నిజానికి న్యూ బాంబే టైలర్స్ మరియు ఇతర కథల లో అన్ని కథలూ బానే ఉన్నాయి. అవన్నీ వివిధ పత్రికలలో ప్రచురింపబడినవీ, అందరూ మెచ్చుకున్నవీ. కొన్ని కథలు ముగించాకయితే ఒక క్షణం ఆగి, ఆలోచించుకోవాలనిపించేలా ఉన్నాయి. కొన్ని బీద ముస్లీము కుటుంబాల కథలు, కొన్ని మామూలు హిందూ కథలు, దురదృష్టవంతుల కథలు, పోరాట వీరుల కథలు ఉన్నాయి. కాకపోతే, అవన్నీ దాదాపు ఒకే మూడ్ లో ఉన్నట్టు అనిపించాయి. కొన్ని మరీ అతిగానూ ఉన్నట్టనిపించాయి.
"గెట్ పబ్లిష్డ్" (2010) క్లాసిక్ గా, చాలా బావుంది. ఈ కథ చెప్పడంలో రచయిత అతి ఆత్మ విశ్వాసం ఏదీ ప్రదర్శించలేదు. ఒక నిబద్ధత కల ముస్లిం జర్నలిస్ట్ ఒక బీద ముస్లిము కుటుంబం గురించి రాసిన చిన్న కథ ఇది. అయితే ఇది టెర్రరిజం కు సంబంధించిన బీద కథ. అదీ విశేషం. మహమ్మదీయుల తీవ్రవాదం వల్ల ఎవరయ్యా నష్టపోయారూ అంటే సాటి మహమ్మదీయులే. హిందూ తీవ్రవాదుల వల్ల నష్టపోయిందీ మహమ్మదీయులే. ఈ విషయాన్ని అందరూ కళ్ళతో చూస్తారు, చెవులతో వింటారు గానీ, కాయితం మీద పెట్టరు. ఏదో అడ్డుగోడ అది.
తెలంగాణా రాజధానిలో ఓ మసీదు కు నమాజు కి తరచూ వెళ్తూండే ఆంధ్రా ముస్లీము కధకుడు. ఆయన వేష భాషలేవీ హైదరాబాదీయంగా వుండవు. అసలు సాటి ముస్లీములే గుర్తు పట్టరే అన్నట్టుంటాడు. అనగా, మతాన్ని తన భుజాన వేసుకుని తిరిగే మనిషి కాదు ఆయన. సరే.. వెళ్తున్నాడా, ఆ మసీదులో ఓ చిన్ని బాలుడు. బీద వాడు. ప్రార్ధనలకు వచ్చే వారి చెప్పులకు కాపలాగా ఉండి రెండూ మూడు రూపాయలు సంపాదిస్తూ ఉండే మామూలు పిల్ల వాడు. ఈ అబ్బాయితో కథకుడికి చిన్న అనుబంధం. అదీ ట్రిగ్గర్ ఇక్కడ. వేరే ఎవరి కథ నో అయితె ఇంత ఇదిగా చెప్పుండునా ఈయన ? ఈ బుడ్డోడి కథ కాబట్టి బాగా చెప్పాడు.
అసలు ఎవరి కష్టాన్నయినా మనం మనసులతో చూస్తే గానీ, వారి చెప్పుల్లో దూరితే గానీ అర్ధం చేసుకోలేం. అదే ఈ కథ. ఈ మసీదులో చెప్పులు కాపలా కాస్తూండే అబ్బాయికి ఓ అమ్మా, నాన్న. నాన్న అంటే పిల్లాడికి చాలా అభిమానం, ప్రేమ. తండ్రి జీవితంలో ఒకప్పుడు బాగా బ్రతికి ప్రస్తుతానికి చెడ్డవాడు. తల్లి దాదాపు యాచకురాలు.. ప్రజలామెకు ఫకీరు నామం కూడా తగిలించారు. ఈ కుటుంబం, డబ్బు లేకపోయినా మనశ్శాంతిగానే బ్రతుకుతూంది. కానీ ఓ ఉగ్రదాడి తరవాత అనుమానితుడి గా పిల్లాడి తండ్రిని ఓ రాత్రి వేళ భోజనం చేస్తుండగా వచ్చి, పోలీసులు నిర్బంధంగా అపహరిస్తారు.
