Pages

05/04/2021

Rise of ISIS, A THREAT WE CAN'T IGNORE - Jay Sekulow

 Rise of ISIS

A THREAT WE CANT IGNORE

by 

Jay Sekulow, with ACLJ Law of War Team 

Jordan Sekulow, Robert W Ash and David French 




నిజానికి ఇది ఒక కేస్ స్టడీ. ప్రధానంగా ఐసిస్, హమాస్ ఉగ్రవాద సంస్థల ప్రస్థానం గురించి. దీన్ని July 2011 లో ప్రచురించారు.ఈ పుస్తకంలో ప్రచురించిన చాలా భాగాలు అంటే - ఐసిస్ పుట్టుక, ప్రస్థానం, హమాస్, ఐసిస్ ల మధ్య పోలికలు, వారి పోరాట వ్యూహాలు, రాజకీయపుటెత్తులు, ప్రపంచపు దృష్టిని ఆకట్టుకునేందుకు అవలంబించే పద్ధతుల గురించి  ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ తాలూకూ   History Politics and Society Program on Religion and Politics in the Middle East లో సమర్పించిన థీసిస్ లో ఉన్నాయి. 

ఈ పుస్తకం తాలూకు ప్రధాన ఉద్దేశ్యం - ఒక టెర్రరిస్ట్ గ్రూప్ ఎదగడానికి, ఒక భయానక శక్తి గా ఎదగడానికీ, ఏ శక్తులు దోహదం చేస్తాయో, ఎందుకు చేస్తాయో - ఆఖరికి వాటి అంతం ఎలా ఉండొచ్చో, చర్చించడమే.  అయితే ఈ పుస్తకం ప్రచురించే సమయానికి (2011)  ఐసిస్ కథ ముగియలేదు. కానీ, ఐసిస్ బలాలనీ, బలహీనతలను అంచనా వెయ్యడం లో ఒక థింక్ టాంక్ తాలూకూ ప్రయత్నం, అది విస్తృత సత్యంగా ఎలా మలుపు తిరిగిందో ఆలోచించడానికి బావుంది. 

AQI (Al Queda in Iraq) నుండీ ఐసిస్ / ఐసిల్ / డాయిష్ పుట్టింది. 'అబూ ముసాల్ అల్ జర్కావీ' మానస పుత్రిక. 2004 లోనే మొదలయినా 2011 నుండీ ప్రాముఖ్యతలోకి వచ్చింది. 2013 లో స్థిరపడి, వేళ్ళూని, తన పేరు ఐసిస్ గా మార్చుకుని,  ఇరాక్, సిరియా లలో (సిరియాలో దాదాపుఒక సమయంలో  90% భాగాన్ని) ఈజిప్ట్, టర్కీ ల లో కూడా చాలా భాగాల్ని తన అదుపులోకి తెచ్చుకుని, "కాలిఫైట్" ని ప్రకటించుకుంది.  .        

అమెరికా తాలూకూ ఆపరేషన్ ఇన్ హెరెంట్ రిసాల్వ్ (OP Inherent Resolve) లో దాదాపూ 8000 వైమానిక దాడుల అనంతరం, బలహీనపడడం మొదలయింది.  Dec 2017 సరికి 95% of its territoryని  కోల్పోయి, 2018 లో కుర్దులు (SDF - Syrian Democratic Forces) దాన్ని కొన్ని గ్రామాలకు పరిమితం చేయడం,  Feb 2019 లో  ఆఖరి ముట్టడి (Final Siege) మొదలయ్యాక, Mar 23, 2019 లో పూర్తి గా ఓడిపోయి, ఉగ్రవాదులు, తమ కుటుంబాలతో సహా మూకుమ్మడి గా లొంగిపోవడం, దాని అసంఖ్యాక విదేశీ సభ్యులను, వారి వారి  దేశాలు అన్నీ నిరాకరించడం,   అలాగే Oct 26, 2019 లో అబూ బకర్ అల్ బగ్దాదీ,  సిరియాలో అమెరికా దాడి లో మరణించాక, దాని కథ ముగియడం జరిగాయి.  

