Pages

09/04/2019

Women in Terrorism, Case of the LTTE - Tamara Herath



Part - I 

Netflix లో బోడీ గార్డ్ అని ఒక సిరీస్ ఉంది.  ఇంగ్లీష్ డ్రామా.  సరే. దీన్లో ఒక ముస్లిం మహిళ మొట్ట మొదటి ఎపిసోడ్ లోనే, తన చాందసవాద టెర్రరిస్ట్ భర్త కారణంగా బ్రెయిన్ వాష్ చేయబడి,  వళ్ళంతా బాంబ్ లు కట్టుకుని, ట్రెయిన్ లో వొణికిపోతూ హీరో కి కనిపిస్తుంది.  ఒక్క బటన్ నొక్కగానే విధ్వంసం సృష్టించగల క్షణాన, హీరో ఆమెతో మాట్లాడి, భయాన్ని పోగొట్టి, మెల్లగా ఆమె బాంబ్ ను పేల్చకుండా ఆపగలుగుతాడు.  ఇరవయ్యీ పాతిక కూడా మించని - బహుశా టీనేజ్ అమ్మాయి లా వుండే ఈ అతి భయస్తురాలు సిరీస్ అంతా చెమట్లతో, వొణికిపోతూ, భయపడిపోయి, తికమక పడుతూ పెడుతూ, ప్రేక్షకుల జాలి ని అంతా గాలన్ల కొద్దీ తాగేస్తూ... ఉండగా చివరాఖరికి ఈమే టెర్రరిస్టు అనీ, పెద్ద ఇంజనీరనీ, బాంబులు చిటికెన వేలు తో తయారుచేయగల సమర్ధురాలనీ, వగైరా తెలుస్తుంది.  అంతవరకూ ఆమె మీద జాలి పడిన ప్రేక్షకుడు షాక్ అవుతాడు. భయపడతాడు. నివ్వెరపోతాడు. ఈ పాత్ర పోషించిన నటి  "మొదట చేయననుకున్నాను గానీ, తరవాత ఈ పాత్ర చాలా శక్తివంతంగా అనిపించి,   Empowering గా అనిపించీ చేసానని" ఒక ఇంటర్వ్యూ లో చెప్తుంది.  పాత్ర పేరు 'నాదియా'. భయంకరమైన ఉగ్రవాది. అంత సున్నితమైన, పువ్వు లాంటమ్మాయి, మనుషుల ప్రాణాలంటే లెక్క లేని పిచ్చి మనిషి అనీ, అమాయకులని నిష్కారణంగా చంపేందుకు, అదీ, అత్యంత ఘోరంగా.... వెనకాడదనీ తెలుసుకున్నాక చాలా బాధనిపిస్తుంది. సరే.. ఈ పిల్ల కి తీవ్రవాదం ఎంపవరింగ్ గా అనిపించడం (పాత్రకూ, పాత్ర ధారికీ) చాలా ఇంటరెస్టింగ్ గా అనిపించి, ఈ పుస్తకాన్ని పరిచయం చేస్తున్నాను.

ఇరాక్ సిరియాల్లో ఐసిస్ మీద యుద్ధం ఓ కొలిక్కి వచ్చేలా అనిపిస్తూ, కలుగులోంచీ వందలాదిగా తీవ్రవాదులూ, ఇల్లూ, పొల్లూ, దేశమూ, సొంత జీవితాన్నీ విడిచిపెట్టి తీవ్రవాదులకి సాయం చేయడానికీ, పిల్లల్ని కనడానికీ వరసకట్టి వెళ్ళిన వివిధ దేశాల ఐసిస్ పెళ్ళికూతుర్లూ, ఐసిస్ విధవలూ, వారికి పుట్టిన, పుట్టి, గిట్టిన పిల్లల గురించీ కూడా విరివి గా వార్తలు వస్తున్నాయి. భవిత గురించి వాళ్ళ ఐడియాలూ, యెమనీ యజీదీ మహిళల సాక్షాలూ, వారిని తిరిగి సమాజం లోకి ఆహ్వానించడానికి జంకే దేశాలూ.. ఇవన్నీ తీవ్రవాదంలో మహిళల పాత్ర ఇలా కూడా ఉండటం,  ఇంటర్ నెట్ ద్వారా యువతులని ఆకర్షించి, సిరియా దాకా తీసుకొచ్చి, వాళ్ళని భార్యలుగా కుదిర్చడం, పెళ్ళిళ్ళు చేయడం, వారూ దీనికి సిద్ధపడీ, ఇష్టపడీ, బురఖాలు ధరించి, సామూహిక హత్యల్ని నిర్లిప్తంగా చూస్తూ, ఏదో 'మంచి పని చేసేస్తున్నట్టు నమ్మడం, వారి మానసిక స్థితీ, భవిష్యత్తూ.. తల నొప్పులన్నీ పక్కన పెడితే, అసలు తీవ్రవాదం ఎలా మహిళల్ని శక్తివంతం చేస్తుంది - సమాజికంగా, ఎమోషనల్ గా.. అనే ప్రశ్న ఎవరికైనా ఎదురవుతుంది.

