Pages

28/06/2020

ఉల్లంఘన - ప్రతిభా రాయ్ (Ullanghan - Dr. Pratibha Ray)




ఉల్లంఘన   - సాహిత్య అకాడమీ పురస్కారం లభించిన ఒడియా కథా సంపుటి. దీనిలో కథలన్నీ చాలా సంతృప్తికరంగా, మానవీయ దృక్పథంతో రాసినవి. ఒడియా సాహిత్యపు అనువాదాలు ఇంత వరకూ ఎప్పుడూ నిరాశ పరచలేదు. సాహిత్య ఎకాడమీ ప్రచురించే ప్రాచీన "సమ కాలీన"* వివిధ భాషల కథలు కూడా చాలా మటుకూ బావున్నా, ఒక ప్రతిభా వంతురాలైన రచయిత్రి, స్త్రీ కోణంలో (ఫెమినిస్టిక్ గా కాదు) చెప్పడం, అవన్నీ చిన్నాన్నల ప్రేమలవీ, పిన్నమ్మల అభిమానాలవీ, మనుషుల అసంకల్పిత  స్వార్ధాలవీ, ధైర్యాలవీ, మూర్ఖపు పట్టుదలలవీ, ఉమ్మడి కుటుంబపు రాజకీయాలవీ, పనివాళ్ళ విధ్యేయత్వానివీ, నిజాయితీవి అయినందున, ఇవన్నీ చదివాక కొంచెం సేపు ఆలోచన లో పడతాం.

మేము కొంచెం పాత కాలం వాళ్ళం. చిన్న తాతగారు, పిన నానమ్మ, మేనత్త, దూరపు చుట్టాల పిల్లలు, పెద్దమ్మ, పిన్నమ్మల పిల్లలు, ఇలా బోల్డంత మంది బంధువులు, (వాళ్ళలో ఒక వయసు వాళ్ళందరూ మితృలు కూడా)- ఇలా బోల్డన్ని బంధాల్ని ఎరిగున్న కాలం వాళ్ళం.  కాబట్టి వీటిల్లో చాలా సంప్రదాయాలతో కాస్త ఐడింటిఫయి చేసుకుని అర్ధం చేసుకోగలం. 

పూర్వ కాలంలో మనుషులు పాటించాల్సిన  వివిధ సంప్రదాయాలతో పాటు,  బాధ్యత గా నెరపవలసిన మానవ సంబంధాలు కూడా ఎక్కువ.  ఇరుగు పొరుగు వారు అయితే చుట్టాలు / వరసల పేర్లు తో పిలవబడే వాళ్ళు. సంసారాలు పెద్దవి. ఊరందరు ఒకటే. ఎవరింట్లో ఏమి జరుగునో అందరికీ దాదాపుగా తెలుస్తూండేది.  వాటిలో కూడా మర్యాదలు, పోట్లాటలు, పుకార్లు, అల్లర్లు. వీటన్నిటి తో పాటు సఖ్యత కూడా.

మన వీధిలో రోడ్లు ఊడ్చే పని వాడు కూడా మన జీవితాల్లో ఎంతటి కనిపించని అంతర్భాగమో చెప్తూ, మనుషుల్లో కొంచెం పక్క వాడి గురించి, వాడి మనస్థితి ని గురించీ, అంతస్తుల వారీగా మనలోని అందరి సమానత్వానికీ పట్టం కడుతూండడం వల్ల చదివాక మంచి అనుభూతిని ఇచ్చిన పుస్తకం. దీనిలో మచ్చుకి ఒక కథ - మృష్ఠాన్న భోజనం. 

ఉల్లంఘన అనే కథ (ఈ పుస్తకం పేరు) చాలా పేరు తెచ్చుకున్న కథ. సంప్రదాయం, ప్రాక్టికల్ జీవిత సమస్యలు, బాధ్యతల మధ్య నలిగే ఓ పదహారూ పదిహేడేళ్ళ కొత్త  కోడలి జీవితం గురించి చాలా చక్కగా రాసిన కథ. చదివేసాక,  చాలా షాక్ కి గురి చేసినా, మనం కొన్ని సమస్యలని మేనేజ్ చెయ్యగలిగితే ఎంత బావుండేది అనిపించేలా చేస్తుంది. సాంప్రదాయ చట్రం లో పడి,  వృద్ధాప్యం లో మానసిక ప్రకోపంతో, చపలత్వంతో నలిగిపోయిన మామగారి కథ కూడా ఇది.

