Part - 3
ఈ పుస్తకంలో శ్రీలంక చరిత్ర ని పూర్తిగా చర్చించండం జరిగింది. సింహళీయులు - తమిళులు మధ్య తగువు ఎలా మొదలయిందో వివరంగా రాసారు. శ్రీలంక చరిత్ర ప్రకారం శ్రీలంకీయులలో, సింహానికి పుట్టిన సింహళులు కాకుండా హైనా సంతానం తరాచ్చులూ, కాకి సంతానం బలిభోజకులు, కుందేలు సంతానం లంబకన్నులు, నెమలి సంతానం మోరియాలూ ఉన్నారు. సింహళులు, భారత దేశం నుండీ వెళ్ళగొట్టబడిన ఒక రాజు, తంబప్ని ప్రాంతంలో నాలుగో, ఆరో శతాబ్దంలో ఒక సిమ్హాన్ని వివాహం చేసుకోవడం ద్వారా జన్మించారు. పైన చెప్పిన వివిధ జంతువులు ఆయా జాతులు ఆరాధించిన దేవతలు కావచ్చు. వీటికి ఆధారాలు ఏమీ లేవు. వారి పురాణ గాధల ప్రకారం కావచ్చు. ఉదాహరణ కి ఆంధృలు నాగులు అని ఒక థియరీ ఉంది. మహాభారత యుద్ధంలో నాగులు పాల్గొన్నారు. వారి సంతానమే ఆంధృలు అంటారు. అలాగే వీళ్ళూ. ఇప్పుడు ఈ సింహాలు తాము, తమిళుల మీదా, ఇతర తెగల మీదా ఆధిక్యం ప్రదర్శించడం - దానికి తిరుగుబాటు గా ప్రభాకరన్ పులులని ప్రతీక గా తీసుకుని బ్లాక్ టైగర్స్ ని తన జెండా గా మార్చుకోవడం, చరిత్ర.
నిజానికి డా. తమారా హెరాథ్ సింహళ మూలాలున్న బ్రిటిష్ వనిత. అయినా తూకం ఎటూ బరువెక్కకుండా ఈ ఈలం పోరాటం తాలూకూ మూలాలనూ వేర్లనూ చక్కగా పక్షపాతం లేకుండా టైం, డేట్ లైన్లతో సహా వివరించారు. సింహళాన్ని అధికార భాషగా తమిళుల మీద రుద్దడం ఇందులో ఒక భాగం. సింహళ భాష రానివారికి ఉద్యోగాలు దొరకవు. బ్రతుకు తెరవు లేదు. వివక్ష రూపాలనూ, నెమ్మదిగా మొదలయిన అసంతృప్తి తీవ్ర అసహనంగా రూపుదిద్దుకుని తీవ్రవాదం గా రూపాంతరం చెందడం ఇందులో కళ్ళకు కట్టినట్టు రచయిత్రి చెప్తారు.
నిజానికి ఈలం అంటే అర్థం శ్రీలంకే. తమిళ ఈలం అంటే శ్రీలంక లో తమిళ భాగం. శ్రీలంక యొక్క తమిళ పదం 'ఈలంకై' కు మరో రూపమే ఈలం. భాషా ప్రాతిపదికన శ్రీలంక సమాజం చీలిపోవడానికి బ్రిటీషు వారి 'విభజించు పాలించు' సూత్రమే కారణం. అది రాను రానూ తమిళు ల పై వివక్ష, అత్యాచారానికీ. వారి తిరుగుబాటు కూ, మరిన్ని వ్యధలకూ కారణమయింది. ఈ ఈలం పోరాటం 1970 లలోనే మొదలయింది.
ఈ ఉద్యమంలో స్త్రీల ప్రవేశం, పిల్లల ప్రవేశం, మరణాల ద్వారా తగ్గిపోతున్న దళ సంఖ్యని పెంచడానికి పనికొచ్చేది. పైగా అణిచివేత, వెలివేత, ఉన్న ఊర్లనుండీ, ఇళ్ళ నుండీ మాన ప్రాణాలు దక్కించుకుంటూ పారిపోతూ, జాఫ్నా, వన్ని లాంటి ఊర్లలో తల దాచుకున్న కుటుంబాలూ, చెట్ల కింద కుల మత, వర్గ భేధాలు లేకుండా కమ్యూన్ల మాదిరి బ్రతుకుతూ కలగలుపుకున్న స్నేహాలు, చెల్లా చెదురయిన బ్రతుకుకు, ఆగిపోయిన చదువుకూ, అత్యాచార బాధితులకూ, అందరినీ కోల్పోయిన అనాధలకూ ఎల్.టీ.టీ.యీ ఆశ్రయం ఇస్తూ అక్కున చేర్చుకోవడం మొదలయింది.