కొన్ని సమాజాల్లో మరీ ఎక్కువగా, కొన్నిటిలో తక్కువగానూ మహిళలు అసహజమైన అసమానత ని ఎదుర్కొంటారు. వారికి  ఇష్టపడిన వారిని పెళ్ళాడే హక్కు లేదు. ఇష్టం లేనివాడిని వొద్దనే హక్కు లేదు.  చదువుకునే హక్కు లేదు. ఉద్యోగం చేసే హక్కూ లేదు. వారు కేవలం వస్తువులు. తండ్రీ, సోదరుడూ, భర్తా, కొడుకూ.. వీళ్ళ చేతుల మీదుగా బ్రతకాల్సిన బానిసత్వం చాలా మామూలు విషయం. మతం కూడా వీలైనంత తొక్కి పారేస్తుంటుంది. సాంప్రదాయం, ఆచారం, పద్ధతీ, ముఖ్యంగా శీలం, ప్యూరిటీ, పవిత్రత.. ఇవన్నీ మేకులై శిలువ కొట్టేస్తూ ఉంటాయి. అలాంటప్పుడు తీవ్రవాదం నిన్నూ ఓ మనిషి గా గుర్తించి నీ బ్రతుక్కీ ఓ లక్ష్యం ఉంది.. నువ్విలా కా.. నువ్విది చెయ్యు.. నువ్వు చేయగలవూ.. ఇలా ప్రోత్సాహకరంగా ఉంటూన్నపుడు స్త్రీలు ఆకర్షితులవుతారు. పైగా దీని వెనక ఏవో ఆదర్శాలూ, మత పరమైన గుర్తింపూ దక్కేటప్పుడు. వగైరా వాదనలు, థియరీలను ఈ పుస్తకంలో చక్కగా చర్చించారు.

తమిళ పులుల గుర్నించి ఎప్పుడో పదిహేనేళ్ళ క్రితం అనితా ప్రతాప్ రాసిన"ఐలాండ్ ఆఫ్ బ్లడ్" చదివాక, ఎల్ టీ టీ ఈ గురించి ఒక పుస్తకం చదవడం ఇన్నాళ్ళకి ఇప్పుడే.   అనితా ప్రతాప్ తమిళ సింహళుల మధ్య ఈ యుద్ధం ఎందుకు జరిగిందో రాసినట్టు గుర్తు లేదు. కానీ ప్రభాకరన్ ఒక్కో సాటి తమిళ తీవ్రవాద, మిత వాద, అతివాద బృందాలనీ, లీడర్లనీ మట్టు పెట్టుకుంటూ వస్తూ, భయంకరం, భయానకమైన హత్యలు చేసి, తమిళ, సింహళ సమాజాల్లో తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తూ, ఒక ప్రభంజనం లా ఎలా తెరమీదకొస్తాడో రాసారు. అయితే, అప్పటికి తమిళ ఈలం కోసం పోరాటం జరుగుతూండేది.  అనిత శ్రీలంక లో పర్యటించినపుడూ, తొట్ట తొలి గా ప్రభాకరన్ ను ఇంటర్వ్యూ చేసిన జర్నలిస్ట్ గా నిలిచినప్పుడూ.. ఆ సమయాల్లో ఆమె ముందే ఎన్నో హత్యలు జరిగాయి. భీభత్సాన్ని కళ్ళారా చూసారావిడ.  కూడళ్ళలో, లాంప్ పోల్ ల దగ్గర కట్టేసి, తుపాకీతో కాల్చి చంపేసిన మనుషుల శవాలని చూసారావిడ.  భయాందోళనలు సృష్టించడమే ప్రభాకరన్ యూ ఎస్ పీ.. చివరికి ఈ అతి తీవ్రవాదమే, రాజీవ్ గాంధీ ని హత్య చేయడానికీ, ఆఖరికి తానూ మట్టుపడిపోవడానికీ దారి తీసింది.

