ఏ భేషజాలూ లేకుండా నిజమే చెప్పాలంటే, ఓ 200 పేజీల దాకా... దీనిలో "హాపీనెస్" అనేది మచ్చుకన్నా లేదే అని నట్టుతూ.. కధ తప్ప చెత్త అంతా ఉందని విసుక్కుంటూ కూడా, వొదల్లేక చదివాను. వొదల్లేకపోవడానికి సాహితీ స్పృహ, ఇది విడిచిపెట్టేయదగ్గ పుస్తకం కాదు అనే భావన, వగైరాల కన్నా, మానవత్వం ముందు నించుని తోవ చూపించడం వల్లే, మిగిల్న పుస్తకం అంతా చదవగలిగాను. ఈ కధ అంతా మనిషిలో లోపించిన మానవత్వం గురించే. అసలు దీన్లో కధ ఏమీ లేదు. ఎప్పటిదో పాత కధ. రెండు మూడు - నుంచీ - ఓ ముప్ఫయ్ అరవై దాకా పాత్రలు ! ప్రతీ పాత్ర దీ ఓ విషాద గాధ.
దిల్లీ నేపధ్యం. అత్యంత బీదరికం లో మగ్గిపోతున్న అంజుం అనే హిజ్రా మనసు కధ మొదటి భాగం అంతా. అంజుం స్మశానంలో మనకి పరిచయం అవుతుంది.
She lived in the graveyard like a tree. At dawn she saw the crows off and welcomed the bats home. At dusk she did the opposite. When she first moved in, she endured months of casual cruelty like a tree would - without flinching. When people called her names - clown without a circus, queen without a palace - she let the hurt blow through her branches like a breeze and used the music of her rustling leaves as balm to ease the pain.
పాత దిల్లీ లో ముస్లింలు ఎక్కువ గా ఉండే షాజహాన్ బాద్ లో ఓ చీకటి వేళ ఆఫ్తాబ్ గా పుట్టింది అంజుం. చీకట్లో ప్రసవం చేసిన మంత్ర సాని మగ పిల్లాడు పుట్టాడని ప్రకటించగానే అంతా ఆనందిస్తారు. కానీ తల్లికి ఆఫ్తాబ్ స్త్రీ, పురుషుడూ ఇద్దరూనూ అని మర్నాడు తెలుస్తుంది. వెంటనే మాతృ సహజమమైన భయం తో ఆ విషయాన్ని దాచి, దర్గాల చుట్టూ, తన కుమారుడి (!) కోసం వేలాది మొక్కులు మొక్కుతూ, అయిదేళ్ళ వరకూ కొడుకు లానే పెంచుతుంది తల్లి. కానీ పిల్లాడు బడిలో కి వెళ్ళే సమయానికి, మొదటి సారిగా తండ్రికి ఆఫ్తాబ్ విషయం చెప్పాల్సొస్తుంది. తమకి పుట్టిన బాబు పరిస్థితి ఇదీ అని తెలుసుకున్న తండ్రి హతాశుడయిపోతాడు. డాక్టర్ల చుట్టూ ప్రదక్షిణలూ, అవమానాలూ, క్లేశాల అధ్య ఆఫ్తాబ్ పెద్ద వాడవుతున్నాడు. అతని శరీరానికీ, మనసుకీ పొంతన కుదరక, విపరీతమైన మానసిక సంఘర్షణ తో బాధపడుతూ చివరికి తాముండే చోటికి దగ్గర్లోనే హిజ్రాలుండే ఖ్వాబ్ గంజ్ - కు చేరి, అక్కడే తన జీవితాన్ని, అంజుం గా మారి గడుపుతాడు. ఈ అంజుం చిన్నతనం లో హిందుస్తానీ సంగీతం నేర్చుకుని గొంతు మారాకా - వివిధ శస్త్ర చికిత్సలూ, నాటు వైద్యాల వల్ల గొంతు లో స్థిరత్వం పోయి, పాడడమే వొదిలేయాలిసి వస్తుంది.
అంజుం బ్రతుకంతా హిజ్రా గా - దిల్లీ లో వివిధ శుభకార్యాల లో పాల్గొని, ఆశీర్వాదాలు ఇవ్వడం లోనూ, గాన బజానాల లోనూ, పాత దిల్లీ ని చూడడానికొచ్చే విదేశీయులు భారతీయ హిజ్రాల గురించి నిర్మించే డాక్యుమెంటరీల లో మెరవడంలోనూ, వివిధ పత్రికల లో ఇంటర్వ్యూలూ, ఫోటోలూ దిగడం తోనూ ఉపాధి ని పొందుతూ - ఒక రకంగా హాయిగా - జీవిస్తుంది. కానీ హిజ్రాల లో ఉన్న మానవత్వం - "తల్లి" తనాలు ఓ మెట్టు పెద్దవే. జమా మసీదులో ఓ పసిపాప ని ఎవరో వొదిలేసి వెళ్ళిపోతే, తప్పిపోయిన పిల్లేమో అని తన వాళ్ళ కోసం వెతికి, ఆఖర్న ఆ పాప ఎవరో వదిలించు కునేందుకు వదిలి పెట్టిన పాప అని గ్రహించి, అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతురే అంజుం లోకం.