ఇళ్ళలో పెద్దవారు ప్రభాకరన్ గురించి, అతని దళం గురించీ అబ్బురంగా చెప్పుకోవడం, ప్రభాకరన్ ప్రదర్శించే నైపుణ్యమైన పెద్దన్న తరహా లక్షణాలు, మెరిసే బూట్లూ, పులిచారల యూనిఫాం, చేతిలో తళుక్కుమనే తుపాకీ, మెడలో రక్షణ కోసం ఉండే సైనేడ్ - ఇవన్నీ పెద్ద ఆకర్షణలు. ఇంకే భవిష్యతూ లేని తరానికి ఈ వాలంటీరింగ్ తప్ప వేరే దారి లేదు. అలా అని ప్రతీ అత్యాచార బాధితురాలూ ఈలం పోరాటంలో చేరినట్టు కాదు. ప్రతి ఆత్మాహుతి దాడి జరిపిన మహిళా, అత్యాచార బాధితురాలు కాదు. కానీ ఎక్కువ సార్లు ఇదే జరిగింది. వారిని బ్రెయిన్ వాష్ చేయడం సులభం. ఇదో ఆబ్లిగేటరీ ఆల్ట్రూయిస్టిక్ సూయిసైడ్.
పైగా తమిళులపై జరిగిన అకృత్యాలలో భాగంగా గాంగ్ రేప్ లకు గురయిన మహిళలకు తమ శరీరం అపవిత్రం అయిందనీ, ఆత్మాహుతి దాడి ద్వారా దాన్ని పునీతం చేసుకోవచ్చనీ, (అగ్నిప్రవేశం) లేదా ఇలా ప్రతీకారం తీసుకోవచ్చనీ కొన్ని భావాలు అప్పటికే పాతుకుపోయి ఉండేవి. తమని ప్రత్యక్షంగా అతిక్రమించిన వ్యక్తుల మీద ప్రత్యక్షంగా కాకపోయినా, పరోక్షంగా ఈ పతనానికి కారణమైన నేతల మీదా, వ్యవస్థ మీదా ప్రతీకారం తీసుకోవడం ద్వారా సమాజానికో సందేశం ఇవ్వడానికీ బెల్టు బాంబు ఉపయోగపడేది.
పైగా ప్రభాకరన్ దళంలో అత్యాచార బాధితులని తక్కువగా చూడడం, తక్కువ కులాల వారిని వివక్ష తో చూడడం అలాంటివేవీ లేకపోవడం, బయట సమాజం కన్నా దళంలో దొరికిన సమానత్వం, గుర్తింపూ, బంధనాలూ వారిని ఎక్కువగా ప్రభావితం చేసేవి. ఇలా అగ్ని పునీతం అవ్వడం లాంటి ఎల్.టీ.టీ.యీ తరహా నమ్మకాలు మత పరమైన బ్రెయిన్వాషింగ్ కి ఉపయోగపడ్డాయి.
ఎల్.టీ.టీ.యీ లో అందరు దళ సభ్యులూ ఏదో రకం బాధితులే. అందరూ అన్నా, అక్కా, అలా వరసలు కట్టి పిలుచుకుంటూ ఒకే కుటుంబం లా ఉంటూండే వారు. పురుషులదో గ్రూప్, మహిళలది వేరే గ్రూప్. వారి మధ్య ఇంటరాక్షన్ తక్కువ. గెలుపు సంబరాల్లో కూడా ఎక్కడా స్త్రీ పురుషులిద్దరూ కలిసి నృత్యం చేసిన ఆనవాళ్ళు లేవు. మహిళలు వేరే గా, పురుషులు వేరే గా సంబరాలు చేసుకునే వారు. ఒక వేళ స్త్రీ పురుసుల మధ్య ప్రేమ తలెత్తితే, వారి పెళ్ళి బయటి సమాజం లొ లానే జరిగేది. తమిళుల విలువల ప్రకారం, అబ్బాయి అమ్మాయి దళ కమాండర్ కు తన ప్రేమ విషయం చెప్పి అనుమతి కోరాలి. అమ్మాయికి ఈ సంబంధం అంగీకారం అయితేనే పెళ్ళి జరిగేది. పెళ్ళయే దాకా వారు ఎప్పుడూ కలుసుకోనే కూడదు అనే నియమం తో.
పైగా ప్రభాకరన్, మాలథి (మాథి) ల పెళ్ళయే దాకా, దళంలో పెళ్ళి ని, ప్రేమలనూ నిషేదించారు. అవి దళ సభ్యులను లక్ష్యానికి దూరం చేస్తాయేమో అని భయపడ్డారు. పెళ్ళి, పిల్లలూ, ఝంఝాటం తమకు వద్దనుకున్నారు. కానీ ప్రభాకరన్ మాలతి ని కిడ్నాప్ చేసి తమిళ నాడు లో ఉంచి పెళ్ళి చేసుకోవడం పెద్ద కధ. ఆయన వివాహం తరవాత దళ సభ్యుల్లో ప్రేమ పెద్ద ఆక్షేపణ కాలేదు. అయితే అది ఎట్టి పరిస్థితుల్లోనూ అమ్మాయి ఇష్టప్రకారమే జరిగేది. అమ్మాయి ఇష్టపడకపోయినా, సమయం కోరినా ఆమె మాటకు పూర్తి విలువ ని ఇచ్చేవారు. మహిళలు సాధికారంగా ఫీల్ అవడానికి ఈ నియమం ఎంతగానో పనిచేసింది. తమ పట్ల ఇంత మానవత్వంతో వ్యవహరించే దళం వారికి కుటుంబం కన్నా ఎక్కువ అయ్యేది.