సరే.. ఇప్పుడు నేను చెప్పబోయే కథ - మావిడి పళ్ళ కాలంలో చదివినది. మేముంటున్న ఊర్లో తోటలెక్కడో ఊరవతల ధనవంతులకే ఉంటాయి. అమ్మే పళ్ళన్నీ పక్క రాష్ట్రాల నుండీ కాయల్లా వచ్చి, కెమికల్స్ వేసి పండించినవి.  ఆంధ్ర లో లాగా చెట్లకి మగ్గి,  మావిడి, పనస పళ్ళ వాసన తో మార్కెట్లు గుమ్మెత్తిపోవు. అంతా కనుల మాయే. మంచి పళ్ళు ఊరెళ్ళి తిందామనే వాంచ ని కరోనా భయం తొక్కేసింది. కాబట్టి దీనిలో మావిడి పళ్ళ భోజనం గురించి చెప్పడం వల్ల, తోటలూ, వరదల వర్ణన వల్ల, ఈ కథ బాగా మనసులో ముద్రించుకుపోయింది.

సిటీల్లో ఇప్పుడు పెరిగే పిల్లలకి వరదల భీభత్సం అసలు తెలుసా అనిపిస్తుంది. సిటీలో వానా కాలాల్లో మునిసిపాలిటీ వైఫల్యాలవల్ల మోకాళ్ళ లోతుల్లో రోడ్ల మీద నిలిచే నీటి వరదలు కావవి.  ఊర్లకు ఊర్లని ముంచేసి, తోటల్నీ, పంటల్నీ సర్వ నాశనం చేసే వరదలు. పల్లెటూళ్ళ ఆర్ధిక వ్యవస్థలను చిన్నా భిన్నం చేసేసి, పశువుల్నీ, మనుషుల్నీ ఎంతో కొంత చంపేసే వరదలు.

ఒడిసా లాంటి తీర ప్రాంత రాష్ట్రాలకు వరదలు సాధారణం. తోటలకు తోటలే, వారాల తరబడి నీళ్ళలో నాని పోవడం, ఇళ్ళూ, పల్లెల్ని మళ్ళీ నిర్మించుకోవాల్సి రావడం, వీటన్నిటి వల్లా, కటిక బీద వాళ్ళ జీవితాలు ఇంకా బీదరికం లోకి వెళిపోవడం, తిండి కోసం జనం దొంగతనాలకు తెగబడటం.. ఇలాంటి జీవితం సామాన్యం గా ఉంటూండే కాలం లోనిది ఈ కథ. ఒడిషా లో రాజధాని భుబనేశ్వర్, పక్కనే ఉన్న కటక్, ప్రధాన పట్టణాలు.  మారు మూల పల్లెల నుండీ ఉపాధి కోసం కటక్ కు వెళ్ళే వారి సంఖ్య అధికం. కటక్ లో ప్రధాన కార్యాలయాలూ, కోర్టులూ ఉండటం కారణం.

సరే, ఈ కథ ఒక ముసలి అవ్వది. ప్రతిభా రే ముసలి అవ్వల కథలు ఇంకొన్ని రాసారు. ఇప్పుడు మనకి అస్సలు అక్కర్లేని ముసలిది ఒకతి, ఓ చలి కాలం వేళ ఇంటి ముందు అన్నం కోసం నిలబడితే మీరేం చేస్తారు ?  ఇప్పుడు మనం బిచ్చ గాళ్ళని నమ్మం. ఒకప్పుడు పేదరికం ఎక్కువ గా ఉండే కాలంలో, కాస్తో కూస్తో కలిగిన వాళ్ళు పేద వాడు ఇంటికొస్తే, ఉన్న దాంట్లోనే ఏదో తినడానికివ్వడం, బట్టలు లేని వారికి బట్టలివ్వడం సంప్రదాయంగా ఉండేది. ఇప్పటికీ బిచ్చ గాళ్ళ కోసం ప్రత్యేకంగా రేషన్ తీసి పెట్టుకునే సంప్రదాయ వాదులు ఉన్నారక్కడ. మా అత్త వారింట్లో ఈ సాంప్రదాయం ఉంది. 

