హంపి గురించి ఒక స్వాప్నిక నగరం అని, వంశీ తరహా రచయితలు చెప్పే మార్మిక స్వప్న సుందరులు - కాలం లో ప్రయాణం చేసి వస్తారనీ, ఆ శిధిలాల్లో తిరుగుతుంటారనీ, తెలుగు కథలు విపరీతంగా చదివి ఉండడం వల్ల - యూ ట్యూబ్ వీడియోలు కూడా అంత కుదురుగా ఉండక, మొత్తానికి ఎలాగో - ఒక లక్ష్యం అంటూ ముందుగా నిర్ణయించుకోకుండా, ప్రణాళిక లేని ప్రయాణం పెట్టుకుని హంపి చూసొచ్చాక, చిన్నప్పుడు నాన్న గారు చదవమని ఇచ్చిన "ఆంధ్ర ప్రభ" దిన పత్రికలో ధారావాహికంగా వచ్చిన ఈ అపురూప పుస్తకం గుర్తొచ్చింది.
ఎందుకో హంపి లో నాకు ఆ "స్వాప్నికత" ఏదీ కనిపించలేదు. కానీ, శ్రీ తిరుమల రామచంద్ర ఆత్మ కథ లో వర్ణించిన పసివాడు - సర్దార్జీ లా జుత్తు పెంచుకుని, ఆ అడవుల్లో, వీధిలో - తిరుగాడిన చిన్న అబ్బాయే గుర్తొచ్చాడు. నాలాంటి సెంటిమెంటల్ మనుషులకి జ్ఞానం కన్నా అనుభూతికి విలువెక్కువ కాబట్టి, హంపి కి ప్రయాణమయ్యాక, ఆ కుందన నగరం చూసాక, ఈ పుస్తకం జ్ఞాపకం రావడమేమిటో - యాధృచ్చికం.
ఈ పుస్తకం చాలా చాలా ఆనందకరమైన అనుభవం. పూర్తి సాంప్రదాయ కుటుంబ వాతావరణం లో పుట్టి, వీధి బళ్ళలో చదివి, పిదప అత్యంత ప్రతిభావంతులైన గురువుల దగ్గర ఎంతో క్రమశిక్షణ తో చదువుకుని, ఆయా గురువుల కుటుంబాల ప్రేమాదరణ ల తో సరస్వతి ని ప్రసన్నం చేసుకుని, ఆ రోజుల చదువులు ఇచ్చిన ధారణా శక్తి తో, ప్రాచీన తెలుగు సాహిత్యానికి సేవ చేసుకుని, విధి వశాన ఉత్తర భారతం చేరి, అక్కడి జీవితాన్ని కూడా అంతే ఆదరణ తో, మద్రాసు, లాహోరు లను ఒకేలా ప్రేమించిన మనిషి ఆత్మ కథ ఇది.
దేశం లో యువత అంతా స్వతంత్ర పోరాటం లో మునిగిపోయి ఉండగా, యుగాలు మారుతున్న కాలాన, తన సంస్కృతం చదువు, బాల్యం, ఊర్లోని వ్యక్తులు, గురువులు, సందర్భాలు, పద్యాలు, హంపిలో తాను తిరిగిన ప్రదేశాలు, కమలాపురం, ఆనెగొంది పరిసరాలు, ఆ శిధిలాల్లో ఆటలు, అక్కడి కన్నడ, తెలుగు ప్రజల జీవితాలు, నిద్రలో రెండు మూడు ఊర్లు దాటేసే నడక, తాను నత్తిని అధిగమించగలగడం - వంటి విశేషాలు - నన్ను అప్పటి తుప్పల్లో, అడవుల్లో కనబడిన ఆ శిధిలాలని అలాగే చూడాలనిపించింది.