సాధారణ కుటుంబం లో ఇమడలేక, తనంతట తానే ఇల్లొదిలి బయటికి వచ్చిన అంజుం కి తన కుటుంబ సభ్యుల ప్రేమాదరాలకు ఎన్నడూ లోటు లేదు. చాలా మంది హిజ్రాల లాగా ఈమె ను తల్లి దండ్రులే విడిచిపెట్టేయలేదు. ఖ్వాబ్ గంజ్ చేరిన కొన్నాళ్ళ వరకూ, అంజుం కి తల్లి వేడిగా భోజనం వండి కారియర్ పంపేది. నెమ్మదిగా తన కాళ్ళ మీద తాను నిలబడగలిగే వరకూ అంజుం కి అన్నదమ్ముల, అక్క చెల్లెళ్ళ ప్రేమ దొరికింది. అందుకే, పరిస్థితులు విపరీతంగా దిగజారి ఖ్వాబ్ గంజ్ వొదిలేసే పరిస్తితులొచ్చిన సమయానికి చనిపోయిన తన కుటుంబ సభ్యుల సమాధుల దగ్గరకే వచ్చి ఆ సమాధుల మధ్య కొత్త జీవితాన్ని మొదలుపెడుతుంది. ఇక్కడ ఆమె లోకం, పరిధీ విస్తృతమయ్యి, తననంత తాను బ్రతుకుతూ, మరి నలుగుర్ని చేరదీసి పెంచగలిగే ధైర్యం, తోడూ, స్థిరత్వం కలుగుతాయి. అంజుం ధైర్య శాలి. కరుణామయి. ఎన్నో భయాలు, బెంగల మధ్య, జీవితాన్ని వెతుక్కున్న మంచి మనిషి.
ఈ లంకె ను అక్కడల్లా వొదిలి, కశ్మీర్ లో ఓ ముగ్గురు స్నేహితుల కధ ని మొదలు పెడుతుంది రచయిత్రి. వాళ్ళు ముగ్గురూ, నాగా, మూసా, బిప్లవ్ - దిల్లీ లో ఆర్కిటెక్చర్ చదువుతారు. వీళ్ళ క్లాస్ మేట్ - కేరళ కుట్టి - తిలోత్తమ. ఈ నలుగురిదీ కాలేజీ స్నేహమే. వీళ్ళలో నాగా, బిప్లవ్ లు మరీ చిన్ననాటి స్నేహితులు. ముగ్గురు అబ్బాయిలకీ తిలోత్తమ అంటే ఇష్టం. పిల్ల నల్లగా ఉన్నా కళ గా, పైగా చాలా అందంగా పొడవైన జుత్తు తో తిలో ముగ్గురి మనసుల్నీ గెలిచేస్తుంది. కానీ తిలో ఎవ్వరితోనూ పెద్దగా కలిసి మెలిసి తిరిగే రకం కాదు. ఆమెకు తండ్రి లేడు. తల్లి పెంపుడు తల్లి కాదు, నిజమైన తల్లే అని అపవాదు ఉంది. ఏదేమైనా తిలో ది చాలా స్వంతంత్ర వ్యక్తిత్వం. కశ్మీర్ కు చెందిన మూసా ది కూడా అదే తీరు. అతనూ అంతర్ముఖుడు. కాలేజీ ముగిసాకా, మళ్ళీ కధా కాలానికి వివిధ విచిత్రమైన సంఘటనల తరవాత కలుసుకుంటారు. నలుగురి జీవితం, చిక్కగా అల్లుకుని, పెనవేసుకుపోతుంది. ఈ భాగం అంతా చాలా హృద్యంగా, తెలివిగా, వేదన తో, సౌందర్యం తో - నింపేసింది రచయిత్రి. అసలు కాశ్మీర్ ని చర్చించడానికి ఎంత రీసెర్చ్ అవసరమో అంతా చేసి, లొసుగుల తో పాటూ, అక్కడ జరిగే అన్యాయాల్ని, మనం రోజూ చూసే రాళ్ళు రువ్వే కాశ్మీర్ ని, పెల్లెట్ లు ప్రయోగించే సైన్యాన్నీ పక్క పక్కనే పెట్టి చూపిస్తుంది.