Women in Terrorism Case of the LTTE ని ఒక మహిళ Tamara Herath  ఇంత సమర్ధవంతంగా రాయడం, తాను చెప్పే ప్రతీ వివరానికీ, రిఫరెన్సు, ఫుట్ నోట్సూ ఇవ్వడం.. టైం మెషీన్ మీద రైడ్ లా అనిపించాయి.  రాజీవ్ హత్య సమయంలో మేము ఫ్రంట్ లైన్, తెలుగులో కాబోలు అచ్చయ్యే ఇండియా టుడే లాంటి మేగజైన్ లని ఎంతో ఆసక్తి గా చదివే వాళ్ళం.  శ్రీలంక నుండీ పోటెత్తే తమిళ శరణార్ధులూ, వారి పై తమిళ రాజకీయాలూ అవీ చాలా ఆశ్చర్యం కలిగించేవి.  అయితే, వయసూ, అజ్ఞానం అదేదో మనకి సంబంధించిన విషయం కాదనుకోవడమూ.. అవన్నీ గుర్తొచ్చాయి.  తమిళ శరణార్ధులు, ప్రపంచంలో వివిధ ప్రాంతాల్లో స్థిరపడి,  ప్రభాకరన్ మరణం తరవాత ఈలం మాటే లేకుండా ఇప్పుడంతా ప్రశాంతంగా ఉన్నట్టు అనిపించడం. పెరిగిన టూరిజం.  ఇదీ ఈ నాటి వాస్తవం.  కానీ ఒకప్పుడు అత్యంత అధిక సంఖ్య లో మహిళలూ, పిల్లలూ పనిచేసిన తీవ్రవాద సంస్థ ఈ ఎల్ టీ టీ ఈ.  రాజీవ్ హత్య లో చనిపోయిన, ఆత్మాహుతి దాడి చేసిన  తీవ్రవాది కూడా ఒక మహిళే. తీవ్రవాదులకు - వారు ఏ ప్రాంతానికీ, దేశానికీ, సంస్కృతికి చెందిన వారైన  ఒక కామన్ వర్క్ కోడ్ ఉండటం, తాము ప్రచారం పొంద దలచిన దాడులని, ముఖ్యంగా దళాన్ని ఉత్తేజితం చేసే ఎన్ కౌంటర్లనూ, ఆత్మాహుతి దాడులనూ వీడియో గ్రాఫ్ చేయడం - అదే వారి డిజిటల్ సిగ్నేచర్ కావడమూ,  చీకట్లో, తమిళ నాడు లో ఓ మారుమూల చిద్రమై చనిపోయిన రాజీవ్ హత్య కేసు ను సాల్వ్ చేయడానికి ఈ కేమెరాలే ఆధారం కావడమూ కాకతాళీయాలు.


మహిళ లని ఆయుధాలుగా వాడటం, వారి శరీరాలని ఆత్మాహుతి దాడుల కోసం వాడుకోవడమూ, అలా ఉద్యమం కోసం పనికిరాగలగడంలో తమ శక్తి ని ఉపయోగించడం వల్ల మహిళ శక్తివంతంగా ఫీల్ కావడం గురించి రక రకాల వాదనలు ప్రచారంలో ఉన్నాయి. వీటిలో ప్రముఖమైనది బ్లాక్ విడోస్ ఆఫ్ చెచెన్యా అనే మహిళా తీవ్రవాద సంస్థ.  రష్యా ఆక్రమణ లో అణగదొక్కబడిన చెచెన్లు విప్లవం లేవదీసినప్పుడు 1994 లోనే మహిళలు, ముఖ్యంగా ఉద్యమ ప్రభావితులైన విధవలు, తమ ఆత్మల్నీ, శరీరాల్నీ,  విప్లవం కోసం అంకితం ఇచ్చి, తిరుగులేని ఖ్యాతిని, తమ త్యాగం ద్వారా బహుశా స్వర్గం లో స్థానాన్నీ సంపాదించారు.