ఆ ఊరిలో పెరిగిన పిల్లవాడిగా ఏ కొండల్లోనో, ఆడుకుంటున్న రామచంద్ర - ఎలాంటి వైభవం ఇలా అయింది కదా అని బాధపడడం - అంత చిన్న పిల్ల వాడిని కూడా కదిలించిన శిధిల సౌందర్యం - అప్పుట్లో ఆ విఠలాలయం లో, మిగతా ఆలయాల్లో, జరిగే జాతర్లూ, ప్రదర్శనలు, ఊరి వాళ్ళు ఆ ఊరు, ఆ సంసృతీ తమదీ అని భావించి, వైభవంగా జరుపుకునే ప్రాభవ ఉత్సవాల్నీ గురించి చదివి చాలా ఆనందం కలిగింది.
ఈ ప్రాంతం రామాయణ కాలంలో కిష్కింధ అని ఓ నమ్మకం ఉండడం వల్ల, ఊరిలో ఆడుకుంటూనో, ఏ ఆకులు సేకరించేందుకో చుట్టు పక్కల తిరిగినప్పటి విశేషాలు, కిష్కింధ లో వాలిని తగలబెట్టిన దిబ్బ, ఆయా ప్రముఖ స్థలాలు, ఆలయాలు, అప్పటి కాల మాన పరిస్థితులు, తనను ఆదరించిన పుణ్యవతులు, తల్లులు, సాకిన అమ్మలు, పార్వతీ దేవి లాంటి ప్రేమ మూర్తి బసివి, (జోగిని / దేవ దాసి) గురించి, ఇవన్నీ, కేవలం జ్ఞాపకాల ఆధారంగా రాసిన మొత్తం 61 అధ్యాయాలు.
తుంగభద్ర లో పుట్టి ప్రయాణాలు, ఆ ఊరిలో, రాయచూర్ జిల్లా కావడాన నిజాం రాజ్యం లోని ప్రాంతం కావడాన - అద్దెకు వచ్చిన ఉత్తరాది సైన్యం, వీరుల్లో ఇస్లామీయ మతాన్ని పుచ్చుకున్న రాజపుత్రుల గురించి, తనకు విద్య నేర్పిన వారు, స్వతంత్ర పోరాటం లో మద్రాసు కుట్ర లో పాల్గొనడం గురించి, ఆయా సందర్భాలలో పోలీసు తనిఖీల్లో, మకాం మార్పుళ్ళలో పోయిన తన తాళ పత్ర / ప్రాచీన పుస్తక నిధుల్ని తలచుకుని, "వాట్ని నేను సరిగ్గా ప్రిసెర్వ్ చెయ్యలేకపోయాను. చరిత్ర కి అన్యాయం చేసాను" అనుకుని బాధపడడం చదివి అసలు నేనుచాలా ఆశ్చర్యపోయాను. చేస్తున్న పని విలువ చాలా తక్కువ మందికి తెలుస్తుంది.
అందులోనూ ఇప్పుడు మరి దొరకని ఆ తాళపత్రాల గ్రంధాలలోని సమాచారాన్ని వాళ్ళు చూసి, పుస్తకాలలో తిరీగి రాసి, భద్రపరచడం, కొరుకుడు పడని భాషని, బహుశా, వాడుకలో లేని పదాలనీ, పరిష్కరించడం, వంటివి చేసి ఉండకపోతే, మనకి ఇపుడు చాలా విషయాలు తెలిసే ఉండేవి కాదు. తిరుమల రామచంద్ర ఉద్యోగం లో భాగంగా అదే పని చేసారు. మద్రాసు లోనూ, తరవాత తంజావూర్ సరస్వతీ మహల్ లోనూ ఎన్నో గ్రంధాలను కాపీ, కేటలాగింగ్, చేసి పెట్టారు.
