్దిరోజుల్లోనే ఒక కొక్కేనికి మెరుపు కాయితం చుట్టి తన చిన్న పొట్టకి తగినంత చిన్న స్థాయిలో చేపలు పట్టడం నేర్చుకుంటాడు. కొన్ని రోజుల్లోనే పాపం వీడికి ఇలా "చేప ముక్కలూ", "సొరచేప పిట్టు" లాంటివి కాకుండా ఒక పెద్ద అవసరం వస్తుంది. ఓరోజు అప్పటికే చిరుగు కుట్లు ఉన్న తన బీద స్కూలు బేగ్ కాస్తా పూర్తిగా చిరిగిపోయి, పుస్తకాలన్నీ కింద పడిపోతాయి. పిన్నీసులు పెట్టినా, కుట్టినా సరి కానంతగా ఆ బేగ్ ఇక చిరిగిపోయింది. అమ్మకి చెప్తాడు కొత్త బేగ్ కావాలని. అమ్మ ఆ మాట విని భోరుమని ఏడ్చేసింది.
ఇంతకు ముందు "నాన్న రానీ.. నాన్నొచ్చాక కొంటాను!" అనేది. "నాన్నెప్పుడొస్తాడు" ?
"సముద్రంలో చేపలు గుడ్లు పెట్టే కాలమొచ్చినప్పుడు!".
"ఆ కాలం ఎప్పుడొస్తుంది?" అని ఎదురు చూసేవాడు. చేపలు గుడ్లు పెట్టే కాలంలో వేటకి బోటుకి వెళ్ళిన బెస్తవాళ్ళంతా తీరానికి వచ్చి తమ ఇళ్ళల్లో గడిపేవారు. చిన్నా నాన్న కూడా పిల్లాడిని ఒక్క క్షణం వొదలకుండా ముద్దు చేసేవాడు.
ఈ సారి మాత్రం చేపలు గుడ్లు పెట్టే కాలానికి అందరి నాన్నలు వచ్చినా చిన్నా నాన్న మాత్రం రాలేదు. అప్పటినించీ తల్లిని ఏమడిగినా ఏడుస్తుంది. పండక్కి ఏడ్చింది. మామ చిన్నాకిచ్చిన కొత్త చొక్కా పట్టుకుని ఏడ్చింది. చెప్పు తెగిపోయింది కొత్త చెప్పు కొనమంటే ఏడ్చింది. అమ్మ ఏడుస్తుందని పిల్లాడు ఈ మధ్య ఏమీ అడగడం లేదు అసలు. కానీ మర్చిపోయి కొత్త బేగ్ కావాలని అడిగీసేడు. రేపు బడికి పుస్తకాలెలా తీస్కెళ్ళడమో తెలీలేదు. అమ్మ ఒక బియ్యం గోతం ఇచ్చింది. అది ఇంట్లోనే ఓ మూలకి విసిరి కొట్టి, సముద్రం దగ్గరకి పరిగెత్తాడు.
ఇసుకలో ఉత్తి కాళ్ళతో పరిగెత్తడం సులభం. చిన్నాకు చెప్పులు తెగిపోయి చాలా కాలమయింది. మళ్ళీ కొనలేదు. చేతుల్లో బలం తెచ్చుకుని, బేగ్ ని సముద్రం లోకి దూరంగా విసిరేసాడు. "సముద్రంలోకి వేటకెళ్ళిన నాన్న ఇంకా రాలేదు కదా.. నాన్న ఈ సముద్రంలోనే వుండుండాలి. చేపలు గుడ్లు పెట్టే కాలం గడిచి చాలా కాలమైంది కదా. నాన్న ఇక రాకూడదూ!!" అని బాధపడ్డాడు. వాడికి దుఃఖం వచ్చింది. వాడితో పాటూ సముద్రమూ ఏడిచింది. వాడు అలల్లోకి వెళ్ళిపోతున్న కొద్దీ, వెనక్కిపో అని వాడిని అలలు బెదిరించాయి.
కథ, దాన్ని రాసుకున్న తీరు రెండూ అద్భుతః !
ReplyDeleteThank you so much.
Delete