అలా, దొంగతనాలు కూడా ఎక్కువ గా జరుగుతూ ఊరి జనమంతా అప్రమత్తంగా ఉన్న ఓ చలి సాయంకాలం, ఓ ఇంటికి ఓ ముసలమ్మ అన్నం కోసం వస్తుంది. అప్పటికి తండ్రి ఇంట్లో ఉండదు. కటక్ వెళ్ళి ఉంటాడు. తల్లి ఎంతో మంచిది. దీనురాలైన ముసలమ్మ కు ఆ పూటకి మంచి భోజనం పెడ్తుంది.   అంబిక అనే ఆ ముసలమ్మ ఎక్కడి నుండో తన ఊరు, (ఊరి పేరు మథువా)  ఇంకాస్త మారు మూల ప్రాంతానికి పోవాలి. అప్పటికే చీకటి పడింది, బయట చలి విపరీతంగా ఉంది. రాత్రికి ఆశ్రయం ఇస్తారా అని అడుగుతుంది.  తల్లి, ఎంతో దయతో, ముసలమ్మ కి బట్టలు ఇచ్చి, దారిలో తినడానికి మరి కొంత ఆహారం ఇచ్చి, ఇరుగు, పొరుగు బాగా భయపెట్టేయడంతో  ఇంటిలో మగ వారు లేనందున, అపరిచిత మనిషి కి ఆశ్రయం ఇవ్వలేనందుకు క్షమాపణ అడుగుతుంది. ముసిలిది అర్ధం చేసుకుని అక్కడి నుండి వెళిపోతుంది.  అయితే ఆవిడ కాస్తా వెళ్ళాక, ఇంటి యజమానురాలికి చాలా బాధ అనిపిస్తుంది. ఆ రోజు చలి కి ఆమె కానీ చనిపోతే తనని తాను క్షమించుకోగలదా అని బాధ తో భోజనం కూడా తీసుకోదు. ఒడిషా లో మనిషి ప్రాణాలు తీసేంత బలమైన చలి ఉంటుంది శీతాకాలాల్లో. 

ఆ రోజుల్లో దొంగలు ముందుగా తమ 'గూఢచారుల్ని'  పంపి, ఇళ్ళలో ఉన్న వారి కూపీ లాగేందుకు ఇలాంటి అవ్వలని, స్త్రీ లని, అనుమానం రాని విధంగా పంపించేవారు. ఆ కారణాన, పైగా ఇంటి యజమాని కటకం (Cuttack) వెళ్ళిన విషయం మాటల్లో చెప్పేసినందునా, అమ్మ భయపడి, నమ్మకస్తుడైన యుజో అనే  పని వాడిని ఆ రాత్రికి ఇంట్లో నే  కాపలా గా ఉండిపొమ్మంటుంది.   చుట్టు పక్కల వాళ్లంతా ఆ ముసలమ్మ దొంగల తరఫు గూడచారి కావచ్చునని, ఆ రాత్రి ఏవేళ కయినా దొంగలు రావచ్చని అనుకుంటారు.    ఆనాటి చలి విపరీతంగా ఉంటుంది.


అనుకోకుండా  రాత్రి పొద్దు పోయాక, కటక్ వెళ్ళిన ఇంటి యజమాని ఇంటికి తిరిగొస్తాడు. ఆయన రావడంతోనే, ముసలామెను చలిలో చీకట్లో ఇంటి లోంచి వెళ్ళమన్నందుకు గిల్టీ గా ఫీలవుతున్న భార్య దగ్గర 'సంగతి'  విని, అలా అర్ధం పర్ధం లేని భయాలతో పేదరాలిని పంపించేసినందుకు దెబ్బలాడి, ఆ రాత్రి చలిలో ఆమెను తీసుకు రావడాన్ని పెద్దగా సమర్ధించని 'యుజో' అనే ఆ నమ్మకస్తుడైన పని వానితో  ముసలమ్మ ని వెతుక్కుని,   చలి తో దాదాపు చావు అంచుల వరకూ వెళ్ళి, ఏ అరుగు మీదో చచ్చిన కట్టై పడుకున్న ఆమెను తన గొంగళి లో చుట్టి ఇంటికి తీసుకొస్తాడు.  తరవాత భార్యా భర్తలిద్దరూ పరిచర్యలతో ఆమెలో ప్రాణాన్ని కొడగొట్టకుండా కాపాడతారు.