విధవా జీవితం లో పనికిరాకపోవటమనే నిరాశక్తికరమైన, దుర్భర, విలువ లేని జీవితాన్ని గడపడం కన్నా విప్లవం కోసం, దేశం కోసం, ఒక ఆదర్శం కోసం చనిపోవడమే మేలు అని తలిచిన చెచెన్ మహిళలు, బహుశా మొట్ట మొదటి మహిళా తీవ్రవాదులు.   1994-96 దాకా జరిగిన పోరాటంలో మహిళలు, ఆత్మాహుతి దాడుల్లో విస్తృతంగా పాల్గొనడం జరిగింది. కేవలం 2004 లోనే మహిళలు 12 ఆత్మాహుతి దాడులకు పాల్పడ్డారు.  అక్టోబర్ 2002 లో మాస్కో లో అత్యంత దారుణమైన థియేటర్ ముట్టడి లో పాల్గొన్న తీవ్రవాదుల్లో కేవలం 16 ఏళ్ళ అమ్మాయి కూడా ఉండటం చాలా బాధాకరం.  చెచెన్ ఆత్మాహుతి మహిళా దళాల స్పూర్థి ని పాలస్తనైసేషన్ గా కొట్టి పడేసారు కానీ నిజానికి పాలస్తీనా మహిళలే చెచెన్ మహిళల నుండీ స్పూర్థి పొందారు.  ముస్లిం మహిళలు గా చెచెన్ సోదరీమణులు చేసే సాహసాలను, త్యాగాలనూ మమ్మల్నీ చేయనివ్వండీ అంటూ పాలస్తీనా ఉగ్రవాద సంస్థ హమాస్ కు ఉత్తరం రాసారు.

- ఇంకా వుంది.


Notes :

LTTE

Anita Pratap  :  Prabhakaran ను ఇంటర్వ్యూ చేసిన మొదటి జర్నలిస్ట్.   ఈమె పుస్తకంలో మహిళల పట్ల ప్రభాకరన్ సంస్కారవంతమైన ప్రవర్తన నీ, తమిళ పులుల విలువల గురించీ రాసారు.   ఈలం కోసం జరిగిన పోరాటంలో ప్రభాకరన్ ఎంతటి ఘోరాలకు పాల్పడినా, అతను గానీ, అతని సంస్థ లో సభ్యులు గానీ సిమ్హళ మహిళల పైన అత్యాచారాలకూ, అకృత్యాలకూ పాల్పడిన ఆధారాలు / కధనాలూ లేవు.  ఆఖరికి చివరి ఈలం పోరాటం తరవాత శ్రీలంక సైనికులు మాత్రము తమిళ మహిళలని చంపే ముందు అత్యాచారం చేసి, తీవ్రంగా అవమానించి, చిత్రవధలు చేసి చంపినట్టు, ట్రక్ లలోకి స్త్రీల నగ్న మృతదేహాలను గుట్టగా  విసిరేస్తూ.. "ఆమె ఇంకా కామంతో నిట్టూరుస్తుంది చూడు", " ఈమె కు ఇంకా కావాలంట !"  అని నవ్వుతూ  అంటూన్న శ్రీలంక సైనికుని వీడియో, చానెల్ 4 డాక్యుమెంటరీ లో చూడొచ్చు.

హమాస్ :  పాలస్తీనా కు చెందిన (తీవ్రవాద ) సంస్థ

Black Widows of Chechnya :  చెచెన్యా లో మహిళా తీవ్రవాదుల సంస్థ. షహీదా అనే పదానికి గుర్తింపు తెచ్చిన మొదటి సంస్థ

Grozny

Moscow Theater Seize 

The Hindu Article  :  ఈ పుస్తకం గురించి ఒక పరిచయం.  ఎంపవర్మెంట్ భ్రమల గురించి.

2 comments:

  1. ఇంత బాగా విశ్లేషించి రాసినందుకు అభినందించకుండా ఉండలేకపోతున్నాను.ఏదైనా చదివాక ఆలోచనలు సహజమే కానీ ఆ ఆలోచనలకి అక్షరరూపం ఇవ్వటం కష్టమే.అది లేజీ people cheyaleremo కూడా.
    Anyways, I applaud you for your thoughts and writing skill. Keep it up.

    ReplyDelete
    Replies
    1. Writing skills improve చేసుకోవాలనే ఈ ఇంపోసిషన్‌. Thanks akka. Very happy to find u here.

      Delete

Thank you.