అయితే, అంతవరకూ ఎదురు లేకుండా, కనీ వినీ ఎరగని రీతిలో, స్వయంగా వివిధ ఇతర హింసాత్మక ఉగ్రవాద సంస్థలు కూడా సమ్మతించనంత ఘోరమైన పద్ధతుల్లో, తాము గెలుచుకున్న భూభాగం లో - తలలు నరకడం, తల్లుల ముందే బిడ్డల్ను చంపడం, బహిరంగంగా శవాలను మూడు నాలుగురోజుల పాటు ప్రదర్శించడం, స్త్రీ లను రేప్ చేసి, తమ తమ దేహాలను పవిత్ర పరిచేందుకు ఆత్మాహుతి దాడుల్లో పాల్గొనాల్సిందే అని ఒప్పించడం లాంటి పనులు చెయ్యడం తో పాటు,  సాంకేతిక సహకారంతో, తమ తమ ఘోరాలను ప్రపంచానికి సోషల్ మీడియా ద్వారా వ్యాప్తి చేసి, అసంఖ్యాక పిచ్చివాళ్ళను (వీరుల్ని/వధువులనూ) ఆకర్షించి, పద్ధతి ప్రకారం రిక్రూట్ చేసికుని, అర చేతిలో వైకుంఠం (కాలిఫైట్) చూపిస్తూ, వాళ్ళ చేత యుద్ధాలూ, హత్యలూ - కౄరత కు  పరాకాష్ట లాంటి పనులన్నీ చేయించి, గ్రామాలకు గ్రామాల్నే చంపేసి, భీభత్సం సృష్టించింది.  ఐసిస్ సృష్టించిన  ఘోర కలి, దాని రెవెన్యూ విధానాలు, దాని సభ్యుల సాంకేతిక విద్య అపరిమితత్వం,  కిచెన్ లో బాంబులు తయారుచెయ్యడం, మెల్లగా తలలు నరకడం గురించి యూ ట్యూబ్ ట్యుటోరియళ్ళు - ఇలా ఐసిస్ ప్రపంచ వ్యాప్తంగా ఇళ్ళలోకి ప్రవేశించి, రాజకీయాల్ని వేడెక్కించి, ఎందరో తల్లులకు గర్భ శోకాన్ని మిగిల్చి, అన్ని దేశాల్నీ ఓ కుదుపు కుదిపింది. 


ప్రపంచ వ్యాప్తంగా ఐసిస్ ప్రేరణ తో, దన్నుతో, సూచనలతో, ఆదేశాలతో, అసంఖ్యాక బాంబు దాడులూ, కత్తి దాడులూ, వాహనాలతో హత్య చేయడాలు  జరిగాయి. ఇంకా, ఆఫ్రికా లో బోకో హరాం లాంటి సంస్థలతో చేతులు కలిపి, మన దేశం లో కూడా తన శాఖ ను ప్రకటించి,  తమ పరిథి ని ఇంకా విస్తృత పరచుకుంటూ, ప్రపంచానికి పెను సవాలైపోయింది.  "షరియా లా" ని అక్షరాలా  చాందసంగా అమలు చెయ్యడం, వాలంటరీ గా వచ్చిన స్త్రీలను కూడా సెక్స్ బానిసలు గా చూడడం, (తెలిసీ తెలియని వయసున్న టీనేజర్లు - పాశ్చాత్య దేశాలవారు), సామూహికంగా హత్యలు చెయ్యడం, సామూహికంగా శవాలను కప్పిపెట్టడం, పిల్లల మీద, మహిళల మీదా నేరాలకు పాల్పడడం వంటి ద్వారా, బయటి ప్రపంచం కన్నా, తమ లోపలి ప్రపంచంలో కూడా చాలా వ్యతిరేకత మూట కట్టుకున్నారు ఈ ఐసిస్ సభ్యులు.  (తాము ఆక్రమించుకున్న ప్రాంతాల ప్రజల దృష్టి లోనూ, తెలిసీ తెలియక తమ లో చేరిన 'బలహీన' సభ్యుల దృష్టి లో కూడా "రక్తపిపాసి" లాగా నిలబడింది తప్ప, తాను చూపించిన కాలిఫైట్ స్వప్నాలని అందివ్వలేకపోయింది). 

దీనికీ హమాస్ కూ ఉన్న పోలికలు, వాటి విధానాల మధ్య ఉన్న పోలికలూ - ముఖ్యంగా  ఇజ్రాయిల్ కు అతి సమీపంగా రాగలగడం, తమకు మతపర శతృవుల్నీ (NON MUSLIMS / Non-believers) నిర్మూలించడమే, వారి లక్ష్యం గాబట్టి, ఇజ్రాయిల్ మీదా, యూదుల మీదా ఆధిపత్యం సాధించడం, యూదుల్ని చంపడం తమ తదుపరి లక్ష్యంగా ప్రకటించేసరికీ, వాతావరణం వేడెక్కడం మొదలయింది.  నెతన్యాహూ, ఐసిస్ ను హమాస్ తో పోల్చారు. అమెరికాను ఐసిస్ మీదకు బలంగా విరుచుకుపడేందుకు ఒప్పించడానికి అందరికీ తలప్రాణం తోకకొచ్చింది. ఆఖరికి "అమెరికన్ విలువ"ల (American Values)  గాలం వేసి, చమురు వ్యాపారాన్ని సరిదిద్దడానికి, రష్యా కూటమి అధికార విస్తృతిని అడ్డుకోవడానికి - తీవ్రవాదానికి తాళం వేసే "అనిశ్చితత్వాని'కీ  అడ్డు వేసారు.  ఐసిస్ ఇలా చాపకింద నీరులా ప్రపంచవ్యాప్తంగా కాలు కదపకుండానే లోన్-వుల్ఫ్ దాడుల ద్వారా భీభత్సం సృష్టించాక, మెల్లగా అమెరికా, కేనడా, నాటో లు ముందుకు కదలడం, ఐసిస్ కోసం ప్రపంచం రెండుగా చీలడం, వివిధ దౌత్య, సైనిక, రాజకీయ జోక్యాల తరవాత ఐసిస్ బలహీనతల సమాచారం అందుబాటులోకి రావడం మొదలయ్యాయి. 