బిప్లవ్ అమితంగా ఆరాధించిన తిలో, ఆఖరికి నాగా ని వివాహం చేసుకుని 20 ఏళ్ళ కి తను ఏమి చేస్తున్నదీ అర్ధం కాక, అతన్ని విడిచి అంజుం ని చేరుకోవడమే ఈ కధ - దీని వెనుక తిలో, మూసాల ప్రేమ కథ, తొలో అందమయిన జుత్తు ని కత్తిరించిన కశ్మీరీ పోలీసు, మరణించిన అమాయకులూ, ఇవన్నీ చాలా కదిలిస్తాయి. ఒక్కో చోట చాలా బోర్ అనిపించినా, నరేంద్ర మోదీ ని విపరీతంగా విమర్శించి - గుజరాత్ కా లల్లా గా ఆ పాత్ర ని పిలుస్తూ, గుజరాత్ అల్లర్లనీ, ఇప్పటి ఉద్వేగంగా మన్ కీ బాత్ చదివే లల్లా నీ, తూర్పారబెట్టినా అది అరుంధతీ రాయ్ కే చెల్లు. నిర్మొహమాటంగా, నిర్భయంగా మనం ప్రభుత్వానికి కట్టబెట్టిన సామ్రాజ్యాధికారం - ఎదురులేని తనానికీ, ఆరిస్ట్రోక్రసీ కీ ఎలా దారి తీస్తూందో ఒక మేధావి గా, ఆలోచించే వ్యక్తి గా చాలా వ్యాఖ్యానాలు చేస్తుంది. కొన్ని వీటిల్లో చాలా అతి గా అనవసరంగా, బోరింగ్ గా అనిపిస్తాయి. వీట్లో - ఒక తెలుగు మహిళా నక్సలైట్ రాసిన ఉత్తరం, దిల్లీ లో ధర్నాల, నిరసన ల రొటీన్, అంజుం పిల్లని పెంచే విధానం, నాగా, తిలో ల వివాహ జీవితం, కశ్మీర్ లో అమ్రీక్ సింగ్ అనే సిక్కు పోలీసు దురాగతాల, దుశ్చర్య ల వర్ణన, విపరీతం - మరీ - అనిపిస్తాయి. కానీ అవి వాస్తవానికి దూరం కాదు. ఏ కష్టాలూ ఎరక్కుండా మీడియా చెప్పిందే నిజమని నమ్మే మామూలు ప్రజల కి - నిజాలు కనిపించవు. కానీ కొన్ని పరిస్థితులు సత్యదూరాలు కావు. మేల్కొలుపులు.
ఈ పుస్తకం రాయడానికి రచయిత్రి కి సుమారుగా 11 ఏళ్ళు పట్టింది. 1980 ల లో సిక్కు ల ఊచకోత దగ్గరినించీ, మేధా పాట్కర్ ఆందోళనలూ, దేశాన్ని ఓ కుదుపు కుదిపిన రెండో స్వాతంత్రోద్యమం - అన్నా హజారే రాం లీలా మైదానం లో సాగించిన ఉద్యమం, కేజ్రీవాల్ పుట్టుకా, పతనం, (నవల లో అగర్వాల్) ప్రతీ నేతా తాలూకు వితండ వాదనా పటిమ, ఇలా కొన్నేళ్ళ కధా వస్తువు లు - ముఖ్యంగా ఈ మధ్య కాలంలో ఎక్కువ గా జరుగుతున్న గోరక్షణ పేరుతో జరుగుతున్నసామూహిక హత్యలూ - అలా ఎన్నేళ్ళ నుండో అతి మామూలుగా జరిగిపోతున్న సంఘటనలు ఇవి. ఇదంతా మన దేశం గురించి, ప్రస్తుత, పాత కాలపు ఎమర్జెన్సీ నుండీ జరిగిన అరాచకాల గురించీ పెద్ద చర్చ - చర్చ అని కూడా అనకూడదు - రేపు ఏంటి అంటూ గతాన్ని మర్చిపోయే ప్రజలకి ఒక రిమైండర్. అత్భుతం - నచ్చిందీ అనలేము - బోరింగ్ - అనలేము. ఏదో ఆత్మ వుందీ పుస్తకం లో.