సాధారణం గా దళంలోకి రిక్రూట్మెంట్ ద్వారా గానీ వాలంటరీ గా గానీ [ఆడ, మగ] పిల్లలు, మహిళా సభ్యులు 16 లేదా అంత కన్నా చిన్న వయసులోనే చేరేవారు. ఒక లక్ష్యంతో ఆధర్శం తో చేరే వారు. వారికి పెళ్ళి పెద్ద లక్ష్యం కాదు. చాలా మంది పెళ్ళి కి ఇష్టపడలేదు కూడా. పెళ్ళి చేసుకుంటే, బయటి సమాజంలో లాగే తమ స్త్రీపాత్ర ని పోషించండానికి ఎక్కువ మంది ఇష్టపడలేదు.
తీవ్రవాదం లోకి మహిళలని మతపరంగా ఆకర్షించడం పాలస్తీనా లో ప్రయత్నాల గురించి తెలుసుకున్నాం కదా. యాసర్ అరాఫత్ పిలుపు ను అందుకుని రంగంలోకి దూకిన మహిళలని "ఆర్మీ ఆఫ్ రోజెస్" అన్నారు. 'దారీ అబూ ఆయెషా' అనే మహిళ ఇద్రిస్ తరహాలో కాకుండా పక్కా ప్రణాళిక తో, వీడియో రికార్డింగ్ తో సహా మొదటి అధికారిక ఆత్మాహుతి దాడి కి పాల్పడ్డాకా, పాలస్తీనియన్ ఇస్లామిక్ జిహాద్ నుంచీ 2003 లో ముగ్గురూ, హమాస్ నుండీ 2004 లో ఒకరూ ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు.
హమాస్ కు చెందిన మత గురువు షేక్ యాసిన్, కొరాన్ లో స్త్రీలు ఇలాంటి స్వాతంత్ర పోరాటంలో పాల్గొనకూడదని ఎక్కడా లేదనీ, వారు భేషుగ్గా పాల్గొనచ్చనీ ప్రకటించి గేట్లు బార్లా తెరిచాడు. 2004 లో 14 జూన్ న 'రీం రియాషీ' అనే మహిళ, ఒక భార్య, తల్లి, బామ్మ, అన్ని బాధ్యతలూ ఉన్న మహిళ హమాస్ తరఫున మొదటి ఆత్మాహుతి దాడికి పాల్పడి చరిత్ర సృష్టించింది. అంటే, బాదరబందీలు లేని, సమాజానికి భారమయ్యే విధవల్లాంటి వారే (వర్త్ లెస్) తీవ్ర వాద దాడి చేయక్కర్లేదు. అందరూ ఆహ్వానితులే అని దీనర్ధం.
పైగా దీనికో మత విశ్వాసం కూడా తోడ్పడింది. నలుగురిని చంపుతూ ఇలాంటి దాడిలో పొందిన వీర మరణం తరవాత దొరికిన స్వర్గంలో సర్వ సుఖాలతో పాటూ, ఒక మంచి భర్త లభించడం, తద్వారా 70 మంది బంధువులని కాపాడబడడం లాంటి బోనస్ లు కూడా ఉంటాయిట. దీని అర్ధం నాకూ తెలీదు. కానీ ఇలాంటి మత విశ్వాసం ద్వారా, మరణానంతరం, అందరికీ సాయపడగలగడం, భర్త కి సేవ వగైరాల ద్వారా మళ్ళీ బాధ్యతలని స్వీకరించడం ద్వారా స్త్రీ త్యాగధనం మరింత పెంచే ప్రయత్నం జరిగినా.. అదో నైతిక ధర్మం అన్నట్టు జరిగిన మీడియా ప్రచారం, మధ్య ప్రాచ్యంలో మహిళలు విస్తృతంగా బాంబ్ బెల్టులను ధరించేలా ఆయుధాలు చేపట్టగలిగేలా చేసింది.
Notes :
కోరా లో ఎ.టీ.టీ.యీ మహిళా బ్రిగేడ్ ల గురించీ, మహిళా సభ్యుల పాత్ర గురించీ విస్తృత వ్యాసం.
ఆర్మీ ఆఫ్ రోజెస్ - Yasser Arafat మహిళలను తమ దేశంకోసం ప్రాణ త్యాగానికి సైతం సిద్ధపడమంటూ వారిని తన 'ఆర్మీ ఆఫ్ రోజెస్' గా అభివర్ణించినప్పుడు వచ్చిన అనుకోనంత గొప్ప రెస్పాన్స్, వఫా ఇద్రిస్ దాడి, మరణం.. చక చకా జరిగిపోయాక, వేలాదిగా మహిళలు పాలస్తీనా పోరాటంలోకి దిగడం ఒక చారిత్రాత్మక మలుపు.
Shiek Yassin of Hamas
Your intellectual band width and patience are always amazing to me Sujatha garu.
ReplyDeleteThank you very much mam. I'm honoured. Pl eliminate 'garu'.
Delete