తీవ్రవాద చట్టాలూ, తీవ్రవాద న్యాయాలూ చాలా తీవ్రంగా ఉంటాయి. తండ్రి తన కళ్ళ ముందే అలా మాయమవడం చూసిన పిల్లాడు భయంతో జ్వరం తెచ్చుకుంటాడు. అదృష్టం బావుండి కొన్నాళ్ళకు అమాయకుడైన తండ్రిని పోలీసులు విడిచిపెడతారు. బందీగా ఉన్నప్పుడు విపరీతమైన చిత్రవధకు గురయిన ఆ తండ్రి ఇప్పుడో జీవచ్చవం. ఆ కుటుంబం పడ్డ కష్టాలనూ, పోస్ట్ ట్రమాటిక్ స్ట్రెస్ నీ దగ్గరగా చూసి, కథకుడు రాసిన రిపోర్ట్, ఆయన రాసినది చదివి స్పందించిన పత్రిక సంపాదకుడి మానవత్వ స్పందనా ఈ కథ. ఈ జీవచ్చవమూ, రోజూ రాత్రవగానే జ్వరం తెచ్చేసుకుని భయంతో వొణికే చిన్న పిల్లాడూ.. వీళ్ళ జీవితాలు ఒడ్డున పడేలా చేసేది ఏది ? పైగా ఆ కుటుంబం ధనసాయం తీసుకోదు.
ప్రధాన మీడియాలో ఇలాంటి ముస్లీం గొంతులని వినిపించి, వారి తరఫు కథ ను చెప్పడానికి ప్రయత్నిస్తే ఆ కథనాలు ప్రచురితమవుతాయా..? ఎటువంటి ముద్రా వేయకుండా ప్రజలు అలాంటి కథనాలని చదువుతారా అనేది కథకుడు సంధించిన సూటి ప్రశ్న. ఈ సంకలనం లో కొన్ని మిగతా ముస్లిం కథలు కూడా ఇవే ప్రశ్నలు వేస్తాయి. పాత బస్తీ విలాసమూ, మహమ్మదీయ నామధేయమూ బ్రతుక్కి అడ్డంకిగా మారిన వేలాది యువకుల గురించి ప్రస్తావన ఉంటుంది.
ఇలాంటి కథలు రాయాలంటే అరుంధతీ రాయ్ కే సాధ్యం. అలా నిర్భయంగా ప్రశ్నించాలంటే లౌక్యం చొక్కా విప్పేసి, ధైర్యం చొక్కా తొడుక్కోవాలి. కాబట్టి, ఒక తెలుగు కథ గా ఇది చాలా విచిత్రమైన కథ. అడ కత్తెరలో ఉన్న పోక చెక్కల్నిగురించి ఇలా రాసి, ప్రచురించి, మానవత్వం ప్రదర్శించినందుకు రచయితకు అభినందనలు.
ఈ మధ్య కాలంలో నాకు చాలా చాలా తక్కువ తెలుగు కథలు నచ్చుతున్నాయి. ఊరికే డీటైల్స్ ఎక్కువుండే రచనలు అస్సలు నచ్చట్లేదు. ఎక్కడికక్కడ చిన్న చిన్నభాగాలుగా, ముందుకూ, వెనకకూ జరుగుతూ సంభాషణ లాంటి కథ నచ్చడం చాలా బావుంది. మనకి కావలసింది చేంజ్. బాధితుడి కథ విన్నాక, అతని వెర్షన్ పట్ల కూడా సానుభూతి కలగాలి. అప్పుడు సమాజం కదులుతుంది. ముస్లిం కథలైనా, వేరే ఏమయినా, ఇవే చేస్తాయి. కానీ పుస్తకాల, ప్రచురణల మార్కెట్, పాఠకుల మార్కెట్ కన్నా చాలా విభిన్నంగా ఉండటం ఇప్పుడిప్పుడే తెలుస్తూంది. కాబట్టి కొన్ని ప్రచురణ కి నోచుకోవడం, నోచుకోకపోవడం గురించి ఎవరి అభిప్రాయాలు వారివి. అందుకే ఇది రొటీన్ కన్నా భిన్నం. ఇలాంటిది ఇంకోటి రాదు. వచ్చినా ఒకటే ట్రంప్ కార్డ్ ఎక్కువ నాళ్ళు చెల్లదూనూ.
***
No comments:
Post a Comment
వ్యాఖ్యానించినందుకు చాలా చాలా థాంక్స్.