ఆ ఆత్మ అంతా - ఎపిటాప్ లది. కధంతా పంచదార గుళికల్లాంటి కవితలు - వందల ఏళ్ళ నాటి సూఫీ కవితలు - ఉర్దూ కవితలు - ఇవే అందం. మచ్చుకి :-
Le saans bhi ahista ki nazuk hai bahut kaam
Afaq ki iss kargah-e-shishagari ka
Breathe, gently here, for with fragility all is fraught,
Here, in this workshop of the world, where wares of glass are wrought
కశ్మీర్ గురించి మాత్రం ఓ నిజం - మనందరికీ తెలిసిన నిజమే గానీ, కొంచెం ఎక్కువ నిజం :-
The inbuilt idiocy, this idea of jihad, has seeped into Kashmir from Pakistan and Afghanistan. Now, twenty-five years down the line, I think, to our advantage, we have eight or nine versions of 'True' Islam battling it out in Kashmir. Each has its own stable of Mullahs and Moulanas. Some of the most radical among them - those who preach against the idea of nationalism and in favour of the great Islamic Ummah - are actually on our payroll. One of them was recently blown up outside his mosque by a bicycle bomb. He wont be hard to replace. The only thing that keeps Kashmir from self-destructing like Pakistan and Afghanistan is good old petit bourgeois capitalism. For all their religiosity, Kashmiris are great businessmen. And all businessmen eventually, one way or another, have a stake in the status quo - or what we call the "Peace Process", which, by the way, is an entirely different kind of business opportunity from peace itself.
కాశ్మీర్ గురించీ, హిజ్రాల జీవితం గురించీ, ఏదీ దాయకుండా, భయపడకుండా - కాసిన్ని అతిశయోక్తుల తో రాసినా - కొన్ని థియరీ లు మాత్రం నిజంగా ప్రసంశించే విధంగా చక్కగా వివరించడం లో మాత్రం చాలా చక్కని ప్రతిభ కనబరిచిందీవిడ. అన్యాయాలూ, మానవ హక్కుల ఉల్లంఘనా - వీటన్నిటి మధ్యా - ఇస్లాం అనే మాట మీద తమ లో తామే కొట్టేసుకుని లేదా భద్రతా దళాలతో ఎదురు కాల్పుల్లో ఈ తీవ్రవాదులు భారత్ లో కి చొరబడిన ఆర్నెల్లకల్లా చనిపోయే విషయాన్ని - నవ్వుతూ చెప్పేస్తారు. హిజ్రాలూ, వాళ్ళ వ్యవస్థా, నక్సలిజం లో మహిళా కామ్రేడ్ల దుస్థితీ, వాళ్ళ కర్తవ్య దీక్ష, తీవ్రవాదుల భావోద్వేగాలూ, వాళ్ళని రక్షించే ప్రజల defiance, వీటన్నిటి మధ్యా మన కధ ఇది. మన దేశం కధ. అంజుం ఉండే స్మశానం లో కొన్ని సమాధులకి కధ లుంటాయి. ఈ సమాధుల చుట్టూ అల్లుకున్న కధల పుస్తకం చదవచ్చు. అందుకే కవర్ కూడా ఒక సమాధి - దాని మీద ఓ చిన్న పూవు. చావు లో సౌందర్యాన్ని విప్పి చెప్పే వర్ణనలు. దాల్ లేక్ నుంచీ దర్గాల వరకూ, ఉర్దూ కవితల మాధుర్యాన్నీ, చనిపోయిన పిల్లల సమాధుల మీద చిన్ని చిన్ని రాతల్నీ - అన్నిట్నీ ఎంతో నిబద్ధత తో సేకరించి, విస్తారంగా రాసిన కధ ఈ Ministry of Utmost Happiness. (ఈ పేరు వెనక కూడా ఒక చారిత్రాత్మక కధ ఉంటుంది. అది మాత్రం చదివి తీరాల్సిందే)
అరుంధతీ రాయ్ అతిశయోక్తుల్లో మన దేశ వినాశన ప్రస్తావన కూడా వస్తుంది. కశ్మీర్ వాది ఒకడు మన దేశం ఏదో ఓ నాటికి సమాధి కావల్సిందే అంటాడు. పెద్ద పెద్ద సామ్రాజ్యాలే నేల మట్టం అయినప్పుడు మన లాంటి చిన్న దేశం ఒక లెక్కా.. ఇలానే స్వయంకృతాపరాధాల్ని పునరావృతం చేస్తూంటే - నీ పరిస్థితి కూడా ఇంతే అని చెప్పబోయేటట్టుండే ఈ ప్రస్తావన మరీ అతి గా అనిపిస్తుంది. కానీ ఇదొ మంచి ప్రయత్నం అని చెప్పడానికి సందేహించక్కర్లేదు.
* * *
First published in pustakam.net.
First published in pustakam.net.
No comments:
Post a Comment
వ్యాఖ్యానించినందుకు చాలా చాలా థాంక్స్.