ఆయన ఒక సందర్భం లో తన దగ్గర ఉన్న గ్రంధాల కట్ట ను మద్రాసు నుండీ తన ఇంటికి పార్సెల్ చేయాల్సినిదిగా కోరి, చార్జీలు సహా ఇచ్చినా కూడా ఒక పెద్ద మనిషి ఉపేక్షించడం, ఆ కట్టల్లో తాళపత్రాల గ్రంధాలు ఉండడం వల్ల పురుగు పట్టి, అన్నీ పాడై పోవడం, వాటిని కాపాడుకోలేకపోవడం రామచంద్ర ని చాలా తొలిచేస్తుంది. అలాగే అపురూప గ్రంధపు ఏకైక ప్రతి ని కూడా ఎవరో తస్కరించడం - అయ్యో దీన్ని సరైన చోటికికి తొందరగా చేర్చ లేక పోవడం ఎంత తప్పయింది అని బాధపడడం - గొప్ప విషయాలు.
రామచంద్ర చాలా మంది మంచి గురువుల వద్ద సంస్కృతం చదువుకుని, తరవాత తిరుపతి లో సంస్కృత కళాశాల లో చదివి, ఆనాటి కాంగ్రెస్ లో చేరి, స్వంతంత్ర భావాల ఊపులో గోవిందరాజ స్వామి ఆలయ గోపురం మీద ఖద్దరు త్రివర్ణ పతాకాన్ని ఎగరేసి, బ్రిటీషు ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేతి వ్రాత కరపత్రాలు పంచి, జైలు కెళ్ళి, కెరీర్ ని మొదలు పెట్టిన మనిషి.
మద్రాస్ లో కూడా ఎలాగో కాలేజీ లో ప్రవేశించి, భగత్ సింగ్ ఉరితీత తరవాత జ్వలించిపోతున్న దేశ హృదయాగ్నిని చల్లార్చడం కోసం, అండమానుకు తరలింపబడుతున్న వారిని రైల్ లోంచీ విడిపిద్దామనుకుని ఆ కుట్ర విఫలం అయి, జైలు శిక్ష అనుభవిస్తాడు. ఈ సంప్రదాయ వైష్ణవ యువకుడికి తల్లి తో చక్కటి అనుబంధం. వాళ్ళిద్దరి ఉత్తరాలు, ఆవిడ కమ్మని, విస్పష్ట మైన జవాబులు, గైడెన్స్ - అతనికి శిరోధార్యాలు. అయినా తల్లికి తన విప్లవ భావాలు చెప్పడానికి జంకి,
చాలా నాళ్ళు పగలు సంస్కృతం చదువుకునే ఆచార్ల పిల్లాడు, రాత్రి పూట విప్లవ భావాలున్న యువకులతో తిరగడం, ఇది గాంధేయ వాదులైన తమ కుటుంబ సభ్యులు అంగీకరించరని తెలిసి, రెండు జీవితాల ద్వందాన్ని గడుపుతూ - ఆఖరికి పట్టు బడ్డాక, చదువు ఆపవలసి రావడం, అటు ఇంట్లో కూడా నిరసన ని ఎదుర్కోవడం జరుగుతుంది.
ఈ పుస్తకం లో మనం చాలా మంది ప్రముఖుల ప్రస్తావన చూస్తాం. గొప్ప గొప్ప వాళ్ళందరూ ఆరోజుల్లో చెట్టా పట్టాలేసుకుని తిరిగారా అనిపిస్తుంది. మరీ నిజాయితీ గా చెప్పేందుకు ప్రయత్నించి, తను మనసు పడి, వివాహం చేసుకుందామనుకున్న మహిళల పూర్తి వివరాలతో వారి మధ్య గౌరవ పూర్వక వీడ్కోళ్ళ గురించి కూడా రాస్తారు. ఈ పుస్తకం చాలా ఏళ్ళ తరవాత రాయబడినందున ఆ మహిళలు కాకపోయినా, వారి మనవళ్ళయినా ఈ పుస్తకం చదివి ఓహో అనుకునేలా ఉన్నాయి వివరాలు. అది ఆశ్చర్యం కలిగిస్తుంది. జైలు జీవితం, తనని జైలుకు పంపుతూ బాధపడిన పోలీసధికారి మంచితనం, జైలు లో ఖైదీల వర్గీకరణ, అక్కడి భోజనం గురించి మంచి వివరణ వుంటుంది. ఇంత నిజాయితీ గా ఖైదీల వర్గీకరణ జరిగిందని ఎక్కడా చదివిన జ్ఞాపకం లేదు.