ఆఖరికి టర్కీలో  తన రాజకీయ ప్రయోజనాల కోసం (నాటో సభ్యురాలు - ఈ.యూ. లో ప్రవేశం కోసం అభ్యర్ధి, కావడాన)  ఎర్డోగన్ వ్యూహ మార్పు వల్ల,  ఐసిస్ అంతం అయింది.   అంతవరకూ, తమ దేశం గుండానే, వేలాది మంది విదేశీయులు సిరియాలోకి ప్రవేశించడాన్ని, ఆయుధ సరఫరాని అనుమతించడాన్ని, అమెరికా కు "టర్కీ  సార్వభౌమత్వం" పేరుతో తమ దేశంలో బేస్ నిరాకరించడం - వగైరా ఐసిస్ అనుకూల దృక్పధాన్ని కొనసాగించడం,  దాని వల్ల  ప్రపంచంతో  ఏర్పడ్డ శతృత్వం ఎన్నో నాళ్ళు నిభాయించలేక పోయినా సరే టర్కీ, తన మొండి విధానాల్నే నమ్ముకుంది.    టర్కీ ని "సంచీ" లో వేసుకున్నంత వరకూ ఐసిస్ కూ, అది చేసే చమురు నల్ల వ్యాపారానికీ, దానికి కావలసిన ఆయుధ సంపత్తికీ, చనిపోతున్న వీరుల సంఖ్యను పూర్తి చేసేందుకు టర్కీ ఏర్పోర్టులలో దిగుతున్న కొత్త సభ్యుల సరఫరాకీ ఎలాంటి అడ్డూ లేదని ప్రపంచం గ్రహించింది. ఈ పుస్తకం లో రచయితల బృందం సూచించినది అదే. 

అనూహ్యంగా,  టర్కీ లో సురుక్ (Suruc - అది సిరియా సరిహద్దు నుండీ కేవలం 10 km దూరంలో ఉంది) లో,   Jul 20 న బాంబు దాడి జరిగాక (ఈ దాడి బాధ్యత ను ఐసిస్ స్వీకరించలేదు) Turkey అకస్మాత్తు గా ఐసిస్ మీద ఎదురు దాడికి దిగడం తో పూర్తిగా సమీకరణాలు మారిపోయాయి.  

టర్కీ మీద ఒత్తిడి తీసుకుని రావడం ద్వారా ఐసిస్ ను ఎదుర్కోగలమని సూచించిన నిపుణులు  ఎన్ని వ్యూహాలు రచించినప్పటికీ,  ఎర్డోగన్ (2014 లో కేవలం టర్కీ ప్రధాని) అధ్యక్ష పదవీ వ్యామోహం,  అతని పార్టీ కేవలం 258 / 550 సీట్లు సాధించాక, అతనితో సంకీర్ణానికి ఎవరూ ముందుకు రాకపోవడంతో షాక్ తిని, - ఐసిస్ వ్యతిరేకత టర్కీ లో పెరగడం తో, ఐసిస్ ను అణచకపోతే, అది తన నెత్తినే కాటేస్తుందని అర్ధం చేసుకుని -  ఎలక్షన్ లలో గెలుపు కోసం, ఎర్డోగన్ (Erdogan) తన స్టాండ్ మార్చుకున్నాడు గానీ,   మీడియా ప్రాచారం చేసినట్టు టర్కీ మీద దాడి (ఇది ఎవరు చేయించారో తెలీదు. ఈ దాడి లో 33 మంది సామాన్య పౌరులు మరణించారు)  వల్ల కాదని అంటారు. 