తెలివొచ్చాక, మొహమాట పడి, తన స్థాయి బట్టి,  కింద నేల మీద పడుకోబోయిన ఆమెని బలవంతం గా మంచం మీద పడుకోబెడతారు. కంబళి కప్పుతారు.   మరుసటి  రోజు పొద్దున్న  వేడి అన్నం పెడతారు. మధ్యాన్నం, ఇంట్లో మిగిలిన స్వీట్లూ, పళ్ళూ, కాస్త డబ్బూ, కొన్ని కంబళ్ళూ,  ఇచ్చి పంపిస్తారు.


జీవితంలో అంతటి ఆదరణనెరగని ముసలమ్మ కరిగిపోతుంది. వేల నోళ్ళతొ ఆ కుటుంబాన్ని దీవిస్తుంది. తన గురించి వివరాలన్నీ చెప్తుంది. ఆమె పేరు అంబిక.
మథువా గ్రామానికి చెందినది. ఆమె కు, చనిపోయిన భర్తకూ ఓ చిన్న  మామిడి తోట ఉంది. అదే వారి జీవనాధారం. ఆ తోటలో మిగిలిన రకాల మావిడి పళ్ళున్నా, రెండే రెండు మేలిరకపు, అతి తియ్యని కొలంగోవా మావిడి పళ్ళ చెట్లున్నాయి. అవి చాలా కొద్దిగా కాసినా,  అత్భుతమైన రుచి  ఉన్నవి.

తనకి తిండి, నీడ, ప్రేమా ఇచ్చిన ఆ కుటుంబాని పట్ల ముసలామె కు చాలా అభిమానం అయిపోతుంది. ఆ రోజుల్లో అపరిచిత / వయసులో పెద్ద ఆడవాళ్ళని మౌషీ (పిన్ని - మాతృ సమానురాలు) అని పిలవడం వాడుక. కాబట్టి,అమ్మ ఆ ముసలమ్మ ని మౌషీ అనే పిలుస్తుంది. చిరుగు గుడ్డలతో, తైల సంస్కారం లేని జుత్తు తో, చేతిలో కాణీ లేని, తిండి మొహం చూసి రోజులు దాటిన తన లాంటి బీద రాలికి అంత గౌరవం ఇచ్చిన ఆ కుటుంబం అంటే, ఈ ముసలమ్మ కి ఎంతో అనుబంధం వచ్చేస్తుంది.  మథువా లో తన కొడుకు, కోడలు, మనవలు ఉన్నారు. వరదలు వచ్చి పంట నాశనం అయింది. కొడుకూ, కోడలూ, తిండి తిప్పలకై, పిల్లల్ని పోషించుకోలేక, ముసలామె ను నిర్లక్షం చేస్తుంటారు. ఒకప్పుడు బాగానే గడిపినా చాలా నిరాదరణ పూర్వకమైన వృద్ధాప్యం గడుపుతున్నది ఈ ముసలమ్మ.

సెలవు తీసుకునే ముందు వీళ్ళందరినీ ఆత్మ  బంధువులు  గా పరిగణిస్తూ, 'వచ్చే యేడు కొలంగోవా మావిడి పళ్ళు తీసుకుని వస్తాను. బాబు గారు, పిల్లలు, పెరుగు అన్నం తో మామిడి పళ్ళు నంజుకుని తింటారు ' అంటుంది. "మీరు నా కడుపున కనని బిడ్డలు. నాకు రెండు చెట్లున్నాయి. ఒకటి నా కొడుకుది. రెండోది మీది. నేను బ్రతికున్న కాలమూ, ఆ చెట్టు పళ్ళూ మీవి." అని వాగ్దానం చేస్తుంది. వీళ్ళు ఎంత వద్దన్నా వినదు. మరుసటి యేడు ఎండల్లో ఊరి నుంచీ నడుచుకుని పళ్ళు తెస్తుంది. అవి అత్భుతమైన రుచి, సువాసన గల  కండ పట్టిన మేలు జాతి పళ్ళు.