ఆయుర్వేదం చదవడం వల్ల, కామశాస్త్ర సూత్రాల గురించి కూడా తన జ్ఞానాన్ని పంచుకుంటారు. ఉద్యోగం లేని రోజుల్లో - పంజాబ్ లో తాను వెలగబెట్టిన ఉద్యోగాలలో ఒకటి - ఉత్తరాలకు సమాధానాలు రాయడం. అదీ దొంగ లేహ్యాలు అమ్మే సంస్థ కోసం. ఆఖరికి తన చదువు ఇలాంటి ఉద్యోగానికా అని బాధపడతారు.
జీవితం ఎన్నో మలుపులు తీసుకుంటుంది, పూట పూట కీ తిండికి డబ్బు లెక్క బెట్టుకోవాల్సిన రోజులూ చూడడం, మిలటరీ లో చేరడం, విధి వశాన కోర్ట్ మార్షల్ కావడం, వివాహం, లహోర్ నుండీ హరప్ప, మొహెంజదారో లను చూడబోవడం, వివిధ వృత్తుల్లో ప్రవేశం, ఆఖరికి పాత్రికేయం, ఇంటికి తిరిగి రావడం - ఇలా ఎన్ని మజిలీలో. వీటిలో తనకు తారస పడిన వ్యక్తుల పేర్లను గుర్తు పెట్టుకోవడం, ఇంటి పేర్ల తో సహా.. వారి తో పరిచయాలు, అసలు ఎంత జ్ఞాపక శక్తి !!! లాహోరు లో అనార్కలీ సజీవంగా సమాధి కాబడిన స్థలం చూసి, ఆయనలో మనిషి ఎంత దహించుకుపోతాడో. ఒక మనిషిని, నిస్సహాయురాలైన స్త్రీ ని అక్బరు లాంటి పెద్ద చక్రవర్తి, ప్రేమించినందుకు అంత పెద్ద కృఊర, అమానుష శిక్ష విధించడం ఏమిటి.. అతను ఎంత మానవత్వం లేనివాడు ? రాక్షసుడు! అని బాధపడతారు.
అన్ని పరిచయాలు, ఆయా వ్యక్తులతో మెలిగిన సందర్భాలు వగైరా అన్నీ, జ్ఞాపకం తెచ్చుకుంటూ చెప్పినవి. వేటూరి ప్రభాకర శాస్త్రి గారి గురించి, వారి గురు శిష్య అనుబంధానికి, ప్రభాకర శాస్త్రి గారి యోగ సాధన, ఆయన ఇంటిలో ప్రతి సాయంత్రమూ కలుసుకునే సాహితీ వేత్తల, ప్రముఖుల జీవనం గురించి ప్రస్తావన చాలా బావుంటాయి.
మొత్తానికి చిన్న చిన్న చాప్టర్లు గా ఏక బిగిన చదివిస్తూ - ప్రాచీన నగరాలలో తిప్పి అన్నీ చూపిస్తూ, ప్రస్థాన జీవితం తెరిచి చూపించే ప్రపంచాన్ని, అది మిగిల్చే అనుభవాలనీ నిజాయితీ గా పంచుకున్న సమగ్ర జీవిత చరిత్ర ఇది. ఏదో పెద్ద సిరీస్ చూస్తున్నట్టు - చాలా బావుంది.
ఇలా హంపిని చదువుతూ గడపడం వల్ల, పురాతన హంపి ని గురించి, వెతుకుతూ, కొన్ని జ్ఞాపకాల రికార్డ్ కోసం, ఇలా కొన్ని ఫోటోలు.
[ఫోటోలు ఈ గైడ్ నుండీ తీసుకున్నాను]
***
Some pictures of old Hampi
Excellent write up...I read this book their and with that feeling i visited Hampi. Thankyou..
ReplyDeleteThrice
ReplyDelete