ఏది ఎమయినా ఐసిస్ ఇప్పుడు ఓ గతం. కానీ ఈ కాలంలో కూడా ఐసిస్, హమాస్ లు అవలంబిస్తున్న, అవలంబించిన పోరాట విధానాలు అధ్యయనం చేయాల్సిందే.  పౌరులు ఎక్కువగా ఉండే జనావాస స్థలాలలో తమ బేస్ లు ఏర్పాటు చేసుకోవడం, హస్పెటల్స్ నుండీ రాకెట్లు లాంచ్ చెయ్యడం, ఐక్యరాజ్య సమితి ఏర్పాటు చేసిన వివిధ ప్రాంగణాలలో బాంబులు, ఆయుధాలు భద్రపరచడం,  సామాన్యుల ప్రాణాలను బలి పెట్టడం లాంటివి సాధారణం గా చెయ్యడం, ఈ రెండు సంస్థల స్వభావం.  ఐసిస్ ప్రధాన ఆదాయ వనరు చమురు. ఐసిస్ తదనంతరం, చమురు వ్యాపారపు పగ్గాలు ఆయా దేశాలు అంది పుచ్చుకున్నాయి. ఇపుడు చమురు రాజకీయాలు రష్యాను, కతార్ ను, సౌదీ అరేబియాను, ఇజ్రాయెల్ ను, మొత్తానికి ప్రపంచాన్నీ  ప్రభావితం చేస్తున్నాయి. 

ముఖ్యంగా - అధ్యక్షుడిగా ఎన్నికయేందుకు ఉన్న అడ్డంకులను తొలగించుకోవడానికి , Erdogan తన (Turkey) శత్రు దళాలైన PKK (Kurdish Workers Party)  మీద, కొంచెం ఐసిస్ మీదా,  దాడులు జరపడానికి పూనుకుపోయి ఉంటే ఏమి జరిగేదొ.   కుర్దిస్తాన్ కోసం పోరాడే కుర్దు వీరులు, ఐసిస్ కు గట్టి ఎదురు దెబ్బలు కలిగించకపోతే, ఆ ప్రయత్నాలలో వారు ఓడి  ఉంటే ? ఇవన్నీ ఊహించడానికి కూడా భయానకం గా ఉంటాయి. సిరియా యుద్ధం, వరద ప్రవాహం లాంటి శరణార్ధులు యూరోప్ ను ముంచెత్తడం, సముద్రం మింగేసిన శరణార్ధులు - వీళ్ళంతా ప్రపంచానికి గుర్తున్నారా ? మానవత్వం, అమానుషత్వం - వీటిల్లో ఏది గెలుస్తుంది?  అంత వరకూ తేనె తుట్ట ను కదిలించేది / కదలకుండా ఉంచేది  ఎవరు ?  వీటికి సమాధానాలు వెతకడం కూడా ఇప్పుడు కష్టమే. 

ఐసిస్ ను ట్విటర్ లాంటి సంస్థలు ఎదుర్కోక మునుపు,  ఫిఫా ప్రపంచ ఫుట్ బాల్ కప్ పోటీలు జరిగేటప్పుడు హాష్టాగ్ వరల్డ్ కప్ (#World Cup) ను ఉపయోగించి ఐసిస్ ట్విటర్ హాండ్లర్, ఒక నరికిన తల ఫోటో ను ట్వీట్ చెయ్యడం (This is our Football, its made of skin అంటూ)  ప్రకంపనలు సృష్టించింది. ఐసిస్ చేసిన వివిధ హత్యలను,  ఉదాహరణకు, జోర్డన్ పైలట్ ను ఒక బోనులో ఉంచి సజీవ దహనం చెయ్యడం, వివిధ దేశాల జర్నలిస్టులను, ఎయిడ్ వర్కర్ లను, సైనికులను చంపుతూ చేసిన వీడియోలు కొత్త లో sensation కోసం చూపించిన ప్రధాన స్రవంతి మీడియా - దాన్ని విరమించుకోవడంతో SOCIAL MEDIA లో, ప్రపంచ కప్ చూసే అభిమానులను టార్గెట్ చేస్తూ - ట్వీట్ చెయ్యడం, దాన్ని అమాయక, ఈ ప్రమాదాన్ని ఊహించనే లేని యువత చూడ డానికి అనువుగా పెట్టడం -  ఐసిస్ మీద వ్యతిరేకత ను,  చాందస భావాలతో పెరిగిన యువత లో  'అభిమానాన్ని' కూడా సృస్టించింది. ఏ పోరాటానికైనా, ఏ అకృత్యాలకైనా పాపం పండడం అనే మాట ఒకటుంటుంది. కొన్ని విపరీతాలు అందుకే జరుగుతాయి.  కొన్ని చెడ్డ విషయాలు కూడా ఇలాగే అంతం అవుతాయి.   ఇప్పటికీ ఐసిస్ అనుకూల, ప్రేరేరిత దాడులు ప్రపంచం లో అడపాదడపా జరుగుతున్నాయి. ఎక్కడో అది బ్రతికే ఉంది. కాబట్టి, జాగ్రత్త అవసరం. 

***


No comments:

Post a Comment

వ్యాఖ్యానించినందుకు చాలా చాలా థాంక్స్.