యుజో కి ఈ ముసల్దంటే ముందు నుండీ పడదు. వాడికి తన విధేయత వల్ల ఆమె పై అనుమానం. ముసలిది గొప్పలు చెప్పుకుంటూంది గానీ, అంత మంచి రకం మామిడి పళ్ళు చెట్టు దీనికి ఉంటుందా, ఉన్నా మర్యాదలకో, గొప్పలకో పోయి మీ ఊరు తెచ్చిస్తుందా అమ్ముకోక అని వీడి అనుమానం.  వాడు తీరా ఆ పళ్ళు తిని ఆశ్చర్యం తో మౌనం దాలుస్తాడు. ముసలి మౌసీ నిజంగానే కొలంగోవాలు తెచ్చింది.

నాన్న గారు, "మౌసీ, ఈ పళ్ళ టెంకలు నాటి, పెద్ద తోట చెయ్యొచ్చు కదా!  వీటికి మంచి గిరాకీ. మీ పేదరికం తీరిపోతుంది" అంటారు. అప్పుడు మౌసీ, "అయ్యో!! ఎన్ని సార్లు ప్రయత్నించామో బాబు గారు!!! ఎన్ని టెంకలో పాతాము. ఒక్కటీ మొలకెత్తలేదు.  నా భర్త బ్రతికున్నాళ్ళూ కొలంగోవా చెట్టులు మొలకెత్తిద్దామని ప్రయత్నిస్తూనే పోయాడు. నేను కూడా ఎంతో ప్రయత్నించాను బాబు గారు, ఒక్కటీ అవ్వ(లే) దు" అంటుంది. వీళ్ళు కూడా ఆ ఏడు తిన్న కాయల టెంకలన్నీ పెరట్లో పాతుకుంటారు.  ఒక్కటీ మొలవదు.

ఇలా ప్రతీ యేడూ, మథువా నుండీ ఆ బీదరాలు చేపలో, పళ్ళో కొడుకుతో పంపించడమో, తనే వచ్చి ఇవ్వడమో చేస్తుంది.  కొన్నాళ్ళకి ఆమె పోయాక, పనివాడు యజో, "ఇంక ఆ కొడుకేం తెస్తాడండీ తల్లి మాట నిలబెట్టేందుకు!" అని ఈసడించినా, కొడుకు ఎలాగోలా తెస్తూనే ఉంటాడు. వీడు ఏ కారణంగా నైనా పళ్ళు లేకపోతే ఆ ఏడు నుండీ ఆ చెట్లు పూత పుయ్యవు అని అంబిక వాణ్ణి బెదిరిస్తుంది‌.

అలా, వాళ్ళు అంత బీదరికంలో కూడా, ఈ దేవుడు కుదిర్చిన బంధుత్వాన్ని,  ఒక్క రాత్రి ఆశ్రయం ఇచ్చిన పాపానికి,  ఒక్క పూట అన్నం పెట్టినందుకు,  తమని ఎంత రుణగ్రస్తులు గా చేస్తున్నారో అని ఇంటి యజమానురాలు బాధపడుతూ, వచ్చినప్పుడల్లా,  మౌషీ కొడుకు చేతిలో పిల్లలకు డబ్బో, స్వీట్లో పెడుతూంటుంది - వాడు, 'మా అమ్మ వీటికి డబ్బులు తీసుకోవద్దని అందని '  ఎంత చెప్తున్నా.

ఒక యేడు, సందేహంగా చెప్తాడు మౌషీ కొడుకు - కొలంగోవా చెట్టు చనిపోయేలా ఉందని, వరదలకి దెబ్బ తిందని, కాపు తగ్గిందని. మరుసటి యేడు అతను రాడు. చెట్టు కూడా చనిపోయినట్టు అర్ధం చేసుకుని,  వీరందరూ   సమాధాన పడతారు. 

ఆ ఏడు పిచ్చి పిచ్చిగా వానలు కురుస్తాయి. పెరడంతా మొక్కలతో నిండిపోతుంది. అప్పటికి, ఆ కుటుంబము,      పిల్లలు కొలంగోవా మామిడి పళ్ళ కన్నా, మౌషీ అభిమానాన్ని, ఆమె కొడుకు ప్రథ గా తెచ్చి ప్రతీ యేడూ ఆమెని గుర్తు చెయ్యడాన్ని, ఆ ముసలమ్మ ఆదరణ ని ముఖ్యంగా మిస్ అవుతుంటారు. మౌషీ ఇన్నేళ్ళలోనూ, సొంత బంధువు కాకపోయినా, ఆత్మ బంధువు గా మారిపోతుంది.

ఒక ఆదివారం నాన్న గారు, మాలి సాయంతో పిచ్చి  మొక్కల్ని తీసి పారేసి, పురుగు పుట్రా చేరకుండా,  పెరట్లో మొక్కల పని పడదామని పెరట్లోకి వెళ్ళి, అన్నిటినీ పరిశీలిస్తుంటారు. . హఠాత్తుగా పెద్ద కేక వేసి, ఇంటిల్లపాదినీ పిలిచి, ఎన్నో ఏళ్ళుగా ఎన్ని సార్లు ప్రయత్నించినా మొలవని కొలంగోవా మామిడి చెట్టు మొలక ని చూపించి, "చూడండి, అంబికా మౌషీ వచ్చింది. ఇక ఆమె మనతోనే వుంటుంది" అంటారు. కుటుంబం అంతా ఎమోషనల్ గా, సంతోషంగా ఫీలవుతుంది. ఒక చిన్న మామిడి చెట్టు మొలక వాళ్ళని ఆనందాశ్చర్యాలలో,  ప్రేమలో ముంచెత్తేస్తుంది.  ఇక నుండీ వారికి మామిడి పళ్ళు పంపలేనని, తనే చెట్టయి వచ్చి తమ ఇంట్లో కలకాలం తియ్యని మామిడి పళ్ళు ఇచ్చేందుకు మౌషీ వచ్చిందని అబ్బుర పడతారు.  ఇదీ కథ.

ఆకలి గొన్న ప్రాణికి పెట్టిన ఒక  భోజనపు విలువ జీవిత కాలపు బంధంగా మారుతుంది. ఇలాంటి అమాయకపు, నిజాయితీ బంధాలు ఇప్పుడు ఉంటాయా ? చెప్పలేం. మనిషిని మనిషి నమ్మడమే లేదు.  అన్నీ కండిషనల్ ప్రేమలు, కృత్రిమత, పైరవీ, పెదవంచు మాటలు, డబ్బంటే కక్కుర్తి ఉన్న సమాజం ఇది. అందుకే గుండె బరువెక్కించే కథ అయిందిది.

అనువాదం గురించి : నిస్సందేహంగా చాలా బావుంది. కొన్ని అర్ధం కాని ఒడిషా సంప్రదాయాలు, కొన్ని పదాల విడి అర్ధాలు చక్కగా నోట్స్ ఇచ్చారు. ముసలి వారి కథలు చాలా బావున్నాయి. చావులాగే వృద్ధాప్యం అనివార్యం మన జీవితాల్లో.  అలాగే ఆ దశలో మనం ఎదుర్కొనే సవాళ్ళూనూ.

ఈ సంకలనంలో అన్ని రకాల ప్రేమానురాగాల గురించీ, కుటుంబపు సంస్కారాల గురించి కూడా చదివి, ఏ భాషయినా, ఏ సంస్కృతి అయినా, ఏ అంతస్తు వారం అయినా, మనుషులంతా ఒక్కటే అనిపిస్తుంది. తప్పకుండా చదవండి.



No comments:

Post a Comment

వ్యాఖ్యానించినందుకు చాలా చాలా థాంక్స్.